వినయం . - ఆదూరి హైమావతి

vinayam

రామాపురంలో రాంబాబు ఒక వ్యవసాయ కూలీ. చాలా పేదవాడైనా మంచి వాడు. అతడి ఒక్కగానొక్క కొడుకు సోంబాబు తండ్రి లా వినయ విధేయతలున్నవాడు. ఆఊరి సర్కార్ బళ్ళో ఐదో తరగతి చదువుతున్నాడు.ఆఊరి పెద్ద రైతు పద్దయ్య కొడుకు కార్తీక్ కూడ అదే బళ్ళో ఐదో తరగతి చదువు తున్నాడు. చదువులో ఇద్దరూ పోటా పోటీ గానే ఉంటారు. ఐతే కార్తీక్ కు తాను ధనవంతు ల బిడ్డనని బాగా గర్వం. పంతుళ్ళకే సరిగా నమస్కరించడు.ఇహ తోటిపిల్లల్ని చాలా చౌకగా చూస్తాడు . తన బట్టలూ,తనబూట్లూ చూసి అంతా తనను గౌరవిస్తారని అపోహ పడతాడు.

సోంబాబు చదువులోనే కాక ఆటల్లోనూ బాగా ముందుంటాడు. అన్ని ఆటల పోటీల్లో అతడిదే ప్రధమస్థానం .కార్తీక్ ఆటల్లోసోంబా బు తో పోటీ పడలేడు. అదీ కార్తీక్ కు కంట గింపే. ఆసంవత్సరం చదువైపోతే తాను పట్నంలో పెద్ద స్కూల్లో చేరుతున్నట్లు తోటి వారందరికీ చెప్పుకుని మురిసిపోయాడు కార్తీక్. సోంబాబును అంతదూరం పంపి చదివించే స్థాయిలేక తండ్రి రాంబాబు తన తోటే కూలి పనికి తీసుకెళాతానని చెప్పాడు.సోంబాబుకు చదువంటే ఎంత ఇష్టం ఉన్నా, తండ్రికి చదివించే స్థోమత లేనందుకు విచా రిం చాడు, 'నాకింతే ప్రాప్తం, 'అనుకున్నాడు. ఆపాఠశాలపెద్దపంతులు వాడిబాధ చూసి తానూ బాధపడేవాడు.



ఆ సంవత్సరం పాఠశాల వార్షిక తనిఖీకి వచ్చిన అధికారి ఐదోతరగతి తనిఖీ చేస్తూ పెద్ద పంతులు గారితో "ఈసంవత్సరం మన ప్రభుత్వం విద్యాశాఖకు అదనపు నిధులిచ్చి క్రీడల్లో మంచి ప్రవేశమున్నవారిని ఉచితంగా చదివించి ఆటల్లో ఉచిత శిక్షణ ఇచ్చే విధా నాన్ని ప్రవేశపెట్టింది .మంచి అనుభవం సంపాదించిన విద్యార్ధులను జిల్లాపోటీలకూ, ఆతర్వాత రాష్ట్రస్థాయిపోటీలకూ అలా వారి గెలుపునూ సామర్ధ్యాన్నీ బట్టి ఇంకా పై పోటీలకూ పంపుతుంది. మంచి వినయ విధేయతలూ, కష్టపడే మనస్తత్వం, విచక్ష ణాఙ్ఞానం ఉన్న ఒక విద్యార్ధిని , దానికోసం మన పాఠశాలల నుండీ ఎంపికచేసే పని నాకు అప్పగించింది.మీరొక మంచి విద్యార్ధి పేరు ఇవ్వండి. " అని కోరారు.

అది విన్న కార్తీక్ మధ్యాహ్న భోజనసమయం లో ఇంటికెళ్ళి తన తండ్రికి చెప్పి తనపేరు పంపేలా చేయమని అడిగాడు. కార్తీక్ తండ్రి వచ్చి పెద్దపంతులుతో " పంతులూ! కార్తీక్ పేరు చెప్పండి తనిఖీ అధికారికి, బదులుగా నేను ఈ బడికి కావల్సిన సదుపా యాలన్నీ సమకూరుస్తాను " అన్నాడు. పెద్దపంతులు గారు "అయ్యా! నేను కార్తీక్ పేరూ, సోంబాబు పేరూ రెండూ ఇస్తాను. అధి కారే వారిలో ఒకర్ని నిర్ణయించి తీసు కుంటారు. పెద్దలు మీమాట నేనెందుకు కాదంటానూ "అన్నాడు.

తనిఖీ అధికారికి అంతా అర్ధమైంది. ఆయన " పంతులుగారూ! చెప్పడం మరచాను దార్లో నా చెప్పులు కాస్తంత కుట్లు ఊడి పో యా యి , ఎవరిచేతైనా కాస్త రిపేర్చేయిస్తారా!" అన్నాడు. పంతులు పిల్లలందరి వంకాచూసారు . సోంబాబు లేచాడు. అధికారి కుట్టు లూజైన ఒకచెప్పు ఇచ్చాడు.దానికి సోంబాబు "సారూ రెండు చెప్పులూ ఇవ్వండి , కుట్టేప్పుడు సరిసమానం చూసుకో వాలికదా!" అని ఆరెండు చెప్పులనూ తన గుడ్డ సంచీలో వేసుకుని వేగంగా పరుగెట్టి ఊరిచివర ఉన్న చెప్పులు కుట్టే చెలమయ్య వద్ద ఇచ్చాడు. చలమయ్య వాటిని చూసి " సోమూ! ఈ చెప్పులకు పెద్ద రిపేరేం లేదురా! ఎందుకు తెచ్చినట్లూ?" అన్నాడు.

సోంబాబు తల ఊచి " పెద్దయ్యా! రెండు చెప్పులూ బాగా పాలిష్ చేసి,సరిచేసి ఇవ్వు , చాలు . సందేళ మానాయన్నడిగి డబ్బిస్తా " అన్నాడు. చలమయ్య పనిచేస్తూ " దీనికి డబ్బేంట్రా! మీనాయన నాకెన్ని సార్లు సాయం చేయలేదూ!"అంటూ కొత్తచెప్పులా పాలిష్ చేసి,కుట్టు సరిచేసి ఇచ్చాడు. వాటిని తన గుడ్ద సంచీలో వేసుకుని వచ్చినంత వేగంగానూ తిరిగొచ్చి తనిఖీ అధికారి ముందుంచాడు. వాటిని పరిశీలించిన అధికారి మెచ్చుకోలుగా సోంబాబు వైపుచూసాడు. కార్తీక్ తండ్రికి చెప్పి ,తమ ఊర్లో ఉన్న ఒకే ఒక షాపు నుంచీ కొత్త చెప్పులు తెప్పించాడు.వాటిని అధికారి ముందుంచి "పాతవెందుకు సార్! ఈకొత్తవి వేసుకెళ్ళండి" అన్నాడు దర్జాగా. " కార్తీక్! గాంధీగారి కధ తెల్సుకదా! ఆయన అతిచిన్నపెన్సిల్ నే పాళీపోయిన పెన్ను లో ఉంచి చివరంటా వ్రాసే వారు. పొదుపు ఆచరించాలి బాబూ ! నాచెప్పులు నిజానికి పెద్ద రిపేరేం లేవు. చిన్నపరీక్ష పెట్టానంతే!. పాలిష్ చేయించి కొత్త వాటిలా మెరుపుతో తెచ్చాడు సోంబాబు.నిజానికి మీచేత నా పాద రక్షలు రిపేరు చేయించకూడదు. ఐనా మీ వినయాన్ని పరీక్షించనే ఈపనిచేసాను .అలాంటి విచక్షణ ఉన్నవాడేమాకు కావాలి. నేనుసోంబాబునుఎంపిక చేస్తున్నాను."అని ప్రకటించాడు.

చూసారా! వినయం ,విచక్షణా ఉన్న వారు ఎక్కడైనా రాణిస్తారు.

మరిన్ని కథలు

Kya huvaa
క్యా హువా
- కె. తేజస్వని
Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు