పూర్వం మగధ దేశాన్ని కీర్తి సింహుడు అనే రాజు పరిపాలించేవాడు. ఆయన రాజ్యంలో శ్రీపాలుడు మంత్రిగా పని చేసేవాడు. కీర్తి సింహుడి తండ్రి శూరసింహుడి హయాము నుండీ శ్రీపాలుడు మంత్రిగా ఆ దేశానికి సేవలు అందిస్తూ ఉన్నాడు. శూరసింహుడి మరణానంతరం ఆయన ఏకైక కుమారుడు కీర్తి సింహుడికి పట్టాభిషేకం జరిపించి మగధ దేశానికి రాజుని చేశాడు మంత్రి శ్రీపాలుడు. తమ దేశానికి పొరుగునే ఉన్న మరో శక్తివంతమైన అవంతి దేశాధినేత ఏకైక కుమార్తె తో కీర్తి సింహుడి వివాహం జరిపించి మగధ రాజ్యానికి బలమైన మిత్ర దేశంగా అవంతి దేశాన్ని చేశాడు. శ్రీపాలుడు కీర్తి సింహుడి తండ్రి హయాములో పరిపాలనకు సంబంధించిన ఎన్నెన్నో చక్కటి సలహాలు , సూచనలు ఇచ్చి కీర్తి సింహుడి తండ్రికి మంచి పరి పాలనా దక్షుడు అనే పేరు వచ్చేలా చేశాడు. తన రాజకీయ చతురత తో ఇరుగు పొరుగు దేశాలతో సత్సంబంధాలు నెరుపుతూ మగధ రాజ్యాన్ని శత్రుదుర్భేధ్యంగా తయారు చేశాడు. అంతేకాక తమ పరిపాలన గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకోనేటందుకు చారులను నియోగించటం మాత్రమే కాకుండా తాను సైతం తరచుగా మారు వేషాలతో రాజ్యం లో సంచరిస్తూ ప్రజల నాడిని కనిపెట్టి ప్రజా రంజక మైన పాలన అందించేలా చూసేవాడు.
ప్రస్తుతం వయోభారం వలన తను మునుపటిలాగా చురుగ్గా పని చెయ్యలేక పోతున్నట్లు శ్రీపాలుడు కూడా గుర్తించాడు. తనకు శక్తి ఉన్నంత కాలం మంత్రి పదవిని నిర్వహించి కీర్తి సింహుడికి కూడా తన తండ్రికి లాగా మంచి పాలకుడు అనే గుర్తింపు వచ్చేలా చెయ్యాలని శ్రీపాలుడు ఎప్పుడూ ఆలోచించేవాడు. వయో భారంతో మునుపటిలాగా చురుకుగా పని చెయ్యలేక పోతున్న మంత్రి గారి గురించి కీర్తి సింహుడు కూడా తరుచుగా బాధ పడేవాడు. ఆ వయసులో కూడా ఆయన రాజ్య పరిపాలనకు సంబంధించిన అనేక కార్య భారాలతో సతమతం అవుతూ ఉండటం చూసి కీర్తి సింహుడికి కూడా బాధగా ఉండేది. మగధ దేశం లోనే శ్రీపాలుడికి సాటి వచ్చే ప్రతిభాశాలి మరొకడు లేనేలేడని కీర్తి సింహుడి అభిప్రాయం. అందుకే శ్రీపాలుడు తన స్థానంలో మరొక సమర్దుడిని మంత్రి గా నియమించుకోమని చాలా సార్లు కోరినా కీర్తి సింహుడు నిర్ద్వందంగా తిరస్కరించేవాడు. ఒక నాడు కీర్తి సింహుడు కొలువు తీరి ఉండగా శ్రీపాలుడు "ప్రభూ ! నేను రాచ కార్యాల భారం అధికమై సతమతమౌతున్నాను. తమరు నాకు రోజువారీ కార్యాలలో చేదోడు వాదోడు గా ఉండగలందులకు ఎవరినయినా సహాయకుడిగా నియమిస్తే బాగుంటుంది. ఆ విధంగా నాకు కొంచెం కార్య భారం తగ్గుతుంది" అని మనవి చేశాడు.
"అవును అమాత్యా-మీకు రాచ కార్యాల భారం అధికంగా ఉన్నది. మీకు నచ్చిన వాడిని మీరే సహాయకుడిగా నియమించుకోండి" అని చెప్పాడు కీర్తి సింహుడు.
తనకు సహాయకుడిని నియమించుకునే అధికారం తనకే కట్ట బెట్టటం తో శ్రీపాలుడు ఆ దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టాడు. శ్రీపాలుడి సహాయకుడి నియామకం కోసం పెట్టిన పరీక్షలలో ఆ దేశానికే కాక ఇరుగు పొరుగు దేశాలకు చెందిన చాలా మంది యువకులు పాల్గొన్నారు. దేహ దారుడ్యము, కత్తి యుద్ధం, విలువిద్య, మల్ల యుద్దాలలో ప్రావీణ్యం వంటి అనేక పరీక్షల ద్వారా అన్ని వడపోతల తరువాత చివరికి ఇద్దరు యువకులు మాత్రమే రంగంలో మిగిలారు. ఆ ఇరువురి పేర్లు అజయుడు, విజయుడు. ఇద్దరూ మంచి గురువుల దగ్గర విద్యాభ్యాసం పూర్తి చేసుకున్నారు. మంత్రిగారి సహాయకుడిగా పనిచేయటం అంటే మాటలు కాదు. అమిత ప్రజ్ఞాశాలిగా పేరు తెచ్చుకున్న శ్రీపాలుడు వంటి మేధావికి సహాయకుడిగా బాధ్యతలు నిర్వహించటం అంటే ఆషామాషీ వ్యవహారం కాదని ఆ ఇద్దరికీ తెలుసు. అయినా ఆ ఇద్దరూ తమ తమ తెలివి తేటలతో పోటీదారులనందరినీ అంచెలంచెలుగా అధిగమించి చివరి అంచె దాకా వచ్చారు. కానీ ఇద్దరిలో ఒక్కరికి మాత్రమే ఆ అవకాశం లభిస్తుంది. చివరి అంచెలో ఒకరిని ఎంపిక చేసుకుని సహాయకుడిగా నియమించే ప్రక్రియ మొదలైంది. చివరి అంచెలో పరీక్షాంశం గా "సమస్యా పరిష్కారం" ఉంటుంది. శ్రీపాలుడి సలహా మేరకు సైన్యాధ్యక్షుడు ఆ ఇరువురు యువకులనీ చెరొక గ్రామానికి పంపించాడు. రెండు గ్రామాల పేర్లు రామాపురం, సీతాపురం. రెండు గ్రామాలలో దాదాపు ఒకేలాంటి సమస్య ఉన్నది. ఆ రెండు ఊళ్లకు తాగు నీటి సమస్య ఉన్నది. రెండు ఊళ్లకు దూరంగా రెండు కోసుల దూరంలో మంచినీటి చెరువులు ఉన్నాయి. ఆ గ్రామస్తులందరికీ చెరువు నుండి మంచి నీరు తెచ్చుకోవటము తోనే ప్రతి రోజూ అధిక సమయం గడిచి పోతున్నది. ఆఖరి అంచె పరీక్షలో భాగంగా అజయుడు విజయుడు రామాపురం సీతాపురం గ్రామాలకు పంపబడ్డారు. ఆ గ్రామస్తులతో సంప్రదించి ఆ గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న మంచి నీటి సమస్యను పరిష్కరించి రమ్మని ఆ యువకులకు తెలియ చేశారు. ఇద్దరికీ రెండు మాసాల గడువు విధించారు.
రెండు మాసాల గడువు తీరిన తరువాత అజయుడు విజయుడు తమకు అప్పగించిన పనులను విజయవంతంగా పూర్తి చేసి రాజధానికి తిరిగి వచ్చారు. ఇద్దరూ తమకి అప్పగించిన గ్రామాల నీటి సమస్యను తమదైన శైలి లో పరిష్కరించారు. ఐతే ఇద్దరిలో సరి అయిన పరిష్కారం ఎవరు చూపుతారో వారే విజేత గా నిలుస్తారు. ఈ విషయం మంత్రి శ్రీపాలుడే స్వయంగా పరీక్షించి ఇద్దరిలో విజేత ఎవరో నిర్ణయించవలసినదిగా మహా రాజు కీర్తి సింహుడు కోరాడు. రాజాజ్ఞ మేరకు శ్రీపాలుడు రెండు గ్రామాల్లోనూ పర్యటించి అజయుడు విజయుడు ఆ గ్రామాల నీటి సమస్యను ఏ విధంగా పరిష్కరించినదీ పరిశీలించాడు.
రామాపురానికి పంపబడ్డ అజయుడు ఆ ఊరి వారందరితో సంప్రదించి ఒక నలుగురు బలిష్టులైన యువకులను ఎన్నుకున్నాడు. నాలుగు కావళ్ళను దృఢమైన కొయ్యతో చేయించాడు. ఆ నలుగురు యువకులు ప్రతిరోజూ కావళ్ళలో పెట్టుకుని చెరువు నుండి బిందెలతో నీటిని తెచ్చి గ్రామస్తులకు ఇళ్ళ వద్ద అందించేలాగా ఏర్పాటు చేసాడు. అందుకు బదులుగా ఆ నలుగురు యువకుల జీవనానికి అవసరమయిన ధనాన్ని గ్రామస్తులందరూ వంతులు వేసుకొని ఇచ్చేలాగా అజయుడు ఏర్పాటు చేసాడు. ఇలా నీళ్ళను చెరువు నుండి మోసుకుని తెచ్చుకొనే పని తప్పి పోవటంతో గ్రామస్తులకు ఎంతో తీరిక దొరికి తమ పొలం పనులు మరియు ఇతర పనులను మరింత చక్కగా చూసుకోసాగారు. గ్రామస్తులందరూ అజయుడు చేసిన కావళ్ళ ద్వారా నీటి సరఫరా ఏర్పాటు ఎంతో బాగుందని, తమకు ఎంతో సమయం ఆదా అవుతోందనీ చెప్పారు. ఆ సమయాన్ని తాము ఇతర కార్య కలాపాలకు వినియోగిస్తున్నట్లు మంత్రి గారికి విన్నవించారు. మంత్రి శ్రీపాలుడు ఆ తరువాత సీతాపురానికి బయలుదేరాడు.
సీతాపురానికి పంపించిన విజయుడు ఆ ఊరిని, ఊరి చెరువును శ్రద్ధగా పరిశీలించాడు. ఊరు కంటే ఊరికి నీరు అందిస్తున్న చెరువు ఎక్కువ ఎత్తులో ఉన్నట్లు గమనించాడు. నీరు పల్లమెరుగు అన్న సూక్తి ప్రకారం ఎత్తుగా ఉన్న ప్రదేశంలో ఉన్న చెరువు నుండి పల్లపు ప్రాంతంలో ఉన్న ఊరికి నీటిని సులభంగా ప్రవహింప చేయవచ్చు అని గ్రహించాడు. కావలసిందల్లా చెరువునుండి గ్రామానికి మంచి నీటిని తీసుకుపోయే టందుకు ఒక పిల్ల కాలువ మాత్రమే అని గ్రహించాడు విజయుడు. ఆ గ్రామస్తు లందరినీ సమావేశపరిచి అందరినీ పిల్ల కాలువ తవ్వటానికి శ్రమదానం చేయటానికి ఒప్పించాడు విజయుడు. గ్రామస్తుల సహకారంతో త్వరలోనే పిల్ల కాలువ తయారైంది. కాలువ గుండా ప్రవహించే నీరు భూమిలోకి ఇంకి పోకుండా కాలువ అడుగుభాగాన ఆ గ్రామ సమీపంలోనే లభించే నాప రాళ్ళను కాలువ కింది భాగంలో పరిపించాడు. దీంతో శుభ్రమైన నీరు ఆ పిల్ల కాలువ ద్వారా గ్రామ మధ్యకు ప్రవహించే లాగా ఏర్పాటు అయింది. గ్రామ మధ్యలో ఒక పెద్ద తొట్టె ఏర్పాటు చేయటంతో కాలువ ద్వారా వచ్చే నీటితో తొట్టె నిండి గ్రామస్తులకు తాగు నీరు నిరంతరాయంగా అందుబాటు లోకి వచ్చింది. ఆ విధంగా సీతాపురం గ్రామస్తుల తాగు నీటి బాధలకు శాశ్వత మైన పరిష్కారం దొరికింది.
రెండు గ్రామాలలో అజయుడు విజయుడు చేసి చూపించిన పరిష్కారాలను పరీక్షించిన మంత్రి శ్రీపాలుడు రాజు తో ఇలా చెప్పాడు " ఒకే లాంటి సమస్యలున్న రెండు గ్రామాలలో వీళ్ళిద్దరూ తమదైన శైలిలో పరిష్కారాలను చూపించారు. రామాపురం నీటి సమస్య తీర్చటానికి అజయుడు చేసిన ఏర్పాటు తాత్కాలికమైనది. ఆ నలుగురు యువకులు కావిళ్ళ తో నీటిని గ్రామస్తుల ఇళ్ళ వద్దనే అందిస్తున్నారు. అంటే గ్రామస్తులందరి బదులుగా ఆ నలుగురు యువకులే శ్రమ పడుతున్నారన్న మాట. కానీ నా దృష్టి లో ఇది శాశ్వతమైన పరిష్కారం కాదు. ఇకపోతే విజయుడు దూరదృష్టి తో ఏకంగా చెరువు నీటిని గ్రామానికి తరలించేలాగా పిల్ల కాలువ తవ్వించటం ద్వారా ఆ గ్రామస్తుల మంచి నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాడు. అందువల్ల విజయుడే ఈ పోటీలో విజేత" అని ముగించాడు మంత్రి శ్రీపాలుడు.