రోజూ లాగే సాయంత్రం అయిదింటికి రామ్మూర్తి గారు జగన్నాధం గారి ఇంటి కాలింగ్ బెల్ నొక్కారు. జగన్నాధం గారి భార్య రుక్మిణి గారు తలుపు తీసి కూర్చోండి వస్తున్నారు అని లోపలికి వెళ్ళిపోయింది. జగన్నాధం గారు డ్రాయింగ్ రూము లోకి రాగానే ఇద్దరికీ ఆవిడ రోజూ లాగే కాఫీ తెచ్చి ఇచ్చారు. రామ్మూర్తి గారు రుక్మిణి గారు ఇచ్చే ఫిల్టర్ కాఫీ చాలా లైక్ చేస్తారు . కాఫీ తాగి ఇద్దరూ ఈవెనింగ్ వాక్ కి బయలు దేరారు
జగన్నాధం గారు రామ్మూర్తి గారి కంటే వయసులోనూ వృత్తి పరంగానూ కూడా సీనియర్. ఆయన ఈమధ్యనే హై కోర్టు జడ్జీ గా రిటైర్ అయ్యారు. రామ్మూర్తి గారు కాలేజీ లో లెక్చరర్ గా రిటైర్ అయ్యారు. ఇద్దరి ఇళ్ళూ దగ్గర గా ఉండడం, ఇద్దరి పిల్లలూ స్నేహితులు కావడంతో వారి మధ్య స్నేహం బాగా వృద్ధి అయింది.
చాలా కాలం నుంచి ఇద్దరూ కలిసి ఈవెనింగ్ వాక్ చేయడం జరుగుతోంది. రోజూ ఎదో విషయం మీద వాళ్ల ఇద్దరి మధ్యా చర్చ జరుగుతూ ఉండేది. జగన్నాధం గారికి బాగా పుస్తకాలు చదవడం అలవాటు. జడ్జీ గా ఆయన అనుభవాలు, ఆయన చదివిన వివిధ పుస్తకాలు దృష్ట్యా ఎక్కువగా ఆయన మాట్లాడడం రామ్మూర్తి గారు వినడం కద్దు.
ఆవేళ వాకింగ్ ప్రారంభించిన తరువాత, ప్రొద్దున్న చదివిన పేపరు విషయాలు గుర్తుకు వచ్చి రామ్మూర్తి గారు అన్నారు " ఈ మధ్యన వరకట్న వేధింపులు చాలా ఎక్కువ అయిపోయాయి. పెద్ద పెద్ద కట్నాలు ఇచ్చి పెళ్లి చేసినా పెళ్లి అయినతరువాత ఇంకా తెమ్మని వేధించడాలు ఎక్కువ అవుతున్నాయి" అన్నారు
" మీరు పేపర్లలో చదివే వాటికి వాస్తవంగా జరిగే వాటికి చాలా తేడా ఉంటుందండి" అన్నారు జగన్నాధం గారు
" అంటే పేపర్లలో వచ్చేవి వాస్తవం కాదంటారా?"
" మీకు వార్తలలో వచ్చేవన్నీ పోలీసు స్టేషన్లో నమోదు అయె ఎఫ్ఐఆర్ లు, లాయర్లు కోర్టులలో దాఖలు చేసే ప్లైయింట్ల ఆధారం గా ఉంటాయి. కానీ చాలా మాట్లు వాస్తవాలు వాటికి చాలా విరుద్ధం గా ఉంటాయి"
"కానీ మీరు కేసుల మీద న్యాయ నిర్ణయాలు వాటిని ఆధారం చేసుకునే చేస్తారు కదా?"
" వాటితో ప్రారంభం అవుతుంది. కేసు ముందుకు వెళ్లిన కొద్దీ న్యాయ నిర్ణేతలకి వాస్తవంగా కేసులో జరిగిన విషయాలు అవగాహన లోకి వస్తాయి. వాటిని దృష్టి లో ఉంచుకుని లభ్యమయినసాక్ష్యాల అధారంగా తీర్పులు ఇవ్వడం జరుగుతుంది. అనుభవజ్ఞులయిన జడ్జీల చేతుల్లో ఎక్కువకేసుల్లో న్యాయం జరుగుతూనే ఉంటుంది. కానీ ఆ తీర్పులు ఇవ్వదానికి ప్రస్తుత కాలంలో చాలా సంవత్సరాలు పడుతోంది కాబట్టి ప్రజలు పేపర్లలో వచ్చిన వార్తల నే నమ్మి అభిప్రాయాలు ఏర్పరుచు కుంటారు." అన్నారు జగన్నాధం గారు కొంత వివరణ ఇస్తూ.
"కావాలనే లాయర్లు ప్లైయింట్లలో, వాస్తవాలు కానీ విషయాలు చేరుస్తూ ఉంటారా?" అన్నారు రామూర్తి గారు అలాంటి సందర్భాలు ఊహించ లేక
" కొన్ని సందర్భాలలో న్యాయాన్ని డైరెక్ట్ గా పొందడం కష్టం అవచ్చు. అటువంటి సందర్భాలలో చటం లో ఉన్న వెసులుబాటు ఆధారం గా న్యాయాన్ని పొందాలని కొంత మంది ప్రయత్నించవచ్చు. అది పూర్తి గా ధర్మ మని చెప్పలేము''
" ఉదాహరణ ఇస్తే కానీ అర్థం కాదేమో" అన్నారు రామ్మూర్తి గారు నవ్వుతూ
"ఈ మధ్యనే జరిగిన ఓక కేసు లో విషయాలు చెబుతాను. శేషగిరిరావు కి తల్లి తండ్రులు ఓ సంబంధం చూసి పెళ్లి చేశారు. అమ్మాయి జానకి తండ్రి చాలా డబ్బు ఖర్చు పెట్టి పెళ్లి చేశాడు. శేషగిరిరావు కి పెళ్ళికి ముందే ఒక అమ్మాయి తో సంబంధం ఉంది. పెళ్లి అయినా తరువాత దానిని దూరం చేయవచ్చని, శేషగిరి రావు తల్లి తండ్రులూ, శేషగిరి రావు కూడా అనుకున్నారు. అది అంట సులువుగా జరగలేదు. జానకి కి ఈ విషయం తెలిసి, ఆ అక్రమ సంబంధం వదులుకోమని లేకపోతే విడాకులు ఇచ్చేయమనీ ఒత్తిడి చేసింది. విడాకులకు శేషగిరిరావు సిద్ధ మాయాడ్యు కానీ, జానకి తండ్రి మొత్తం పెళ్లి ఖర్చులు, జానకి జీవితానికి ఆర్ధిక భద్రతా అన్నీ దృష్టి లో పెట్టుకుని చాల పెద్ద మొత్తం అడిగాడు. అందుకు శేషగిరి రావు సిద్ధం గా లేడు.
ఆ స్టేజి లో జానకి తండ్రి ఒక లాయరు దగ్గరికి వెళ్లి పరిస్థితి వివరించాడు. లాయరు ఆయనకి చెప్పినదేమిటంటే, కేసు విషయాలు వాస్తవంగా జరిగినవే చెప్పి నెగ్గుకు రావడం కష్టమని, చట్టాలలో ఉన్న కొన్ని విషయాలని ఆధారం చేసుకుని మనకి రావాల్సిన డాబు త్వరగా రాబట్టు కోవచ్చు అన్నాడు. అయితే శేషగిరిరావు మీద ఏ మాత్రం సానుభూతి ఉన్నా ఆ మార్గం కష్ట మన్నాడు. ఎందుకంటే చట్టం లో ఉన్న కొన్ని నిబంధనలు వాడుకుంటే చట్టం ద్వారా శేషగిరి రావు కి చాలా కష్టం కలగా వచ్చు. అప్పుడు అయ్యో అని వెనక్కి వెళ్లడం కుదరక పోవచ్చు. అందుచేత మళ్ళీ బాగా ఆలోచించు కుని చెప్పమన్నాడు. మధ్యవర్తి ద్వారా శేషగిరి రావు నీ, అతని తల్లి తండ్రులని సంప్రదించినా ఉపయోగం లేక పోయింది. అప్పుడు గత్యంతరం లేక తమ లాయర్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారు.
జానకి లాయర్, చట్టం లోని వరకట్నం వేధింపు నింబంధనలు ఆధారం గా శేషగిరి రావు నీ, అతని తల్లితండ్రులనీ కూడా కలుపుతూ ఎఫ్ ఐ ఆర్, ప్లేయింట్ తయారు చేస్తే, అందరినీ తీసుకె ళ్లి జైల్లో పడేశారు.
ఆ తరువాత కాళ్ళ బేరానికి వచ్చి. వీళ్ళు అడిగిన డబ్బు అంతా ఇచ్చి బయట పడ్డారు.వరకట్నం కేసులు మనము పేపర్లలో చదివే కేసులలో ఎక్కువ శాతం ఇలాంటివే." అని వివరించారు జగన్నాధం గారు " అర్థమయ్యిందా?" అన్నట్టు చూస్తూ.
" మరి వేధింపులూ అవీ జరిగినట్టు సాక్ష్యాలు ఇవ్వాలి కదా ?"
" అందుకే ఆ చట్టా లని ఆశ్రయిస్తారు. ముందు సాక్ష్యాలు అవీ అడగకుండా, బైలు కూడా ఇవ్వకుండా జైల్లో పడేస్తారు. ఆ స్థితి లో కోర్టు బయట సెటిల్ చేసుకుంటారు. అందుకే కొంత దుర్వినియోగం అవుతోందని గ్రహించి చట్టాన్ని మార్చడానికి కేంద్రం ప్రయత్నిస్తోంది "
వాళ్లిద్దరూ మాట్లాడుకుంటూ వాళ్ళు రోజూ వెళ్లే పార్క్ రోడ్డుకు వచ్చారు. ఈ వేళ ఆ రోడ్డులో తారు వేస్తున్నట్టున్నారు, చాల దుమ్ముగా ఉండి రోడ్డుకు అడ్డం కూడా పెట్టారు. ఆ రోడ్డు వదిలి వాళ్ళు దానికి ఎదురు గా ఉన్న చాకలి పాలెం రోడ్డు లో నడవడం మొదలెట్టారు.
"అయితే లాయర్లు కేసులు నెగ్గడానికి, లేని విషయాలు కూడా తెలివి గా సృష్టిస్తారన్నమాట " అన్నారు రామ్మూర్తి గారు సంభాషణ కొన సాగిస్తూ
"కానీ కొన్ని మాట్లు అవి పనిచేసినా కొన్ని మాట్లు అవి బెడిసి కొడతాయి. కేసును లాయర్లు తిప్పిన మలుపులు జడ్జీలు సులువు గానే పట్టేస్తారు. కానీ పత్రికల వాళ్లకి, ప్రజలకి అవి తెలియవు. ఈ మధ్యన ఖోస్లా గారని ఓ రిటైర్డ్ జడ్జీ గారి పుస్తకం చదవడం జరిగింది. ప్రజలు పేపర్లలో చదివి ఉద్రేకాలు తెచ్చుకున్న ఓ కేసులో ఆయన లాయర్లు చేసిన భాగోతం వివరించారు
" ఏమిటాకేసు ? అన్నారు రామూర్తిగారు కుతూహలంగా
" మీరు కూడా పేపర్లలో చదివే వుంటారు చాలా కాలం క్రితం . ఒక నేవల్ ఆఫిసర్ ఒక స్నేహితుడిని హత్య చేస్తాడు. పేపర్లలో వచ్చిన కథనం ఏమిటంటే, ఆ నేవల్ ఆఫీసర్ షిప్ మీద దూర దేశాలు వెడుతూ భార్యని మిత్రుడి ఇంట్లో వదలి వెడతాడు. అతను తిరిగి వచ్చిన తరువాత భార్యకీ స్నేహితుడికి సంబంధం ఉందని తెలిసి, వస్తూనే, నేవల్ యార్డ్ కి వెళ్లి పిస్తోలు కలెక్ట్ చేసుకుని స్నేహితుడి ఇంటికి వెడతాడు. సంబంధం గురించి ఇద్దరి మధ్యా వాదోపవాదాలు జరుగుతాయి. అందులో భాగంగా , ఆ నేవల్ ఆఫిసర్ సరే అయిందేదో అయి పోయింది తన భార్యని వివాహం చేసుకో మని అడుగుతాడు. అందుకు ఆ మిత్రుడు " పరిచయం ఉన్న ప్రతి ఆడదాన్నీ పెళ్లి చేసుకుంటామా ? ( అసలు వాడిన పదం కొంచెం అసభ్యం గా ఉంటుంది) అని అంటే ఆ మాటకి ఉద్రేకపడి ఈ ఆఫీసర్ అతన్ని కాల్చేశాడు . ఇదీ కథ పత్రికలలో వచ్చింది. ప్రజలు అందరూ ఆ ఆఫీసర్ మీద సానుభూతి కనబరిచారు. అతన్ని రెచ్చకొడితే ఉద్రేకంలో చేసాడు కాబట్టి అతని తప్పు లేదని అభిప్రాయం పడ్డారు"
" ఇంతకీ అతనికి శిక్ష పడలేదా?
"పడింది. అసలు జరిగిందేమిటంటే. ఆ ఆఫీసర్ కి ఆ మిత్రుడికీ ఏవో వ్యాపార లావాదేవీలున్నాయి. అందులో ఈ మిత్రుడు మోసం చేసి నట్టు ఆఫిసర్ కి తెలిసింది. ట్రిప్ ముంచి రాగానే నేవల్ యార్డ్ కి వెళ్లి పిస్తోలు కలెక్ట్ చేసుకుని మిత్రుడి దగ్గరికి వెళ్లి వాదనల మధ్యలో మిత్రుడ్ని కాల్చి చంపాడు. అతను పారసీ వాడు కాబట్టి పారసీ లాయర్లందరూ కలిసి అతన్ని బయట పడేయడానికి ప్లేయింట్ రాసినప్పుడు ఓ కథ అల్లారు. అదే పత్రికలలో వచ్చింది. కానీ పిస్తోలు కలెక్ట్ చేసుకోవడం అన్న అంశం వల్ల, మిగతా కేసు బలహీనత వల్లా శిక్ష పడింది. ఒక కేసు లో శిక్ష నిర్ణయించేట ప్పుడు జడ్జీలు చాలా విషయాలు దృష్టిలో ఉంచుకుంటారు" అన్నారు జగన్నాధం గారు ఎదో ఆలోచిస్తూ.
వాళ్ళు మాట్లాడుకుంటూ చాకలి పేట రోడ్డు చివరికి వచ్చారు. అక్కడ అన్నీ చాల చిన్న చిన్న ఇళ్ళు, ప్రభుత్వం వారు ఎప్పుడో ఇచ్చిన స్థలాలలో చాకలి వృత్తి వాళ్ళు మొదట, ఆతరువాత వాళ్ళదగ్గరనుంచి కొనుక్కుని కొంతం మంది దిగువ మధ్యతరగతి వాళ్ళు కట్టుకున్నవి ఉన్నాయి. వాటి అన్నిటి మధ్యన ఒక చాలా పెద్దదయిన నాలుగంతస్తుల ఖరీదయిన భవనం అన్ని రకాల హంగులు అమర్చి ఉన్నది వాళ్ళ దృష్టిని పడింది. మొదటి అంతస్తులో ఫ్లవర్ గార్డెన్, రెండవ అంతస్తు లో వరండాలో బయటికి కనబడుతున్న ఖరీదయిన ఉయ్యాల బల్ల మొదలయిన వాటితో, ఎవరిదో చాలా డబ్బు ఉన్న వాళ్ళ భవనం లాగ ఉంది.
వాక్ నుంచి వెనక్కి తిరుగుతూ జగన్నాధం గారు " ఆ భవనం చూశారా? అంత ఖరీదయిన భవనం ఆ చిన్న ఇళ్ల ల్లొ వారిమీద ఎటువంటి ప్రభావం చూపు పుతుందంటారు?" అన్నారు.
" కొంత మంది తమ తమ రొటీన్ జీవితం లో పట్టించుకోక పోవచ్చునేమో కానీ చాలా మంది మీద ఒక నెగటివ్ ప్రభావం తప్పకుండా పడుతుంది. ఎదురుగా కనపడే విలాస వంతమయిన జీవితం చూస్తూ అలాంటివి తాము పొందడానికి వీలున్నంతలో ప్రయత్నాలు చేసినా, అవి పొందే అవకాశం ఏమాత్రం లేని సందర్భాలలో వాళ్లకు తెలియ కుండానే ఒక రకమయిన నిస్పృహ వాళ్లలో ప్రవేశించ వచ్చు. ప్రత్యక్షంగా కాక పోయినా పరోక్షంగా కొంత ప్రభావం ఉండా వచ్చు" అని తన అభిప్రాయం చెబుతూ ఇంతకీ "ఆ ఇల్లు ఎవరిదీ ?" అన్నారు రామ్మూ ర్తి గారు
"మీరు ఈ మధ్య పేపర్లలో చూసే ఉంటారు. రాజరత్నం గారని ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ "
"ఓ! ఆయనదా !.గతం లో ఓ వారం రోజులు టీవీ లోనూ, పత్రికల లోనూ ఆయన అక్రమ సంపాదన మీద హోరెత్తిపోయింది కదా. ఈ మధ్యనే కదా జడ్జిమెంట్ వచ్చింది. జడ్జిమెంట్ మీద చాలా చర్చ జరిగింది. అటువంటి కేసులలో మామూలుగా రెండు సంవత్సరాలు కంటే వేయరు. కానీ చట్టం లో ఉన్న మొత్తం పది సంవత్సరాల శిక్ష నీ ఎందుకు విధించారో చాలా మందికి అర్థం కాలేదు. మీరు ఇందాకా చెప్పిన కేసులలో లాగ ప్లేయింట్ లో కథలు చేర్చడం కుదరలేదు కాబోలు తప్పించుకోవడానికి. అయినా మీరు కూడా చాలా జడ్జిమెంట్లు ఇచ్చారు కదా? అలా ఎందుకు వేశారో మీకు బాగా తెలిసుండాలె?
ఆ తీర్పు ఇచ్చిన బెంచ్ లో తానూ ఉన్నట్టూ, తన నిర్ణయాన్ని మిగతా సభ్యులు అందరూ ఆ మోదించారన్న విషయాన్ని జగన్నాధం గారు రామ్మూర్తి గారికి చెప్పలేదు.
" ఇప్పుడు రాజారత్నం గారి ఇల్లు, ఆ పరిసరాలూ చూసిన తరువాత తీర్పు అలా ఎందుకు ఇచ్చారో ఊహించండి " అన్నారు నవ్వుతూ.