కలిసొచ్చిన గది - మౌద్గల్య

Kalisochhina Gadi

ఆ రోజు శివరాం హోటల్ దగ్గరకు రాగానే, రిసెప్షన్లో డ్యూటీ చేస్తున్న వ్యక్తి అతన్ని చూసి గుర్తుపట్టి పలకరింపుగా నవ్వాడు.

ఆ తర్వాత, అతను ఎప్పుడు కోరుకునే గది తాళం చెవి గుత్తి అతని చేతిలో ఉంచాడు. వాటిని తీసుకుని తలపంకించి మెల్లగా తన గది వైపు సాగిపోయాడు.

శివరాం ఉద్యోగ బాధ్యతల్లో భాగంగా, నెలకోమారు ఆ ఊరు వస్తాడు. అక్కడికి వచ్చినప్పుడల్లా అదే గది కావాలని కోరుకుంటాడు. మేనేజర్కి ముందుగా ఫోన్ చేసి మరీ గదిని సిద్ధం చేయించుకుంటాడు.

ఆ గదిలో దిగటం వల్ల తనకు బాగా ‘కలిసొస్తుందని’ అతను గాఢంగా నమ్ముతాడు. ఆ నమ్మకం ఏడాది క్రితం అతనిలో ఏర్పడింది.

మొదటిసారి కాన్ఫరెన్సుకు వచ్చినప్పుడు ఇదే గదిలో దిగాడు.

‘బాస్ చండశాసనుడు. మనం ఒళ్లు వంచి పనిచేసినా సంతృప్తి చెందడు. ఇంకా ఇంకా పనిచేయాలంటాడు. ఏటికేడు టార్గెట్ పెంచి మనకు మనశ్శాంతి లేకుండా చేస్తాడు. పరమ దుర్మార్గుడనుకో’’

సమావేశానికి వెళ్ళే ముందు హెచ్చరించారు కొలీగ్స్.

భయం భయంగా లోపలకి అడుగుపెట్టాడు.

‘‘కస్టమర్లను ఆకట్టుకోవటం ఓ కళ. మీ మాటలతో వాళ్లని లొంగ తీసుకోవాలి. మీ కంపెనీ తయారు చేస్తున్న ప్రోడక్టు మిగతా వారి కంటే నాణ్య మైంది... మన్నికయిందన్న నమ్మకం వారికి కలగాలి. అప్పుడే కొనటానికి ఎగబడతారు. అమ్మకాలు బావున్నాయి కదా అని నాసిరకం వస్తువులు అంటగట్టారా, రెండో నెలలో వాడు మీ మొహం చూడడు. పైగా నలుగురికి చెబుతాడు. పరమ దరిద్రంగా ఉంది. ఈ వస్తువు కొంటే మీరు మునిగిపోతారు జాగ్రత్త అని హెచ్చరిక చేస్తాడు. ఈమౌత్ పబ్లిసిటీ... బ్యాడ్ ప్రాపగాండా మనకు చెరుపు చేస్తుంది. కనుక ఎక్కడయినా ఫిర్యాదులుంటే... వాటిని తక్షణం మన హెడ్ ఆఫీసుకు తెలపండి. సమస్య పరిష్కారం అయ్యేలా చూడండి.’’ ప్రవాహంలా సాగింది ఆయన సంభాషణంతా.

‘‘కంపెనీ వేరు, మీరు వేరు అన్నభావన మీకొద్దు. దీన్ని మీ సొంత సంస్థలా భావించండి. అప్పుడే మీరు అంకిత భావంతో పనిచేయగలుగుతారు. ఏ పనీ పెద్దగా శ్రమ అనిపించదు. కస్టమర్లను ఆకట్టుకోటానికి మీ సొంత అజెండాతో వెళ్లగలుగుతారు. విజయం సాధిస్తారు.’’

‘‘అలా అని మీరు పడిన శ్రమకి ప్రతిఫలం ఉండదని అనుకోకండి. కంపెనీ ప్రతి ఒక్కరి కృషిని గుర్తిస్తుంది. ఇన్సెంటివ్ లు, ప్రమోషన్లతో మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది. ఒకప్పుడు నేనూ మీలాగే సాధారణ సేల్స్ మెన్ ని. ఇప్పుడు ఈ స్థాయికి చేరానంటే, నేను చేసిన శ్రమ ఒక్కటే కాదు... కంపెనీ నుంచి నా కందిన సహకారం కూడా కారణం. నన్ను చూసి మీరంతా ఈ విషయాన్ని గ్రహిస్తారని ఆశిస్తాను’’

ఆయన రూపం, వాగ్థాటి రెండూ శివరాంని ఆకట్టుకున్నాయి. మిగతావాళ్లుకూడా చెవులు రిక్కించి విన్నారు. ఆ తర్వాత మొదలయింది అసలు వ్యవహారం.

ఒక్కొక్కళ్లని పిలిచి వాయించటం మొదలు పెట్టాడు.

‘‘రోజూ కనీసం పది మందితో మాట్టాడి అందులో కనీసం ముగ్గురు నలుగురి చేతయినా వస్తువు కొనిపించలేని వాడివి... ఎందుకయ్యా? అసలు పని మీద నీకుఆసక్తి లేదు. ఉంటే ఈ పదేళ్లలో ఎంత అనుభవం సంపాయించుకునేవాడివి. పనితీరు ఎంత మెరుగుపరుచుకునేవాడివి. నీ అవసరం లేదు. వేరే పని చూసుకో’’ అన్నాడు గంభీరంగా.

బిక్కచచ్చిపోయాడతను. గుడ్లళ్లో నీళ్లుకుక్కుకుంటూ డయాస్ మీద నుంచి కిందకు వచ్చాడు. అక్కడున్న వాళ్లంతా ఆ పరిణామానికి వణికిపోయారు. ‘‘చూడబోతే, ఇక్కడికి వచ్చిన వాళ్లలో సగం మందిని ఇంటికి పంపించేటట్టున్నాడు.’’ అనుకున్నారు మనసులో.

తన దగ్గరకు వచ్చిన వాళ్లలో లోపాలను ఆయన ఎత్తి చూపుతున్నాడు. సూటిగా మాట్టాడుతున్నాడు. అప్పుడప్పుడు వ్యంగ్యంగా విసుర్లు విసురుతున్నాడు.

మీటింగుకు వచ్చిన వాళ్లలో కొంత మందిని వెంటనే మానేయాలని సూచించాడు. మరికొంత మందికి ఆరేడు నెలలు గడువు విధించి... అప్పటికీ పనితీరు మెరుగుపడకపోతే
ఇంటికి పంపిస్తానని హెచ్చరికలు జారీ చేశాడు.

శివరాం వంతు వచ్చింది.

‘‘...అయిపోయింది... అంతా అయిపోయింది... ఇక ఈ ఉద్యోగానికి... తనకీ రాం... రాం... రేపట్నుంచి కొత్త ఉద్యోగం వెతుక్కోవలసిందే.’’ మనసులో ఆందోళన నింపుకుని...
తడబడుతున్న అడుగులతో బాస్ ని సమీపించాడు.

ఆశ్చర్యం... ఆయన ఒక్కటంటే ఒక్క విమర్శ చేయలేదు. పైగా శివరాంని ఆకాశానికెత్తేశాడు.

‘‘నువ్వు ఒక ప్రణాళిక ప్రకారం పనిచేస్తున్నావు. ఇలా చేస్తూ పోతే విజయం దానికంతటికి అది సిద్దిస్తుంది. నిరాశ పడకుండా ప్రయత్నించు’’ అన్నాడు.

శివరాం మనసు సంతోషంతో ఉప్పొంగింది. అది అతని వూహకందని విషయం.

బాస్ తిట్టకుండా ఉంటే చాలని... మనసులో వేయి దేముళ్లకు మొక్కుకున్నాడు. ఇప్పుడు ప్రోత్సాహపూర్వకంగా ఆయన మాట్లాడటం అతనిలో వేయి ఏనుగుల బలాన్నిచ్చింది.

మరుసటి నెలంతా రెట్టించిన ఉత్సాహంతో పనిచేశాడు.

క్యాష్ అవార్డుకు అతని పేరు సిఫార్సు చేస్తున్నట్టు బాస్ ప్రకటన చేశాడు.

ప్రమోషన్ రావటానికి మరెంతో కాలం పట్టలేదు.

యాదృచ్చికంగా మొదటి రెండు సార్లు అదే గదిలో దిగాడు. తర్వాత నుంచి మాత్రం అతను ఆ గదిని కోరి ఎంపిక చేసుకుంటున్నాడు.

లిఫ్ట్ పనిచేయటంలేదు. మెట్లమీదుగా పైకి వెళుతూ అనుకున్నాడు శివరాం...

‘‘ఇక్కడికి వచ్చినప్పుడల్లా నాకు ఏదో ఒక మంచి జరుగుతోంది. రేపేం లాభం వచ్చి పడుతుందో...’’

గదిలోపలకి అడుగుపెట్టి బ్రీఫ్ కేసును పక్కనున్న ర్యాక్ లో ఉంచాడు. ఆ తర్వాత స్నానం కానిచ్చి డిన్నర్ కి ఆర్డరిచ్చాడు.

ఈలోపు టీవీ ఆన్ చేశాడు.

క్రైమ్ వార్తలు వస్తున్నాయి. వాటిని ఆసక్తిగా చూడసాగాడు శివరాం.

‘‘నాలుగేళ్ల క్రితం చోటుచేసుకున్న ఘోరం... టీవీ యాంకర్ పైన అత్యాచారం, ఆ తర్వాత హత్య.’’ యాంకర్ చదువుతున్నాడు. దానికి అనుబంధంగా విజువల్స్ చూపిస్తున్నారు.

దృశ్యాలు చకచకా కదులుతున్నాయి. ఒక్కో దృశ్యం కదులుతున్న కొద్దీ, శివరాంలో భయం క్రమంగా పెరగసాగింది. ఆ గది వాతావరణం అంతా అతన్ని భయపెట్టింది.

గబుక్కున గోడకు తగిలించిన షర్టు, ప్యాంటు బ్రీఫ్ కేసులో కుక్కుకుని... లుంగీమీదే రిసెష్షన్ దగ్గరికి పరిగెత్తుకొచ్చాడు.

‘‘ఆ గది ఖాళీ చేస్తున్నాను.’’ ఒకే ఒక ముక్కలో చెప్పాడు.

అర్ధగంట క్రితం వచ్చిన వ్యక్తి, హఠాత్తుగా ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడో అర్ధంకాక, అయోమయంగా చూశాడు కౌంటర్లో వ్యక్తి.

‘‘సార్. గదులు ఖాళీ లేవు. రేపు ఉదయం దాకా వెళ్లేవారెవరూ లేరు.’’ అన్నాడు. ఇంకా నచ్చచెప్పాడు.

‘‘అవసరమయితే రూం మరోసారి క్లీన్ చేయించి బెడ్ షీట్లవీ మార్పిస్తా.’’

శివరాం ఆ గది కేటాయించమని ఎప్పుడు ఒత్తిడి చేసే విషయ అతనికి తెలుసు. నెలనెలా వచ్చే కస్టమర్ కనుక హోటల్ వాళ్లు అతనికి ప్రాధాన్యం ఇస్తారు. గౌరవంగా చూసుకుంటారు. అతను ఎప్పడు వచ్చినా బిల్లులో పదిశాతం రాయితీ కూడా ఉండేది.

‘‘ఒక్క నిముషం కూడా ఇక్కడ ఉండదలుచుకోలేదు... ఖాళీ చేసి వెళ్లిపోతున్నా.’’ కొట్టినట్టుగా చెప్పాడు. చేతులో ఉన్న తాళం గుత్తిని రిసెప్షన్ టేబుల్ పైకి విసిరేసి బయటకు నడిచాడు.

శివరాం ప్రవర్తన అతనికి వింతగా అనిపించింది. హోటల్ మెట్లు దిగి వెళ్లేవరకూ అతని వైపే చూస్తుండిపోయాడు.

ఆ నిముషంలో... శివరాంకి... ‘‘ఇక్కడకు వచ్చినప్పుడల్లా ఏదో ఒక మంచి జరుగుతోంది. ఇప్పుడు ఖాళీ చేసి వెళ్లిపోతే, ఆ అదృష్టం చేజారిపోతుంది... ’’ అన్న ఆలోచన రాలేదు.

అలా అనుకుని ఉంటే గది ఖాళీ చేసే వాడే కాదు.

ఇంకా స్పష్టంగా చెప్పాలంటే... అసలు అతని మనసులో రేపటి సేల్స్ మీటింగులేదు. అది తన జీవితంలో కలిగించబోమయే ప్రభావం గురించీ ఆందోళన లేదు.

ఇంతకు ముందు టీవీలో దృశ్యాలే శివరాం కళ్లముందు కదలాడుతున్నాయి.

యాంకర్ హత్య జరిగింది ఆ హోటల్లోనే...

అదీ తను ఏరి కోరి తీసుకునే గదిలోనే...

అతనికి గుండెదడ ఇంకా తగ్గలేదు.

ఒకప్పుడు ‘కలిసొచ్చిన గది’ని విపరీతంగా ప్రేమించిన శివరాం... ఇప్పుడు దానికందనంత దూరంగా పోతున్నాడు. అతను ఎక్కిన ఆటో సిటీ దూరంగా ఉన్న మరో హోటల్ దిశగా సాగిపోతోంది.

మరిన్ని కథలు

Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు
Sundari maarindi
సుందరి మారింది
- జి.ఆర్.భాస్కర బాబు