విజయతిలకం - సుంకర వి.హనుమంతరావు

vijaya tilakam

‘స్త్రీణామాద్యం..ప్రణయవచనం విభ్రమో హిప్రియేషు”

స్త్రీలు ప్రియుల విషయమై తమ భావాలను విభ్రమములతోనే ..అంటే శరీర విన్యాసములతోనే ప్రకటిస్తారు తప్ప నోటి మాటలతో ప్రకటించరు. దానినే మనం ఈనాడు ఓ మోడ్రన్ ట్రెండ్ గా “బాడీ లాంగ్వేజ్ “ అంటూ విర్రవీగుతున్నాం.దాదాపు పద్నాలుగు వందల సంవత్సరాల క్రిందటే” కాళిదాసు మహాకవి” తన మేఘసందేశం లో వివరించారు.

స్రీలు సున్నిత మనస్తత్వం కలిగి వుండడమే దీనికి ముఖ్య కారణం కాదు. తమకు ప్రకృతి సహజంగా సంక్రమించిన ఆకృతిని ..అందమైన భంగిమలలో బంధించి ..ఎటువంటి భావాన్నైనా శరీర విన్యాసంతో వ్యక్తం చేయగల సామర్ధ్యాన్ని కలిగి వుండడమే.

అందుకే అన్నారో మహాకవి “కళ్లెత్తితే చాలు కనకాభిషేకాలు.”.అని.

సీనియర్ ఇంటర్ స్టూడెంట్స్ కు లెసన్ చెప్తున్న తెలుగు లెక్చరర్.. శ్రీరమణ..గొంతది.

స్టాఫ్ రూం ప్రక్కనే ఆ క్లాస్ రూం వుండడం..ఆ నాలుగో పీరియడ్ నాకు లీజర్ కావడంతో రమణ చెప్పే పాఠాలన్నీ నా చెవిని పడుతూనే వుంటాయి.

దాదాపు టూ యియర్సయి పోతోంది..రమణ కాలేజీ కొచ్చి.

ఇంగ్లీష్ బిఏ చేసి..తెలుగు భాషమీదున్న అభిమానంతో తెలుగు ఎంఏ చేసి..లెక్చరర్ గా జాయినై పోయాడని..ఇప్పటికో వంద సార్లు రికార్డ్ పెట్టేసింది వాణి..ద గ్రేట్ ఇంగ్లీష్ లెక్చరర్ ఆఫ్ దిస్ కాలేజ్ అండ్ ..మై ఒన్ అండ్ ఓన్లీ క్లోజ్ ఫెండ్

తనే కాదు మా కాలేజీలో ఎవరు నోరు విప్పినా ..సేమ్ డైలాగ్సే .స్టూడెంట్స్ కైతే ..మాస్టారు

కాదు ..మా..స్టారే! అతని కలుపుగోలు తనం..జంటిల్ బిహేవియర్..లైక్ చేయని వారు మా కాలేజీలో లేరనే చెప్పాలి. నాకు కూడా అతనంటే యిష్టమే.ఆ యిష్టం ఈ మధ్యే అదీ డాడీ లెటర్ వచ్చాక ఓ ప్రత్యేకతను సంతరించుకొని..హరివిల్లులా ఆకర్షణీయమవుతోందని అర్ధ మవుతోంది.

ఎంఏ సోషల్ సైన్సెస్ చేసిలెక్చరర్ గా స్థిర పడినప్పటి నుండి మమ్మీ డాడీలు పాడుతున్న పెళ్లి పాట వినాలనిపిస్తోంది.
ఆస్తి అంతస్తులున్న కుటుంబం మాది.ఆ ఆస్తికి నేనొక్కదాన్నే వారసురాల్ని.అందం విషయానికొస్తే “కాకి పిల్ల..సామెతలా “..నా అందం నాకే ముద్దొస్తుంటుంది..ఎప్పుడు బాత్ రూం మిర్రర్ ముందు నిలబడినా. నా ఫ్రండ్ వాణి కెప్పుడూ నా అందంమీదే ధ్యాస.
ఏయ్ శిరీషా.!.నువ్వీ చదువుల తల్లి వేషం మానేసి ..ఏ సిల్వర్ స్క్రీనుకో ..బుల్లి తెరకో ట్రాన్స్ ఫరైపోయి” మేరా శిరీష మహాన్”
అనుకుంటూ మేమంతా గర్వ పడేలా..చేయవే బాబూ అంటూ టైం దొరకితే చాలు వాయించేస్తూ వుంటుంది.

పెళ్లైపోయి ఇద్దరు భావి భారత పౌరుల్నిపొలోమంటూ కనేసినా..దాని చిలిపి తనం మాత్రం తగ్గలేదు.

వాణే తొలిసారిగా రమణమీద ఓ అభిప్రాయం కలిగేలా చేసింది.

ఆ రోజు కాలేజీ డే.ఫుల్ సూట్ లో రేమండ్ మోడల్లా తయారైన రమణ ఆ ఫంక్షన్ ను కండక్ట్ చేసిన తీరు అమోఘం.అదే స్టేజిమీద ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ తంతంతా నేనే నిర్వహించాను.

ఆ గొడవంతా అయిపోయాక హమ్మయ్య అనుకుంటూ..వాణి ప్రక్కన సెటిలౌతుండగానే మొదలు పెట్టింది. “అదీ మేడ్ ఫర్ ఈచదరంటే “అంటుంటే..అర్దంకాని గాని నేను తెల్లముఖం పెట్టేస్తే ..ఓయ్ పిల్లా !..ముఖాన్ని అంతగా..వైట్ వాష్ చేసుకోకు.నిన్నూ రమణల్ని అలా స్టేజ్ మీద చూస్తూ..

ఏ” సింగపూరో..స్విట్జర్లాండో “వెళ్లి పోయి..ఓ డ్యూయట్ ఊహించేసుకుందామని ట్రై చేసి ఫెయిలైపోయి..చివరకు శిరీషా రమణా ! వెన్నార్యుగివింగ్ పప్పన్నం విందో అని అడిగేద్దామనే నిర్ణయాని కొచ్చేశాను అన్న మాట.

తన మాటలు వింటుంటే తొలి సారిగా సిగ్గనిపించింది.

ఆహా ఏం ఫ్లూయన్సే బాబూ..ఇంగ్లీష్ ..తెలుగు ..రెండు లేంగ్వేజెస్..అదరహో..కుర్రాడు ఇంపోర్టెడ్ చాకులా వున్నాడు..నువ్వు స్పాట్ పెట్టెయ్ నేను బత్తీ బర్న్ చేసేస్తా.. అంటూ విజృంభిస్సున్న..దాని వాక్ ప్రవాహాన్ని ఆపకపోతే ..అక్కడే ఓ బహిరంగ సభ..ఏర్పాటు చేసేలా వుందని పించి ఆ విషయాలు తర్వాత మాట్లాడుదాం..ఇప్పుడెవరి చెవిలో నైనా పడిందంటే..ప్రత్యేకహోదా..విషయంలా..వైల్డ్ ఫైర్ అయిపోతుంది ఇప్పూడు ఆపవే ప్లీజ్.. అంటూ నోరు మూసెయ్య బోతుంటే ..

చిలిపిగా నవ్వి..చిన్నగా కన్నుకొట్టి

అయితే అమ్మాయి గారు ఆల్రెడీ..ట్రాక్ లోనే వున్నారన్న మాట..బెస్టాఫ్ లక్కే పిల్లా..ఆరోజైనా రమణబాబుని పంచెకట్టులో చూసే భాగ్యం దక్కుతుంది..ఎప్పుడు చూసినా ..జీన్సూ టక్కులేగా.

ఆ సంఘటన తర్వాతే రమణని నిశితంగా గమనించడం మొదలు పెట్టాను.అతని సిన్సియారిటి ప్రొఫెషన్ మీద అతనికున్న డెడికేషన్..నాకు ఎంతగానో నచ్చాయి . గుడ్ నేచరున్న..గుడ్ గై అన్న నిర్ణయాని కొచ్చేశాను.

క్లాసైపోయినట్లుంది..స్టూడెంట్స్ గోలతో నా ఆలోచన్లకు..బ్రేక్ పడింది.తేరుకుని చూస్తే..ఎదురుగా విజయ.లేబ్ అసిస్టెంటుగా పని చేస్తున్న విజయంటే నాకో ప్రత్యేకమైన అభిమానం.ఎంత పొలైట్ గా బిహేవ్ చేస్తుందంటే..ఇలాంటి అమ్మాయి కూతురు గానో ..చెల్లెలి గానో వుంటే ఎంత అదృష్టమో అనుకునేంత. ఆ అమ్మాయిని ఎప్పుడు చూసినా శరత్ నవలా నాయకి లానే అనిపిస్తుంటుంది.మంచి ముహూర్తం లేదని ..పెళ్లి తర్వాత ర్పాటు చేసిన శోభనానికి వస్తూ ఆటో యాక్సిడెంటులో ప్రాణాలుకోల్పోయాడు విజయ భర్త . కాలేజి తోటమాలిగా పనిచేస్తున్న విజయ తండ్రి అభ్యర్దనను మన్నించి..విజయను లేబ్ అసిస్టెంట్ గా నియమించింది కాలేజి మేనేజ్ మెంటు.అందం అణకువలున్న విజయ విషాధ కావ్యంలా మిగిలి పోయింది.

మేడం ! ఓపెన్ యూనివర్సిటీ బిఏ చదవమంటున్నారు శ్రీరమణ సర్.మిమ్మల్నడిగితే సబ్జ క్ట్ సజస్ట్ చేసి తగిన సలహాలుకూడా యిస్తారని ..మిమ్మల్ని కలవమన్నారు శ్రీరమణసర్.

విజయ మాటలకు చెప్పలేనంత ఆనందం కలగింది.అటువంటి ఐడియా నాకు రానందుకు సిగ్గనిపించింది.,ష్యూర్ విజయా..నేను చేసిన సబ్జక్ట్ లో చేస్తానంటే..నోట్సుతో బాటు..సబ్జక్ట్ లో హెల్ప్ కూడా చేస్తాను..రమణసర్ కి ఈ ఐడియా రావడం నిజంగా గ్రేట్.. మనస్ఫూర్తిగా అన్నాను.

ఔను మేడం శ్రీరమణ సర్ మన కాలేజీలో పని చేయడం ..పిల్లల అదృష్టం మాత్రమే కాదు..నాదికూడా..మళ్లీ కలుస్తాను మేడం.
రమణా యువార్ గ్రేట్ యార్ ..అనుకోకుండా వుండలేక పోయాను.రమణలాంటి వ్యక్తి జీవిత భాగస్వామైతే? నవ్వుకుంటూ నాన్న రాసిన లెటర్ మరోసారి చదువుదామని తీసుకున్నాను.

అమ్మా శిరీ.!.నీ అభిప్రాయం కోసమే ఈ ప్రపోజల్.మీ కాలేజీ లెక్చరర్ శ్రీరమణ గురించి నీ అభిప్రాయం రాస్తే నేను వాళ్ల అమ్మా నాన్నలతో మాట్లాడి విషయాలు తెలియ పరుస్తాను.కట్నకానుకలు ఆశించని ఆదర్శ కుటుంబం వారిది..చేతిలో లెటర్నెవరో లాక్కున్నట్లు అనిపించి చూస్తే వాణి.నేను రియాక్టవకముందే లెటరంతా చదివేసి.. అయి తే అమ్మాయి గారి లవ్ స్టోరీ ఫాస్ట్ ట్రాక్ లో పరుగెడుతోందన్న మాట.కంగ్రాట్సే ఐశ్వర్యారాయ్.. అంటూనే రెండు బుగ్గలూ చిదిమేసి ..నుదుటిమీద ముద్దు పెట్టేసింది. ఏం మాట్లాడాలో అర్దం గాక మౌనవ్రతం పాటించాను.

ఏయ్.. ఏంటే శిరీ!..అలా డల్లయి పోయావ్. కుదిపేస్తూ అడిగింది.

ముందు రమణ మనసు తెలియాలి కదా ? ..నెమ్మదిగా నా అనుమానాన్నివ్యక్తం చేశాను. ఆహా.. మరీ యింత చెత్త అనుమానమా?..అందము ప్రాయము ఐశ్వర్యమున్న నీ లాంటి అమ్మాయ దొరికితే ఎగిరి గంతేయని పురుష పుంగవు డెవరే..నీ ప్రపోజల్ కి రమణబాబు టై పీక్కో పోతే చూడు. తేలికగా కొట్టి పడేసింది.కానీ నేనంత ఈజీగా తీసుకో లేక పోయాను. చివరకు తనే ఓ పథకాన్ని రచించి ..నెక్ట్స్ సండే అమలు చేయాలని డిసైడ్ చేసేసింది.

*** *** ***

“ఆదివారం”

వాణి ప్లాను ప్రకారం మధ్యాహ్నమే తన ఇంటకెళ్లి ..తన బెడ్ రూంలో సెటిలై పోయాను.డ్రాయింగ్ రూం ప్రక్కనే బెడ్ రూం వుండడం వలన హాల్లోని సంభాషణంతా క్లియర్ వినొచ్చు.సాయంత్రం నాలుగవుతుండగా వచ్చాడు రమణ.వాణి తన హబ్బీని లిటిల్ రాస్కెల్స్ ని పరిచయం చేసింది.టీ బిస్కెట్స సర్వ్ చేసి.. క్యాజువల్ గా కాలేజి విషయాలు..లెక్చరర్ ల గురించి ప్రస్తావించి..చివరగా నా గురించి టాపిక్ ఎత్తింది.నా గురించి తన అభిప్రాయాన్ని అడిగింది.బెడ్ రూం లో వున్న నాకు నా హార్ట్ బీట్ డీటియస్ లెవెల్లోకి మారిపోయందని అర్ధమై పోయింది.
వాణీ మేడం ! శిరీషా మేడం గురించి నేను కామెంట్ చేయడమా?..మరీ జోకులేయకండి.మన కాలేజీ లెక్చరర్లలో షి ఈజ్ మోస్ట్ ఎఫీషియంట్ అండ్ బ్యూటిఫుల్ . ఆమెని లైక్ చేయని వారు మన కాలేజీలో ఎవరూ లేరు మేడం.

ఆ కామెంట్ నా గుండె నిండా ఆక్సిజన్ ని పంప్ చేసేసింది.గుండె చప్పుడు నార్మల్ కొచ్చేసింది.

శిరీషది మీదీ ఒకేకులం అని విన్నాను.వాళ్ల నాన్న గారు తనకు మ్యారేజి చేయాలని..కట్నకానుకలు నీ ష్టం.నీ అభిప్రాయం చెపితే..
మేడం కులాల కట్నాల ప్రసక్తి వద్దు.నా అభిప్రాయం రేపు కాలేజీ లో మీకే తెలుస్తుంది.సీ యూ మేడం..

రమణ వెళ్లి పోవడం నాకు తెలుస్తూనే వుంది.హడావుడిగా వచ్చిన వాణి గుడ్ లక్కే మేనకా..శ్వామిత్తుడు..ఆల్రెడీ తపస్సు ఫినిష్ చేసేసి నట్లున్నాడే.

తనకేం సమాధానం చెప్పాలో అర్దంగాని నేను సరాసరి ఇంటికొచ్చి బెడ్ మీద వాలిపోయాను.

*** ***

మర్నాడు కాలేజీకి డుమ్మా కొట్టేద్దామనుకుంటూనే రేపు కాలేజీలో మీకే తెలుస్తుంది మేడం అన్న రమణ మాటలు గుర్తొచ్చి ..కాలేజీ కొచ్చి కూడా అన్యమనస్కంగా ప్రేయర్ కి కూడా అటెండవకుండా స్టాఫ్ రూంలోనే వుండిపోయాను.కందిరీగల తుట్టెలా వుంది..మనసు.
ప్రేయరైపోయినట్లుంది.మైక్ లోంచి రమణ వాయిస్ వినిపించింది.

గౌరవనీయ ప్రిన్సిపల్ గారూ..తోటి సహాధ్యాయులు మరియూ నా ప్రియమైన..విద్యార్దులారా..

ఆదర్శం కోసమో అభ్యుదయం కోసమో నేనీ నిర్ణయం తీసుకోలేదు.జాలితోనో ..ఆమెను ఉద్ధరించాలనో నేనీ పెళ్లి చేసుకోవడం లేదు.ఆమె యిష్టానుసారమే..మన లేబ్ అసిస్టెంట్ విజయను మీ అందరి సమక్షంలో వివాహం చేసుకుంటున్నానని మనవి చేస్తూ మీ అందరి ఆశీస్సులను..సహకారాన్ని కోరుకుంటున్నాను.

కరతాళధ్వనులతో కాలేజి మారుమోగి పోయంది.విజయ పేరు వినిపించగానే అప్పటి వరకు నన్ను ఆవరించివున్న..నిరాశ..నిస్పృహలు పటాపంచలమై పోయాయి.కనులముందు కళ్యాణ తిలకంతో విజయ సాక్షాత్కరించింది.మనసు మల్లెలమేఘమై..ఆనందంతో ఆకాశాన్ని తాకిన అనుభూతితో శరీరం పులకరించి పోయింది.నాప్రమేయం లేకుండానే ఆనంద భాష్పాలతో..నా కనులు కాసారా లయ్యాయి.
రమణా యువార్ గ్రేట్ ..అనుకుంటూ నిలబడి అంజలి ఘటిస్తుంటే ఎదురుగా గోడమీదున్న కందుకూరి వారు..చిరునవ్వులు చిందిస్తూ ..వధూవరులను ఆశీర్వదిస్తున్న అనుభూతి కలిగింది.

మరిన్ని కథలు

Kya huvaa
క్యా హువా
- కె. తేజస్వని
Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు