బాయ్ ఫ్రెండ్ - చెన్నూరి సుదర్శన్.

boy friend

“వాసుకు పెళ్లి సంబంధం చూసే బాధ్యత నీదే బాబూ” అంటూ మా మామయ్య నాకు గురుతరమైన బాధ్యత అప్పగించాడు.

పెళ్లి సంబంధాలు చూడ్డమంటే మాటలు కాదు. తీరా చూసాక పెళ్లి కుదిరి విజయవంతమైతే ఫరవాలేదు గాని బెడిసికొట్టిందంటే నా కాపురమెక్కడ కోల్లేరవుతుందోనని భయపడ్డాను.

అయినా నా జాగ్రత్తలో నేనుండాలి. ‘సంబంధం చూడటం వరకే నావంతు.. ఆ కుటుంబం మంచీ, చెడు లోతుగా తెలుసుకొని ఖరారు చేసుకోవడం మీ వంతు..’ అని తప్పుకుంటే సరి అని మనసులో అనుకొని పైకి మాత్రం నా మాటలన్నీ ధైర్యంలో కుమ్మరించి “సరే..మామయ్యా..” అన్నాను గంభీరంగా..

అలా అనక తప్ప లేదు. నేను హైదరాబాదు కూకట్ పల్లిలో ఉంటాను. సిటీలో పెళ్లిసంబంధాల సంస్థలెక్కువ. మామయ్య వాళ్ళది పెద్ద కుటుంబం. ముగ్గురమ్మాయిలు.. ఇద్దరబ్బాయిలు. వాళ్ళు సిరిసిల్లలో ఉంటారు.

ఇంటికి పెద్దల్లున్ని నేను. నన్ను పెద్ద కొడుకులా చూసుకుంటారు. ఆ మర్యాద కాపాడుకోవా లను కున్నాను.

నా పెద్ద బావమర్ది వాసు పెళ్లి సంబంధం కుదిరిందంటే అనుభవాల దొంతరాలలో వాసు రాటుదేలుతాడు. ఇక వారి కుటుంబ భారం అతడు చూసు కుంటాడనని నానమ్మకం.

సంబధాలు చూసే కార్యక్రమంలో అడుగుమోపాను.

నాకు తెలిసిన “పెళ్లి భరోసా కేంద్రం “ - ‘పడకు నిరాశ’ అనే ట్యాగ్ లైన్ కలిగిన వివాహ సంస్థ ఒకటి వారసిగూడలో ఉంది. దాన్ని నడిపేది నడిమింటి నారాయణ గారు. నాకు పరిచయస్తుడు కూడా..

ఆదివారం వీలు చూసుకొని ఫోన్ చేసి వెళ్లాను. సాదరంగా ఆహ్వానించాడు.

వారసిగూడ ప్రధాన కూడలిలో ఒక పోర్షన్ ఇంట్లో రోడ్డు ముఖంగా లేడీస్ ఎంపోరియం.. దాని వెనకాల గదిలో పెళ్లి సంబంధాల ఫైల్స్ అల్మారాలలో పేర్చి ఉన్నాయి. తాను నిస్వార్థంగా సేవ చేస్తున్నాడు. వెళ్ళిన వారందరికీ చాయ్ పానీయాలివ్వడం వారి ఆత్మీయతను చాటుతుంది.

బుక్ షెల్ఫ్ లలో అమ్మాయిల, అబ్బాయిల ఫైల్స్ వేరు వేరుగా ఉన్నాయి. అందులో డాక్టర్లు, ఇంజనీర్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్స్, గ్రాడ్యుయేట్స్, పాఠశాల చదువుతో ఆగిపోయినవారి ఫైల్స్ లేబుల్స్ అతికించిన సొరుగుల్లో ఉన్నాయి. ఇంకా పునర్వివాహం ఫైల్స్ ఉండడం అభినందనీయమే.

నేను వాసుకు సరిపోయే అమ్మాయిల వివరాలు వారి చిరునామాలు డైరీలో రాసుకుంటు న్నాను.

ఇంతలో నారాయణ గారే స్వయంగా ట్రే లో గ్లాసుల్లో నీళ్ళు, టీ కప్పులు తీసుకొచ్చాడు. ఫైళ్ళు పక్కకు పెట్టి ట్రే అందుకున్నాను.
టీ తాగుతూ కబుర్లలో పడ్డాం. సంబంధాలు నా బావమర్ది కోసమని తెలుసుకున్నాడు.

“ముందుగా ఫోన్ చెయ్యండి. ఫోన్లో వారు మాట్లాడే విధానంతో వారి స్వభావం కొంతవరకు తెలిసి పోతుంది. వారు ఇంట్లో ఉండే సమయ వివరాలు తెలుసుకొండి. ఒక రోజు చెప్పా చెయ్యకుండా మీరొక్కరే వెళ్ళండి. దాంతో వారింటి స్థితిగతుల యదార్థ స్వరూపం బయట పడ్తుంది.
స్నేహపూర్వకంగా కుటుంబ పరిచయం చేసుకుందామని వచ్చానని అందరినీ పలుకరిస్తూ అమ్మాయిని పరిచయం చేసుకోండి. మీకు నచ్చితే వారి బంధువుల చిరునామాలు కనుక్కొని బయట పడండి. ఆ తరువాత వారి బంధువులతో చర్చించి నిర్ణయం తీసుకున్నాక సదరు అమ్మాయి వాళ్ళని మీ ఇంటికి ఆహ్వానించండి. అబ్బాయిని పరిచయం చేయండి. మీ బంధువుల వివరాలివ్వండి. వారికీ నచ్చాక పెళ్లి చూపులు పెట్టుకోండి. పెళ్లి చూపులయ్యాయంటే సగం పెళ్ళయినట్లే..” అంటూ గీతోపదేశం చేసాడు నారాయణ.

“1965 లో పెళ్లి పిల్లవాడు సైకిల్ కావాలని, 1975 లో రేడియో కావాలని, 1985 టీ.వీ. కావాలని, 1995 లో టూ వీలర్ కావాలని అడిగే వాడు. కాని ఇప్పుడు అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ లేకుంటే చాలనుకునే కాలమొచ్చింది” అనే సరికి నాకు నవ్వాగింది కాదు. టీ గ్లాసు కింద పెట్టి భళ్ళున నవ్వాను. నా నవ్వులో నారాయణ నవ్వు మిళితమైంది. మా నవ్వుల ధాటికి షాపుకొచ్చిన వాళ్ళంతా మమ్మల్ని తొంగి చూడసాగారు ఆశ్చర్యంగా..

“నిజమే ఈ కాలంలో బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ లేకుంటే నామర్దా అనుకుంటుంది యువత. హద్దుల్లో ఉంటున్నారా అంటే అదీ లేదు. అనర్థాలు కొని తెచ్చుకుంటున్నారు. ఏదైనా తమ దాకా వస్తే గాని తెలిసిరాదు” అంటూ నా డైరీ తీసుకొని బయలుదేరాను.

పెళ్లి సంబంధాల వేటలో ఒక రోజు నేను మలక్ పేట వెళ్లాను. నేను ఎన్నుకున్నది చిన్న కుటుంబం. సారంగపాణి, సరోజలకు ఒక్కర్తే అమ్మాయి పేరు నీరజ. ఫైల్లో ఫోటోలు చూసాను.. సులభంగా గుర్తు పట్టవచ్చు. నారాయణ గారి సలహా తు.చ. తప్పకుండా ప్రణాళిక ప్రకారం తలుపు తట్టాను.

అమ్మాయి తలుపు తీసింది.

“నాన్న గారున్నారా.. నీరజా” అంటూ అడుగుతుంటే స్వరం తప్పింది. మంచినీళ్ళు కావాలని సంజ్ఞ చేసాను. పేరు పెట్టి పిలిచే సరికి కాసేపు విస్తుపోయింది. తల వెనకాల చూపుడు వేలుతో సుతారముగా గోక్కుంటూ వంటగదిలోకి వెళ్తోంది. మధ్యలో ఆమె చెయ్యి పట్టుకొని వెనక్కి లాగాడు.. ఒక అబ్బాయి.

డ్రాయింగ్ రూం చివరన ఉన్న అద్దంలో వారి ప్రతిబింబాలు స్పష్టంగా కనబడుతున్నాయి. వారది గమనించే స్థితిలో లేరు. నీరజను దగ్గరికి లాక్కొని హత్తుకున్నాడు. చుంబించబోతుంటే వద్దన్నట్లుగా అతడి పెదవులపై అరచెయి అడ్డు పెట్టింది. నన్ను పంపించి వస్తానన్నట్లుగా ఆమె ముఖకవళికలు అద్దంలో ఆడుకుంటున్నాయి..

నా మనసు చివుక్కుమంది. నేనెవరని పరిచయం చేసుకోవాలి?.. అనే ఆలోచనలు నన్ను ముసురుకున్నాయి.

నీరజ గ్లాసు నా చేతికందిస్తూ “అమ్మ, నాన్న ఊరెళ్ళారు. నేనొక్కర్తనే ఉన్నాను. ఏం పనిమీద వచ్చారు.. మీరెవరండి? నాకు గుర్తుకు రావడం లేదు.” అంటూ ఏంతో వినయం ప్రదర్శిస్తోంది.

నా హృదయం ఉడికి పోతోంది.. “మీ అమ్మ గారి బాయ్ ఫ్రెండ్ ని” అన్నాను ఠక్కున. ఉన్నఫళంగా నా పైకి లంఘించింది నీరజ ఆవేశంగా.. ఆమె కళ్ళు నిప్పుకణికలయ్యాయి. చున్నీని నడుమకు చుడ్తూ..

“ఏదీ మళ్ళీ అనండి..” అంటూ గట్టిగా అరిచింది. “ మా నాన్నుంటే ప్రాణాలు తోడేసే వాడు”

“లేడనే గదా నేను ధైర్యంగా వచ్చింది.. పేరెంట్స్ లేరనే ధీమాతో నువ్వేం వెలగబెడ్తున్నావో ఎవరికెరుక?..” అంటూ నేను వ్యంగ్యంగా సమాధానమిచ్చాను.

లిప్తకాలం స్థాణువై తేరుకుంది. ఆవేశం తగ్గించుకుంది.

“నవ్వెవ్వరో ఎందుకొచ్చావో నాకు తెలీదు. పైగా హద్దు మీరి మాట్లాడుతున్నావు. మర్యాదగా వెళ్ళిపో” అంటూ కళ్ళు ఎగరేస్తూ మాట్లాడుతుంటే.. రయ్యిన బయటకొచ్చాడు నీరజ బాయ్ ఫ్రెండ్.. నన్ను తరిమేయాలనే ఆవేశంతో కాబోలు.

ఖంగుతింది నీరజ. నూవ్వెందుకొచ్చావ్ అన్నట్లుగా ఉరిమి చూసింది.

“ఒక్కర్తనే ఉన్నానన్నావుగా.. ఇతనెవరు?” అంటూ ప్రశ్నించాను.

“నీకన్నీ చెప్పాలా.. అయినా నాకు భయమేంటి? .. ఇతను నా బాయ్ ఫ్రెండ్”

“మరి నేను మీ అమ్మగారి బాయ్ ఫ్రెండునంటే నీకు కోపమెందుకొచ్చింది?..” అంటుంటే గుమ్మం తెరుచుకుంది.

ఎదురు గా.. నీరజ పేరెంట్స్. నేనూ నెమ్మది పడ్డాను.

“నమస్కారం సార్.. నమస్కారమమ్మా..” అంటూ నేను లేచి వారిరువురికి అభివాదం చేసాను.

నీరజ బాయ్ ఫ్రెండ్ సుడిగాలిలా బయటికి పరుగు లంఘించుకున్నాడు.

“ఏమీ తప్పు చేయడం లేదుకదా.. ఎందుకలా నీ బాయ్ ఫ్రెండ్ పారిపోతున్నాడు?” అంటూ ప్రశ్నిస్తుంటే నీరజ ముఖం పాలిపోయింది.
సారంగపాణిగారు తల దించుకున్నాడు.

సరోజగారు పారిపోతున్న అబ్బాయిని తదేకంగా చూడ సాగింది.

“చూడమ్మా.. నీరజా.. నీ మూలాన తల్లిదండ్రులను తలెత్తుకోలేకుండా చేస్తున్నావ్. నిన్ను పెంచి పెద్దచేసినందుకు నువ్వు వారికిచ్చే బహుమానమిదేనా?..

నేను మీ అమ్మ గారి బాయ్ ఫ్రెండునంటే నీకు విపరీతమైన కోపమొచ్చింది. నీ పెళ్ళయ్యాక కూడా నీ భర్తకు ఇతడు నా బాయ్ ఫ్రెండ్ అని పరిచయం చేయగలవా?.. చేయలేవు. మన సంస్కృతి అడ్డొస్తుంది. ఒక వేళ సంస్కృతిని కాల రాచి పరిచయం చేసినా నీ కాపురం నిలబడుతుందనే గ్యారెంటీ లేదు.

ఫ్రెండ్ అంటే స్నేహితుడా.. స్నేహితురాలా అనే సందేహం రాకుండా బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ అంటూ వాడుతున్నాం. స్నేహితుల్లా మెలగడం తప్పులేదు. కాని అలా మెలగడం లేదు.. పరిధులు దాటుతున్నారు. స్నేహితుడు అంటే వేరు.. బాయ్ ఫ్రెండ్ అంటే వేరు అనే అర్థాలు వచ్చేలా నేటి యువత ప్రవర్తిస్తోంది. దాని మూలాన బాయ్ ఫ్రెండ్ అంటేనే అదోరకమైన చెడు అభిప్రాయం మనలో స్థిరపడిపోయింది..” అంటూ చిన్న పాటి ఉపన్యాసమిచ్చాను.

సారంగపాణిగారు మౌనంగా వింటున్నాడు. సరోజగారు, నీరజను తీసుకొని లోనికి వెళ్ళింది. నీరజతో గుస, గుస లాడుతోంది.. నాకు అద్దంలో కనబడతోంది.

“సార్.. నేనే మీకు ఫోన్ చేసాను. నా బావమర్ధి వాసు పెళ్ళిసంబంధం గురించి. మీరు ఊరెళ్తున్నామన్నారు. అనుకోకుండా దిల్ సుఖ్ నగర్ వెళ్ళాల్సి వచ్చింది. దారిలోనే కదా.. ఒక సారి మీ ఇల్లు చూసినట్లుంటుందని వచ్చాను” అంటూ నా పరిచయం చేసుకున్నాను. “సారీ సార్..మీకు ఇబ్బంది కల్గించాను”

“అదేం లేదు బాబు.. మాకు ట్రైన్ మిస్సయ్యింది. తిరిగి వచ్చేసాం...” అంటూ సారంగపాణిగారు సంభాషణను ఎలా పొడిగించాలా అని అమాయకంగా మాటలు వెదుక్కుంటున్నాడు.

ఇంతలో సరోజగారు హాల్లోకి వస్తూ.. “మా నీరజ నిప్పు బాబూ.. ఇంతకు ముందు వచ్చిన అబ్బాయి మా నీరజ క్లాస్ మేటు. నోట్స్ అడిగి తీసుకోడానికి అప్పుడప్పుడు వస్తూంటాడు.. మీరు అపార్థం చేసుకోవద్దు” అంది. ఎంతైనా తల్లి గదా.. బిడ్డని వేనుకేసుకు రావడం సహజం.
తల్లి తనకు సపోర్ట్ చేస్తుంటే లోన నీరజ ‘హమ్.. తుమ్.. ఏక్ కమ్రే మె బంద్ హో...’ అన్నట్లు డాన్స్ చేస్తోంది.. అద్దం అందంగా చూపిస్తోంది.

“నేను అబద్ధమాడినా అద్దం అబద్ధమాడదు కదమ్మా.. ఇలా వచ్చి నా కుర్చీలో కూర్చొని అద్దం వంక చూడండి.. మీ అమ్మాయి చేష్టలు నాకెలా కంట పడ్డాయో మీకర్థమవుతుంది. ” అంటూ నేను లేచాను.

సరోజగారు సందేహిస్తూ కూర్చుంది.. అద్దం వంక చూస్తోంది.. పక్క గదిలోని నీరజ నిజ స్వరూపం అద్దంలో ప్రతిబింబిస్తోంది.. ఆమె ముఖం వివర్ణమౌతోంది.. ఇంకా నేను అక్కడే ఉండటం సమంజసం కాదని సారంగ పాణి వద్ద సెలవు తీసుకొని బయటపడ్డాను.

మరిన్ని కథలు

Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న
ఓ breaking news
ఓ బ్రేకింగ్ న్యూస్
- బివిడి ప్రసాద రావు
chettu baadha
చెట్టు బాధ
- లక్ష్మీ కుమారి.సి