“అబ్బబ్బ ఈ కొంప ఎన్ని సార్లు సర్దినా ఇంతే.” అంటూ అలమారాలో వున్న కాగితాలన్నీకింద పడేసి 'ఏవండీ... ఏవండీ... మిమ్మల్నే' అంటూ భర్త రాఘవరావుని పిలిచింది.
'ఏవిటే నీ గోల' అంటూ వచ్చాడు.
కింద పడివున్న కాగితాలని చూసాడు. 'ఏవిటే అన్నీ ఇలా పడేసావు' అంటూ విసుక్కున్నాడు.
'ఏ కాగితాలు పనికి వస్తాయో, ఏ కాగితాలు పనికి రావో తెలిసి చావదు. అవన్నీ చూసుకుని పనికి రానివి పక్కన పడెయ్యండి. రేపు పేపర్లతో కలిపి అమ్మేస్తాను' అంటూ లోపలికి వెళ్లి పోయింది.
'ఖర్మ దీనికి ఏ టైములో ఏమవుతుందో తెలియదు. ఇప్పుడు ఇవన్నీ కింద పడేసి పెద్ద పని పెట్టింది అంటూ రాఘవరావు కింద అడ్డ దిడ్డంగా వున్నా కాగితాలు తీసి సర్డుతున్నాడు. ఆ కాగితాల్లోంచి ఓ కవరు కింద పడింది. రాఘవరావు ఆకవరు తీసి ఓపెన్ చేసి అందులోంచి ఓ కాగితం తీసాడు.
అది తన జాతకం కాగితం. తీసి చదివాడు. మొహం లో ఫీలింగులు మారి పోయాయి.
అందులో రాఘవరావు జాతకం 11-12-13 వరకు రాసి వుంది. రాఘవరావు క్యాలెండరు వంక చూసాడు.
ఇవాళ నవంబరు ఎనిమిది. అంటే ఈ జాతకం ప్రకారం నేను రెండు మూడు రోజుల్లో పోతానన్నమాట. మరి నా కోరిక ఈ రెండు మూడు రోజుల్లో తీరుతుందా. ఇంత చిన్న కోరిక తీర్చు కోలేనా? తీరదా? ఎలా? అనుకుంటూ ఆలోచనలతో గుండె బరువెక్కి 'శాంతా' అంటూ భార్యని పిలిచాడు.
హడావిడి పరుగు లాంటి నడకతో వచ్చింది శాంత.
'శాంతా గుండెల్లో ఏదో బరువుగా వుంది. తలతిరుగుతుంది' అన్నాడు.
శాంత కంగారు పడి 'అవన్నీ అలా వుంచండి. తర్వాత సర్దుకోవచ్చు. వేడిగా కాఫీ ఇస్తా, తాగి కాసేపు పడుకోండి. తగ్గి పోతుంది.' అంటూ లేవదీసి మంచం మీద పడుకోపెట్టి
కాఫీ తీసుకురావడానికి లోపలికి వెళ్ళింది.
రాఘవరావు పడుకుని అలా ఆలోచిస్తూ కళ్ళు మూసుకున్నాడు.
శాంత కాఫీ తీసుకువచ్చింది.
'ఏవండీ... ఇదిగోకాఫీ. లేవండి... మిమ్మల్నే... అప్పుడే నిద్ర పట్టేసిందా' అంటూ తట్టి లేపింది.
రాఘవరావులో కదలిక లేదు. కంగారు పడింది శాంత.
'ఏవండీ... ఏవండీ...' అంటూ కుదిపింది. అయినా రాఘవరావులో కదలిక లేదు.
'ఏవండీ... ఏవండీ...' అంటూ ఏం చెయ్యాలో తోచక రాఘవరావు ప్రాణ స్నేహితుడు విశ్వనాధం కి ఫోన్ చేసింది.
విశ్వనాథ్ పది నిముషాల్లో డాక్టర్ కామేష్ తో హడావిడిగా వచ్చాడు.
శాంత జరిగినదంతా డాక్టర్ కి చెప్పింది.
కామేష్ రాఘవరావుని టెస్ట్ చేసాడు.
'ప్రాబ్లం ఏమీ కనిపించడం లేదు. కాకపోతే ఆయన స్పృహలోలేరు. 'అంటూ రెండు ఇంజెక్షన్ లు చేసాడు. 'కంగారు పడాల్సిన అవసరం లేదు. తగ్గి పోతుంది. స్పృహ వస్తుంది. మళ్ళీ రేపు వస్తాను. ఈ లోగా ఏవన్నా అవసరం అయితే ఫోను చెయ్యండి.' అంటూ వెళ్లి పోయాడు.
మర్నాడు కామేష్ వచ్చి చూసాడు. రాఘవరావులో చలనం లేదు. సెలేన్ ఎక్కిస్తున్నారు. కామేష్, కార్డియాలజీ స్పెషలిస్టు శ్రీనివాసరావుని పిలిపించాడు. అయినా రాఘవరావు లో చలనం రాలేదు. ఇద్దరు నర్సులని కేర్ టేకర్స్ గా పెట్టారు.
అమెరికా నుంచి పెద్దబ్బాయి సుధాకర్, కోడలు సునీత, బెంగళూర్ నుంచి కూతురు సుజాత, అల్లుడు అరవింద్, ఢిల్లీ నుంచి చిన్నబ్బాయి వంశీ వచ్చారు.
అందరూ ఏమి జరిగిందో అని కంగారుగా వున్నారు.
డాక్టర్ శ్రీనివాసరావు 'అంతా బాగానే వుంది. ఇది కార్డియాలజీ ప్రాబ్లం కాదు. న్యురోలజిస్ట్ డాక్టర్ నూకరాజుకి చూపిస్తే బాగుంటుంది. అన్నాడు కామేష్ తో.
విశ్వనాథం వెంటనే వెళ్లి నూకరాజుని తీసుకు వచ్చాడు.
డాక్టర్ నూకరాజు రఘురాం ని టెస్ట్ చేసి 'కాలి బొటన వేలు నుంచి హెడ్ వరకూ నెర్వస్ సిస్టం అంతా బాగానే వుంది. ఏం ప్రాబ్లం లేదు.' అన్నాడు.
'హార్టు బీటింగు, వాల్వ్స్, బి పి, షుగర్ అన్నీ నార్మల్ గానే వున్నాయి. కానీ ఏ ట్రీట్మెంటు కి బాడీ రియాక్టు కావటం లేదు' అన్నాడు కామేష్.
'ఈయన చాలా డిప్రెషన్ లోకి వెళ్లి పోయారు.' అన్నాడు నూకరాజు.
'హాస్పిటల్ లో జాయిన్ చెయ్యమంటారా' అడిగాడు విశ్వనాథం.
'నో ... ఈ పరిస్థితిలో ఈయన్ని కదపటం మంచిదికాదు. ఈయన స్పృహలో లేక పోయినా బాడీ లో ప్రతీ పార్టు తన పని తాను క్యాజువల్ గా చేసుకుపోతోంది. కానీ ఇలాగే వుంటే ఈయన మెల్లిగా కోమాలోకి వెళ్ళే అవకాశం వుంది. కాబట్టి ఆయన్ని మనం డిప్రెషన్ లోంచి త్వరగా బయటికి తీసుకురావాలి.' అన్నాడు నూకరాజు.
'ఏం చేద్దామంటారు' అంటూ అడిగింది శాంత.
ఆయన్ని చూస్తుంటే ఏదో విషయం గురించి ఆలోచిస్తూ అలా ట్రాన్స్ లోకి వెళ్లిపోయినట్టు అన్పిస్తోంది. అ ట్రాన్స్ లోంచి బయటికి రావాలంటే ఆ విషయం ఏంటో మనం తెల్సు కోవాలి.' అన్నాడు నూకరాజు.
'అదెలా తెలుస్తుంది' అంటూ అడిగాడు వంశీ.
'అది ఏదయినా కావచ్చు. ఎవర్నయినా బెంగతో చూడాలని వుండొచ్చు. ఏదయినా చెయ్యాలని గానీ, చెప్పాలని గానీ వుండొచ్చు. ఏవయిన తినాలని గానీ, ఏదయినా జరిగినదానిని గురించి గానీ, ఏదయినా తీరని కోరిక గురించి గానీ ఎక్కువ అలోచించి ట్రాన్స్ లోకి వెళ్లి వుండాలి. ఏదో వుంది ఆయన మనసులో. అది మనం తెల్సుకుంటే ప్రాబ్లం సాల్వయినట్టే.' అన్నాడు నూకరాజు.
'నాకు తెల్సి ఆయనకి ఏ సమస్యలూ లేవు డాక్టరు గారూ' అంది శాంత.
'అదీ నిజమే... కుటుంబపరంగా, ఆర్దికంగా, బిజినెస్ పరంగా కూడా ఎటువంటి సమస్యలూ లేవు' అన్నాడు విశ్వనాథం.
'నాన్న గారు ఏ విషయం గురించి బాధపడటం మేం చూడలేదు' అన్నారు అంతా.
'ఇంకో రెండు రోజులు చూద్దాం . ఆతర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం. సిస్టర్స్ ... టేక్ కేర్. ఏమయినా ఇంప్రూవ్ మెంటు వుంటే వెంటనే ఫోన్ చెయ్యండి. మళ్ళీ సాయత్రం వచ్చి చూస్తాం.' అంటూ వెళ్ళిపోయారు డాక్టర్ నూకరాజు, కామేష్.
ఇంటి పక్క ఇంట్లో ఏదో ఫంక్షన్ జరుగుతోంది. వాళ్ళు బ్యాండు మేళం పెట్టారు. ఆ శబ్దం గోలగా వినపడుతోంది.
'రాఘవా... నేనురా... విశ్వాన్ని. ఏమయిందిరా. నిన్నెప్పుడూ ఇలా చూడలేదు. ఏంట్రా... నువ్విలా పడుకుని వుంటే నాకు ప్రాణం పోయినట్టు వుందిరా... లేరా...లే... ` అంటూ రాఘవరావు బుగ్గలు నిమురుతూ ఆన్నాడు విశ్వం.
అందరూ రాఘవ చుట్టూ చేరారు. విశ్వనాథం పక్కకి జరిగాడు.
అక్కడే పక్కన పడేసిన రాఘవ చొక్కా జేబులో ఓ కాగితం కనిపించింది. అది గమనించి విశ్వం అటుగా వెళ్ళాడు.
'నాన్నా... నేను సుదాకర్ ని... చెప్పు నాన్నా. నీకెవర్నయినా చూడాలనుందా. ఏదయినా చూడాలనుందా... చెప్పు... అంటూ చెవిలో అడిగాడు సుధాకర్.
'నాన్నా... నీ కేమయినా తినాలనుందా? గారెలు, బూరెలు, బిర్యాని, స్వీట్లు చెప్పండి నాన్నా...' అంటూ అడిగింది సుజాత.
రాఘవరావులో ఏ చలనం లేదు. అలాగే ప్రశాంతంగా పడుకుని వున్నాడు.
విశ్వనాథం రాఘవరావు చొక్కా జేబులో దొరికిన జాతకం కాగితాన్ని చదువుతున్నాడు. అది ఎవరూ గమనించలేదు.
'నాన్న్నా... నేను వంశీని... నీకు తీర్థయాత్రలు ఏవన్నా చెయ్యాలనుందా. కాశీ... రామేశ్వరం... గయా... షిర్డీ... బదరీనాథ్... చెప్పండి నాన్నా... నేను తీసుకువెళ్తాను.' అన్నాడు వంశీ.
'ఏవండీ ఒక్కసారి కళ్ళు తెరవండి. నా వల్లేమయినా తప్పు జరిగిందా... జరిగితే నన్ను క్షమించండి.' అంటూ బావురుమంది శాంత.
రాఘవరావులో మార్పులేదు.
'అమ్మా... వూరుకో... నాన్నకి ఏమీ కాదు.' అంటూ అందరూ శాంత ని సముదాయించారు.
'ఈ జాతకం చదివి తను రెండు మూడు రోజుల్లో పోతానని తెల్సి డిప్రెషన్ లోకి వెళ్ళాడన్న మాట.' అనుకున్నాడు విశ్వనాథం.
బయట 'డడ్డనక డన్... డడ్డనక డన్... అంటూ డప్పుల మోత భీభత్సంగా వినబడుతోంది.
'అసలే ఇక్కడ టెన్షన్తో చస్తుంటే బయట ఆ డప్పుల గోలోకటి... ఆ కిటికీ తలుపులు వెయ్యండి' అంది శాంత.
సుధాకర్ వెళ్లి శబ్దం లోపలికి రాకుండా తలుపులు వేసి వచ్చాడు.
సరిగ్గా అప్పుడే ఓ వింత జరిగింది. దాన్ని విశ్వనాధం గమనించాడు. 'ఎస్' అనుకుంటూ బయటకి వెళ్లిపోయాడు.
'మావయ్య గారూ మేం అమెరికా నుంచి తిరిగి ఇండియా కి వచ్చేస్తాం. లెండి మావయ్య గారూ.' అంది సునీత.
అందరూ చుట్టూ చేరి రాఘవరావు చెవిలో ఏవో చెబుతూనే వున్నారు.
రాఘవరావులో మార్పు లేదు.
ఇంతలో అంబులెన్స్ సౌండ్ వినిపించింది.
కాసేపటిలో విశ్వనాధం డాక్టర్ నూకరాజు, కామేష్ లతో వచ్చాడు.
'మీ నాన్నకి ఏం కాలేదు. పక్కకి జరగండి...' అన్నాడు విశ్వం.
'మీరు చాలా రిస్క్ తీసుకుంటున్నారు.' అన్నాడు కామేష్.
'ఏం కాదు డాక్టర్. నాదీ పూచి ముందు అంబులెన్స్ ఎక్కించండి.' అన్నాడు విశ్వనాథం
రాఘవరావుని స్త్రేక్చర్ మీద పడుకోబెట్టి తీసుకెళ్ళారు.
బయట డప్పుల శబ్దం వినిపిస్తోంది.
అందరూ రాఘవరావు తో బయటికి వచ్చారు.
'నేను కూడా వస్తా' అంది శాంత.
'చూడండి. ఎవరూ రావద్దు. మేం ఓ మూడు నాలుగు గంటల్లో వచ్చేస్తాం. మీ నాన్న కూడా హుషారుగా లేచి నాతో వస్తాడు. నాదీ గ్యారంటీ. ఎవన్నా అవసరమయితే నేనే మీకు ఫోన్ చేస్తా. పోనీ డ్రైవర్' అంటూ అంబులెన్స్ డోర్ మూసేసాడు విశ్వనాథం.
అంబులెన్స్ దూసుకు పోయింది.
రాత్రి పదవుతోంది. అందరిలోనూ టెన్షన్.
బయట అంబులెన్స్ ఆగిన శబ్దం. అందరూ గబ గబా బయటికి వెళ్లారు.
రాఘవరావు విశ్వనాథం భుజం మీద చెయ్యి వేసుకుని సంతోషంగా దిగాడు.
అందరూ ఆశ్చర్య పోయారు.
'కంగ్రాట్స్' మీ డాడీ ఆరోగ్యం పూర్తిగా నయమయింది.' అన్నాడు డాక్టర్ నూకరాజు.
'థాంక్ యు డాక్టర్' అన్నాడు సుధాకర్.
'థాంక్స్ నాకు కాదు. విశ్వనాథం గారికి చెప్పాలి. ఇదంతా ఆయన ట్రీట్మెంటు.' అన్నాడు నూకరాజు.
'ముందు రాఘవ ని లోపలికి తీసుకెళ్ళి పడుకోబెట్టండి. బాగా అలిసిపోయాడు.' అన్నాడు విశ్వనాథం.
అంబులెన్స్, డాక్టర్ నూకరాజు, కామేష్ లు వెళ్లి పోయారు.
సుధాకర్, వంశీ లు రాఘవరావుని ఇంట్లోకి తీసుకెళ్ళి మంచం మీద పడుకోబెట్టారు...
'థాంక్స్ రా విశ్వం. ఈ జన్మలో తీరదనుకున్న నాకోరిక నీ వల్ల తీరింది. ఇంక ఇప్పుడు నేను హాయిగా పోవచ్చు.' అన్నాడు రాఘవరావు.
'నోర్ముయ్యిరా... అలాంటి మాటలు మాట్లాడకు. నా ట్రీట్ మెంటు తో నీ ఆయుష్షు ఇంకో యాభై సంవత్సరాలు పెరిగింది.' అన్నాడు. విశ్వనాథం.
ఇంకా ఏదో అనబోతున్న రాఘవరావుతో 'ఇంక ఎక్కువగా మాట్లాడకుండా రెస్టు తీసుకో... రేపు వస్తాగా... అప్పుడు మాట్లాడుకుందాం.' అన్నాడు విశ్వనాథం.
'ముందు మీరు పడుకోండి.' అంది శాంత
రాఘవరావు అలిసిపోయి వుండటంతో మాట్లాడకుండా పడుకున్నాడు.
అందరూ బయటకి వచ్చారు.
'ఏం ట్రీట్మెంటు ఇచ్చారు అంకుల్' అంటూ అడిగాడు వంశీ.
'రేపు వస్తాగా. అప్పుడు చెబుతా.' అన్నాడు విశ్వనాథం.
'చెప్తే గాని ఇంటికి వెళ్ళనీయం.' అంటూ పట్టుపట్టడం తో చెప్పడం మొదలుపెట్టాడు విశ్వనాథం.
'మీ నాన్నకి జాలీగా తిరగటం, సరదాగా అందరితో కలిసి వుండటం అంటే ఇష్టం. కానీ మీ తాతగారు క్రమశిక్షణ అంటూ బయటికి వెళ్ళ నిచ్చేవారు కాదు. ఆరోజు వూర్లో జాతర వుంటే మీ నాన్న ఇంట్లో చెప్పకుండా నాతో జాతరకి వచ్చాడు. అక్కడ కొందరు డప్పులు కొడుతుంటే అందరితో పాటూ మేం కూడా డాన్సులు చేస్తూ ఎగరటం మొదలు పెట్టాం. అది మీ తాత గారి కంటబడింది. అంతే ఆయన ఇద్దర్నీ అక్కడే వుతికేసారు. ఆ తర్వాత మా నాన్న కూడా ఎగస్ట్రాగా నన్ను ఇంకో రెండు పేకాడు. మీ నాన్నకి అలా డప్పు కొడుతుంటే డాన్సు చెయ్యాలంటే ఇష్టం. మీ తాత గారి భయం వల్ల చెయ్యలేకపోయాడు. ఆ కోరిక అలా వుండిపోయింది. తర్వాత స్కూళ్ళు, కాలేజీలు, పెళ్లి, పిల్లలు, మనవలు. కాలం మారింది కానీ ఆ కోరిక మాత్రం తీరకుండా వుండి పోయింది. తీర్చుకోవాలంటే సిగ్గు, స్టేటస్ అడ్డొచ్చి తీర్చుకోలేని పరిస్థితులు.' ఆగాడు విశ్వనాథం 'మరి ఇప్పుడెలా తీరింది' అడిగాడు వంశీ.
'ఇందాకా మీ నాన్న చొక్కా జేబులో ఈ జాతకం కాగితం దొరికింది. ఇందులో మీ నాన్న జాతకం 11-12-2013 వరకే రాసాడు. ఈ సంఘటన ఎనిమిదో తారీఖున జరిగింది. ఇంకా రెండు మూడు రోజుల్లో పోతాననుకుని, తన కోరిక ఇంక తీరదని ఆలోచించుకుంటూ అలాగే ట్రాన్స్ లోకి వెళ్లి పోయాడు. మొన్ననే మేం మా చిన్నతనం రోజులు గుర్తు చేసుకుంటూ నా ఈ కోరిక చచ్చే లోపలయినా తీరుతుందా అని అన్నాడు. అప్పుడు గుర్తుకువచ్చింది.' అన్నాడు విశ్వనాథం.
'జాతకం ప్రకారం అన్నీ జరిగాయా.' అడిగింది సుజాత.
'ఆ... ఇరవయ్ నాలుగో ఏట పెళ్లి, ఇరవయ్ ఆరో ఏట పిల్లలూ తప్ప ఏం జరగలేదు.' అన్నాడు విశ్వనాథం.
'అంకుల్... ఇంతకీ మీరిచ్చిన ట్రీట్మెంటు ఏంటో చెప్పలేదు.
'ఏంటంటే' అంటూ చెప్పడం మొదలు పెట్టాడు.
అంబులెన్సు వూరావతల వున్న ఓ గుడిసె ముందు ఆగింది. విశ్వనాథం గబా గబా కిందికి దిగి గుడిసె పక్కనే వున్న చెట్టు కింద మంచం వేసాడు.
రాఘవ రావుని తీసుకొచ్చి మంచం మీద పడుకో పెట్టి అందరూ పక్కకి వెళ్లి పోయారు.
'మీరేం చేస్తున్నారో నాకు అర్ధం కావటం లేదు' అన్నాడు నూకరాజు
'చూస్తూ వుండండి' అంటూ విజిల్ వేసాడు విశ్వనాథం.
చేతిలో డప్పుతో మందు మీదున్నాడప్పు సాయిగాడు వచ్చాడు.
వీరలెవల్లో డప్పు వాయించడం మొదలు పెట్టాడు. డప్పు శబ్దం హోరెత్తి పోతూంది. రాఘవరావులో కదలిక వచ్చింది. మెల్లిగా కళ్ళు తెరిచి చూసాడు.
ఎదురుగ డప్పు సాయిగాడు వాయిస్తున్నాడు.
రాఘవరావు చుట్టూ చూసాడు. ఎవ్వరూ కనపడలేదు. సాయిగాడు తప్ప.
వెయ్యి ఏనుగుల బలం వచ్చినట్టు రాఘవరావు లేచి డప్పు శబ్దానికి అనుగుణంగా స్టెప్పులు వేస్తున్నాడు. ఇద్దరూ రెచ్చిపోయారు.
ఇంతలో విశ్వనాథం కూడా స్టెప్పులు వేస్తూ వచ్చాడు.
డాక్టర్ నూకరాజుకి కూడా స్టెప్పులు వెయ్యాలని పించింది. కానీ స్టేటస్ అడ్డు వచ్చి ఆగాడు.
'ఫర్వాలేదు అందరూ మనోళ్ళే. కానివ్వండి.' అన్నాడు విశ్వనాథం. అందరూ స్టెప్స్ వేసా రు.
'అదే డప్పులో వున్న మహిమ' అన్నాడు విశ్వనాథం.
అందరూ ఎగరలేక మంచం మీద కూల బడ్డారు. సాయిగాడు వాయిస్తూనే వున్నాడు. విశ్వనాథం సాయిగాడిని పిలిచి ఐదు వందల నోటు చేతిలో పెట్టాడు. సాయిగాడు ఆనందంగా వెళ్లి పోయాడు.
'చాలురా... ఈ జన్మకిది చాలు. నా కోరిక తీరిపోయింది. ఇప్పుడు ఇంక పోయినా ఫర్వాలేదు.' అన్నాడు రాఘవరావు.
'అదీ నా ట్రీట్మెంట్.' అన్నాడు విశ్వనాథం చెప్పటం ముగిస్తూ.
'అవునంకుల్... ఇదీ విషయమని మీకు ఎలా తెలిసింది.' అడిగింది సుజాత
'మనింటి పక్కన ఫంక్షన్ డప్పు వాయించారు గుర్తుందా.' అడిగాడు విశ్వనాథం
'అ నేను కిటికీ తలుపు కూడా వేసాను' అన్నాడు సుధాకర్.
'ఆ డప్పు శబ్దానికి మీ నాన్న కాలి వేళ్ళు కదిపాడు. అది మీరెవ్వరూ చూడలేదు. నేను చూసాను. అంతే అదే కోరికని తెలిసిపోయింది.' అన్నాడు విశ్వనాథం. అందరూ విశ్వనాథానికి థాంక్స్ చెప్పారు.
ఆ రోజు రాఘవరావు పుట్టిన రోజు . రాఘవరావు కేక్ కట్ చేసాడు.
'ఏరా ప్రతీ పుట్టిన రోజుకి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చే వాడివి. ఈసారి ఏంటి నీ స్పెషల్ గిఫ్ట్.' అడిగాడు రాఘవరావు విశ్వనాధాన్ని.
'తీసుకో' అంటూ ఒక సి.డి. ఇచ్చాడు.
'ఏంటి జోల పాటలా' అన్నాడు రాఘవ రావు.
'పెట్టి చూడు తెలుస్తుంది.' అన్నాడు విశ్వనాథం.
వంశీ డెక్ లో పెట్టి ఆన్ చేసాడు.
అంతే డప్పు సాయిగాడి డప్పు శబ్దంతో హాలు హోరెత్తిపోయింది. విశ్వనాథం విజిల్ వేసాడు.
రాఘవరావు ఆనందంతో డాన్సు మొదలు పెట్టాడు.
అందరూ రాఘవరావుతో పాటూ అందరూ స్టెప్స్ వేసారు.
రాఘవరావు కోరిక మరోసారి తీరింది.