విశాల హృదయం - నారంశెట్టి ఉమామహేశ్వరరావు.

vishala hrudayam

“అమ్మా! రేపటి నుండి స్కూలుకి దసరా సెలవులు. చుట్టాలింటికి, టూర్లకి వెళుతున్నారు స్నేహితులు. మనం కూడా ఎక్కడికైనా వెళ్దామా?” అని అడిగాడు గోపి టిఫిన్ తింటూ.

“ఎక్కడికి వెళ్ళాలన్నా చాలా డబ్బు ఉండాలి. మీ నాన్నగారికి సెలవు దొరుకుతుందో లేదో” అంది మానస.

“అవన్నీ నాకు తెలియదు. సెలవులు తరువాత బడికి వచ్చి ఏమేం చూసారో గొప్పగా చెబుతారు అందరూ. నేనొక్కడినే ఏమీ చెప్పలేను. షేం షేం అంటారు” మొహం చిన్నది చేసుకొని చెప్పాడు గోపి.

మోహన్, మానసల ఏకైక పుత్రుడు గోపి. మంచి అలవాట్లతో పెంచుతున్నారు కొడుకుని. అయినా తోటి విద్యార్ధుల ప్రభావం అప్పుడప్పుడు గోపి మీద పడుతుంది. అందుకే తల్లితో మనసులో కోరిక చెప్పాడు గోపి.

మానసకు ఇంట్లో ఆర్ధికపరిస్థితి తెలియంది కాదు. మామగారి ఆపరేషన్ కోసం ముందు నెలలోనే ఆఫీసు నుండి అప్పు తీసుకున్నారు. ఆడపడుచు చదువుకి అవసరమై స్నేహితుడి దగ్గర బదులు తీసుకున్నాడు మోహన్. ఇంటి అద్దె, ఇతర ఖర్చులు ఎక్కువవై పొదుపు కూడా తగ్గింది. గోపి కోరిక చెబితే భర్త ఏమంటాడో అని గుబులుగా ఉంది మానసకి.

మానస ఆలోచనల్లో ఉండగానే “అమ్మా నా స్కూలుకి టైమయింది. సాయంత్రం వచ్చేసరికి గుడ్ న్యూస్ చెప్పాలి” అని తల్లి బుగ్గ మీద ముద్దు ఇచ్చి వెళ్ళాడు గోపి.

బాత్రూములో ఉన్న మోహన్ తల్లీకొడుకుల మాటలు విన్నాడు. బయటకు రాగానే “గోపి చిన్నపిల్లవాడు. సరదాలు సహజం. వాడికి నెమ్మదిగా నచ్చజెప్పు. విహారయాత్రలకి వెళ్లాలని నాకూ ఉంది. డబ్బూ, సెలవూ రెండూ లేవు. నీకు తెలియని ఆదాయం మనకు ఏమీ లేదు” అన్నాడు మోహన్.

నిజమేనన్నట్టు తలాడించింది మానస.

మోహన్ ఆఫీసుకి వెళ్ళాక దగ్గరలోని గుడికి వెళ్లి “దేవుడా! మా అబ్బాయి మనసు కష్టపెట్టకుండా పరిష్కారం చూపించు” అని వేడుకుంది.

సాయంత్రం గోపి వచ్చేసరికి ఏమి జవాబు చెప్పాలా అని లోలోపల గుబులు పడుతోంది మానస.

“మమ్మీ...” అన్న పిలుపు వినబడడం, గోపి ఇంట్లో అడుగు పెట్టడం ఒకేసారి జరిగింది. షూ విప్పేసి, చేతులు కడుక్కొని లోపలకు వచ్చాడు గోపి.

“ఇదిగో ఈ ఏపిల్ తింటూ ఉండు. పాలు ఇస్తాను” అని ఏపిల్ అందించింది మానస.

ఏపిల్ అందుకొని కొరికి “ఈ రోజు స్కూల్లో ఏమి జరిగిందో తెలుసా? మత సామరస్యం మీద పాఠం చెప్పారు మాష్టారు. వెంటనే నా స్నేహితులు కరీం, యోహాన్ గుర్తొచ్చారు. యోహాన్ పుట్టినప్పుడే అమ్మ చనిపోయిందట. కొత్త అమ్మ రోజూ కొడుతుందట! నాన్న లేడు కాబట్టి కరీం కూడా బడి వదిలాక సైకిలు షాపులో పనిచేస్తాడు. దసరా పండుగ ఎలా జరుపుతామో వాళ్లకి తెలియదని ఒకసారి చెప్పారు. అందుకే మన ఇంటికి పిలిచాను. పండుగ రోజులలో మా ముగ్గురికీ భోజనం, పిండివంటలు సమానంగా వడ్డించు. సెలవుల్లో మనం ఎక్కడికీ వెళ్లొద్దు. వాళ్ళని మాత్రం రావద్దని చెప్పకు. ప్లీజ్ మమ్మీ” అన్నాడు గోపి.

ఆ మాటలు విని మానస ఆశ్చర్యపోయింది. సమస్య తీర్చిన దేవుడికి కృతజ్ఞతలు చెప్పాలో లేక కొడుకు విశాల హృదయానికి ముందుగా అభినoదనలు తెలపాలో తెలియక ఉబ్బితబ్బిబ్బయింది మానస.

మరిన్ని కథలు

Kya huvaa
క్యా హువా
- కె. తేజస్వని
Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు