బంధం - చెన్నూరి సుదర్శన్

bandham

సాందయ్య బతుకును ప్రతిబింబిస్తున్న పశువుల కొట్టం..

అందులో పార్వతి దీనంగా ఏడుస్తోంది. దాని కనుకొనుకుల్లో నుండి నీరు కారి.. కారి ఎండిపోయిన చారలు సాందయ్య ఆర్ధిక పరిస్థితికి అద్దం పడ్తున్నాయి.

పార్వతి ఏడ్పు సాందయ్య గుండెను వడిపెడ్తోంది. గుడిసెలో నుండిపరుగెత్తు కుంటూ వచ్చి నిశ్చేష్టుడయ్యాడు పార్వతిని చూసి..

సాందయ్యకు రెండు ఆవులు కవలలు. ముద్దుగా లక్ష్మి, పార్వతి అని పేర్లు పెట్టుకున్నాడు. గారాబంగా తన చేతుల మీదుగా పెంచాడు.
విధి వశాత్తు లక్ష్మిని అమ్మాల్సి వచ్చింది.. తనకు సహవాసంగా లక్మి లేకపోయేసరికి పార్వతి బెంగటిల్లింది..

పార్వతి గడ్డిపరక ముట్టలేదు.. కుడితిగోళెంలో మూతి పెట్టలేదు. సాందయ్య గుండె తరుక్కుపోయింది. అమాంతం పార్వతి ముందర కాళ్ళపై పడిపోయాడు. దాని రెండు కాళ్ళు పట్టుకొని తన బాధనంతా చెప్పుకోసాగాడు.

“పార్వతీ.. గోళెంల కుడితి కలిపింది కలిపినట్లే ఉండే.. గడ్డిపోస వాసన కూడా చూడకపోతివి.. ఇలా అయితే ఎలారా ..? నేనేం చేసేది..?
నా కడుపులో ఉన్న యాతన ఎవరితో చెప్పుకోను..!

బుద్ధి ఉన్న మనుషులకు చెప్పుకొనుడు.. ఆ రాళ్ళకు రప్పలకు చెప్పుకున్నది ఒక్కటే.. అయినా నాకెవరున్నరు చెప్పు నువ్వు తప్ప నీ కైనా చెప్పుకుంటే నా ఎద కాస్తా చల్లారుతుంది.

నీ తోటి లక్ష్మి కనబడ్త లేదని రంది పెట్టుకుంటే నా బతుకేం కావాలె..

నేను కావాలని లక్ష్మిని అమ్మితినా.. నా చేతులు పడిపోను” అంటూ తనకు తానే నిందించుకోసాగాడు సాందయ్య. కళ్ళు జలపాతాలయ్యాయి. భుజమ్మీది కండువాతో కళ్ళూ, ముక్కు తుడ్చుకుంటూ..

“నీకు తెలవందేమున్నది పార్వతీ.. నా ఒక్కగానొక్క కొడుక్కు జ్వరమొస్తే.. ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా దావఖానకు తీసుక పోతిని.. పరీక్షలు .. పరీక్షలు అనుకుంట పైసలు ఝాడించుకున్నారే గాని రోగమేందో చెప్పకపోయిరి డాక్టర్లు. ఉన్న ఒక్క ఎకరం ఊడ్చుకపాయె.. పోతే పోయింది నాచేతి మైల.. నా కొడుకు దక్కితే చాలని డాక్టర్ల కాళ్ళు మొక్కితి.. కాని పిడాత ప్రాణం పోయేదాకా చెప్పక పోయిరి డాక్టర్లు. అక్కరకొచ్చే కొడుకు అవయవాలూ దానం చేశా..

నేనూ, నా ఇంటిది గుండెలు బాదుకుంటూ ఏడ్చిన ఏడ్పులు ఏ దేవుడూ వినకపాయే.. ఏ దేవతా కనకపాయే. దావఖాన ఫీజు పైసలు మొత్తం కట్టందే కొడుకు శవంమ్మీద చెయ్యి వెయ్యనియ్యక పోయిరి.. ముఖంమ్మీద గుడ్డ తీసి నా కొడుకు ముఖమైనా చూపక పోయిరి..
ఏం చెయ్యాలే.. చెప్పు పార్వతీ.. నాకు ఎటూ తోచక పాయె.. లక్ష్మిని అమ్మక తప్పకపాయే..

ఏకాఎకిన అమ్మబోతే ఎవరు కొంటరు.. ? అడ్డికి పావుసేరు లెక్కన మన కిరాణ కొట్టు షావుకారు కొన్నాడు. మన ఖాతా పైసలు జమకట్టుకొని.. మిగిలిన పైసలు నా చేతిలో పెట్టాడు. తీసుకొని దండం పెట్టాను.

లక్ష్మిని అమ్మిన పైసలు నా కొడుకను మట్టిలో కలపడానికే సరిపాయే.. కొద్దో గొప్పో మిగిలితే నీ దానకు కావాలని దాచిపెట్టిన.. నా తల్లివి కదూ.. కొంచెం ఎగిలి పడమ్మా.. నిన్ను చూస్తుంటే నా గుండె తరుక్కు పోతోంది.. నీకు దండం పెడ్తా.. ఒక బుక్కెడు కుడితి తాగు.. రెండు గడ్డిపోసలు తిను.. చచ్చి నీ కడుపున పుడతా..”అనుకుంటూ నాలుగు గడ్డి పోచలు తీసుకొని పార్వతి మూతి ముందు పెట్టాడు.
పార్వతి తలనడ్డంగా విసిరింది.

తల బాదుకుంటూ పార్వతి రెండు కాళ్ళను మొక్కసాగాడు సాందయ్య.

ఆవు కన్నీటి చుక్కలు సాందయ్య వీపు మీద పడి పొగలెల్లుతున్నాయి.. అతడి ఎదలో ఉన్న సెగకు సాక్షిగా.

సాందయ్య భార్య సావిత్రమ్మ ఇంటి వెనకాల గుమ్మం నుండి సావిడిలోకి చూస్తూ తన భర్త పడే ఆవేదన గమనిస్తోంది... ఆమె కళ్ళూ కన్నీటి కడవలయ్యాయి.

తన పార్వతిని ఎలా దారిలోకి తెచ్చుకోవాలనే ఆరాటం సాందయ్యను ఆరాత్రి నిద్ర పోనివ్వలేదు. అతడు మగతగా పక్కపై దొర్లుతూ ఉండటం సావిత్రమ్మకూ కంటి మీద కునుకు పట్టలేదు.. పస్తులతో పడుకున్న ఇద్దరికీ పార్వతి రోదన పదే, పదే గుండెల్లో దడ పుట్టిస్తోంది.
ఆ మరునాడు ఉదయమే షావుకారు వద్దకు వెళ్ళి పార్వతి పడ్తున్న యాతన చెప్పి లక్ష్మిని రెండు రోజులపాటు ఇంటికి పంపించుమని బతిమిలాడుదామని సాందయ్య కలవరిస్తూ.. తెల్లవారు ఝామున తనకు తెలియకుండానే నిద్రలోకి జారుకున్నాడు.

***

ఆ మరునాడు ఉదయమే సాందయ్య నిద్ర లేచి గబా, గబా కాలకృత్యాలు తీర్చుకున్నాడు. ఎలాగూ షావుకారు పద్దు పూర్తిగా జమ చేసుకున్నాడు కదా.. కొత్తగా మళ్ళీ ఖాతా తెరిపించి కొన్ని సరుకులు తెచ్చుకుందామని సంచి భుజాన వేసుకొని బయలు దేరాడు.
ఇంతపెందరాలే తన పెనిమిటి సంచి తీసుకొని బయలుదేరడం.. వాకిట్లో సానుపు చల్లుతూ చూస్తోంది సావిత్రమ్మ. భుజాన సంచిని చూసి సరుకులకేమో అనుకుంటూ ఇంట్లోకి పోయింది.

తాను ఏమి సాధించుకు రాబోతున్నాడో.. షావుకారు ఏమంటాడో తెలియదు. సావిత్రమ్మకు చెప్పాలా వద్దా అని ఆలోచిస్తున్న వాడల్లా వీధిలో ఎవరో తుమ్మడంతో ఆగిపోయాడు సాందయ్య.

కాసేపు కూర్చొని వెళ్దామని ఇంటి ముందున్న గద్దెపై కూర్చుండి పోయాడు..వెనుక తుమ్ము శుభ సూచకం.. అనుకుంటూ.
ఇంతలో సావిత్రమ్మ వచ్చి చూసింది. ఇంకా సాందయ్య అక్కడే కూర్చుండి పోయాడేమిటా అని విస్తుపోయింది.

“ఏమయ్యా.. నిన్నే.. ఎక్కడికో బయలుదేరి ఆగిపోయావేం” అంటూ పలుకరించింది. భార్య ‘కరుణేషు మంత్రి..’ అని జ్ఞప్తికి వచ్చింది. తన మనసులోని మాట చెప్పాడు.. సలహా అడిగాడు సాందయ్య.

సావిత్రమ్మ తన చేతిలోని కంచుడు పక్కకు పెట్టి సాందయ్య పక్కనే కూర్చుంది.

“మన పార్వతి ఏడ్పు వినొస్తుండా..”అడిగింది.

“నిజమే..ఏంమాయ చేసావు..”అంటూ ఆత్రుతగా అడిగాడు సాందయ్య.

“రాత్రి మీరు పడ్తున్న బాధ నన్ను కలవర పర్చింది. వాటి మీద బెంగతో మీరేమైపోతారో అని నాకు భయమేసింది. తెల్లవారు ఝామున్నే లేచి పార్వతిని తీసుకొని షావుకారు ఇంటికి వెళ్లాను.

‘అయ్యా.. నా తాళి బొట్టు తీసుకొని నా లక్ష్మిని వదలి పెట్టండి’ అని షావుకారు కాళ్ళమీద పడ్డాను.

అక్కడ లక్ష్మి కూడా పార్వతి మీద బెంగతో నీళ్ళు సైతం తాగక ఒకటే ఏడుపని షావుకారు చెప్పాడు.

లక్ష్మిని చూడగానే పార్వతి పరుగెత్తుకుంటూ వెళ్ళింది.. వాని నాలుకలతో ఒకదాని ఒడలు మరొకటి తడుముకోవడం చూసి షావుకారు, నేను నివ్వెరపోయాం.

నా మంగళ సూత్రాలు తీసుకొని షావుకారు ఒక షరతు పెట్టాడు.

‘మా పశువుల కాపరి ఈ రోజు మా పశువులతో బాటు మీ ఆవులను కూడా మేపడానికి తీసుకెళ్తాడు. సాయంత్రం సరాసరి అవి మీ ఇంటికే వస్తే.. మీ అత్మబంధువలన్నమాట. అప్పుడు మంగళ సూత్రాల ఖరీదు కట్టి మిగిలిన డబ్బు ఇస్తానన్నాడు. ఒకవేళ ఆవులు తన ఇంటికే వస్తే.. మంగళ సూత్రాలు తిరిగిస్తానన్నాడు. పార్వతికి ఖరీదు కూడా కట్టి డబ్బు ముట్టజెప్తానన్నాడు.

లక్ష్మీ, పార్వతి కలిసి తృప్తిగా పచ్చగడ్డి మేస్తున్నాయి.

అవి ఎక్కడున్నా కలిసి మెలిసి చల్లగా ఉండాలి అని మనసులో అనుకొని తాళి బొట్టు షావుకారు చేతిలో పెట్టి దండం పెట్టి వచ్చాను.
సాయంత్రం వరకు చూద్దాం . నువ్వు ఇంట్లోకి రావయ్యా..” అనుకుంటూ తాను కింద పెట్టిన కంచుడు తీసుకొని ఇంటి పనిలో మునిగి పోయింది సావిత్రమ్మ.

సాందయ్య మనసు డీలా పడింది. తాన వెళ్లి కార్యం సాధించుకు రావాలనే పనికి గండి పడే సరికి హతాశుడయ్యాడు. కాలు కదుప మనస్కరించడంలేదు.

సావిత్రమ్మ మెడలోని పసుపు తాడు అతడి హృదయాన్ని కకావికలం చేస్తోంది.

ఒకవేళ లక్ష్మీ, పార్వతి రాకుంటే.. అని మనసులోకి రాగానే.. కళ్ళల్లో నీళ్ళు ఉబికాయి..

అవి వచ్చే దాకా ఇక్కడి నుండి కదలను.. అని భీష్మించుకొని అలాగే కూర్చుండి పోయాడు..

సాందయ్య మొండి పట్టుదల సావిత్రమ్మకు తెలియంది కాదు.. తనూ అన్నపానీయాలు మానేసి.. మాటి మాటికి గుడిసెలో నుండి తొంగి చూడసాగింది.

పొద్దుగూకింది..

పక్షులు తమ, తమ గూటిలోకి పరుగులు తీస్తున్నాయి. వాటి కిల, కిల రాగాలతో సాందయ్య మదిలో కలవరం మొదలయ్యింది. లక్ష్మీ, పార్వతి రాక కోసం ఒళ్ళంతా కళ్ళు చేసుకున్నాడు.

దూరంగా లక్ష్మీ, పార్వతి జంటగా రావడం కలయా..? నిజమా..? అని ఆశ్చర్యంగా చూడసాగాడు.

చెయ్యి పైకెత్తి దృష్టిని తీక్షణం చేసాడు. నిజమే.. తన ఆత్మబందువులే..

ఉత్సాహంగా సావిత్రమ్మను పిలిచాడు. తన చూపు మీద నమ్మకం లేక. సావిత్రమ్మ పరుగు, పరుగున వచ్చింది. లక్ష్మీ, పార్వతిని చూసి కౌగిలించుకుంది. సాందయ్య లేచి ఆవులను ముద్దాడుతూ..“సావిత్రమ్మా.. మనం చూస్తున్నది నిజమేనా..!”అంటూ అడిగాడు.. ఇంకా తన మదిలో సందేహం వీడలేదు.

‘నిజమే..’ అన్నట్లు తన కళ్ళతోనే సావిత్రమ్మ సమాధానం చెబుతుంటే సాందయ్య కళ్ళల్లో ఆనందభాష్పాలు దొర్లాయి.

***

ఈ బొమ్మ ఏ కథ కోసం గీయబడిందో ఈ క్రింది లింక్ క్లిక్ చేసి చూడండి.... http://www.gotelugu.com/issue126/3286/telugu-stories/aatmabandhuvulu/

మరిన్ని కథలు

Kya huvaa
క్యా హువా
- కె. తేజస్వని
Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు