రమ్య - నూజిళ్ళ శ్రీనివాస్

ramya

సాయంత్రం రైలుకి మా ఊరెళ్ళాలని, ఆఫీసుకు ఆఫ్ డే శలవు పెట్టి, మధ్యాహ్నం హోటలు కెళ్ళి భోంచేసి రూమ్ కు వచ్చి కాసేపు కునుకు తీద్దామని మంచం మీద వాలాను. ఏదో అర్జంటు పని ఉంది రమ్మని, ఊరి నుంచి అమ్మ ఫోన్ చేసి చెప్పింది. ఏమిటో విషయం...బహుశా పెళ్ళి చూపుల గురించి కావచ్చు. చాలా రోజులనుంచి తప్పించుకుంటున్నానని అమ్మకు చాలా కోపంగా ఉంది. ఈ రోజు కూడా నేను వాళ్ళు చెప్పే పెళ్ళి చూపుల కోసం కాక, నా మనసులోని మాటను చెప్పటానికి వెళుతున్నాను.

అలా ఆలోచిస్తూ ఎప్పుడు నిద్రపోయానో...“పోస్ట్” అన్న కేకతో మత్తు వదిలింది. పరుగున వెళ్ళి తలుపు తీసాను. ఎప్పటినుండి అరుస్తున్నాడో ఏమో, కవర్ మొఖం మీద విసిరినట్టుగా పడేశాడు పోస్టుమాన్. హౌస్ ఓనర్ కూడా ఎక్కడికో వెళ్ళినట్టున్నారు. లేదంటే, వాళ్ళకే యిచ్చేవాడు అనుకొంటూ, క్రిందపడ్డ కవర్ తీసి చూసాను. లేత గులాబి రంగు కవర్. దానిపై ముత్యాల వంటి అక్షరాలతో నా అడ్రస్ వ్రాయబడి ఉంది. ఫ్రమ్ అడ్రస్ కోసం చూసాను, లేదు. ఎవరీ అజ్ఞాత వ్యక్తి అనుకుంటూ, సస్పెన్స్ భరించలేక కవర్ జాగ్రత్తగా తెరచి చూసాను.తెల్లటి కాగితం మడత పెట్టి ఉంది కాగితం తెరవగానే, దానిపై స్ప్రే చేసిన సెంటు పరిమళం ముక్కు పుటాలకు తాకింది. ఆ ఉత్తరంలోని అక్షరాల వెంబడి నా చూపులు పరిగెడుతున్నాయి...

“డియర్ మోహన్!

హౌఆర్యూ! అయామ్ ఫైన్. ఏంటీ, ఈ క్లోజ్ ఫ్రెండ్ ఎవరా అని ఆశ్చర్యపోతున్నావా? అవునులే, నేనసలు గుర్తుంటేగా, కాలేజిలో ఉన్నప్పుడే పలకరించినా, ముద్దపప్పులా ఉలుకూ పలుకూ లేకుండా ఉండేవాడివి. యిప్పుడయినా కొంచెం మారావా? లేక అంతేనా? ఏంటో, ఎన్ని చెప్పినా నీకు ఒకటే కదా!

ఏంటీ? సమయం, సందర్భం లేకుండా ఉత్తరం రాసానని ఆశ్చర్య పోతున్నావా? సందర్భం ఉంది కనుకనే వ్రాస్తున్నాను. నేను పెళ్ళి చేసుకోబోతున్నాను. ఈ నెల పదిహేనో తారీఖునే నా పెళ్ళి. మద్రాస్ రిజిష్ట్రార్ ఆఫీసులో. ఏంటీ, రిజిష్ట్రార్ ఆఫీసులో పెళ్ళేంటి అని ఆశ్చర్యపోతున్నావా? మరి, నేను చేసుకోబోయేది లవ్ మేరేజి. నన్ను చేసుకోబోయే బలిపశువెవరా అని జాలి పడుతున్నావా? సస్పెన్స్. నీకు డైరెక్టుగానే పరిచయం చేస్తాను.

నా మేరేజికి నిన్ను, నా రూమ్మేట్స్ ఇద్దరిని తప్ప ఎవరిని పిలవటం లేదు. ఎందుకో నిన్నే పిలవాలన్పించింది. ఎన్నాళ్ళ నుంచో వెతుకుతుంటే, అతి కష్టంమీద నీ అడ్రస్ దొరికింది. ఈ లేఖే నా పెండ్లి శుభలేఖ అనుకో. నీ కన్నా ఆత్మీయులు నాకెవరున్నారు మోహన్? తప్పక వస్తావు కదూ? రాక తప్పదులే! నువ్వు రాకపోతే, నాకు కోపంవస్తుంది. నాకు కోపం వస్తే ఏమౌతుందో తెలుసు కదా! అనవసరంగా ఆ అమాయకుడు (పెళ్ళికొడుకు) బలైపోతాడు.

నీ రాక కోసం ఎదురుచూస్తూ ఉంటాను...

“రమ్య”

ఉత్తరం చదవటం పూర్తయినా, నా చేతులు వణకటం తగ్గలేదు. ఒళ్లంతా చెమటలు పట్టాయి. మెదడు మొద్దుబారిపోయింది. కొంతసేపటివరకూ మనసంతా శూన్యంగా అనిపించింది. రమ్యకి పెళ్ళా? అందులోనూ, లవ్ మేరేజా? నా మనసంతా గతం వైపుకు పరిగెడుతోంది.

******

నేను డిగ్రీ చదువుతున్న రోజులవి. రమ్య ఫస్టియర్ సగంలో కాలేజీలో జాయిన్ అయింది. వాళ్ళ నాన్నగారికి వైజాగ్ నుంచి మా ఊరికి ట్రాన్సఫర్ అవటంతో, ఆమె మా కాలేజిలో జాయిన్ అయింది. అతి కొద్ది కాలంలోనే అందరితో కలివిడిగా మసలుతూ మాకందరికీ బెస్ట్ ఫ్రెండ్ గా మారింది. తను చాలా ఫాస్ట్ గాళ్. చాలా సరదాగా, ఫ్రాంక్ గా మాట్లాడేది. ఎందుకో తెలియదు గాని, నాతో మరింత చనువు ప్రదర్శించేది. కాని, నాకు మాత్రం ఆమెతో మాట్లాడాలంటే చాలా బిడియంగా ఉండేది. కాని, ఒక రకమైన అభిమానం ఆమెపై ఏర్పడింది. ఆమె నా దగ్గరకొచ్చి మాట్లాడుతున్నా, సూటిగా ఆమె కళ్ళలోకి చూడలేకపోయే వాడిని. ఏదో అధైర్యం, ఏదో బెరుకు, కాని ఎప్పుడూ ఆమె గురించే ఆలోచిస్తుండేవాడిని. అది యిష్టమో, అభిమానమో, స్నేహమో, మరేదో నాకు తెలిసేది కాదు.

నాకు చిన్నప్పట్నించి కో-కరిక్యులర్ ఏక్టివిటీస్ లో పాల్గొనే అలవాటు ఉంది. పాల్గొనే ప్రతి అంశం లోను ఏదో ఒక ప్రైజ్ వచ్చేది. ఇంటర్ లో కూడా కాంపిటీషన్స్ లో నాకు చాలా ప్రైజులు వచ్చేవి. ప్రైజు వచ్చినప్పుడల్లా, రమ్య నా దగ్గరకొచ్చి కంగ్రాట్స్ చెప్పేది. నాకు తిరిగి “థేంక్స్” అని చెప్పటానికి కూడా వణుకు, దడ. నా పరిస్థితిని చూసి, ఆమె మరింత ఏడిపించేది. “ఏంటీ! కంగ్రాట్స్ చెప్పినా కూడా, ఉలుకూ పలుకూ ఉండదు. నీ ప్రైజెస్ అన్నీ తీసేసుకుంటాననా? ఆ భయమేం అక్కర్లేదులే. కావాలంటే మరిన్ని నేనే కొనిపెడతాను”, అంటూనే, నా చేతిలో ఉన్న ప్రైజెస్ లాక్కునేది. జంకుతూనే, నేను “రమ్యగారూ! నా ప్రైజెస్ నాకు యిచ్చెయ్యండి”, అనే వాడిని. “గారూ, గీరూ అన్నావంటే, అసలివ్వను” అంటూ కోపంగా అనేది. నాకూ ఆమెను ప్రేమగా పిలవాలనే ఉండేది. క్లోజ్ గా మాట్లాడాలనే వుండేది.కాని, ఎందుకనో నేను పెరిగిన వాతావరణం నన్ను మాట్లాడకుండా చేసేది. రాన్రాను, రమ్యకు నాతో చనువు ఎక్కువౌతోంది. నాకు కూడా తను అంటే అభిమానం పెరుగుతోంది. ప్రేమంటే ఇదేనేమో? కాని, తనను ప్రేమిస్తున్నానని చెప్పే ధైర్యం లేదు.

రమ్య మీద నా అభిమానం మరింత పెరగటానికి దోహదం చేసిన, ఆ అద్భుతమైన సంఘటన, నాకు ఎప్పటికీ చెరగని గుర్తే. డిగ్రీ ఫైనలియర్ లో అందరమూ అరకులోయ టూర్ వెళ్ళాము. ఆ వాతావరణం ఆహ్లాదకరంగా ఉండి, నన్ను ఏవో ఊహా లోకాలలో విహరింపజేసేది. ఆ కొండవాలుల్లో, చెట్ల నీడల్లో ఎన్నో రంగుల కలలు కనేవాడిని. నా కలలన్నింటిలోనూ రమ్య రూపమే. ఆ రూపాన్ని శాశ్వతంగా నాదిగా చేసుకోవాలన్పించేది. కాని, ఆమె నా దగ్గరగా వస్తే, నోరువిప్పి ధైర్యంగా మాట్లాడే వాణ్ణి కాదు. ఆమె అరకులో నాతో మరింత సన్నిహితంగా మెలిగేది. ఒకసారి, లంచ్ పూర్తవగానే, అందరం చెట్లనీడన కూర్చున్నాం. రమ్య, వాళ్ళ ఫ్రెండ్స్ కొందరు కాలక్షేపం కోసం ఏదైనా చేద్దామన్నారు. కొందరు పాటలు పాడారు. కొందరు జోక్స్ చెప్పారు. పాటల పోటీలలో ఎప్పుడు పాల్గొన్నా ఫస్ట్ ప్రయిజ్ తెచ్చుకొనే నేను, ఆ రోజు ఫ్రెండ్స్ ఎంత బలవంత పెట్టినా పాడ లేక పోయాను.

రమ్య కొంటె చూపులతో, నా గుండె లయ తప్పుతోంది, గొంతు తడారి పోతోంది. నా ప్రక్కనే కూర్చొని, రమ్య చిలిపి పనులు చేస్తుంటె, ఏమీ అన లేక పోయే వాడిని. మా స్నేహితులు కొందరు మా ఇద్దరి సాన్నిహిత్యాన్ని చూసి, ఈర్ష్య పడటం మనసులో గర్వంగా అనిపించినా, భయంగా కూడా ఉండేది. కొంత సేపటి తరువాత, చీటీల ఆట మొదలెట్టేరు. చిన్న చిన్న కాగితాల మీద ఫన్నీ ప్రోగ్రామ్స్ వ్రాసి, అవి లక్కీ డిప్ లో వచ్చిన వారి చేత మిమిక్రీనో, డాన్సో, అభినయమో, చేయించే వారు. యింకో ముఖ్యమైన ఐటమ్ కూడా వుంది. అదేమిటంటే, ‘నేమ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్”. అని, అది, రమ్యే సజెస్ట్ చేసిందని అందరికీ తెలుసు. ఆ చీటీ వచ్చిన వారు, తమ బెస్ట్ ఫ్రెండ్ ఎవరో చెప్పాలి. సాధారణంగా ఆడ వాళ్ళు, ఆడ వాళ్ళ పేర్లు, మొగ వాళ్ళు మొగ వాళ్ళ పేర్లు చెప్పే వారు. ఎవరైనా అవతలి వాళ్ళని ఇష్ట పడ్డ వాళ్ళు ఉన్నా, లేని పోని గొడవ ఎందుకని బయట పడే వారు కారు. ఒక వేళ తను మీ గర్ల్ ఫ్రెండ్ కదా, బాయ్ ఫ్రెండ్ కదా అంటే – అబ్బే జస్ట్ ‘ఎ ఫ్రెండ్ హు ఈజ్ ఎ గాళ్’ అంటూ తెలివిగా తప్పించు కొనే వారు.

ఎలా మేనేజ్ చేసిందో తెలియదు కాని, ఒక సారి, ఆ చీటి రమ్యకు వచ్చింది. ఆమె అందరి ముందరా “మోహన్ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్” ....అని నా దగ్గరకు వచ్చి, కూర్చుంది. అందరూ చూస్తూండగా, ఊహించని విధంగా, నా చేయి తన చేతి లోకి తీసుకొని ముద్దు పెట్టింది. అనుకోని ఈ సంఘటనకి నేను షాకయ్యాను. అందరూ మాకేసి ఆశ్చర్యంగాను, అసూయ గాను చూడటం కనిపించింది. ఒక్క సారిగా నాకు కోపం, భయం కలిగాయి. వెంటనే, రమ్య పిలుస్తున్నా వినకుండా, బస్సెక్కి కూచున్నాను. ఆమె వచ్చి, “ఐయామ్ సారీ మోహన్, నువ్వు ఇలా రియాక్ట్ అవుతావని అనుకో లేదు.అయినా, సందర్భం వచ్చింది కనుక చెప్పేస్తున్నాను. నువ్వంటే నాకు చాలా యిష్టం. నేను నిన్ను ప్రేమిస్తున్నానని తెలియ జేయ టానికే, అలా చేసాను. నేను తప్పు చేస్తే క్షమించు. కాని, నా మీద కోపం మాత్రం ఉంచుకోకు. నా ప్రేమను కాదనకు...ప్లీజ్” అంటూ బ్రతిమాలింది.

ఆమె కళ్ళల్లోంచి కన్నీళ్ళు నా చేతి మీద ధారగా పడుతున్నాయి. అయినా, నేను నోరు విప్ప లేదు. ఆమె ఆ ప్రయాణంలో నాతో మాట్లాడాలని చాలా సార్లు ప్రయత్నించినా నేను స్పందించ లేదు. అందరెదురుగా ఆమె చేసిన పనికి నాకు మొదట కోపం వచ్చినా, ఆమె యిచ్చిన అపురూపమైన కానుకను మనసులో పదిలంగా దాచుకున్నాను. నా మీద ఎంత ప్రేమ లేక పోతే, అంత మందిలో అలా ప్రకటిస్తుంది? టూర్ నుంచి యింటికి వెళ్ళి పోయిన తరువాత కూడా, ఆ దృశ్యమే నా కళ్ళ ముందు మెదిలేది.

అదృష్టవశాత్తు, పరీక్షలు దగ్గర కావటంతో, మాకు ప్రిపరేషన్ హాలిడేస్ ఇవ్వడం వల్ల, మా పేర్లు మాత్రం కాలేజి గోడల మీదకు ఎక్క లేదు. పరీక్షలలో కూడా ప్రతి రోజూ రమ్య పలకరించేది. ఆమె మాట్లాడుతుంటే, సరిగా సమాధానం చెప్పక పోతే, “ ఏం! ఆ రోజు కోపం యింకా పోలేదా?” అని అడిగేది. అబ్బే, అదేం కాదు, అని నేను నవ్వుతూ సమాధానమిస్తే, “అయితే, మరో సారి ఇవ్వనా?” అంటూ కవ్వించేది.

పరీక్షలు అయి పోయాయి. ఆఖరి రోజు. ఫ్రెండ్స్ అందరూ ఆటోగ్రాఫ్ లు తీసుకుంటున్నారు. ఆడ పిల్లలు కూడా కొందరు నా ఆటో గ్రాఫ్ తీసుకున్నారు. రమ్య మాత్రం తీసుకో లేదు, నాకు ఇవ్వ లేదు. “ఆటో గ్రాఫ్ తీసుకుంటే, అంతటి తోనే దూరమై పోతావు. నువ్వెప్పుడూ, నా మనసులో స్థిరంగా ఉండాలి” అని అంది. అలా అంటూంటే, ఆమె కళ్ళల్లో నీళ్ళు. నాకూ ఆ క్షణంలో ఆమెతో నా మనసు విప్పి చెప్పుకోవాలనిపించింది. కాని, ఎంత ప్రయత్నించినా ధైర్యంగా, ఆమెతో, “నిన్ను ప్రేమిస్తున్నాను” అని అన లేక పోయాను.

పరీక్షలు తరువాతి శలవులలో ఒక సారి తను మా యింటికి వచ్చింది. నేను లేక పోవటంతో, మా చెల్లెలితో స్నేహం కలిపి, వాళ్ళ నాన్న గారికి చెన్నయ్ ట్రాన్సఫర్ అయిందని, నాకు ఇమ్మని అడ్రస్ ఇచ్చి వెళ్ళి పోయింది. ఆ తరువాత మళ్ళీ రమ్యను కలవ లేదు. జీవితంలో స్థిర పడిన తరువాత, ఆమెనే పెళ్ళి చేసు కోవాలని నా మనసులో స్థిర నిర్ణయం తీసుకున్నాను. కాని, ఆ విషయం రమ్యకు కూడా తెలియ పర్చ లేదు. తరువాత నేను, ఎం.సి.ఏ. చదువు కోసం, హైదరాబాదు వచ్చెయ్యటం, జాబ్ కూడా ఇక్కడే రావటం జరిగింది.

మళ్ళీ యిన్నాళ్ళకి, యిన్నేళ్ళకి రమ్య నుంచి ఉత్తరం. అదీ ప్రేమ పెళ్ళి వార్తతో. నాకు ఎంత ప్రయత్నించినా కళ్ళలో నీళ్ళు ఆగటం లేదు. మనసులో ముల్లు పెట్టి గుచ్చినట్లుంది. యింట్లో వాళ్ళు ఎన్ని సంబంధాలు తీసుకువచ్చినా కాదన్నాను. నా మనసులో రమ్య స్థానం వేరెవరికీ ఇవ్వ లేను. ఈ విషయం చూచాయగా చెల్లాయికి చెప్పాను. అదే, అమ్మా నాన్నలతో కూడా చెప్పి, రమ్యను కాంటాక్టు చేద్దామనుకునేంతలో ఈ ఉత్తరం. అప్పుడు, తను నన్ను ప్రేమిస్తున్నానని చెప్పినా, అవుననే ధైర్యం అప్పట్లో నాకు లేదు. నాకు ధైర్యం వచ్చి చెపుదామనుకొనే టైముకు ఆ అవకాశం లేదు. నా అంత దురదృష్టవంతులెవరూ ఈ ప్రపంచంలో ఉండరేమో అనిపించింది. గతంలోని నా పిరికి తనం మీద నాకు ఇప్పుడు అసహ్యం వేస్తోంది.

సరే...తల రాత ఇలా ఉంది...అయినా, రమ్య అదృష్టవంతురాలు...ఆమె ప్రేమను అర్ధం చేసుకో గలిగే వేరొక వ్యక్తిని పొంద గలిగింది. నా లాంటి పిరికి వాడు ప్రేమకు పనికి రాడు...అనుకుంటూ మంచం మీద వాలి, కళ్ళు మూసుకున్నాను. ఏ విషయం అమ్మ, నాన్నలకు చెప్పి, అనుమతి తీసుకోవడానికి ఊరు వెళదామనుకున్నానో, అందుకు అవకాశం ఇంక లేదు కదా...అని, సాయంత్రం రైలు ప్రయాణం కేన్సిల్ చేసుకొని, రమ్య చెప్పిన పెళ్ళి రోజుకు శలవు పెట్టాను..ఎలాగైనా చెన్నయ్ వెళ్ళాలి..తనను మనస్ఫూర్తిగా అభినందనలు అంద జేయాలి... ఒక మంచి స్నేహితునిగా నైనా తన దృష్టిలో నిలిచి పోవాలి...అని నా మనసును తేలిక పరుచుకోడానికి ప్రయత్నించాను.

* * *

అది చెన్నయ్ లో నుంగంబాక్కం ఏరియాలో ఉన్న రిజిస్ట్రార్ ఆఫీసు. టైము పదకొండు అవుతోంది. ఆఫీసు స్టాఫ్ కూడా అందరూ ఇంకా వచ్చినట్లు లేదు. “నన్ను ఇదే టైముకు రమ్మని, రమ్య ఇంకా రాలేదేంటి”?.. మరో అర గంట వెయిట్ చేసి, అందరూ నన్నే చూస్తూండటంతో బయటకు వచ్చి, కారిడార్ లోనుంచున్నాను. మరో ఐదు నిమిషాలు గడిచాయి. అప్పుడు చూసాను, ఎదురుగా ఉన్న చెట్టు కింద, ఎవరో ఒక అమ్మాయి ఆటో దిగి ఎదురుగా వస్తోంది. రమ్య కాదు కదా...అనుకొంటూ చూసాను.

అనుమానం లేదు...రమ్యే...గాలికి అల్లల్లాడుతున్న నీలాల కురులు, నెమలి కంఠం రంగు కాటన్ చీరలో....హుందాగా, హంసలా నడుస్తూ... నా కలల రాణి రమ్య... ఐదేళ్ళ తరువాత తనలో ఎంతో మార్పు...అందం ద్విగుణీకృతమైంది.. కాని, ఆ అమాయకత్వం, కొంటె తనం కలబోసిన ముఖం తాను ఎన్నటికీ మరవ లేడు,,.ఇంతటి సౌందర్య రాశిని పొంద లేక పోవడం నా దురదృష్టం... ఛీఛీ ఏమిటిలా ఆలోచిస్తున్నాను? తన పెళ్ళికని వచ్చి, ఈ చంచలమైన ప్రవృత్తి ఏమిటీ? అంటూ నన్ను నేనే నిందించుకుంటూ, నవ్వుతూ, రమ్యకు ఎదురు వెళ్ళాను. నన్ను పోల్చుకున్న రమ్య కళ్ళల్లో మెరుపు, ముఖంలో సిగ్గు, అంతలోనే ఆశ్చర్యం. ఊహించని అతిథి ఎదురుగా ఉన్నట్లు. ఇద్దరి కళ్ళల్లోనూ నీళ్ళు సుళ్ళు తిరుగుతున్నాయి. కాని, బయట పడటం ఎవరికీ ఇష్టం లేదు.

చివరికి, నేనే ధైర్యం చేసి, నోరు విప్పాను, “రమ్యా! ఎలా వున్నావు?” అని. ఎప్పటి లాగే చిలిపిగా నవ్వుతూ “ఇల్లా ఉన్నాను... ఏం? బాగోలేనా?” అంది. “నో..నో...యు ఆర్ ఆబ్సల్యూట్లీ ఫైన్” అన్నాను, ఏమి సమాధానం చెప్పాలో తెలియక. “సరే...సరదాగా అలా బెంచి మీద కూర్చుని మాట్లాడుకుందామా?” అంది రమ్య. ‘ఓకే..కాని, మీ వుడ్ బీ ఏరీ?” అన్నాను.అలా అంటుంటే, నా గుండెల్లో బాధ నాకు తెలుస్తోంది. “వుడ్ బీనా? ఇక్కడే ఉన్నారు కదా”...అంది, రమ్య. ఇక్కడా? ఎక్కడ? చుట్టూ చూసాను.“అయ్యో మొద్దూ, ఆయన్ని, నా ఎదురుగా పెట్టుకుని, ఎక్కడ వెతుకుతున్నావు?” అంది. “నీ ఎదురు గానా? ఎవరూ?...” విషయం అర్ధం కావటానికి కొంచెం సమయం పట్టింది. అర్ధమయ్యేటప్పటికి, నా మనసు రాగ రంజితమైంది.

“నిజంగా...నువ్వు చెప్పేది...?” అంటుంటే, అవును, అంటూ చూపులతోనే చెపుతున్న రమ్య కొంటె కళ్ళల్లో సిగ్గు దొంతరలు. నా మనసులోని బింకాన్ని, భయాన్ని పటాపంచలు చేస్తూ, “థాంక్యూ రమ్యా...ఈ జన్మకు లేదనుకున్న అదృష్టాన్ని నాకు కలిగించావు...ఐ లవ్యూ వెరీ మచ్...ఈ విషయం నీకు చెబుదామనుకునేంత లోనే...నీ నుంచి ఉత్తరం...దొంగా, నన్ను ఇక్కడ కూడా ఫూల్ ని చేసావు కదూ...” అంటూ తనని నా దగ్గరకు తీసుకున్నాను... గుండెల్లో గువ్వ పిట్టలా ఒదిగి పోయిన రమ్య కళ్ళల్లోంచి వెచ్చని కన్నీళ్ళు... అమృత ధారల్లా కురుస్తున్నయి... దగ్గరలో ఉన్న గుడి లోంచి గంటలు మోగాయి...శుభ సూచకంగా...వెడ్డింగ్ బెల్స్ అనిపించేట్లు.

మరిన్ని కథలు

Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న
ఓ breaking news
ఓ బ్రేకింగ్ న్యూస్
- బివిడి ప్రసాద రావు
chettu baadha
చెట్టు బాధ
- లక్ష్మీ కుమారి.సి