కమాను వీది కథలు - .

ఎండాకాలం...మధ్యాహ్నం 2 గంటలు...కుంబార గేరి. నడినెత్తిన సూరీడు ఒకే రీతిగా మండిపడుతున్నాడు. ఉదయమంతా పనిచేసి అలసిన ఆడవాళ్ళు ఇంట్లో కాస్త నడుం వాల్చే సమయం. ఉన్నట్టుండి వీధిలో సందడి మొదలైంది. ' కామన్న మక్కళే...' పిల్లలందరం ఒక్కసారిగా గొంతు చించుకుని అరిచేసరికి, అందరూ ఉలిక్కిపడ్డారు. ఒకావిడ తలుపు సగం తెరిచి...ఏం పోయేకాలం...మద్దేనం స్కూలుకు రజ ఇచ్చింది అరిచేకేనా..? గావుకేకలు పెట్టే బదులు ఇంట్లోనే చావచ్చుగా..' అంది. మరింత రెచ్చిపోయాం. మళ్ళీ మొదలు. ' కామణ్ణమక్కళే...' గట్టిగా అరవడం....లబలబమని నోరు కొట్టుకోవడం....ఆపితేగా..! ఆయమ్మ పాపం కంగారు పడిపోయింది. ' ఎహే ...ఆపండి...మీ నోళ్ళు పడిపోనూ...అట్టా నోరు కొట్టుకుంటున్నారెందుకు? ఈడ ఎవరైనా సచ్చిపోయిండారా? ' అంటూ గట్టిగా గదరించింది. మనం తగ్గితేగా.... మళ్ళీ అదే వరస. పాపం ఈ సారి ఆయమ్మే తగ్గింది..' ఇప్పుడేం కావాలో సెప్పండి ' అనడంతో ' కట్టెలూ...' గట్టిగా అరిచాం. ' సూడండప్పా..మేం దుడ్లు పెట్టి కొనుక్కునేది మీకు ఇచ్చేకి కాదు కదా ! ఏదో కామణ్ణ పండగని వచ్చిండారు. ఒకటి ఇస్తాను సరేనా?' అంటూ ఓ చిన్న పుల్ల గోనె సంచిలో వేసింది. ఎంత అవమానం... ఇంత కష్టపడి వస్తే బిచ్చమేసినట్లు ఓ పుల్లేసి చేతులు దులుపుకుంటుందా? మళ్ళీ నోటికొచ్చినట్టు మాటలా? అందరం ఒక్కసారిగా మళ్ళీ కామణ్ణ కేకలు మొదలెట్టాం. చివరికి ఆమె చేసేది లేక ఇంట్లో పాత పరక ఉంటే తెచ్చి వేసింది. గోనె సంచి బరువనిపించేసరికి ఉత్సాహం రెట్టింపయ్యింది. ఇంకో ఇంటి ముందుకెళ్ళాం.

ఈ ఉత్సాహానికి ముందురోజే తెరలేసింది. ఉదయం కట్టెపై కూర్చొని పళ్ళు తోముకుంటున్నానా...ఒకడు పరగెత్తుకుంటూ వచ్చి చెవిలో ' లే...ఈ రోజే గుంత తవ్వేది....' అని ఊది పోయాడు. గట్టిగా అరిచేటన ఆనందం లో నుంచి తన్నుకొచ్చినా...తమాయించుకున్నాను. ఆ క్షణమే స్కూలుకు ఎగనామం పెట్టే ప్లాన్ సిద్ధమైపోయింది. అనుకోగానే వచ్చేది కడుపునొప్పే! ఎందుకంటే దానికి పెద్ద పరీక్షలుండవు, ఇంకేముంది? అదే వచ్చేసింది. ఇంట్లో వాళ్ళకి అనుమానం రాకుండా ఉండేలా వరసగా రెండుసార్లు చెంబు పట్టుకుని అటూ ఇటూ పరిగెత్తాను. అమ్మ కంగారుగా ఏరా...అని అడగ్గానే కడుపులో ' గడ్ బిడ్ ' అంటూ మోకాలు కడుపులోకి ముడిచి కూర్చుండిపోయాను. స్కూలుకెళ్ళే టైం అయ్యేదాకా ఆ ఆసనంలోనే ఉన్నా. ' ఏమైందట వాడికి? ' అని నాన్న అడుగుతూంటే ...' కడుపు నొప్పి ' అమ్మ చెబుతున్న మాటలు చెవికి చేరుతూనే ఉన్నాయి. సైకిల్ బైటికి తీసిన చప్పుడవగానే ...హమ్మయ్యా నాన్న వెళ్ళిపోయాడని లేచి కాళ్ళు జాడించా.. ! కడుపు నొప్పి మాయం. వెంటనే గుమ్మం దాకా పరిగెత్తా. రేయ్...కడుపునొప్పని అన్నావు కదరా..అమ్మ నోటివెంట వచ్చేసరికి నేను వీధిలో..మధ్యాహ్నం ఎప్పుడవుతుందా అని నేను బుసీ, రఘు, చెంద్రి అందరం చక్కర్లు కొడుతూనే ఉన్నాం. చివరికి ఆ ముహూర్తం రానే వచ్చింది. మహానందయ్య సార్ ఇంటి ఎదుర ఖాళీ స్థలంలో కామణ్ణ గుంత. రాము, తుంగా గుండ, చిన్న గుండ, చెంద్రి కామణ్ణ గుంత తవ్వేకి కూర్చున్నారు.ఇంతలో ఇళ్ళల్లో పోరాడి గడార్లు పట్టుకొచ్చాం...ఒరేయ్..మట్టి అవుతుంది..వద్దన్నానా పాపం.

అమ్మ అరుస్తూనే వుంది. వినేదెవరు? ఇద్దరు గుంత తవ్వుతుంటే, మరో ఇద్దరు చిన్న తట్టల్లో మట్టి నింపి మాకందిస్తున్నారు. దాన్ని పక్కనే అరుగు కింద వున్న స్థలంలో పోయాలి. ఇక్కడా తగువులాటే! ఈ తట్ట ఎత్తేందుకు నేనంటే నేనంటూ చొక్కాలు పట్టుకుని గుంజుకుంటుంటే... అన్నలు సర్దిచెప్పాల్సి వచ్చింది. గుంత లోతవుతున్న కొద్దీ మాలో కట్టలు తెగే ఉత్సాహం. ఈ తతంగాన్ని పెద్దలందరూ అరుగులపై కూర్చుని చూసేవారు. గతేడాది గుంత పూడ్చేముందు వేసిన పైసలు.. కాలిన బొగ్గు ముక్కలు ఒక్కొక్కటిగా పైకి తేలుతుంటే ఈలలు...అరుపులు...! పిల్లలెంత అరచినా ఆ సమయం లో మాత్రం పెద్దలు అడ్డు చెప్పేవారు కాదు. చివారాఖరికి చిన్న శివలింగం కనిపించే సరికి ఇంక గెంతులే గెంతులు... కామణ్ణ మక్కలే అంటూ గొంతు రాచుకుపోయేలా అరిచాం. అసలు కామణ్ణ పండుగంటేనే హుషారు. మిగిలిన పండుగలకన్నా ఇది చాలా భిన్నం. పెద్ద చిన్న పిల్లలు ఏకమయ్యేది ఈ పండుగప్పుడే. గుంతలో దీపం పెట్టడానికి వీలుగా చిన్న గూడు. పున్నమి వచ్చేదాకా రోజూ ఆ లింగ రూపానికి దీపారాధన. గుంత తవ్వగానే సరికాదు. అసలు పని అక్కడ్నుంచే. కామదహనానికి రోజూ కట్టేలు సేకరించాలి. ఓ పాత గోనె సంచి నాల్గు కొసల్ని పట్టుకుని నడుస్తుంటే మరో ఐదారుగురు ఈలలు కేకలు వేసుకుంటూ వెళ్ళేవాళ్ళం . గట్టిగా అరిచేవాళ్ళు... రెండు చేతి వేళ్ళు నోట్లో పెట్టుకుని గట్టిగా ఈల వేయగలిగే వాళ్ళు. లబలబలబ అంటూ మనసారా నోళ్ళు కోట్టుకోగలిగే వాళ్ళకు ఈ పండుగలో భలే డిమాండు. మాలాంటి చిన్నోళ్ళు గోనె సంచి పట్టుకునేందుకు సిద్ధమయ్యేవాళ్ళం. ఆ పనికి రోజూ పోటీయే! నలుగురితో సరిపోయేదానికి ఎనిమిదిమంది తన్నుకు చచ్చేవాళ్ళం.

ఎండాకాలం ఒంటిపూట బడి. కామణ్ణ పనికి ఢోకా వుండేది కాదు. పొద్దున తప్పదు కాబట్టే స్కూలుకు , మనసంతా మధ్యాహ్నం పనిపైనే! ఎప్పుడెప్పుడు స్కూల్ బెల్ కొడుతుందా అని కాచుక్కూర్చునే వాళ్ళం. ఇంటికి రయ్ మంటూ రావడం.. సంచి పడేసి పోవడమే! తిండి తిప్పలు లేకుండా దయ్యం పట్టినట్లు తిరిగేవాళ్ళం! కట్టేలు ఏ వీధిలో ఎక్కువేస్తారు? ఎవరింటి వద్ద ఎంతసేపుంటే బాగుంటుంది?? ఈ లెక్కలతోనే పొద్దు గడిపేవాళ్ళం. రోజూ మధ్యాహ్నం చిరిగిపోయిన చాట... పరీక్ష అట్టలు పట్టుకుని కర్రలతో డప్పుకొడుతూ... నేను వేణు, రఘు, బుస్సి తండాలు తండాలుగా కదిలేవాళ్ళం. మధ్యలో చింతకుంట మధు, రంగణ్ణ ఇంకొందరు కలిసేవారు.

ఈ వ్యవహారానికి అడ్డంకులెన్నో! ఒక్కోరోజు ఇంట్లో మధ్యాహ్నం తలుపులేసేవారు. అప్పుడు వద్దు నా తిప్పలు. గట్టిగా ఏడ్చేవణ్ణి, తలుపులు దబ దబా బాదేసేవాణ్ణి. ఈ గోల భరించలేక.. అర్ధగంటలో వచ్చేయాలి అంటూ షరతుపై పంపేవాళ్ళు. సాయంత్రం ఆరు అయినా ఆ అర్ధగంట పూర్తయ్యేది కాదు. దొంగపిల్లిలా ఇంట్లో కాలు పెట్టామో లేదో వీపుపై దబ్ దబ్ మని దెబ్బలు ! చేత్తో వీపు రుద్దుకోవడం ... లోనికి పరుగెత్తడం . అప్పుడు పుస్తకాలు ముందేసుకుని ఇల్లు పడిపోయేలా గట్టిగా చదవడం మొదలయ్యేది. అయిందంటే అయిదు నిముషాలకే గునగునమంటూ గొణిగే స్థితి. ముందు పుస్తకమున్నా, బుర్రలో సవాలక్ష ఆలోచనలు, ఏ వీధికి వెళ్ళాలి. కొత్తగా ఎలా అరవాలి? సిటీ వేయడం ఎలా? ఈగల్లా ఇన్ని ముసురుకుంటుంటే... ఎవడైనా ఎలా చదువుతాడు? చూస్తుండగానే 'రేయ్ అన్నానికి రా' అంటూ కేక వినిపించేది క్షణాల్లో వంటింట్లో వెళ్ళి ఆవురావురుమంటూ తినేసేవాణ్ణి! నిద్రాదేవి మాకు బెస్ట్ ఫ్రెండ్. గోడకానుకునే కళ్ళు మూతపడుతుంటే.. పుస్తకాన్ని అటూ ఇటూ తిప్పడం ... కింద పడిపోతుంటే మళ్ళీ తీసుకోవడం ... ఈ తిప్పలు చూళ్ళేక అమ్మ ' చెదివింది చాలు గానీ... పడుకో అంటూ కసురుకునేది. మరుక్షణంలో దుప్పట్లో దూరిపోవడమే!

రోజూ కట్టేల్ని లెక్క పెట్టుకోవడం, మళ్ళీ పేర్చడం తప్పనిసరి, రేయ్ ... ఎన్నిసార్లు లెక్కేసినా పెరగవురా గాడిదల్లారా... ఇళ్ళకు తిరిగి తెచ్చుకోవాలని అన్నలు తిట్టిపోసేవాళ్ళు రెచ్చిపోయి కొత్త వీధులన్నీ చుట్టేసే వాళ్ళం. ఈ సందడిలోనే చొక్కాలపై నల్లటి ముద్రలు దబాలున పడిపోయేవి. జేబులో బిళ్ళ వున్నా... చేతిలో గోనె సంచి కొస వుండేది కదా! వీలు చిక్కేది కాదు. మరుసటి రోజు పొద్దున్నే కాపు కచ్చి వాడి వీపుపై గుద్దందే మనశ్శాంతి దక్కేది కాదు . ఈ ముద్రల బిళ్ళ తయారీ ఓ పెద్ద పని! ఇంటి చుట్టుపక్కల పగిలిపోయిన మట్టికుండల బోకుల్ని వెదికి తెచ్చుకోవాలి. ఆ ముక్కల్ని బండ్లపై రుద్ది రుద్ది గుండ్రంగా బిళ్ళలుగా మార్చాలి. ఆ తర్వాత పాతబట్టను దానికి చుడితే ... అబ్బరు స్టాంపులా వుండేది. బొగ్గుల పుడి, పాత బేటరీలను పగులగొట్టి అందులో నల్లని పుడినో నీళ్ళల్లో కలిపి అంటిస్తే ఇక రెడీ! వేళ్ళ మధ్య బట్టముడిని బిగించుకుని రయ్ మంటూ పరుగులు తీసేవాళ్ళం. ఎవడు కనిపిస్తే వాడి వీపుపై దబ్ మని గుద్దడం వెళ్ళిపోవడం ! రంగుల పండుగ వచ్చేదాకా ఇదే తీరు.

మట్టిబిళ్ళ దొరికినా పాత పంచె పీలిక వెదకాలంటే ప్రాణం మీదకొచ్చేది.. గుట్టు చప్పుడు కాకుండా గదిలో దూరి బట్టల మూట విప్పి పాత పంచె సర్రున దింపాల్సి వచ్చేది. మా వీధి పక్కన ఓ ఎడ్ల బండి వుండేది. దాని పక్కన మెల్లగా నక్కి చక్రాలున్న కందెనను బిళ్ళకు దట్టించేవాళ్ళం. ఈ సీజన్ లో ఒక్కోడి స్కూలు సంచిలో కనీసం నాలుగైది బిళ్ళల స్టాకు వుండేవి. వీటికి అదనంగా జేబులో ఒకటి. కామణ్ణ కట్టెలు తెచ్చే పనిలో మునిగి వున్నా... ఈ బిళ్ళ గుద్దుడులో చురుకుగా వుండేవాళ్ళం. మధ్యాహ్నం చొక్కాపై ముద్ర పడిందంటే.... సాయంకాలానికల్లా వాడెక్కడ నక్కినా మా ముద్రా పడాల్సిందే!

కాముని పున్నమి నాడు హంగామా అంతా ఇంతా కాదు. ఆ రోజు స్కూలుకు చక్కర్ కొట్టేసే వాళ్ళం. ఉదయం నుంచి ఆ కామణ్ణ గుంత వద్దే మా పడిగాపులు. ఎప్పుడు సాయంత్రం అవుతుందా... ఎప్పుడెప్పుడు గుంతలో కట్టెలు పేర్చాలా అని ఒకటే ఆరాటం. మధ్యాహ్నం కాగానే వీధిలో అందరు చేరుకునే వారు. రాము, తుంగా గుండ పేపరుపై కాముడి బొమ్మ వేయించే పనిపై వుంటే... మరికొందరు రాత్రి దహనం అయ్యాక అందరికీ పంచేకి బొరుగులు, మిక్చర్ తేవడానికి వెళ్ళేవారు. అరె ఆ కట్టెలు కిందికి దించడప్పా... మాట వినగానే ఇక మొదలు! ఒక్కసారి అరుగెక్కడం కట్టెలు పట్టుకుని కిందికి దూకేవాళ్ళం. గుంతలో ఒక్కో కట్టె పేరుస్తుంటే గట్టిగా అరుపులు కేకలు... నోళ్ళు కొట్టుకోవడాలు... అన్నలు పక్కకు పిలిచి 'ఇప్పుడే కాదురా... రాత్రి కొట్టుకోవాలి అనేవారు.

రాత్రి ఆకాశంలో విచ్చుకున్న పచ్చని పువ్వులా చంద్రుడు, చుట్టు పక్కల వీధి నుంచి వచ్చిన వాళ్ళతో కమాను కిక్కిరిసి కళకళలాడేది. ఉత్సాహాల వన్నెలద్దిన రంగుల బొమ్మలా మెరిసిపోయేది. సాయంకాలానికల్లా రామన్నయ్య పేపరుపై కాముడి బొమ్మ వేయించుకు వచ్చేవాడు. పొడవాటి కర్రకు పేపరు అతికించి గుంత మధ్యలో పెట్టేవాళ్ళం. కిరోసిన్ పోసి అంతా సిద్ధమయ్యాక పూజారి టెంకాయ కొట్టి , ఇంక సురు అనగానే ... గుంతలో చుర్ మంటూ ఓ అగ్గిపుల్ల , ఒక్కసారిగా మంటలు. అంతెత్తున... నాలుకలు చాస్తూ ఎగసి ఎగసి పడుతుంటే... ఆ వెలుగులో 'కామణ్ణ మక్కలే' అంటూ కమాను దద్దరిల్లేలా మా కేకలు. ఆ మంటలు మాటున రెండు గంటలపాటు ఓ అద్భుత దృశ్యం జీవం పోసుకునేది. నిప్పుల సెగ మొహాలకు తాకుతున్నా... మొండిగా ముందుకురకడమే. ఎక్కడ నేను ఆ మంట దగ్గరకెళతానో అని అమ్మ భయపడి కేకలేసేది. కానీ మేమీ లోకం లో వుంటేగా! వంటిపై ఏదో తెలీని ఆవేశం. ఆ రోజు మా కమాను వైభవం చూడాలంటే రెండు కళ్ళూ చాలేవి కావు. గుంతలోంచి ఎగసే ఆ ఎర్రటి వెలుగుల్లో వెయ్యి జన్మలకు సరిపడా ఆనందం మా కళ్ళల్లోనే.

కారా బూందీ, కొబ్బరి ముక్కలు కలిపిన బొరుగుల పంపిణీతో ఆ సందడికి తెరపడేది. గుండ, చెంద్రి, రాము వీళ్ళు మాత్రం కమాను మిద్దెపైకెక్కి నిర్వాహకులు మిగిలిన బొరుగులు, బజ్జీలు హాయిగా లాగించేవారు. నేను , ఋసి, రఘు, మైకం దిగని ఇంకొందరు ఆ గుంత వద్దే పుల్లలు వేస్తూ వుండిపోయేవాళ్ళం. 'ఇంక చాల్లే... రా బాగా అరిచినావు గానీ ఇంటికి రా' అని అమ్మ లాక్కెళ్ళే దాకా అక్కడే ధ్యాస. అప్పటిదాకా విర్రవీగిన మంటలు మెత్తబడేవి. పిచ్చిపిచ్చిగా ఎగిరిన మేమూ దెబ్బకు నిద్రలో జారిపోయే వాళ్ళం. ఆ పున్నమి రాత్రి కాముని గుంతలోని మంటలు కట్టెల్నే కాదు... మా మనసుల్లో పాతబడ్డ భావాల్నీ కాల్చేసి కొత్త వెలుగులిచ్చేవేమో! ఆదమరిచిన ఆ నిద్రలో రెక్కలార్చుకున్న కలలు చిమ్మే రంగులు మా మనసుల్ని తడిసి ముద్దచేసేవి. రేపటి హోలీ కోసం అప్పుడే మొలకెత్తిన నిరీక్షణ మాత్రం మా కళ్ళల్లో కొత్త వన్నెల్ని పరిచేది!!

................కామణ్ణ మక్కళు- కాముని బిడ్డలు, సీటీ - ఈల

మరిన్ని కథలు

Kya huvaa
క్యా హువా
- కె. తేజస్వని
Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు