వ్యాపార విద్య - పార్నంది వేంకట రామ శర్మ,

vyapara vidya

దసరారోజుల్లో సరస్వతీ దేవి పూజ చేసుకుంటే విద్యావృధ్ధి, ఉద్యోగ వృధ్ధి జరుగుతుందని అనాదిగా వస్తున్న నమ్మకం. ఈకాలం పిల్లలు ఫాషన్ల మోజులో ఎంత కొట్టుకుపోతున్నాగానీ, ఇంకా చాలామందిలో దైవం పట్ల భక్తి, నమ్మకం ఉన్నాయి. ‘అమ్మా, నాన్నలు చెప్పేరుగా, కాసేపు దేవుణ్ణి ధ్యానించుకుంటే మనకి పోయేదేముంది? వస్తే ఏదో ఒక మంచి తప్ప’ అన్న భావం ఉంది వారికి. అందుకే పర్వదినాల్లో చాలా గుళ్ళలో పెద్దవాళ్ళతో పాటూ పిల్లలూ కూడా కనిపిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో ఆయా దేవాలయాల్లో నూటెనిమిది సార్లు ప్రదక్షిణం అన్న కార్యక్రమం కూడా చేపడుతున్నారు కొందరు పిల్లలు. మా పిల్లలది కూడా మరీ గొప్ప భక్తి కాకపోయినా, పర్వదినాల్లో వాళ్ళ అమ్మ ఎంత చెప్తే అంత.

మా పెద్దవాడు ఎం. టెక్ ఫైనల్ ఇయర్, చిన్నది ఇంటర్మీడియట్ రెండో సంవత్సరంలో ఉన్నారు. ఎప్పటిలాగే కాస్త ముందుగానే మా ఆవిడ వాళ్ళని, పూజ ఉంది సిద్ధం కమ్మని చెప్పడం వల్ల, వాళ్ళూ తెల్లవారు ఝామునే లేచి, రెడీ అవసాగారు. దసరా సెలవులు సాధారణంగా గతంలో అన్నీ స్కూళ్ళకీ, కాలేజీలకీ ఇచ్చేవారు. టీచర్ వృత్తిలో ఉన్నవాళ్లకి సరేసరి. దసరానే ఓ సరదా వాళ్ళకి. 30-40 ఏళ్ల క్రితం దసరా పాటలు, పద్యాలు పిల్లలకి నేర్పి, వాళ్ళతో ఇంటింటికీ వెళ్ళి, వాళ్ళచేత ఆ పాటలు,పద్యాలు పాడించి ఎంతో కొంత దసరా కట్నం (అదే రాను రాను వాళ్ళకి తప్ప మిగతావారికి దసరా మామూలు, లేక దసరా దందా అయిపోయిందనుకోండి!) తీసుకునే వారు ఉపాధ్యాయులు. ముఖ్యంగా “అయ్యవారికి చాలు అయిదు వరహాలు, పిల్లవాళ్లకి చాలు పప్పు బెల్లాలు” అని తప్పని సరిగా పాడించి, తమకు కట్నం, పాడిన పిల్లలకి పప్పుబెల్లాలు రాబట్టుకునే వారు. ఈ కాలం చదువుల్లో కాలేజీ వారీగా ర్యాంకుల కోసం రన్నింగ్ రేస్ వల్ల దసరా సెలవులు, సంక్రాంతి సెలవులు, వేసవి సెలవులు అన్నీ అంతరించి పోయాయి. ఆదివారాలు కూడా హాఫ్ డే స్పెషల్ క్లాసెస్ అని పిల్లల్ని హింస పెడుతున్న కాలేజీలు కోకొల్లలు. మా పిల్లలకి అతికష్టమ్మీద ఒక్క విజయదశమి నాడే సెలవు ఇచ్చారు. సరస్వతీ పూజ నాటికి సెలవు లేదు కనుక, నేను ఆఫీస్ కి, పిల్లలు కాలేజీలకి వెళ్ళి పోవాలని ఉదయాన్నే పూజకి అన్నీ సిద్ధం చేసేసింది నా శ్రీమతి.

తీరా అన్నీ సిధ్ధం చేసుకున్నాక, అరటిపళ్లు చాలవేమో నని మా ఆవిడకి సందేహం కలిగింది. ఫలితం! అరటిపళ్ళ కోసం నేను ఉదయాన్నే రోడ్డెక్కాను. మా ఇంటికి దగ్గరే బజారు, అయినా అంత ఉదయాన్నే ఎవరు దుకాణాలు తెరుస్తారు?తెరిచినా పళ్ల దుకాణాలు తెరవడం కొంచెం కష్టమే. అయితే అరటిపళ్లు తోపుడు బళ్ల వాళ్ళే ఎక్కువ అమ్ముతారు కనుక, వాళ్లెవరైనా దొరుకుతారేమోనని ప్రయత్నించేలోగానే, ఓ రెండు అరటిపళ్ల బళ్ళు కనబడ్డాయి. బహుశా, పర్వదినాలు కదా, ఉదయాన్నే నాలాంటి బేరగాళ్ళు కూడా తగుల్తారని వాళ్ళ నమ్మకం కాబోలు. అందుకని ఉదయాన్నే రెడీగా ఉన్నారు వాళ్ళు.

హమ్మయ్య! అనుకుని, ఓ బండి దగ్గరకి చేరాను. తీరా చూస్తే ఆ బండి దగ్గర ఓ చిన్నకుర్రాడు, బహుశా మూడేళ్ళుంటాయెమో, కూర్చుని ఉన్నాడు. దగ్గర్లో ఎవరూ కనబడలేదు, వెనకున్న ఓ టీ కొట్టులో ఒకరిద్దరు తప్ప. పక్కనే ఉన్న ఇంకో బండి వాడు నన్ను చూసి పిలుస్తున్నాడు, “అక్క డెవరూ లేరుగానీ, ఇట్రాండి బాబూ” అని .

కానీ ఆ కుర్రాడు నన్ను చూస్తూనే “ అమ్మా! బేరమొచ్చిందే! రావే! రావే!!” అని గట్టిగా అరవడం మొదలెట్టాడు, వెనకున్న టీ కొట్టు కేసి చూస్తూ. నేను పక్కనున్న బండి దగ్గరికి వెళ్ళేలోగానే, ఆ అరుపులు విని, ఆ టీ కొట్టు దగ్గర నిలబడి టీ త్రాగుతున్న ఓ ఆవిడ “వస్తున్నా.. వస్తున్నా...” అంటూ టీ గ్లాస్ తో సహా పరిగెట్టుకొచ్చింది.

నాకు ఆ చిన్నపిల్లాడిని చూస్తే ఆశ్చర్యమేసింది. ముచ్చటేసింది కూడా. తన బండి దగ్గర కొచ్చిన వాడు అరటిపళ్లు కొనే బేరగాడు. ఆ బేరం పోకూడదని ఆ మూడేళ్ల వాడు తన తల్లిని పిలిచిన తీరు నన్ను ఆకట్టుకుంది.

“ఏమ్మా! నీ కొడుకా? భలే ట్రైనింగ్ ఇచ్చావు. ఇంత చిన్న వయసులోనే, బేరం పోకుండా భలేగా పిలిచాడు నిన్ను. ఇంతకీ డజనెంత? అనడిగాను ఆవిడని, అరటిపళ్లని పరీక్షిస్తూ. “అవును బాబూ. నా కొడుకే” అని నవ్వి, ‘డజను డెబ్భై బాబూ’ అని రేటు చెప్పింది ఆవిడ.
“మరీ డెబ్భై ఏమిటమ్మా? ఏభై చేసుకో” అన్నాను , ఇదే మా ఆవిడైతే డజను ఏ ముప్ఫై కో అడిగుండేది కదా, నా కంత ధైర్యం లేదనుకుంటూ.

‘మరీ అంత తేడా కిట్టదు బాబూ’ అని, మళ్ళీ ‘ఓ అయిదు తగ్గించి అరవై అయిదివ్వండి’ అందామె. పర్వాలేదు. అయిదు తగ్గింది కదా, నేనో అయిదు పెంచితే పోలా.. అననుకుని, సరే! ఏభై అయిదిస్తా.. ఓ డజనివ్వు “ అన్నాను అదే ఫైనల్ అన్నట్టుగా.

ఇలాంటి బేరాల్లో మా బావమరిది మహా ఘటికుడు. ఇలాంటివే కాదు, ఎక్కడైనా బేరాలాడే సత్తా ఉన్నవాడు. తను వాళ్ళ స్వంతూరులో హై స్కూల్ లో మాథ్స్ టీచర్ గా చేస్తున్నాడు. ఓ సారి వాళ్ళ ఊరికి మేం వెళ్ళినప్పుడు ఓ హోటల్ కి తీసుకుపోయి, సుష్టుగా టిఫిన్ చేశాక బిల్ చెల్లించే ముందు, ఆ సర్వర్ కన్నా ముందే బోర్డ్ మీద రేట్లు చూసి, మేం తిన్నవాటికి ఎంతయిందో లెక్క కట్టి, దానికి ఓ పది తగ్గించి కౌంటర్ లో ఇచ్చాడు.

ఆ ఓనరు గారు సర్వర్ చెప్పిన దానితో ఆ డబ్బులు సరిచూసి, ‘బాబూ! ఓ పది తగ్గించినారేటి?’ అనగానే, మా బామ్మర్ది “సరిపోతుందోయ్. చిన్న పూరీలు, చల్లారిన కూర, ఇడ్లీల్లోకి పులిసిన చెట్నీ! ఇంతకీ..పొద్దున్నే రెడీ చేయలేక, నిన్నటిదే వేసేశారా ఏంటీ ఆ చట్నీ? అన్నాడు సీరియస్ గా. దాంతో సీన్ అర్ధమైపోయి, “అబ్బే! అలాగేం ఉండదు బాబూ. సర్లేండి. పదిరూపాయల కేవుంది. ఈసారొచ్చినప్పుడిద్దురు గానీ” అంటూ మావాడిచ్చిన డబ్బులు తీసుకున్నాడా ఓనరు, ఓడినా గెలిచినవాడిలా మొహం పెట్టి, ఇంకోసారి ఆటో ఎక్కి ఫలానా సెంటర్ కి పోనీ అని, అక్కడ దిగాక ఇరవై రూపాయల నోటు వాడి చేతిలో పెట్టి వెళ్లిపోతుంటే ఆ ఆటో అతను ‘సార్! సార్! ముప్ఫై సార్’ అనరవసాగాడు. “ఈ దూరానికి నీకెంతివ్వాలో నాకు తెలుసు.

మనిషికి పది. ఇద్దరం కనుక ఇరవై. లెక్క సరిపోయిందిలే. లేకపోతే ఓ పని చెయ్యి. ఓ అరగంట వెయిట్ చేస్తే మమ్మల్ని మళ్ళీ ఎక్కినచోటే దింపేద్దువుగాని, అటు ఇటూ కలిపి ఏభై ఇస్తా. ఓకేనా!” అననడంతో వాడు గొణుక్కుంటూ పోయాడు. అప్పట్నుండి మా బామ్మర్దిని బేరగాడు అని పిలుస్తూండేవాళ్లం. అలాంటి మహా తెలివితేటలు అసలుకే లేవు నాకు.


ఏభై అయిదుకి కూడా సంకోచిస్తున్న ఆమెని చూస్తూ, పూజ కి ఇప్పటికే ఆలశ్యమైపోతోంది అనుకుంటూ, పోనీ ఆ అయిదూ కలిపేసి అరవై ఇస్తా అని అందామనే లోగానే, “అమ్మా! బోణీ బేరమే!” అన్నాడు మళ్ళీ ఆ పిల్లాడు.

ఇంకా ఆశ్చర్యపోయాను నేను. అంటే! ‘ఇది బోణీ బేరం, కాస్త తక్కువైనా వదులుకోవద్దు’ అని వాళ్లమ్మ కి హింట్ ఇస్తున్నాడా ఈ పిల్లాడు? ఏం బిజినెస్ మేనేజిమెంట్ కోర్సు తెల్సు వీడికి? హాయిగా ఆడుకునే వయసులో తన తల్లితో పాటు ఈ పళ్ల బండి మీద కూర్చుని, రోజూ తన తల్లి చేస్తున్న వ్యాపారాన్ని నిశితంగా గమనిస్తున్నాడా? బోణీ బేరం పేరిట కాస్త వెనక్కి తగ్గి నష్టపోకపోయినా, లాభం కాస్త తగ్గించుకుంటే, తర్వాత అమ్మకాల్లో ఆ తగ్గిన లాభాన్ని పూడ్చుకోవడం ఎంతసేపు? ఈ టెక్నిక్ కూడా ఈ చిన్నవాడు ఒంట బట్టించుకున్నాడా అన్న అనుమానం వచ్చింది. ఏమైనా, వాణ్ని చూశాక నాకు ఇంక బేరమాడాలనిపించలేదు. ఆమె ఎంతంటే అంత ఇచ్చేద్దామనే అనుకున్నాను. కావాలంటే మా ఆవిడకి వాళ్ళు డెబ్భై అంటే.. ఏభై కే తెచ్చా అని చెప్పేద్దాం గొప్పగా అని కూడా అనుకున్నా.

‘నేను చెప్పిన మాట విను’ అని మనం ఎవరితోనైనా అంటే.. అది వారిని భౌతికంగా వినమనే అర్ధమే కాకుండా, ఆ మాటని మన్నించి అలా చెయ్యి అన్న అర్ధం వస్తుందిగా!? అలాగే తన కొడుకు మాటలు విన్నట్టుగా, మన్నించినట్టుగా, “సర్లే బాబూ! బోణీ బేరం.” అంటూ డజను ఏభైఅయిదుకే ఇస్తున్నట్టుగా డజను పళ్ళు నేను ఎంచినవి తీసింది. ఈలోగా ఆ చిన్నోడు సగానికి చింపి రెడీగా ఉంచిన న్యూస్ పేపర్ ముక్క వాళ్లమ్మకి అందించాడు. ఆ కాగితం పొట్లం లో పళ్లని చుట్టి ఇచ్చిందామె. పాలిథిన్ కవర్ లేదా అని అడగబోయి, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించే చర్య గా ఆమె చేస్తున్న పనిని మెచ్చుకుంటూ అరటి పళ్లని తీసుకుంటూ,

“ నాకు నీ కొడుకుని చూస్తే ముచ్చట గా ఉంది. ఇప్పటినుండే మీతో తిప్పుకుంటూ వాడికి వ్యాపారం ఎలా చేయాలో నేర్పుతున్నావా ? బాగుంది “ అన్నాను.

“ఏటి సేత్తాం బాబూ. వేరే పెద్ద దిక్కు లేదు. అందుకనీ ఆడు సంటోడుగా ఉన్నప్పట్నుండీ కూడా ఇలా బళ్ల మీద మాతో పాటే ఉంచుకుంటున్నాం. మావేమీ నేర్పకుండానే, మాతోనే ఉండీ అన్నీ చూస్తూ నేర్చుకున్నాడు కావాల. నేనిలా బండి కాణ్ణుంచి ఎప్పుడేనా అలా పక్కకెళ్ళగానే బండి కాడికి ఎవరొచ్చినా ఇలానే పిలవడం వొచ్చేసింది. ఎదవకి ముదురు మాటలు బాగానే వొచ్చీసినాయి” అందామె కొడుకుని మురిపెం గా చూసుకుంటూ.

“అవి ముదురు మాటలు కావులేమ్మా. కుదురు మాటలే. నీకీపాటి సాయంగా ఉంటున్నాడు అది చాలదూ. ఏదన్నా స్కూల్ లో వెయ్యి. బాగా వృద్ధి లోకి వస్తాడు.” అని వాడిని మెచ్చుకుంటూ ఓ ఉచిత సలహా కూడా పారేశాను.

“మా చదువులేపాటివి బాబూ. పెద్ద పెద్ద చదువులు చదివించే శక్తి మాకెక్కడిది? ఏదో వ్యాపారం చేసుకునేందుకు చాలే చదువైతే చదివిస్తాం గానీ. “ అందామె నిరాశ గా. ఒకరకంగా ఆమె చెప్పిన మాట నిజమే. “ ‘విద్యే వ్యాపారం’ గా మారిపోయిన ఈ రోజుల్లో, వ్యాపారం చేసుకోవడానికి సరిపడే విద్యని నేర్చుకుని ఇటువంటివాళ్ళు రాణిస్తున్నారు.

తమకున్న తెలివితేటలు సక్రమంగా వినియోగించుకోగలిగితే, ఆ కొద్దిపాటి ‘వ్యాపారవిద్య’ చాలు జీవితంలో రాణించడానికి.” అనుకుంటూ.. “పోన్లెమ్మా! ఏ చదువైనా బ్రతకడానికి అవకాశం కల్పించడానికే గా! నీకు చాతనైనంతే చదివించు. వాడి వాలకం చూస్తే వాడు ఎలాగైనా హాయిగా బ్రతికేస్తాడులే!” అని ఆమెకి భరోసా, వాడికి దీవెన లాంటిది ఇచ్చి ఇంటికి బయలుదేరాను

మరిన్ని కథలు

Kya huvaa
క్యా హువా
- కె. తేజస్వని
Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు