కమాను కేరాఫ్ చెత్తొట్టి...!:
ఊరిలో కొత్తగా దిగినవారెవరైనా..."కమాను ఎక్కడుంది?' అని అడిగారనుకోండి... "ఇదే రోడ్డు సార్...సీదా ఎళ్లండి. ఎక్కడ చెత్త తొట్టి కనిపిస్తుందో అదే కమాను...' దేపుని ప్రమాణంగా ఇలాగే చెప్పేవారు. కమాను ఉనికి చాటి చెప్పడానికి ఇంతకన్నా అద్భుతమైన గురుతులు దొరికేవి కావు. అసలే చెత్తొట్టి పుణ్యమా అని భరించలేని కంపును చచ్చినట్టు భరిస్తున్న మాకు, ఇదో పెద్ద హోదా! మీరే చెప్పండి ఫలానా వారిల్లు ఎక్కడుంది? ఫలానా వీధి ఎక్కడుంది? అన్నప్పుడు కనిపించే పెద్ద బిల్డింగు పక్క సందు అనో...ఇలా వెళితే పచ్చని చెట్టు కనిపిస్తుందే దాని ముందున్నదే అనో ఎంత మర్యాదగా చెప్పొచ్చు. సాధారణంగా కొండగురుతులంటే ఇలాగే కదా చెప్పేది. కానీ మా కమాను కథే వేరు. ముందున్న చెత్త తొట్టెతో ఎక్కడ్లేని గుర్తింపు తెచ్చేసుకుంది. కమానుకు వచ్చారనుకోండి... అడ్డమైన చెత్తా చెదారంతో ఇప్పుడో రేపో కనే ఆడమనిషిలా నిండుగా ఉండే చెత్త తొట్టే ముందు కనిపిస్తుంది. ఆ తర్వాతో కమానులోకి పోవాల. మునిసిపాలిటీ వాళ్లు ఏ ముహూర్తాన ఇక్కడ స్థలం కనిపెట్టారో కానీ ...మా కమానుకు ఈ తొట్టే ఓ కొండగురుతుగా మారిపోయింది. పోనీ కమానులో అనామకులు...దిక్కూమొక్కూ లేనోళ్లుండారా అంటే అదీ లేదు. నాలుగురు స్కూలు మేస్టర్లు, పత్తి వ్యాపారం చేసేవాళ్లు, బేంకు ఆఫీసర్లు...దర్జాగా బతికేందుకు అన్ని అవకాశాలున్నోళ్లే! వీరెవరి పేరు లేకుండా...మర్యాద పోయేకి కాకోతే ఈ చెత్తతొట్టికి అంత పేరు వచ్చేదేంటో? ఇంకో విషయం పోనీ అడ్రసు అడిగేవాళ్లు కొత్తోళ్లు అనుకున్నా...కనీసం చెప్పేవాళ్లకయినా మంచీమర్యాదా ఉండాలి కదా! అబ్బే అదేం లేదప్పా. పైగా అదేదో బ్రహ్మాండమైన కొండగురతయినట్టు...ఆ చెత్తొట్టి ఉంది కదా...అక్కడే అంటుంటే...పాపం వినేవాళ్లకు అప్పుడే కంపు ముక్కుల్ని తాకుతున్నట్టుంటుంది.
కమాను ముందున్నదన్నమాటే గానీ ఆ చెత్తొట్టిపై చుట్టుపక్కల మూడు సందులోళ్లకీ సర్వ హక్కులుండేవి. వాళ్లూ ఇష్టారాజ్యంగా చెత్త తెచ్చివేసేవాళ్లు. పోనీ అడ్డు చెబుదామంటే కుదరని పని. ఎందుకంటే అది మునిసిపాలిటీ చెత్తొట్టి. అలాగని భరిద్దామా అంటే అదీ కుదరని పనే! మరేం చేయాలి...చేయడానికేముంది లోలోపల పళ్లునూరుకోవడం తప్ప! కమానులో చాలా మంది పెద్దోళ్ల మానసిక స్థితి ఇదే! అక్కడికీ కొందరు తట్టుకోలేక...చెత్త వేసేవాళ్లను "బాగా నిండింది...వేరేచోట వేయొచ్చు కదా..' అంటుంటే వారు వంకరరగా నవ్వుతూ "నువ్వే సెప్పు యాడేయాలో...బాగయ్య మీ కత! మునిసిపాలిటీ తొట్టెలోంకి యేసేకి కూడా పరిమిసను కావాలా...' అంటూ సూది గుచ్చినట్టు అంటుంటే ...ఆ మాటకు నవ్వాలో ఏడ్వాలో అర్థం కాక "అంతేలే...అంతేలే...మీరు మాత్రం ఏం చేస్తారు' అని సణుక్కోవాల్సి వచ్చేది. తొట్టె స్పీడుగా నిండటానికి మెయిను రోడ్డు పక్కనే ఉండటం మరో కారణం. అటూ ఇటూ తిరిగే ఎవరు చెత్త పడేయాలన్నా...నేను...నేనున్నాను కదా అంటూ నవ్వుతూ వారికి కనిపించేదేమో! అందుకే టపీమని వేసేసేవాళ్లు. కమాను వాళ్లకు ఈ చెత్త కంపు బాగా అలవాటు. కాస్త వెనక ఉన్నవాళ్ల దాకా కంపు కొట్టడానికి పదిహేను రోజులు పట్టేది కానీ...ముందున్నవాళ్లకి నాల్లు రోజులు చాలదూ...ముక్కుపుటాలు అదరగొట్టడానికి!
కమాను చెత్తతొట్టెలో కేవలం చెత్తమాత్రమే వేయాలని రూలేమీ లేదు. ఇంట్లో ఎలకలు చచ్చినా...వాటిని ఏం చక్కా చిన్న చేటలో ఎత్తుకొచ్చి వేసిపోయేవాళ్లు. మరికొందరు ఇంటి ముందు కాళ్లు తుడుచుకుని లోనికొచ్చేందుకు వేసుకున్న గోనెతట్ట చినిగిపోయినా...దాన్ని తెచ్చి వేసేవాళ్లు. కుళ్లిపోయిన కాయగూరలు, పాచిపోయిన అన్నం...మిగిలిపోయిన పప్పు, సాంబారు...పాపం ఇదీ అదీ అని కాకుండా ఆ తొట్టెలో వేసేవాళ్లు. అడ్డమైన ప్రతి వస్తువుకూ మా చెత్తతొట్టెలో స్థానముండేది. సమాన న్యాయం అక్కడ మాత్రం తప్పకుండా అమలయ్యేది. చెత్తతొట్టె మూడు దశల్లో మాకు దర్శనమిచ్చేది. మొదటి పదిరోజులూ వేసిన ఏదైనా కనిపించేది కాదు. ఆ తర్వాత మెలమెల్లగా చెత్త తొంగిచూసి వచ్చిపోయేవాళ్లను పలకరించేందుకు ప్రయత్నించేది. పదిహేను రోజులు దాటాక బాగా నిండి క ళకళలాడేది. ఆ తర్వాతే అసలు కత సురూ! తొట్టె నిండిపోయింది కదా ఏం చేద్దాం? వేరేచోట వేద్దామా అనుకునేంత సున్నిత మనసున్నవాళ్లు కమాను చుట్టుపక్కల టార్చి వేసినా దొరికేవారు కాదు. అది నిండిందా లేదా అన్నది కాదు...మనం వేశామా లేదా అన్నదే ముఖ్యం. ఓ రకంగా చెప్పాలంటే పాపం కమాను వాళ్లే కాస్త తక్కువగా ఏదో మూడుపూట్ల ఇంట్లో కసవు తీసుకొచ్చి వేసేవారు. కానీ బైటవాళ్లకు అంత కనికరం ఎందుకుంటుంది? అందుకే తొట్టె నిండుతున్న కొద్దీ మరింత కసితో చెత్త వేసి చేతులు దులుపుకొనేవాళ్లు. తొట్టె నిండినాంక...మెల్లగా దాని ముందు చెత్త పడేది. అది అంతకంతకూ పెరిగి...కమానులోకి వెళ్లే దారికి అడ్డంగా పేరుకుపోయేది. లోపలున్న పదమూడిళ్ల వాళ్లు ఎంత మంచివాళ్లంటే ...కనీసం మాటమాత్రంగా కూడా విసుక్కోకుండా చాలా జాగ్రత్తగా చెత్త దాటుకుని లోపలికి,బైటకీ వస్తూపోతూ ఉండేవాళ్లు!
ఈ వైభోగం చాలదన్నట్టు...పందులు తమ కొంపల్ని చెత్తొట్టి వద్దే గట్టి చేసుకునేవి. ఒకటి రెండు అంటే ఫరవాలేదు. కానీ ఉదయం నుంచి రాత్రి దాకా ఎప్పుడు చూసినా...కనీసం అయిదారు గుంపుగా చేరి అక్కడ సేదదీరుతుండేవి. చిత్రంగా వాటి సైజులోనూ ఒక క్రమం ఉండేది. ఒక పేద్దది...దాని కన్నా కాస్త చిన్నది...ఆ తర్వాత మూడు పిల్లపందులు. చూస్తుంటే అదేదో సకుటుంబ సపరివారంగా తిష్ట వేసినట్టు కనిపించేది. అయినా పందులెన్ని వచ్చినా వాటి ఆహారానికి ఏమాత్రం ఢోకా ఉండేది కాదు. కమాను చుట్టుపక్కల పిలగాళ్లు ఆ బాధ్యతను చాలా పద్ధతిగా నెరవేర్చేవారు. ...కమాను ముందు రోడ్డు...అది దాటితే మురుగు కాలవ. అక్కడే రోజూ ఒకటి రెండూ కానిచ్చేవాళ్లు. కాలువకు ఆనుకునే తుంగా వాళ్ల ఇల్లు. అయితే ఏమాత్రం అదురుబెదురు లేకుండా కాలువ ముందే కూర్చొనేవాళ్లు.
రోజూ ఉదయం 7గంటలప్పుడు కాస్త ఓపిగ్గా గమనిస్తే...నిక్కర్లు వదిలేసి బాణంలా కాల్వ వద్దకు దూసుకెళ్లే పిల్లలు...అక్కడ్నుంచి ప్రశాంత చిత్తంతో నెమ్మది నడచుకుంటూ వచ్చి ఇంటిముందు నిలుచుని "అమ్మా... నీళ్లు పోయవే...'అంటూ గట్టిగా అరిచే భడవలూ కనిపించేవాళ్లు. అక్కడికీ తుంగా దొడ్డబసప్ప పిలగాళ్లు కాల్వ ముందు కనిపిస్తే చేతి కర్ర ఎత్తి..."రేయ్...పో' అంటూ కేకలేసేవాడు. అయితే అది చెవికెక్కే సమయం కాదు...సందర్భం అంతకన్నా కాదు! ఆయన విసిగి పోయి "మీరు మారర్రా...' అని విసుక్కొనేవాడు. దీనికి తోడు అప్పుడప్పుడు గాడిదలూ వచ్చి ఠీవిగా నిలుచుండేవి. ఇక వీధి కుక్కల సంగతి చెప్పక్కర్లేదు. విచ్చలవిడిగా తిరగాడేవి. ఇంత చెత్తాతి చెత్తగా తొట్టె కనిపిస్తున్నా...మునిసిపాలిటీవా
ఇంత రాద్ధాంతానికి మూలకారణమైన తొట్టెను కమాను ఆడోళ్లు ఏమాత్రం తిట్టుకునేవాళ్లు కాదు. ఒకవేళ ఇదే లేకపోతే చెత్త వేసేందుకు రోజుకు మూడు సార్లు బైటకొచ్చే బంగారు అవకాశం దొరికేది కాదుకదా! పొద్దస్తమానం ఇంట్లో పనులతో సతమతమయ్యే వారికి కాస్త తెరిపినిచ్చే పనేమైనా ఉందా అంటే ...అది ఇల్లు ఊడ్చి కసవు చేటలో ఎత్తుకుని వెళ్లడమే! నింపాదిగా చేత్తో చేటపట్టుకుని వెళ్లేముందు ఓ రెండిళ్లు...వచ్చేముందు ఓ రెండిళ్ల కాడ ఆగి సుద్దులు చెప్పుకునేవాళ్లు. బాగా తీరిక ఉంటే కట్టలపై కూర్చొని కబుర్లు. కానీ పురసత్తు లేకుండా పనులుంటే మటుకు ..పాపం ఇలా తోవ చేసుకుని మాటలు కలిపేవాళ్లు. అయితే ఈ కబుర్లలో పెద్ద సమాచారం ఉండేది కాదు. వంటయిందా... టిపినయిందా... బట్టలు తికే శావా...ముసుర్లు కడిగినావా...ఇవే! కాకపోతే అప్పుడప్పుడూ...సీరియస్ విషయాలూ దొర్లేవి. అప్పుడే సమయం కూడా ఎక్కువ పట్టేది. ఎప్పుడూ ఇల్లు దాట రాని వారు కూడా చెత్త వేయడానికి బైటకొచ్చేవారు. మా పక్కింటి వనజమ్మవ్వ కోడలు నాగమ్మక్క కసవు వేయడానికి దర్జాగా బైటకొచ్చేది. మామూలు సమయాల్లో గడప బైట కాలు పెడితే అత్త ఎక్కడా అని ఆరా తీసేది. కానీ కసవు తీసుకెళ్లేటపుడు ఎవరడుగుతారు...ఏం అడుగుతారు? అదీ ఆమె ధైర్యం. ఆసమయంలోనే నాగమ్మక్క ఇంట్లోకి వచ్చి అమ్మతో నాల్గు కబుర్లు చెప్పేది. అలాగే పార్వతమ్మక్క, కోమలమ్మక్క, అందరూ వస్తూ పోతూ ...చెత్త వేస్తూ... మధ్యలో కాసిన్ని కబుర్లు చెప్పుకుంటుంటే...అదో సరదాలా కనిపించేది. ఇదంతా తొట్టె ఉండబట్టే కదా! ఒకవేళ అదే లేకుంటే...ఇలా మాట్లాడుకోను వీలుండేది కాదు కదా అని కొందరి వాదన.
ఏడాదికోసారి మా ఊరివాళ్లను వణికించే వ్యాధి మెదడువాపు. అసలు మొదటిసారి ఈ పేరు విన్నప్పుడు మాకు విచిత్రంగా అనిపించింది. పిల్లలకు మామూలుగానే జ్వరం వస్తుంటుంది. కానీ మెదడువాపు జ్వరం వస్తే ప్రాణాలమీదకే తెస్తుందని ప్రత్యక్షంగా తెలియగానే బెదిరిపోయాం. కమాను వెనక ఓ ఇంటివాళ్లమ్మాయికి మెదడువాపు వచ్చింది. ఒక్కసారిగా ఆ పిల్ల పరిస్థితి చావు బతుకులా మారిపోయేసరికి అందరికీ హడల్. విషయం అక్కడితో ఆగితే బావుండేది. కానీ రోజుకో వార్త. ఆ సందులో పిల్లోడు పోయాడు...ఈ సందులో పిల్లకి జొరమొచ్చి మంచమెక్కింది....వింటుంటేనే గాబరాపెరిగిపోయేది. ఆ సందర్భాల్లో మా కమానును తిట్టుకోని వాళ్లంటూ లేదు. అందరూ "ఆ కమాను చూసినారా...ఆ తొట్టె చూసినారా...అబ్బబ్బా ఎంత చెత్తో. ఆ పందులు చూడు ఎట్లా తిరుగుతుండాయో...' అంటు బెదరగొట్టేవాళ్లు. పైగా ఈ మెదడువాపుకు మూలం పందులే అని...వాటిని దూరంగా ఉంచాలని మైకుల్లో ప్రకటనలు. దేవుడా ...ఏం చేయాలిరా నాయనా! కమాను ముందు తొట్టె...దాంట్లో చెత్త...దాని కోసం పందులు...ఈ స్థితి మారేదప్పుడు? అని పాపం కమానువాళ్లందరూ తలలు పట్టుక్కూర్చొనేవారు. ఈ ఖర్మ చాలదన్నట్టు...వేరే ఊరి నుంచి వచ్చేవాళ్లు కూడా "ఊరికి ఇప్పుడే రాము. అక్కడ మెదడువాపు జ్వరాలంట కదా!....వద్దమ్మా తల్లీ...మీకు మీ కమానుకో దండం...ఆ చెత్తొట్టి అలానే ఉందా...తీసేయించొచ్చు కదా!' అంటుంటే కమానువాళ్లు బిక్కచచ్చిపోవడం తప్ప చేసేదేముంది?
అందుకే పిల్లలకు కాస్త జ్వరం వస్తే చాలు ఎందుకైనా మంచిదని గాయత్రి డాక్గరు వద్ద క్యూ కట్టేవాళ్లు. పాపం ఆయన "పరవాలేదమ్మా...మామూలు జ్వరమే' అన్నా వినిపించుకునే వాళ్లు కాదు. "కాస్త చూడండి డాక్టరు...ఊర్లో పిల్లలందరికీ మెదడువాపు ఉందట' అంటూ గిజగిజలాడిపోయేవారు. సరే అయితే ఈ బెల్డోనా వేయండి అంటూ హోమియో గుళికలు ఇచ్చేవాడు. అప్పట్లో బెల్డోనా మాత్రలు ఊరంతా ప్రసిద్ధి అయింది. ఎవరి నోట్లో విన్నా... బెల్డోనాయే! కమాను పక్కనే వైద్యం వాళ్ల హోమియో షాపుండేది. వాళ్లు రోజూ ఉదయం పెద్దెత్తున బెల్డోనా గుళికలు ఇచ్చేవాళ్లు. హావన్నపేట మునిసిపల్ స్కూల్లో పిల్లలకు ఇవే మాత్రలు పంపిణీ చేసేవాళ్లు. హోమియో వైద్యం, మందులు అస్సలు తెలీని వాళ్ల నోట కూడా బెల్డోనా తారకమంత్రంలా మారిపోయింది. "ఒరేయ్ స్కూలుకెళ్లగానే జేబులోంచి ఈ చీటీ తీసి నాలుగంటే నాలుగే మాత్రలు నోట్లో వేసుకో...' అని నిక్కరు జేబుల్లో పెట్టి పంపే స్థితి దాకా ఈ బెల్డోనా మహిమ పాకిపోయింది. అందరిళ్లల్లో చిన్న సీసానో లేదా చిన్నిచిన్ని పొట్లాల్లో ఈ మాత్రలో తప్పకుండా ఉండేవి. పిల్లలకు నోట్లో వేసేవాళ్లు. తియ్యగా చప్పరించేలా ఉంటాయి కాబట్టి...పిల్లలకు ఏగొడవా ఉండేది కాదు. అయితే బెల్డోనా తీసుకున్న అరగంట దాకా ఏదీ ముట్టకూడదనీ,తినకూడదని చెప్పడమే పెద్దతలనొప్పి. అర్ధగంట ఎప్పుడు అవుతుందా అని కాచుక్కూర్చోవలసి వచ్చేది.
కమాను ముఖాన ఓ దిష్టిచుక్కలా...రోజూ చెత్తతో మంగళహారతిచ్చే పళ్లెంలా కనిపించే ఆ చెత్తొట్టికి కమాను వాళ్లకి ఎక్కడ్లేని అనుబంధం. చిన్నప్పుడు మా గోలీలు..బొగరీలు... బంతులు పడిపోతే వాటిని తీసుకునేటపుడు కచ్చితంగా తొట్టెను తాకేవాళ్లం. అది మమ్మల్ని చూసి చిలిపిగా నవ్వేది. చెత్త ఎక్కువయితే కుయ్యో మొర్రో అంటూ మూల్గేది. మాకు తెలీకుం డా ఎవరెవరు చెత్త వేసేకి వచ్చేవాళ్లో వారి వివరాలన్నీ భద్రంగా కడుపులో దాచుకునేది. "దొంగసచ్చినోళ్లు రాత్రికి రాత్రే ఎట్టా చెత్త వేశారో...బుద్ధి లేకపోతే సరి...' అని బూతులు ఎత్తుకుంటుంటే ...అది పకపకా నవ్వేది. మేం పెరిగి పదోక్లాసు దాటి కాలేజి మెట్లెక్కినా... ఫ్రెండ్స్ తో తొట్టెవద్దే కబుర్లు చెప్పుకుంటూ కాలం గడిపేవాళ్లం. పక్కనే పందులు, గాడిద లు,కుక్కలు తిరగాడుతున్నా...నిలుచున్నా...