ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న స్టేడియం బయట ఎంత టెన్షన్ వుంటుందో..
అంతకు మించిన టెన్షన్ వ్యాపించి పోయింది.. ఆ కోర్టు ప్రాంగణమంతా. అన్ని ఛానళ్ల ఓబీ వేనులతో బాటు ..పోలీస్ వెహికల్స్ తో అక్కడి పార్కింగ్ ప్లేసు నిండి పోయింది. యస్ పీ..డియస్పీ రేంక్ ఆఫీసర్లతో బాటు దాదాపు రెండు వందల మంది పోలీస్ బలగాలతో..టెర్రరిస్ట్ ఎన్ కౌంటర్ ఆపరేషనా?..అనిపించేలా..నిశ్శబ్దం గానూ..ఉద్రిక్తంగా వుంది. ఛానెళ్ల కెమారా మెన్ లతో బాటు..న్యూస్ రిపోర్టర్లు కూడా పోలీసులు ఏర్పాటు చేసిన బారికేళ్ల వెనుక..నిలబడి..కోర్టు నుండి బయటి కొచ్చే..వ్యక్తులను నిశితంగా గమనిస్తున్నారు.
ఆ రోజు సిటీలో సెన్సేషన్ క్రియేట్ చేసిన ..ముగ్గురి మరణానికి కారణమైన..శ్రావన్ కేసు విచారణ. ఆ కేసులోవున్న ముద్దాయిల సంబంధీకులందరూ..సిటీలో బిగ్ షాట్స్ కావడమే..ముఖ్య కారణం.
కోర్టు లోపలి వాతావరణం కూడా అందుకు భిన్నంగా లేదు సెషన్స్ కోర్టు విజిటర్స్ గేలరీ ఖాళీ లేకుండా క్రిక్కిరిసి పోయింది.
వివిధ న్యూస్ పేపర్ల పత్రికా విలేఖరులతో.. కోర్టు హాలంతా ..కోలాహలంగా వుంది.
కార్ యాక్సిడెంట్ లో చని పోయిన” చిరంజీవి సౌమ్య కేసు” విచారణ..
బోనులో తల వంచుకు నిల బడిన టీనేజ్ ముద్దాయిలు ..ఐదుగురూ..అయోమయంగా చూస్తున్నారు. ముద్దాయిల తలి దండ్రులు ఆడ్వాన్స్ డు కేన్సర్ పేషెంటుల్లా మరీ దీనంగా ముఖాలు పెట్టారు. కోర్టు ప్రారంభాన్ని సూచించే గంట మోగింది. కోర్టు అటెండర్ వచ్చి జడ్జి గారి కుర్చీ ప్రక్క నిలబడటంతో..కోర్ట హాలంతా పిన్ డ్రాప్ సైలెన్సుతో నిండి పోయింది. గంభీరంగా వచ్చిన జడ్జి గారిని చూస్తూనే అందరూ నిలబడి అభివాదం చేశారు.
తల వంచి అభివాదాన్ని స్వీకరించిన జడ్జి గారు ఆశీనులు కాగానే..అందరూ తమ తమ స్థానాల్లో..కూర్చుండి పోయారు. పట్ట పగలే తప్పతాగి..డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేసి మూడు నిండు ప్రాణాలను బలిగొన్న కిరాతకుల పక్షాన వాదించడానికి ఏ లాయరూ ముందుకు రాక పోవడంతో కోర్టు వారు అనుమతించిన డిఫెన్సు లాయరు ముద్దాయిల తరఫున కేసు ఫ్రెజెంట్ చేయడానికి నియమించబడ్డారు.
పబ్లిక్ ప్రాసిక్యూటర్..లేచి నిలబడి
“యస్ యువరానర్” అంటూ మొదలు పెట్టారు .”.యువరానర్ ముగ్గురి ప్రాణాలు బలిగొన్నఈ కేసులో ముద్దాయిలు ఐదు మందీ మైనర్లే. అందరూ ఇంజినీరింగ్ విద్యార్ధులే..యువరానర్. మల్టీప్లెక్స్ లో టికెట్లు దొరక్క పోవడంతో..పట్ట పగలే డ్రింక్ చేసి ..ఫ్లై ఓవర్ డౌన్ లో కార్ ను కంట్రోల్ చేయ లేక రోడ్ డివైడర్ ను గుద్దేసారు. కారు..ఆ స్పీడుకు టిల్టై ..రైట్ సైడ్ లో వస్తున్న కారు మీదకు పల్టీలు కొట్టేసింది. ఆ కారు డ్రైవ్ చేస్తున్న సౌమ్య బాబాయ్ స్పాట్ లో చనిపోతే ఎనిమిది సంవత్సరాల సౌమ్య కోమా లోకి వెళ్లి పోయి ఎనిమిదో రోజున కన్ను మూసింది యువరానర్. సౌమ్య తాత గారు కూడా చికిత్స పొందుతూ మరణించారు. పోలీస్ డిపార్టుమెంటు కోర్టుకు సమర్పిం చిన బారు లోని సిసి కెమారా రికార్డింగ్స్..ఇన్సిడెంట్ ప్లేసు ఫ్రక్కనున్న హోటల్ సిసి కెమారాలో రికార్డైన క్లిప్పింగ్స్ కేసును ప్రూవ్ చేశాయి యువరానర్. ముద్దాయిలు కూడా తమ నేరాన్ని అంగీకరించారు యువరానర్.
ముద్దాయిలకు ఐ పి సీ 304సెక్షన్ బ్ ప్రకారం తగిన శిక్షలు విధించ వలసినదిగా..కోరుతున్నాను యువరానర్..పబ్లిక్ ప్రాసిక్యూటర్ తన వాదనను ముగించగానే.. ముద్దాయిల తరఫున వాదనలు వినిపించడానికి లాయర్స్ ఎవరూ ముందుకు రాక పోవడంతో.. కోర్టు వారే నియమించిన డిఫెన్స లాయర్ నిలబడి.. అభివాదం చేసి.
“ యువరానర్..!”
“ఈ కేసులో డిఫెన్స్ చేయడానికి గానీ..వాదించ డానికి గానీ ..ఏమీ లేదు యువరానర్.. కేసుకు సంబంధించిన వివరాలన్నీ కోర్టుకు సబ్మిట్ చేశాను యువరానర్..అభియోగం మోప బడిన ముద్దాయిలందరూ తమ నేరాన్ని ఒప్పుకున్నారు యువరానర్..ముఖ్యంగా ముద్దాయిల తరఫు పేరెంట్సందరూ నా ద్వారా కోర్టు వారికి తమ మనవిని విన్నవించుకోడానికి అనుమతి కోసం సవినయంగా మనవి చేసుకుంటున్నారు యువరానర్. “
“ఐ అబ్జెక్ట్ యువరానర్.!. ముద్దాయిల తరఫున వున్న ఐదు మందికీ టైం స్పేర్ చేయడం కోర్టు వారి సమయాన్ని వృధా చేయడమే ఔతుంది.”
ప్రాసిక్యూటర్ ఆబ్జెక్ట్ చేయడంతో..డిఫెన్స్ లాయర్ లేచి..
“కోర్టు సమయాన్ని వృధా చేయడం ముద్దాయిల తలిదండ్రుల ఉద్దేశం కాదు యువరానర్. కేసుకు గానీ ముద్దాయిలకు గానీ ఎటువంటి సంబంధం లేని..తమ మనో భావనలతో బాటు..చిరంజీవి సౌమ్యకు తమ సంతానం కలిగించిన అన్యాయానికి బదులుగా తాము చేయ తల పెట్టిన కార్యక్రమాన్ని కోర్టు ముందాచాలనే తపన తప్ప మరో ఉద్దేశం లేదు యువరానర్..అందరి తరఫున ఒక్కరికైనా అవకాశం యిప్పించ వలసినదిగా అందరి ప్రార్ధనే ఈ విన్నపం.. యువరానర్.”
వినమ్రంగా అభివాదం చేశాడు ..డిఫెన్స్ లాయర్.
“అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్ నౌ..వన్ కెన్ ప్రొసీడ్..”
జడ్జి గారు అనుమతించగానే ..కారు డ్రైవ్ చేసి మూడు ప్రాణాలను బలిగొన్న శ్రావన్ తండ్రి కిషోర్
బోనులోకొచ్చి అందరికీ అభివాదం చేశాడు.
“మా అభ్యర్ధనను మన్నించి మాకీ అవకాశ మిచ్చిన కోర్టు వారికి..హృదయ పూర్వక నమస్కారములు. ముగ్గురి మరణానికి మూడు కుటుంబాల క్షోభకు..కారకులైన మా దారి తప్పిన పిల్లల..గురించి ఏంచెప్పినా ..వ్యర్ధమే యువరానర్.ఈ దురదృష్ట సంఘటనకు బాధ్యులు ఈ మా పిల్లలే కాదు యువరానర్..మేం కూడా బాధ్యులమే. వీలయితే మా పిల్లలకు విధించే శిక్షను..వారితో బాటు మాకు కూడా వర్తింప చేసే అవకాశాలను పరిశీలించ వలసినదిగా మనవి చేసుకుంటున్నాము. చిన్నారి సౌమ్య జ్ఞాపకార్ధం ..తన పేరున ఓ ట్రస్ట్ ఏర్పాటు చేసి..
మాలాంటి పనికి మాలిన పేరెంట్స్ ను ఎడ్యుకేట్ చేసే కార్యక్రమాలను ..నిర్వహించేలా..రూపు దిద్దాలనుకుంటున్నాము..ఇది మాత్రమే గాక ఏ టీనేజర్ తప్పు చేసినా ముందతని తల్లిదండ్రుల్నిబాధ్యుల్నిచేసే జీవో పాస్ చేయ వలసిందిగా..మీ ద్వారా ప్రభుత్వాన్ని..కోరుతున్నాము యువరానర్..ఒకప్పుడు తాగుబోతంటే సంఘం చీకొట్టేది..అసహ్యించు కొనేది.. మరి అదే ఈనాడు..ఫ్యాషనై పోయింది ..ప్రభుత్వానికి గొప్ప ఆదాయ వనరై పోయింది. ఒకప్పుడు తాగుబోతులు రాత్రిళ్లు మాత్రమే తాగి తందనాలాడేవారు మరి ఈనాడు..తాగి మరీ ఆఫీసులకొస్తున్నారు..ముఖ్యంగా…. టీనేజర్స్..పబ్బుల్లో వారే.. హుక్కా సెంటర్లలో వాళ్లే..తాగి మరీ బైక్ రేసుల్లో ప్రాణాలు కోల్పోతోందీ.. డ్రగ్స్ రాకెట్లలోపట్టు బడుతోందీ యువతే.. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో కూడా యువతే యువరానర్.. వీరందరి విచ్చల విడి తనానికి..ఆద్యులూ..ఆజ్యం పోస్తోంది మా వంటి బాధ్యత తెలియని.. తల్లిదండ్రులే యువరానర్.. ఆఖరు సారిగా మాకు కూడా కఠిన కారాగార శిక్ష. విధించ వలసినదిగా మనవి చేసుకుంటూ మాకీ అవకాశమిచ్చిన..కోర్టు వారికి మా కృతజ్ఞతలు తెలుపుకుంటూ..సెలవు తీసుకుంటున్నాను యువరానర్.”
కిశోర్ నమస్కరించి వెళ్లగానే..జడ్జి గారు కోర్టులో వున్న అందరినీ చూస్తూ..
నా అనుభవంలో వాదోపవాదనలు లేని తొలి కేసిది. ముద్దాయిల తరఫు మనవిని పరిగణన లోకి తీసుకుంటాం.వారి విన్నపాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తాం.. ఈ కేసు..క్షుణ్ణంగా పరిశీలించిన పిమ్మట..అయా సెక్షన్ల ప్రకారము ..శిక్షలు అమలు చేస్తాం..ఫైనల్ హియరింగ్ నెక్ట్స్ సోమ వారానికి వాయిదా వేస్తున్నాం..నౌ కోర్ట్ ఈజ్ ఎడ్జర్న్డ్ ..
*** *** ***
ముద్దాయిల తలిదండ్రులందరూ కిశోర్..బంగ్లాను సమీపిస్తూ ఇంటి చుట్టూ గుమి కూడిన జనాల్ని చూస్తూనే ఏదో ఉపద్రవం సంభవించిందన్న సెన్స్ తో కొట్టుకుంటున్న గుండెల్ని అదుపులో పెట్టుకుంటూ జీవమున్న శవాల్లా కార్లు దిగారు. అంతలో ఏడ్చుకుంటూ హఠాత్తుగా వచ్చిన కిశోర్ కూతురు తండ్రిని చుట్టుకుపోతూ..
“డాడీ !అమ్మ..అమ్మ చచ్చి పోయింది “ అంటూనే ఒక లెటర్ తండ్రి చేతిలో పెట్టి కుప్ప కూలి పోయింది.
కూతురి ప్రక్కనే కూలబడి పోయిన కిశోర్ వణికే చేతులతో..లెటర్ తెరిచాడు.
ఏమండీ..!ఈ లెటర్ మీరు చదివే సరికి నేనీ లోకంలో వుండను. మన బాబు తప్ప తాగి ముగ్గురి జీవితాలను పొట్టన పెట్టుకున్నాడన్న వార్త వింటూనే చచ్చి పోవాలనుకున్నాను...కాని మన మిగిలిన యిద్దరు బిడ్డల ముఖాలు చూసి ..సాహసం చేయ లేక పోయాను. ఈవారం రోజులూ నేనెంత నరకం అనుభవించానో..మీరు వూహించలేరు. బంధువుల పరామర్శల్లోని వ్యంగ్యాన్ని ..చుట్టు ప్రక్కల వారి అసహ్యమైన చూపుల్ని..భరించ లేక పోయాను. మన కిరాతకుడు పొట్టన పెట్టుకున్న ముక్కు పచ్చ లారని సౌమ్య..సౌమ్య బాబాయి..తాతయ్యల మరణాన్ని టీవీల్లో ..పేపర్లలో చూస్తూ..ప్రతి క్షణం చచ్చి పోతున్న..ఫీలింగుతో ఈ వారం రోజులూ నెట్టుకొచ్చాను. మనం ..చేసిన చెత్త పనులే మన బిడ్డ కిరాతకానికి కారణాలయ్యాయని మనసారా నమ్ముతున్నాను. దద్దమ్ముకు..పట్టం కట్టాలనుకున్నాం. లీకుల పేపర్లు కొన్నాం..లక్ష లక్షలు తగలేసాం..చెప్పు తినే కుక్కను అందలమెక్కించాలనుకున్నాం. చివరకు హంతకుడయ్యాడు. మనం చేసిన చెత్త పనులు మన చావుకు కారణమైనా..సంతోషించే వాళ్లం..మూడు నిండు ప్రాణాలు..మూడు కుటుంబాలు..ఈ పాపం ఎవరిది.?.డబ్బులు సంపాదించాలనే యావలో మీరు..ఆడంబరాల వలలో నేను..ఇంటర్ లో స్మార్ట్ పోను..లైసెన్స్ లేకుండానే స్పోర్ట్ బైకు..మీకు తెలియకుండా అడిగినంత పోకెట్ మనీ.. నా కారు..ఎన్ని ఎన్నెన్ని వెధవ పనులు చేశామో ..చేతులు కాలాయి..మూడు నిండు ప్రాణాలు..పోయాయి. పందులు కంటున్నాయి ..మనమూ కంటున్నాం.. మన వెధవకు ఎలాంటి శిక్ష పడినా నాకు ఎలాంటి బెంగా లేదు..వినడానికి నేనుండను..కనీసం మిగిలిన యిద్దరు పిల్లల్ని..పిల్లల్లా..పెరగనివ్వండి.. పిచ్చి ప్రేమతో పిల్లల్ని చంపుకోకండి. ఎంత ఖర్చయినా ఈ నా మరణ వాజ్ఞ్మూలాన్ని అన్ని పేపర్లలో ప్రకటించండి..అన్ని ఛానల్స్ లో..టెలీ కేస్ట్ చేయించండి.
చివరిగా ఈ దేశ తల్లిదండ్రులకు నా విన్నపం.. అమ్మలూ నాన్నలూ!..దొడ్లో మొక్కకు చీడ పట్టకుండా పెంచ గల్గితేనే నాటండి. పిల్లల బాగోగులు చూడ గలిగితేనే కనండి..డబ్బుందని అడ్డ దారుల్లో పెంచకండి. మనం పోస్తున్న..పిచ్చి ప్రేమలు..తొక్కుతున్న అడ్డ దారులు విషాన్ని కక్కుతున్న కాల నాగులని గుర్తించండి. చేతులెత్తి వేడుకుంటున్నాను.. కనే ముందు..నన్ను..నా రాక్షస బిడ్డ శ్రావన్ ను..మా చెత్త పెంపకాన్ని ఒక్క క్షణం స్మరించుకోండి...సెలవ్..
చివరి పదం చదువుతూనే..అమ్మా..అంటూ గుండె పట్టుకుని ..కూతురి ప్రక్కనే..ఒరిగి పోయాడు....అప్పటికే బ్లాక్ లిస్ట్ లో వున్న రోడ్స్ కాంట్రాక్టర్ ...కిశోర్.