"బ్లెస్ మై పేరెంట్స్...బ్లెస్ మై టీచర్...బ్లెస్ మై రిక్షావాలా...'
కేవలం ఈ మాటలే నా స్థాయిని అమాంతం పెంచేశాయ్. నా నోటి వెంట వచ్చే ఈ మాటల కోసం చుట్టుపక్కల అమ్మలక్కలు... ఇంటికొచ్చే బంధువులు చెవులింతగ చేసుకుని వినేవారు. పాపం అమ్మ అయితే మనోడింక ఎక్కడిదాకా పోతాడో...అంటూ ఈస్ట్ మన్ కలర్ లో కలలు కంటూ తెగ మురిసి పోయేది. నేను కాన్వెంట్ చేరడమనేది ...మా ఇంటివాళ్లకు ఓ నవరసభరిత చిత్రం చూసి నంత గొప్ప అనుభూతి కల్గించిన విషయం. ప్రతి రోజూ కాన్వెంటుకు తీసుకెళ్లడానికి ఓ జట్కా రీతిలో ఉన్న రిక్షా ఉండేది. దానిపై సాయిబాబా కాన్వెంటు...అంటూ మిలమిల మెరిసే అక్షరాలుండేవి. యూనిఫాం నిక్కరు, షర్టు, టై కట్టుకుని, నల్ల షూలు వేసుకుని చిన్నసైజు ట్రంకుపెట్టెలాంటి తెల్లరంగు పెట్టెను ఊపుకొంటూ..ఎక్కడ్లేని వగలుపోతూ కాన్వెంటుకు వెళుతుంటే...చుట్టుపక్కల వాళ్లు అబ్బబ్బా...ఈడు సూడు కానుమెంటుకు ఎట్టా పోతుండాడో..మా దిస్టే తగల్తాదేమో...అక్కా మీ వోడికి సాయంత్రము రాగానే దిస్టి తీయండి... అంటూ ముచ్చటపడేవారు. ఈ మాటలు వింటున్న కొద్దీ అమ్మ కళ్లల్లో మెరుపులే కనిపించేవి.
ఆ రోజుల్లో కాన్వెంటు చదువు అంటే దుబారా కింద లెక్క! బాగా డబ్బున్నోళ్లు చేసే కొన్ని అతి పనుల్లో కాన్వెంటు పంపించేదొకటి. ఎందుకంటే పైసా ఖర్చు లేకుండా మునిసిపల్ స్కూలు ఇంటికి దగ్గరగా ఉంటే...ఎవుడు కాన్వెంటుకు పంపుతాడు? మధ్యతరగతి కంటే కాస్త దిగువన ఉన్న కుటుంబం మాది. అయినా నాన్న నన్ను కాన్వెంటుకు పంపే సాహసం ఎందుకు చేశారో మరి? కమానులో చుట్టుపక్కల పిల్లోళ్లు దగ్గర్లోని హావనపేట మునిసిపల్ స్కూలుకు వెళతుంటే...నేను మాత్రం టింగురంగా అంటూ సోగ్గాడిలా సాయిబాబా కాన్వెంటుకు వెళ్లేవాణ్ని. నన్ను కాన్వెంటుకు చేర్పించడంలో నాన్న ఆలోచనలేంటో నాకు తెలీదు. ఆ మాటకొస్తే ఇంట్లో ఎవరికి మాత్రం తెలుసు? అందరూ నన్ను ప్రత్యేకంగా చూడటం ...ఆ వయసులోనే నాకు తెలుస్తుండటంతో నాకు పండగలా ఉండేది.
కాన్వెంటు నుంచి ఇంటికి వచ్చిందే తడువు...పెట్టె పడేసి తుర్రుమంటూ వీధిలోకి పరిగెత్తేవాణ్ని. నా ఫ్రెండ్స్ అందరూ ఆటల్లో కేరింతలు కొడుతుంటే...నేను నా విద్యా ప్రదర్శన లో తలమునకలై పోయేవాణ్ని. కట్టలపై కూర్చొన్న కొందరు సరదా కోసం నన్ను పిలిచి... "ఒరేయ్...మీ కానుమెంటులో ఏం సెబుతారప్పా...' అనగానే నేను బుంగ మూతి పెట్టుకుం టూ "ఓ..చాలా..ప్రేయరు..రైములు..ఎ ఫర్ యాపిలు..' కళ్లు చక్రాల్లా తిప్పుతూ అంటుంటే..." అదంతా బేకులేదు గానీ...ఏదీ..అదేద్రా..బ్లెస్సు...అది చెప్పు...చెప్పరా రేయ్.. అంటూ తెగ బంగపోతుంటే...వారిని ఊరించి ఊరించి...నేను "బ్లెస్ మై పేరెంట్స్...' అంటూ అందుకో వడం...భలే మజాగా ఉండేది. కమానులో కాన్వెంటుకు వెళ్లేది నేనొక్కణ్ణే కావడంతో ...నాకు చాలా మర్యాదలు దక్కేవి. అంతా సజావుగా నడుస్తోంది అనుకుంటుంటే...ఓ అవాంతరం వచ్చి పడింది. అదీ నాకుగా నేను తెచ్చిపెట్టుకుందే! అంత పెద్ద అవాంతరమౌతుందని దేవుని తోడు నాకు తెలీదు. నాకెందుకు ఆ బుద్ది పుట్టిందో తెలియదుగానీ...ఓ రోజు మధ్యాహ్నం కాన్వెంటు లంచ్ కు వదలినపుడు...సక్కగా నడచుకుంటూ సాయిబాబానగర్ లోని చిట్టమ్మత్త ఇంటికెళ్లిపోయాను. ఆ వేళలో నన్ను చూసి అత్తమ్మ బిత్తరపోయింది. "ఇదేందిరా...ఇట్టా వచ్చేసినవ్..ఇంటికెళ్లలేదా?' అంటూ తెగ ఇదైపోయింది. పైగా అప్పట్లో వెంటనే సమాచారం అందించేందుకు ఫోన్లు లేవాయె. అమ్మనాన్నకంగారుపడిపోతారని అత్తమ్మకు తెలుసు. "ఎంత పని చేస్తివిరా...ఎవ్రుకి చెప్పకుండా వస్తే ఎలా?...' అని గొణుక్కొంటూ నన్ను ఎలాగోలా సాయంత్రానికల్లా జాగ్రత్తగా ఇంటికి చేర్చింది. ఇంక అక్కడ్నుంచి అసలు రాద్దాంతం సురూ...
నాన్నకు ఈ విషయం తెలీగానే ఒక్కసారిగా అగ్గిరాముడే అయ్యాడు. ఎందుకురా అట్లా వెళ్లావ్? దారి తప్పి ఏదైనా అయిఉంటే ఏంటి గతి? అంటూ అమ్మ పాపం తెగ బాధపడిపోయిం ది. నాన్నకు రెండురకాల కోపాలు ఒక్కసారిగా వచ్చాయి. ఒకటి నేను చెప్పా పెట్టకుండా దాదాపు అర కిలోమీటరు దూరంలో ఉన్న చిట్టమ్మత్త ఇంటికి పోలోమంటూ వెళ్లడం...రెండోది ఆ కాన్వెంటువాళ్లు నన్నెలా వదిలేశారన్నది. నేరుగా కాన్వెంటుకు వెళ్లి వారిని నిలదీశారు... "ఆ చినపిలగాణ్ని ఎలా పడితే అలా వదిలేస్తారా? కనీసం చూసుకోరా? వాడికేమైనా అయితే ఎవరిది బాధ్యత?' ఒక్కసారిగా ప్రశ్నల వర్షం కురిపించాడు. వారు ఏమాత్రం చలించక... మమ్మల్నేం చేయమంటారు సర్? లంచ్ టైంలో ఇంటికొస్తా డనుకుంటాం గానీ...ఎక్కడికో పోతాడని ఎలా తెలుస్తుంది?...అయినా ఇంత చిన్నోడికి ఇవేం పాడుబుద్ధులు? అంటూ విసుక్కున్నారు. నాన్న చేసేదేమీ లేక ఇంటికొచ్చారు. ఏరా బుద్దుందా నీకు...ఎవడు వెళ్లమ న్నాడ్రా? అంటూ భయంకరంగా తిట్టిపోశాడు. ఇంత రచ్చ అవుతున్నా...నాన్న ఎందుకు కోప్పడుతున్నాడో అమ్మెందుకు బాధ పడుతోందో ఎంత బుర్రగోక్కున్నా పిసరంత కూడా అర్థం కాలేదు. కాసేపు గోడకానుకుని కూర్చొన్నా...నాన్న ట్యూషన్ మొదలెట్టగానే... మెల్లగా నేను వీధిలోకి జారుకున్నా..
నేను ఎంత పెద్ద సాహసం చేశానో...నా ఫ్రెండ్స్ వద్ద గానీ తెలిసిరాలేదు. నన్ను చూడగానే చుట్టుముట్టేసి...రే రే బలే పోయిండావే...కాన్మెంటు గేటుకాడ ఎట్టా మిస్ కొట్టినావురా..హీరో అంటే నీవేరా నాయనా! ఒకే రీతిగా పొగుడుతుంటే...ఫరవాలేదు ఘనకార్యమే చేశానని సంబరపడిపోయాను. అయితే దాని ఫలితం ఎలా ఉంటుందో రెండ్రోజులకుగానీ తెలిసిరాలేదు. ఇంక ఆ వెధవ కాన్వెంటు బంద్...అంటూ అక్క చదివే అర్ధగేరి బసవనగౌడ మునిసిపల్ స్కూలుకు చేర్పించాడు. అక్కడైతే నాపై అక్క కన్నేసి ఉంటుందని. విచిత్రమేమంటే ఇదే...ఆ స్కూలు మా చిట్టమ్మత్త ఇంటికి ఆమడదూరంలో ఉంటుంది. నేను కొవ్వెక్కి ఏ దారిలో వెళ్లానో...ఆ దారే నాకు దిక్కయింది. రోజూ చచ్చినట్టు ఆ దారంటే స్కూలుకు వెళ్లాల్సి వచ్చంది. మరో మాట లేకుండా స్కూలుకు రెడీ అయిపోయాను. నిజానికి సోకుగా కాన్వెంటు వెళ్లాల్సింది పోయి మునిసిపల్ స్కూలు దారి పట్టినందుకు కుమిలి కుమిలి ఏడ్వాల్సిన నేను ఏ మాత్రం సిగ్గులేకుండా అక్క వెంట సిద్ధమయ్యాను. అరె...స్కూలు యూనిఫాం పోయిందే...బ్లెస్ మై టీచర్ అంటూ అడిగినోళ్లు...అడగనోళ్ల ముందు గొంతెత్తి పాడే ఛాన్స్ పోయిందే అన్న బాధ ఏమాత్రం కలగలేదు. కానీ కలగలేదు అనడం కన్నా అంతదూరం ఆలోచించే మెదడు లేకపోయిందనడమే సరి. అక్కకు మాత్రం తోడు దొరికానని సంతోషం.
రోజూ అక్కా నేనూ ఇంటి నుంచి స్కూలుకు నడచుకుంటూ వెళ్లేవాళ్లం. అక్కేమో... ఇంతేసి పేద్ద సంచి తగలించుకుని వచ్చేది. నాకు ఏదో చిన్న సంచి వెదికి మెళ్లో వేసి, ఇక పదరా సామీ...నీ బతుక్కిదే పదివేలు...అంటూ అమ్మ సాగనంపింది. దారిలో చిన్న మార్కెట్...కొంచెం ముందెళిత గోషాస్పత్రి. దాని కాంపౌండుకు ఆనుకుని ఓ పెద్ద ట్రాన్స ఫార్మర్. దాన్ని చూడగానే మళ్లీ బుర్ర పాదరసంలా మారిపోయింది. ఓ రోజు స్కూలుకు వెళ్లే ముందు ట్రాన్స్ ఫార్మర్ అంచున అమ్మ ఇచ్చిన పైస పెట్టాను. వచ్చేముందు అక్కతో అన్నా...మనం స్కూలుకెళ్లే ముందు పైసా ఉంచా...ఇప్పుడుందో లేదో చూద్దామని..వెళ్లి చూశాం. పైసా నిక్షేపంలా అక్కడే ఉంది. మాకు ఏదో పెద్ద నిధి కనుక్కొన్నంత ఆనందం వేసింది. అక్కకు ఇదో త్రిల్లింగ్ సినిమా అనిపించింది.పాపం ఇన్నాళ్లు అదే తోవలో స్కూలు కెళుతున్నా... ఇలాంటి ఆలోచన రాలేదు. ఇక అప్పట్నుంచి రోజూ స్కూలుకెళ్లేటప్పుడు పైసలు పెట్టడం...వచ్చేముందు తీసుకురావడం ఓ పెద్ద ఆటలా మారింది. రోజులు గడుస్తున్న కొద్ది కొత్త అలవాట్లు వచ్చి చేరుకున్నాయి. స్కూలు ఎదురుగా సాయిబాబా గుడి. మెట్లెక్కి వెళ్లాలి. రోజూ ఇంటికెళ్లేముందు గుడి వద్ద ఆగేవాళ్లం. అంటే మాకేదో భక్తి ముంచుకొచ్చిం దనుకుంటే పొరపాటే! గుడి రెండో మెట్టు వద్ద చప్పట్లు కొడితే ఝణ్..ఝణ్..అంటూ ఓ విచిత్ర శబ్దం వినిపించేది. మా స్కూలు పిల్లలందరికీ ఈ విషయం తెలుసు. వారు రోజులో ఏదో ఓ సమయంలో అక్కడికెళ్లి చప్పట్లు కొట్టేవారు. కొన్ని సార్లు పూజారి పై నుంచి రేయ్.. వెళ్లండి... వెళ్లండీ... అంటూ కేకలేసేవారు. పాపం ఆ మానవుడి మాటలు వినేవారెవరు? ఆ చప్పట్ల జట్టులో నేనూ చేరాను. రోజూ క్రమం తప్పకుండా ఆ మెట్టు దగ్గర నిలబడి చప్పట్లు కొట్టేసి..హమ్మయ్య ఓ పనైంది...అని తృప్తిగా వచ్చేవాణ్ని. స్కూల్లో ఏం చెప్పేవారో...నాకు ఎంత అబ్బిందో...అన్నఅవుటాఫ్ సిలబస్ ప్రశ్నల్ని , సందేహాల్ని పక్కన పెడితే...ప్రతి రోజూ ఠంచనుగా అక్కవెంట స్కూలుకు అంతదూరం హాయిగా నడుచుకుంటూ వెళ్లడం...ఏన్నో కబుర్లు...మరెన్నో పిచ్చి పిచ్చి ప్రశ్నలతో ఆమెను తెగ విసిగించడంతో కాలం సాగిపోతోంది.
ఓ రోజు నాన్న అక్కకు నాకు కొత్త బ్యాగులు కుట్టిస్తానని ప్రకటించాడు. పాపం పోనీలే కాన్వెంటు నుంచి స్కూలుకు మారాడని అనుకున్నాడేమో...ఏమైతేనేం ఆ మాట విన్న ప్పట్నుంచి నాకు కాలునిలువ లేదు. ఓ శుభముహూర్తాన ఖాకీ బట్ట కొని మా ఆస్థాన టైలర్ కు వేశాడు. అది మొదలు మనసులో ఒకటే ఆరాటం. సంచి ఎప్పుడొస్తుంది... రేపా...ఎల్లుండా..మర్నాడా...అక్కను రోజూ విసిగించి చంపేవాణ్ని. అక్కకూ లోలోన సంతోషం ఉన్నా...ఓ పట్టాన బైట పెట్టేది కాదు. నాకైతే రోజూ రాత్రి బ్యాగు గురించే కలలు. అమ్మ నన్ను ప్రేమగా పిలిచి..ఇదిగోరా...నీ బుజ్జి సంచి.. అంటూ నిగనిగలాడే కొత్త సంచిని మెళ్లో వేస్తున్నట్టు...అంగరాజ్యానికి అధిపతిగా చేస్తున్నా...పో ఇక ఏలుకో...ఇదిగో సంచి అంటూ నాన్న ఒకింత రాజసంతో విసిరినట్టు...చిత్తం ప్రభూ అంటూ వినయంగా అందుకుం టున్నట్టు..ఏవేవో పిచ్చి పిచ్చి కలలు. బ్యాగు పుణ్యమా అని నా ఆలోచన మొత్తం దాని గురించే అయిపోయింది. ఇంటికొచ్చే దారి మారిపోయింది.
రోజూ బడి నుంచి వచ్చేటపుడు ఆ టైలరంగడి ముందునుంచే వచ్చేవాళ్లం. ఆ ముస్లిం టైలర్ సాబ్...చాలా గంభీరంగా ఉండేవాడు. అసలు మాట్లాడేవాడు కాదు. మేం కాళ్లీడ్చుకుంటూ వెళ్లి అతని ముందు నిలుచుంటే...కనీసం తలెత్తి చూసేవాడు కాదు. ఈ యప్పకు ఎంత టెక్కురా నాయనా...అనుకునేవాళ్లం. కానీ ఆ కొత్త సంచి యావ వదిలితేగా! స్కూలులో సారుని చూసినా టైలరుసాబే కనిపించేవాడు. సారు పాఠం చెబుతుంటే...వినబుద్ధేసేది కాదు. ఎపుడెపుడు సాయంకాలం అవుతుందా...ఆ టైలరు షాపు ముందు వాలిపోదామా అన్నట్టుండేవాణ్ని. ఎంత లేదన్నా కనీసం ఓ పాతిక సార్లయినా ఆ కొట్టుచుట్టూ తిరిగి ఉంటాం. కానీ ఆ టైలరప్పకు కనికరమే లేకపోయింది. పోయిన ప్రతిసారీ ఏదో చెప్పి పంపేవాడు. ఒక్కోసారి చూపుల్తోనే షో కేసులో బట్టను చూపి...ఇంక కుట్టేస్తా అనేవాడు. మరోసారి ఇదిగో తడుపుతున్నానంటూ చిన్న ఇనుపబకెట్లో సగం తడిసిన గుడ్డను చూపేవాడు. ఏదో మాయ చేసేవాడు కానీ ఎప్పుడూ కుట్టను అని మాత్రం చెప్పేవాడు కాదు. అసలు ఆ బ్యాగును తగిలించుకునే ఆదృష్టం ఈ భుజాలకుందో లేదో అనుకుని తెగ బాధపడే వాణ్ని.
ఈ కొత్త బ్యాగు ప్రహసనం కొనసాగుతుండగానే...మరో గ్రాచారం వచ్చి పడింది. కాన్వెంటులో అతివేషాలు వేసినందుకు దారుణంగా దెబ్బతిన్నామన్న కనీస జ్ఞానం లేకపాయె...అందుకే ఈ గ్రాచారం.స్కూలుకు పెద్ద గేటు ఉంది. తెరచిన గేటులోంచి బుద్ధిగా వెళ్లాలి కదా...ఉహూ...ఆ గేటుకు వేలాడుతూ...అలా తోసుకుంటూ లోనికి వెళ్లవాణ్ని. అలా సర్రుమంటూ వెళుతుంటే ఏదో మజా. నేనే కాదు... మా క్లాసులో అందరూ ఇట్టాగే వెళ్లేవారు. ఓ సారి ఈ సర్కసులో నా బొటనవేలు గేటు సందులో ఇరుక్కుపోయింది.ఇంక ఒకటే రక్తం. నొప్పితో గావుకేకలు పెడుతుంటే పాపం అక్క గాబరాపడిపోయింది. సాయంత్రం ఇంట్లో ఈ విషయంగా మళ్లీ చర్చ...రచ్చ. నిన్నేమో చెప్పాపెట్టకుండా వెళ్లాడు...ఇవాళ ఇలా వంటిపై తెచ్చుకున్నాడు. రేపేం చేస్తాడో...వీడితో ఎలా వేగను? రాన్రానూ మొండిఘటమవుతున్నాడు అని అమ్మ చుట్టుపక్కలోళ్లతో చెబుతూ కన్నీరు పెట్టుకుంది. ఏం చేయాలో పాలుపోక నాన్న తలపట్టు కున్నాడు. వీణ్నేం చేయాలి? ఎక్కడేసినా ఏదో చేస్తున్నాడే...అనుకున్నాడేమో. ఇక లాభం లేదనుకుని నన్ను ఎత్తుకెళ్లి ఇంటివద్ద ఉన్న హావన్నపేట మునిసిపల్ స్కూల్లో పడేశాడు.
హావన్నపేట స్కూలు అనగానే ఎగిరిగంతేశాను. నిజానికైతే సిగ్గుతో చితికి పోవాలి. క్లాసులు పెరగాల్సింది పోయి స్కూళ్ల నెంబరు పెరుగుతోందని. ఇంతకూ నేనంత సంబరపడిపోవడానికి కారణం... కమాను ఫ్రెండ్స్ తోపాటు చుట్టుపక్కల గేరీ పిలగాళ్లు అదే స్కూలులో ఉండటం. రోజూ ఏంచక్కా అందరితో కలిసి వెళ్లవచ్చు. అమ్మ కూడా.."పోనీలే కళ్లెదుటే తిరుగుతుంటాడు అనుకుందేమో...శాంతించింది. రఘు,చెంద్రి అందరూ నేను వారితోపాటే అని సంతోషించారు. రఘు..పోనీలేరా...ఈ స్కూలే బావుంటుంది. అంత దూరం పోతే ఏమొస్తుందీ...కాళ్లనొప్పులంతే! అని తేల్చేశాడు. హావన్నపేట స్కూలు ఇంటికి చాలా దగ్గరవడంతో ఇంటర్వెల్ క్కూడా ఇంటికి పరిగెత్తుకొచ్చేవాణ్ని. అమ్మ చక్కెరో, బెల్లం ముక్కో ఇస్తే నిక్కరు జేబులో వేసుకోవడం మళ్లీ పరుగుతీయడం. స్కూలు బ్యాగులో స్లేటు, బలపాలతోపాటు బొగరీ,గోలీలు వచ్చి చేరాయి.స్కూలులో కిష్టప్ప సారు అంటే అందరికీ హడల్!
ఆయన క్లాసులోకి రావడం రావడంతోనే...అందరి వీపులపై దభ్..దభ్...అంటూ దెబ్బలు పడ్డాకే అటెండెన్స్ పిలిచేవాడు. నరసప్ప సారు చాలా నెమ్మది. నవ్వుతూ పాఠాలు చెప్పేవాడు. ఒకటోతరగతికి మేడమ్ ఉండేది. ఇంతలావు కళ్లద్దాలతో అందరినీ హడలెత్తించేది. ఓ సారి నా పక్కనున్నోడు "ఒరేయ్...టీచర్ ని సోడాబుడ్డీ అనరా...నీకు నిజంగ దయిర్యముంటే' అంటూ రెచ్చగొట్టాడు. తెంపరితనం తప్ప మరేం లేని నేను టీచర్ క్లాసులో ఉంటే...గాఠిగా..."సోడాబుడ్డీ' అంటూ అరిచేశా. మేడమ్ మొహం ఎర్రగా కంది పోయింది. బైటకు వచ్చి చొక్కా పట్టుకుని క్లాసులోకి లాక్కెళ్లింది. చెంపై లాగి ఇచ్చేసరికి...అది పూరీలా ఒక్కసారి పొంగింది. నాలుగు వేళ్ల వాతలు ఎర్రగా తేలాయి. సాయంత్రం కందిపోయిన చెంపతో ఇంటికెళ్లాను. నన్నలా చూడగానే అమ్మకు ఒక్కసారి ఆ టీచర్ పై కోపం తన్నుకొచ్చింది. "ఛీ..ఛీ ఏం మనిషి...చిన్నోణ్ని ఇలా కొట్టేస్తారా ఎవరైనా? దవడ చూడు ఎలా వాచిందో...చేతులు పడిపోనూ...' అంటూ టీచర్ ను దుమ్మెత్తి పోసింది. "ఇంతమంది పిల్లలుంటే...నా కొడుకే దొరికాడా కొట్టడానికి...' అంటూ చుట్టుపక్కలోళ్లతో అంటుంటే..."నీ కొడుకు చేసిన వెదవపని మాత్రం తక్కువా ఏంటి? అని చెప్పేవారు ఎవరూ లేరు కాబట్టి...దీనాతిదీనంగా మొహమేసుకుని అమ్మ కొంగు పట్టుకుని ఎక్కిళ్లు పెట్టాను.
అమ్మ చుట్టుపక్కలోళ్లతో చెప్పుకుందే గానీ ఈ విషయం నాన్నదాకా తీసుకెళ్లలేదు. ఆయనకు గానీ కోపం వస్తే ఈసారి ఎత్తుకెళ్లి ఏ చెరువులో విసిరేస్తాడో అని భయపడి ఉంటుంది. సాయిబాబా కాన్వెంటుతో అట్టహాసంగా మొదలైన నా స్కూలు ముచ్చట...వినాయకుడి పెళ్లిలా...నిలకడలేని పిల్లి సంసారంలా పదహారిళ్లు తిరిగి...చివరికి హావన్నపేట మునిసిపల్ స్కూలుకు చేరుకుంది.
అమాయకత్వం....ఆటపాటలపై ఎక్కడలేని ఆరాటం...వీటి మధ్య కుంటినడకన చదువు . ఆ చదువుతో మెదడు కుదుళ్లు గట్టిపడ్డాయో లేవో చెప్పలేను కానీ...ఒక జీవితానికి సరిపడా ఆనందపు రంగుల్ని మాత్రం మనసు అక్కడే అద్దుకుంది. నాగరికత పౌడరు రాసుకునే అవసరం లేని స్వచ్ఛమైన సందర్భాలవి.అప్పట్లో మమ్మల్ని తన సుకుమారత్వంతో ప్రభావితం చేసిన నరసప్ప సారును తర్వాతర్వాత చాలా సార్లు కలుసుకున్నాను. ఉద్యోగంలో చేరిన తొల్నాళ్లలో సార్ ని కలిసినపుడు వద్ధాప్య ఛాయలు బాగా కనిపించేవి. వణుకుతున్న స్వరంతో..." ఏమప్పా బాగుండావా...వచ్చినపుడల్లా మాట్లాడిస్తుంటావు...సానా సంతోషం! మీకు మేమేం సెప్పిండామో గుర్తులేదు..కానీ మీరు పలకరిస్తుంటే ప్రాణానికి కుశాలంగా ఉంటుంది నాయనా! ' అంటుంటే కళ్లల్లో నీళ్లు చివ్వున చిమ్మేవి. మనసును మానవీయంగా మలచింది ఈ టీచర్లే కదా...వీరే జీవితంలో ఎదురుకాకుంటే...అంటూ మనసు కొద్దిగా బెంగపడుతుంటుంది కూడా!!