చేలో చేప - గుడిపూడి రాధికా రాణి.

chelo chepa

చికినాల లో ఓబులేశు అనే చిన్నపాటి రైతు ఉండేవాడు. తనకున్న కొద్ది పాటి పొలాన్ని కష్ట పడి సాగు చేసుకునే వాడు. కానీ అతనికో దురలవాటు ఉండేది. తూనీగలకి దారం కట్టి, మిణుగురులను సీసాలో పట్టి, పక్షులను వడిశెలతో కొట్టి వినోదించేవాడు.

ఓబు లేశుకి చేపల కూరంటే ఎంతిష్టమో! రోజూ తన పంట పొలాల అవతల ఉన్న ఏట్లో గాలం వేసి కొన్ని చేపలను పట్టి భార్యతో వండించుకుని తింటే గానీ అతడికి ముద్ద దిగేది కాదు.

ఒక సారి కాని కాలంలో తుఫాను వచ్చింది. విపరీతంగా వర్షాలు పడ్డాయి. వాగులు, వంకలు పొంగి పొర్లాయి. పొట్ట దశలో ఉన్న పంట పొలాల్లో ఏటి నీరు చేరింది. వరి మొక్కలన్నీ తలలు వాల్చేశాయి. అనుకోని నష్టానికి రైతులందరూ తల్లడిల్ల సాగారు. ఓబులేశు కూడా దుఃఖిస్తూ తన పొలానికి వెళ్ళాడు. ఏట్లో నీరు తన పొలంలో చేరింది. ఆ నీటితో పాటుగా కొన్ని చేపలు కూడా తన పొలంలో చేరడం గమనించాడు.

' సరే! జరిగిన నష్టం ఎలాగూ పూడ్చలేం..కొన్ని చేపలన్నా పట్టుకుందాం.ఈ చలిలో వేడి వేడి చేపల కూర తినొచ్చు.'అనుకున్నాడు.

గాలం వేశాడు.అంతే! మిలమిల మెరుస్తున్న బంగారు రంగు చేప ఒకటి అతని గాలానికి చిక్కింది. దాని కళ్ళు వజ్రాల్లా మెరుస్తున్నాయి. ఓబులేశు దానిని నీటి బొక్కెన లో జారవిడిస్తే అది చిన్న చిన్న గా తృళ్ళి పడ సాగింది. అటువంటి అపురూపమైన, అరుదైన అందాల చేపను బహుశా అంత వరకు ఎవరూ చూసి ఉండరు.

నోరు వెళ్ళ బెట్టి కాసేపు చేపని చూసిన ఓబులేశు మనసులో ఆశ మెరిసింది. 'దీనిని రాజు గారికి ఇస్తే నాకు కానుకగా డబ్బే డబ్బు.' అనుకున్నాడు సంబరంగా.

ఇంతలో తళుకులీనుతున్న ఆ చేప తమాషాగా కళ్ళు ఆర్పుతూ " ఓ మనిషీ! దయ చేసి నన్ను ఆ ఏట్లో వదిలేస్తే మిగిలిన నా నాలుగు నేస్తాలతో వెళ్ళి పోతాను." అంది.

కాంతులు చిమ్మే ఆ చేప మాట్లాడినందుకు ఓబులేశు మరింత ఆశ్చర్య పోయాడు. అతనిలో అత్యాశ పడగలు విప్పింది.

"ఓ బంగారు చేపా! నిన్ను ఏటి గట్టుకు తీసుకుపోతా. మిగిలిన నీ నాలుగు నేస్తాలను కూడా పిలువు" అన్నాడు.

"ఎందుకు?" అందా చేప అనుమానిస్తూ.

"అయిదు అందాల మాట్లాడే బంగారు చేపల్ని రాజు గారికిస్తే నాకు బహుమతిగా బోలెడు డబ్బిస్తారు. రాజుగారు మిమ్మల్ని చంపరులే. గాజు తొట్టెలో ఉంచి పెంచుకుంటారు. గొప్పగా అందరికీ చూపిస్తారు." అన్నాడు ఓబులేశు.

దానికా చేప "సాటి ప్రాణుల స్వేచ్చను హరించే హక్కు మనకి లేదు. అర్ధం చేసుకో." అని దీనంగా బతిమాలింది.

"ఆ నాలుగిటినీ అప్పగిస్తే నిన్నొదిలేస్తా" అని ఆశ పెట్టాడు ఓబులేశు. అయిన అది ససేమిరా ఒప్పుకో లేదు.

ఓబులేశు బెదిరింపు లోకి దిగాడు. "మర్యాదగా పిలిస్తే గాజు తొట్టెలో అయినా బతికుంటావు. లేదంటే నిన్ను చంపేస్తా" అని హెచ్చరించాడు.

"చావడానికైనా సిద్దమే గానీ సాటి ప్రాణులకు అందునా స్నేహితులకు హాని తల పెట్టను." అందా చేప మొండిగా. భయ పెట్టే ఉద్దేశ్యంతో చేప మెడ నొక్క సాగాడు. ప్రాణ భయంతో గిజ గిజ లాడిందా చేప. వదలమంటూ వేడుకుంది. కాసేపటికి వణికి పోతూ "సరే! ఒప్పుకుంటున్నాను. నా నేస్తాలను అప్పగిస్తా. నన్నొదిలెయ్." అని అరిచింది.

ఇంతలో ఒక విచిత్రం జరిగింది. నక్షత్రాల్లాంటి కళ్ళతో, బంగారం లాంటి ఒళ్ళుతో అద్భుతంగా మెరిసి పోతున్న ఆ చేప ఒక్క సారిగా మామూలు చేపగా మారి పోయింది. మాట్లాడే శక్తి కూడా కోల్పోయింది.

ఓబులేశు తెల్ల మొహం వేశాడు. కాసేపు ఆలోచించిన మీదట అతనికి ఒక విషయం తేట తెల్లమైంది.

"ప్రాణ భయంతో తప్పని సరి అయినా సరే. సాటి ప్రాణికి కీడు తల పెట్టాలనే నిర్ణయానికి రాగానే చేపకి ఆ గతి పట్టింది. మరి సరదాకి రోజూ తూనీగలని ఏడిపించే తన గతి ఏమిటి?" ఈ ఆలోచనతో అతను సిగ్గు పడి భద్రంగా ఆ చేపను ఏట్లో వదిలాడు.

ఆనాటి నుండి జీవ హింస చేయకుండా ప్రశాంతంగా జీవించ సాగాడు.

మరిన్ని కథలు

Kya huvaa
క్యా హువా
- కె. తేజస్వని
Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు