మా అమ్మ చిన్న నాటి స్నేహితురాలు లీల ఆంటీ మరణ వార్త ఆలస్యంగా తెలియడముతో తెలిసిన వెంటనే వైజాగ్ నుండి బయలు దేరి హైదరాబాద్ లో ఉన్న లీల ఆంటీ ఇంటికి నేను, అమ్మ చేరుకున్నాను. ఆ రోజు ఆదివారం కావడంతో వాసు అంకుల్ వాళ్ళ పిల్లలు రోజీ, శ్రీను ముగ్గురు ఇంటి వద్దనే ఉన్నారు. మమ్మల్ని చూడ గానే ముగ్గురూ ధుఖం ఆపుకో లేక ఏడ్చేశారు. పిల్లలిద్దరూ అమ్మని గట్టిగా వాటేసుకుని విడువనే లేదు.
‘’ అసలు ఎలా ఇలా జరిగింది, లీల ఆరోగ్యం గానే ఉంది కదా, రెండు నెలల క్రితం నేను తనతో మాట్లాడాను, అప్పుడు నాతో తను ఏమీ చెప్పనే లేదు, నేను కంపెనీ ప్రొజెక్ట్ పని మీద ఏడాది క్రిందట అమెరికా వెళ్ళాను, నిన్ననే ఇండియా వచ్చాను, ప్రోజెక్టు చివరి దశలో ఉండడం వలన గత నెల రోజులు గా ఎవరి తోనూ మాట్లాడ లేనంత పనిలో మునిగి పోయాను, వచ్చిన వెంటనే విషయము తెలిసి ఆశ్చర్య పోయాను. వెంటనే బయలు దేరి వచ్చేశాను, అసలు ఏమైంది వాసు గారు ’’ అని అమ్మ ఒకటే ప్రశ్నల వర్షం కురిపించింది . ‘’మాకు విషయము తెలిసే సరికే డాక్టర్లు ఏమి చెయ్య లేమని చెప్పేసారు, తనకి కేన్సర్ చివరి దశ, తెలిసిన వారు చెప్పిన డాక్టర్లు అందరికీ చూపించాను, ట్రీట్ మెంట్ చేయించాను, కానీ అంతా నెల రోజుల లోనే ముగిసి పోయింది’’ అని వాసు గారు బోరున విలపించారు. వింటున్న మాకు బాగా ఏడుపు వచ్చింది. ఇంకా ఏడవ డానికి కన్నీళ్లే లేవన్నంతగా అందరమూ ఏడిచాము.
తరువాత లోపలికి వెళ్ళిన నాకు ఇల్లు చూస్తే ఒక్క సారిగా భయం వేసింది. ఆడది లేని ఇల్లు ఇలా ఉంటుందా అని అనిపించింది. గదులలో ఎక్కడ విడిచిన బట్టలు అక్కడే పడి ఉన్నాయి. ఏవి విడిచినవో, ఏవి ఉతికినవో అర్దం కావడం లేదు. పక్క బట్టలు అలానే ఉన్నాయి. వంట గదిని చూస్తే అది స్టోర్ రూమ్ లా ఉంది. పొయ్యి మీద బాగా జిడ్డు పేరుకు పోయి ఉంది, గట్టు మీద చీమలు తిరుగు తున్నాయి, క్రింద గచ్చు కాళ్ళకు అతుక్కు పోతుంది. ఇంకా డైనింగ్ టేబుల్ గురించి చెప్పనక్కర్లేదు, బయట నుండి తెచ్చుకున్న పోట్లాల కవర్లు, కాగితాలు అన్నీ అక్కడే పడి ఉన్నాయి. టేబుల్ తుడిచి ఎన్ని రోజులయ్యిందో అని అనుకున్నాను. రోజీ ని పిలిచి’’ ఏమిటమ్మా ఇల్లు ఇలా ఉంది పనమ్మాయి రావడము లేదా’’ అని అమ్మ అడిగింది ,‘’ఏమో ఆంటీ నాకు తెలియదు’’ అని సమాధానం ఇచ్చి వెళ్లి పోయింది. ఆ మాట విన్న వాసు గారు ‘’హైదరాబాదు లో పని వాళ్ళ గురించి మీకు తెలియనిది ఏముంది, దొరకడమే కష్టము, ఒక వేళ దొరికినా సమయానికి రారు, వాళ్ళు వచ్చిన సమయానికి మేము ఇంట్లో ఉండము, లీల ఉంటే తానే చూసుకునేది, ఎన్ని రోజులని నేను ఆఫీసుకి సెలవు పెట్టి ఇంట్లో ఉంటాను, ఈ రోజు ఆది వారము కదా ఎవరైనా దొరికితే పని చేయిద్దామని చూస్తున్నాను’’ అని బయటికి చూస్తున్న వాసు గారి తో ‘’మరి వంట ఎవరు చేస్తున్నారు’’ అని అడిగింది. ‘’ఏముంది మూడు పూటలా బయట నుండి తెచ్చుకుని తింటున్నాము’’ అని విరక్తిగా సమాధానము ఇచ్చిన వాసు గారితో ‘’అదేమిటి రోజీకి ఏమీ చేయడము రాదా?’’ అని అడిగింది.’’రోజీనా! అది ఇంకా చిన్న పిల్ల తన కేమి తెలుస్తుంది, మీకు టిఫిన్ తెస్తాను ఉండండి’’ అని చెప్పి బయటకి వెళ్ళి పోయారు అంకుల్.
ఇవి అన్నీ వింటున్న నాకు ఒక్క సారిగా తల తిరిగినట్లు అనిపించింది. మా అమ్మ ఎప్పుడూ నన్ను ఆ పని చెయ్యు, ఈ పని చెయ్యు అని చెబుతుంటే విసుక్కునే దాన్ని. ఎందుకమ్మా అలా ఏదో ఒక పని చెబుతూనే ఉంటావు పెళ్లయ్యాక నీలా ఎలాగూ చెయ్యక తప్పదు కదా! అప్పుడు చేస్తాలే ఇప్పుడు వదిలేయ్ నన్ను అని అనే దాన్ని .కాని మా అమ్మ అలా కాదు నీ పనులు నీవే చేసుకోవాలి, ఎవరి మీద ఆధార పడ కూడదు, అన్ని పనులూ నీకు వచ్చిఉండాలి, భాద్యతగా అన్నీ చేసుకోవాలి అని నాకు పనులు నేర్పించింది. అయిష్టంగానైనా కొన్ని పనులు నేర్చుకున్నాను. మా అమ్మ పని చెప్పిన ప్రతీ సారీ నేను విసుక్కోవడం అయిష్టంగా చేయడం మా అమ్మ నాకు నచ్చ చెప్పడము అన్నీ ఒక్క సారిగా నా కళ్ళ ముందు కదలాడాయి. రోజీ ఇంజనీరింగు మొదటి సంవత్సరము, శ్రీను పదవ తరగతి చదువుతున్నారన్న మాటే గాని వాళ్ళిద్దరికి ఏమీ తెలియదు, ఆశ్చర్యకరమైన విషయము ఏమిటంటే రోజీ కి తను వేసుకో వలసిన బట్టలు ఎక్కడ ఉన్నాయో, ఏవి వేసుకోవాలో కూడా తెలియదు. ఏది అడిగినా ఏమో ఆంటీ నాకు తెలియదు, అన్నీ మా అమ్మే చూసుకుంటుంది అని ఒకే ఒక్క సమాధానం చెబుతుంది. తెలిసిందల్లా కాలేజీ కి వెళ్ళడం, రావడం.. అంతే అది తప్ప ఇంకేమీ తెలియదు.
లీల ఆంటీ పిల్లలిద్దరికీ ఏ పనీ నేర్పకుండా, చెప్పకుండా అన్నీ తనే చేసిపెట్టేది అంట, వాళ్ళకు బ్రష్ ల దగ్గర నుండి పడుకునే పక్క దుప్పట్ల వరకూ అన్నీ తనే వాళ్ళకు ఏ ఇబ్బంది రాకుండా చూసుకునేదంట. తను ఉన్నన్నాళ్లు బాగుండేది, తను పోగానే ఒక్క సారిగా ఇల్లు ఎలా అయి పోయిందో, వాసు అంకుల్ కి అన్నీ కాళ్ళ దగ్గరికి తెచ్చి పెట్టేదంట. ఒక సారి అమ్మ ఇవన్నీ గమనించి లీల అంటీని అడిగిందంట ‘’ఎందుకే అన్ని సేవలు చేస్తావు, కాస్త వాళ్ళ పని వాళ్ళని చేసుకో నివ్వు’’ అని .‘’ పోనీ లేవే ఆయన పొద్దున్న నుండి ఆఫీసు లో కష్ట పడి వస్తారు ఆ మాత్రం చేస్తే అలిసి పోతానా ఏంటి, ఇంకా పిల్లలంటావా వాళ్ళు చదివి, చదివి అలిసి పోయి వస్తారు, ఇంకేం చేస్తారు? నేను ఎటూ ఇంట్లోనే ఉంటాను కదా’’ అని చిరు నవ్వు తో సమాధానం ఇచ్చిందంట. ఆ మాట నాకు చెబుతూ లీలా ఆంటీ గుర్తుకు వచ్చిందేమో అమ్మ కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.
వాసు అంకుల్ తో అమ్మ” రోజీ కి అన్నీ నేర్పించండి, తను ఇంకా చిన్న పిల్ల కాదు, ఇలా అయితే కష్టము” అని, చాలా విషయాలు చెప్పింది. అన్నింటికీ అంకుల్ సరే అని అన్నారు ఏమో ఏమి చేస్తారో మరి, పాపం రోజీ ని తలుచు కుంటే బాధ అనిపించింది నాకు, ఇన్నాళ్ళు ఏ కష్టము తెలియ కుండా పెరిగింది, ఇప్పుడు భాద్యతలన్నీ ఒక్క సారిగా మీద పడే సరికి ఎలా ఉక్కిరి బిక్కిరి అవుతుందో పాపం. అమ్మో! నేను మాత్రం మా అమ్మ చెప్పినట్లు అన్నీ నేర్చుకుంటాను. పని చేయ వలసిన అవసరం ఉన్నా లేక పోయినా ముందు నేర్చుకోవాలి. ఏ సమయానికి ఏ అవసరం వస్తుందో, ఏ భాద్యత నెత్తి మీద పడుతుందో, అమ్మ చెబుతుంటే తేలికగా తీసుకున్నాను, రోజీ పరిస్థితి చూశాక అర్ధమయ్యింది నాకు పెద్దలు, అమ్మ ఏది చెప్పినా మన మంచికే చెబుతారు అని.