తథాస్తు - నారంశెట్టి ఉమామహేశ్వరరావు.

tathaastu

వినాయక చవితి పండుగ రోజున భూలోక విహారానికి బయల్దేరాడు వినాయకుడు. మొట్టమొదట ఒక నగరంలో ప్రవేశించాడు వినాయకుడు. వాహనాలు వదులుతున్న పొగ ఎక్కువై వాయు కాలుష్యంతో గాలి పీల్చడం కష్టమై ఉక్కిరి బిక్కిరయ్యారు మూషిక, వినాయకులు.

“స్వామి... నాకు ఊపిరి ఆడడం లేదు. ఈ నగరంలో ప్రజలు ఎలా బ్రతుకుతున్నారో అని సందేహం కలుగుతోంది. ఇక్కడే రోజంతా గడిపితే మన లోకం వెళ్లలేము” అంది మూషికం.

“నా పరిస్థితీ అలాగే ఉంది. వెంటనే ముఖానికి తొడుగులు ధరించకపోతే ప్రమాదం తప్పదు” అని రెండు తొడుగులు సృష్టించి ఒకటి ధరించడమే కాకుండా మూషికానికీ ఇచ్చాడు వినాయకుడు.

“హమ్మయ్య... ఇప్పుడు కొంత నయం” ముఖానికి తొడుగు ధరించి అంది ఎలుక. ఆ ఉత్సాహంలో దగ్గరలోని ఇంటికి చేర్చింది వినాయకుడిని.

ఆ ఇల్లు భాగ్యవంతుడు బంగారయ్యది. బంగారు వినాయకుడి ప్రతిమకు పూజలు చేస్తున్నాడు బంగారయ్య. బంగారు పళ్ళెం నిండా ఉండ్రాళ్ళు, పాయసం, వడపప్పులు, పండ్లూ, పాలు దండిగా అమర్చి కుటుంబమంతా కూర్చుని పూజలు చేసారు. “దేవా... ఈ సంవత్సరం కూడా వ్యాపారంలో ఎక్కువ లాభాలు ప్రసాదించు. ఏడాది తిరిగేలోపు నా ఆస్తి రెట్టింపు చెయ్యు” అని మొక్కాడు బంగారయ్య. బంగారయ్య ఇంట్లో ఏమీ తినకుండానే బయటపడ్డాడు వినాయకుడు.

సుగంధపు వాసనలు వచ్చిన ఇంటికి దారి తీసాడు మూషికుడు. కమలయ్య అనే ఉద్యోగి ఇల్లు అది. వెండి వినాయకుడిని పూజిస్తున్నారు కమలయ్య కుటుంబ సభ్యులు. పూజ పూర్తి చేసి “స్వామీ...ఇప్పుడు జీతం మాత్రమే వస్తోంది. ఖర్చులు పెరిగాయి. అదనపు రాబడి కూడా వచ్చేలా దీవించు” అని మొక్కాడు కమలయ్య. కమలయ్య ఇంట్లో ఏమీ తినకుండానే మరో ఇంటికి వెళ్ళాడు వినాయకుడు.

ఈసారి శ్రేష్టమైన నెయ్యితో చేసిన ఉండ్రాళ్ళ వాసన ముక్కుకి సోకగా ఆ ఇంటికి వెళ్ళాడు వినాయకుడు. సూరయ్య అనే పూజారి ఇల్లు అది. ఇత్తడి వినాయకుడి విగ్రహానికి పూజలు చేసారు సూరయ్య దంపతులు. “మా పిల్లలకి చదువు మీద శ్రద్ధ లేదు. నువ్వే వాళ్ళని ఎలాగోలా ప్రయోజకుల్నిచెయ్యు. మా అమ్మాయికి గొప్ప ఇంటి సంబంధం అయ్యేలా దీవించు” అని మొక్కాడు సూరయ్య. సూరయ్య ఇంట్లో ఏమీ తినకుండానే బయట పడ్డారు మూషిక, వినాయకులు.

అప్పటి వరకు ఏమీ తినకపోవడం వల్ల మూషికానికి కడుపు కాలుతోంది. “స్వామీ .. ఏమీ తినకపోవడం వల్ల శక్తి చాలక మోయలేక పోతున్నాను” అంది మూషికం. “కాసేపు ఓపిక పట్టు” అన్నాడు వినాయకుడు నవ్వుతూ.

అలా చాలా పూజలు చూసిన వినాయకుడుకి తృప్తి కలగక నగరం నుండి పట్టణానికి బయల్దేరాడు వినాయకుడు. అక్కడ కూడా అంతే. శక్తి మేరకు పూజలు జరిపించి పెద్ద పెద్ద కోరికలు కోరే భక్తులతో విసుగు వచ్చింది వినాయకుడికి.

ఈ సారి పల్లెకు వెళ్ళాడు వినాయకుడు. ప్రశాంత వాతావరణంలో ఉన్న ఆ వూరు నచ్చింది. ఎత్తైన చెట్ల మధ్య ఒక పూరిల్లు కనబడితే అక్కడకు వెళ్ళారు. మట్టి వినాయకుడి బొమ్మకు పూజలు చేస్తున్నాడు ఒక రైతు. చెట్లకు కాసిన సీతాఫలాలు, అరటి పండ్లు, పొలంలో పండిన చెరకు గడలు నైవేద్యం పెట్టాడు రైతు. దొడ్లో పూసిన పూలుతో పూజించారు రైతు దంపతులు.

“దేవుడిని ఏమి కోరారు?” అని అడిగింది రైతు భార్య.

“మన అవసరాలు దేవుడికి తెలుసు. వేరుగా ఎందుకు కోరాలి?” అని అడిగాడు రైతు.

“అడగందే అమ్మయినా పెట్టదు. మీకేం కావాలో మీరే అడగాలి” అని భర్తను ప్రోత్సహించింది రైతు భార్య.

“‘శ్రమ పడేందుకు తగిన శక్తి ప్రసాదించు! కష్టానికి తగిన ప్రతిఫలం ఇవ్వు” అని కోరాడు రైతు.

“అదేమి కోరిక? మీ కోసం ఏదైనా అడగండి” అంది రైతు భార్య.

“సమయానికి వర్షాలు కురిపిస్తే చాలు. నా పొలంలో పండిన పంటలు ప్రజలకు ఆహారంగా అందితే అదే పదివేలు. అందరికీ ఆరోగ్యం ప్రసాదించు” అని ఈసారి కోరాడు రైతు.

రైతు భార్య తల పట్టుకుంది. “తనకేం కావాలో కోరడం కూడా తెలియని ఈయనను నువ్వే కాపాడు” అంది రైతు భార్య. “తథాస్తు” అన్నాడు వినాయకుడు.

“ఖరీదైన విగ్రహమూ పెట్టలేదు. మిగతా వాళ్ళలా మంచి ఫలహారమూ పెట్టలేదు. అయినా రైతుని దీవించారు. అలా చేసారేం స్వామీ?” అని అడిగింది మూషికం.

“కపటం లేని మనసుతో పొరుగు వారి క్షేమం కోసం ప్రార్ధించాడు రైతు. అలాంటి వారు కొందరైనా లోకంలో ఉండాలి. అందుకే దీవించాను” అన్నాడు వినాయకుడు.

రైతు పెట్టిన ఫలహారాలు తృప్తిగా ఆరగించి మరో ఇంటికి బయల్దేరాడు వినాయకుడు. కడుపు నిండా ఫలహారం తిని ఉత్సాహంగా వినాయకుడిని మోసాడు మూషికుడు.

మరిన్ని కథలు

Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న
ఓ breaking news
ఓ బ్రేకింగ్ న్యూస్
- బివిడి ప్రసాద రావు
chettu baadha
చెట్టు బాధ
- లక్ష్మీ కుమారి.సి