తగిలిందా...! - సుంకర వి హనుమంతరావు.

tagilindaa..!

“ఏంటే కమలా ! ఇంత లేటుగా వచ్చావ్ ? ..నేను పూజ చేసుకోవాలి కదా ఆ మాత్రం బుద్ది లేదా?”

“అమ్మగారూ! నేను పదింటికే వచ్చా ఎవరో పోలీసమ్మ వచ్చి మీటింగ్ పెట్టారమ్మా..ఈ అపార్టుమెంటులో పని చేసే..పని మనుషులందరినీ మీటింగని సెక్కరటరీ సారు ఆపేసా రమ్మా ఆయమ్మ మాతోనే మాట్లాడాలని చెప్పారని.”

“కథలు చెప్పడం నీకు బాగా అలవాటై పోయిందే..పోలీసమ్మ మీతో మీటింగ్ పెట్టారంటే నేను నమ్మాలి. మీటింగే పెట్టిందా..పార్టీ లాంటి దిచ్చిందా..?”

“మీకెలా తెలిసిందమ్మా.? .అందరికీ చాయ్ యిప్పించిందని..?”

అంటూ ఆశ్చర్య పోతూ అయోమయంగా చూస్తున్న..కమలని వింతగా చూస్తూ

“అంటే.. నువ్వు చెప్పేదంతా నిజమే నంటావ్ ? “

“అమ్మతోడమ్మా ..సెక్కరటరీ సారుకు ఫోను చెయ్యండమ్మా ..నేను అబద్దం చెప్పలేదమ్మా “

చేతిని తలమీద పెట్టుకొని ఒట్టు పెట్టుకుంటున్న కమలను అదోలా చూస్తూ..

“పోలీసమ్మకు మీతో మీటింగేంటే.? .

ఇంతకీ ఆయమ్మ ఏమడిగింది..మీరేం చెప్పారు.. ?

“మరేం లేదమ్మా..మన యపార్టుమెంటులో ఎవరో “అత్త రాక్షసి” కోడల్ని రాచి రంపాన పెడుతోందని రిపోర్టిచ్చారంట..ఆ రిపోర్టులో ప్లాటు నెంబరు గాని పేరు గానీ రాయలేదంట. అందుకే మా అందరినీ అడిగి ఏ ప్లాటులో..ఎవరెవరుంటారో ..అందులో అత్తాకోడల్లు ఏ ప్లాటుల్లో వుంటారో కాగితం మీద రాసుకెల్లారమ్మా..ఏ అత్తా కోడల్లు గొడవ పడినా సెక్కరట్టీ సారుకు చెప్పాలని చెప్పారమ్మా.”

ఆ సారు ఆ యమ్మకు పోను సేత్తారంట.నిజమని తేలిందా మీముందే చెత్త కొట్టుడు కొట్టి బొక్కలో తోస్తా నన్నారమ్మా..మీలో ఎవరు ఏం చెప్పినా ఆల్ల పేర్లు బయటకు రావని మరీ మరీ సెప్పి నా రమ్మా.మరో మాట కూడా సెప్పినారమ్మా..ఏ అమ్మాయికి అన్నాయం జరిగినా మన అమ్మాయిలకు జరిగి నట్టే నని .ఆమ్మ సెప్పింది నిజమే కదమ్మా..? రేపు నా కూతురూ అత్తోరింటికి ఎల్లేదే కదమ్మా..అసుమంటి అత్తలే కదమ్మా కట్నాలకోసం ..పిల్లలు పుట్టలేదని ..పుట్టినా మగ పిల్లలు పుట్ట లేదని కిరసనాయిలు పోసి పానాలు తీస్తు న్నారు కదమ్మా.?.అయినా ..మొన్నామద్య ఆటల పోటీలు జరిగితే మీసాలు తిప్పుకంటూ..కండలు పెంచుకుని ఎల్లిన అబ్బాయిలంతా..ముకానికి పసుపు పూసుకొత్తే..అమ్మాయిలు అందునా మన తెలుగమ్మాయి తో బాటుమరో యిద్దరమ్మాయిలు..కప్పులు తెచ్చారంటగా..”?
అంటూ చెప్పుకు పోతున్న కమల ముఖం చూడలేక

“కమలా! ముందు హాలంతా వూడ్చెయ్..నేను బాతురూం కెళ్లున్నా”

దడ దడ లాడుతున్న గుండెల్ని అదిమి పెట్టుకుంటూ బెడ్ రూంలోకొచ్చి తలుపులు మూసేసుకుంది..జానకమ్మ..ద సాఫ్ట్ వేర్ ఇంజినీర్ రవీంద్ర తల్లి .నిస్సత్తువగా మంచం మీద పడి పోయిన జానకమ్మ కళ్లముందు కదలాడింది..పోయిన వారం తనకూ రవీంద్ర కూ మధ్య జరిగిన” సంభాషణ “

** *

“రవీంద్రా! ..మీ నాన్న యాక్సిడెంటులో చనిపోయే నాటికి నువ్వు ఇంటర్ లో వున్నావు. మీ మామయ్య దగ్గర అప్పు చేసి నిన్ను ఇంతవాడిని చేశాను. నీ చెల్లాయిల్ని హాస్టల్లో పెట్టి చదివిస్తున్నాను. కట్నం డబ్బులతో మామయ్య బాకీ తీర్చేద్దామనుకుంటే నువ్వు లవ్వని
నీరజను పెళ్లి చేసుకుని నా నమ్మకాన్ని నీళ్ల పాలుచేశావు”.

“ అవునమ్మా.. నీ దృష్టిలో నేను చేసింది అన్యాయమే..కానీ ఆ బాకీ అంతా నెల నెలా తీరుస్తోంది నీరజ శాలరీ నుంచే కదా. చెల్లాయిలకి హాస్టల్ ఫీజు కూడా నీరజే కడుతోంది.తను లోనుతీసుకుని మరీ మామయ్య కే యిచ్చింది..దాదాపు మామయ్య బాకీ అంతా తనేగా తీర్చేసింది .?”

“మా తీర్సిందిలే.. బోడి గొప్పలు చెప్పకు.నిన్ను అల్లుడిగా చేస్తానని మాటిచ్చి అప్పు చేశా. నా మాట నట్టేట్లో ముంచావ్. అయిదేళ్లయింది పెళ్లై..ఓ మనమడినో మనుమరాలినో ఎత్తుకుందామంటే ఆ అదృష్టం కూడా లేదు నా ముఖానికి.నీ పెళ్లాం “గొడ్రాలు.” .దానికీ జన్మకిక పిల్లల రాతలేదు.మామయ్యతో మాట్లాడాను..వాడి రెండో కూతురు బంగారు బొమ్మ ..ఎంతంటే అంత కట్నం యిస్తా నంటున్నాడు.”
అమ్మా! నీకెన్నో సార్లు చెప్పాను..నీరజ గురించి నీచంగా మాట్లాడొద్దని.నాన్నకు నువ్వెంతో నీరజ నాకంతే.తననే ఎందుకు ఆడి పోసుకుంటావు..లోపం నాదే నేమో.

“నోరు ముయ్ రా..వెధవా..మీ తాతయ్యకు ఐదుగురు సంతానం..మీ నాన్నకు నీతో బాటు యిద్దరు కూతుళ్లు..నీలో లోపం వుందని మరెప్పుడైనా పిచ్చి కూతలు కూశా వంటే పళ్లు రాల గొడతా.”

అగ్గిమీద గుగ్గిలమై పోయింది జానకమ్మ. మూర్ఖు రాలైన తల్లితో మాట్లాడడం..శుద్ధ వేష్టనే నిర్ణయంతో..మౌనం వహించాడు..రవీంద్ర.
“ నీ వేషాలు నాదగ్గర వేయకు..నువ్వేం చేస్తావో..నీ పెళ్లానికేం చెప్పుకుంటావో నీ యిష్టం..ముందు నీ పెళ్లానికి విడాకులివ్వు. నా పెళ్లాం గొడ్రాలని..కోర్టులో చెప్పుకుంటే విడాకులిస్తారని మామయ్య చెప్పాడు.కోర్ట యవ్వారమంతా వాడు చూసుకుంటా నన్నాడు.”

“ అమ్మా! గట్టిగా అరవకు.నీరజ వచ్చే టైమయ్యింది.యివ్వాళ పేపరు చదివావా? పిల్లలు పుట్టలేదని అత్తింటి వేధింపులతో గృహిణి బలవంతంగా ప్రాణాలు తీసుకుంది.ఈ సంఘటన నిన్ననే చిక్కడపల్లి లో జరిగింది.అత్తగారి వేధింపులతో బాటు ఆడబిడ్డల సూటి పోటి మాటలకు తట్టకో లేక ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది స్రవంతి అనే అమ్మాయి.

స్రనంతి నాన్నగారి ఫిర్యాదుతో రాజశేఖరనే ఆమె భర్తతో బాటు అతని అమ్మానాన్నల్ని ..అక్కా చెల్లెళ్లని పోలీసులు అరెష్ట్ చేశారట.”
“ఆ ..నీపెళ్లాం మరీ అంత సున్నితం కాదులే..ముందు నీ సొల్లువాగుడాపి..ఓ మంచి లాయర్ని చూడు.”

తల్లి కి ఏంచెప్పినా తలకెక్కదనే ఆలోచనతో కామై పోయాడు రవీంద్ర.జరిగి పోయిన ఆనాటి ఘటనంతా తన కళ్లముందు కనిపిస్తుంటే పోలీసులకు ఇదేమైనా రిపోర్టు యిచ్చి వుంటుందా అనుకుంటూ..ముఖం తుడుచుకుంటూ హాల్లో కొచ్చింది జానకమ్మ. “అమ్మగారూ ! మీ బెడ్డురూం తుడిచేస్తే నాపనై పోతుంది.అన్నట్టు మీకు యిందాక చెప్పలేదమ్మ ..

ఆ పోలీసమ్మ రెండు మూడు రోజుల్లో మళ్లీ వస్తానన్నరమ్మా ..ఈ సారి ఆ అత్తెవరో తెలిస్తే అంకుశం సినిమాలో హీరో విలన్ని కొట్టినట్టు నడి రోడ్డుమీద కొట్టుకుంటూ తీసుకెల్తే ..నా సామిరంగా.. అది చూసి ఇసుమంటి దగుల్బాజీ అత్తలంతా బట్టలు తడిపేసుకుంటారమ్మా.. అమ్మ గారూ అలా జరుగుద్దంటారా..?” వాగుతున్న పని మనిషి ముఖం చూడలేక ..ఏదో పనున్నట్లు కిచెన్ లోకి పారిపోయింది జానకమ్మ. పనైపోయిన కమల

“అమ్మగారూ..! నేను వెల్తా ..నాపనై పోయింది. అయినా అమ్మగారూ మన యపార్టుమెంటులో వున్నోల్లంతా యింజినీర్లూ ..డాక్టర్లూ ..కదమ్మా. కోడల్లని కట్నాలతో ఏదించి సంపాదించిన పాపిస్టి డబ్బుతో ఏం సేత్తారమ్మా..కట్టెలతో తగలబట్టే తమ శవాల్ని కట్టలతో కాల్చుకుంటారంటారా..అయినా యియ్యన్నీ నాకెందుగ్గానీ వస్తానమ్మా..”

కమల వెళ్లపోగానే ..తలుపులు బిగించుకుని మంచంమీద కూలి పోయంది..జానకమ్మ.చెవుల్లో కమల మాటలు ప్రతిధ్వనిస్తుంటే ..కళ్లముందు ఏవేవో దృశ్యాలు బొంగరాల్లా తిరిగి పోతుంటే ..నిస్సత్తువుగా వచ్చి వణికే చేతులతో రవీందర్ ఫోనుకు డైల్ చేసింది.. జానకమ్మ.

***

తన సెల్ ఫోను డిస్ ప్లేలో కనిపించిన షీ టీం హెడ్..తన క్లోజ్ ఫ్రెండ్ రాజు నెంబర్ చూస్తూనే చెప్పరానంత ఆనందంతో హాయ్ రాజా
అన్నాడు..రవీంద్ర.

ఏరా సాఫ్ట్ వేరూ..! మొన్న మా ఝాన్సీ దెబ్బకు నీ మదర్ తల్లి పాకిస్తానా..పీకిస్తానా..?

“ఆ సంగతి నేనే ఫోన్ చేద్దామనుకున్నాను..మీ వీరనారి ఝాన్సీ ..తెలివికి నా హేట్స్ ఆఫ్ రా.ఎవరితో మాట్లాడకుండా..ఫ్లాట్ అంబాసిడర్ల వంటి పని మనుషులతో మా అమ్మలవంటి శూర్పణకలకు వార్నింగులు..పంపించిన ఝాన్సీ ప్లానుకు నా జోహార్.సందేశమేంటో నాకు తెలీదు గానీ రిజల్ట్ మాత్రం..నా తల్లి పరార్. మా అమ్మ ఆ రోజు మధ్యాహ్నమే పోన్ చేసి మీ మామయ్యకు సీరియస్ అంటున్నారు..రాత్రి బస్ కు బుక్ చెయ్యమని చాలా సీరియస్ గా ..ఆందోళనగా చెప్పింది.

అమ్మా ! ఇప్పటి కిప్పుడు ప్రయాణ మేంటమ్మా?

రేపు ట్రై చేద్దామంటున్నా వినకుండా రిజర్వేషన్ లేకపోయినా ..వెళ్లిపోతానని మంకు పట్టు పట్టింది.మొన్న నీకు ఫోన్ ఎందుకు చేశానో అదే నెరవేరుతుంటే ఆనందం పట్టలేక కావలసినంత విచారాన్ని నటించి ఆ రాత్రే బస్సెక్కించి..బరువు దింపుకున్నాన్రా.ప్రేమలు పంచే వాళ్లు తల్లులు గానీ..పిల్లలతో వ్యాపారం చేసే వాళ్లు తల్లులెలా అవుతారు చెప్పు.?సరే.. సరే.. మరీ ఎమోషనల్ గాకు.. ఆరోజు నువ్వు నీ సమస్య చెప్పగానే మా “షీటీం మెంబర్స్ తో “ మీటింగ్ పెట్టి నీ సమస్య చెప్పాను,.ఝాన్సీయే పరిష్కారం చెప్పి రేగింగ్ ..ఈవ్ టీజింగ్ ..లతో బాటు డౌరీ హెరాస్ మెంటును కూడా మన షీ టీంలో యాడ్ చేస్తే బాగుంటుందని సలహా యిచ్చింది.డిపార్టు మెంటు ఓకే అనగానే ఫస్ట్ ట్రయల్ నీతోనే స్టార్ట్ చేశాం.నువ్వు చెప్తుంటే అర్ధమై పోయంది.మా ప్లాన్ సూపర్ హిట్టని. ఇది మరో టైపు ..సర్జికల్ స్ట్రైకని..అన్ని అపార్ట్ మెంటులతో బాటు రాష్ట్రం మొత్తం ఇంప్లిమెంట్ చేస్తాం ..నీకే మా డిపార్ట్ మెంటు తరఫున కృతజ్ఞతల్రా రవీ.!

***

సాయంతం ఆఫీస్ నుంచి వస్తూనే తన భార్యను గిల్టీగా చూస్తూ డాక్టర్ రిపోర్టును ఆమె చేతిలో పెట్టి తన రెండు చెవులూ పట్టుకుని ఐయాం సారీరా నీరూ ! నీకు సంతాన భాగ్యాన్ని కలిగించలేని నా అసమర్దతను క్షమిస్తావు కదూ? అంటున్నభర్తను ప్రేమతో చుట్టేసి..

“నీ ఫ్రాంక్ నెస్ తో ఫ్లాటైపోయాను .. యువార్ వెరీ గ్రేట్ రా ఇంద్రా! ఐయామ్ నాటోన్లీ యువర్ వైఫ్ ..యువర్ లైఫ్ ఆల్సో..జన్మ జన్మలకీ నువ్వే నా భర్తవి కావాలి” .

నీరజ ఆనంద భాష్పాలతో తడిసి ముద్దయిన రవీంద్ర అర్దాంగి చేయి పట్టుకుని అనాధ శరణాలయం మెట్లు అధిరోహించాడు..తాము పెంచుకోబోయే కూతురి కోసం*

మరిన్ని కథలు

Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న
ఓ breaking news
ఓ బ్రేకింగ్ న్యూస్
- బివిడి ప్రసాద రావు
chettu baadha
చెట్టు బాధ
- లక్ష్మీ కుమారి.సి