'ఎవడు చస్తే నాకేంటి ' అంటుంటాం. కానీ చెంద్రి మాత్రం అలా అనుకోడు.. అనుకోడానికి వీల్లేదు కూడా. ఎవరైనా చస్తేనే వాడికి చేతినిండా పని. లింగాయతుల ఇళ్ళల్లో ఎవరు కాలం చేసినా శాస్త్రోక్తంగా మసానం దాకా తీసుకెళ్ళి మన్ను చేసేదాకా పనులన్నీ దగ్గరుండి చూసుకోవాల్సి వచ్చేది. కమాను మూలింటిలో ఉండే చెంద్రి వాళ్ళకు ఇది కులవృత్తి. నాన్న హంపయ్య, పెద్దన్న వీరభద్రి ఇప్పుడు తను. సాధారణంగా శవాన్ని పాడెపై పడుకోబెడతాడు.కానీ లింగాయతుల్లో అలా కాదు. నాల్గు చక్రాల బండిపై కంబానికి ఆంచి కూచోబెట్టేవారు. అది పక్కకు ఒరగకుండా గొంతుకు కంబానికి దారం కట్టేవారు. కేవలం ఆ తంతు నిర్వహించడమే కాదు, ఇంకో బాధ్యత కూడా ఉండేది. శవయాత్రలో డప్పు వాయించడం. తబలా మాదిరి ఉండే ఆ డప్పుకి రెండు పెద్ద కుండలుండేవి. వాటిని పక్కపక్కనే బిగించేవారు. పై మూత చర్మంతో బిగుతుగా ఉండేది. ఈ రెండు అర్ధ కుండల్ని కలిపే బలమైన తాడు గొలుసులా ఉండేది. దాన్ని మెడకేసుకుని రెండు పొడవాటి వెదురు కర్రలతో వాయించాలి. ఆ డప్పు ఎంత ప్రసిద్ది అంటే, విన్న ఎవరికైనా ఓహో ఏదో శాల్తీ లేచినట్టుంది అని తెలిసిపోయేది. ఇంటినుంచి మసానం దాకా శవయాత్ర సాగుతున్నంతసేపూ ఆగకుండా డప్పు కొడుతూనే ఉండాలి. ముఖం నుంచి చెమట కారిపోతున్నా..వేలి కొసల్లో ఉత్సాహం నింపుతూ బలంగా కొట్టాలి. లింగాయతుల ఇంట్లో ఎవరైఅనా కాలం చేశారంటే అక్కడ చెంద్రి వాళ్ళు వెళ్ళాల్సిందే.
చెంద్రి అప్ప హంపయ్య , వీరభద్రి శవయాత్రలో హుషారుగా డప్పు వాయించడం నాకు బాగా గుర్తు. చిన్నప్పుడు ఈ వ్యవహారాన్ని ఆసక్తిగా గమనించేవాళ్ళం. డప్పు వాయించడం అంత తేలికేం కాదు. ఆ చప్పుడు వెనుక బోల్డెంత శ్రమ ఉండేది. రోజూ చెంద్రి తప్పనిసరిగా ఇంట్లో అభ్యాసం చేసేవాడు. మేం ఆటల్లో మునిగి ఉంటే, చెంద్రి ఇంట్లో నేలపై రోకలి అడ్డంగా పెట్టుకుని దాని ముందు కూర్చుని వెదురు బద్దలతో వాయిస్తుండేవాడు. కులవిద్య మరి. శ్రద్ధగా నేర్చుకోకపోతే హంపయ్య చర్మం వలిచేసేవాడు.
తలకు నూనె పెట్టుకుని చక్కగా ఒత్తుగా దువ్విన క్రాఫ్ తో నవ్వుతూ కనిపించేవాడు చెంద్రి. చెంద్రి మాటల్లో ఆటల్లోనే కాదు, నడకలోనూ ఓ ప్రత్యేకత చూపేవాడు. వాడు నడుస్తూ నడుస్తూ మమ్మల్ని చూడగానే చెంగున పల్టీ కొట్టి మళ్ళీ ఏమీ తెలీని వాడిలా అలా ముందుకు వెళ్ళిపోయేవాడు. సైకిల్ కూడా చాలా తమాషాగా నడిపేవాడు. ఉన్నట్టుండి రెండు చేతులు వదిలేసి గట్టిగా చప్పట్లు కొట్టేవాడు. బహుశ, శరభణ్ణను చూసే ఇలా రెచ్చిపోయేవాడేమో.!
మిగిలిన ఆటల సంగతెలా ఉన్నా, గోలీకాయలాటలో వాడే చాంపియన్. ఒక్కసారి గురిపెట్టాడంటే అంతే, మైలు దూరమున్నా గోలీకి పెటీల్మని తగలాల్సిందే. చెంద్రి ఎవరి జట్టులో ఉంటే వారు నిశ్తింతగా ఉండేవాళ్ళు. కొన్నిసార్లు ఆటలో చెంద్రి అవసరం తప్పనిసరి అయ్యేది. అయితే అదంత సులభమైన వ్యవహారమా? వాడు ఎప్పుడు వీధిలో ఉంటాడో, ఎప్పుడు ఇంట్లో ఉంటాడో తెలిసేది కాదు. ఇంట్లో ఉంటే మాత్రం బైటికి లాగలేక చచ్చేవాళ్ళం. చెంద్రి ప్రాక్టీసు చేస్తున్నప్పుడల్లా ఎదురుగానో, పక్కకు గోడకు ఆనుకునో హంపయ్య ఉండేవాదు. పిల్లిలా కుక్కలా అరుస్తూ ఇంటి ముందు పరిగెత్తేవాళ్ళం. వాడు ఇవేవీ పట్టించుకోకుండా పుల్లల్ని రోకలిపై టకటకలాడిస్తుండేవాడు. అదే మా బాధ. పీకల్దాకా కోపం వచ్చేది. వీడికేం మాయ రోగం? బైటికి రావొచ్చుగా? బాగా ఆడతాడని భలే సొక్కు అనుకునేవాళ్ళం.
మాతోపాటు ఆడిపాడిన చెంద్రి మాకు తెలీకుండానే జట్టుకు దూరమయ్యాడు. మేం ఎనిమిదో తరగతికి వచ్చేసరికి స్కూలు బ్యాగు బదులు డప్పు మెడకేసుకున్నాడు. చిన్న ఇల్లు, ఇంటినిండా జనం, చాలీచాలని ఆదాయం ఉన్న నలుగురూ వళ్ళు వంచితే తప్ప సంసారం గడవదు. ఇవన్నీ చెంద్రి హుషారును, తెలివితేటల్ని మింగేశాయి. వాడి మెళ్ళో డప్పు చేరితే అబ్బా ఎలా వాయిస్తున్నాడో అని మురిసిపోయామే గానీ బాధ్యతలు భుజానికెక్కాయని మాకర్థం కాలేదు.
ఈ మధ్య చెంద్రిని కలిశా. కమాను చివర పెద్ద గోడ దానికి ఆనుకునే ఉంది చెంద్రి ఇల్లు. దాని పక్కన బెణకప్ప విగ్రహం. చిన్న మండపంలో ఉండే ఆ బెణకప్పకు వీరే పూజలు చేస్తారు. బెణకప్ప ముందు అఖండ దీపంలా స్వచ్చంగా వెలుగుతోంది. చెంద్రి చిరునవ్వులా..దానిముందు చిన్న అరుగు. అప్పుడప్పుడు మా ఆట తగాదాలు తీర్చుకోడానికి అదే రచ్చబండ. స్థలం మహత్యమో మరోటో గానీ కమాన్ల్ లో ఎప్పుడు వెళ్ళినా నా బాల్యం పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంటుంది నాతోపాటే. ఇంకా నిన్నమొన్న ఆ వీధిలో ఆడుకున్నట్టుంటుంది. ఈసారీ అంతే. ఇంటిముందు రాగానే పాత జ్ఞాపకాలు ముసురుకున్నాయి. చెంద్రి ఇంటికెళ్ళినప్పుడు చాలాసేపటికి ఇంట్లోంచి ఓ ఆకారం బైటికొచ్చింది. బక్కచిక్కిన దేహం, లావుపాటి ఫ్రేము చెస్మాతో వచ్చింది చెంద్రి అని పోల్చుకోడానికి టైం పట్టింది. ఎవరూ...కళ్ళపై చేతులు ఆనించి ఎగాదిగా చూశాడు. క్షణంలో గుర్తుపట్టి ఓ నువ్వా...రా అంటూ బెణకప్ప ముందరుగు పై కూర్చొన్నాడు. ఇద్దరం చాలాసేపు మాట్లాడుకున్నాం.
' హైద్రాబాదు సానా పెద్దూరు. పడేళ్ళనుంచీ ఉండావా..అబ్బో! మాకీడ పదిమంది ఉంటేనే ఉసురు కట్టినట్టుంటాది. మాకైతే ఈడే ఫస్టు..'
' అవునూ ఇంట్లో డప్పు లేదే? '
' డప్పా,..ఎప్పటి సుద్దో...! పోయి సానా కాలం అయ్యిండాది. జనాలు సానా నాజూకయ్యిండారప్పా. వారికిదంతా బేకులేదు. అంతా గప్ చుప్ గా ముగిసిపోవాలంతే.' అన్నాడు.
' మరి సంసారం ? '
కస్టమే....ఏం సెయ్యాల? ఇప్పుడందరూ పేషన్ గా మారిపోయుండారు కదా! మసానానికి పేషన్ గానే పోవాలా అటుండారాయే. ' కొలువు సరిగా లేదనే బాధకన్న వెటకారమే ఎక్కువగా ధ్వనించింది.
' సూడప్పా ఇది ఆచారం. వద్దేనీకి లేదు. అలాగని మితిమీరేకి లేదు అలా ఉండాది కత. అప్పట్లో ఎవరైనా పోయిండారని ఇంటికాడికొచ్చి సెప్పంగనే ఉరికేవాళ్ళం. మసానానికి తీసుకెళ్ళేందుకు ఏమేం కావాలో సరుకుల కాయితం ఇచ్చేవాళ్ళం. వెంటనే సైకిలేసుకుని సుడుగాడుకి పోయేవాళ్ళం. అక్కడ గుంత తీసేటోడితో మాట్లాడేవాళ్ళం. అంగట్లో సరుకులు తెచ్చుకోవాల...ఆ శవానికి స్నానం చేయించాల ..బండ్లో కూసోబెట్టాలా...దారం కట్టాలా...ఒకటా..రెండా...వళ్ళు హూనమయ్యేది....ఈ సావు పనులు మా సావుకొచ్చిందారా నాయినా అనుకునేవాళ్ళం...'
' ఈ వ్యవహారమే ఇంత. ఇంట్లో మనిసి పోయిండారనే ఇచారం ఉంటుంది. మేం పైసలడిగే సరికి ఈ పనికి ఇంత సావా అనుకుంటారేమో .' చిన్నగా నవ్వాడు.
' అయినా మేం ఎక్కువడిగిందేమీ ఉండదప్పా. ఇది ఒకిరే సేసుకునేదీ కాదు కదా.! ఇచ్చేవాళ్ళకేమో జేబులోంచి లాగేసున్నట్టనిపిస్తుండాది ఏం చేద్దాం. అప్పట్లో మా బండి బాగానే నడిసేది. ఈ పనులు చేసినందుకు ఒక్కోసారి పదివేలు కూడా తీసుకునిండాము. కానీ ఒకటి మాత్రం సత్తెప్రమాణంగా చెబుతుండా. లేనోళ్ళ వద్ద గుంజింది లేదు. నాకాడ ఇంతేనప్పా అంటే సాలు అర్థం సేసుకునేవాళ్ళం. షావుకార్లనూ అడగొద్దంటే ఏవూరు న్యాయం నువ్వేచెప్పు..' అన్నాడు.
' మరి ఇప్పుడెలా ఉంది?'
' ఆ..ఇప్పుడు సానా సులువు...మఠం కమిటీ తీర్మానం అయిండాది. డప్పు వాయించి తీరాలని రూలేం లేదు. వాళ్ళ ఇష్టం. ఎవరింట్లో పోయినా వాళ్ళే చూసుకోవాల. గుంతకు వాళ్ళే ఇచ్చుకోవాల..మఠం నుంచి మాకు ప్రతినెలా ఇంతా అని జీతం లెక్క ఇస్తుండారు. సానా సుకం. బండిలో తీసుకెళ్ళే కాటమూ తప్పింది, వేను వచ్చేస్తుంది. దాంట్లో పెడ్తే సాలు..సర్రుమంటూ సుడుగాడుకే! ఆ నెలలో
శవాలున్నా..లేకున్నా.. మా డబ్బు మాకిచ్చేస్తారు.'
' ఫలానా ఇంట్లో మడిసి పోయుండాడు అని ఊరి జనాలకు తెలియాలని డప్పు కొట్టేవాళ్ళం. ఇప్పుడు ఎవరికి చస్తే ఎవరికి పట్టిందీ....ఇంటోళ్ళకు తెలిస్తే సాలు..సెల్ ఫోన్లు వచ్చినాంక కూడా ఆడు పోయాడు...ఈడు పోయాడని డప్పు కొట్టి మరీ సెప్పాలంటే ఎట్టా కుదురుతుందీ? అర్థం సేసుకోవాల. అంతే కదా!" దీర్ఘంగా నిట్టూర్చాడు.
' ఈ పని నీతోనే....' నామాట సగంలో ఉండగానే బెణకప్పకి చేతులెత్తి దండం పెట్టేశాడు. ' వీరభ్ర సామి మా కస్టాలు ఇనుకునిండాడు. ఈ పని మాతోనే సరి. కొడుకు బాగా సదువుకొనిండాడు. బేంకులో పనిచేస్తున్నాడు. తమ్ముళ్ళిద్దరు ...నేను ఇది చేసుకుంటుండాము. " అన్నాడు.
ఇక వెళ్దామని లేచా. ' పోన్లే టెన్షన్ తప్పిందండాది. లేకుంటే రోజూ ఎవరు పోతారా అని చూడాల్సి వచ్చేది. కొన్నిసార్లయితే నెలవుతోంది ఇంకా ఎవరూ పోలేదేందిరా నాయనా అనుకోవాల్సి వచ్చేది....' నవ్వుతూ అన్నాడు. వరసగా వచ్చిపడిన కష్టాలు చెంద్రి చదువుని, బాల్యాన్ని లాగేసుకున్నాయే గానీ...ఈ నవ్వుని అందులోనూ వ్యంగ్యం దట్టించిన నవ్వును మాత్రం లాక్కోలేకపోయాయి.
-----------------------------
సుద్ది-సమాచారం, బేకులేదు-అక్కర్లేదు, సుడుగాడు,మసానం-శ్మశానం, సొక్కు-గర్వం, కాటం-కష్టం, దుడ్లు-డబ్బులు, కంబం-స్తంభం