కమాను వీధి కథలు - రామదుర్గం మధుసూధన్ రావు



"నాకవన్నీ బేకులేదు...రేపు ఇచ్చేయాలంతే...!' నగేష్ గాడు అలా అనేసరికి ,నాకు ఒక్కసారిగా తల తిరిగినట్టయింది. నోట మాటరాలేదు. గుండెకాయ నోట్లోకి వచ్చినట్టయింది. ఇంకేముంది...కళ్లల్లో నీళ్లు సురూ... అయితే ఏడ్చేకి లేదుకదా! అసలే విషయం ఎడ్వట్టు అయింది. ఇంక వీడి ముందు ఏడిస్తే ఇంకేమైనా ఉందా! మర్యాద మూడు కాసులకే పోతుంది కదా! ఆ...అయినా ఇప్పుడు మాత్రం మర్యాద ఉండి చచ్చిందేముంది? అసలు ఈ పోగొట్టుకోవడం అనే జబ్బు నాకెలా వచ్చిందో ఏమో? పెన్నా...పుస్తకమా...మరొకటా కాదు. ఏదైనా సరే చాలా సులువుగా నా దగ్గరనుంచి మాయమైపోతాయి. పోనీ పెన్నో...పెన్సిలో... నోటుబుక్కో అయితే చచ్చీ చెడీ ఎక్కడయినా అడుక్కొనైనా తెచ్చి ఇవ్వొచ్చు. కానీ అలా కాదే! నాటకం పేపర్లు. నా ఖర్మ కాకపోతే...ఏదీ నాకాడ ఉండదని తెలిసీ ఎందుకు తీసుకోవాలా? పోనీ తీసుకున్నానే అనుకో... రొవంతయినా జవాబ్దారీ లేకపోతే ఎలా? ఆ రోజంతా ఇట్టాగే తిట్టుకున్నా. ఎంత తిట్టుకున్నా ఏముంది? వాడేమో వచ్చి వార్నింగు ఇచ్చిపోయా! ఇక్కడ నాటకం కాగితాలు కనిపించకుండా పోయా!! సామీ రణ్మండల ఆంజనేయా...మంగరాయా...ఎంత పజీతి తెచ్చినావురా నాయనా...అవి ఎక్కడ ఉండి చచ్చాయో కాస్త చెప్పు తండ్రీ...అంటూ మనసులోనే మొక్కుకుంటూ పడుకున్నాను. జమకానాపై పడుకున్నానన్న మాటే కానీ కళ్లు మూత పడట్లేదు. ఆ దిక్కుమాలిన నాటకం కాయితాలే నా ముందు తైతక్కలాడుతున్నాయి.

నగేష్ నేను వరసకు అన్నదమ్ములం. దొడ్డప్ప హిందూపురం మునిసిపాలిటీలో ఇంజనీరు. ఇక్కడికి బదిలీ అయ్యారు. నెహ్రూమెమోరియల్ మునిసిపల్ హై స్కూలులో నేను నగేష్ ఆరో తరగతి చేరాము. అప్పుడే వాడు నాకు బాగా ఫ్రెండు అయింది. ఎంకణ్ణబావి గేరిలో ఉండేవారు. రెండిళ్ల మధ్య రాకపోకలు బాగానే ఉండేవి. వీడే కాకుండా వేణు,ఆచారి, భాస్కర్ రెడ్డి ఇలా ఓ పదిమంది పిలగాళ్లం జిగ్రీదోస్త్ ల లెక్క జట్టుకట్టి ఆడుకునేవాళ్లం. మా అందరిలో నగేష్ గాడు స్పెషల్. వాడి మాటతీరు...క్లాసులో సార్లు లేపి ఏదైనా అడిగితే "ష్...సర్ అదీ' అంటూ తలగోక్కునే తీరు బాగా నవ్వు తెప్పించేవి. నగేష్ మా గుంపులో అందరికన్నా ప్రత్యేకం గా ఉండేవాడు. అందుకు కావలసిన అన్ని లక్షణాలు వాడిలో ఉన్నాయి. బాగా పాటలు పాడేవాడు. మిమిక్రీలా వాడు గొంతు మార్చి పాడుతుంటే అందరం సరదాగా వినేవాళ్లం. ఏడో క్లాసులో వాడి టాలెంటు క్లాసే కాకుండా స్కూలంతా పాకింది. మా క్లాసు టీచరు కాంతారావు సారు ఓసారి వీణ్ని పిలిచి "ఏరా...పాడతావటగా...ఏదీ పాడు' అన్నాడో లేదో మనోడు రెచ్చిపోయాడు. ఊరుమ్మడి బతుకులు సినిమాలో "పోవుచున్నావా ...'పాట అందుకున్నాడు. సారు పాడరా అంటే వీడు యాక్షన్ కూడా చేసేశాడు. "చెప్పిన వినవు చెముడా...గిముడా...'అంటూ యముడిలా...వెంటనే "పోవుచున్నావా...ఔరా యమధర్మరాజా' అంటూ గొంతు సన్నగా చేసి సతీ సావిత్రిలా పాడుతుంటే అందరూ డంగైపోయాం. నేను,వేణు, ఆచారి అందరం వీడేందిరా నాయనా...ఇట్లా పాట,యాక్టింగు చేసేస్తున్నాడు...ఇంక మా పని ఖలాసే.. అనుకుంటూ కళ్లింత చేసుకుని చూస్తుండి పోయామంతే! అప్పట్నుంచి ఇంక చూస్కో కనిపించిన ప్రతి సారూ...రేయ్ పాడూ అనడమూ...వీడేదో టేపురికార్డరు బటన్ నొక్కినట్టు పాట అందుకోవడం అప్పట్లో ఓ పెద్ద డ్రామాలా నడిచిందిలే! పాడిన ప్రతిసారీ సార్లు ఏం పాడావురా అని మెచ్చుకుంటుంటే...మాకు మాత్రం అదో వింతలా కనిపించేది. అప్పట్నుంచే నగేష్ స్పెషల్ గా ఉండేందుకు ప్రయత్నించేవాడు.

ఓ రోజు నగేష్ "మనం డ్రామా వేస్తున్నాం...' అంటు మొదలెట్టాడు. మాకదేదో తెలిస్తేగా. డ్రామానా అదెట్లా? అంటూ అమాయకంగా నోరెళ్లబెట్టాం. డ్రామా అంటే యాక్షన్ అన్నమాట. సినిమాలో చేస్తారు కదా అలా...అన్నాడు. "ఓర్నీ ఆ మాత్రం తెలిసిలేదా...'అన్నట్టు వినిపించింది మాకు. సినిమాలోలాగా...అలా చేస్తే చూసేదెవరు? రెండో కొశ్చెను అడగాలని ఉన్నా...నోట్లోనే మింగేసుకోవలసి వచ్చింది. ఇలాంటి డౌట్లు అడిగితే కచ్చితంగా మమ్మల్ని బేవకూఫ్ లా లెక్క గడతాడని భయం లోపల్నుంచి తన్నుకొచ్చింది. ఎందుకంటే... అసలే వాడు కిలాడీ! క్లాసులో సార్లనే అదీ..ఇదీ అని అడిగేవాడు. అప్పుడే మాకు వీడు ఖతర్నాకురోయ్ అనిపించింది. ఇప్పడేమో డ్రామా అంటుండాడు. ఈ సామి ఇంకేమేమి కతలు పోతాడో ఏందో? మనమా కమానులో పిలగాళ్లతో కలిసి ఆడుకోవడం తప్పించి...ఇలా ఎగస్ట్రాలు ఏసింది లేదు. అయినా ఆ పాటి దానికే గేరిలో అందరి నుంచి కంప్లైంట్లు. వాడట్లా...వీడిట్లా...ఎప్పడూ ఆటల్లోనే చస్తుంటారు...అని. ఇవే ఎక్కువైతే ఇంకా ఆ డ్రామాలేందో మాకెట్లా తెలిసేది? కానీ తెలీదని మొహంపెడితే ఇంకేమైనా ఉందా?మా జుట్టు తీసి వాడి చేతిలో పెట్టినట్టే కదా! పోనీ పెద్దోడా అంటే అదీ కాదు. నిక్కరేసుకున్నోడు...నిక్కరేసుకున్నోడి వద్దే చేతులెత్తేయడం కన్నా నరకం ఏముంటుంది? అందుకే నోరు మూసేసుకుని అమాయకంగా..."యాక్షన్ యాడ సేయాలి...' అని అడిగినం. అప్పడు వాడు నింపాదిగా... సీఐడీ అని డ్రామా రాసిండాను. దాన్ని మనం చేయాల. నేనే ఎలా చేయాలో మీకు నేర్పిస్తాను. అంటే డైరెట్రన్నమాట..' తన పొజిషను తనే ప్రకటించేసుకున్నాడు. అయినా ఆ క్షణంలో మాకు ఏమాత్రం బాధ అనిపించలేదు. ఇదేదో బాగున్నట్టుందే...పోనీలే ఈ డ్రమా బాగా వేస్తే...నలుగురిలో నగేషులా మాకూ బోల్డంత పేరు వస్తుందని వెంటనే యస్ అని గట్టిగా అరిచినాం.

మరుసటి రోజు వాడు నాల్టు పెద్ద కాగితాలు పట్టుకొచ్చాడు. మమ్మల్ని కూర్చోబెట్టి డ్రామాను చదివినాడు.భలే మజాగా ఉండింది. వాడు గొంతు మార్చి మార్చి డైలాగు చెబుతుంటే...అబ్బా ఏం రాసినాడురా

ఎట్టా డైలాగు కొడుతున్నాడురా అనుకున్నాం. అంతా అయినాంక ఎవరెవరు ఏ పాత్ర చేయాలో వాడే డిసైడు చేశాడు. కాదనేదెవరు? అందరికీ డ్రామా కొత్త. పైగా వాడు నాలుగు పేజీలు రాసినాడంటే ఎంత గొప్ప! మాకందరికీ వాడో పెద్ద హీరోలా కనిపించాడు. "ఈ పేపర్లలో ఎవరి పోర్షన్లు వాళ్లు రాసుకుని ఇవ్వండి...ఆ తర్వాత ప్రాక్టీసు ఉంటుంది. అందరికీ బాగా వచ్చినాంక డ్రామా వేద్దాం...' అంటూ పేపర్లు మాకు అప్పగించాడు. మొదట కొందరు రాసుకున్నాంక నా వంతు వచ్చంది. అప్పుడే నా నెత్తిపై శని కూర్చొని ఉన్నాడు. ఆ కాగితాలు ఏ రాహుకాలంలో తీసుకున్నానో కానీ రెండో రోజే మాయమైనాయి. ఎక్కడ పెట్టినానో...స్కూలు బ్యాగు నుంచి పడిపోయిందో...గుర్తులేదు. ఇంక అప్పట్నుంచి నాకు కష్టకాలం మొదలైంది.వారం...పదిరోజులు గడిచాయి. నగేష్...రేయ్ అందరూ రాసుకుండారు కదా...ఇంక కూర్చొందాం అన్నాడు.నాకు ప్రాణం పోయినం త పనైంది. ఏం చేద్దాం రా దేవుడా అనుకుంటూ...."నోట్సులు రాస్కోవాలి...నేను రాను' అన్నా. వాడు వదిలితేగా. "పోనీ ఆదివారం కూర్చొందాం' అన్నాడు. హమ్మయ్యా ఇప్పటికైతే గండం గడిచింది..అనుకున్నా. కానీ అదెంత సేపూ.ఆదివారం రానే వచ్చింది. వాడు కలుసుకునేందుకు ఆర్డరేశాడు. అప్పుడు నాటకం పేపర్లు కనిపించడం లేదని చావు కబురు చల్లగా చెప్పాను. పాపం వాడి మొహం ఒక్కసారిగా వాడి పోయింది. అందరూ ఆ...అన్నారు. కొన్ని క్షణాల తర్వాత "ఎక్కడ పోతుందిరా...వెదుకు ఇంట్లోనే ఉంటుంది. అయినా ఇదేందిరా అన్నీ పోగొట్టుకోవడమేనా? అని నగేష్ అంటుంటే వెర్రిగా నవ్వడం తప్ప ఏం చేయగలను?

ఈ సీఐడీ కతేందోగానీ నగేష్ గాడు నాకు నక్షత్రకుడైపోయాడు. ఎక్కడ కనిపిస్తే అక్కడ"ఎక్కడ్రా నా సీఐడీ' అని అడగడం మొదలెట్టాడు. ఏం చేయన్నా నాయనా...అంటూ తెగ బాధపడిపోయాను. రోజు రోజుకీ బెంగ పెరిగిపోతోంది. పోనీ ఎవరికైనా చెబుదామా అంటే దానివల్ల నయాపైసా ఉపయోగం లేదు. పైగా విన్నోళ్లు ప్రపంచంలో ఎక్కడా లేని నీతుల చిట్టా విప్పుతారు. దానికన్నా నోర్మూసుకుని ఉండటమే మంచిది.కానీ ఎలా?? మంగరాయా ఆంజనేయసామికి మనసులోనే మొక్కుకున్నా...ఈ గండం గట్టెక్కించు స్వామీ ఇంకేం అడగను అని. ఆ సీఐడీ డ్రామా ఏదో తంటాలు పడి రాద్దామా అంటే...అస్సలు కుదరదు. మనకు క్లాసు నోట్సు రాసుకోవడమే చేతకాదు. ఇంక ఈ నాటకం రాయడమా...అసలు అనుకోడానిక్కూడా వీల్లేని పని. నా దిగాలు మొహం చూడగానే అమ్మకు వీడేదో కిరికిరి చేసుకున్నాడని అర్థమైంది.

ఏందిరా అట్టాగున్నావ్? అని అడగ్గానే దుఃఖం తన్నుకొచ్చేసింది. గట్గిగా ఏడ్చేసినా. అమ్మ కంగారు పడిపోయింది. ఏమైందిరా ఎందుకేడుస్తున్నావంటే ...నగేషుగాడి పేపర్లు పోగొట్టినా...వెక్కిళ్లమధ్య చెప్పాను. పాపం అమ్మకు డ్రామా అంటే ఏంటో...దాని కష్టమేంటో ఏం తెలుసు? అందుకే తాపీగా "పేపర్లేగా పోతే పోయాయిలే...కొత్తవి ఇద్దాం' అంటుంటే నాకు అంత ఏడ్పులోనూ కోపం నెత్తికెక్కింది. "ఎట్లా ఇస్తావే...అవేం తెల్లపేపర్లు కాదు. డ్రామా...డ్రామా...' అంటూ ఇంకా గట్టిగా ఏడ్చా. "...మరి ఎక్కడ పెట్టి చచ్చావు? ఇట్లా ప్రతీదీ పోగొట్టేది...చేతకాక ఏడ్చేది...బాగయ్య నీకత!...సరే ఇప్పడు నేనేం చేయాలి?' అంది ఓదారుస్తూ."నాకేం తెలుసే...' ఏడ్పు మరింత పెరిగింది. అమ్మకు కోపం వచ్చింది. "ముందు నోర్మూసుకుంటావా లేదా? చేసింది చేసి ఏడుస్తున్నాడు చూడు...ఆ నగేషుకు చెబుతాలే' అంది. "వాడికేం చెప్పొద్దు...ఒప్పుకోడు...నాకు డ్రామా పేపర్లే కావాలి...'అంటుంటే అమ్మ చేసేది లేక "ఏదో ఒకటి చేస్తాగానీ ముందా వెధవ ఏడ్పు ఆపు...నీతో చస్తున్నా' అంటూ కసురుకుంది. అమ్మకు చెప్పాక మనసులో బరువు కాస్త తగ్గినట్టనిపించింది. పోనీలే అమ్మ ఏదో ఒకటి చేస్తుంది. కనీసం..వాడికి నచ్చచెబుతుంది. అమ్మకు వాడు ఎలాగూ ఎదురు తిరగలేడు. కాబట్టి ఈ దరిద్రం నుంచి బైట పడొచ్చు...అని మనసులోనే లెక్కలు వేసుకుని కళ్లు తుడుచుకుంటూ నిమ్మళంగా లేచా.

ఇంక నా పని సులువైంది. నన్ను నగేష్ గాడు అడిగినప్పుడల్లా...అమ్మను సతాయించడం మొదలెట్టా. ఏదో నేను ఏడుస్తుంటే...తట్టుకోలేక చూద్దాం అంది తప్ప...ఈ సమస్య ఎలా తీర్చాలో ఆమెకు మాత్రం ఏం తెలుసు? కానీ నా బుర్ర అంత దూరం ఆలోచిస్తేగా! అమ్మకు చెప్పినా...ఇంక ఫికరు లేదు. తను చూసుకుంటుందని గట్టి నమ్మకం. ఇలా తరచూ వెంటపడుతుంటే...అమ్మ కూడా ఆలోచించినట్టుంది. ఓ రోజు నాన్న వద్ద ట్యూషనుక వస్తన్న టెన్త్ పిలగాడు చంద్రశేఖర్ను "ఏమప్పా...చంద్రశేఖరా...వీడికేదో రాసిపెట్టాలంట కాస్త చూడు...' అంది. ఎప్పుడూ ఏమీ అడగని అమ్మ అలా ఒక్కసారిగా అడిగేసరికి చంద్రశేఖర్ ఉబ్బితబ్బిబ్బయ్యాడు. "అలాగే అక్క...తప్పకుండా' అన్నాడు. ఈ సీఐడీ కతలో ఇప్పుడు మూడోవాడు ఎంటరయ్యాడు.ఇంకేముంది...అమ్మను వదలి చంద్రశేఖర్ ను పట్టుకున్నా. చంద్రశేఖర్ తోపాటే నగేష్ అన్న మురళి కూడా ట్యూషన్ కు వచ్చేవాడు. చంద్రన్న ఎక్కడ మురళి అన్నకు చెబుతాడో అని మనసులో ఓ మూల పీకుతుండేది. అయితే నా అదృష్టం బాగుండి ఆ ప్రమాదం జరగలేదు. ఎలాగూ చంద్రన్న రాస్తానన్నాడు కాబట్టి...నగష్ త "ఇస్తాలే...నీ బోడి సీఐడీ..'అనేశా. బహుశా వాడిక్కూడా ఆశ్చర్యం వేసి ఉంటుంది. ఎలా ఇస్తాడు? అని వాడు బుర్ర బద్దలు కొట్టుకునే ఉంటాడు. ఎందుకంటే నా తెలివితేటలు రోజూ క్లాసులో చూస్తున్నాడు కాబట్టి...వాడికి నా గురించి అన్నీ తెలుసు. "సరే చూద్దాం...ఎలా ఇస్తావో' అన్నాడు నవ్వుతూ. వాడలా నవ్వుతుంటే నాకు వంటిపై కారం పూసినంత మంటైంది. కానీ నాకెందుకో చంద్రన్నపై గొప్ప నమ్మకం కుదిరింది. నిండుగా...బొద్దుగా...ఎప్పడూ నుదుట విబూది రాసుకుని బుద్ధిగా ట్యూషన్ కు వస్తుండేవాడు. అన్నకూ ఎలాగైనా నాకోసం డ్రమా రాయాలని పట్టుదల పెరిగినట్టుంది. అందుకే ఓ రోజు ట్యూషను కాగానే...రేపు ఆదివారం ఇంటికి వచ్చేయ్...రాసిస్తా' అన్నాడు. నా చెవిలో అమృతం పోసినట్టయింది. హమ్మయ్యా...రేపటితో నా కష్టాలు ముగిసినట్టే. ఇంక బుద్ధంటూ ఉంటే...ఎవరితో ఏమీ తీసుకోరాదు. ఇదేం దుస్థితిరా దేవుడా! అనుకుంటూ చాలా రోజులు తర్వాత నిశ్చింతగా పడుకున్నా.

మరుసటి రోజు సరిగ్గా పది కాగానే...అమ్మకు చెప్పి చంద్రశేఖర్ ఇంటికి పరిగెత్తా. చిన్నమార్కెట్టు...మార్కండేయ గుడికాడ వాళ్లిల్లు. నేను వెళ్లగానే గేటుతెరచి మేడపై పిలుచుకెళ్లాడు. అప్పటికే అట్టకు తెల్లకాగితాలు పెట్టి రెడీ ఉంచుకున్నాడు. "టిపిను చేస్తావా' అప్యాయంగా అడిగాడు. నాకు ఆ ధ్యాస ఉంటేగా...ఎలాగైనా సరే డ్రామా రాయించుకోవాలని గట్టి పట్టుదల. "వద్దన్నా...ఏం బేకులేదు. తినే వచ్చా' అన్నాను. "సరే నువ్వేం గాబరా పడొద్దు. ఈరోజు ఎంత కష్టమైనా సరే డ్రామా రాసిస్తా. సరేనా' అంటుంటే నాకు ఎక్కడ్లేని ఆనందం. డ్రామాలో ఏముందో చెప్పు అంటూ అడిగాడు. నేను ఓపిగ్గా చదివిందంతా గుర్తు తెచ్చుకుంటూ...చెప్పాను. అట్లా గుర్తు తెచ్చుకుంటున్నప్పుడు నేను పడ్డ కష్టం అంతా ఇంతా కాదు. అదీ కాకండా నగేషు చదివినప్పుడు విన్నది కూడా ఆ క్షణంలో గుర్తొచ్చింది. నా మాటలు వింటూ...తను ఆలోచిస్తూ...రాయడం ప్రారంభించాడు. ఓ మూడు గంటలపాటు కుస్తీ జరిగింది.రాసి...కొట్టేసి...కాయితం చింపేసి...మళ్లీ కొత్తగా రాసి...పాపం నానా కష్టాలు పడి ఓ మూడు పేజీలు రాసిచ్చాడు. ఆ క్షణంలో చంద్రన్న నాకు దేముడే! సాక్షాత్తు ఆ మంగరాయే ఇలా వచ్చి రాసినాడు అనుకున్నా. చంద్రశేఖర్ అక్షరాలు ముత్యాల్లా గుండ్రంగా ఉండేవి. తెల్లటి కాయితంపై ఆ అక్షరాలు...సీఐడీ డ్రామా పేరు చూడగానే నాకు ఏనుగు ఎక్కినంత ఆనందం వేసింది. "రేయ్...నగేషా...సామీ నీకో దండం...నీ సీఐడీకో దండం...చంపినారు కదరా ఇద్దరూ..' అంటూ గట్టిగా అరవాలనిపించింది. ఆ పేపర్లు ఇస్తూ చంద్రన్న "రేయ్...ఇవన్నా జాగ్రత్తగా పెట్టుకోరా. మళ్లీ పోగొట్టేవు' అంటుంటే నా తల కొట్టేసినట్టయింది. ఏం చేద్దాం? ఎవరూ చేయలేని సాయం చేసినాడు అన్న. ఆ మాత్రం అన్నా తప్పేముందిలే అనుకుని మనసుకు నచ్చచెప్పుకున్నా. చేతిలో డ్రామా పేపరు పడగానే ఇంటికి పరుగో రుగు!!

నగేషు ఆ సీఐడీ డ్రామా రాసిందే నాకివ్వడానికీ...నేను పొగొట్టుకుని బోరుబోరున ఏడ్వడానికే అనుకునే వాణ్ని. అయితే నగేషులో ఓ కళాకారుడున్నాడని అందరికీ తెలిసిందీ ఆ రోజుల్లోనే. బహుశా వాడు రాసిందిఈ నాటకం ఒక్కటేనేమో! ఆ తర్వాత బొమ్మలు వేయడం మొదలెట్టాడు. అలా ఇలా కాదు. ఇప్పటికీ నాకు గుర్తు. టెన్త్ క్లాసులో వాడు ఆదివారాలు పేపరుపై దానవీరశూరకర్ణ సినిమాలో ఎన్టీఆర్ దుర్యోధనుడి బొమ్మ అచ్చు అలానే దింపేవాడు. వాడు అలా వేసింది చూసి...నేనూ పేపరు పెన్సిల్ పట్టుకుని కుస్తీపడ్డాను. రకరకాల బొమ్మలు వేసేవాడు. అంతేకాదు పాటలూ పాడేవాడు. క్రికెట్టూ ఆడేవాడు. ఒక్క పాట తప్పించి...వాడు చేసిన ప్రతి పనినీ నేనూ చేశాను. మా ఈడు పిల్లలపై నగేషు ప్రభావం అంతా ఇంతా కాదు. సరే వాడిలా బొమ్మలు వేశామా లేదా అన్నది వేరే చర్చ.టెన్త్, ఇంటర్ దాకా కలిసే చదువుకున్నాం. ఆ తర్వాత దొడ్డప్పకు తిరుపతి బదిలీ కావడంతో వాడు అక్కడ పాలిటెక్నిక్ చేశాడు. అక్కడే వాడి జీవితంలో గొప్ప మార్పులూ వచ్చాయి. కష్టాలు వచ్చి పడ్డాయి. అబ్బో వాడా...అని పెద్దోళ్లు...అబ్బా వాడిలా ఉండాలని మాలాంటి వాళ్లం ఏకకాలంలో అనుకోగలిగినంతగా వార్తల్లో నిలిచాడు. మా అందరికంటే ముందుగానే బెంగళూరులో ఉద్యోగానికెక్కాడు. ఆ తర్వాత బ్యాంకు ఉద్యోగం అందుకున్నాడు. ఊర్లో అందరి నోట్లో నానేలా భయంకరంగా ట్యూషన్లు చెబుతూ...ట్యూషన్ అంకుల్ పేరూ సంపాదించాడు. మా అందరి కన్నా జీవితంలో ఎక్కువ కష్టాలు ఎదుర్కొన్నాడు. అయితే ఏనాడు బెదిరిపోలేదు. జీవిత పాఠాలే కాదు...పాటలూ నేర్చుకున్నాడు. స్కూలు లో బెదురులేకుండా ఎలా పాడేవాడో...బంధువుల పెళ్లిళ్లూ...కార్యక్రమాలప్పుడ అదే చొరవతో గళం విప్పేవాడు. ఇప్పుడూ అంతే...ఓ వైపు జీవితంతో పోరాడుతూనే...తీరిక చేసుకునైనా పాడటం...బొమ్మలు వేయడం లాంటి పనులకు టైము కేటాయిస్తున్నాడు. ఇంకో మాటలో చెప్పాలంటే...మనసులో చొరబడే ఒంటరితనాన్ని...శూన్యాన్ని...పాటలతో దూరం చేసుకునే పనిలో పడ్డాడు. వీడి వాలకం ప్రకారం...పాటల నగేషు...లేదా బొమ్మల నగేషు అని పేరు తెచ్చుకోవడం పోయి గడ్డం నగేషులా గుర్తింపు తెచ్చుకున్నాడు. వాడు బెంగళూరులో ఉండింది మొదలు గడ్డం పెంచుకోవడం సురూ చేశాడు. ఎప్పుడు వాడి గురించి చెప్పాలన్నా...బంధువుల్లో చిన్నా పెద్దా అందరూ "అదే...ఆ గడ్డం నగేషు లేడూ' అన్నంతగా గడ్డానికి పేరొచ్చింది. చిత్రమేమంటే నాలుగేళ్ల కిందట ఉన్నట్టుండి గడ్డం తీసేశాడు. అందరూ ఆశ్చర్యపోయారు. కానీ ఇప్పుడూ వాడు గడ్డం నగేషే!! ఎవరు ఎలా గుర్తుంచుకున్నా...నేను వాణ్ని జీవితాంతం గుర్తుపెట్టుకునేలా చేసింది మటుకు సీఐడీ డ్రామాయే!!

మరిన్ని కథలు

Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న
ఓ breaking news
ఓ బ్రేకింగ్ న్యూస్
- బివిడి ప్రసాద రావు
chettu baadha
చెట్టు బాధ
- లక్ష్మీ కుమారి.సి