ప్రేమకు నిర్వచనం - సుజల గంటి

premaku nirvachanam

“ మా నాన్నలా చూసుకుంటావా?” అంది వినీల.
“నేనడిగిందేమిటీ? నువ్వడిగేదేమిటి?” అన్నాడుఆశ్చర్యంగా ఆదర్శ్.
ఆదర్శ్ ఎన్నో రోజుల నించి వినీలను ప్రేమిస్తున్నాడు. ఆమెను ఆమె ప్రవర్తనను రోజూ చూస్తున్న కొలదీ ఆమే తనకు సరి అయిన భాగస్వామి అని నిర్ణయించుకున్నాడు. స్నేహితులుగా మెలుగుతున్న వారి మధ్య ఇన్నాళ్ళు పెళ్ళి ప్రసక్తి రాలేదు. సడన్ గా ఈ రోజు ఎలాగైనా అడగాలని నిర్ణయించుకుని ధైర్యం చేసి అడిగాడు “నన్ను పెళ్ళి చేసుకుంటావా?” అని.
“నువ్వడిగింది నాకర్ధమయ్యింది అందుకే అలా అడిగాను. ఇలా నేను ఎందుకడిగానో తెలియాలంటే మా అమ్మా నాన్నా గురించి నీకు తెలియాలి”
“చెపితే కదా తెలిసేది. మీ నాన్నగారిలో ఉన్న ఆ స్పెషాలిటీ ఏమిటో మాకూ తెలియాలి కదా!”
వినీల చెప్పడం మొదలు పెట్టింది
----
“ఒక విధంగా చెప్పాలంటే మా అమ్మా నాన్నలది కూడా ప్రేమ వివాహమే. మా నాన్న అమ్మలో ఏం చూసి పెళ్ళి చేసుకున్నారో నాకు తెలిసాక మా నాన్నంటే నాకు ఇంకా ఇష్టమైంది. అమ్మ అవకరం కల అమ్మాయి. సొట్ట కాలు పిల్లగా పిలవ బడుతూ చిన్నప్పటి నించీ న్యూనతా భావంతో పెరిగింది. తాతా, అమ్మమ్మా ఏమీ అనక పోయినా చుట్టు పక్కల వాళ్ళు ఏదో వంకన ఆమె అవకరాన్ని ఎత్తి చూపించే వారు.
“మీ అమ్మ గారు పోలియో ఎఫెక్టెడా?”

“కాదు అమ్మ పుట్టినప్పుడు పాదాలు వంకరతో పుట్టిందిట. ఆ వంకర సరి చెయ్యడానికి ఆపరేషన్ చేసారు. కట్టు లోకి యూరిన్ వెళ్ళి కాలు కుళ్ళి పోయింది. అది అమ్మమ్మ చూసుకో లేదు. ఉమ్మడి కుటుంబంలో పెద్ద కోడలిగా ఆమెకు బాధ్యతలు ఎక్కువగా ఉండేవిట. కాలు కుళ్ళి పోయి వాసన వేస్తుంటే అప్పుడు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళారు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగి పోయింది. అలా అమ్మ కాలు సొట్ట కాలుగా మిగిలి పోయింది.”

“సైన్స్ ఇంత పురోగమించింది కదా! అయిన నష్టాన్ని సరి దిద్ది ఉండ వచ్చు కదా!” అన్నాడు ఆదర్శ్.

“సైన్స్ ఎంత పురోగమించినా కొన్ని సరి దిద్ద లేని తప్పులు కూడా ఉంటాయి. వైద్య సదుపాయాలు

అప్పట్లో అంతగా లేవో, లేక అమ్మమ్మ వాళ్ళ అందుబాటులో లేవో నాకు తెలియదు. ఆత్మ న్యూనత చోటు చేసుకున్న అమ్మ ఉమ్మెత్త పువ్వు లా తనలో తాను ముడుచుకు పోయేది. చదువులో మాత్రం ఎప్పుడూ ముందు ఉండేది”.

“ఆమెకు ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఉండేది కాదా!”

“ఉమ్మడి కుటుంబాల్లో ఒకరి కొకరు ఉన్నట్లుగా కనబడ్డా ఎవరిలోనూ స్వార్ధం లేదనడానికి లేదు. ఎవరి మటుకు వాళ్ళు ఉమ్మడిలో లాభాలు పొందుతున్నా లాభాల కన్నా నష్టాల్ని బేరీజు వేస్తారు. ఈ విషయాలన్నీ అమ్మ అనుభవంలోంచి నేను తెలుసుకున్న నిజాలు”.

“మీ అమ్మా నాన్నా ఎక్కడ కలిసారు?” అడిగాడు ఆదర్శ్

“వాళ్ళిద్దరూ పక్క పక్క ఇళ్ళల్లో ఉండే వారు. ఒక విధంగా చెప్పాలంటే నాన్నకు అమ్మ చిన్న తనం నుండి తెలుసు. అమ్మ ఇంజనీరింగ్ చదివింది. నాన్న ఎం, ఎస్సీ చదివారు. చదువు పూర్తయ్యాక నాన్న ఉద్యోగ ప్రయత్నాలు చేసారు. ఊళ్ళొ ఉన్న జూనియర్ కాలేజ్ లో లెక్చరర్ గా ఉద్యోగం వచ్చింది. అమ్మకు కూడా మంచి ఉద్యోగం వచ్చింది. కానీ హాండికాప్డ్ కోటాలో. అమ్మకు తన ప్రతిభ మీద ఉద్యోగం రావాలన్న కోరిక ఉన్నా వచ్చిన ఉద్యోగం వదులుకోవడం అవివేకం అని తాత నచ్చ చెప్పారు. తాత గారి మాట కాదన లేక అమ్మ ఉద్యోగంలో చేరింది. ఈడొచ్చిన ఆడపిల్లకు పెళ్ళి చెయ్యడం కన్న తండ్రి బాధ్యత కదా! అందుకని అమ్మ కోసం సంబంధాలు వెతకడం మొదలు పెట్టారుట తాత గారు. వచ్చిన ప్రతీ వాళ్ళు అమ్మ అవకరం ఎత్తి చూపడం, కొంత మంది ఆ అవకరం డబ్బుతో ముడి పెట్టడం చూసిన అమ్మ పెళ్ళి చేసుకోనని చెప్పిందిట”.

“ అబ్బ తొందరగా చెప్పు మరీ సస్పెన్స్ మైంటైన్ చేస్తున్నావు” అన్నాడు ఆదర్శ్.

“ అమ్మా నాన్నల ప్రేమ కధ నేను చెప్పడం ఎందుకు? వాళ్ళ నోటే విను”

“అంటే మీ ఇంటికి రమ్మంటావు”.

“నన్ను పెళ్ళి చేసుకుంటానని చెప్పడానికి రావాలిగా” అని కవ్వించింది వినీల.

ఆదర్శ్ కి కూడా వినీల తండ్రిని కలుసుకోవాలని ఉంది. వినీల చెప్పినట్లు అతనిలో ఉన్న ఆ గొప్ప వ్యక్తిత్వం ఏమిటో తెలుసుకోవాలన్న ఉత్సుకత కూడా చోటు చేసుకుంది.

“సరే ఐతే రేపు వస్తాను” అన్నాడు.
రాజేష్ ,మొదటి నించీ సున్నిత మనస్తత్వం కలిగిన మనిషి. ఎవరి కళ్ళల్లో ఉదాసీనత, కన్నీళ్ళు చూడ లేడు. పక్కింటి రాధిక పట్ల కూడా ఆకర్షణ పెరగడానికి అతని మనస్త్వత్వం కూడా కొంత కారణం.
ఆటల్లో పరిగెట్టలేక వెనక బడ్డ రాధికను స్నేహితులు “ఆ కుంటి కాలితో నీకెందుకే ఆటలు? మాతో సమానంగా ఆడదామని అనుకోకుండా ఆ అరుగు మీద కూర్చుని చూడవచ్చు కదా!” అన్నప్పుడు గుడ్ల నీరు కుక్కుకుంటూ అరుగు మీద కూర్చునే రాధికను ఓదార్చడానికి తను కూడా ఆటలు మానేసి ఆమె పక్కన కూర్చునే వాడు.
చిన్న తనంలో లాగా యవ్వనం లోకి అడుగు బెట్టాక ఆమె దు:ఖంలో పాలు పంచుకో లేక ఆమె చిన్న బోయిన మొహంతో బైట కనబడ్డప్పుడల్లా అతని మనసు విల విల లాడేది. అతనికి తెలియకుండానే ఆమె పట్ల ఆకర్షణ ఏర్పడి, ఉద్యోగం వచ్చాక ఆమెను పెళ్ళి చేసుకోవాలని నిర్ణయించు కున్నాడు. ఆ మాటే తండ్రితో చెపితే అతను ఇంతెత్తున ఎగిరి పడ్డాడు.
“నీకేం ఖర్మరా ఆ సొట్ట పిల్లను చేసుకుందుకు. నువ్వు ఊ అంటే కోటి మంది పిల్లల్ని క్యూలో నిల బెడతాను” అన్నాడు.
“నాకు ఆ క్యూలో ఉన్న అమ్మాయిలు అక్కర్లేదు నాన్నా! నేను రాధికని ఇష్ట పడుతున్నాను. మీరు కాదంటే పెళ్ళే చేసుకోను” అన్న కొడుకు మాటలకు కోపం వచ్చినా భార్య కళ్ళతో చేసిన సంజ్ఞతో ఆగి పోయాడు.
“నేను మాత్రం వెళ్ళి అడగను” అని చెప్పాడు.
“నేనే అడుగుతాను నాన్నా. మీకా శ్రమ అక్కర్లేదు” అన్నాడు రాజేష్.
రాజేష్ వచ్చి అడిగినప్పుడు రాధిక తండ్రి కూడా ఆశ్చర్య పోయాడు. ఈ అబ్బాయి ఏమి ఆశించి పెళ్ళి చేసుకుంటానంటున్నాడు? రాధిక అతని కన్నా ఉన్నత ఉద్యోగంలో ఉంది అందుకని ఆశ పడుతున్నాడా! అన్న అనుమానం కలిగింది. ఐనా ఆగలేక తన సందేహాన్ని నివృత్తి చేసుకోవాలని,
“అందరూ చూసి ఎగతాళి చేసే పిల్లను కావాలని కోరుకుంటున్నావంటే దాని వెనకున్న కారణం తండ్రిగా తెలుసుకోవడం నా బాధ్యత కదా! కారణం చెప్తావా?”
“అందరూ రాధికలో ఉన్న మిగిలిన మంచి గుణాల కన్నా ఆమె కాలికి ఉన్న లోపానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారనిపించింది నాకు. నేను అది తప్ప రాధికలో మిగిలిన గుణాలకు ప్రాధాన్యత ఇవ్వ దల్చుకున్నాను. లోపం లేని మనిషి ఉండడం చాలా అరుదని నా అభిప్రాయం. ఐనా రాధికను అడగకుండా ఆమె సమ్మతి లేకుండా నిర్ణయం తీసుకో వద్దండీ” అన్నాడు.
పిల్లాడేదో బుద్ధిమంతుడిలా ఉన్నాడు. రాధిక నిజంగానే అదృష్ట వంతు రాలేమో! అనుకున్నాడు రాధిక తండ్రి.
“ఇప్పుడు జాలితోనో ఆకర్షణతోనో చేసుకుని రేపు దాని లోపాన్ని ఎత్తి చూపకుండా ఉండ గలవా! అది ఆలోచించుకున్నావా? మీ అమ్మ గారూ నాన్న గారూ, నీ వాళ్ళందరు ఒప్పుకుంటారా?” అని అడిగాడు ఆమె తండ్రి.
“ఆమె మీద జాలితో నేను ఈ పెళ్ళి చేసుకుంటానని అనటం లేదండీ నిజంగా రాధిక నాకు కావాలి. జీవితంలో ఎప్పుడూ ఆమె మనసు నొప్పించను. నా వాళ్ళెవరూ ఆమెను నొప్పించ కుండా చూసుకుంటాను. ఇంత కన్నా నేను హామీ ఏమివ్వ గలను చెప్పండి ” అన్నాడు రాజేష్
రాజేష్ తనను పెళ్ళి చేసుకుంటానన్నాడని, తనతో మాట్లాడాలని అన్నాడని తండ్రి చెప్పగానే ఆశ్చర్య పొయింది రాధిక. తనను చేసుకుంటానని ఎవరో రావడం కొత్తగా థ్రిల్లింగ్ గా ఉంది.
రాజేష్ మాట్లాడడానికి వచ్చినప్పుడు అదే అడిగింది—
“ అందరికీ నా సొట్ట పెద్దదిగా కన బడుతుంటే మీకు కన బడ లేదా! అది అడ్డుగా అనిపించ లేదా? ”
“నాకెందుకు కనబడలేదు సొట్టలు? కనబడ్డాయి. సొట్టలు, సొట్టల్లో అప్పుడప్పుడు పూచే గులాబీలూ” అన్నాడు నవ్వుతూ
ఒక్క క్షణం అర్ధం కాలేదు. సొట్టలు అంటున్నాడేమిటా! అని. మరుక్షణం అర్ధమయ్యి మొహం మీద చిరునవ్వు చిందులాడింది. “అదిగో సొట్టలు, గులాబిలూ” అన్నాడు.
రాధిక నవ్వినప్పుడల్లా బుగ్గల్లో అందమైన సొట్టలు పడతాయి.
“మీరు భలే మాట్లాడుతారు” అంది.
“ఐతే నేను మీకు నచ్చానా?” అన్నాడు.
“అందరికీ అడ్డుగా నిల బడ్డ నా కాలి సొట్ట మీకు అభ్యంతరంగా కన బడ లేదా?”
“మనిషన్న వాడికి మనసులో ఏ సొట్టలూ లేకుండా ఉండాలి. అది నీకుందని నాకు తెలుసు. చిన్న తనం నించీ నీ లోపం ని పెద్దగా చూపించడంతో నీలో ఉన్న మిగిలిన గుణాలన్నీ మరుగున పడ్డాయి. ఆ మరుగున పడ్డ గుణాలతో మనం మన జీవితంలో మరు మల్లెలు పండించుకుందాము. ఇంతకన్నా నీ పట్ల నాకున్న ప్రేమను ఎలా వ్యక్తం చెయ్యాలో నాకు తెలియదు. నీ లోపాన్ని గురించి ఇంకెప్పుడూ మన మధ్య చర్చ రావడానికి వీలు లేదు. అసలు ఆ విషయాన్ని పూర్తిగా మర్చిపో “అన్నాడు.
అతని మాటలకు పుట్టాక ఎప్పుడూ పొందనంత ఆనందం పొందింది రాధిక. ఆ ఆనందంలో తనకు తెలియకుండానే వచ్చి అతని భుజం మీద తన తల వాల్చింది. ఆప్యాయత నిండిన అతని చేతులు ఆమెను దగ్గరకు తీసుకున్నాయి.
మర్నాడు వాళ్ళింటికి వచ్చిన ఆదర్శ్ రాజేష్ నోట వాళ్ళ ప్రేమ కధ విన్న అతనికి నోట మాటలు కరువయ్యాయి. ఆలు మగల దాంపత్యానికి శరీర లోపం అడ్డు కాదని నిరూపించారు రాజేష్ అంకుల్ అనుకున్నాడు.
“ ఇంతే కాదు మా నాన్న నన్ను, తమ్ముడ్ని అమ్మలా పెంచారు తెలుసా?”
మళ్ళీ కధలో ట్విస్ట్ ఏమిటిరా బాబూ అన్నట్లుగా చూసాడు ఆదర్శ్.
అతని ముఖ కవళికల్ని చూసి పక్కున నవ్వింది రాధిక.
“ఏంటి ఆంటీ మీరు నవ్వుతున్నారు? అంకుల్ అమ్మలా పెంచడమేమిటీ? అసలే మీ ప్రేమ కధ విన్న నేను అదే జీర్ణించుకో లేక పోతున్నాను. దానిపై మళ్ళీ ఇదొకటి. ఈ పొడుపు కధ మీరు విప్పేయ్యండి బాబూ!” అనగానే అందరూ గొల్లుమని నవ్వారు. ముందుగా రాధిక తేరుకుని చెప్పడం మొదలు పెట్టింది.

పెద్దల ఆమోదంతో వాళ్ళ పెళ్ళి బాగా జరిగింది. రాధిక, రాజేష్ కన్నా ఎక్కువ సంపాదిస్తున్నా వాళ్ళ మధ్య ప్రేమలో ఏమీ తేడా లేకుండా ఆనందంగా సంసారం సాగుతున్న తరుణంలో రాజేష్ ఉద్యోగం పోయింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉద్యోగం దొరక లేదు. అదే సమయంలో రాధిక గర్భవతి అవడంతో తన ఉద్యోగం కన్నా ఆమెను జాగ్రత్తగా చూసుకోవడం అవసరమని నిర్ణయించుకున్నాడు.
వినీల పుట్టుక వాళ్ళ జీవితాల్లొ కొత్త వసంతాన్ని తెచ్చింది. రాధిక ఆఫీస్ లో జాయిన్ అయ్యాక వినీలను అతనే పెంచాడు. అతని సబ్జెక్ట్ మాథ్స్ కావడంతో ఇంటి దగ్గర ట్యూషన్స్ చెప్పే వాడు. ఎంత రాధిక కూ తనకూ మధ్య డబ్బు ప్రసక్తి లేక పోయినా తన ఖర్చులకు ఆమెను అడగడం అతనికిష్టం ఉండేది కాదు.
అలా వినీల రాజేష్ గారాల కూతురయి పోయింది. ఆమెను నిద్ర పుచ్చడానికి లాలి పాటలు కూడా నేర్చుకున్నాడు. పక్క వాళ్ళు విచిత్రంగా ఉందని చెవులు కొరుక్కున్నా అవేమీ అతనికి పట్ట లేదు. పోనీ మేము వచ్చి పెంచుతాము అన్న అమ్మను అత్త గార్నీ కూడా వారించాడు.
“వినీలను పెంచడంలో మీకేం కష్టం అనిపించ లేదా అంకుల్ !” అన్నాడు ఆదర్శ్.
“పుట్టుకతోనే ఎవరికీ ఏ విద్యా రాదు. చూసి కానీ ఎవరైనా నేర్పితే కానీ నేర్చుకుంటాము. ఆడపిల్లకైనా మొదటి బిడ్డను పెంచడానికి కష్టాల్ని ఎదుర్కోక తప్పదు. మొదటి సారి తల్లి అయిన ఆనందం ఆమెను అన్నీ నేర్చుకునేటట్లు చేస్తుంది. ఇక్కడ ఆ పని నేను చేసాను. ఇష్టమైన పని ఎప్పుడూ కష్టమనిపించదు” అన్నాడు రాజేష్.
“నేను కూడా అంత బాగా పెంచి ఉండే దాన్ని కాదేమో! రాజేష్ అంత బాగా చూసుకున్నాడు వినీలను. వినీలకు రెండేళ్ళు వచ్చాక రాజేష్ కు మంచి కాలేజ్ లో మళ్ళీ జాబ్ దొరికింది. ఇంకో రెండేళ్ళకు వినీలకు తమ్ముడు పుట్టాడు. అదృష్టవశాత్తు వాడు సమ్మర్ లో పుట్టాడు. అందుకని వాడికి కూడా నాన్న పెంపకం దొరికింది. సమ్మర్ లో కాలేజీలకు సెలవులు కదా! అదీ కధ” అంది రాధిక.
“అహా చాలా బాగుంది మీ ప్రేమ కధ. ఇప్పుడు అర్ధమయ్యింది వినీలను నన్ను పెళ్ళి చేసుకుంటావా? అంటే నాన్నలా ప్రేమిస్తావా? అని ఎందుకందో. మీరు చాలా గ్రేట్ అంకుల్ ”
“అహా నేనొక్కడ్నే గ్రేట్ కాదిక్కడ అందరూ గ్రేటే. మన మనసులో భావాలు ఉన్నా ఎదటి వాడు దాన్ని అర్ధం చేసుకోనప్పుడు దానికి విలువ లేకుండా బూడిదలో పోసిన పన్నీరవుతుంది.అలాగే చాలా మందికి ప్రేమను వ్యక్తం చెయ్యడం తెలియదు. అలాగే పంచిన ప్రేమను అందుకోవడం కూడా తెలియదు” అన్నాడు రాజేష్.
“ ప్రేమకు నిర్వచనం చాలా బాగా చెప్పారంకుల్. మీ ప్రేమ సామ్రాజ్యంలో నన్ను కూడా ఒక సభ్యుడిగా చేర్చుకోండి” అంటూ వినీల వైపు ఒక కొంటె చూపు విసిరాడు.
వాళ్ళిద్దరి చూపుల్ని అర్ధం చేసుకుని రాజేష్, రాధిక మెల్లిగా అక్కడి నించి జారుకున్నారు.

మరిన్ని కథలు

Kya huvaa
క్యా హువా
- కె. తేజస్వని
Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు