తరిమేద్దాం - రాజచంద్ర వుయ్యూరు

tarimeddam

ఈసారి దీపావళి పండుగ ఎలా జరుపుకుంటున్నారు ? " 9 వ తరగతి సైన్సు మాస్టార్ సుబ్బారావు గారు క్లాస్ నుద్దేశించి అడిగారు. "క్రిందటి సంవత్సరం దసరా దీపావళి పండుగలకు మా మామయ్య చైనా లో తయారైన బోలెడన్ని ఆట బొమ్మలు పంపించాడు సార్. వాటితో స్నేహితులతో కలిసి చక్కగా పండుగ శలవులలో ఆడుకున్నాము . ఈ ఏడు కూడా చైనా నుండి వచ్చిన కొత్త కొత్త బొమ్మలు, టపాకాయలు పంపమని మా మామయ్యని అడిగాను" చెప్పాడు మురళి.

"మా డాడీ క్రిందటి దీపావళికి చైనా టపాకాయలు తెచ్చారు సార్. వాటి ధర కూడా తక్కువ అట. కొత్త కొత్త రకాల వింత వింత టపాకాయలు కాలుస్తుంటే ఎంత సంతోషం వేసిందో!!" క్రితం సంవత్సరం తమ ఇంట్లో జరుపుకున్న దీపావళి పండుగను గుర్తు చేసుకుంటూ చెప్పాడు హరి.

"మా బావ గారు, అక్క చైనా లో తయారైన రంగు రంగుల దీపాల తోరణాలు, బ్యాటరీ తో పనిచేసే ప్రమిదలు, రంగు రంగుల లైట్లు తెచ్చారు సార్ . వాటిని మా ఇంటి ముందు వెలిగించితే అంతా వింతగా చూసారు. నాకు కొంచెం గర్వంగా కూడా అనిపించింది" చెప్పింది రాధ.

"ఇవే కాదు సార్. నాకు చిన్న చిన్న ప్రయోగాలు చేయటం, స్వంతంగా ఏవైనా వస్తువులు తయారు చెయ్యటం అంటే ఎంతో ఇష్టం. మా అన్నయ్య నాకోసం చైనా లో తయారైన టూల్ కిట్స్ పంపాడండీ. క్రిందటి సైన్సు ఫెయిర్ లో నేను పెట్టిన ఐటమ్స్ ఆ టూల్ కిట్స్ వాడి తయారు చేసినవే" గర్వంగా చెప్పాడు శ్రీధర్.

" మా బాబాయ్ చైనా లో తయారైన జీన్ పాంట్స్, టీ షర్టులు, చేతి గడియారం, పెన్నులు, ఇంకా సెల్ ఫోన్ క్రిందటి దీపావళి కి పంపాడండీ. అవే మన దగ్గర కొంటే డబల్ ఖర్చు అవుతుందంట" చెప్పాడు శ్రీనివాస్.

"అయితే మీకు చైనా వస్తువులు బాగా నచ్చాయన్నమాట." అడిగారు సుబ్బారావు గారు. "సరే. క్రిందటి దీపావళి కి మీకు గిఫ్ట్ గా వచ్చిన మీ దగ్గర ఉన్న చైనా వస్తువులలో ఎన్ని ఇంకా పని చేస్తున్నాయో చెప్పండి " క్లాసు ను ఉద్దేశించి అడిగారు సుబ్బారావు గారు.

"నా వాచ్ రెండు మూడు నెలలకే పాడై పోయిందండీ. దానికి ఇక్కడ రిపేర్ చేసే అవకాశం లేదని తెలిసింది. ప్రస్తుతం దాన్ని గుర్తుగా పెట్టెలో దాచుకున్నాను. చైనా సెల్ ఫోన్ ఛార్జ్ చేస్తుంటే కాలి పోయింది సార్ " విచారంగా చెప్పాడు శ్రీనివాస్.

"ఇప్పుడు కరెక్ట్ విషయానికి వచ్చారు. చైనా వస్తువులు చాలా వరకు మన దేశంలో తయారు అయ్యే వస్తువుల కంటే చాలా చవకగా దొరుకుతాయి. ఇది కొంత వరకు నిజమే! దీనికి కారణం చైనా లో ఉన్న ఫ్యాక్టరీలు భారీగా వస్తువులను తయారు చేసి ప్రపంచం నలు మూలలా అమ్ముకుంటాయి. వాటి నాణ్యత కూడా అంతంత మాత్రమే. చైనా వాచీలు, సెల్ ఫోన్లు, బొమ్మలు, ఇతర ఎలక్ట్రిక్ వస్తువులు చౌకగా దొరికినా వాటి కి ఏవైనా విడి భాగాలు అవసరం అయినా, రిపేర్ వచ్చినా మన దగ్గర దొరికే పరిస్థితి లేదు. అందువల్ల అవి పాడైపోతే పారేయటం తప్ప చెయ్యగలిగేది లేదు. పైగా వాటికి ఎటువంటి గ్యారంటీ కూడా ఉండదు. ఇక చైనా టపాకాయల గురించి -- వాళ్ళు తయారు చేసే టపాకాయలలో అధిక మొత్తం లో గంధకం (Sulphur) ఉంటుంది. మన దేశం లో తయారు అయ్యే టపాకాయలలో ఉండే Nitrate కన్నా గంధకం ఎంతో హానికారకం. వీటిని కాల్చటం వలన మన పర్యావరణం ఎంతగానో దెబ్బతింటుంది. అంతేగాదు ఆ విష వాయువులను పీల్చిన మన ఆరోగ్యం సైతం దెబ్బ తింటుంది. కేవలం ధర గురించి మాత్రమే ఆలోచించటం వలన చాలా మంది అనాలోచితంగా తక్కువ ధరకు లభించే చైనా వారు తయారు చేసే హాని కారకమైన టపాకాయలను కొనుగోలు చేసి తమ ఆరోగ్యానికే కాకుండా పర్యావరణానికి కూడా తీరని హాని కలిగిస్తున్నారు. అందువల్లనే చైనా టపాకాయల అమ్మకాన్ని, వాడకాన్ని చాలా చోట్ల నిషేధించారు. అలాగే చైనా బొమ్మల వలన మన కుటీర పరిశ్రమలు, నిర్మల్ బొమ్మలు, కొండపల్లి బొమ్మల వంటి కళా రూపాలు దాదాపుగా అంతరించి పోతున్నాయి. హస్త కళలకు ఎంతో పేరు పొందిన మన కళా కారులు సరి అయిన ఉపాధి లేక వేరే వృత్తులు చూసుకుంటున్నారు. ఒకప్పుడు అగ్గి పెట్టె లో మడిచి పెట్టగలిగే చీరలను తయారు చేసిన మన నేత కళాకారులు నేడు ప్రోత్సాహం కరవై, జీవనోపాధి కొరవై ఆ కళా నైపుణ్యాన్ని విడిచి పెట్టి వేరే వృత్తులు వ్యాపారాలు చేసుకుంటున్నారు. క్రమేణా మన చేతి వృత్తులు పూర్తిగా అంతరించే ప్రమాదం ఉన్నది. దీపావళి కి మనం మట్టి తో చేసిన ప్రమిదలలో నూనె పోసి వత్తులు వేసి వెలిగించి ధన లక్ష్మి కి స్వాగతం పలుకుతాం. కానీ చైనా నుండి దిగుమతి అయిన కృత్రిమమైన రంగు రంగుల బ్యాటరీ దీపాలు, కరంట్ దీపాల తోరణాలు ఇళ్ళ ముందు పెట్టుకొని అదేదో గొప్ప అన్నట్లు మురిసి పోతున్నాము. మన ఊరి లో ఉండే కుమ్మరులు తయారు చేసే మట్టి ప్రమిదలు వెలిగించితే దీపావళి కి సహజమైన, నిజమైన కళ వస్తుంది. మన ఊళ్లలో లభించే మట్టి ప్రమిదలు తెచ్చి వాటికి పోస్టర్ కలర్స్ ఉపయోగించి రంగులు వేసి చూడండి. ఎంతో అందంగా మంచి కళా రూపాలుగా కనిపిస్తాయి. మన భారతీయులు ఎందులోనూ ఎవరికీ తీసిపోరు. సాఫ్ట్ వేర్ రంగంలో ప్రపంచంలోనే మన వాళ్లకు తిరుగులేదు. అయినా వస్తువుల ఉత్పత్తి విషయం వచ్చే సరికి చైనా నుండి మన దేశంలోకి కుప్పలు తెప్పలుగా వచ్చి పడుతున్న నాసి రకం, చౌక రకం వస్తువుల ధాటికి మన నాణ్యమైన వస్తువులు దెబ్బ తింటున్నాయి. మన ప్రజలు కూడా కేవలం చౌకగా వస్తున్నాయనే ఒకే ఒక్క కారణం తో చైనా వస్తువులు కొంటున్నారు.

ఇవన్నీ కాకుండా మరో ముఖ్య విషయం. ఒకప్పుడు నెహ్రూ గారి హయాం లో చైనా మన మీద దురాక్రమణ చేసింది. మనతో స్నేహం నటిస్తూనే వెన్ను పోటు పొడిచింది. అయినా మనం గతాన్ని మరిచిపోయి చైనా తో స్నేహ హస్తాన్ని చాచాము. మరి ఇప్పుడు ఏమి జరుగుతోందో తెలుసా ? --- మన దేశం లోకి నాసిరకం వస్తువులు గుమ్మరించి తక్కువ ధరలకు అమ్ముకుని సంపాదించిన కోట్లాది రూపాయలను మన సరిహద్దుల్లో ఉన్న మన శత్రు దేశానికి సాయం చేయటానికి ఉపయోగిస్తూ మన వేలితో మన కంటినే పొడిచే ప్రయత్నం చేస్తున్నది చైనా దేశం. దీనికి విరుగుడుగా ముందు మనం చైనా లో తయారు అయ్యే వస్తువులను కొనటం మానేసి మన దేశం లో తయారయ్యే వస్తువులనే వాడాలి. ఆ విధంగా మన దేశము లో తయారయ్యే వస్తువులు మనమే కొని ప్రోత్సహించటం వలన మన దేశం లో ఉన్న కార్మికులకు చేతి నిండా పని దొరుకుతుంది. దేశం లో ఉత్పత్తి పెరిగి ప్రజల ఆర్ధిక స్తితిగతులు మెరుగు అవుతాయి. అందుకే మన ప్రధాని గారు "మేక్ ఇన్ ఇండియా" అనే నినాదాన్ని ఇచ్చారు. మనం కూడా మన దేశం లో తయారుఅయిన వస్తువులనే ఉపయోగించుదాం. మీరందరూ ఈ దీపావళి సందర్భంగా ప్రతిజ్ఞ చెయ్యండి --" మేము మన దేశం లో తయారయ్యే వస్తువులను మాత్రమే ప్రోత్సహిస్తాం. మన దేశ ఆర్ధిక పురోభివృద్ధికి పాటు పడుతాం " అని చెప్పారు సుబ్బారావు గారు. "ఓ అలాగే. ఈ దీపావళి నుండే మేము చైనా వస్తువులను కొనము, ఉపయోగించము" ఒక్క గొంతుతో చెప్పారు విద్యార్ధులు.

మరిన్ని కథలు

Kya huvaa
క్యా హువా
- కె. తేజస్వని
Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు