పుత్రోత్సాహము - నూజిళ్ళ శ్రీనివాస్

putrotsaahamu

“సుబ్రహ్మణ్యం గారు - -ఎక్స్ రే రిపోర్టు ...మీరేనా? డాక్టర్ గారు రమ్మంటున్నారు” అంటూ నర్సు పిలవడంతో కుర్చీలో కూర్చుని పేపర్ చదువుతున్న నేను లేచి, డాక్టర్ గారి రూము లోకి వెళ్లాను. ఎక్స్ రే తీసి చూస్తున్నంతలో ఏదో ఫోన్ రావడంతో, మాట్లాడి ఎవరో వ్యక్తిని లోపలికి రమ్మన్నారు – మాటల్ని బట్టి వచ్చిన వ్యక్తి టైల్స్ బిజినెస్ లో ఉన్నారని, డాక్టర్ గారు ఏదో కనస్ట్రక్షన్ పని మీద అతని దగ్గర టైల్సు తీసుకున్నారని అర్ధమైంది.

డాక్టర్ గారిచ్చిన చెక్ తీసుకుంటూ ఆవ్యక్తి – “హాస్పటల్ కొత్త బిల్డింగ్ లోకి మార్చేస్తారండీ?” అని అడిగాడు. డాక్టర్ గారు నవ్వుతూ –“అబ్బే, అది మా అబ్బాయి, కోడలు కోసం అండీ – వాళ్ళు లండన్ నుండి వచ్చేస్తున్నారు – అబ్బాయి హార్మోన్ స్పెషలిస్ట్, కోడలు డెంటిస్ట్ – అది వారి రెసిడెన్స్ మరియు హాస్పిటల్ – అన్నారు”. “ఓహ్ సరేసార్ వస్తాను.” అంటూ వెళ్ళిపోయాడు. మరలా నా వైపు తిరిగిన డాక్టర్ గారితో, “సంతోషం సార్, మీ అబ్బాయి గారు లండన్ నుంచి వచ్చేస్తున్నారన్న మాట” అన్నాను – వారం రోజుల క్రితం నా శ్రీమతి వెళ్ళినప్పుడే డాక్టర్ గారు ఈ విషయం చెప్పడం, వారి అబ్బాయి, కోడలు అక్కడే ఉండడంతో పరిచయం కూడా చేయడం జరిగింది.

అవన్నీ గుర్తు చేస్తూ, నేను మాట్లాడుతుంటే “ఆ... అవునండీ, వాడు వచ్చేస్తాననడం నాకూ ఆశ్చర్యమే – ఎందుకంటే, పదమూడేళ్ళ పాటు అక్కడ ఉన్నవారు సాధారణంగా ఇక్కడకు వస్తామని అనరు- ఎందుకంటే, దేశం మీద, తల్లితండ్రుల మీద ఎంత ప్రేమ ఉన్నా, వారికి అక్కడ ఉన్న సౌకర్యాలు, ఒక పద్ధతికి అలవాటు పడిన జీవితం – అక్కడనుంచి రానివ్వదు. అయితే, మావాడు వస్తాననడం నిజంగా ఆశ్చర్యమే – అందునా డాక్టర్లు అంత తొందరగా అక్కడనుంచి రారు అన్నారు. “ఎందుకు?” అన్నట్లుగా చూస్తున్న నా చూపుల్లో ప్రశ్నను గ్రహించినట్లుగా – “ప్రస్తుతం మా అబ్బాయి పనిచేస్తున్న చోట ఉదయం నుంచి సాయంత్రం వరకే డ్యూటి – ఇంటికి వచ్చాక సాధారణంగా ఫోన్ కాల్స్ కూడా రావు – ముఖ్యంగా సిబ్బందితో ఏ విధమైన ఇబ్బంది ఉండదు. హేపీగా ఏడాదికి కోటి రూపాయలు ఖాతాలోకి వచ్చేస్తుంది...” అంటూ, నోరు వెళ్ళబెట్టి చూస్తున్న నాకేసి చూస్తూ, “..అదే ఇక్కడయితే, రూమ్ క్లీన్స్ చేసేవాళ్ళగురించి, నర్సుల గురించి, ఇతర పనివాళ్ళ గురించి, లేబ్స్ గురించి – ఇలా ప్రతిదీ పొద్దున్న లేచిన దగ్గర్నుంచి చూసుకోవలసిందే – నిజానికి వాళ్లకు అది పెద్ద తలపోటు వ్యవహారం – మాకంటే అలవాటు అయిపొయింది గాని ....” అన్నారు నవ్వుతూ.

ఎప్పుడూ బిజీగా ఉండే డాక్టర్ గారు ఆవేళ కూడా అంతే బిజీగా ఉన్నా, నాతో సరదాగా మాట్లాడుతూ వ్యక్తిగత విషయాలను పంచుకోవటం ఆనందంగా అనిపించి – “అదంతా మీరు నేర్పించిన సంస్కారం వల్లనే అయ్యుంటుంది సర్ – ఈ మధ్య ఏ వార్తలు విన్నా – తల్లితండ్రులు చనిపోయాక అంత్యక్రియలకు కూడా ఖాళీ లేదని విదేశాలనుంచి రాని పిల్లల గురించిన కథలే ఎక్కువ వినబడుతున్నాయి. అలాంటిది, ఇన్నాళ్ళ తరవాత మీదగ్గరకు వచ్చేస్తానని మీ అబ్బాయి అనడం బట్టి – వారు జీవితంలో ఏ అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలో స్పష్టత కలిగి ఉన్నవారని తెలుస్తోంది. అదంతా మీ పెంపకం వల్లే అయ్యుంటుంది సర్” అన్నా.

విలువలకు ప్రాధాన్యత నిస్తూ, ఆధ్యాత్మికత చింతనతో కూడా గడుపుతూ, ఎప్పుడూ ప్రశాంతంగా, ఋషి లా కనబడే శాస్త్రి డాక్టర్ గారంటే ఆ చుట్టుపక్కల అందరికీ ఇష్టమే – వారి హస్తవాసి మంచిదని విశ్వాసం. అన్నింటి కన్నా వారి మాట తీరు నాకు చాలా నచ్చుతుంది. వచ్చిన పేషెంట్ చెప్పిన విషయాలు అన్నీ శ్రద్ధగా విన్నతరవాతనే వైద్యం చేస్తారు – అనవసరంగా హై డోసు మందులు రాయరని, పని లేకుండా టెస్టులు రాయరని, ఊరికే హాస్పిటల్ లో అట్టేపెట్టుకోరని – జనంలో తరచూ వినబడే మాటలు. ఎంత బిజీ ప్రాక్టీసు ఉన్నా, నెలలో రెండు మూడు రోజులు తీర్థ యాత్రలకు, ఐదు, ఆరు నెలలకు ఒక రెండు వారాలు పిల్లల దగ్గరకు వెళ్ళడం చేస్తుంటారు. డబ్బు కన్నా సంతృప్తి, కుటుంబ సంబంధాలు ముఖ్యమని తెలియజేస్తుంది వారి జీవితం. బహుశా అదే సంస్కారం వారి వల్ల వారి పిల్లలకూ అబ్బి ఉంటుంది.

ఇలా ఆలోచిస్తున్న నాతో - “అదేం లేదండి. అదంతా మా నాన్నగారి ప్రభావం” – అన్నారు – ముఖం లో ఆనందం, బాధ కలిసి పోగా --- “మా నాన్నగారు చాలా ఆదర్శవంతమైన జీవితాన్ని గడిపారు – జీవితంలో ఏ అంశానికి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలో వారి ద్వారానే మాకు, మా పిల్లలకు తెలిసింది. వారు వ్యవసాయికులు, వేద పండితులు అయినప్పటికీ, ఆంగ్లంలో మంచి కవిత్వం, వ్యాసాలూ రాసారు – అంతర్జాతీయ పత్రికలలో కూడా ప్రచురితమయ్యాయి – అయినా ఆయన అత్యంత నిరాడంబరంగా, సంతృప్తిగా, ఆధ్యాత్మిక చింతనతో, ప్రశాంతంగా జీవితం సంపూర్ణంగా గడిపి, నాల్గు నెలల క్రితమే హఠాత్తుగా కాలం చేసారు....”. నిజమే, వారి గురించి స్థానిక వార్తా పత్రికలో ఒకరు రాసిన గొప్ప వ్యాసం కూడా నేను చదవటం జరిగింది, ఆ విషయాలన్నీ ఇప్పుడు గుర్తుకొస్తున్నాయి. తొంభై ఏళ్ల వయస్సులో వారు చనిపోయినా, సడన్ గా అంటూ, డాక్టర్ గారు అనడం – ఆ తండ్రి పట్ల ఈయనకు గల ప్రేమకు తార్కాణం అనిపించింది.

మృదు స్వభావి, మితభాషి అయిన శాస్త్రి గారు, వారి తండ్రి గారి ప్రస్తావన రాగానే, ఆనందంగా చాలా సేపు మాట్లాడుతూ ఉంటే, నేను అలా వింటూ ఉండి పోయాను. “పైగా....మా నాన్నగారంటే, మా మనవరాలికి కూడా చాలా ఇష్టం – ఆ ముత్తాత, ముని మనవరాళ్ళ ముచ్చట్లు వింటుంటే – కడుపు నిండిపోయేది – ఈ కాలంలో ఉండే పిల్లలను కూడా ఆకట్టుకొనే వ్యక్తిత్వం మా నాన్నగారిది....” అంటూ ముగించారు డాక్టరు గారు. ప్రిస్క్రిప్షన్ తీసుకొని నేను నమస్కారం చెప్పి బయటకు రాబోతుంటే, వెనక్కి పిలిచి, వారి తండ్రి గారి మీద వచ్చిన వ్యాసం ఒక జిరాక్స్ కాపీని తీసి ఇచ్చారు – చదవండి – అంటూ.

ధన్యవాదాలు చెప్పి బయటకు వచ్చిన నాకు నా అనారోగ్యం గురించిన ఆలోచన బెంగ, ఆందోళన పూర్తిగా పోయాయి – మానవ సంబంధాలకు, కుటుంబ విలువలకు ప్రాధాన్యతనిచ్చే పిల్లలు నేడు కూడా ఉండడం ఒక ఎత్తు అయితే, ఆ విలువలు, సంస్కారాలు అవిచ్చిన్నంగా ఒక తరం నుండి మరొక తరానికి కొనసాగుతూ ఉండడం మరో ఎత్తు. “పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జనియించినపుడె పుట్టదు, జనులా పుత్రుని కనుగొని పొగడగ పుత్రోత్సాహమ్ము నాడు పొందుర సుమతీ” అన్న పద్యం గుర్తుకొస్తుండగా హాస్పిటల్ బయటకు వచ్చాను.

మరిన్ని కథలు

Kya huvaa
క్యా హువా
- కె. తేజస్వని
Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు