అమ్మమ్మతాతయ్య - చెన్నూరి సుదర్శన్ ,

ammammatatayya

“నాన్నా..! హిమ, అమ్మమ్మతాతయ్యా..! అంటూ జ్వరంతో కలవరిస్తోంది. నాకు భయంగా ఉంది.. ఒక సారి రా..! నాన్నా..!!” అంటూ తన కూతురు రవళిక ఫోన్ చేసేసరికి అప్రయత్నంగా కాశీనాథం కళ్లు చెమ్మగిల్లాయి.

గత మాసం వియ్యంకులిద్దరూ హిమజను చూడ్డానికి వేసవి సెలవుల్లో వెళ్ళినప్పుడు జరిగిన సంఘటన కాశీనాథం కళ్ళల్లో కదలాడ సాగింది.

***

హిమజ కాశీనాథం మనవరాలు. ముద్దుగా ఇంట్లో ‘హిమ’ అని పిలుచుకుంటారు.. యు.కే.జీ. పూర్తయ్యింది.. ఫస్ట్ క్లాసులో చేరబోతోంది.
తాతయ్య అంటే ఏ తాతయ్య అని మళ్ళీ మళ్ళీ అడిగే అవసరం రాకుండా.. కాశీనాథంను అమ్మమ్మతాతయ్య.. అతడి వియ్యంకుడు నాగభూషణాన్ని నానమ్మతాతయ్య అని పిలుస్తూంది హిమజ.

ఆవాళ కాశీనాథం “బావగారూ మనం ఈ రోజు హిమజకు జూపార్క్ చూపిద్దాం..” అంటూ ప్రపోజల్ పెట్టాడు.

“ ఆ..! ఎందుకులే బావగారూ.. చిన్న పిల్ల అదేం తిరిగి చూస్తుంది?.. పైగా డబ్బు దండగ” అంటూ ఆదిలోనే హంసపాదు నాటాడు నాగభూషణం. కాశీనాథం చిరునవ్వు నవ్వాడు ‘ఫరవాలేదు మేము వెళ్తాం..’ అన్నట్లుగా.

హిమజ దూరంగా కూర్చొని కాశీనాథం గీచి చూపించిన బొమ్మను కాపీ చేస్తోంది.

కాశీనాథం హిమజ వద్దకు వెళ్లి హిమజ గీచిన బొమ్మను చూసి మెచ్చుకున్నాడు. షేక్ హ్యాండ్ ఇచ్చాడు. హిమజ సిగ్గు మొగ్గయ్యింది.
“జూకు వెళ్దాం పదరా..” అంటూ హిమజ చెయ్యి పట్టుకొని లేచాడు.

నాగభూషణం విసుక్కుంటూ వారిని అనుసరించాడు.

ముగ్గురు కలిసి బస్సులో బయలు దేరారు..

ప్రక్క సీట్లో కూర్చున్న అమ్మాయి ఉన్నఫళంగా ఏడుస్తోంది.

నాగభూషణం “వెధవ సంత..” అంటూ అమ్మాయి వంక గుడ్లురిమి చూసాగాడు.

కాశీనాథం అరా తీసాడు.

“నా పర్సు ఎవరో కొట్టేసారు తాతయ్యా.. బస్సు చార్జీలు లేవు..” అంటూ భయపడుతూ చెప్పింది.

“భయపడకమ్మా.. ఎక్కడికెళ్ళాలి?..” అని ఓదార్పుగా అడుగుతూ కొన్ని డబ్బులిచ్చాడు కాశీనాథం.

“అంతా నాటకం బావగారూ.. డబ్బు లాగే యత్నం.. మీరివ్వకండి..” అంటూ నాగభూషణం చేతితో సైగలు చేసాడు. ‘పోనీలే..’ అన్నట్లుగా వున్న కాశీనాథం మోము అతడికి పిచ్చిమాలోకంలా గోచరించంది. నుదురు సుతారముగా నొక్కుకుంటూ బస్సు కిటికీలో నుండి బయటికి చూడసాగాడు నాగభూషణం.

హిమజను మధ్య మధ్యలో ఎత్తుకుంటూ జూ అంతా కలియ తిరిగాడు కాశీనాథం. నెమళ్ళు, కోతులు, జింకపిల్లల ను చూస్తూ ఆమె పొందే ఆనందంతో కాశీనాథం అలసట మర్చిపోయాడు.

ఇక ఆ రోజు నుండి హిమజ కాశీనాధానికి మరింత మాలిమి అయ్యింది. నిద్దట్లో సైతం పైన చెయ్యి వేసి పడుకునేది. ఉన్న పది రోజులూ పది క్షణాలైన వదిలి పెట్టెది కాదు. బస్సులో సంఘటన పదే పదే గుర్తుకు వచ్చేది.. వేసవి డాన్స్ కోచింగ్ క్లాసులో దిగబెట్టాలన్నా అమ్మమ్మ తాతయ్య తోడు రావాలనేది.. నానమ్మతాతయ్య వద్దు అంటూ మారాం చేసేది.. నాగభూషణం గుర్రుగా చూసేవాడు.. కాశీనాథం సర్ది చెప్పే వాడు. రవళిక ఆశ్చర్య పోయేది.

***

ఇంటికి తిరిగి వచ్చిన రెండు రోజుల్లోనే రవళిక నుండి ఫోన్ రావడం కాశీనాథాన్ని కలవర పర్చింది. వెంటనే రెక్కలు కట్టుకొని హిమజ ముందు వాలాడు.

కాశీనాథాన్ని చూడగానే “అమ్మమ్మతాతయ్యా..” అంటూ వాటేసుకుంది హిమజ జ్వరం కాస్తా తుర్రున పారిపోయినట్లు..

“ నాపిచ్చితల్లి..” అంటూ హిమజ బుగ్గలపై ముద్దుల వర్షం కురిపించాడు కాశీనాథం.

హిమజ మళ్ళీ బస్సులో జరిగిన సంఘటన చెప్పసాగింది.. ఎదురుగా నాగాభూషణం లేడనే ధైర్యంతో..

“అ రోజు బస్సు నుండి మనం దిగుతుంటే అమ్మాయి పర్సు నానమ్మతాతయ్యకు దొరికింది.. నేను చూశా.. దొరికితే తిరిగి ఇచ్చేయాలి కదా అమ్మమ్మతాతయ్యా..? .. అందుకే నానమ్మతాతయ్య కచ్చి..

నువ్వు ఇక్కడే ఉండిపో.. నన్ను వదలి పెట్టి పోవద్దు” అంటూ కన్నీళ్ళు పెట్టుకోసాగింది. రవళిక కొయ్యబారి పోయింది.

“చిన్న పిల్లల ముందు తప్పు చేయొద్దమ్మా.. పసి మనసుపై పడిన ముద్ర తుడిచేయడం చాలా కష్టం. పిల్లల ముందు మన ప్రవర్తన ఆదర్శప్రాయంగా ఉండాలి” అంటూ రవళికకు జాగ్రత్తలు చెప్పసాగాడు.

తను మాత్రమే చూసాడనుకున్న పర్సు విషయం హిమజ సైతం పసిగట్టిందన్న వాస్తవం కాసీనాథాన్ని కలవర పర్చింది.

ఇంతలో నాగభూషణం దగ్గరి నుండి ఫోన్..

హిమజ ఎలా ఉందంటూ వాకబు చేస్తున్నాడు. హిమజ ముందు మాట్లాడడం బాగుండదని వేరే గదిలోకి వెళ్ళాడు కాశీనాథం.

“బావగారు నమస్కారం. ఆరోజు బస్సులో మీ కాలి క్రింద పడిన పర్సును మీరే తీసుకున్నారని హిమజ అపోహ పడింది. నిద్దట్లో.. బస్సులో పర్సు.. బస్సులో పర్సు.. అంటూ కలవరిస్తోంది. పర్సు మీరు తీయలేదని కాకతాళీయంగా అది మీ కాలు క్రింద పడిందని దాన్ని తీసి తిరిగి అ అమ్మాయికి ఇచ్చావని సర్ది చెప్పాను.. హిమజ కోలుకుంటోంది ..” అంటూ లాజిక్ గా చెబ్తుంటే..

చటుక్కున ఫోన్ కట్ చేసాడు నాగభూషణం.

నాగభూషణం ముఖ కవళికలను అంచనా వేస్తూ.. ఇప్పుడు హిమజకు నిజం చెప్పాలా? వద్దా? అనే సందిగ్ధంలో పడ్డాడు కాశీనాథం.

మరిన్ని కథలు

Kya huvaa
క్యా హువా
- కె. తేజస్వని
Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు