అదృష్టం - నూజిళ్ళ శ్రీనివాస్

adrushtam

“ఊరెళ్ళి సిద్దాంతి గార్ని కలిసొద్దామనుకుంటున్నాం.. మీరు కూడా ఏమైనా వస్తారా?” అన్నయ్య ఫోన్ చేసి అడిగేసరికి వెంటనే “సరే” అనేసాడు కామేశ్వరరావు. ....నిజానికి దసరా సెలవులు ఇచ్చిన దగ్గర్నుంచి ఏదో ఒకరోజు ఊరు వెళ్దామని అనుకుంటున్నాడు భార్య, పిల్లలతో. ఇప్పుడు వాళ్ళ అన్నయ్య, వదిన కూడా వస్తామనడంతో మరుసటి రోజు ప్రయాణం ఖాయం చేసేసుకొన్నారు. కాకినాడ నుంచి అమలాపురం బస్సెక్కి కూర్చున్నాక అన్నదమ్ములు, తోడికోడళ్ళు కబుర్లలో మునిగిపోయారు. కామేశ్వరరావు కొడుకు స్మార్ట్ ఫోన్లో గేమ్స్ ఆడడంలో మునిగిపోయాడు.

కామేశ్వరరావు వాళ్ళది అమలాపురం దగ్గర చిన్న పల్లెటూరు. ఇప్పుడిప్పుడే పట్నం రూపం సంతరించుకొంటోంది. తల్లి దండ్రులు ఐదారేళ్ళ క్రితమే అనుకోకుండా వెంటవెంటనే కాలం చేయడంతో ఊళ్ళోకి వెళ్ళాలంటే కామేశ్వర్రావుకి బెంగ. నిజానికి ఊళ్ళో అమ్మ, నాన్నల దగ్గర ఉందామనే ఉద్దేశ్యంతోనే, పెద్ద ప్రయత్నంమీద హైదరాబాద్ నుంచి స్వంత జిల్లాకి ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు. ఇవ్వాళో రేపో సొంతూరికే మకాం మారుద్దామనుకొనేంతలో తల్లిదండ్రులు పోవడంతో, ఆ ఇంట్లో ఉండడం బెంగగా అనిపించి ఉద్యోగం చేస్తున్న కాకినాడలోనే అయిష్టంగానైనా అద్దె ఇంట్లో మకాం పెట్టాడు. అప్పటికే అన్నయ్య కూడా అక్కడే స్థిరపడడంతో ఊరికేసి ట్రాన్స్ఫర్ గురించి పెద్దగా ఆలోచన రాలేదు. ఊరికి వెళ్లాలనో, వీలయితే, అక్కడే ఉండిపోవాలనో కోరిక తరచూ మనసులో రొద పెడుతున్నా పిల్లల చదువుల వంకతోనో, పట్నం సౌకర్యాల పేరుతోనో వాయిదా పడుతూ వస్తోంది. అయినా దసరా సెలవులకి ఊరు వెళ్లకపోతే ఏదో వెలితి. ఎందుకంటే, గణపతి, దసరా నవరాత్రులు తమ ఊర్లో చాలా వైభవంగా చేస్తారు. ఆ సందడి గుర్తుకొస్తే చాలు చిన్నపిల్లవాడైపోతాడు కామేశ్వరరావు. తరచూ పిల్లలకి కూడా ఆ కబుర్లే చెబుతుంటాడు. ఊరెళ్ళి, అటునించి అక్కడికి దగ్గరగానే ఉండే అత్తారింటికి వెళ్లి రావాలి అనుకొంటుండగా అన్నయ్య ఫోను. బాగానే కుదిరిందిలే అనుకున్నాడు కామేశ్వరరావు.

అన్నయ్య, వదినల మాటలని బట్టి ఊళ్ళో సిద్ధాంతి గారికి జాతకాలు చూపించి, ఆయన సలహాలు తీసుకోడం ప్రధానంగా వాళ్ళు పెట్టుకొన్న పని. ఎప్పట్నించో వస్తుందనుకున్న అన్నయ్య ప్రమోషన్ ఇంకా రాకపోవడం, అబ్బాయికి అనుకున్నంత పెద్ద పేకేజ్ తో కేంపస్ ఉద్యోగం రాకపోవడం, అమ్మాయికి అమెరికా సంబంధం ఖాయం అనుకొనేంతలో ఇట్టే తప్పిపోవడం, రాష్ట్రం విడిపోడంతో విపరీతంగా పెరిగిపోతాయని కొన్న స్థలాలకు రేటు పెరగకపోవడం, ఇలా సమస్యలు చుట్టుముట్టడంతో తమ జాతకాలు చూపించుకొని, అదృష్టం ఎప్పుడు కలిసొస్తుందో అడగడానికి, సిద్దాంతి గారి దగ్గరకి వెళుతున్నారు.

కామేశ్వరరావు తండ్రి కాలం నుంచి కూడా సిద్ధాంతి గారంటే వాళ్ళ ఊళ్లోనే గాక, చుట్టుపక్కల ఊళ్ళలో కూడా మంచి పేరు. నిజానికి సిద్ధాంతి గారు ఉపాధ్యాయునిగా ఉద్యోగం చేసినా, ఆయనకు వంశపారంపర్యంగా వచ్చిన పౌరోహిత్యం, జాతక, వాస్తు పరిశీలనల మూలంగానే మంచి పేరు, ప్రఖ్యాతి. ఆయనలో ఉన్న గొప్పతనం ఏంటంటే – మాటల ద్వారా కొండంత భరోసా ఇచ్చి, మనుషులకి మానసికంగా భారం తగ్గించి, చిన్న చిన్న సూచనల ద్వారానే ఎక్కువ ఖర్చులు చేయించకుండా జాతక దోషాలకు నివారణ సూచనలు ఇస్తారని పేరు. జాతకాల మాట ఎలా ఉన్నా, జీవితం పట్ల ఆయనకు ఉన్న సానుకూల దృక్పథం, ఆయన గడిపే నిరాడంబర జీవితం అంటే కామేశ్వరరావుకి, వాళ్ళ కుటుంబానికి చాలా ఇష్టం. అందుకనే, ఏదైనా సమస్య వచ్చినప్పుడు, సిద్ధాంతి గార్ని కలిసి స్వాంతన పొందుతారు. అయితే, కామేశ్వరరావు వాళ్ళ ఇంటికి వెళ్లి దాదాపు ఏడెనిమిది సంవత్సరాలైపోయింది. మధ్యలో ఒకటి రెండు సార్లు ఫోన్లో మాట్లాడడమే. అదీ – సిద్ధాంతి గారి చిన్నబ్బాయి, తన క్లాసుమేటు రామశర్మతో.

కబుర్లలో ఉండగానే, అమలాపురం వచ్చేసింది. బస్సు దిగి, ఆటోలో ఊరికి చేరారు అందరూ. ఊళ్ళో చుట్టాలు ఉన్నా, ముందుగా సిద్ధాంతి గారింట్లో పని చూసుకొనే వెళ్దాం అనుకొని, వారింటికి వెళ్ళారు. తలుపు కొట్టేటప్పటికి పద్దెనిమిది, పంతొమ్మిదేళ్ళ వయసున్న ఒక అమ్మాయి వచ్చి తలుపు తీసింది. సిద్ధాంతి గారి మనవరాలేమో అనుకుంటూనే....వాళ్ళు “సిద్ధాంతి గారున్నారామ్మా?” అని అడిగిన ప్రశ్నకి, “లోపలికి రండి, తాతగారు, నాన్నగారు భోం చేస్తున్నారు....కూర్చోండి” అంటూ వాకిట్లో కుర్చీలు వేసింది. “సమయం పదకొండే కదా – అప్పుడే భోజనాలా?” అని కామేశ్వరరావు అంటుంటే, “మరి సెలవు రోజుల్లో ఊళ్ళల్లో అంతే కదా – పైగా, నవరాత్రులు పూజలు అవీ చేసుకొంటూ ఉంటారుగా.. మనలా కాఫీలు, టిఫిన్లు గొడవలుండవు పొద్దున్నే...” ఇలా మాట్లాడుకుంటూ లోపలికి వెళ్ళబోతూ, ఏదో గుర్తొచ్చిన వాళ్ళల్లా అంతా, చెప్పులు విప్పి, గోలెంలో నీటితో కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళారు.

పూర్వంతో పోలిస్తే పెద్దగా మార్పులేని ఆ ఇంటిని కామేశ్వరరావు పరిశీలించి చూస్తుండగా, వాళ్ళ అబ్బాయి, అక్కడున్న ఉయ్యాల బల్ల మీదకి ఎక్కి ఆనందంగా ఊగుతున్నాడు. కామేశ్వరరావు అన్నయ్య అక్కడ న్యూస్ పేపర్ చదూతుంటే, ఆడవాళ్ళు కబుర్లలో మునిగిపోయారు – అక్కడ మొక్కలు, చెట్లు, ఇల్లు విశేషాలు చూస్తూ. కామేశ్వరరావు చిన్నప్పుడు రామశర్మతో, ఇతర స్నేహితులతో ఆడుకున్న ఆటలని గుర్తు చేసుకొంటున్నాడు. సిద్ధాంతి గారి ఇంటి వెనుక పెద్ద దొడ్డి, తమ ఇంట్లో లాగానే ఉన్నా, వాళ్ళ దొడ్లో ఎక్కువగా జామ చెట్లు, రేగు చెట్లు ఉండడంతో, పిల్లలంతా వాళ్ళ దొడ్లోనే చేరేవారు. ఏ పండగ వచ్చినా సందడి వాళ్ళ దొడ్లోంచే...ఇలా కామేశ్వరరావు ఆలోచిస్తుండగానే, సిద్ధాంతి గారు, రామశర్మ, రామశర్మ వాళ్ళ అన్నయ్య అవధాని ముగ్గురూ వచ్చారు లోపల్నించి.

సిద్ధాంతి గారు చాలా పెద్దవారైపోయారు. అయితే, ఆ ముఖం లోని తేజస్సు మరింత పెరిగిందనిపించింది. పలకరింపులు, పరిచయ వాక్యాలు అయిపోయాక, కామేశ్వరరావు అన్నయ్య తను వచ్చిన విషయం గురించి సిద్ధాంతి గారితో మాట్లాడుతున్నాడు. జాతక చక్రాలు చూపిస్తూ సందేహాలు అడుగుతున్నాడు. రామశర్మ, అవధాని కామేశ్వరరావుతో చాలా ఆప్యాయంగా కబుర్లు చెబుతుండగా, అవధాని భార్య, రామశర్మ భార్య బయటకు వచ్చారు. అప్పుడే పూజలు, వంటలు, భోజనాల పనులు పూర్తయి బయటకు వచ్చినట్లున్నారు. పూర్వ పరిచయాలు ఉన్నవారే అవడంతో, ఆడవాళ్ళు పరస్పరం పలకరించుకొని కలిసిపోయారు. వాళ్ళను చూస్తుంటే కామేశ్వరరావుకి, తన చిన్నప్పుడు చూసిన వాళ్ళ అత్తగారిని చూసినట్లే ఉంది- వాళ్ళ కట్టు, బొట్టు, పలకరించే తీరు. అప్పుడే గుర్తొచ్చి “అవును అత్తయ్య గారేరి? లోపలున్నారా?” అని అడిగాడు కామేశ్వరరావు – చిన్నప్పటి వరసలు గుర్తు తెచ్చుకొంటూ. “అమ్మకి ఈ మధ్య ఒంట్లో బాగుండడం లేదు” అనడంతో, “ఔనా....తెలీదే...ఏమైంది?” అంటుంటే, వాళ్ళ పెద్ద కోడలు, “రండి, చూద్దురు గాని లోపలున్నారు” అంటూ లోపలికి దారి తీసింది. వెనకనే కామేశ్వరరావు, మిగిలిన వాళ్ళు లోపలికి వెళ్ళారు.

అక్కడ మంచం మీద గుర్తు పట్టలేని రీతిలో ఉన్నారు వర్ధనమ్మ గారు. మనిషి పూచిక పుల్లలా అయిపోయి, కళ్ళు గాజు గోళీల్లా, బుగ్గలు లోతుకి పోయి పూర్వపు నిండైన రూపమంతా మాయమైపోయింది. నుదుటి మీద రూపాయి కాసంత కుంకుమ బొట్టు మాత్రం అలానే ఉంది. ఆవిడని ఆ స్థితిలో చూసిన వాళ్లకెవరికీ నోట మాట రాలేదు. సిద్ధాంతి గారు, వర్ధనమ్మ గారు అంటే – ఆ ఊళ్ళో పార్వతీ పరమేశ్వరులని పేరు. ఏ పెళ్లి, పేరంటం అయినా, ఈ దంపతులకే ప్రథమ తాంబూలం. పైగా ఉమ్మడి సంసారంలోకి చిన్న వయసులోనే కోడలుగా వచ్చిన ఆమె, జీవితమంతా పని, పని అంటూనే గడిపింది. అత్త, మామల సేవలు, భర్తకు ఉద్యోగానికి, పూజాదికాలకి అన్నీ సమయానికి అమర్చడం, తమ పిల్లలతో పాటుగా, తోడికోడళ్ళ పిల్లలు, ఆడపడుచుల పిల్లలు, అందరి మంచి చెడ్డలూ బాధ్యతగా చూడడం--- ఇలా ఆమెను ఎప్పుడూ పని చేస్తూ ఉండగానే చూసేవాడు కామేశ్వరరావు. అయితే, ఏనాడు ఆమె ముఖంలో విసుగు గాని, చిరాకు గాని ఉండేవి కావు. అత్త మామలకు, భర్తకు మడిగా చేయవలసిన పనులన్నీ చేసి పెట్టి, చుట్టు పక్కల వాళ్లకి కావలసిన సాయానికి కూడా ముందుండేది. ఆవిడ అంటే – కామేశ్వరరావు తల్లికి చాలా స్నేహం, అభిమానం.

అలాంటి ఆవిడ ఇలా అయిపోవడం చూసిన వారికెవరికీ నోట మాట రాలేదు. ఎన్ని పూజలు, వ్రతాలు, ఉపవాసాలు చేసేది ఆమె? ఏమైపోయాయి ఆ ఫలితాలన్నీ? ఆవిడ కళ్ళతోనే వాళ్ళని పలకరించి నవ్వారు. “ఎలా ఉన్నారు పిన్నిగారూ?” అన్న కామేశ్వరరావు వదిన ప్రశ్నకు “బానేవుందమ్మా- ఇదుగో నా అదృష్టం కొద్దీ వీళ్ళిద్దరూ ఉన్నారుగా...” మాట నూతిలోంచి వచ్చినట్లున్నా, అందులో ఆప్యాయత ధ్వనిస్తూనే ఉంది. “అసలేమైంది?” అన్న కామేశ్వరరావు ప్రశ్నకి, “మూడేళ్ళ క్రితం సడన్ గా పక్షవాతం వచ్చింది, వైద్యంతో కోలుకున్నారు అనుకొంటుంటే, బాత్రూం లో జారి పడడంతో .....ఇదిగో...ఇలా ...అన్నీ మంచం మీదే...గత ఏడాదిగా అసలు నడవడం లేదు”......అంటూ చెప్పింది వాళ్ళ పెద్ద కోడలు. పండగ కదా అందుకని, కొత్త చీర వర్ధనమ్మ గారి మీద దుప్పటి కప్పినట్లు కప్పారు.

ఆడవాళ్ళు మాట్లాడుతుంటే, ఇంక అక్కడ ఉండలేక బయటకు వచ్చేసిన కామేశ్వరరావు, రామశర్మతో “అయ్యో చాలా దురదృష్టంరా....అత్తయ్యగార్ని ఇలా చూస్తే బాధగా ఉంది....” అంటూ తన మనసులోని మాటను అనుకోకుండానే బయట పెట్టేసాడు. ఆ మాటకు అడ్డు తగులుతున్నారా అన్నట్లుగా ఇద్దరు అన్నదమ్ములు ఒకేసారి – “ఇంకా మా అదృష్టం కదా – అమ్మ మాట్లాడుతోంది. మేము చెప్పే విశేషాలు ఆమెకి వినపడడం కొంచెం కష్టంగా ఉంది కాని, తను చెప్పదలచుకున్నవి చెబుతోంది.” అన్నారు. వెనకే వచ్చిన పెద్ద కోడలు - “అవునండీ – మా అత్తయ్య గారు ఆ స్థితిలో ఉన్నా కూడా అలా మాట్లాడుతూ ఉండడం మా అదృష్టం – పెద్దవాళ్ళు మాకు ఎదురుగా ఉన్నారు అంతే చాలు- మాది, పిల్లలది నిజంగా అదృష్టమే” అంటుంటే, అవే మాటలను తన చూపులతో వ్యక్తం చేసింది చిన్న కోడలు.
అలా బయటికి వచ్చి కబుర్లు చెప్పుకుంటుంటే, పళ్ళేల నిండా రకరకాల ప్రసాదాలు తీసుకొచ్చారు ఆ ఇద్దరు కోడళ్ళు. ఆరోజు దుర్గాష్టమి పూజ చేసామని, అనుకోకుండా మేము రావడం తమ అదృష్టం అని చెప్పి, కామేశ్వరరావు భార్యకి, వదినకి తాంబూలం ఇచ్చి, చీరలు పెట్టారు. అవధాని, రామశర్మలతో మాట్లాడుతున్న కామేశ్వరరావు, వాళ్ళ ఉద్యోగ విశేషాలు అడుగుతున్నాడు. అవధాని సెకండరీ గ్రేడ్ టీచరుగా జాయిన్ అయ్యి దాదాపు 20 సంవత్సరాలు అవుతోంది. పక్కనే ఉన్న మరో ఊర్లో కొలువు. బండి మీద పది నిమిషాల ప్రయాణం. “అదేంటీ? ఇన్నాళ్ళయినా ఇంకా స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్ రాలేదా? ఈపాటికి నీకు లెక్చరర్ వరకు ప్రమోషన్ వచ్చుంటుంది అనుకుంటున్నా..” – అంటూ ఆశ్చర్యంగా అడుగుతున్న కామేశ్వరరావుకి నవ్వుతూనే సమాధానం చెప్పాడు – అవధాని. “నా అదృష్టం బాగుంది. కనకనే దగ్గరలో చేస్తున్నా – అదే ప్రమోషన్ వస్తే –పోస్టింగ్ చాలా దూరం వేస్తున్నారు- అందుకని ప్రస్తుతానికి అది రాకపోవడమే మంచిది.” అన్నాడు.

ఏం మాట్లాడాలో తెలీని కామేశ్వరరావు తన క్లాసు మేట్ రామశర్మ తో కబుర్లు ప్రారంభించాడు. “ఏరా, ఇంక ప్రభుత్వ ఉద్యోగం ఆశలు లేనట్లేనా? ఎమ్మెస్సీ బియిడి చేసాక కూడా, నీకు ఏ పోస్టూ రాకపోవడమేంటిరా? నీ దురదృష్టం కాకపోతే, నీకన్నా తెలివి తక్కువ వాళ్ళం అంతా మంచి ఉద్యోగాల్లోనే సెటిల్ అయ్యాం” బాధగా అన్నాడు కామేశ్వరరావు. రామశర్మ మాత్రం నవ్వుతూ – “అదేం లేదురా, నేను అదృష్టవంతుడినే – ఉమ్మడి కుటుంబమే కదా – అన్నయ్యే బాధ్యత తీసుకుంటూ ఉంటాడు. పైగా, నా అదృష్టం కొద్దీ దగ్గరలోనే ఈ మధ్యనే ఒక ప్రైవేటు జూనియర్ కాలేజ్ పెట్టారు – పరవాలేదు జీతం, గౌరవం సంతృప్తికరంగానే ఉన్నాయి. పాపం ఆ అవకాశం లేని వాళ్ళు మన ఊళ్ళో చాలా మందే ఉన్నారు.” కామేశ్వరరావు ఇంకేం మాట్లాడాలో తెలీక పిల్లల గురించి అడిగాడు. “అన్నయ్యకు అబ్బాయి, అమ్మాయిరా – అదృష్టం కొద్దీ బాగా చదివే పిల్లలే. అబ్బాయి అమలాపురంలో బీఎస్సీ చదువుతున్నాడు, అమ్మాయి నేను చెప్పే కాలేజి లోనే ఇంటర్ సెకండియర్....ఇక నాకు ఇద్దరూ పాపలే. ప్రస్తుతం హైస్కూలు చదువులు- ఊళ్ళో స్కూల్లోనే. పండగకి వాళ్ళ అమ్మమ్మ ఇంటికి వెళ్లారు.”
బయట వరండాలో సిద్ధాంతి గారితో మాట్లాడుతున్న వాళ్ళ అన్నయ్య దగ్గరకు వెళ్లి కూచున్నాడు కామేశ్వరరావు. జాతకాలు చూపించుకోవడం అయిపోయినట్లుంది- ఇతర విశేషాలు మాట్లాడుకుంటున్నారు. “ఎలా ఉంది మావయ్య గారూ, మీ ఆరోగ్యం? బాగా నీరసపడిపోయారు ఇదివరకటి మీద...” అంటూ యోగక్షేమాలు అడగడం ప్రారంభించిన కామేశ్వరరావుతో “దివ్యంగా ఉందోయ్ ఆరోగ్యం – వేళపట్టుకి సంధ్యావందనం చేసుకొని, స్వామికింత పూజ చేసుకుంటున్నా. సాయంత్రం వేళల గుళ్ళోకి వెళితే, నలుగురు జనాలతో కబుర్లకి లోటు లేదు. నా అదృష్టం కొద్దీ మా అబ్బాయిలు ఇద్దరు నాకు ఏ ఇబ్బందీ కలక్కుండా చూస్తున్నారు. అంత కన్నా అదృష్టం ఏమిటంటే నా కోడళ్ళు నన్ను, ఆవిడని ఆప్యాయంగా చూసుకుంటూ ఉంటారు. ఇంకా అదృష్టం మా మనవళ్ళు – నాతోటే కబుర్లు చెబుతూ కాలక్షేపానికి లోటు లేకుండా చేస్తుంటారు. అమ్మాయి, అల్లుడూ ఉండేది రాజోల్లోనే కదా....నెలకోసారైనా చూసి వెళ్తుంటారు....ఎప్పుడైనా మీలాంటి వాళ్ళు వస్తుంటే కబుర్లు చెబుతూ గడిపేస్తుంటా...” అంటూ నిండుగా నవ్వుతూ “నీ ఉద్యోగం ఎలా ఉంది? పిల్లలు బాగా చదువుతున్నారా.....” అంటుంటే, “మీ ఆశీస్సుల వల్ల అంతా బాగుందండీ...” అంటుండగానే కామేశ్వరరావు అన్న “ఇక వెళ్ళొస్తామండీ... మీరు చెప్పినట్లే చేస్తా...మళ్ళా కలుస్తా” అంటూ భార్యతో కలిసి ఆయన కాళ్ళకు నమస్కరించాడు. అతన్ని కామేశ్వరరావు, భార్య, పిల్లాడు అనుసరించారు.

అందరి దగ్గరా సెలవు తీసుకొని, బయటకు వచ్చాక, కామేశ్వరరావు కొడుకు అడిగాడు – “నాన్నా? అదృష్టం అంటే ఏమిటి?” అని. “అదేంట్రోయ్... సడన్ గా ఆ పదం ఎందుకు గుర్తొచ్చిందీ...? అన్నాడు వాళ్ళ పెదనాన్న. “ఏం లేదు పెదనాన్న గారూ....వాళ్ళింట్లో ఎవరు మాట్లాడినా, ఏమి మాట్లాడినా “అదృష్టం కొద్దీ...అంతా బాగుంది... అని చాలా సంతోషంగా అంటున్నారు” అన్నాడు. కొడుకు తలని నిమురుతూ అన్నాడు– కామేశ్వరరావు “అదృష్టం అంటే – కంటికి కనబడని సంపద నాన్నా...” “అంటే, శాటిస్ఫేక్షన్ అనుకోవచ్చా?- అడిగాడు వాళ్ళ అబ్బాయి, వాడికేదో అర్ధమైనట్లు. నవ్వుతూ తలూపాడు కామేశ్వరరావు – “అవును కదా, సంతృప్తిని మించిన సంపద ఏముందీ? దాన్ని పొందడం కన్నా అదృష్టం ఏముంటుంది?” అనుకుంటూ.

మరిన్ని కథలు

Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న
ఓ breaking news
ఓ బ్రేకింగ్ న్యూస్
- బివిడి ప్రసాద రావు
chettu baadha
చెట్టు బాధ
- లక్ష్మీ కుమారి.సి