సుఖ ముద్రిక - ప్రతాపవెంకట సుబ్బారాయుడు

sukhamudrika

తెల తెల వారుతోంది.

"రాణీ!"

"ఊ"

"నేను డ్యూటీలి వెళ్ళాలి. నువ్వు లేచి తలుపేస్కో" కొత్త పెళ్లాన్ని నిద్ర లేపాడు పుష్పశర్.

రాణీ బద్ధకంగా లేచి తలుపు తీసింది. చల్లని గాలి ఆమె ఆపాద మస్తకాన్నీ స్పృశించింది. అత్తిపత్తిలా ముడుచుకుపోయింది. పుష్పశర్ ఆమె నుదుటన చుంబించి అల్లరిగా నవ్వి బయటకెళ్లిపోయాడు. ఆమె తలుపేసొచ్చి..మంచం మీద వాలినప్పుడు గుర్తొచ్చింది, ఆరోజు తమ మొదటి సంవత్సరపు పెళ్లి రోజని. నిన్నరాత్రే గుర్తు చేద్దామనుకుంది. ఎప్పుడో పొద్దు పోయి, అలసి పోయి వచ్చిన అతను స్నానం చేసి వచ్చే సరికి డైనింగ్ టేబుల్ మీద అన్నీ సిద్ధం చేసింది. అతను ఆవురావురుమని తినడంలో మునిగి పోయాడు. పడుకునేటప్పుడు చెప్పాలనుకుంది. కానీ తను వెళ్లే సరికే ఆద మరిచి నిద్ర పోయాడు. ఇప్పుడు వెళ్లేప్పుడు కూడా చెప్ప లేక పోయింది. ప్చ్! ఆమె గతం లోకి జారుకుంది.

*****

"అమ్మాయ్ నీకో పెళ్లి సంబంధం వచ్చిందిరా! అబ్బాయి ఫారెస్ట్ ఆఫీసరు. మంచి ఒడ్డూ పొడుగుంటాడట, చక్కటి సంపాదన, అడవన్న మాటే గానీ పోరూ పొక్కూ ఉండదు. తిన దగినవన్నీ అడవి లోనే తాజా, తాజాగా దొరికేస్తాయి. పొల్యూషన్ ఉండదు. కాక పోతే సిటీ లైఫ్ మిస్సవుతావు. ఈ మల్టి ప్లెక్సులు, షాపింగ్ మాల్స్ ఉండవు. కొంత బోరు కొట్టినా కొట్టొచ్చు. కానీ నాకెందుకో నువ్వు అతన్ని చేసుకుంటే హాయిగా ఉంటావనిపిస్తోంది. నేను వాళ్లని పెళ్లి చూపులకు పిలిచేశాను. మూడు గంటలకు వస్తారు. నువ్వు తయారై సిద్ధంగా ఉండు. అతన్ని చూశాక నీ నిర్ణయం చెప్పు. నా బలవంతమేం లేదు" నవ్వుతూ అన్నాడు తండ్రి శశాంక్.

"ఊర్కొండి, గతి లేక పెళ్లి చేసినట్టు అమ్మాయిని అడవులకు పంపుతారా? రేపు పెళ్లయ్యాక పాపం అడవిలో బిక్కు బిక్కు మంటూ ఉంటుంది. దానికేం ఖర్మ? మన చుట్టు పక్కల మంచి సంబంధం చూద్దురు గాని. వాళ్లను రావద్దని చెప్పండి."అంది మాతృ మమకారంతో సరోజ.
"పెళ్లి చూపులు కానివ్వవోయ్! అమ్మాయికి నచ్చక పోతే తెలుగు సినిమాల్లోని విలన్ లా మెడలొంచి అమ్మాయి పెళ్లి చేస్తానా ఏం?"నవ్వుతూ భార్య వంక చూశాడు.

అమ్మానాన్నలంటే తన కెంతో అభిమానం. ఎప్పుడూ మాట అనుకుని ఎరగరు. ఒకళ్ల కోసం ఒకరు పుట్టినట్టుగా ఉంటారు. ఒక్కగా నొక్క కూతుర్నైన తననూ ఏ లోటూ లేకుండా పెంచి పెద్ద చేశారు.

*****

మధ్యాహ్నం మూడు గంటలు.

ఇంటి ముందు కారాగింది.

అబ్బాయి వాళ్లమ్మా నాన్నలతో దిగాడు. మనం సినిమా యాక్టర్లు అందగాళ్లనుకుంటాం గాని, ఏ మేకప్ లు లేకుండా సహజంగా అందంగా ఉండే వాళ్లు బయట చాలా మందే ఉంటారు. పుష్పశర్ ను చూడం గానే రాణీకి అనిపించిన ఆలోచన అది.

చూపులు, లైట్ గా తినడం అయ్యాక "నేను ఒకసారి మీ అమ్మాయితో మాట్లాడాలనుకుంటున్నాను. మీరు అనుమతిస్తే.." అన్నాడు పుష్పశర్.

శశాంక్ అంగీకరించినట్టుగా తలూపి "రాణీ, అబ్బాయిని టెర్రెస్ మీదకు తీసుకెళ్ళు."అన్నాడు.

రాణీ వెనకే పుష్పశర్ అడుగులేస్తూ టెర్రెస్ మీదకు చేరుకున్నాక" ఏవండోయ్, పెళ్ళిలో నా వెనగ్గా ఏడడుగులు నడుస్తారు. పెళ్లికి ముందు మీ వెనక నడిపించడం మీ సంప్రదాయమా?" అమాయకత్వాన్ని నటిస్తూ చిలిపితనం మాటల్లో రంగరించాడు.

రాణీ సిగ్గు పడి పోయింది.

"చూడండీ, నేను ఫారెస్ట్ ఆఫీసరుగా చేస్తున్నానన్న విషయం మీకు తెలిసే ఉంటుంది. బహుశా అందుకేనేమో నాకు పెళ్లి సంబంధాలు గొప్పగా రాలేదు. మీ సంబంధం వచ్చింది. మీరూ నచ్చారు. మీరు బాగా ఆలోచించుకోండి. ఏ సాఫ్ట్ వేర్ అతన్నన్నా పెళ్లి చేసుకుంటే సిటీలో మంచి ఫ్లాట్ తీసుకుని వీకెండ్స్ లో అలా..అలా సరదాగా మిమ్మల్ని తిప్పుతూ స్వర్గాన్ని మీ పాద అంచులకు చేరుస్తాడు. నేను మిమ్మల్ని పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను గాని. అడవి లోనే మిమ్మల్ని ఉంచుతాను. మీరు నన్ను రాక్షసుడు అనుకో కూడదు. మిమ్మల్ని రక్షించడానికి ఏ రాకుమారుడూ రాడు. ఎందుకంటే నేను మీకు నచ్చితే మన పెళ్లై పోతుంది కాబట్టి."అన్నాడు చిన్నగా పాల నురగ లాంటి చిరు నవ్వు ఒలక బోస్తూ.

ఆ అందం, చిలిపి తనం..ఓహ్ నచ్చేశాడు. పుష్పశర్ రాణీకి నచ్చేశాడు.

అదే విషయం తండ్రికి చెప్పేసింది.

దగ్గర్లోని మంచి ముహూర్తంలో వాళ్లిద్దరూ ఒక్కటయ్యారు. అడవికి కాపరానికి పయనమయ్యారు.

*****

రక రకాల పక్షులు జంతువులు ఎంతో ఆహ్లాదంగా ఉంది. ఏది తీసుకున్నా, తిన్నా స్వచ్ఛతే! పండు వెన్నెలైనా, వర్షమైనా చాలా ప్రత్యేకంగా ఆహ్లాదంగా ఉండేది.

గూడెం లోని వాళ్లు చూపించే ఆత్మీయత, కల్మషం లేని వాళ్ల ప్రవర్తన ఎంతో బావుండేది. ఇహ పుష్పశర్ అయితే తనను కాలు కింద పెట్ట నీయడు. రతీ దేవిని మన్మధుడు ఎలా చూసుకున్నాడో ఏ పురాణాల్లో చదవ లేదు, విన లేదు కాని పుష్పశర్ మాత్రం గుండెల్లో తనకో గుడి కట్టేసుకున్నాడు. పుష్పశర్ కు ఉద్యోగమంటే ప్రాణం. డ్యూటీకెళ్లిన వాడు మళ్ళీ ఇంటికెప్పుడొస్తాడో తెలియదు. వచ్చాడంటే ఇహ తనే లోకం.

*****

దూరంగా ఏనుగు గట్టిగా ఘీంకరించడంతో ఆలోచనలకు ఫుల్ స్టాప్ పెట్టి లేచి తలార స్నానం చేసి, కొండ దేవత గుడి కెళ్లి తమ ఇద్దరి పేరు మీద పూజ చేయించుకుని కాసేపు కుందేళ్లతో, లేళ్లతో ఆడుకుని ఇంటికొచ్చింది.

పుష్పశర్ మధ్యాహ్నం భోజనానికి ఇంటికెలాగూ రాడు. అందు చేత నాలుగు పళ్లు తిని పాలు తాగింది.

సాయంత్రం చక్కటి చీర రవిక తొడుక్కుని, పూల మాల తలలో తురుము కుని అతని కోసం ఎదురు చుస్తూ కూర్చునుంది. నిండు పున్నమి చంద్రునికి తన బాధ్యత అప్పగించి సెలవు తీసుకుంది సాయం కాలం. వెన్నెల విరగ కాస్తోంది. ’పుష్పశర్ ఎప్పుడొస్తాడో, అసలు తమ పెళ్లి రోజని అయ్య గారికి గుర్తుందో లేదో’ మనసులో నిట్టూర్చింది.

ఏడు గంటలు... ఇంటి ముందు జీప్ ఆగింది. పుష్పశర్ దిగీ దిగడం తోటే ’పద రాణీ, నిన్నివాళ ఒక చోటికి తీసుకెళతాను. మన పెళ్లి రోజు నీ మనసులో నిలిచుండే మధుర స్మృతి చేస్తాను"అని హడావుడి పెట్టాడు.

రాణీ మనసు పురి విప్పిన మయూరమైంది.

గబ గబ జీప్ ఎక్కింది.

గంట ప్రయాణం చేశాక తామరపూలతో నిండి శోభాయ మానంగా ఉన్న ఒక కొలను దగ్గర జీపుని ఆపాడు.

"రాణీ, దీని పేరు సుధా నిధి కొలను. ఇందులో స్నానం చేస్తే తనువూ, మనసూ పులకరించి పోతాయంటారు. పద దిగి స్నానం చేద్దాం’ అన్నాడు.

ఇద్దరూ దిగి స్నానం చేశారు. విచిత్రం శరీరంలో రక్తం స్థానంలో మరేదో ఉత్ప్రేరకం ప్రవహిస్తున్న అనుభూతి. మనసులు మత్తిల్లుతున్నాయి.

"పద మనం మళ్లీ ప్రయాణించాలి"అని జీపెక్కించి ఓ పావు గంట ప్రయాణించాక ఒక కొండ దగ్గర ఆపాడు.

"రాణీ, దీని పేరు రతి కేళి గిరి, కొత్తగా పెళ్లైన ఆటవిక జంటను ఇక్కడికి పంపిస్తారు. మూడు రాత్రుల ముచ్చటయ్యాక వాళ్లు గూడెం చేరుకునేవారు. ఆ సంవత్సరమే వాళ్లకో పాప పుట్టేదట. దీనిలో చాలా ప్రత్యేకత లున్నాయి. పద మనం లోపలికి వెళుతుంటే, నడుస్తూ చెబుతా" అని ఆమె చెయ్యందుకుని కొండ అంతర్భాగానికి తీసుకెళుతూ, సంభోగ క్రియలో ఉన్న వాళ్లని ఎవరూ డిస్ట్రబ్ చెయ్య కూడదన్నది ప్రకృతి నియమం అని నీకు తెలుసుగా, అందుకే క్రిమి కీటకాదులు, జంతువులూ ఇందులో ప్రవేశించవు. మనం ఇందు లోకి ప్రవేశించ గానే శిఖరం పైన ఒక దీపం వెలుగుతుంది అది చూసిన ఏ ఆటవికులూ ఇందు లోకి రారు. గమనించావా ఇందులో చంద్ర కిరణాలు ఎలా అన్ని వైపుల నించి ప్రసరిస్తున్నాయో? అంతా కాంతి వంతంగా ఉంది కదూ. ఈ సువాసనలు గననించావా? అవి ఎక్కడి నుంచి, ఏ పూల నుంచి వస్తున్నాయో ఎవరూ చెప్పలేరు. అసలు ఈ కొండ సృష్టి విచిత్రం. చాలా మందికి తెలియని ఓ రహస్యం. నేను నచ్చి నాకో కొండ దేవర చెప్పాడు.’ అన్నాడు.

"ఇదిగో ఈ చెట్టుకున్న రెండు కాయలు తింటే రాత్రంతటికీ మనిద్దరికీ కావలసిన శక్తి సమకూరి, తాంబూలం వేసుకున్న అనుభూతి కలుగుతుంది" అన్నాడు మత్తుగా.

ఇద్దరూ మధురమైన రుచితో సుగంధ భరితంగా ఉన్న ఆ పళ్లను తిన్నారు.

రాణీ మనసు మైమరచి పోతోంది. ఒళ్లంతా ఏవిటో చెప్పలేని దివ్య అనుభూతి.

అక్కడే ఉన్న ఒక రాయి మీద సన్నటి గడ్డి ఒత్తుగా ఉంది. చుట్టూ గడ్డి పూల మొక్కలు. "రాణీ అదే మన కామ కేళి పాన్పు" అన్నాడు.
అంతే.. వివశత్వంతో ఆమె అతని మీద సోలి పోయింది. అతను కూడా ఆమెని పొదివి పట్టుకుని ముద్దులు ముద్రిస్తూ ముందుకు సాగి పోతున్నాడు. ఆచ్ఛాదనలన్నీ వాటికవే తొలగిపోయి దారినేర్పాటు చేస్తున్నాయి. ఆ రాత్రి వాళ్లిద్దరి జీవిత పుస్తకంలో బంగారు పుటగా చోటు చేసుకుంది.

‘అను క్షణం డబ్బు యావలో శృంగారాన్ని, సెక్స్ గా యాంత్రికం చేసుకునే సిటీ లోని కుర్రాడ్ని పెళ్లి చేసుకో కుండా, ప్రకృతితో సహ జీవనం చేస్తూ, మమేకమవుతూండే పుష్పకర్ ను పెళ్లి చేసుకోవడం వల్ల ఇలాంటి అద్భుతం సొంతం చేసుకునే అదృష్టం తనకు దక్కింది. జన్మ జన్మలకీ గుర్తుండి పోయే మనో యవనికపై సుఖ ముద్రిక ఇది’ మనసులో అనుకుని పుష్పకర్ ముఖాన్ని చేతుల్లోకి తీసుకుని బుగ్గలపై ముద్దులు ముద్రించింది రాణీ.

మరిన్ని కథలు

Kya huvaa
క్యా హువా
- కె. తేజస్వని
Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు