ఆ ఒక్కడే… - వెంపరాల వెంకట లక్ష్మీ శ్రీనివాస మూర్తి

Aa Okkade

అర్థరాత్రి ఒంటి గంట దాటింది.భాగ్యనగరం భళ్ళున ఎప్పుడు తెల్లారుతుందా... అని ఎదురు చూస్తున్నాడు భరణి. కృష్ణానగర్‌ లోని ఓ గదిలో కూర్చొని సీరియస్‌ గా రాసుకుంటున్నాడు. ఉదయాన్నే వచ్చి ప్రొడ్యూసర్‌ కలవమన్నాడు. రాసిన కధనే తిప్పి,తిప్పి మళ్ళీ చూసుకుంటున్నాడు. ఇది ఒకరోజు, రెండు రోజుల నుంచి ఎదురుచూస్తున్న రోజు కాదు. పది సంవత్సరాల కల. తిరిగి తిరిగి విసిగిపోయినా ఆశ చావక ఎదురుచూస్తున్న రోజు. ఏ రోజుకైనా సిల్వర్‌ స్క్రీన్‌ మీద దర్శకుడిగా తనపేరు చూసుకోవాలని ఓ ఆశ.

***

"ఒరేయ్‌... నాన్నా, ఇంటికి వచ్చి చాలా రోజులైందిరా. మీ చెల్లికి పెళ్ళి కూడా కుదిరేలా వుంది. ఓ సారి ఇంటికి వచ్చి వెళ్ళరా" అవతలనించి ఫోన్‌ లో తల్లి చెప్పిన మాటలు.

"లేదమ్మా, వెండితెర మీద నాపేరు, వాల్‌ పోస్టర్‌ మీద నా ఫొటో పడనిదే నేను మన ఊరిలో అడుగుపెట్టను. అప్పటివరకు నా మొహం మీకు చూపించను" అదే మొండితనం తో అన్నాడు భరణి.

"అనవసరం గా ఎందుకు రా లేనిపోని పంతాలు, ఇక్కడ నీకు ఏమి తక్కువయిందిరా. నీ మీద బెంగతో మీ నాన్న రోజు,రోజుకి శల్యమైపోతున్నారు. నీ చెల్లి నువ్వు రాకపోతే పెళ్ళిపీఠలెక్కనని ఖరాకండీగా తేల్చేసింది. ఇప్పటికైనా నువ్వు అర్థం చేసుకొని ఓసారి రారా. మమ్మల్ని ఇలా ఇబ్బంది పెట్టకురా. సినిమా పిచ్చి వుందనుకున్నాం కానీ ఇలా తయారవుతావనుకోలేదురా" అంది కన్నీళ్ళు నిండిన స్వరంతో.

వెంటనే పోన్‌ కట్‌ చేసాడు భరణి..

***


పది సంవత్సరాల క్రితం...

డిగ్రీ పైనల్‌ ఇయర్‌ పరీక్షలు రాసిన చివరి రోజు. స్నేహితులందిరితో కలసి తన అభిమాన హీరో సినిమా చూసిన రోజు. ఎన్నో ఊహలతో మరెన్నో ఆశలతో ధియేటర్‌ లో అడుగుపెట్టిన భరణి బృందానికి తీవ్ర ఆశనిపాతం కలిగించింది ఆ సినిమా. ఊహించని షాక్‌ లా సినిమా డిజాస్టర్‌,అట్టర్‌ ప్లాఫ్‌ అని టాక్‌ వచ్చేసింది. అందరిలోనూ చెప్పలేనంత నిరుత్సాహం ఆవరించింది.

"బాగా బుక్‌ అయిపోయాం రా... బుర్ర తినేసాడు రా డైరక్టర్‌... ఒరేయ్‌ నాకో డౌట్‌, సినిమా తీసిన తర్వాత ఒకటికి, పది సార్లయినా చూస్తారు కదా. వాళ్ళకి అప్పుడనిపించదా. ఇంత దరిద్రంగా ఉందేమిట్రా బాబూ అని" అన్నాడు ఆవేశంగా భరణి స్నేహితుల్లో ఒకడు.

ఈలోగా మరో స్నేహితుడు అందుకొని "ఏదో ప్రయోగాత్మకంగా చేసాం అంటారు ఒకరకం, ఏది చూపించినా పాపులర్‌ హీరో అయితే చూస్తారనుకొనే రకం మరికొందరు, ఆరుపాటలు, అయిదు ఫైట్లు తో కలిపి హీరోయిన ఆరబోత తో లాగించేద్దామనుకొనే రకం మరో టైపు. ఇలా తీసి వదులుతారంతే. వీటి మధ్యలో కథ అనే ప్రధానమైన వస్తువు నూలువస్త్రం లో దారపుపోగు చందం లా తయారవుతోంది." అన్నాడు పరిశ్రమ ని కాచి వడబోసినవాడిలా.

భరణి కల్పించుకొని "ఆపండిరా మీ అనాలసిన్‌. సినిమా అనేది ఓ రంగులకల. సప్తవర్ణ సమ్మిళితం. 24 క్రాఫ్టుల సమ్మేళనం. దానికి ఎవర్నీ పూర్తి భాద్యుల్ని చేయలేం. సినిమా ఈజ్‌ ఏ టీం వర్క్‌," అన్నాడు.

"ఏంట్రా నువ్వో పెద్ద సినీ మేధావిలా మాట్లాడతావ్‌. ఇలాంటి అనలిస్టులు ఈ దేశం లో కొన్ని కోట్లమంది వున్నారు. ఇక అందులోనూ మన రాష్ట్రంలో అయితే చెప్పక్కరలేదు. ఏదైనా చెప్పడం సులువు, చెయ్యడం కష్టం. టికెట్‌ కొని చూసే సగటు ప్రేక్షకుడుకి ఈ సొద అంతా అక్కరలేదు. బొమ్మ బాగుందా, లేదా అదొక్కటే చూస్తాడు. బాగుంటే హిట్‌ లేకపోతే ఫట్‌." అన్నాడు ముందు మాట్లాడిన స్నేహితుల్లో ఒకడు.

"అందుకేరా, సగటు ప్రేక్షకుడి గుండెచప్పుడు తెలిసిన వాడ్ని కాబట్టే నేను డైరెక్టర్‌ ని అవుదామనుకుంటూన్నాను. దానికోసమే అప్పుడప్పుడు అనేక కథలు రాసి వివిద పత్రికలకు పంపేవాడ్ని. వాటిలో అనేకం అచ్చు అయ్యాయి కూడా. అది మీకూ తెలిసిన విషయమే. ఇప్పుడు నేను హైదరాబాద్‌ వెళ్ళి తీవ్రంగా ప్రయత్నిస్తాను." అన్నాడు ఎంతో ఆత్మవిశ్వాసం తో భరణి.

"ఒరేయ్‌ భరణి... సినిమా అనేది రంగులకల కాదురా, రంగుల వల. ఆ వల లో చిక్కుకొనేవరకు అది మనల్ని ఆకర్షిస్తూనేవుంటుంది. కానీ ఆ వల లోకి వెళ్ళామంటే మన జీవితం కూడా చిరిగిపోక తప్పదు. ఎంతో మంది ఇలాంటి కలలతోటే భాగ్యనగరం లో అడుగు పెడతారు. స్వయంకృషి తో ఎదగాలని చూస్తారు. వెయ్యిమంది వెళితే ఒకడు వెలుగులోకి వస్తాడు. మిగిలిన వాళ్ళంతా చీకటిలో కలిసిపోతారు. ఇక అక్కడికి వెళ్ళిన దగ్గరనుంచి ఆకలికేకలు, అవమానాల కాకలతో సగం ప్రాణం పైనేపోతుంది. ఇది ఎంతోమంది చెప్పుకోని వాళ్ళ అనుభవం." అన్నాడు సినీ జగత్తు ని కాచి వడబోసిన ఓ స్నేహితుడు.

"కానీ నువ్వు చెప్పిన దాంట్లోనే ఓ సత్యం వుంది చూసావా..." అన్నాడు భరణి.

"ఏమిటది...?" అన్నాడు ఆశ్చర్యం గా అతని స్నేహితుడు.

"వెయ్యి మంది వెళితే ఒకడు వెలుగులోకి వస్తాడనినువ్వే చెప్పావు. ఆ ఒక్కడు నేనే ఎందుకు కాకూడదని నా లాంటివాళ్ళ అందరి ఆశ." అన్నాడు భరణి.

"సరే రా, దీన్నిబట్టి మాకు అర్థమయినదేంటంటే, నేనైతే ఆ సినిమాని ఇలా తీస్తాను, ఆ సీను అలా తీస్తాను అని చెప్పే నువ్వు సినిమాలలోకి వెళ్ళాలని డిసైడైపోయావని తెలుస్తోంది. కానీ ఇలా వెళ్ళిన చాలామంది అక్కడ భాదలు పడలేక తిరుగుటపా కట్టేసిన వాళ్ళున్నారు . ఆ జాబితా లో నువ్వు ఉండకూడదని కోరుకుంటున్నాం." అన్నాడు అతని స్నేహితుడు.

"నాకు ఎన్ని కష్టాలెదురైనా, నా పేరు స్క్రీన్‌ మీదా, నా ఫొటో పోస్టర్‌ మీదా చూడకుండా నేను మళ్ళీ ఈ ఊర్లో అడుగుపెట్టను." అని భరణి శపధం చేసాడు.

స్నేహితులు ఆల్‌ ది బెస్ట్‌, చెప్పడం తో ఆత్మవిశ్వాసం తో రైలెక్కాడు భరణి.

***


దిగితే కాని లోతు తెలియదు - చాలా పాత సామెత, అనుభవం లోకి వచ్చింది భరణికి.

ఇంటిదగ్గర వద్దంటున్నా తనమీద నమ్మకం తో బయలుదేరి టాలీవుడ్‌ ఆశలకలల సౌధం, సినీ సామ్రాజ్య కేరాఫ్‌ అడ్డా కృష్ణా నగర్‌ లో పడ్డాడు. కలలు కనీ,కనీ కళ్ళు వాచిపోయిన ఎంతోమంది తనలాంటి మిత్రులు అక్కడ పరిచయమయ్యారు భరణికి.

అందులో ఒకతను " ఏమవుదామని వచ్చావు ఇక్కడికి " అన్నాడు.

"డైరెక్టర్‌ ని" అన్నాడు కాన్ఫిడెంట్‌ గా భరణి.

"ఎక్కడైనా ఫిల్మ్ ఇన్ స్టిట్యూట్ లో చేరావా...? " అడిగాడు అతను.

"నాకు ఆ ఫీజులు చెల్లించి నేర్చుకొనే శక్తి లేదు. కళ అనేది సృజనాత్మకత తో అనుసంధానమైనది. దానికి కావల్సినది సాధన, అనుభవం అని నా అభిప్రాయం.అది చూపించేవాడి అభిరుచి, మనోదృష్టి మీద ఆధారపడివుంటుంది. వర్మ ఏ ఇన్ స్టిట్యూట్ నించి వచ్చాడు, దాసరి ఏ ఇన్ స్టిట్యూట్ లో చదువుకున్నాడు. సినిమా తియ్యడానికి కావలసినది తపన, తపస్సు. సినిమా ని ప్రేమించగలిగే తత్వం. సినిమా ని చూసి మైమరచిపోయే నైజం. ఇవే నిజమైన క్రియేటర్‌ కి వుండాల్సిన ప్రాధమిక లక్షణాలు." అన్నాడు సూటిగా బదులిస్తూ భరణి.

అతనికి వీడిలో విషయం వుంది అనిపించింది. నెమ్మదిగా అక్కడనించి జారుకున్నాడు.

ప్రతీరోజూ ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రతి ప్రొడక్షన్‌ ఆఫీసు గుమ్మం ఎక్కడం, దిగడం అలవాటయింది. ఈ ఎక్కి దిగడం వల్ల ఆయాసం రావడం తప్ప, ఆకలి తీరడం లేదు. ఇండస్ట్రీ లో తెలిసిన వాడు లేకపోతే ఇలాంటి పాట్లు తప్పవన్న సత్యం అనుభవం లోకి వచ్చింది. ఈ క్రమం లో ఆకలి తీరేమార్గాన్ని వెదుక్కుంటూ నెమ్మదిగా జూనియర్‌ ఆర్టిస్టు ఏజంట్‌ దగ్గర పనిలో చేరాడు. అది అరంగేట్రానికి సరిపోయింది. ఇక తనలో వున్న కధకుడ్ని నిద్రలేపాలనుకున్నాడు.

అవకాశం దొరికినప్పుడల్లా అసిస్టెంట్‌ డైరెక్టర్ల దగ్గరకెళ్ళి కూర్చొనేవాడు. తన దగ్గరున్న కధల్ని వాళ్ళకి వినిపించేవాడు. ఇవేం పాత చింతకాయ పచ్చడి కధల్లా వున్నాయి. ఇలాంటి కధలు ఇప్పుడు ఎవడూ చూడరు. కొత్తకధలు రాసుకో పో అని చెప్పేవారు. మరో ఆర్నెళ్ళకి అవే కధలు వెండితెరమీద కనిపించేవి.

'అవాక్కయ్యారా..." అని అడిగినట్టుండేది భరణికి. నెమ్మదిగా సినీ ప్రపంచపుపోకడలు భోదపడ్డాయి.

ఇక్కడ ఎవడు ఎదగాలన్న ఆరాటం వాడిదే. ఎవడు ఎదగడానికి వాడే నిచ్చెనలేసుకోవాలి. కిందనించి నిచ్చెనలు లాగే వాళ్ళుంటారు. అక్కడక్కడ పైకి ఎక్కించే వాళ్ళు కూడా వుంటారు.

అలా ఎక్కించే ఓ ఆణిముత్యం కంట్లో పడ్డాడు భరణి. భరణి తపన, పడే కష్టం చూసి అతనికి ముచ్చటేసింది. తన దగ్గర అసిస్టెంట్‌ గా చేర్చుకొని అన్ని విభాగాల్లోనూ ఆరితేరేలా చేసేడు. తనే ప్రోత్సహించి నిర్మాతల దగ్గరకి పంపి కధలు చెప్పమనేవాడు.

అలా కాలక్రమం లో పదేళ్ళు గడిచాయి. ఆ నిర్మాతకి కధ నచ్చడం తో పూర్తి బౌండెడ్‌ స్క్రిప్ట్‌, తయారుచేసాడు. అది అతనికి ఇవ్వడానికి బయలుదేరాడు.

***


కోటి ఆశలు కళ్ళముందు సందడి చేస్తుండగా బయలుదేరాడు భరణి. తన చిన్న గదిలో వున్న దేవుని పటాలన్నిటికీ మళ్ళీ, మళ్ళీ దణ్ణాలు పెట్టుకున్నాడు. సినిమా ఫీల్డంటేనే సెంటిమెంటల్‌ ఫీల్డని నమ్మకం కొందరికి. అనుకున్న టైం కి చేరుకొని సమయపాలన అవసరాన్ని ఎదిగినవాడుగా పేరు తెచ్చుకోవాలనుకున్నాడు.

హడావిడి గా కిందనున్న తన స్నేహితుని మోటార్‌ సైకిల్‌ తీసుకొని, తన దగ్గరున్న బ్యాగ్‌ లో ఆ పుస్తకాన్ని, కొన్ని కాయితాల్ని పెట్టుకొని బయలుదేరాడు.అడుగడుగున అడ్డుపడుతున్న ట్రాఫిక్‌ కి మనసులోనే తిట్టుకున్నాడు. నెమ్మదిగా అలా నిర్మాత ఇంటిముందర సందు తిరిగేంతలోనే ఊహించని ఉపద్రవం జరిగింది. వెనకనించి వేగం గా వస్తున్న హోండాసిటీ కారు డాష్ ఇవ్వడం తో స్పృహ కోల్పోయాడు భరణి.

ఆ కారు ఆ నిర్మాత దే కావడం, అతను చకచకా ఆసుపత్రి లో జాయిన్‌ చేయడం, పెద్ద ప్రమాదం కాకపోవడం తో త్వరగానే కోలుకున్నాడు భరణి. ఆ కధ నిర్మాతకి విపరీతంగా నచ్చడం తో షూటింగ్‌ కూడా వేగంగా ముగిసింది. భరణి లో ఇంతకాలం నిద్రాణమై వున్న క్రియేటర్‌ ఒక్కసారిగా జూలు విదిల్చాడు. మూస లో కొట్టుకుపోతున్న పరిశ్రమకి ఓ కొత్త చుక్కాని లా తన చిత్రాన్ని మలచి చూపించాడు.

***


ఆర్నెళ్ళ తర్వాత ఓ రోజు సంధ్య దియేటర్‌ దగ్గర పెద్ద వినైల్‌ పోస్టర్‌. దానిమీద ఓ పక్క భరణి కట్‌ అవుట్‌, కింద కథ - కధనం - దర్శకత్వం:భరణి.

ఆ రోజు తన మిత్రులతో పాటు, తన అమ్మ, నాన్నలని కూడా అక్కడికి తీసుకువచ్చాడు భరణి.

అక్కడికి వచ్చిన మిత్రుడు భరణితో "సరదాగా - పోస్టర్‌ మీద పోటో, స్క్రీన్‌ మీద టైటిల్‌ పడ్డాయిరా... ఆ వెయ్యి మంది లో ఆ ఒక్కడివి నువ్వే... కధ అయిపోయింది" అన్నాడు.

"లేదురా కధ ఇప్పుడే మొదలయింది" అన్నాడు భరణి.

మరిన్ని కథలు

Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు
Sundari maarindi
సుందరి మారింది
- జి.ఆర్.భాస్కర బాబు