విజయ్ గాడు అంతగా నవ్వడం నేనెప్పుడూ చూడలేదు.
చిన్న చెరువు తూము, చప్టామీద పడి దొర్లుతూ నవ్వుతూనే ఉన్నాడు.
ఆ నవ్వుకు కారణం ఉంది.
ఇది చెప్పడానికి ముందు మాగురించి కొంత చెప్పాలి. మా జట్టులో నలుగురం మిత్రులం ఉన్నాం. సీనియర్ విజయ్ గాడే. అంటే పదో తరగతిలో రెండు సార్లు, ఇంటర్ మరో రెండు సార్లు డింకీలు కొట్టినవాడు. నేను పదో తరగతి ఒకసారి, ఇంటర్‌లో ఒకసారి బోల్తా కొట్టాను. మిగిలిన ఇద్దరిలో ఒకడు కోటేశ్వరరావు. మరొకడు రాంబాబు. కోటేశ్వరరావుకు చిన్నప్పటి నుంచి చదువు అబ్బలేదు. ఇక రాంబాబు అందరికన్నా ఎక్కువ చదువుకున్నవాడు. డిగ్రీ ఐదో సంవత్సరం.
మా ఊరి పేరు చిన్న రేజేరు. చిన్నూరు అంటారు. పెద్ద రేజేరు అదే పెద్దూరు గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరంలోనూ, పార్వతీపురం టౌన్‌కు పది కిలోమీటర్ల దూరంలోనూ ఉంది. చిన్నూరు- పెద్దూరుకు మధ్య మంచి నీటి చెరువు ఉంది. చెరువు గట్టుపై, రావిచెట్టు కింద తూము చప్టాపైనే మా మకాం. దాదపు రోజంతా అక్కడే ఉంటాం. చిన్నూరు నుంచి పెద్దూరుకు వెళ్లాలన్నా, పార్వతీపురం బస్సు ఎక్కాలన్నా ఈ చెరువు గట్టుపై నుంచే వెళ్లాలి. వచ్చీ పోయే జనాలతో కబుర్లు, చెరువులో చేపలతోనూ, మంచినీటికి వచ్చే పాపలతోనూ పొద్దంతా కాలక్షేపం.
మా బ్యాచ్ అంటే ఊళ్లో జనాలకు హడల్. మా లీడర్ విజయ్ అని చెప్పాను. ఎవడి పేరు చెబితే జనాలు చెవులు, కళ్లు, ఇంటి తలుపులు మూసుకుంటారో వాడే విజయ్ . అంత అల్లరి చేస్తుంటాడు.
ముచ్చటగా మూడు వీధలతో అందమైన ఊరు మాది. ఏ చిన్న వస్తువు కావాలన్నా పార్వతీపురం వెళ్లాల్సిందే. అందుకే మా ఊర్లోవాళ్లందరికీ పార్వతీపురంలోనే పొద్దు పొడుస్తుంది. అపవిడప్పుడూ పెద్దూరు వ్యాపారస్తులు తోపుడు బండ్లపై సరుకులు తెచ్చి చిన్నూరులో అమ్ముతూంటారు.
ఆ రోజు గాజుల నరసయ్య ఆయాస పడుతూ తోపుడు బండిని అతి కష్టం మీద చెరువు గట్టుపైకి తోసుకు వచ్చాడు. బాన పొట్టతో, నెక్కరుపై నల్లగా పొట్టిగా ఉంటాడు. రంగు రంగుల గాజులతో అందంగా అలంకరించుకుని తీర్థానికి బయల్దేరిన అమ్మాయిలా ఉంది బండి. తూపు చప్టాపై రాంబాబుగాడి ఒడిలో తల పెట్టుకుని శేషశయ్యపై మహా విష్ణువులా పడుకుని సినిమా కబుర్లు చెబుతున్నాడు విజయ్ . మరో పనేం -లేకపోవడంతో పాత చింతకాయ పచ్చడి అయినా ఆ గీతామృతాన్నే గ్రోలుతున్నాం.
గాజుల నరసయ్యను చూడగానే విజయ్ కు ఎక్కడలేని హుషారు వచ్చింది - ఏం మావా మీ అమ్మాయి పెద్ద మనిషి అయిందటగదా అని అరిచాడు.
మేమంతా పెద్దగా నవ్వేశాం.
నరసయ్య ముఖం మాడిపోయింది - మీ నాన్న చచ్చినా నీకు బుద్ది రాలేదురా.. ఏంత మంచివాడు! కడుపున చెడబుట్టావ్. ముసల్దాని కష్టంతో షికార్లు చేస్తున్నావ్. సిగ్గులేని జన్మ.. చక్కగా కాలేజీకి వెళ్లి చదువుకోక ఈ చెరువుగట్లంట.. ఈ యెదవలతో ఏంట్రా దరిద్రం.. అంటూ ముక్క చివాట్లు పెట్టాడు.
మేం నవ్వుతూనే ఉన్నాం. ఇటువంటివి మాకు మామూలే. ఇలాంటి తిట్లు తినకపోతే మాకు రోజు గడిచినట్టు ఉండదు. నరసయ్య ఉడుకెత్తి పోవడం విజయ్ కు మరింత హుషారెత్తించింది - వరసగదా అందుకే అడిగాను మావా! అన్నాడు.
ఛీ.. సిగ్గులేదు. బేవార్స్ యెదవలు అంటూ గట్టిగానే తిట్టాడు. నరసయ్య తోపుడు బండిని చెరువు గట్టుపై అమ్మవారి విగ్రహం ఎదుట పెట్టాడు. చెరువుగట్టు వాలులోకి బండి జారిపోకుండా అతి కష్టం మీద చిన్న రాయి వెతికి చక్రం కింద సపోర్టుగా పెట్టాడు. రెండు రకాల గాజులు తీసి బిజినెస్ బాగా సాగాలని గట్టు మీద అమ్మవారికి సమర్పించడానికి వెళ్లాడు.
బండి మాకు ఎదురుగా సరిగ్గా పదిహేను అడుగుల దూరంలో ఉంది. విజయ్ ముఖం వింత కాంతితో మెరిసింది - రెండు రాళ్లు అందుకోండిరా అన్నాడు చేయిసాచి.
చేతికందిన రెండు రాళ్లు తీసి వాడికిచ్చాం. లేచి కూర్చుని పొజిషన్ తీసుకుని గాజుల బండిపైకి విసిరాడు. మొదటిరాయి గురి తప్పింది. రెండో రాయి సరిగ్గా గాజుల బండి చక్రం కింద నరసయ్య పెట్టిన చిన్న సపోర్ట్ రాయికి బలంగా తగిలింది. అంతే.. బండి దడదడమని చెరువు గట్టు నుంచి కిందికి దొర్లి కాలువలో పడింది. బండి పూర్తిగా విరిగిపోయింది. గాజులు కాలవలోనూ, పంట పొలాల్లోనూ చెల్లా చెదురుగా పడిపోయాయి.
నా బండి... నా బండి అంటూ గుండెలు బాదుకుంటూ బండి వెనుక పరిగెత్తాడు నరసయ్య. బాన పొట్ట వేసుకుని పరుగులు తీస్తూంటే మాకు నవ్వాగలేదు. నరసయ్య తిట్లు, శాపనార్థాలు మాకు వినిపించడం లేదు. ఇక విజయ్ గాడి సంగతి చెప్పనవసరం లేదు. కడుపు పట్టుకుని, కళ్లవెంట వస్తున్న నీళ్లను తుడుచుకుంటూ ఒకటే నవ్వు. ఆ రోజంతా ఆ సంఘటన గురించి చెప్పుకుంటూ నవ్వుతూనే ఉన్నాడు.
విజయ్ గాడు అంతగా నవ్వడం నేనెప్పుడూ చూడలేదు.
00000 0000 0000
రాత్రి ఎనిమిది దాటుతోంది. దశమి రాత్రి కావడంతో వెన్నెల విరగకాస్తోంది. చెరువు గట్టు, చుట్టూ పంట పొలాలు కనువిందు చేస్తున్నాయి. చిన్నూరు లోని సుబ్బారావు బెల్ట్ షాపులో బీర్లు తెచ్చుకుని నెమ్మదిగా సిప్ చేస్తున్నాం. మత్తుతోబాటు మాటలు పెరుగుతున్నాయి.
ఏం దరిద్రపు ఊరురా బాబూ..! ఒక సినిమా లేదు. ఒక షికారు లేదు. బీరు కొట్టిన తర్వాత సినిమా చూస్తే ఆ థ్రిల్లే వేరు. అందుకే సాయంత్రమే పార్వతీపురం వెళదాంరా అన్నాను.. నిష్టూరంగా అన్నాడు కోటి.
వెంటనే బీర్ బాటిల్ పట్టుకుని స్టయిల్‌గా లేచి నిలుచున్నాడు విజయ్ - ఏం నీకిప్పుడు సినిమా చూడాలని ఉందా? అని అడిగాడు.
ఏం చూపిస్తావా? పార్వతీపురం వెళ్లాలి. బస్సు లేదు. ఆటో లేదు. నీకూ నాకూ బండి లేదు. ఏం బతుకుల్రా మావా.. అంటూ ఏడుపు మొదలుపెట్టాడు కోటి.
నీ కెందుకు? ఐదు.. ఐదంటే ఐదు నిముషాల్లో అరేంజ్ చేస్తాను... ఒకేనా? అన్నాడు. సెల్ ఫోన్ తీసి 108 అంబులెన్స్
కు ఫోన్ చేశాడు - నా పేరు విజయ్ . చిన్నూరు నించి మాట్లాడుతున్నాను. మా వాడికి అపెండిసైటిస్ నొప్పి .. అర్జంట్ అని చెప్పాడు.
మిగిలిన ముగ్గురం తెల్లబోయాం. తర్వాత చెప్పాడు విజయ్ . కోటిగాడు కడుపు నొప్పి నటిస్తాడు. ఆస్పత్రిలో పది నిముషాలు పడుకుని లేచి సినిమాకు వెళ్లిపోతారు. అదీ ప్లాన్!
108 ఇలా కూడా ఉపయోగపడుతుందని నేను కలలో కూడా ఊహించలేదు.
పది నిముషాల్లో అంబులెన్స్ వచ్చింది - వెంట ఒకరు చాలు అన్నాడు అంబులెన్స్ టెక్నిషియన్. కానీ మిగిలిన ఇద్దరు కూడా రావాలని కోటి పట్టుబట్టాడు.
టెక్నిషియన్ కు అనుమానం వచ్చింది -సర్ నిజంగా అపెండిసైటిస్ నొప్పి అయతేనే రండి. పెద్దూరులో ఒక హార్ట్ పేషెంట్ పరిస్థితి సీరియస్‌గా ఉందట! అన్నాడు.
అయితే..? మాది సీరియస్ కాదా.. మేం అబద్దమాడుతున్నామా? తగువుకు దిగాడు విజయ్. మరో మాట మాట్లాడకుండా టెక్నిషియన్, డ్రైవర్ అంబులెన్స్ ఎక్కేసారు. మరో పదిహేను నిముషాల్లో పార్వతీపురం ఆస్పత్రి ముందు ఆగింది అంబులెన్స్. ఆస్పత్రి లోపలి నుంచి ఇద్దరు నర్సులు పరిగెత్తుకుంటూ వచ్చారు.
కోటి అంబులెన్స్ దిగుతూ -నొప్పి కొద్దిగా తగ్గింది మావా అన్నాడు.
టెక్నిషియన్ నిలదీసాడు -సర్... సినిమాకే కదూ. అంబులెన్స్ ను ఇలా వాడుకోవడం తప్పు కదా? అన్నాడు.
కోపంతో విజయ్ ముఖం ఎర్రబడింది -ఏంట్రా తప్పొప్పులు మాకే చెబుతున్నావా? అన్నాడు కోపాన్ని కంట్రోల్ చేసుకోడానికి ప్రయత్నిస్తూ.
కాద్సార్ చదువుకున్న మీరే.. అంటూ టెక్నిషియన్ ఏదో చెప్పబోయాడు. గట్టిగా ఈడ్చి కొట్టాడు విజయ్. ఆ దెబ్బకు నిశబ్ద నిశీధిలో ఆస్పత్రి గోడలు ప్రతిధ్వనించాయి - నీ డ్యూటీ నువ్ చెయ్... ఎక్‌స్ర్టాలొద్దు వేలు చూపిస్తూ వార్నింగ్ ఇచ్చినట్టు అరిచాడు విజయ్.
నర్స్‌లతో సహా అంతా నివ్వెరపోయి నిల్చున్నాం.
చెంప పట్టుకున్న టెక్నిషియన్ మొదట తేరుకున్నాడు - సార్.. మీరు కొట్టారని నేను బాధపడటం లేదు. మీరు చేసిన పనివల్ల అక్కడ హార్ట్ పేషెంట్ విలువైన ప్రాణాలు పోయాయి. సినిమా రేపు చూడొచ్చు. పోయిన ప్రాణాలు తిరిగి రావు కద్సార్.. అన్నాడు. పేషెంట్ చనిపోయిన సమాచారం సెల్ ఫోన్ ద్వారా అప్పటికే వాళ్లకు తెలిసిపోయింది.
కానీ జీవితంలో మొదటిసారి చూశాను శాంతంతో విధిని తప్ప అవమానాన్ని లెక్క చేయని ఉద్యోగిని.
విజయ్ గాడు దారుణమైన తప్పు చేశాడనిపించింది.
ఆస్పత్రి నుంచి బైటకి రాగానే - తప్పు చేశామేమోరా.. అన్నాను.
మననే కాదు. ఇక ఎవర్నీ క్వశ్చన్ చేయడు. వాడి డ్యూటీ వాడు చేయాలి. అంతే.. అన్నాడు విజయ్. వాడి లాజిక్ ఎప్పుడూ డిఫరెంట్‌గానే ఉంటుంది. కానీ నాకు మాత్రం సినిమాకు వెళుతున్న ఆనందం ఆవిరైపోయింది. సినిమాపై దృష్టిపెట్టలేక పోయాను.
0000 0000 0000
ఆ రోజు గ్రామ దేవత పండుగ.
మా నలుగురిలో ఎవరి దగ్గరా దమ్మిడీ లేదు. ఇంటి దగ్గర ఎలాగూ నాన్ విజ్ చేస్తారు. తలా ఒక బీరుకు డబ్బు సంపాదించాలి. ఎదో ఒకటి చేయాలి. అన్నింటికి సమర్థుడు విజయ్. నేను చూసుకుంటాను.. అన్నాడు.
అంతా సుబ్బారావు బెల్ట్ షాపు దగ్గరికి వెళ్లాం. ఊరంటా బంధువులు ఉండటంతో బెల్ట్ షాప్ కూడా రద్దీగా ఉంది.
పండగపూట అరువు లేదు అని ఖండితంగా చెప్పాడు సుబ్బారావు -గతంలో బాకీ వేయి రూపాయలు రావాలి. ఇలా అయితే నేను షాపు వదిలేసి వెళ్లిపోవాలి.. అని విసుగ్గా కొసరు వేసాడు.
బీర్లు ఇవ్వడని అర్థమైంది. విజయ్ తోబాటు బైటికి వచ్చేశాం. ఆ పండగ నాలిక తడవకుండానే గడిచిపోతుందని తేలిపోయింది.
రాత్రి పది గంటల సమయంలో ఇంటికి వెళుతూ వీధి చివరి నాగేషుగాడి చెప్పులు సుబ్బారావు ఇంటి ముందు విడిచి వెళ్లాడు విజయ్.
రాత్రి పదకొండు దాటిన తర్వాత బెల్ట్ షాపు మూసి వచ్చిన సుబ్బారావు ఇంటి ముందు నాగేషుగాడి చెప్పులు చూసి ఆగ్రహోదగ్రుడయ్యాడు. సుబ్బారావు అసలే అనుమానం మనిషి. నాగేషుగాడు ఊర్లో షోకిల్లా రాయుడిగా పేరున్నవాడు. పండగపూట ప్రళయమే సంభవించింది. రాత్రికి ఊర్లో ఎవరికీ నిద్ర లేదు..
మరునాడు సుబ్బారావు భార్యను పుట్టింటికి పంపించేశాడు.
ఈ సంఘటన మూడు నాలుగు రోజులపాటు నవ్వులు పంచింది.
0000 0000
విజయ్ గాడి అమ్మకు బాగోలేక పోవడంతో నాలుగు రోజులుగా పార్వతీపురం అస్పత్రి చుట్టూ తిరుగుతున్నాడు. మేమూ వాడితోనే అటూ ఇటూ తిరుగుతున్నాం. ఆ రోజు పార్వతీపురం నుంచి రావడం లేటయింది. అప్పటికే చీకటి పడుతోంది. కోటీశ్వరరావు ఇంటి ముందు జనం గుమిగూడి ఉన్నారు. ఏం జరిగిందన్న ఆందోళనతో మేం పరుగున వెళ్లాం. ఇల్లంతా జనంతో నిండిపోయి ఉంది. లోపలి నుంచి కోటిగాడి తల్లి ఏడుపు ఆర్తనాదంలా వినిపిస్తోంది.
జనం మధ్యలో చాపమీద పడుకో బెట్టి ఉంది కోటిగాడి చెల్లె రమ్య. ఉరి పోసుకుని చనిపోయింది.
ఏం జరిగిందో క్షణాల్లో అర్థమై పోయింది నాకు. రెండు రోజుల క్రితం రమ్యతో పెళ్లి ఖాయం చేసుకోడానికి రాజాం నుంచి మగ పెళ్లి వారు వచ్చారు. ముహూర్తాలు పెట్టుకోడానికి పిల్ల తరపున ఊర్లో ఒకరిద్దరు పెద్దలు ఉంటే బాగుంటుందన్నారు. కానీ కోటిగాడి ఇంట్లో కార్యం అనే సరికి ఏ పెద్ద మనిషీ ముందుకు రాలేదు. నీ కొడుకు నిర్వాకం వల్ల కొంపలు కూలిపోతున్నాయ్.. నీ ఇంటి కొస్తే జనం ముఖం మీద ఉమ్మేస్తారు.. అంటూ ముఖం మీదే రానని చెప్పారు. ఊర్లో కాస్త పేరున్న ప్రతి పెద్దనూ కోటిగాడి తండ్రి రామునాయుడు బతిమాలాడు. తిట్లు ఇంటికి తెచ్చుకున్నాడు తప్ప ఒక్క పెద్ద మనిషిని ఇంటికి రప్పించుకోలేక పోయాడు.
మగ పెళ్లివారికి పరిస్థితి అర్ధమై పోయింది. ఒక్క పెద్దమైనిషైనా పెళ్లి పెద్దగా రాలేదంటే ఎంత నీచమైన కుటుంబమో అంటూ ముఖం మీదనే చెప్పి మగ పెళ్లివాళ్లు వెళ్లిపోయారు. పీటల మీదికి వెళ్లాల్సిన కోటిగాడి చెల్లి పెళ్లి అలా చెడిపోయింది.
జనం గుసగుసలు, తిట్లు... శాపనార్థాలు స్పష్టంగా వినబడుతున్నాయి. అన్నీ కోటిగాడిని, వాడి స్నేహితులమైన మమ్ముల్ని.
కూతురు మీద పడి ఏడుస్తున్నరామునాయుడు కోటిగాడిని, మమ్మల్ని చూసి కోపంతో మండిపోయాడు. మీ మూలంగానేరా..నా బిడ్డ చచ్చిపోయింది. మీకు అదేం అన్యాయం చేసిందిరా.. పొండిరా పొండి.. కళ్లకు కనిపించకుండా వెళ్లిపొండి... అంటూ రెండు చేతులు ఎత్తి నమస్కరించాడు.
నిజమే .. మా మూలంగానే పెళ్లి కాలేదు.. కాదన్న అవమాన భారంతో చిట్టి తల్లి రమ్య చనిపోయింది. కోటిగాడి ఆకతాయితన ఆ ఇంటి మహలక్ష్మి ఉసురు తీసుకుంది.
జనం చూపుల్లో ఛీత్కారాన్ని తట్టుకోలేక, వాళ్ల కళ్లలోకి చూడలేక తల దించుకుని బైటకి నడిచాను.
రెండు రోజులకే జనం అంతా మరచిపోయారు. కానీ మా ఇంట్లో మా అమ్మా నాన్న నాతో మాట్టాడటం మానేసారు. కోటిగాడు పిచ్చోడై తిరుగుతున్నాడు.
విజయ్ తల్లికి కొంత బాగుండటంతో ఇంటికి తీసుకు వచ్చారు. కానీ అనారోగ్యం అలాగే కొనసాగుతోంది. మా కలయికలో ఆబ్సెంట్‌లు ఎక్కువయ్యాయి.
ఆరోజు రాత్రి కోటిగాడు, రాంబాబు, నేను చెరువు తూము చప్టామీద కూర్చుని కొత్త సినిమా కబుర్లు చెప్పుకుంటూ పది గంటల వరకూ గడిపాం. తర్వాత ఇళ్లకు వెళ్లబోతూండగా విజయ్ గాడు పరిగెత్తుకుంటూ వచ్చాడు -ఒరేయ్ మా అమ్మకు సీరియస్‌గా ఉందిరా.. రండిరా! అన్నాడు.
అంతా కలిసి వాడి ఇంటికి వెళ్లాం. విజయ్ తల్లి మంచంపై ఛాతి పట్టుకుని మెలికలు తిరిగిపోతోంది. పరిస్థితి అర్థమై పోయింది. గుండె నొప్పి.. దేనికైనా దారితీయవచ్చు.
ఒరేయ్.. 108కి ఫోన్ చేశావా..? అడిగాను.
చేశాను.. బయల్తేరుతున్నామన్నారు..
అంబులెన్స్ రాగానే విజయ్ గాడి తల్లిని ఎక్కించడానికి అన్ని సర్థుకుని రెడీగా ఉన్నాం. విజయ్ తల్లి పరిస్థితి చెప్పనలవి కాకుండా ఉంది. గుండె నొప్పితో మంచంలో ఉండలు చుట్టుకు పోతోంది. చూడలేక 108కి ఫోన్ చేశాను -చిన్న ఊరేనా.. విజయ్ కదా? ఆ రోజు హస్పిటల్ దగ్గర కొట్టాడు. గుర్తుంది. వస్తున్నాం.. అన్నాడు టెక్నిషియన్.
అవాక్కయి పోయాను. అంబులెన్స్ లాగ్ బుక్‌లో ఫోన్ చేసిన ప్రతి వ్యక్తి అడ్రస్ ఫోన్ నెంబర్ ఉంటాయి. తనను కొట్టిన వ్యక్తి ఫోన్ నెంబర్‌ను సేవ్ చేసుకోవడం, గుర్తుంచుకోవడం పెద్ద కష్టమైన పని కాదు. రేపు అనేది ఉంటుందని నమ్మే వ్యక్తుల్లో ఉండే శాంత గుణమే ఆ రోజు దెబ్బతిన్న టెక్నిషియన్‌లో కనిపించింది.
నెమ్మదిగా నాలో అలజడి ప్రారంభమైంది. అంబులెన్స్ వాళ్లు ప్రతీకారానికి దిగితే ప్రమాదం. నా అనుమానాలను విజయ్ తో చెప్పలేదు. వస్తున్నారట! అని మాత్రం అనగలిగాను.
గంట దాటినా 108 జాడ లేదు.
విజయ్ లో సహనం నశించిపోయింది. కానీ అటువైపు నుంచి అదే సమాధానం -బయల్దేరాం ... వస్తున్నాం
ఇంకెంతసేపు. తొక్కలో పార్వతీపురం నుంచి రావడానికి గంటా? అని అరిచాడు విజయ్.
మధ్యలో ఉన్నాం సర్.. రోడ్డుకు అడ్డంగా ఎవరో చెట్లు నరికి వేసారు. నక్సలైట్లు అనుకుంటా.. అన్నాడు అంబులెన్స్ టెక్నిషియన్.
త్వరగా వచ్చేయండి ఇక్కడ సీరియస్ అని విసుగ్గా ఫోన్ పెట్టేసాడు విజయ్.
మరో గంట గడిచిపోయింది. కానీ 108 జాడలేదు. అర్థరాత్రి దాటిన తర్వాత ఇక 108 రాదని అర్థమై పోయింది. విజయ్ కొట్టినందుకు ఇలా సహాయ నిరాకరణ చేస్తున్నారు.
అప్పటికే విజయ్ తల్లికి గుండె నొప్పి ఎక్కువై కోమాలోకి వెళ్లిపోయింది.
ఎద్దుల బండిపై విజయ్ తల్లిని పార్వతీపురం ఆస్పత్రికి తరలిద్దామని ప్రయత్నించాం. రెగ్యులర్‌గా పార్వతీపురానికి బండి కట్టే కుమార స్వామి ఇంటికి వెళ్లి తలుపు తట్టాను. షర్ట్ చేత్తో పట్టుకుని నిద్ర మత్తులో బైటికి వచ్చి పద అంటూనే పేషెంట్ ఎవరు? అని అడిగాడు.
విజయ్ గాడి తల్లి చెప్పాను.
గోడ ఎదురుగా వచ్చినట్టు ఆగిపోయాడు కుమారస్వామి. నిద్ర మబ్బులుగా విడిపోయింది - మీ నాన్న ముఖం చూసి లేచి వచ్చాను. నువ్వు తెచ్చిన యెదవ బేరం ఇదా? యెల్లెల్లు..అని కసురుకున్నాడు. ఎడ్ల బండ్లున్న మరో ఇద్దరు ఇళ్లకు వెళ్లాం. బండి కట్టడానికి కాదు కదా అంత చిన్న ఊర్లో సాటి మనిషికి ఆపద వచ్చిందంటే వచ్చి చూడటానికి కూడా ఎవరూ ఆసక్తి చూపలేదు.
ఊర్లో జనం మా బ్యాచ్‌ను ఎంతగా అసహ్యించుకుంటున్నారో తెలిసింది.
విజయ్ కు కూడా విషయం అర్థమైంది -ఒరేయ్ చెప్పండిరా.. పొరపాటే చేశాను. ఎన్నో పొరపాట్లు చేశాను. మనం అంబులెన్స్‌లో సినిమాకు వెళ్లడం తప్పే. వాడిని కొట్టడం కూడా తప్పే. సారీ చెబుతున్నాను. వాడి కాళ్లు పట్టుకుంటానని చెప్పండిరా.. మా అమ్మను హస్పిటల్‌కు తీసుకువెళ్లమని చెప్పండిరా.. అంటూ ఏడుస్తున్నాడు.
అప్పటికే తెల్లవారిపోయింది.
108 మాత్రం రాలేదు.
విజయ్ తల్లి బతుకు తెల్లారిపోయింది.
పశ్చాత్తాపం అగ్నిలా దహించి వేస్తూంటే తల్లి మీద పడి గుండెలు పగిలేలా రోదిస్తున్నాడు విజయ్ .
విజయ్ గాడు అంత దీనంగా ఏడవడం నేనెప్పుడూ చూడలేదు