సేవ - హైమాశ్రీనివాస్

seva

ఏనాడూ లేంది, ఎంగంపల్లికి విమానమంత తెల్ల కారొచ్చి పంచాయతీ ఆఫీసు ముందు ఆగింది. వాన కురిసిన మట్టిరోడ్డులో వచ్చి బురద కొట్టుకునున్నతెల్లకారు, యుధ్ధభూమిలో దెబ్బతిని ఒళ్లంతా రక్తం మరకలతో ఉన్న వీర సైకునిలా ఉంది. అంత పెద్దకారు ఏనాడూ చూడని పిల్లమూకంతా బెల్లం చుట్టూ మూగిన ఈగల్లా కారు చుట్టూ చేరారు. బొద్దుగా, ఎర్రగా, ఎత్తుగా పాత సినిమాల్లో ఎస్వీ రంగారావులా తెల్ల ఖద్దరు పంచా, లాల్చీలో ఉన్న ఒక 65 ఏళ్ళ పెద్దాయన కారు దిగాడు. " బాబూ!" అనే పిలుపు విని పంచాయతీ ఆఫీసు వరండాలో తలొక పేజీ పంచుకుని తెలుగు దినపత్రిక చదువుతున్న పదిమంది యువకులూ తలలెత్తి చూశారు.

"బాబూ! ఈ ఊర్లో పరమేశ్వరయ్యగారి ఇల్లెక్కడా?" అని అడిగాడాయన. " ఏ పరమేశం? ఈ ఊర్లో ఇద్దరు పరమేశ్వరయ్యలున్నారు? అన్నాడు వారిలో ఎత్తుగా ఉన్న ఒక యువకుడు. "అదే బాబూ! వాళ్లబ్బాయి హైదరాబాదులో ఉద్యోగం చేస్తున్నాడే, ఆ పరమేశ్వరయ్య గారు.." అన్నాడాయన. "ఓహో! పంచాయతీ ప్రెసిడెంటు పరమేశ్వయ్యా!? కుడి వైపు వెళ్ళి ఎడంకు తిరగండి మూడో ఇల్లే." అనిచెప్పి తిరిగి దినపత్రికా పఠనంలో పడ్డాడా యువకుడు. మిగిలినవారూ అదేపనిలో పడ్దారు. ఎండమావిలో దొరకని నీళ్ళకై ఎదురు చూసినట్లు లేని అవకాశాలకై వెతుకులాటలు వారివి, కడుపుకు తిండి, చేతికి పనీ దొరికే అవకాశం కోసం.

ఆ పెద్దాయన కారెక్కి ఆ యువకుడు చెప్పిన దారంట కారు నడుపుకుంటూ వెళ్ళాడు. ఆ ఇంటి ముందు కారాపి దిగాడాయన. వెనకాలే ఒక మహిళ దిగింది. ఇద్దరూ గేటు తీసుకుని లోపలి కెళ్ళారు. పెద్ద లోగిలి, చుట్టూ పెంకుల వరండా, గేదెలూ, ఆవులూ ‘అంబా’ అని అరుస్తూ లేగదూడలూ, గేటుకిరువైపులా పెద్ద వేపచెట్లూ, చుట్టూ అరుగులూ! రైతు కుటుంబం అని ఇల్లు చూడగానే తెలుస్తున్నది. అరుగు మీద కూర్చునున్న ఒక 80 ఏళ్ళ వయస్సాయన, "ఎవరదీ?" అన్నాడు గేటు తీసిన శబ్దానికి తలెత్తి . కారు దిగినాయన దగ్గరగా వెళ్ళి "అయ్యా! నా పేరు అనంత రామయ్య, మాది హైదరాబాదు. నేను పరమేశ్వరయ్యగారితో మాట్లాడాలని వచ్చాను.

వారిని కాస్త పిలుస్తారా?" అన్నాడు. "అయ్యా! నేనే పరమేశాన్ని. రండి లోపలికి“ అంటూ అరుగు దిగి లోపలికి దారి తీశాడు, పై పంచతో ముఖం తుడుచుకుంటూ. "సుశీలా! మంచితీర్ధం తేవే! హైదరాబాదు నుంచి మనతో మాట్లాడేందుకెవురో పెద్దోళ్ళు వచ్చారు." అంటూ కేకేసి, "కూర్చోండి బాబూ, కూర్చోమ్మా!" అంటూ కుర్చీలు చూపాడు. ఇద్దరూ కూర్చున్నారు. లోపలి నుంచి ఆయన పిలిచిన సుశీలమ్మ వచ్చింది, చేతుల్లో తళతళా మెరిసే కంచు గ్లాసులతో మంచితీర్ధం తీసుకుని ఇద్దరికీ అందించింది.

"దూరం నుంచొచ్చారు, కాళ్ళూ, ముఖం కడుక్కోండి బాబూ! వెంకయ్యా, ఈ అయ్య గారికి కాళ్ళకు నీళ్ళియ్యి. పిచ్చమ్మా! అమ్మ గారిని లోగాకు తీస్కెళ్ళు కాళ్ళు కడుక్కుంటారు, కాపీ చేయరాదూ సుశీలా!" అంటూ అందరికీ పనులు పురమాయించాడు పరమేశ్వరయ్య. కాఫీలు త్రాగి అంతా స్థిమిత పడ్దాక, "మీరే పని మీదొచ్చారో తెలుసుకోవచ్చా?" అన్నాడు. "అయ్యా! నేను హైదరాబాదులో ఒక కంటి వైద్యుడ్ని.." అంటుండగానే ఈశ్వరయ్య చివ్వున తలెత్తి చూశాడు. "మీ మనవడు వివేక్, మా అమ్మాయి చంద్రిక ఒకే ఆఫీసులో పనిచేస్తారు. మా అమ్మాయిని మీ మనవడికి అడగాలని సంబంధం మాట్లాడను వచ్చాము. ఈమె నా భార్య భానుమతి, ఈమె కూడా హైదరాబాదులో డాక్టరే!" అని తమను పరిచయం చేసుకుని, ఆగాడు అనంత రామయ్య. పై మీది కండువాతో ముఖం తుడుచుకుని "మీరు మా మనవడు వివేకానందును చూసినారా బాబూ?" అన్నాడు.

"చూట్టమేంటండీ! వివేక్ మా ఇంటి మేడ మీదే అద్దెకుండేది. మా అమ్మాయి చంద్రికా, వివేక్ ఇద్దరూ కలసి ఒకే ఆఫీసు కెళుతుంటారు రోజూనూ! ఇద్దరూ మనస్సులు ఇచ్చి పుచ్చుకున్నా, పెద్దల అనుమతి కోసం వేచి ఉన్నారు తప్ప, బయట పడ లేదు. మేమే వారి మనస్సు తెల్సుకుని, మీతో మాట్లాడదామని వచ్చాము." "మంచిది. ఐతే మా అబ్బాయి, అదే మా వివేకు తండ్రి శీనయ్య ఎరువులు తోలుకు రాను టౌనెళ్లాడు, మధ్యాహ్ననికి వస్తాడు. మీకు వివేకు గురించి ఏమి తెలుసు బాబూ?" "అదేంటండీ! వివేక్ బంగారం లాంటి యువకుడు. అలాంటి బుధ్ధి మంతుడు ఈ రోజుల్లో ఎవరూ ఉండరు. బాగా తెలివి గల వాడు, చదువుతో పాటుగా సంస్కారం ఉన్న వాడు. ఇంకేం కావాలండీ పిల్ల నిచ్చే వారికి? కట్న కానుకలకు లోటు చేయం, మాకున్నది ఒక్కతే అమ్మాయి, మా తర్వాత అన్నీ ఆమెకే." అన్నాడు అనంత రామయ్య.

"మంచిది బాబూ! మాకూ కట్న కానుకల మీద ఆశ లేదు, మాకున్నదే చాలు! తిండికీ, బట్టకూ మాకు లోటు లేదు. మీరా గదిలో విశ్రాంతి తీసుకోండి! నేనెంత తాతనైనా తండ్రితో సంప్రదించకుండా మాటివ్వలేను గదండీ!" అన్నాడాయన. కొంచెం సేపు విశ్రాంతి తీసుకున్నాక "భోజనానికి లేవండి!" అంది సుశీలమ్మ. ఇంతలో తోటకెళ్ళిన ఆమె కోడలు అనూరాధ కూడా వచ్చింది, పని వారి చేత వంకాయలు కోయించుకుని. "మేమంతా తోటల్లో పనులు చేసుకుంటూ, చేయించుకుంటూ ఉంటాం బాబూ! యజమాని లేందే పనివారు సక్రమంగా చేయరు. రామ్మా! అనూరాధా! వీరు హైదరాబాదు నుంచి వచ్చారు. ఇద్దరూ డాక్టర్లేట! మన వివేకుకు వాళ్ళమ్మాయిని ఇవ్వాలని సంబంధం మాట్లాడను వచ్చారు. సాయంత్రానికి శీనయ్య వస్తాడు గదా! అప్పుడే మాట్లాడ వచ్చని ఆగాను.

మీరిద్దరూ లేంది నేనేం మాట్లాడతా?" అంటూ ,"రండి బాబూ! అతికితే కతకదని ఉపోషం ఉండకండి! అతిధులు తినందే మేం తినం" అంటూ డైనింగ్ టేబుల్ దగ్గరికి పిలిచాడు వాళ్లని పరమేశ్వరయ్య. పెద్ద చెక్క టేబుల్. "మీ నగరాల్లో లాగా మా ఇళ్ళు, టేబుళ్ళూ అందంగా ఉండవు బాబూ! రైతులం, అవసరానికి తగినట్లు అమర్చుకుంటాం, సుశీలా! అన్నం వడ్డించండి! పిచ్చమ్మా కాళ్ళకు నీళ్ళు పట్టుకురా! అనూరాధా, కూరలు వడ్డించు," అంటూ, అందరికీ తలో మాటా చెప్పాడాయన. ఇంటి మహిళలు చక్కగా ఆప్యాయంగా చూసి చూసి వడ్డించి కడుపు నిండుగా భోజనం పెట్టారు, ఆత్మీయత, అభిమానం రంగరించి. వారి సంస్కారానికీ, అతిధి మర్యాదకు అనంత రామయ్యకూ, భానుమతికీ చాలా సంతోషమైంది. ‘అన్నమంతా పట్టి చూడక్కర్లేదు, ఒక్క మెతుకు చూస్తే చాలన్న‘ పెద్దల మాట, వారి మర్యాద, మన్ననతో తేట తెల్లంకాగా అనంతరామయ్య దంపతులు ఆనందించారు, తమ ప్రతిపాదనలో పొరబాటులేదని.

విశ్రాంతిగా నడవాలో కూర్చుని టీ.వీ చూస్తూ, లోకాభిరామాయణంలో పడ్దారు మొగవారు ఇద్దరూ. మహిళలు పెరట్లోని తోటలోకి భానుమతిని తీసుకెళ్ళి తమ పండ్ల, పూలతోట విశేషాలు చెప్పసాగారు. పొద్దు వాలుతుండగా బస్తీ కెళ్ళిన శీనయ్య అనే శ్రీనివాస రావు వచ్చాడు. "ఏందబ్బయ్యా! ఇంత లేటాయె! పొద్దు వాలుతున్నది ఎట్టొస్తవోని దిగాలు పడుతుంటిని, రా కాళ్ళుకడుక్కుని ఇంతెంగిలి పడు. సుశీలా! అబ్బయ్యొచ్చిండు చూడూ! బోం చేసినాక నీతో కాస్తంత మాట్లాడాల, హైదరా బాదు నుంచీ చుట్టాలొస్తిరి అబ్బయ్యా! ముందు తినేది కానీ, సుశీలా! కోడలు శీనయ్యకు వడ్డిస్తది కానీ, నీవు కాసింత చాయ్ పెట్రాదూ! తినేందుకేమైనా చేస్తూన్నరా!?" అంటూ తన ధోరణిలో అన్నీ ఒకే మారు చెప్పేశాడు పరమేశ్వరయ్య. మరో ఐదు నిముషాలకే వేడి వేడి పకోడీ ప్లేట్లు వచ్చాయి, ఆ తర్వాత టీ కప్పులూ వచ్చాయి టేబుల్ మీదకు. అంతా అయ్యాక "శ్రీనయ్యా! ఈ నడవాలో కూర్చుందాం రా! ఆడాళ్ళూ రండి, ఒకే మారిందురు, వెంకయ్యా! యాడున్నవ్! రారా యిటు, నన్ను దీస్కెళ్ళి నడవాలో దింపు" అంటూ కుర్చీలోంచీ లేచి నిలుచున్నాడు పరమేశ్వరయ్య. "శీనయ్యా! రారా! దీపాలన్నీ ఎయ్యండి పిచ్చమ్మా! చీకటవుతన్నాది!"అన్నాడు పరమేశం.

అనంతరామయ్య ‘టైం మూడే ఐంది కదా! ఈ పల్లెల్లో మూడింటికే దీపాలు వెలిగించుకుంటారేమో!’ అనుకున్నాడు. వెంకయ్య చేయి సాయంతో ఈశ్వరయ్య, ఆయన వెనకాలే శ్రీనివాసులూ వచ్చి కూర్చున్నారు. మహిళలు ముగ్గురూ కూడా వచ్చికూర్చున్నాక, పరమేశ్వరయ్య , "బాబూ! మీరు బాగా చదువుకున్నవారు, నగరాల్లో ఉండేవారు, మేమా పల్లెటూరి బైతులం, మా పధ్దతులు మీ నాగరీకులకు కొత్తగా ఉంటయ్యేమో! మా గురించీ కొంచెం చెప్పడం ఇంటి పెద్దగా నా ధర్మంగా భావిస్తున్నా. మాది మొదటి నుంచీ ఉమ్మడి కుటుంబం, ఐదు తరాలుగా మా ఇంట మా పిల్లల్ని పరాయి ఇళ్ళకు పంపకుండా మేనరికమే చేస్తూవచ్చాం. మేమే కాదు బాబూ! ఇంచుమించుగా ఈ గ్రామంలో ఉండే వారంతా అంతే! మా అక్క బిడ్డనే మా కొడుకు శీనయ్యకు చేసుకున్నాను.

అక్కా బావా పొలం నుంచీ వస్తూ మబ్బేసి దారి కనిపించక బండి తోలడంలో, బండి తిరగ బడి చెఱువులో పడి చని పోయారు. మా ఇంటి పిల్లలకెవరికీ చదువు కూడా అంతంత మాత్రమే. 20 ఏళ్ళ క్రితం మా ఊరు బడికి వచ్చిన పంతులమ్మ పద్మమ్మ, మా పిల్లల్ని తన బళ్ళో వేసి చదివించింది. ఈ ఊరి ఐదో క్లాసు చదువు కాగానే బాగా తెలివి గల పిల్లలనీ వాళ్ళ చదువు ఆపద్దనీ మాకు నచ్చ జెప్పి, తన పూచీ మీద టవున్లో తన ఇంట్లోనే ఉంచుకుని హైస్కూల్, కాలేజీల్లో చదివించింది, ఆ తర్వాత మా మనవడు, మనవరాలూ ఇద్దరూ ఏదో పెద్ద నగరంలో, పిలానీనో ఏదో బాబూ! నాకు తెలవదు, ఇంజనీరు చదివారు ఆరేళ్ళు. చదివేప్పుడే మా పిల్లలకు ఉద్యోగాలూ వచ్చాయి. మాకెంతో సహాయం చేసిన ఆమె కొడుక్కే మా మనవరాలినిచ్చి గతేడాది పెళ్ళిచేశాం. సగం ఆస్తి కూడా రాసిచ్చేశాం, ఇలా మాఇంట్లో తొలిసారిగా వేరే ఇంటి బిడ్దకిచ్చి పెళ్ళి చేయడం జరిగింది. వీళ్లకి మేనరికం కూడా లేదు." అని చెప్తూండగా పరమేశానికి దగ్గు తెర వచ్చింది. గబుక్కున లేవ బోయిన సుశీలమ్మ దట్టుకుని క్రిందపడింది. పిచ్చమ్మ వచ్చి లేపి పట్టుకుంది. "ఎందుకే సుశీలా, అంత తొందర! "అన్నాడు పరమేశం.

"దగ్గుతున్నావ్ కదా మంచి నీళ్ళిద్దమనయ్యా!" అంది ఆమె. "బాబూ! ఏకారణమో కానీ మా ఇంట్లో అందరికీ రాత్రులు కనబడదు. మూడైన కాడ్ణుంచీ మాకు కాన్రాదు. మా ఇంటి దేవతలాంటి ఆ పంతులమ్మ పద్మమ్మ చెప్పింది, ఇలా తరాలుగా మేనరికాలు చేయడం వల్ల వచ్చిందని, దాన్ని ‘రేచీక’టంటారనీ! మా మనవడు చదువు కున్నాక ఈ జబ్బు గురించీ చాలా తెల్సుకున్నాడు. వాడికీ, మనవరాలికీ కూడా ఆపరేసన్ చేయించినం! ఐనా లాబం అంతగా కనిపిచ్చలా! మా మనవరాలికీ రేజీకటుందని తెల్సీ తన కోడల్ని చేసుకుంది పెద్ద మనస్సాపెది. ఇట్టాగా వేరే ఇంటి పిల్లలతో పెళ్ళిళ్ళు చేస్తే ఇగనా కంటి జబ్బు రాదంట గదయ్యా! మీరు కల్ల డాక్టర్, మీకు తెలిసే ఉంటది. ఇహ మా మనవడు ..." అంటూ ఆపాడాయన.

“మీ మనవడు అంతా చెప్పాడండీ! మీ మర్యాద, దాపరికం లేని మీమనస్తత్వం మాకెంతో నచ్చాయి. మీ మనవడికి 15 సం. వయస్సు నుంచే సరిగా కనిపించేది కాదనీ, దానివల్ల బిడియం కలిగి నలుగుర్లో కలవలేకపోయేవాడనీ కూడా చెప్పాడు. మీరు మంచి వివేకమున్న వారు కనుక చెప్తున్నాను. …” అంటూండగానే , పెద్దగా అరుచుకుంటూ పది మంది వచ్చారు ”పరమేశం మావా! మా ఆడాల్లు చెంబెత్తుకెళ్తే పాము కాటేసింది మావా! ..” అంటూ ఏడ్వ సాగాడు ఒకాయన. అప్పటికి సూర్యాస్తమయమైంది. “ఉండ్రయ్యా! బాబూ! మీరు డాక్టర్లు కదా! ఏదైనా…” అని పరమేశ్వరయ్య అంటుండగానే, “బాబూ! ఆమె ఎక్కడున్నారు?” అంది భానుమతి.

ఇంతలో ఒక స్త్రీని మోసుకుంటూ వచ్చారు కొందరు. ఆమెను బయటే ఉన్న మంచమ్మీద పడుకో బెట్టమని, కార్లోంచీ ప్రధమ చికిత్స సరంజామా తీసుకు వచ్చింది భానుమతి. ఆమెకు అవసరమైన చికిత్స చేసి ఒక ఇంజక్షన్ చేసింది. ఆ మంచాన్ని వరండాలోకి పట్టించి ఒకరిని ఉంచి విసన కర్రతో విసరమని చెప్పి , ”బాబూ! ఆమెకొచ్చిన ప్రమాదం ఏమీ లేదు. మీరు కాస్సేపు కూర్చోండి, ఆమె లేస్తుంది. సమయానికి వైద్యం అందింది.” అంది భానుమతి. ఆమె భర్త వచ్చి, భానుమతి పాదాలు పట్టుకుని “సమయానికి దేవతలా వచ్చిమా ఇంటి దాని ప్రాణాలు కాచావమ్మా!” అన్నాడు. భానుమతి అతడ్ని లేపి ”అయ్యా! నేనూ మీలాంటి మనిషినే, ఇక్కడ ఉండటం మూలాని మాకు తెలిసిన వైద్యం చేశాము. ‘కాగల కార్యం గంధర్వులు తీర్చా’రన్నట్లు, మేము వచ్చిన పని సులువైంది.

అంతా కూర్చోండి బాబూ! మీతో కాస్త మాట్లాడుతాము.” అంది భానుమతి. పాము కాటు మాట తెల్సి, ఆ పాటికే ఊరు ఊరంతా వచ్చి పరమేశ్వరయ్య ఇంటి ముందు చేరింది. భానుమతి మాటలకు అంతా కూర్చున్నారు. అనంత రామయ్య లేచి “బాబూ! నేను హైదరాబాదు నగరంలో ఒక వైద్యుడ్ని. ఈమె నా భార్య భానుమతి, ఈమె కూడా ఒక డాక్టరే! ప్రపంచమంతా వాయు వేగంతో ముందుకు సాగుతుంటే మీ గ్రామం ఇలా ఉండటం దురదృష్టం. మీరేమీ అనుకోకండి, మా మాటలు శాంతంగా వినండి. మేమిద్దరం మా వృత్తిలో ధర్మ మార్గంలో బాగా సంపాదించాం! ఈ పరమేశ్వరయ్య గారి మనవడు, మా అమ్మాయి చంద్రికా ఒకే ఆఫీసులో ఉద్యోగం చేస్తున్నారు. వివేక్ మాటలను విని మీ ఊరి పరిస్థితి అర్ధం చేసుకున్నాం! వివేక్ ఎలాగైనా తన వూరిని బాగు చేయాలని చెప్పాడు. మాకు పిత్రార్జితమూ చాలానే ఉంది. దాన్ని సద్వినియోగం చేయాలని సంకల్పించాం. మా అమ్మాయిని మీ ఊరి అబ్బాయైన వివేక్ కు ఇచ్చి వివాహం చేసి మీ ఊరితో చుట్టరికం కలుపుకుని మీ ఊరి వారమై ఒక పని చేయాలని మా ఉద్దేశం. ఐతే ముందు మీ ఊరికి సేవ చేసి ఆ తర్వాతే చుట్టరికం కలుపుకోవాలని ఈ సంఘటనతో భావించాం.” అంటూండగానే పాము కరచిన మహిళ లేచిందని తెల్సి వెళ్ళి చూశారు. ఆమె లేచి కూర్చుంది.

”అమ్మా మీరు ఈరోజు విశ్రాంతి తీసుకోవాలి" అని భానుమతి ఒక మాత్ర వేసి వచ్చింది. “అయ్యా! మీ గ్రామంలో ఉన్న మహిళలంతా ఇలా అవసరానికి చీకట్లో ఊరి బయటకెళ్ళి ఎన్నో ప్రమాదాలకు గురవుతున్నట్లు వివేక్ చెప్పాడు. మేము ఉండగానే ఈమెకు ప్రమాదం జరగ బట్టి మాకు సహాయం చేసే అవకాశం కలిగింది. లేక పోతే ప్రాణానికే మోసం వచ్చేది. ఖర్చంతా మేమే భరిస్తాం, మీరు స్వఛ్ఛందంగా సేవలో పాల్గొని మీ అందరి ఇళ్ళకూ శౌచాలయాలు కట్టించను సహకరించండి,” అంటూ తమ ప్రణాళికను అందరికీ తెలిపారు అనంతరామయ్య, భానుమతి. అంతా అంగీకరించారు.

మరుసటి వారంలో ఒక శుభ ముహూర్తాన ఊరిలోకి లారీలతో లోడు వచ్చి దిగింది. పరమేశ్వరయ్యతో కొబ్బరికాయ కొట్టించి పనులు మొదలుపెట్టారు. పని కోసం ఎదురు చూస్తున్న యువత అంతా, అక్షర ఙ్ఞానం ఉన్న వారూ, లేని వారూ అంతా నడుం కట్టారు. ఆ పాటికే పొలాల్లో పనులు ఐపోయాయి. రైతు కూలీలంతా పనుల్లేక ఊరికే ఉండే సమయానికి వారికి చేతి నిండాపని, కడుపునిండా కూడూ అమరాయి. అనంతరామయ్య, భానుమతి పక్కాగా ప్రణాళిక వేసి పనులు సాగించారు. వివేక్, చంద్రిక మధ్యలో వచ్చి పర్యవేక్షించి వెళ్ళేవారు. పద్మా టీచర్, వివేక్ చెల్లి వనజా కూడా వారి ఊరు బాగుపడుతున్నందుకు ఎంతో సంబరంగా వచ్చి చూడసాగారు. రెండు మూడు నెలలయ్యేసరికి ఊరి రూపే మారిపోయింది. పక్కా ఇళ్ళు లేనివారికి ఇళ్ళు, ప్రతి ఇంటికీ శౌచాలయాలు [సెప్టిక్ లెట్రిన్స్], స్నానాలగదులు, ఇళ్ళకు సోలార్ ఎనర్జీతో లైట్లు, ఊరి చివర ఉన్న చెఱువు పూడికతీత, వాననీరు పారే వాలు చూసుకుని మరొక చెఱువు, ఇంకుడు గుంతలు, ఊరంతా కలుపుతూ సిమెంట్ రోడ్లు, పంచాయతీ ఆవరణలో వైద్యశాల వెలిశాయి.

ఊర్లో ఒక్క పూరిల్లైనా లేదిప్పుడు. ఇంట్లో చెత్తంతా బుట్టల్లో ఉంచి ఊరి చివర ఉన్న పెద్దగుంటలో వేయడం మొదలుపెట్టారు. అదంతా ఎరువుగా మారాక అంతా వాడుకోవచ్చునని పంచాయతీ నిర్ణయించింది. దాంతో ఊర్లో ఈగలు, దోమలబాధ తప్పింది. వాటివల్ల వచ్చే జబ్బులూ లేవు. అనంతరామయ్య, భానుమతి తమ హాస్పిటల్ నుంచి సంచార వైద్య బృందాన్ని బస్సుల్లో తెప్పించి గ్రామవాసులందరికీ రక్త పరీక్షలు, అవసరమైన వైద్య పరీక్షలన్నీ చేయించారు. ఊర్లో బిడ్డలందరినీ స్కూలుకు పంపి చదివించే ఏర్పాటు చేశారు. పైచదువులకు వెళ్లేవారికి తమ సంస్థ తరఫున తగు ఏర్పాట్లూ చేశారు. ముఖ్యంగా ఆ ఊరిని బాధించే ‘రేచీకటి‘ నివారణ గురించీ వివరించారు. రక్త సంబంధీకులు... అంటే మేనరిక వివాహాలు జరపడం మంచిది కాదని పవర్ పాయింట్ ద్వారా చూపుతూ వివరించారు. మేనరిక వివాహాలవల్ల రక్తంలో ఏవైనా లోపాలుంటే దీర్ఘ వ్యాధులు రావచ్చు. తల్లిదండ్రుల జన్యువులో ఏదైనా లోపం ఉంటే, మరో జన్యువు ఆ లోపాన్ని పూరిస్తుంది. ఐతే రెండు జన్యువులూ లోపమైనవైతే ఏదైనా అవకరం, లేక లోపమున్న పిల్లలు పుట్టవచ్చు.

రెండు జన్యువులూ లోపంతో ఉండేవాళ్లిద్దరూ ఒకే రక్త సంబంధీకులైనప్పుడు వివాహాలు జరిగితే లోపాలతో బిడ్డలు పుట్టేందుకు అవకాశాలు చాలా ఎక్కువ. అందుకే ఆరోగ్యకరమైన సంతానం కోసం దూరపు సంబంధాలనూ, ఏ విధమైన రక్తసంబంధం లేని కుటుంబాలవారితో పెళ్ళిళ్ళు చేయడం మంచిదని ఆధునిక వైద్యశాస్త్రం చెప్తున్నది. మేనరికపు పెళ్ళిళ్ళు చేసుకుంటే, తరాలు గడిచిన కొద్దీ మంద బుద్ధులు, అనేక జబ్బులతో కూడుకున్న వాళ్ళూ పుడుతూ ఉంటారు. బ్రెయిన్ కు సంబంధించిన వ్యాధులూ, అంగవైకల్యమున్న పిల్లలూ, తీవ్రమైన చర్మవ్యాధులూ, ఒక రకమైన పక్షవాతం వంటి జబ్బులు, పుట్టుకతోనే రేచీకటి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది, వీటన్నిటికీ కారణం కేవలం మేనరికపు వివాహాలే! [రెటినిటిస్ పిగ్మెంటోసా]( ఋఫ్)అంటే రేచీకటి వారసత్వంగా వచ్చే ఒక కంటివ్యాధి. దీనికి పూర్తి నివారణ ఇంతవరకూ కనుగొనలేదు. కేవలం కొంతకాలం చూపు తగ్గకుండా ఆపరేషన్స్ చేయవచ్చు. ఒక కంటివైద్యునిగా నేను చెప్తున్నాను.

ఈ వ్యాధి లక్షణాలు సాధారణంగా పసివయస్సులోనే కనిపిస్తాయి. కొందరికి యుక్తవయసు ప్రారంభంనుండీ రేచీకటి ఉన్నట్లు తెల్సుకోవచ్చు. ఇది మొదలయ్యేప్పుడు చీకటిలో చూడలేకపోతారు, దృష్టి క్రమంగా తగ్గిపోతుంటుంది. నేరుగా ఉన్నవాటిని తప్ప పక్కన వాటిని చూడలేరు. దీన్నే వైద్యశాస్త్రంలో "సొరంగం దృష్టి" తున్నెల్ విసిఒన్ [ట్యూనల్ విషన్] అంటారు. క్రమేపీ అంధత్వం వస్తుంది. పగలు కూడా చూడలేరు. కంటికి ఒక తెర వేసినట్లు మసకగా నీడలు మాత్రమే కనిపిస్తాయి. వంశపారంపర్యం కానివారికి ఈ ’రేచీకటి‘ ఆహారలో విటమిన్ ఎ లోపంవల్ల వస్తుంది. విటమిన్ ఎ, క్యారట్లు, పసుపు లేక ఆకుపచ్చ కూరల్లో ఉండే విటమిన్ కంటిలోని రెటీనాను ఆరోగ్యంగా ఉంచడానికి సహకరిస్తుంది. కంటిలోని తెల్లపొర ప్రకాశం కోల్పోయి, పొడి ఆరిపోతుంది. కనుగుడ్డు మీద తెల్లని మచ్చలు ఏర్పడతాయి. ఈ వ్యాధి సోకినవారు మసక వెలుతుర్లో వస్తువులను చూడలేరు. ఇంకా అశ్రద్ధ చేస్తే పూర్తి అంధత్వము వస్తుంది. పగలు కనిపిస్తూ రాత్రులు లైట్లు ఉన్నా కూడా చీకటిగా ఉన్నట్లు ఉంటుంది. అందుకే ఈ వ్యాధిని రేచీకటి అంటారు. స్టీఫెన్ హిక్స్ అనే ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ పరిశోధకుడు ఒక కళ్ళజోడును కనిపెట్టాడు.

పూర్తిగా అంధత్వం ఉన్నవారికి కాక స్వల్పంగా కనిపించేవారికి ఈ కళ్ళజోడు ఉపయోగిస్తుంది. కళ్ళజోడు ఫ్రేముపై ఉండే వీడియో కేమెరా ఎదురుగా ఉన్న వస్తువుల చిత్రాలను తీసి చూపుతుంది. ఐతే దీన్ని బాగా ఆధునీకరించి మనం వాడే కళ్లజోడంత సైజుకు తీసుకువస్తే ఎంతోమందికి ఉపయోగిస్తుంది. ఇది చాలా ఖర్చుతో కూడినది, పైగా మన దేశానికి వాడుకకు రావడమూ కొంత కష్టమే! ఇవన్నీ మీకు బాగా తెలియాలని చూపుతున్నాను. ప్రపంచవ్యాప్తంగా ఈ రేచీకటి గురించిన పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. “అని వివరిస్తూ ఎదురుగా ఉన్న తెల్లని పెద్ద గోడమీద సినిమాలా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చూపుతూ అనంతరామయ్య, భానుమతి చెప్తుంటే గ్రామస్తులంతా ఆసక్తిగా చూశారు. భానుమతి అందుకుంది "గ్రామస్తులందరికీ నమస్కారాలు! ఏదో మేము చెప్తున్నామని కాక మీకోసం మీరు చాలా చేసుకున్నారు. ఇప్పుడు మన గ్రామంలో ఏ రోగాలూ రావు, ఐతే ఈ గ్రామంలో చాలామందికి ఉన్న రేచీకటిని మనం పూర్తిగా నివారించలేకపోయినా, పిల్లల్లో కనీసం రాకుండా తగు జాగ్రత్తలు తీసుకుందాం, మా గ్రూపు సభ్యులు రేపు వస్తున్నారు, రెండు బస్సుల్లో.

అన్నిపరీక్షలూ బస్సులోనే జరుగుతాయి. మాది ’మొబైల్ హాస్పిటల్, అంతా వచ్చి రక్త పరీక్షలు, మహిళలకు సంబంధించిన పరీక్షలు చేయించుకోండి, ప్రతినెలా వస్తాం, ఎవరికైనా ఏదైనా రుగ్మత ఉంటే నెల వరకూ సరి పడా మందులు ఇస్తాం! మళ్ళా నెలలో పరీక్షించి అవసరమైన వైద్యం అందిస్తాం! పెద్ద ఆపరేషన్స్ అవసరమైతే మా బస్సులో తీసుకెళ్ళి వైద్యం చేసి జాగ్రత్తగా తెచ్చి దింపుతాం! ఒక్క ఊరినైనా దత్తత తీసుకుని మావంతు సేవ దేశానికి చేయాలనే మా ఉద్దేశానికి మీరంతా సహకరించి మా కోర్కె తీర్చినందుకు సంతోషం. చేయీ చేయీ కలిస్తేనే శబ్దం అనేవారు, అది తగాదాలకు సంబంధించిన సూక్తి, మనం మన ఊరికోసం ’చేయీ చేయీ కలిపి కలిపితే శక్తి‘ అని ఇలా నవీకరించుకున్నాం, ఎవరో వస్తారనీ, ఏదో చేస్తారనీ కాక మనం మన ఊరిని బాగు చేసుకోడం మీకూ సంతోషంగా ఉంది కదూ! మా ఈ కార్యక్రమానికి అవసరమైన అనుమతి అంతా ప్రభుత్వం వారు కల్పించి, అంగీకరించినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం." అంటూ ముగించింది. గ్రామస్తులంతా వారిద్దరినీ తమ సంతోషం వెలిబుచ్చుకోను అన్నట్లుగా పూలమాలలతో ముంచెత్తారు.

గ్రామంలో పనులు చేయను అనేకమంది కొత్తవారు వచ్చిపోతుండటాన కొత్తవారిని చూసి ఎవ్వరూ భయపడటం లేదు పూర్వంలా. ఐతే ఒక రోజున జరిగిన సంఘటన ఊరివారందరినీ భయభ్రాంతులను చేసింది. ఒక రోజు పొలం నుంచి ఒంటరిగా వస్తున్న ఒక యువతిని పట్టుకుని ఒక ఆగంతకుడు తోటలోకి లాక్కుపోయాడు. ఆమెపై అత్యాచార యత్నం చేయబోగా, ఆమె కేకలకు పొలం నుంచి వస్తున్న వారు పరుగెత్తుకొచ్చి వాడిని పట్టుకుని ఊరిలోకి లాక్కొచ్చారు. వాడిని పోలీసులకు అప్పగించారు. ఇది తెలిసి అనంతరామయ్య, భానుమతి, వివేక్, చంద్రికలతో కల్సి బాగా బాగా ఆలోచించి, అమెరికాలో ఉంటున్న తన తమ్ముని సహకారంతో అక్కడినుంచి 'గిజ్మోపాల్ [ఘిజ్మొపల్] అనే ఒక చిన్న చేతి వాచీ ఉపయోగం గురించీ తెల్సుకున్నారు. అమెరికాలో 4 సం. పైన వయస్సున్న స్కూళ్ళ కెళ్ళే పిల్లలకు ఆ వాచీ పెడతారనీ, తలిదండ్రులు మాట్లాడితే వారికి తెలుస్తుందనీ, వారు కూడా తాము ఎక్కడున్నదీ చెప్పవచ్చనీ, చిన్న మొబైల్ ఫోన్ ని దాన్లో అమర్చారనీ తెల్సుకున్నాడు అనంతరామయ్య.

దాని ఉపయోగం పూర్తిగా తెల్సుకున్నాక అనంతరామయ్య బెంగుళూరులోని ఒక వ్యాపార సంస్థతో సంప్రదించాడు. G.P.S.కనెక్షన్ తో ఎక్కడున్నారో కంప్యూటర్ లోంచి తెల్సుకునే విధంగా అతి చిన్న ‘చిప్‘ మొబైల్ ఫోన్ లాంటి దాన్ని చేతి వాచీలో పెట్టించి బెంగుళూర్లో తయారు చేయించి తెప్పించాడు. యువతులు, మహిళలు ఒంటరిగా ఎక్కడికీ వెళ్లకుండా, ఎప్పుడూ 3 లేక 5 మంది కలిసి వెళ్లేలాగా ఏర్పాటు చేసాడు. ఆ వాచీని గ్రూపులో ఒకరు చేతికి ధరించి వెళ్ళాలని వివరంగా చెప్పాడు. ఇంకా స్కూల్, కాలేజీలకు వెళ్ళే విద్యార్ధులకు అతి చిన్న జీ.పీ.ఎస్. కనెక్షన్ తో ఉన్న పరికరం అమర్చిన స్కూల్ బ్యాగ్స్ తయారు చేయించి ఇచ్చాడు. ఆ పరికరం బయటికి కనిపించదు. బ్యాగ్ లోపల పొరలో ఉంటుంది. ఆ పరికరాల ద్వారా వారు ఎక్కడున్నదీ తెల్సుకోవచ్చు, ఆ వాచీల్లో ఉన్న ఫోన్స్ ద్వారా వారు ఆపద సంభవించినపుడు పోలీస్ స్టేషన్ కు కానీ, గ్రామంలోని పంచాయతీ ఆఫీసుకు ఉన్న కనెక్టెడ్ ఫోన్ కు కానీ సమాచారం అందించవచ్చు. ఒక చిన్న స్విచ్ నొక్కితే చాలు సమాచారం అందుతుంది. దాంతో ఆ గ్రామ మహిళలకు ఆపదలే సంభవించవు.

అప్పుడు పంచాయతీ ఆఫీసులోని కంప్యూటర్ ద్వారా వారెక్కడున్నదీ తెల్సుకుని సహకరించవచ్చు. కొందరు యువకులకు కంప్యూటర్ ట్రైనింగ్ ఇప్పించి పంచాయతీ ఆఫీసులో ఉద్యోగులుగా నియమించారు. ఇలా ఆ గ్రామాన్ని దత్తత తీసుకుని అధునాతన, ఆధునిక గ్రామంగా తీర్చిదిద్దారు అనంత రామయ్య గ్రూప్ ఆఫ్ డాక్టర్స్, మొబైల్ హాస్పెటల్ సిబ్బందీ కల్సి. యువతకు పని కల్పించను వారికి ‘మహిళలకు, పురుషులకు, చిన్నపిల్లలకు’ దుస్తులు కుట్టే ట్రైనింగ్ గ్రామంలోనే ఇప్పించి, అవసరమైనవన్నీ సమకూర్చి, దుస్తులు కుట్టడం, వాటిని చక్కగా ప్యాక్ చేయించి నగరాలకు మాల్స్ కు సప్లై చేయించి, ఆ సొమ్ము వారి వారి బ్యాంక్ అకౌంట్ లో జమ అయ్యేలా చర్యలు చేపట్టింది. సొసైటీ ఏర్పరచారు. సేవా సంస్థ గ్రూప్ వారి నిరంతర పర్యవేక్షణలో ఇప్పుడా గ్రామం ఒక చిన్న పట్టణంలా, తయారైంది... స్వయంశక్తికి ఋజువుగా నిలిచింది.

అప్పుడే తన కల నిజం చేయను సహకరించిన వివేక్ కూ, అతని కుటుంబానికీ కృతఙ్ఞత తెల్పుకుంటూ తమ కుమార్తెతో వివాహాన్ని ఏర్పాటు చేశారు అనంతరామయ్య దంపతులు. ఆ వేడుకల సందర్భంగా ఊరివారంతా పాల్గొని తమ శాయశక్తులా సహకరించి ఆనందించారు. ఆ ఊరి యువత తాము తయారు చేసిన పెళ్ళి వస్త్రాలు వధూవరుల కిద్దరికీ కానుకగా ఇచ్చారు. గ్రామంలో ఎక్కడా కులమత భేదాలు లేకుండా, పార్టీలకు అతీతంగా, అంతా అన్నదమ్ముల్లా కలసి మెలసి పనులు చేసుకోడం అనంతరామయ్య దంపతులకు పరమానందమైంది.

పని లేనప్పుడే ఇవన్నీ మనసుకొస్తాయి. తీరిక లేని పనులతో ఎవ్వరికీ తన పర భేదాలే లేకుండా పోడం ప్రగతికి చిహ్నం అనిపించింది అందరికినీ! భారత కేంద్ర ప్రభుత్వం ఈ విషయాలన్నీ తెల్సుకుని ఒక అధికారిని పంపింది. టి.వి., పత్రికలవారంతా వచ్చి కళ్ళారా చూసి, కెమెరాల నిండా చిత్రాలు నింపుకుని వెళ్ళారు. 'ఇదండీ నిజమైన సేవ అంటే' అని తమ పత్రికల్లో, టీవీ ఛానల్స్ లో అహోరాత్రులు వార్తలు నింపారు. 'చేయీ చేయీ కలిపి' సాధించిన ఘనత' అనే టైటిల్ తో…

మరిన్ని కథలు

Kya huvaa
క్యా హువా
- కె. తేజస్వని
Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు