సమస్య - జీడిగుంట నరసింహ మూర్తి

samsya

సైక్రియాటిస్టు రాజేష్ కు ఆ రోజు సరికొత్త సమస్య తెచ్చిపెట్టాడు ఒక వ్యక్తి.

“ వాళ్ళందరిని పలకరించాలంటే పరమ అసహ్యంగా ఉంటోంది “ అన్నాడు వర్ధన్.

“ఎరక్కపోయి నేనే వాళ్ళ నందరిని నెత్తికెక్కించుకున్నానా అనిపిస్తూ ఉంటుంది.”

“ఎవరికీ వారు వాళ్ళేదో గొప్ప అనుకుంటారు. స్వయం ప్రకాశక శక్తి లేదు. వాళ్ళనీ వీళ్ళనీ అనుకరిస్తూ రోజులు గడిపేస్తూ ఉంటారు. “

“ వాళ్ళు చేసే నిర్వాకాలకు” ఆహో ఓహో” అంటూ పైకి ఎత్తేయ్యాలిట. ఇలా ఎంతకాలం వాళ్ళ పల్లకీ మొయ్యాలి ?”

“ఇంతా చేస్తే వాళ్ళు చేసేవన్నీ కాపీ పనులే. చేతిలో టైపింగ్ చేసే కళ ఉందని మరీ రెచ్చి పోతున్నారు. హార్మోనియం పెట్టిలా ఒళ్లో పెట్టుకుని వాళ్ళవీ, వీళ్ళవీ ఒకటే బాధేస్తున్నారు.”

“ ఎంతో కస్టపడి బుర్ర ఉపయోగించి రాత్రింబవళ్ళు శ్రమపడినా ఫలితం దక్కడం లేదు. ”

“అప్పటికీ చాలా సార్లు అనుకున్నాను. కొత్తగా అంటించుకున్న ఈ రోగాన్ని ఎలాగైనా వదుల్చుకోవాలని “

“అలా చేస్తే నాలో ప్రజ్వరిల్లుతున్న కళను అణగదొక్కేసుకోవడమే అవుతుందేమో అని మళ్ళీ ఆలోచన “

“ ఈ విచిత్ర రోగం బారిన పడుతున్న వాళ్ళు ఎక్కువగా అరవై ఏళ్ళు పై పడిన వాళ్ళేనట . ఈ వయసులో ఏ వ్యాపకంలేకుండా, బుర్ర ఉపయోగించ కుండా రెండు పూటలా తిండి తినేసి ఖాళీగా కూర్చుంటే లేనిపోని వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని ఆయనెవరో హెచ్చరించడం గుర్తొచ్చి ఒక్కోసారి మనసు మార్చుకునే ప్రయత్నం కూడా చేస్తున్నాను “

“ఇంకోపక్క తీవ్రమైన ఆందోళన, నన్ను సరిగ్గా గుర్తించడంలేదన్న అవమాన భారంతో రాత్రంతా నిద్ర పట్టటం లేదు “

“అయినా కూడా నాలుగైదు సార్లు అందులోంచి బయటకు వచ్చేసాను. రాయని ఉత్తరానికి రిప్లై కోసం ఎదురుచూసే వాడ్నిలా అయ్యింది నా పని. వాళ్ళు నన్ను అసలు పట్టించుకోవడం మానేశారు. ఆణువణువూ నిస్సత్తువ, ఆవరించింది. దాని స్థానాన తీవ్రమైన అవమానం నరనరాల్లోనూ విషంలా పాకసాగింది “

“ లేదు లేదు నేనిలా చేతకాని వాడిలా ఉండటానికి వీల్లేదు. ఈ పుష్పకవిమానంలో కానీ ఖర్చు లేకుండా ఇంతమంది అర్హులు, అనర్హులు ప్రయాణం చెయ్యగా లేనిదీ నాకేం తక్కువని ఇలా ముడుచుకుని కూర్చోవాలి ?. ఎవరో కోసం మనం బ్రతుకుతున్నామా ? ఎవరో కోసం మనం వ్యాపకాలు మానుకోవాలా ?” అని వీరావేశం వచ్చి మళ్ళీ ముందుకు దూసుకు పోయేవాడిని. ”

“ సైక్రియాటిస్టు రాజేష్ సావధానంగా రోజూ వచ్చి వర్ధన్ చెపుతున్న సమస్యల సీరియల్ వింటూ వచ్చాడు. బహుశా ఆయన సర్వీస్ మొత్తంలో ఇలాంటి సమస్యలున్న వాళ్ళను ఎవర్నీ చూసి ఉండడు. వర్ధన్ మానసిక వ్యాధికి ఎటువంటి చికిత్స ఇవ్వాలో తెలియక రోజూ తనచుట్టూ తిప్పుకుంటున్నాడు.

ఆఖరికి ఒకరోజు రాజేష్ వర్ధన్ చెయ్యి పట్టుకుని “ వర్ధన్ గారు దయచేసి నాకో పది రోజులు సమయం ఇవ్వగలరా ? ఈ లోపు మీ సమస్యకు సరియిన పరిష్కారం కనుక్కుంటాను “ అని దాదాపు వేడుకున్నట్టుగా అడిగాడు.

ఈ పది రోజులు వర్ధన్ డాక్టర్ రాజేష్ మొహం చూడలేదు. యధావిధిగా తను చవిచూస్తున్న నరక భాధలను ఎలాగో అలా దిగమింగుకుంటూ క్రమం తప్పకుండా పట్టు వదలని “విక్రమూర్ఖుడిలా” తనకు సంక్రమించిన అంటు రోగాలకు ఏవేవో తోచిన ఉపశమనాలు చేసుకుంటూ పది రోజుల తర్వాత డాక్టర్ రాజేష్ దగ్గరికి వెళ్ళాడు.

“ చూడండి మిస్టర్ వర్ధన్ గారు. మీరు క్రమక్రమంగా మీరు చేస్తున్న పని నుండి ఎంత త్వరగా బయట పడితే అంత మంచిది. ఇది భయంకరమైన వైరల్ ఫీవర్ లాంటిది. మనుషుల్ని పీల్చి పిప్పి చేసి కాని వదలదు. దీనికి అలవాటు పడితే ఏ మందులూ పని చెయ్యవు. మీరు చేస్తున్న పనిలో ఒక్కోసారి ఎంతో ఎత్తుకు ఎదుగుతున్నానని అందరూ మీ చుట్టూ భరోసాగా ఉన్నారని భ్రమ కలిగిస్తుంది. చూస్తూండగానే అంత ఎత్తునుండి ఒక్కసారి దభీమని పడిపోతారు. మన ఇంట్లోనే మనకు శత్రువులు తయారవుతారు. ఏదో చెయ్యాలన్న ఆరాటం, ఏమీ చెయ్యలేని అశక్తత మిమ్మల్ని వెంబడిస్తుంది. రోజులో పది పన్నెండు గంటలు ఇదే వ్యాపకం వల్ల ఊబ కాయానికి వారసులవుతారు. పని మధ్యలో ఎవరైనా ఆటంకపరిస్తే వాళ్ళ మీద గట్టిగా అరవడం మొదలు పెడతారు. లెక్కకు మించి ఎన్నో సార్లు మనిషి డిప్రెషన్ కు గురవుతాడు. మీ ఒరిజినల్ బిఎస్సీ డిగ్రీకి స్వయంకృతాపరాధంతో తెచ్చుకున్న మరో బిఎస్సీ డిగ్రీ జత అవుతుంది. అదేనండి. బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ అన్నమాట. “

“ఇంకా వినండి. మెల్ల మెల్లగా మీలో ఆల్జైమర్స్ అనే భయంకరమైన మతిమరుపు వ్యాధి అలుముకుంటుంది. పక్కనే కాఫీ ఉన్నా, నీళ్ళు ఉన్నా దాన్ని తోసేస్తారు. మీకు భోజనం తెచ్చిన మీ ఆవిడ మొహమ్మీద కంచం విసిరికొడతారు. దాని పర్యవసానం పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ చివరకు “పిచ్చివాళ్ళు”గా మారడం. మీరు ముందుగా వచ్చి మంచి పని చేసారు. ఇప్పుడు మీ బుర్ర ఇంకా మీ స్వాధీనంలో ఉంది కాబట్టి నేను చెపుతున్నది మీకు అర్ధం అవుతోందనే అనుకుంటున్నాను. ఇంకో వారం రోజుల తర్వాత వచ్చి ఉంటే నా చేతుల్లో ఏమీ ఉండేది కాదు. కమాన్. హర్ర్రీ అప్. . మనసును వేరే పనులలోకి మళ్ళించి త్వరగా దీన్ని నుండి బయటపడండి .” అంటూ ఆవేశంగా ఊగిపోతూ చెప్పాడు ప్రముఖ సైక్రియాటిస్టు డాక్టర్ రాజేష్.

“ అది సరే సర్. ఈ విషయం చెప్పడానికి మీరు పది రోజులు సమయం ఎందుకు తీసుకున్నారు ? “ అని అనుమానం వచ్చి అడిగాడు వర్ధన్.

“ కారణం మీరు ఎదుర్కుంటున్న సమస్య నాకూ ఉంది కాబట్టి. నేను ఈ పది రోజులు ఆ సమస్య నుండి బయట పడటానికి విశ్వ ప్రయత్నాలు చేసి చేసి మీకు ఇప్పుడు ఈ సలహా ఇవ్వగలుగుతున్నాను” అంటూ టేబుల్ మీద గ్లాసులో నుండి గటగటా మంచినీళ్ళు తాగేసాడు సైక్రియాటిస్టు రాజేష్. .

ఇంతకీ వర్ధన్ ఎదుర్కుంటున్నభయంకరమైన సమస్యేమిటో చెప్పలేదు కదూ అదేనండి బాబూ పేస్ బుక్ సమస్య.

మరిన్ని కథలు

Kya huvaa
క్యా హువా
- కె. తేజస్వని
Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు