నేనూ... నా దొంగేడ్పులు! - రామదుర్గం మధుసూధనరావు

"... అసలు వాడెలా ఏడుస్తాడు? ఒక్కసారి చూడాలని వుంది!!' నాన్న నోటి వెంట తరచూ వచ్చేమాట. కానీ నేను అంతకన్నా ఖతర్నాక్... ఆయన కంట పడకుండా చిత్ర విచిత్రరీతుల్లో ఏడ్చి ఏడ్చి నాక్కావలసింది సాధించుకునేవాణ్ణి. ఇలా ఏ ఒకరోజో రెండ్రోజులో కాదు . ఏడో తరగతి వచ్చేదాకా . మరి ఈ ఏడ్వడం ఎలా అలవాటైందో తెలీదు గానీ... అప్పట్లో అదే నా ఆయుధం. ఎలాంటి సమయంలోనైనా నేను ఏడ్వడం మొదలెట్టానంటే ఇంక అంతే! 'నాయనా... వీడు మొదలెట్టాడా... ఇంక నేను చచ్చినట్టే! రేయ్.. ఏమైందిరా?' వంటింటి నుంచే అమ్మ కేకలు మొదలయ్యేవి. ఏం చేయను మరి నా అవసరాలు అలాంటివి. గోలీలు కొనాలి... బొంగరం కొనాలి... చాక్లెట్ లా వున్న కమ్మర కట్ట కొనాలి... ఇన్నింటికి డబ్బులెవడిస్తాడు? పోనీ నా అవసరాలు గుర్తెరిగి నాకు తెలీకుండానే జేబుల్లో పైసలు పెట్టే పెద్దరికం వీరికి లేదాయే! ఫ్రెండ్స్ ను అడుక్కుందామా అంటే అదీ నాలానే దిక్కుమాలిన బ్యాచి. అయినా అప్పుడప్పుడు పప్పులు, బెల్లం, చక్కెర జేబుల్లో వేసుకుని తిరిగినా... పక్కనోడు పైసలు తీసి కొంటుంటే ఎక్కడ్లేని రోషం తన్నుకొచ్చేది. ఇన్ని సమస్యలకు నా దగ్గరున్న దారులు రెండే రెండు! ఒకటి ఏడ్వడం... రెండు సతాయించడం. సందర్భానుసారం గా ఆయా ప్రయోగాలు!

ఏ పనికైనా ముహూర్త బలం ముఖ్యం. నా ఏడ్పు కార్యక్రమం కూడా ముహూర్తం ప్రకారమే జరిగేది. ఇంట్లో నాన్న వున్నారంటే ... అది రాహుకాలం... వర్జ్యం తో సమానం. అందుకే ఆయన వున్నప్పుడు అన్ని మూసుకుని బుద్ధిగా రాముడు మంచి బాలుడు అన్న లెవెల్ లో పుస్తకాలు ముందేసుకుని కూర్చునేవాణ్ణి. అయితే మేనమామ గోత్రాలు అమ్మకెరుక అన్నట్టు నా వ్యవహారం నాన్నకు బాగా తెలుసు. అయినా ఏమీ ఎరగనట్టు వ్యవహరించడం లో ఆయన మహా దిట్ట. నాన్న ఇంట్లోంచి సైకిల్ బైటకు తీస్తున్నప్పుడు ... స్కూలు నుంచి వచ్చాకా లోనికి పెడుతున్నప్పుడు అయ్యే చప్పుళ్ళు చప్పున నా చెవుల్లోకి దూరిపోయేవి. అంతేకాదు... బైట తీసే శబ్ధం... లోనికి వచ్చే శబ్ధానికి మధ్య తేడా గుర్తించే తెలివిడి మస్తుగా వుండేది. నాన్న స్కూలుకు బైలుదేరాడని తెలియగానే మెల్లగా పిల్లిలా లేచి తలుపుదాకా వెళ్ళి నిజం గా నాన్న వెళ్ళాడని స్వయం నిర్ధారణ చేసుకున్నాక , నా తీరు తక్షణం మారిపోయేది. అంటే అమ్మకు రాహుకాలం మొదలైనట్టన్నమాట!

'నాకు పావలా ఇవ్వు... వెంటనే' నా అరుపు వినిపించగానే 'ఆ... మీ నాన్న స్కూలుకు వెళ్ళాడుగా... ఇంక మొదలెట్టూ...!' అనేది అమ్మ వ్యంగ్యం గా. ' నాకు పావలా కావాలి ఇస్తావా ఇవ్వవా' నా స్వరం కాస్త పెంచగానే ' ఎక్కడ్నుంచి వస్తుందిరా? డబ్బులు చెట్లకు కాస్తున్నాయా? పావలా కావాలట పావలా... అసలు బడికెందుకెళ్ళలేదో చెప్పు మొదటా అంటూ రివర్స్ గేర్ లో వచ్చేది. అయినా మేం తక్కువ తినలేదుగా ...'నాకు ఇప్పుడు అర్జంటుగా ఇవ్వు... మొన్న ఇస్తానన్నావుగా' పెంకెగా అనేసరికి అమ్మకు ఎక్కడ్లేని కోపం ముంచుకొచ్చేది 'ఇదిగో చెబుతున్నా... ఊర్కే సతాయించొద్దు. స్కూలు కన్నా వెళ్ళు ... లేదా ఆడుకోడానికెళ్ళు...' అంటూ పనిలో మునిగిపోయేది. ఆమె ఆడుకోడానికెళ్ళు అంటే నాకు ఆడుకోడాంకెళ్ళు అన్నట్టుండేది. ఇంక అప్పట్నుంచి నాకు అంతకంతకు ఉక్రోషం పెరిగిపోయేది. జేబులో పైసా గతిలేదు. ఆడుకోవాలంటే ఏమున్నాయి? బొగరీలా? గోలీలా? గాలిపటమా? ఒక్కట్లేకుండా ఆడుకోవాలంట! ఈమెదేం పోయింది. వీధిలో కాలుపెడితే పోయేది నా మర్యాదేగా! ఎలాగైనా సరే పైసలు లాగాల్సిందే... నా బుర్రలో రీళ్ళలా తిరిగే ఆలోచనలివే! అమ్మ ఎలాగూ పావలా ఇవ్వదని తెలుసు. అక్కడ మొదలెడితే... కనీసం అయిదు పైసల వద్దయినా బేరం ఆగుతుందని ఆశ అంతే! ఇక మాటలతో పని కుదరదని తేల్చుకున్నప్పుడు నా వజ్రాయుధాన్ని బైటకు తీసేవాణ్ణి. అదే ఏడ్వడం.

గోడకి చేరగిలబడి... రెండు కాళ్ళు చాపుకొని, అటూఇటూ ఊపుతూ 'పావలా కావాలీ... హుహుహూ.. 'అంటూ ఏడ్వడం ప్రారంభించేసరికి అమ్మ అదిరిపోయేది. వీడు మొదలెట్టాడ్రా బాబూ... అనుకుంటూ

'ఒరేయ్... ఏడ్వొద్దురా... పైసల్లేవు. నా దగ్గరెక్కడొస్తుంది? అయినా మీ నాన్న వెళ్ళేముందు అడగొచ్చుగా' అంటూ కసురుకునేది. 'ఆ... నాకు తెలీదు... పైసలివ్వూ... వూ...వూ ఓ అంటూ స్వరం పెంచడంతోపాటు కాళ్ళు నేలకేసి కొట్టడం మొదలయ్యేది. ఈ ఏడ్పు పెరిగేదే కానీ తగ్గేది కాదని అమ్మకు అర్ధమయ్యేది. పదో పరకో పడేస్తే తప్ప వీడు వదిలేలా లేడనుకుని వున్నదాంట్లో ఇచ్చేది. అది ఇవ్వనప్పుడే అసలు సమస్య మొదలు. 'ఏదీ... ఏడ్చావంటే పడతాయంతే! వుండూ నీ పని చెప్తా..." అంటూ పరక పట్టుకొచ్చేది. కానీ ఆపితేగా... అమ్మచేత్లో పరక వుంటుందే కానీ కొట్టదని తెలుసు. ఇంక ఆమె చేసేది లేక 'ఏడిస్తే... ఏడ్చుకో... వుంటే ఇస్తా... లేనిదే ఎక్కడ్నుంచి ఇచ్చేది... ఏమైనా చేస్కొని సావు...' అంటూ పనిలో మునిగిపోయేది. ఇంక చూస్కో అప్పుడు మొదలయ్యేది మూడోస్టేజి... అంటే కిందపడి దొర్లడం అన్నమాట. గట్టిగా ఏడుస్తూ... దొర్లుతూ... రెండు కాళ్ళు లేపి గోడకేసి కొడుతూ నానా భీబత్సం గా ఏడ్చేవాణ్ణి. గలాటా ఎక్కువయ్యే సరికి విషాలాక్షమ్మక్కో... పార్వతమ్మక్కో ఇంట్లోకి వచ్చేవాళ్ళూ. వాళ్ళను చూడగానే అమ్మ 'చూడమ్మా... ఎట్టా సతాయిస్తున్నాడో. రోజూ ఇంతే. బడికి పోరా అంటే పోడుగాని... నా ప్రాణం తీసేస్తున్నాడు... నువ్వయినా సెప్పూ అంటుంటే... వాళ్ళు 'ఏ... సలెప్పా... ఇడుసు... బలే ఏడుస్తుండావు గానీ... ఇంక చాల్జేయ్...' అని తిట్టు తిట్టి అమ్మతో కబుర్లలో మునిగిపోయేవారు. అప్పటికే ఏడ్చి ఏడ్చి కాస్త నిస్త్రాణం వచ్చి ఆపేసేవాణ్ణి. నేలపై నుంచి మాత్రం లేచేవాణ్ణి కాదు. అయితే వాళ్ళ కబుర్లు ఓపట్టాన తెమిలేవి కాదు. నా చెవి అటు పడేసి వాళ్ళేం చెబుతున్నారో వింటూ వుండిపోయే వాణ్ణి... వున్నట్టుండి మళ్ళీ నా పని గుర్తొచ్చేది. మళ్ళీ పుంజుకున్న శక్తితో ఏడ్పు మొదలెట్టేవాణ్ణా... 'ఇంక చాల్లేరా నాయనా... మూతిపై గడ్డాలు మీసాలు వచ్చాయి... నీ ఏడ్పు గోల ఆపు చూల్లేక పోతున్నాం గానీ...' తిడుతూ వాళ్ళు బైటికెళ్ళిపోయేవారు.

ఏదీ చేతకాకపోతే ఏడుస్తారని అంటారే గానీ ఏడ్వడంలోనూ చాలా నేర్పు కావాలి. సన్నగా ముసురులా మొదలై... క్రమం గా పెద్దదై... చివర్లో జోరుగా సాగాలి. మూడు స్టేజీల్లో వుండే ఈ కతలో మొదటే బోరుబోరు ఏడ్చేస్తే లాభం లేదు. అవతల వ్యక్తికి కనీసం తలనొప్పి కూడా తెప్పించలేకపోతే ఆ ఏడ్పు దండగమారి కింద లెక్క. అందుకే చాలా పద్ధతిగా ఏడ్వాలి. ఈ దశలన్నీ అమ్మకు ఎప్పుడూ తెలిసినవే కాబట్టి రెండు, మూడో స్టేజికి వెళ్ళకముందే మొహాన పైసలు పడేసేది. అయితే ఒక్కోసారి బండి తిరగబడేది. అలాంటప్పుడే కాస్త మొండిగా వ్యవహరించాల్సి వచ్చేది. అయితే ప్రతీసారి కచ్చితం గా ఏదో దొరికితీరుతుందన్న నమ్మకం లేదు. ఒక్కోసారి అమ్మ కజానా ఖాళీ అని నాకు తెలిసిపోయేది. అప్పుడు ఎంత అరచి గీపెట్టినా లాభం వుండదు కాబట్టి. ఏదో మొక్కుబడిగా ముక్కుచీదేసి... ముందెప్పుడయినా పైసలిచ్చేలా ఒప్పందం చేసుకుని బేషరతుగా రాజీపడిపోయేవాణ్ణి.

ఎప్పుడూ ఒకే ఆయుధాన్ని నమ్ముకుని వుంటే యుద్ధం కష్టమవుతుంది. నేను కూడా కేవలం ఏడ్చే కాకుండా సతాయించడం అనే మరో గట్టి ఆయుధం వాడేవాణ్ణి. అయితే దీనికి చాలా ముందుచూపు వుండాలి. చాలా విషయాలు అనుకూలించాలి. ఈ విషయం లో నేను చాలా అదృష్టవంతుణ్ణే! ఎందుకంటే అమ్మకు మడుగు వ్యవహారం వుండేది కాబట్టి ... చాలా సందర్భాల్లో ఆమెను సతాయించడానికి వీలుదొరికేది. అమ్మ పూజకోసం మండపం ముందున్న చిన్న కట్ట ఎక్కి కూర్చోగానే... కథ ప్రారంభించేవాణ్ణి. అయితే ఈ పద్ధతిలో అడుక్కోవడాలుండవ్... కేవలం డిమాండ్ చేయడమే మడుగు చీర ఆరేసుకోడానికి వాడే కర్ర పట్టుకునే వాణ్ణి.'ఒరేయ్ వద్దురా... నా మాట వినరా... తాకొద్దురా... మళ్ళీ స్నానం చేయాల్సివస్తుంది. వంట ఆలస్యమవుతుందీ అమ్మ ఒకటే వేడుకోలు. 'అయితే పైసలు ఇచ్చేయ్... లేకుంటే ఈ కర్రతో తాకేస్తా... తాకే..స్తా' వెనకా ముందూ జరుగుతుంటే... అమ్మకు ఒకటే టెన్షన్... ఒకవైపు పూజ... మరోవైపు నాన్న వచ్చేలోగా వంట పూర్తి చేయాలి... మధ్యలో నా కాకిగోల. పాపం ఎంత ప్రాధేయపడ్డా... నేను మంకుగా మొండికేసేవాణ్ణి... ఇక చేసేదిలేక తిడుతూ... అయిదో ... పదో పైసలు పడేసేది. పైసలు చేతిలో పడిందే ఆలస్యం కర్ర వదిలేసి పరిగెత్తడమే! అయితే ఒకసారి ఈ వ్యవహారమే బెడిసికొట్టింది.

ఎప్పట్లాగే... నేను కర్రను పట్టుకుని అటూఇటూ కదులుతుంటే... పొరపాటున చిన్ని చెల్లి తలకు బలంగా తగిలింది. అది అరుస్తూ కిందపడిపోయింది. అమ్మ కంగారు చూడాలి... మడుగు విషయం కూడా మరిచిపోయి...'ఒరేయ్... చంపేసావ్ కదరా దీన్ని ' అంటూ అరిచేసరికి... నాకు ఎక్కడ్లేని భయం పట్టుకుంది. బైటికి పారిపోదామంటే తలుపులు వేసి వున్నాయ్. ఇంక నా పని అయిపోయినట్టే అని గిజగిజలాడిపోయాను. అమ్మ చెల్లికి సపర్యలు చేసేసరికి కళ్ళు తెరిచింది. హమ్మయ్యా... బతుకు జీవుడా అనుకున్నా. ఇంక జన్మలో కర్ర పట్టుకుని బేరసారాలకు దిగరాదని మనసులోనే ఒట్టు పెట్టుకున్నా ఎన్ని వెధవవేషాలేసినా నాన్న చాలా చేయిచేసుకోవడం నాకు గుర్తులేదు. అది నాపై ప్రేమతో కాదు. వీడు మారడు... వీడి వ్యవహారం ఇంతే... అన్న భావన. అయితే ఆయనంటే వల్లమాలిన భయం వుండేది. నాన్న ఎక్కడున్నా కనీసం ఓ ఇరవై అడుగుల దూరం చుట్టుపక్కల వుండకుండా జాగ్రత్తపడేవాణ్ణి. ఆయన దగ్గినా... ఆయన స్వరం వినిపించినా... చటుక్కున మాయమైపోయేవాణ్ణి. మరి ఇంట్లో ఇంతలా సతాయిస్తుంటే నాన్నెందుకు కొట్టలేదు... అన్న అనుమానం మీకు వస్తోంది కదూ. నాకు అనుమానం రాలేదు కానీ...

ఊహ తెలిశాక నాన్న నాపై ఎందుకు చేయిచేసుకునేవాడు కాదో తెలిసింది. నాన్న ఇంట్లో ట్యూషన్లు చెప్పేవారు. రోజూ ఉదయం... సాయంత్రం స్టూడెంట్లతో ఇల్లు సందడి సందడిగా వుండేది. నా చిన్నప్పుడు ఓసారి నాన్న ట్యూషన్ చెబుతుంటే... నేను ఓ స్టూడెంట్ కంపాస్ తెరచి ... అందులో డివైడర్ ను నాన్న తొడకు గుచ్చేశాను. ఒక్కసారిగా కోపం తన్నుకొచ్చి నాన్న విసురుగా చెంపపై ఇచ్చేసరికి ఎగిరి గోడకు తగులుకుని పడిపోయాను. స్పృహ తప్పేసరికి చుట్టుపక్కల వాళ్ళు వచ్చి మూగేశారు. మా ఇంటి పక్కనే వున్న వనజమ్మవ్వ భర్త కిష్టాచారి నాన్నను ' ఏమయ్యా... పిల్లవాణ్ణి చంపేస్తావా ఏంటి?' అని అనేసరికి ఇక నన్ను కొట్టగూడదని గట్టిగా నిర్ణయం తీసుకున్నాడు. అప్పట్నుంచి నేను ఎంతగా అల్లరి చేసినా తిట్టేవాడు కానీ కొట్టేవాడు కాదు. నాన్నకు తెలీకుండా... అమ్మను ఎన్ని దార్లుంటాయో అన్ని రకాలుగా సతాయించి రెండు మూడు అయిదు పైసలు రాబట్టుకోగలిగాను కాబట్టే... అప్పట్లో నా నిక్కరు జేబి గోలీలు... బొంగరం తో కళకళలాడేది. నిమ్మపులుపు పిప్పరమెంట్లు, కమ్మరకట్టలు, బొంబాయి మిఠాయి, దూది పింజం లా మెత్తగా వుండే సోన్ పాపిడీ... ఈ చిరుతిళ్ళు మమ్మల్ని విపరీతం గా ఆశపెట్టేవి. ఆకర్షించేవి. సోంపాపిడీ వాడొచ్చాడంటే చాలు మా ప్రాణం లేచి వచ్చేది. వాడి కోసం నిలువు గుడ్లేసుకుని ఎదురు చూస్తుండేవాళ్ళం. వాడు రోడ్డు మీద రాగానే బండి కింద వేలాడే పెద్ద గంటను గణగణమంటూ వాయించేవాడు.

బండిపై బొర్లించిన పేద్ద గ్లాసు సీసా, అందులో వెండిపోగులా సున్నితం గా మెరుస్తూ ఊరించే సోన్ పాపిడీ. అక్కడ్నుంచి మా ఆరాటం మొదలు . రెండు పైసలిస్తే నాల్గు మునివేళ్ళతో ఆ పోగు తీసి చిన్ని పేపర్లో చుట్టి ఇచ్చేవాడు. సోన్ పాపిడి తీపి కన్నా వాడు ఇచ్చే నాజూకుతనమే మాకు మజా ఇచ్చేది. వాడిచ్చింది మొత్తం నోట్లో అలా వేసుకోగానే కరిగిపోయేది. చక్కెర పాఠం నాలుకకు తగలగానే నీరు ఊరిపోయేది. ఇంత రుచిగా వుంటుంది కాబట్టే... ఆ బండి వచ్చేలోగా నాల్గు పైసలు పోగేసుకుని వుండేవాళ్ళం. జేబులో పావలా వుంటే వాడు మహారాజు కింద లెక్క. అందుకే కమానులో నేనైనా, ఇంకోడైనా పైసలకోసం పడరాని పాట్లు పడేవాళ్ళం. పాపం అమ్మ పైసలు ఎక్కడ్నుంచి పోగేసేదో కానీ నన్ను తిడుతూనే ఇచ్చేది. ఎందుకో ఆ సతాయింపులో అమాయకత్వం... అమ్మ తిట్లలో అభిమానం గుర్తుచేసుకుంటుంటే ఇప్పటికీ కంట్లో చెమ్మ ఊరుతుంది. కమానులో ఏ ఇంట్లో తొంగి చూసినా... ఏ తలుపు తాకినా... మా చిన్ననాటి జ్ఞాపకాలు దొంతర దొంతరలుగా దొర్లుతాయి. వయసు పెరుగుతున్నా ఓ పట్టాన బుర్రను వదిలిపెట్టని పసితనం ఎన్ని అకతాయి పనులు చేయింద్రా దేవుడా అనిపిస్తుంటుంది. ఆ క్షణాల్లోనే కళ్ళల్లో పాత గురుతుల మెరుపులు మిలమిలమంటూ నవ్వుతుంటాయి.

మరిన్ని కథలు

Kya huvaa
క్యా హువా
- కె. తేజస్వని
Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు