అలవాటు - ఆత్మానంద

alavaatu

"ఈ నగరానికి ఏ మయింది ?---స్మోకింగ్ వార్నింగ్ యాడ్ ప్రారంభమయింది సినిమా హాలులో. నీరజ సీటులో ఇబ్బందిగా కదిలింది. సినీమా మొదట్లోనూ, ఇంటర్వెల్ లోనూ ఆ యాడ్ పూర్తయితే కానీ సినిమా హాల్లోకి రాడు ఆమె భర్త రాఘవ. వాళ్ళిద్దరికీ పెళ్లయి మూడు సంవత్సరాలు దాటింది. అన్యోన్యమయిన దాంపత్యమే కానీ ఒక్క విషయం లో వాళ్ళిద్దరి మధ్యా వాగ్వివాదాలు జరుగుతూ ఉంటాయి. అదే రాఘవ సిగరెట్టు మానడం గురించి. పెళ్లి అయినప్పటినుంచీ అతని చేత సిగరెట్ మాన్పించడం లో విఫలమయ్యింది నీరజ. ఆ ఒక్క బలహీనత తప్ప అతను మిగతా అన్ని విషయాలలో చాలా బాగా చూసుకుంటాడు నీరజని. ఆమె సలహాలని అన్నివిషయాలలో పాటిస్తాడు. ఆమె ఇష్టా యిష్టాలన్నిటి కి తగిన గౌరవ మిస్తాడు. నీరజ స్నేహితుల దృష్టి లో అతను చాలా మంచి భర్త.

సినిమా అయినతరువాత ఇంటికి వస్తూ డ్రైవ్ చేస్తున్న రాఘవ తో అంది నీరజ " ఓ ఛాలెంజ్ గా తీసుకుని కాల్చడం మానేయచ్చు కదా" అని.
'ఇంకో ఛాలెంజ్ గురించి నీకు తెలియదు' అని మనసులో అనుకుని రాఘవ జవాబు చెప్పలేదు.

నారాయణ, గణపతి, రాఘవ ముగ్గురూ ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం నుంచీ చాలా మంచి స్నేహితులు. ముగ్గురూ తల్లి తండ్రుల డిసిప్లిన్ నుంచి విడివడి మొదటిసారిగా ఇంజనీరింగ్ లో వేరే ఊళ్ళో కలవడం తో కొంత కంట్రోల్ తప్పిన వాతావరణం లో గడపడం జరిగింది. ఆ మొదటిరోజుల్లో బాలూ మహేంద్ర సినిమా "కొంటె కుర్రాళ్ళు" చూసి వచ్చి మొదటిసారిగా సిగరెట్లు కాల్చారు. అలా సరదాగా మొదలెట్టిన సిగరెట్టు గట్టిగానే తగులుకుంది వాళ్ళని. ఇంజనీరింగ్ నాలుగో సంవత్సరం దసరా సెలవల్లో గణపతి పెళ్లి అయింది. నారాయణ, రాఘవ పెళ్లి కి వెళ్లి వెంఠనే వచ్చేశారు. గణపతి దసరా శలవుల తరువాత వచ్చి చేరాడు. పేళ్ళి అయి వచ్చిన తరువాత వచ్చిన పెద్ద మార్పు ఏమిటంటే, గణపతి సిగరెట్ మానేశాడు. ఏమిటిరా మార్పు అని అడిగితే, వాళ్ళ ఆవిడ, ఏడ్చి మొత్తుకుని ఒట్టేసుకుని మాన్పించేసిందట. ఒట్టు వేశాడు కాబట్టి ఇంక కాల్చనని ఖచ్చితం గా చెప్పేశాడు. నారాయణ ఎక్కువ మాట్లాడలేదు కానీ రాఘవ మటుకు " నేను అలా లొంగను. పెళ్ళికి ముందే చెప్పి కండిషన్ పెడతాను" అన్నాడు కొంచెం గొప్పగా.

వీళ్ళు ఫైనల్ ఇయర్ లో ఉండగా ఓ కంపెనీ నుంచి 'ఒరాకిల్' సబ్జక్ట్ చెప్పడానికి పార్ట్ టైం లెక్చరర్ రాజారామ్ గారు వచ్చేవారు. ఆయన చాల సరదాగా స్టూడెంట్స్ తో బాగా కల్సి పోయేవారు. ఓ మాటు కేంటీన్ లో వీళ్ళు ముగ్గురినీ చూసి వీళ్ళ దగ్గరికి వచ్చి కూర్చున్నారు. నారాయణ, రాఘవ ఆయన దగ్గరకు రాగానే కాలుస్తున్న సిగరెట్లు హడావిడి గా పడేశారు. ఆయన మిగతా విషయాలు అవీ ఇవీ మాట్లాడి సంభాషణ హాబిట్స్ అలవాటు అవడం గురించి వివరం గా మాట్లాడారు.
" కొన్ని కొన్ని అలవాట్లు చాల సులువు గ తగుల్చు కుంటామయ్యా. కానీ అవి వదుల్చుకోవడం చాలా కష్టమవచ్చు. .HABIT అన్న పదాన్ని మీరు నిలువు గా రాశారనుకోండి. H కొట్టేసామానుకో, అంటే కొంత వదుల్చుకున్నామనుకో, A BIT ఇంకా ఉంటుంది. ఇంకొంచెం ప్రయత్నించి A తీసినా BIT ఇంకా ఉంటుంది. ఇంకా కొంచెం ప్రయత్నించినా IT ఈజ్ స్టిల్ దేర్. .
దానికి నేనే ఉదాహరణ. నేను సిగరెట్ మానేసి పది సంవత్సరాలయినా ఇంకా నాకు సిగరెట్ కాలుస్తున్నట్టు కలలొస్తూ ఉంటాయి. ఒక థియరీ ప్రకారం పూర్తి గా సిస్టం నుంచి పోవాలంటే మానేసిన తరువాత కూడా పన్నెండు సంవత్సరాలు పడుతుందట.

" మీరు సిగరెట్లు కాల్చేవారా మాష్టారూ? ఎలా మానేశారు ?" అన్నాడు గణపతి మిగతా వాళ్ల కేసి చూస్తూ.

. పెళ్ళికి ముందునుంచీ కాల్చే వాడిని. మా ఆవిడ గోల తో మానడానికి ప్రయత్నించినా కుదర లేదు. కానీ మా అబ్బాయికి కొద్దిగా జ్ఞానం వచ్చి విషయాలు తెలిసే వయసు రాగానే, వాడిని అలాంటి అలవాటు బారిన పడకుండా చేయాలంటే నేను మానేయటం కంటే మార్గం లేదని పించింది. నేను కాలుస్తూ, వాడిని అలవరచు కోవద్దనే అర్హత నా కెక్కడిది? ఆ భావనే నన్ను దానినుంచి బయట పడేసింది. ఇంకో ముఖ్య విషయం.
"కొంతమందికి చాలా కాలం కాల్చినా ఏమీ కాలేదు" అని కొందరు మూర్ఖులు అర్గ్యూ చేయడం నేను చూశాను. వాళ్లకి తెలియనిదేమంటే ప్రతి వ్యక్తి శరీరం టెస్ట్ ట్యూబ్ లాంటిది కాదు. ఏ టెస్ట్ ట్యూబ్ లో పరీక్షించినా రసాయనాలు ఒకే రకమయిన ఫలితాన్నిస్తాయి. కానీ మనుషుల శరీరాలు అలా కాదుకదా? ఒక్కొక్క వ్యక్తి శరీరం ఒక ప్రత్యేకమయిన సిస్టం. అందరి వేలి ముద్రలూ ఒక లా ఉండవు కదా? అందు చేత, నికోటిన్ ఒక్కొక్క శరీరంలో ఒక్కొక్క లా రియాక్ట్ అవవచ్చు. ఒకడికి పదేళ్లకి ఏమీ కాక పోయినా, ఒకడికి ఏడాదిలోనే కేన్సర్ రావచ్చు. ఎవడికి ఎలా రియాక్ట్ అవుతుందో ముందే తెలియదు కదా? తెలిసేటప్పటికీ ఆలస్యమవ వచ్చు. అందు చేత దూరం గా ఉండడం ఉత్తమం. ఇదంతా ఒక ఆప్త మిత్రుడు ఈ మధ్యనే గొంతు కేన్సర్ కి గురయిన సందర్భం లో తెలిసినవి " అంటూ లేచారు రాజారామ్ గారు.

ఆయన వెళ్ళిపోయిన తరువాత. అందరూ నిశ్శబ్దంగా ఉండి పోయారు కొంత సేపు.

ఆ తరువాత నారాయణ సిగరెట్లు మానేసాడు. కానీ రాఘవ మాత్రం కొద్దిగా ప్రయత్నించినా మానలేక పోయాడు. రాజారామ్ గారు చెప్పినవి విన్నతరువాత రాఘవ లో కూడా మానాలి అన్న ఆలోచన వచ్చినా తొందరేముందిలే అని పక్కకి పెట్టాడు. తరువాత ఉద్యోగాల రీత్యా గణపతీ, నారాయణా విదేశాలు వెళ్లడంతో రాఘవ పెళ్ళికి కూడా వాళ్ళు కలవలేదు, అప్పుడప్పుడు మెయిల్ పలకరింపులు తప్ప.

***
రాఘవ బి టెక్ అవగానే కాగ్నిజెంట్ లో చేరాడు. రెండేళ్లు అయినతరువాత తల్లి దండ్రులు చూసిన ఒకటి రెండు సంబంధాలు చూశాడు. తండ్రికి తెలిసిన మిత్రుడు చెబితే నీరజ ని చూశాడు. నీరజ తండ్రికి జాతకాల మీద బాగా నమ్మకం. ఆయన ఒకళ్లిద్దరికి జాతకాలు చూపించుకున్న తరువాత బాగా నప్పేయని చెబితే ముందుకు వెళ్ళ దలచుకున్నారు. నీరజ, రాఘవ కూడా మాట్లాడుకున్నారు. రాఘవ ముందుగానే తన అలవాటు గురించి నీరజ కి చెప్పాడు. సాధారణంగా పెళ్ళికి ముందు ఉండే ఉత్సాహంలో మానడా నికి ప్రయత్నిస్తానని, కొంచెం టైము ఇవ్వమని అడిగాడు. పెళ్లయిన కొత్తలో కొద్దిరోజులు మానేసి, తరువాత రహస్యం గాను కానిచ్చాడు. ఇద్దరూ ఉద్యోగం చేసు కుంటున్నారు కాబట్టి, ఇల్లూ, కారూ వంటివి అన్నీ కొద్దికాలం లోనే ఏర్పరచు కున్నారు

రాఘవలో ఒక్క సిగరెట్ బలహీనత తప్ప మిగతా అన్ని లక్షణాలు చాల గొప్పవి అని గ్రహించడానికి నీరజకి అట్టే సమయం పట్టలేదు. కొంత మంది మగవాళ్ల లాగ స్త్రీల పట్ల అసలు అతనికిచులకన భావం లేదు . అన్నీ అతనిని అడిగి చేయాలని పట్టింపులు గాని పురుష ఆధిక్యత ప్రదర్శించడం కానీ చేయడు. ఇక ఆర్ధిక విషయాలలో సహాయం అవసరమయితే స్వ, పర భేదం లేకుండా ఖర్చు చేస్తాడు. రాఘవకి కూడా నీరజ మీద భార్య అని ప్రేమ తో బాటు ఆమె వ్యక్తిత్వాన్ని ఇష్టపడతాడు. పుట్టింటి వాళ్ల ని, అత్తింటి వాళ్ళని తేడా లేకుండా అందరి పట్లా అన్ని బాధ్యతలూ మీద వేసుకోవడం వల్ల, చాలా సందర్భాలలో అతనికి పెద్ద రిలీఫ్ . అందుకే ఉద్యోగం మీద దృష్టి పెట్టి త్వరగానే మంచి ప్రమోషన్స్ సాధించాడు. వాళ్ళిద్దరిదీ చాలా అన్యోన్య దాంపత్యమని, నేహితులలోనూ బంధు వర్గం లోనూ కూడా అభిప్రాయం ఉంది.

అయితే ఈ మధ్య వృత్తి పరం గా వాళ్ళ జీవితం లో జరిగిన ఒక ముఖ్యమయిన మార్పు సమస్య ని జటిలం చేసింది. ఇద్దరూ వేరు వేరు కంపెనీల్లో పని కాబట్టి వారం లో వాళ్ళు కలిసుండేది తక్కువ సమయమే అయ్యేది. రాఘవ పనిచేసే కంపెనీ లో ఓ క్లయంట్ ఒక స్టార్టప్ కంపెనీ పెట్టి రాఘవ కీ భార్యకీ ఒక చక్కటి ఆఫర్ చేశాడు. వాళ్ళు ఇంటివద్దనుంచే పని చేసుకోవచ్చు. పబ్లిక్ ఇష్యూ కి వెడితే ఎక్కువ శాతం స్టాక్ అప్షన్ ఇవ్వడానికి ఒప్పందం. కొన్ని కోట్లు కలిసి వచ్చే అవకాశం. ఇద్దరూ బాగా ఆలోచించుకుని వెంఠనే చేరిపోయారు.

అప్పటినుంచీ ఇద్దరూ ఇంట్లోనే పనిచేయడం. పక్క పక్కనే కూర్చుని పనిచేసే అవకాశం. కానీ రాఘవ కి ఇది పెద్ద సమస్యే అయ్యింది. అదివరకు అయితే ఆఫీసులో కావలసినప్పుడల్లా సిగరెట్ కాల్చుకోవడం ఇబ్బంది లేదు. ఇప్పుడు పక్కనే నీరజ ఉండడం ఇబ్బందే. ముందు నీరజ అతని ఆరోగ్యం గురించి జాగ్రత్తలు చెబుతున్నా, ఆ తరువాత అతని పని వత్తిడి చూసి ఏమీ అనలేక పోయేది. నీరజ అతని ఆరోగ్యం గురించి ఎంత పట్టించుకునేదో , రాఘవ కూడా ఆమె మీద అంతే ప్రేమ కనపరచే వాడు. ఒకవేళ ఎప్పుడయినా ఆమెకి కొంచెం నలతగా ఉన్నా పనులు చేయనిచ్చేవాడు కాదు. తాను వంట చేయడమో, లేదా హోటల్ కు ఆర్డర్ చేయడమో చేసే వాడు. పని లో పడి వాళ్లకి తెలియకుండానే ఆరు నెలలు గడిచిపోయాయి. పని బాగా జరుగుతోంది కానీ, రాఘవ సిగరెట్లు కాల్చడం మాత్రం తగ్గలేదు. ఆ విషయం లోనే నీరజ కి ఎక్కువ మనస్తాపం గా ఉంది

నీరజ వాళ్ళు చదువుకున్న టెన్త్ క్లాస్ వాళ్ళు అందరూ ఓల్డ్ స్టూడెంట్స్ మీట్ పెట్టడం తో, ఓ మాటు తల్లి నీ తండ్రినీ కూడా చూసి వచ్చినట్టవుతుందని రెండు, మూడు రోజులు కాకినాడ వెళ్లి వస్తానంది. ఆమె పని కూడా తాను చూస్తానని వెళ్లి రమ్మన్నాడు. తాను లేదు కదా అని ఎక్కువ సిగరెట్లు కాల్చవద్దని ఒట్టు వేయించుకుని వెళ్ళింది. మొదటి రోజు సతాయింపులు లేకపోవడం బాగేనే ఉంది కానీ, రెండవ రోజు నుంచీ ఆమె లేకపోవడం అతనికి మానసికంగా కష్టమే అయ్యింది.

పుట్టింటి నుంచి వస్తూనే తిరిగి అతనితో బాటు ఆఫీసు పని లో పడి పోయింది నీరజ. వచ్చిన రెండవ రోజు నుంచీ కొంచెం దగ్గు ప్రారంభమయి, రోజులు గడిచిన కొద్దీ బాగా ఎక్కువ అయింది. మొదట ప్రయాణం లో తేడా చేసిందేమో అనుకున్నాడు రాఘవ. వారమయినా తగ్గక పోవడంతో, డాక్టర్ దగ్గరకు వెళ్ళవచ్చు కదా? అన్నాడు కొంచెం ఆందోళన వ్యక్తం చేస్తూ.

అమ్మా వాళ ఇంట్లో కొంచెం ఊరగాయలు ఎక్కువ లాగించాను. దానివల్లేమో. కాఫ్ సిరప్ వాడుతున్నాను ఫరవాలేదు అంది. ఓ రోజు కొంచెం తగ్గినట్టు అనిపించినా తరువాత మళ్ళీ రావడం మొదలయింది. ఇక లాభం లేదని కాలనీలోనే ఉన్న డాక్టర్ దగారికి వెళ్లి వస్తానని వెళ్లి మందులు తెచ్చుకుంది. ఒక నాలుగురోజులు అయినతరువాత ఈ మాటు చాలా ఎక్కువగా రావడం తో అతను చాలా కంగారు పడ్డాడు. ఓ మాటు బాగా ఎక్కువ వస్తే శ్లేష్మం ఎక్కువ వచ్చినట్టుంది వాష్ బేసిన్ దగ్గరకి వెళ్లి ఊసి వచ్చింది. పని ఆపేసి ఆమెని రెస్ట్ తీసుకోమని తాను పనిలో పడిపోయాడు. కొంత సేపు తరువాత అతను బాత్ రూమ్ వైపు వెడుతూ యాదాలాపం గా వాష్ బేసిన్ లో చూస్తే కొద్దిగా రక్తం మరకలు లాగ కన్పిస్తే కంగారు పడి, వెంఠనే నీరజ ఉన్న గదిలోకి వెళ్ళాడు. ఆమె కళ్ళు మూసుకుని పడుకుని ఉంది.

" నువ్వు వెంఠనే చెకప్ చేయించుకోవాలి నడు నిమ్స్ కి వెడదాము" అన్నాడు ఆమెని లేవదీస్తూ.
నిమ్స్ అక్కరలేదు కానీ, మొన్న మా ఊళ్ళో జరిగిన "ఓల్డ్ బోయ్స్ మీట్" లో తెలిసింది. మా క్లాస్మేట్ అనిల్ ఛెస్ట్ కి సంబంధించిన స్పెషలైజేషన్ చేసి మనకి దగ్గరలోనే ఉన్న యశోద లో ఉన్నాడు. నా పర్స్ లో అతని కార్డు ఉంది. ఫోన్ చేసి వివరాలు చెప్పి ఎప్పుడు రమ్మంటాడో కనుక్కోండి వెడదాము. ఎక్కడో నిమ్స్ కి పోయి తెలియని డాక్టర్ ని కలిసే కంటే అనిల్ సలహా తీసుకుందాము" అని మళ్లీ కళ్ళు మూసుకుంది .

వెంఠనే రాఘవ అనిల్ కి ఫోన్ చేసి కొంచెం కంగారుగా నీరజ విషయం చెప్పి వెంఠనే చెకప్ చేయించాలని,ఎప్పుడు రమ్మంటారని అడిగాడు. అతను రాఘవ ని కంగారు పడవద్దని, సాయంత్రం అయిందింటికి వస్తే ముందు పరీక్షించి, అవసరమయితే డిటైల్డ్ టెస్ట్స్ చేయిద్దామని ధైర్యం చెప్పాడు.

అనుకున్నట్టే సాయంత్రం ఇద్దరూ యశోదాలో అనిల్ ని కలిశారు. మొత్తం హిస్టరీ విన్నతరువాత, . ప్రిస్క్రిప్షన్ పాడ్ మీద మూడు ఐటమ్స్ రాసి ఓ నర్స్ ని పిలిచినీరజని తీసుకు వెళ్లి టెస్ట్స్ చేయించ మన్నాడు. వాళ్లిద్దరూ వెళ్లిన తరువాత రాఘవతో మాట్లాడుతూ నీరజ ఆహారపు అలవాట్లూ, జాబ్ లో ఉన్నవత్తిడి మొదలయిన కొన్ని విషయాలు అడిగిగాడు. అన్నీ నోట్ చేస్కుని రాఘవని వెయిట్ చెయ్యమని లోపలికి వెళ్ళాడు.

ఓ అరగంట తరువాత నీరజ తో వెనక్కివచ్చాడు అనిల్. పెద్దగా వర్రీ అవలసింది లేదని,టెస్ట్స్ రిసల్ట్స్ మరునాడు వస్తాయని, రాఘవని ముందుగా ఫోన్ చేసి రమ్మన్నాడు. సరే అని నీరజ, రాఘవ లేచి అతనికి తాంక్స్ చెప్పి బయలుదేరారు. వాళ్ళు కొద్దీ దూరం వెళ్లిన తరువాత అనిల్, రాఘవని వెనక్కి పిలిచి మెల్లిగా అతనికి వినపడేలా మాత్రమే చెప్పాడు." నీరజ అక్కర లేదు మీరు ఒక్కరే రండి " అని.

మరునాడు మధ్యాన్నం రెండుగంటలకి అనిల్ కి రాఘవ ఫోన్ చేసి "సాయంత్రం రమ్మంటారా? అన్నాడు

" లేదు, ఒక టెస్ట్ డిటైల్డ్ టెస్ట్ కోసం వేరే లాబ్ కి పంపించాము. అది రేపు కానీ రాదు. అందు చేత రేపు సాయంత్రం రండి " అని చెప్పి " నీరజ అనవసరం గా కంగారు పడుతుందేమో డి టై ల్డ్ టెస్ట్ గురించి ఆమెకి చెప్పకండి, ఇవాళ నాకు అనుకోకుండా ఆపరేషన్ షెడ్యూల్ అవడం వల్ల రేపు రమ్మన్నాని చెప్పండి " అని పెట్టేశాడు.

మరునాడు యశోదాకి బయలు దేరే దాకా రాఘవ చాలా వర్రీడ్ గా గడిపాడు. సాయంత్రం అవగానే నీరజకి చెప్పి యశోదాకి బయలుదేరాడు. రాఘవ అనిల్ కేబిన్ కి వెళ్ళగానే ఇతన్ని కూర్చోమని అతను లోపలికి వెళ్లి ఏవో రిపోర్ట్స్ తీసుకు వచ్చాడు. అనిల్ కొంచెం గంభీరముగా ఉండడంతో రాఘవకి కొంచెం భయంగానే ఉంది.

రిపోర్ట్స్ లోంచి తలెత్తి అనిల్ అన్నాడు " ఎలిమినేషన్ కోసం అడుగుతున్నాను - నీరజకి స్మోక్ చేయడం అలవాటు ఉందా ?" అన్నాడు

రాఘవ విస్తుపోయి " భలేవారే ఆమె స్మోక్ చేయడం ఏమిటండి?" అన్నాడు కొంచెం ఇబ్బందిగా

" నేను చెప్పాను కదా? ఎలిమినేషన్ కోసం మాత్రమే అడుగుతున్నానని. అయితే మీరు స్మోక్ చేస్తారా.? ఆమె చెయ్యక పోతే, ఆమెకి దగ్గరగా ఎవరయినా స్మోక్ చేసి ఉండాలి లేకపోతే నికోటిన్ ప్రభావం అంతగా ఎఫెక్ట్ చెయ్యదు" అన్నాడు రాఘవ కేసి చూస్తూ

" ముందు రిపోర్ట్స్ రిజల్ట్స్ కొంచెం చెబుతారా?" అన్నాడు రాఘవ సస్పెన్స్ భరించలేక, అనిల్ మాట్లాడేది అర్థం కాక

" కంగారు పడకండి అంత పెద్దగా వర్రీ అవవలసింది లేదు. కానీ ఆమెకి నికోటిన్ ప్రభావం వల్ల ఊపిరితిత్తులలో చిన్న పాచ్ ఏర్పడింది . అది స్మోకింగ్ వల్ల కానీ,లేదా స్మోకింగ్ చేసే వాళ్లకి దగ్గరగా కానీ ఎక్కువ గడిపితే సంభవించవచ్చు. చాలా ప్రారంభ దశలో ఉన్న మాలిగ్నన్సీ. ఈ మధ్య ఒక కొత్త ఇంజక్షన్ వచ్చింది . అది ఒక వారం రోజులు ఇస్తే ఇటువంటి ప్రారంభం లో ఉన్న పాచ్ ని తీసేయవచ్చు. అవును మీరు సెలవు పెట్టి ఇంట్లో ఎక్కువ సేపు ఉంటూ సిగరెట్లు కాలుస్తున్నారా? మీ స్మోకింగ్ హాబిట్ డీటెయిల్స్ కొంచెం వివరిస్తారా ?

రాఘవ వివరంగా అన్నీ చెప్పాడు. అంతకు ముందు ఆఫీసు కు బయటకి వెళ్లడం అక్కడే ఎక్కువ కాల్చడం జరిగేదని, ఆరు నెలల నుంచి ఇంటినుంచి పనిచేస్తూ ఉండడం వల్ల నీరజ పక్కనే కూర్చుని పని చేస్తూ, వర్క్ ప్రెషర్ లో ఎక్కువ కాల్చడం జరుగుతోందని. మానేద్దామనుకుంటూనే అశ్రద్ధ చేశానని గిల్టీ ఫీలవుతూ చెప్పాడు. అయినా నేను కాలిస్తే నాకేమీ కాకుండా ఆమెకి ఎఫెక్ట్ అవడం ఆశ్చర్యం గా ఉందే అన్నాడు అమాయకంగా

" టెస్ట్బ ట్యూబుల్లో అయితే ఒకే రియాక్షన్ఉంటుంది. మీ సిస్టం వేరు ఆమె సిస్టం వేరు కదా ! అందుకే బహి రంగ ప్రదేశాల్లోనూ, జనం ఉండే చోటా స్మోకింగ్ బేన్ చేశారు కదా?"


చెంప మీద కొట్టినట్టు రాజారామ్ మాష్టారి మాటలు గుర్తు కొచ్చాయి రాఘవకి " ప్రతి వ్యక్తి శరీరం టెస్ట్ ట్యూబ్ లాటిది కాదు కదా>"

అనిల్ రాఘవకి ధైర్యం చెప్పాడు. "మనం వెంఠనే ఇంజక్షన్స్ స్టార్ట్ చేస్తే ప్రోబ్లం ఏమీ ఉండదు. మీరు త్వరగా ఇక్కడికి తీసుకు రావడం మంచిది అయ్యింది" మరునాడు ఎప్పుడు రావాలో అన్నీ వివరంగా చెప్పి పంపించాడు. నీరజ కి ఎక్కువ వివరాలు చెప్పకుండా, ఇన్ఫెక్షన్స్ క్లియర్ చేయడానికి ఇంజక్షన్స్ తీసుకోవాలని చెప్పమన్నాడు.

రాఘవ ఇంటికి వస్తూనే ఉన్న సిగారెట్ ప్యాకెట్లు బయట పడేసి, నీరజకి, అనిల్ చెప్పమన్నట్టు చెప్పాడు.
ఆశ్చర్యంగా ఆరోజంతా అతనికి సిగరెట్లు కాల్చక పోయినా, నీరజ ఆరోగ్యం గురించిన ఆలోచనలతో పెద్ద తేడా తెలియలేదు.

అనిల్ సారధ్యంలో వారం రోజులూ ఇంజక్షన్స్ కోర్సు ఇవ్వడం జరిగి, నీరజ కొద్దీ రోజులలోనే మామూలు మనిషి అయి పనిలో పడింది. రాఘవకూడా సిగరెట్ల నుంచి బయట పడ్డాడు. సిగరెట్ ఆలోచన వచ్చినప్పుడల్లా, నీరజ ఆరోగ్యం గురించి అనిల్ చెప్పినప్పుడు ఎంత టెన్షన్ పడ్డాడో గుర్తుకు వచ్చి ఆ ఆలోచనల నుంచి త్వరగానే బయట పడ్డాడు.

ఓ వారం రోజుల తరువాత నీరజ బయటికి వచ్చినప్పుడు అనిల్ కి ఫోన్ చేసింది " మన ప్లాన్ సక్సస్. ఆయన సిగరెట్లు పూర్తిగా మానేశారు. మనం ఓల్డ్ స్టూడెంట్స్ మీట్ లో కలవడం మంచిది అయ్యింది. చాలా థాంక్స్ మంచి సలహా కి, దాన్ని అమలు చేయడానికి " అంది నవ్వుతూ.

" నువ్వు ఓ ముఖ్య విషయం మరిచిపోకు, దీనివల్ల రాఘవకి నీ మీద ఎంత ప్రేమ ఉందొ కూడా ప్రకటిత మయింది కదా ?" నవ్వుతూ అన్నాడు అనిల్. మళ్ళీ వెంఠనే " ఎంతయినా భార్యా భర్తలు కాబట్టి పూర్తి గా బయట పడ్డాడని నమ్మకం కలిగిన తరువాత అన్నీ చెప్పెయ్యి." అన్నాడు సలహా యిస్తూ.

"ఎప్పుడు చెప్పాలో నిర్ణయ మయిపోయింది. ఒక ఇన్సూరెన్సు తీసుకున్న తరువాత చెప్పాలి. దానిగురించి నీకు తరువాత చెబుతాను" అని మరోమారు థాంక్స్ చెప్పి ఫోన్ కట్ చేసింది.

*****

కథ ఇక్కడితో ముగించేయవచ్చు. కానీ కొసమెరుపుకు కొద్దిగా వివరణ ఇస్తే బాగుంటుందేమో -

రాఘవ అంతకు ముందు పిల్లల గురించి ఎత్తినప్పుడు నీరజ ఖచ్చితం గా చెప్పేది. అతను సిగరెట్లు మానిన తరువాతే పిల్లల మాటఎత్త మని.

అతను సిగరెట్లు మానేసిన ఆరు నెలల తరువాత ప్రెగ్నన్సీ టెస్ట్ కన్ఫర్మేషన్ అయిన తరువాత చెప్పింది వివరాలన్నీ. కాకినాడ లో ఓల్డ్ స్టూడెంట్స్ మీట్ లో కలిసినప్పుడు అనిల్ డాక్టర్ గా యశోద లో పని చేస్తున్నాడని తెలియడం , మిగతా విషయాలు మాట్లాడుతూ , రాఘవ సిగరెట్లు మానలేక పోవడం వర్రీ గా ఉందనిఅతని తో అనడం, అతను మిగతా విషయాలన్నీ విన్న తరువాత 'ప్లాన్' చెప్పడం జరిగిందని.

" అమ్మ దొంగా" పుట్టబోయే బిడ్డని ఇన్సూరెన్స్ గా పెట్టుకున్నావా? చెప్పడానికి ! మరి ఆ రక్తం? ఇంజక్షన్లు?" రాఘవ అడిగాడు వివరాల కోసం

"అవా మనతెలుగు సినిమాలు ధర్మమా అని -టమాటో సాస్ వాడడం జరిగింది. ఇక ఇంజక్షన్లా ? నిన్ను బయట కూర్చోపెట్టి మేము కాఫీ తాగే వాళ్ళం"

మరిన్ని కథలు

Kya huvaa
క్యా హువా
- కె. తేజస్వని
Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు