కమాను వీది కథలు - రామదుర్గం మధుసూధనరావు

రభణ్ణ అలా సైకిల్ తొక్కకుండా ఉంటే గుర్తుండేవాడే కాడు. ఆయప్పని హీరో అనీ ఎవరూ పిలిచేవాళ్ళమూ కాదు. దినామూ కాటన్ మార్కెట్ నుంచి కమాన్ కు సైకిల్ పై ఎట్లా వచ్చేవాడో తెలీదు కానీ మెయిన్ రోడ్డు నుంచి కమాన్లోకి తిరుగుతాడే...అబ్బ..! అప్పుడు సూడాల ఆయప్పని. భలే సోకుగా తొక్కేవాడ్లే! మాకైతే ఊరుకాల్వ ఉన్నట్టుండి మలిపినట్టు...కొండ పై గాలి బర్రున తిరుక్కున్నట్టు అనిపించేది. ముందు చక్రం సర్రున లోనికొచ్చేదా...ఎనకాల చక్రం పరిగెత్తేది. ఆయప్ప ఎంత శాని అంటే...తిప్పిండేది హాండిలా లేదా పెడలా తెలుసుకునేకి ఇడిసేవాడు కాదు. అసలు శరభణ్ణ మా కంట్లో పడకుండా ఉంటే ఎప్పటికీ గుంపులో గోవిందయ్య అయ్యేవాడు. కమానులో మా సైన్యం అరడజను. ఇంకా చింతకుంట వీధి, కుబ్మార వీధి నుంచి నలుగురైదుగురు పోగయ్యేవారు. కాబట్టి మాది నానావీధి సమితి. ఏ విషయమైనా తిట్టుకోకుండా రాజకీయాలు చేసుకోకుండా ఒప్పుకునే బాపతు కాదు. ఎవడైనా కొత్త విషయం చెబితే చాలు, ' పోలే పో...నువ్ చెప్పిందే ఇనాలా...' అనేవాళ్ళం. కానీ శరభణ్ణ విషయంలో ఎవడి నోట్లోనూ రెండోమాట రాలేదు. నిజానికి శరభణ్ణ సైకిల్ కొత్తగా తొక్కిందేమీ లేదు. మేమే ఆలస్యంగా చూసిండాం.

ఆ రోజు ఇంకా గుర్తే. సాయంకాలం ' బచ్చా ' సీరియస్ గా ఆడుకుంటున్నాం. ఆటలో సోల్తే పోయేది గోలీలే కాదు మర్యాద కూడా కద. కోట్టేకి సేతకాక నాలుగ్గోలీలు పోగొట్టుకుణ్ణోన్ని నలుగురు నాలుగు రకాలుగా చూస్తుంటే ఎలా వుంటుంది? ఆ నరకం పడినోడికే తెలుస్తుంది. ఈ కష్టం మాకొద్దు సామీ అనుకునే...ఎవడికి వాడు కుట్రలు చేసేవాడు. ఎవర్ని నమ్ముకోవాలో, ఎవడిపై కన్నేసి ఉంచాలో సులువుగా తెలిసేది కాదు. ఒకరికి తెలీకుండా మరొకరు ఎదుటోళ్ళతో జట్టు కట్టేవారు. మేం ఊర్కే వదులుతామా...కిందామీదా పడయినా సరే పట్టేసేవాళ్ళం. దొంగ ఎంత హుషారుగా ఉన్నా...దొరక్కపోడుగా...ముసుగు లాగేసే చిట్కాలు మస్తుగుండేవి. చేతికందే గోలీ వదిలేసి దూరంగా ఉండేదాన్ని పటేల్మని కొట్టడంలాంటి బద్మాష్ పనులకు పాల్పడితే వెంటనే పట్టేసేవాళ్ళం. మాకు తెలిసిపోయిందన్న విషయం మాత్రం బైటపెట్టుకునేవాళ్ళం కాదు. దొంగ దెబ్బకు దొంగదెబ్బే సరి అనేదే మా విధానం.

వేరే జట్టుతో అంటకాగినోడు కన్నా వాణ్ణలా రెచ్చగొట్టినోడే విలన్. వలసపోయినోడ్ని వీలైతే రెండుమూడు సార్లు వాడితో రాయబారం నడిపి చర్చల ద్వారా దారికి తెచ్చుకునేవాళ్ళం. ఇంతపెద్ద వ్యవహారంలో మునిగాక ఇక చుట్టుపక్కల చూసే ఓపిక తీరిక ఎక్కడ?

ముంగాలిపై కూర్చొని దూరంలో ఉన్న గోలీకాయకు రైటీస్* కొడుతున్నా. ఈలోగా కళ్ళముందు ఓ పెద్ద చక్రం గిర్రున అడ్డంగా తిరిగింది. తల విదిల్చి చూసేలోపు వెనక చక్రం నన్ను దాటేసింది. ఒకరి తర్వాత ఒకరిగా కూర్చొన్న మా మధ్యలో అలా పాములా వెళ్ళింది సైకిలని తెలుసుకోవడానికి రెండు నిముషాలు పట్టింది. సైకిల్ వెళ్ళినా దాని శబ్దం చెవుల్లో అలా గుయ్యిమంటూనే ఉంది. మాకు బాగా కోపమొచ్చేసింది...ఈయనేం మనిషిరా బాబూ...సైకిల్ ని రోడ్డుపై కాకుండా మనుషుల మీదే నడిపిస్తుండాడు. అరే...పిల్లలు ఆడుకుంటున్నారన్న జ్ఞానం కూడా లేదా ఏంటి? పెద్ద పుడింగ్ లా సైకిల్ ను ఇష్టారాజ్యంగా తొక్కేసేదేనా? మనసులో తిట్లే తిట్లు...! ఇప్పటిదాకా సైకిల్ పై వచ్చేవారు మమ్మల్ని చూడగానే మర్యాదగా బెల్ కొట్టేవారు. కొందరేమో ' ఈ అడ్డగాడిదలకు ఎప్పుడూ ఆటే...బుద్ధి లేకపోతే సరి అంటూ ప్రేమగా కసురుకునేవారు.

మరి ఈ మానవుడు ఎందుకిలా చేసాడు? ఆటభంగం తపోభంగం కన్నా పెద్ద నేరమని తెలీదా? ఇప్పటిదాకా కమానులో పిల్లల్ని తిట్టేవాళ్ళే కానీ ఆటల్ని ఇలా మధ్యలో చెడగొట్టినోళ్ళు లేరే...? ఎందుకిలా జరిగింది? పోనీ కొత్తోడా అంటే అదీ కాదు. ఎప్పట్నుంచో ఉన్నోళ్ళే.!ఈ లెక్కన శరభణ్ణ భార్య పార్వతమ్మే నయం. ఇంటిముందు ఆడుతుంటే ...ఏయ్...వెళ్ళండెళ్ళండి అనేదంతే....! ఇలా మాత్రం చేసేది కాదు. అదే వేరేవాళ్ళయితే సరిగ్గా అప్పుడే ఇంటిముందు బకెట్ నీళ్ళు పారబోసేవాళ్ళు. అంటే ఇప్పుడు ఆడుకోండ్రా చూస్తా అని సవాల్ విసరడం లాంటిదన్నమాట. కానీ ఇది మేం ఊహించింది కాదు. ఏం చేయాలో ...ఇంతలో రఘు, ' ఒరేయ్ శరభణ్ణ ఆట పాడు చేస్తే చేసినాడు గానీ...అబ్బా సైకిలు ఏం నడిపాడ్రా....' అన్నాడు. నాకు కంపరం పుట్టుకొచ్చింది. ఏరా తమాషాగా ఉందా ఏంటి? అరె, బంగారం లాంటి ఆటకు అడ్డు తగిలినోణ్ణి అడ్డంగా తిట్టకుండా ఎవరైనా ఇలా మెచ్చేసుకుంటారా మరీ అర్థం పర్థం లేకుండా? అంటూ ఒంటికాలిపై లేచా..' నిజమేరా బాబూ శరభణ్ణలా సైకిల్ నడిపినోన్నీ ఇప్పటిదాకా చూడ్లేదు. చక్రం భూచక్రంలా...హ్యాండిల్ ని విష్ణు చక్రంలా తిప్పేశాడ్రా..తొక్కితే అలా తొక్కాలి...' ఇంకోడు అందుకున్నాడు. ఈసారి నేనూ ఆలోచనలో పడ్డాను. వాళ్ళు చెప్పింది నిజమే అనిపించింది. ఈ విషయంలో అంత రాద్దాంతం అనవసరం అనిపించి నేనూ వారితోబాటు శరభణ్ణకు ఓటేశా..

కమానులో చాలామందికి సైకిళ్ళున్నా...అలా నడపడం వారివల్ల అయ్యేది కాదు మా నాన్న కమానులో రాగానే బెల్ కొట్టేవాడు. మలుపు తిప్పేముందు జాగ్రత్త కోసం అలా కొట్టినా...మాకది ప్రమాద సంకేతంగా వినిపించేది. ఎంత ఆటలో ఉన్నా ఆ బెల్ ధ్వని ఇట్టే కనిపెట్టేవాళ్ళం. ఒకవేళ నేను ఆదమరిచి ఉన్నా..పక్కనున్నోళ్ళు ...చిత్...చిత్..అంటూ హెచ్చరించేవారు. నాలుక బిగపట్టిలోనుంచి గాలిని కొద్దికొద్దిగా వదిల్తే వచ్చే ఆ శబ్దం ఎంత చిన్నగా ఉన్నా చెవులు ఇట్టే పట్టేసేవి..ఎంటనే ఇంట్లో వెళ్ళిపోయేవాడ్ని. నేనేకాదు మా జట్టులో ప్రతి ఒక్కరూ ఇలాంటి గుర్తులేవో పెట్టుకోవాల్సి వచ్చేది. ఇంత పకడ్బందీగా వ్యవహరించినా..అప్పుడప్పుడు మా ఖర్మ కాలి దొరికిపోయేవాళ్ళం.

శరభణ్ణ సైకిల్ ఎంత స్పీడుగా నడిపినా బెల్ అస్సలు కొట్టేవాడు కాదు. మేం అతడు చాలా పోటుగాడు అనుకునే కారణాల్లో ఇదే ప్రధానం తెల్లజుబ్బా పైజామా...బుగురు మీసాలు...సినిమా హీరో శోభన్ బాబులా రింగులేని చక్కని క్రాఫ్...నుదిటిపై అడ్డంగా తీర్చిదిద్దిన విబూతి పట్టీలు...నోట్లో ఎర్రగా పండిన తాంబూలం ...శరభణ్ణ సోగ్గాడులా కనిపించేవాడు. ఒక్కోరోజు ఒక్కోస్టైల్ లో కమాన్ లో వచ్చేవాడు. ఓసారి జోరుగా వర్షం..నోట్ బుక్ నుంచి చింపుకొచ్చిన తెల్లకాయితాలతో కత్తిప్[అడవ ...మామూలు పడవలు తయారు చేసి ఒక్కొక్కటి వదులుకుంటున్నాం. ఇంతలో శరభణ్ణ సైకిల్ పై సర్రుమంటూ వచ్చాడు. చక్రం పక్కనుంచి నీళ్ళు ఫౌంటేన్ లా మాపై పడ్డాయి. తలెత్తి చూశాం. అంతే..నోటమాట రాలేదు. శరభణ్ణ హుషారుగా ఓచేత్తో గొడుగు మరోచేత్తో హ్యాండిల్ పట్టుకుని అదే పాము స్టైల్ లో అటూ ఇటూ సైకిల్ ను మెలికలు తిప్పుతూ ఇంటిముందు ఆగాడు. ఈయనేం మనిషిరా బాబూ అని నోళ్ళు నొక్కుకున్నాం. శరభణ్ణ ఒంటిచేత్తో సైకిల్ నడిపి మా మనసుల్లో ఎక్కడో వెళ్ళిపోయాడు. చినుకులు నెత్తి నుంచి ముక్కుపై ..కనురెప్పల పై అలా ముత్యాల్లా రాలుతూంటే ఆ బిందువుల మధ్యలోంచి చూస్తున్న మాకు...హీరో అంటే వీడేరా అనిపించింది.

మమ్మల్ని ఆశ్చర్యపరచడం శరభణ్ణకు అలవాటైపోయింది. ఓసారి కూతురు మంజుని ఓ చేత్తో ఎత్తుకుని సేం టు సేం పాము స్టైల్ లో వచ్చి షాక్ ఇచ్చాడు. ఆహా నీకో దండమ్రా సామీ...ఏం తొక్కుతున్నావ్...అనుకున్నాం. శరభణ్ణ సైకిల్ తొక్కడమే కాదు ఆయన సీట్లో కూచోవడం, ఇంటిముందు అలా దిగడం, ప్రతీదీ గొప్పే అనిపించేది. శరభణ్ణ కుళాయి నుంచి నీళ్ళు తెచ్చినా అబ్బురం అనిపించేది. ఆయన రూటే సెపరేటు. అందరూ ఓ బిందె భుజానెట్టుకుని నీళ్ళు తెస్తే, ఆయన మాత్రం భుజంపై ఒకటి, చేత్తో మరొకటి తీసుకుని సుడిగాలిలా వేగంగా నీళ్ళు తెచ్చేవాడు. ఎంత వేగంగా కదిలినా అడుగులు మాత్రం తడబడేవి కాదు. ఇలా శరభణ్ణ చేసే ప్రతి పనిలో మాకు ఏదోక నైపుణ్యం కనిపించేది. రాత్రుళ్ళు సైకిల్ కున్న డైనమో ఏకబిగిన వెలుగుతోందంటే...అది ఖచ్చితంగా శరభణ్ణదే..మిగిలినోళ్ళ సైకిల్ లైటు గుడ్డి ఆముదపు దీపంలా మినుకుమినుకుమంటూండేది.

ఏ పండుగ వచ్చినా బైట కనిపించని శరభణ్ణ దీపావళిలో మాత్రం రెచ్చిపోయేవాడు. పండగంతా ఆయన ఇంటిముందే అన్నట్టుండేది. ఎన్నిరకాల టపాసులు పేలేవో. మా ఇళ్ళమ్నుందు అంతా ముగిశాక ఆయన మొదలెట్టేవాడు. బిరుసులు, భూచక్రం, విష్ణుచక్రం, లవంగాల సరాలు, డాంబర్ బాణాలు, కాకరొత్తులు రాకెట్లు ఒకటా రెండా...ఏవైనా సరే డజన్లకొద్దీ కాల్చేవాడు. వంకాయ, లక్ష్మీబాణం శబ్దాలతో కమాను దద్దరిల్లిపోయేది. ఆ హంగామా చూసి చుట్టుపక్కల వాళ్ళు ఓహో శరభణ్ణ మొదలెట్టాడా అనుకునేవాళ్ళు. మేమైతే అలా చూస్తూండి పోయేవాళ్ళం. ఈ ఉత్సాహమే ఓసారి నా కొంప ముంచింది. శరభణ్ణ పేద్ద చిచ్చుబుడ్డి చేత్తో పట్టుకుని వెలిగించేశాడు. అది అంతెత్తున పూవులు విరజిమ్ముతూ పైకెగురుతూంటే ఒకటే అరుపులు కేకలు. శరభణ్ణ గుబురు మీసాల చాటున ముసిముసిగా నవ్వాడు. నాకు తెలిసి ఆయప్ప నవ్వుతూండగా చూడడం అదే మొదటిసారి. కొద్దిసేపు తర్వాత మిగిలిన టపాసులు మాకు దక్కాయి. నిజానికి దీనికోసమే ఆ ఇంటిముందు బిచ్చగాళ్ళా తిరగాడతుండేవాళ్ళం. ఇదేం దరిద్రం రా..ఇప్పటిదాకా కాల్చారుగా..మళ్ళీ అక్కడ దేబరిస్తున్నారెందుకు అని ఇంట్లో పెద్దలు తిట్టినా లెక్క చేసేవాళ్ళం కాదు. చేతికందిన బాణాల్లో చిచ్చుబుడ్డి చూడగానే నాకూ ఆవేశమొచ్చేసింది. అచ్చం శరభణ్ణలా చేత్తో పట్టుకుని వెలిగించా.. నా తోటి పిలకాయలందరూ అరె చూడ్రా అంటూ గట్టిగా అరిచారు. ఆ చిచ్చుబుడ్డే సరిగ్గా వెలిగి ఉంటే నేనో హీరో అయ్యేవాణ్ణి. ఏం చేద్దాం, దురదృష్టంకొద్దీ అది కాస్త ఢాం అంటూ పేలింది. సీన్ కట్ చేస్తే ఇంట్లో చేతి బొటన వేలికి ఇంకు అంటించుకుంటూ నేను...తిట్లతో తలంటుతూ అమ్మ.

శరభణ్ణ ముచ్చట్లతోపాటు చదువుల కష్టాలూ పోగేసుకుంటున్న మాకు క్లాసులు పెరుగుతూ వచ్చాయి. అయినా మా ఆటల సమయాన్ని కాపాడుకుంటూనే ఉన్నాం. జట్టులో కొత్తవాళ్ళు వచ్చారు. వారికీ శరభణ్ణ గొప్పతనం కతలు కతలుగా చెప్పం. విచిత్రం ఏమిటంటే శరభణ్ణ ప్రభావం కేవలం సైకిల్ కే పరిమితం కాలేదు. వయసు పెరుగుతున్నకొద్దీ ఆయన వ్యక్తిగత విషయాలు తెలుసుకునేంతగా మా ఆసక్తి విస్తరించింది. హోస్పేట నుంచి వీళ్ళ వద్దకు వచ్చేసిన బామ్మర్ది శివు మాతో బాగా కలిసేవాడు. ఆయన పత్తి వ్యాపారం చేస్తాడనీ, జేబు నిండా డబ్బులుంటాయనీ,...వేలకు వేలు చేతులు మారుతుంటాయనీ..డబ్బంటే లెక్కలేదనీ ఇలా బావ గురించి చెప్పేవాడు.

బతుకు చక్రం గిరూన తిరుగుతోంది. ఈలోగా కాలేజి దగ్గర ఇల్లు కట్టుకుని మారిపోయాం. ఉద్యోగం పేరిట వేరే దేశాలు పట్టుకుని వెళ్ళాక ...సొంత ఊరు సమాచారం కరవైంది. బతుకు పోరాటంలో ఏరోజుకారోజు అలసిపోయే మనసు వేరే వ్యాపకం వద్దనే స్థితికి చేరుకుంది. అయినా ఓసారి కమాను చూద్దామని వెళ్ళాను. శరభణ్ణకు వ్యాపారంలో కోలుకోలేని దెబ్బ తగిలిందనీ, ఆర్థికంగా కుదేలైన ఆ కుటుంబం బెంగళూరు వలస వెళ్ళిందనీ, అక్కడ ఆయన ఆటో డ్రైవర్ అవతారమెత్తాడని తెలిసింది. ఒక్కసారిగా గుండెలో బెంగ గూడు కట్టింది. అంత పెద్ద నగరంలో అనామకుడుగా ఆటో నడుపుతూ ...దక్కిన పదోపరకతో బతుకుబండీడుస్తూ ...ఎందుకో శరభణ్ణని అలా కలలో కూడా ఊహించుకోలేకపోయాను. పాపం..ఈ కష్టం వచ్చుండాల్సింది కాదు అనుకున్నా,ఆ తర్వాత కొద్ది కాలానికే శరభణ్ణ పోయాడన్న మరో పిడుగులాంటి వార్త. రక్త సంబంధం లేకున్నా శరభణ్ణ మరణం పుట్టెడంత దు:ఖం మిగిల్చింది. ఇప్పటికీ తెల్లని దుస్తులతో అటూ ఇటూ ఊగుతూ సైకిల్ తొక్కుతున్న రూపమే కళ్ళముందు..విధి ఇంత కౄరంగా ఉంటుందా..మా బాల్యానికి ఓ అందమైన రంగు అద్దిన శరభణ్ణ పేదరికంతో పోరాడుతూ మరణించడం విషాదం కాకపోతే మరేంటీ? కొందరు అంతేనేనేమో. ఉన్నప్పుడూ గుర్తొస్తుంటారు ఆనందంతో..పోయాక గుర్తొస్తుంటారు ఆవేదనతో...!!

......................

బిరుసు - చిచ్చుబుడ్డి, రైటీస్- గోలీని గురిచూసి కొట్టడం

మరిన్ని కథలు

Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న
ఓ breaking news
ఓ బ్రేకింగ్ న్యూస్
- బివిడి ప్రసాద రావు
chettu baadha
చెట్టు బాధ
- లక్ష్మీ కుమారి.సి