నివాళి - నారంశెట్టి ఉమామహేశ్వరరావు.

nivali

“సరిహద్దుల్లో పాకిస్తాన్ బలగాలు విధ్వంసం సృష్టించాయి. జమ్మూ జిల్లాలో అంతర్జాతీయ సరిహద్దు వెంబడి భారత దళాల శిబిరాలు, గ్రామాలపై విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడి బి.ఎస్. ఎఫ్. జవాను సహా ఓ బాలుడ్ని పొట్టన పెట్టుకున్నాయి. మరో పది మందిని గాయపర్చాయి”.

దినపత్రికలోని వార్తను బయటికి చదివి వినిపించాడు అశోక్.

‘అంత దారుణానికి తెగబడిందా పాక్ సైన్యం?” ఆసక్తిగా అడిగాడు సింహాచలం.

“అవును నాన్నా... మన దేశం మీద చెప్పలేనంత ద్వేషం పెంచుకుంది. అన్ని రంగాల్లో భారత్ ముందుకు దూసుకుపోతుంటే ఓర్వలేకనే ఇవన్నీ చేస్తోంది. ఉగ్రవాదం ఆపెయ్యమని అమెరికాతో సహా అన్నిదేశాలూ మొత్తు కుంటున్నా చెవిటివాడి ముందు శంఖం ఊదినట్టే ఉంది పాకిస్తాన్” ఓపికగా వివరణ ఇచ్చాడు అశోక్.

“అప్పట్లో బ్రిటీషువాడు స్వాతంత్ర్యం ఇచ్చినట్టే ఇచ్చి దాయాదుల మధ్య కుంపటి రగిల్చి వెళ్ళిపోయాడు. ఆ కుంపటి ఇంకా మండుతూనే ఉంది. పాకిస్తాన్ కి బుద్ధి వస్తుందంటే నమ్మబుద్ధి కలగదురా” బాధగా అన్నాడు సింహాచలం.

“సర్జికల్ స్ట్రయికులు చేసినా బుద్ధి రాలేదు వాళ్లకి” వినిపించాల్సిన వార్త కోసం పేపర్ వెతుకుతూ చెప్పాడు అశోక్.

‘తండ్రీ కొడుకుల డిస్కషన్ కి మరొక వార్త దొరికిందా? పొద్దున్న లేచేసరికి పేపర్ కనబడితే చాలు గంటల తరబడి చర్చల్లో మునిగిపోతారు. టీ త్రాగి మరొక వార్తలోకి వెళ్ళండి”. ట్రే లో తీసుకువచ్చిన రెండు టీ కప్పుల్ని టీ పాయ్ మీద పెట్టి చెప్పింది ఆనంది.

నవ్వుతూ భార్య ఇచ్చిన కప్పు అందుకున్నాడు అశోక్. “మాట్లాడడానికి నీకయితే పనిమనిషి, పక్కింటి వనజ, పద్మ, మీ అమ్మ ఉన్నారు. నాన్నకి ఊసులు చెప్పడానికి నేను తప్ప ఎవరు ఉన్నారు?” తిరిగి నవ్వుతూ ప్రశ్నించాడు.

సింహాచలం వయసు ఇప్పడు ఎనభై అయిదు ఏళ్ళు. ఒక్కడే కొడుకు అశోక్. అశోక్ పుట్టిన కొన్నేళ్ళకే అతడి అమ్మ చనిపోయినా మళ్ళీ పెళ్లి చేసుకోలేదు సింహాచలం. తాతయ్య, నాన్నమ్మల సాయంతో పెంచాడు. అవన్నీ తాత ద్వారా విన్నాడు అశోక్. అప్పటి నుండి నాన్న మీద ప్రేమ పెంచుకున్నాడు. యాభయి దాటిన వయసులో కూడా నాన్నకి కావాల్సిన సేవలు చేస్తూ సంబరపడతాడు అశోక్. చేసేది పెద్దఉద్యోగమయినా తండ్రి దగ్గర చిన్నపిల్లాడిలా మారిపోయి సేవలు చేస్తాడు. నవ్వించే విషయాలు చెబుతాడు. అన్నం తినేటప్పుడు క్రింద ఒలకబోసుకుంటే శాంతంగా శుభ్రం చేస్తాడు. ఆయనకి ఇష్టమయిన తెల్లటి పంచె, చొక్కా తొడిగి తల దువ్విన తరువాతే తన పనుల్లో దూరతాడు అశోక్.

మామయ్య మీద భర్తకి ఎంత ప్రేముందో తెలిసిన ఆనంది కూడా ఆయనలో స్వంత తండ్రిని చూసుకుంటుంది. పిల్లలిద్దరూ ఇంజినీరింగ్ లో పి.జి. చేస్తూ దూరంగా ఉండడంతో వాళ్ళ భారం కూడా తగ్గిన ఆనంది భర్తామామల సేవలో మునిగి తేలుతుంది.

“ఆ వార్తలేవో చదివే బదులు టి.వి. ఆన్ చేయొచ్చు కదా....” అంది ఆనంది అక్కడున్న పేపర్లోని ఒక జిల్లా పేజి తెరుస్తూ.

“నాన్నతో రోజూ ఉదయాన్నే గడిపితే సాయంత్రం తిరిగి వచ్చేవరకు ఆయనకు తృప్తిగా ఉంటుంది. ఈ వయసులో ఆయనకి కావాల్సింది మనతో గడిపిన మధురజ్ఞాపకాలు. ఆయనతో గడపడానికి నాకూ ఒక రీజన్ కావాలి. వార్తలు వినిపించడం, స్నానం చేయించడం, వేడి టీ సాసర్లో పోసి చల్లారాక త్రాగించడం .... ఇవన్నీ చిన్నప్పుడు నాకు ఆయన చేసినవే. తిరిగి అప్పు తీరుస్తున్నాను. అంతే!” తండ్రికోసం తెచ్చిన టీని సాసర్లో పోసి అందిస్తూ చెప్పాడు అశోక్.

‘కళ్ళు మసకగా కనిపిస్తున్నాయి అక్షరాలు చదవలేకపోతున్నాను’ అన్నాడొకసారి ఆ మధ్య సింహాచలం. అప్పటి నుండి తండ్రికి వార్తలు వినిపిస్తున్నాడు అశోక్. చెకప్ కి వెళ్దామని గుర్తుచేస్తూనే ఉన్నాడు కానీ సింహాచలమే వాయిదా వేస్తున్నాడు. ప్రేమతో కొడుకు చేసే సేవల్ని వదులుకోవడం ఏ తండ్రికి ఇష్టం? సింహాచలం అందుకు అతీతుడు కాదు.

“మీ ఇద్దరిదీ అపురూప బంధం. లోకంలో ఉన్న కొడుకులందరూ మీలా ఆలోచిస్తే వృద్ధాశ్రమాలే ఉండవు” పేపర్లో వచ్చిన ఒక వృద్ధాశ్రమం వార్త చదివి అశోక్ తో అంది ఆనంది.

“ఏమిటమ్మా వృద్ధాశ్రమం అంటున్నావు? మీ ఇంట్లో అలాంటి పదం వినబడడమా?”.

మాటలు వినబడిన వైపు తలెత్తి చూసేసరికి చొరవగా లోపలకి అడుగు పెడుతున్న శేఖర్ కనిపించాడు.

‘రారా శేఖర్ ..” ఆత్మీయంగా ఆహ్వానించాడు అశోక్. శేఖర్, అశోక్ కాలేజి రోజుల నుండి స్నేహితులు. సింహాచలాన్ని అశోక్ లాగానే నాన్న అని పిలిచేంత ఇష్టమైన స్నేహితుడు శేఖర్.

“నాన్నకి వార్తలు వినిపిస్తుండగా నా మీద చలోక్తులు విసరడం మీ చెల్లికి అలవాటే కదరా! దగ్గరగా పోలిన వార్త ఇప్పుడే చదివి ఉంటుంది. అంతే!” చెప్పాడు అశోక్.

“అన్నయ్యా... మీకు టీ తెస్తాను” నవ్వుతూ లోపలకి వెళ్ళబోయింది ఆనంది.

“వాకింగ్ నుండి ఇంటికి వెళుతూ ఇలా వచ్చాను. షుగర్ లెస్ టీ అయితేనే ఇవ్వు” చెప్పాడు శేఖర్.

‘నాకు గుర్తుంది అన్నయ్యా” వెళ్తూ చెప్పింది ఆనంది.

“నాన్నా బాగున్నారా?” అని సింహాచలంని కూడా పలకరించాడు శేఖర్. బాగున్నట్టు తలాడించాడు సింహాచలం.

“దీపావళి టపాసుల సంగతి ఏం చేసావు? మా స్టాఫంతా ఎవరికో ఆర్డర్ ఇచ్చారు. పోయినేడాదిలాగే నువ్వు తెప్పిస్తావని ఆగాను. గుర్తుందా?” గుర్తుచేసాడు శేఖర్.

“ఇంకా ఏమీ అనుకోలేదు ..” కాసేపు ఆగి చెప్పాడు అశోక్.

“ఇంకా అనుకోలేదా? పండుగ దగ్గరకి వచ్చేసింది. కొంప ముంచావు కదరా... మా వాడయితే ఫోన్లో లిస్టు చదివేశాడు. లక్ష్మీబాంబులు, రాకెట్లు, చిచ్చుబుడ్లు, ఫైవు థౌజండ్ వాలా ....అంటున్నాడు. పోయినసారి కంటే ఘనంగా చెయ్యాలన్నాడు. ఇప్పుడెలా?” తలగోక్కుంటూ అన్నాడు శేఖర్.

“ఏదో తప్పు జరిగిపోయినట్టు ఎందుకురా అంతగా భయపడతావు?” నవ్వుతూ అడిగాడు అశోక్.

“మావాడు ఫైనల్ ఇయర్ కదరా.. స్టూడెంట్ లైఫుకి ఫులుస్టాపు పడినట్టేననీ, సరదాలన్నీ ఇప్పుడే తీర్చుకోవాలనీ అన్నాడు. పైగా క్యాంపస్ సెలక్షన్ వచ్చిన హుషారులో ఉన్నాడు. వాడి గురించేరా నా ఆలోచన” నిజం చెప్పాడు శేఖర్.

“మా పిల్లలు కూడా ఆ మాటే అన్నారు ...” టీ కప్పు తో వచ్చిన ఆనంది చెప్పింది.

“థాంక్స్ చెల్లెమ్మా... ఆప్యాయంగా పలకరిస్తావు. రాగానే వేడిగా టీ ఇస్తావు” మెచ్చుకున్నాడు శేఖర్.

‘అదేంటన్నయ్యా.....టీ కి కూడా థేంక్స్ చెబుతావు” కోపంగా అంది ఆనంది.

‘మనం పొందిన సహాయానికి కృతజ్ఞత చెప్పడం కనీస ధర్మం అని ఎక్కడో చదివాను” టీ త్రాగుతూ చెప్పాడు శేఖర్.

“ఏ వాట్స్ ఆప్ మెసేజిలోనో చదివుంటావ్” టక్కున అందుకున్నాడు అశోక్.

‘నిజమే .. రోజూ వేల సంఖ్యలో మెసేజిలు వస్తున్నాయి. సరిగ్గా గుర్తు పెట్టుకోలేకపోతున్నాం” ఒప్పుకున్నాడు శేఖర్.

“ఈ సంవత్సరం దీపావళి టపాసులు కొనకూడదని మావారి ఉద్దేశం” దారి తప్పిన టాపిక్కును గుర్తుచేసింది ఆనంది.

“ఎందుకురా అలా అనుకున్నావ్?” ఆసక్తిగా అడిగాడు శేఖర్.

“ఇటీవల జరిగిన పాక్ దాడులూ, మన వాళ్ళు చేసిన సర్జికల్ స్ట్రయికులూ గుర్తున్నాయి కదా. సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. అక్కడ మన సైనికులు ప్రాణత్యాగం చేస్తుంటే మనం టపాసులు కాల్చి పండుగ చేసుకుంటామా?” ఆవేశంగా అడిగాడు అశోక్.

“మరైతే ఏం చేద్దామంటావు?” కాస్త ఆసక్తి మిళితమైన స్వరంతో అడిగాడు శేఖర్.

“దీపావళి జరుపుకోవడం మానేద్దామంటారా?” మరోప్రక్క ఆనందికీ ఆసక్తిగానే ఉంది.

“మానేద్దామని కాదు. కొత్తగా చెయ్యాలని ఆలోచన” చెప్పాడు అశోక్.

“అదేమిటో క్లారిటీ ఇస్తే మేమూ పాటిస్తాము” అన్నాడు శేఖర్.

“టపాసుల కోసం ఖర్చు చెయ్యడం వల్ల ఏం ప్రయోజనం ఉంది? గంట గంటన్నర వినోదం కోసం ఒక్కో కుటుంబం వేలకివేలు ఖర్చు చేస్తున్నారు. ధ్వనికాలుష్యం, వాతావరణ కాలుష్యం పెంచుతున్నారు తప్ప ప్రకృతికీ, పర్యావరణానికీ నష్టమే చేస్తున్నారు. అవునా?” అడిగాడు అశోక్.

“అవును...” ఒప్పుకుంది ఆనంది. తలాడించాడు శేఖర్.

“మనం కాల్చే టపాసుల్లో ఎక్కువభాగం చైనా నుండి దిగుమతి అవుతున్నాయి. మన సరిహద్దుల్లో కవ్వింపులకు పాల్పడుతున్న పాకిస్తాన్‌ కు చైనా వత్తాసు పలుకుతోంది. అన్ని రకాలుగా అండగా నిలుస్తోంది. చైనా మనలను పరోక్షంగా బెదిరిస్తుంది. తనకున్న వీటో పవర్ ను ఉపయోగించుకుని అంతర్జాతీయ కరుడుగట్టిన ఉగ్రవాది పాకిస్థాన్ జైషే మహమ్మద్ నేత "హఫీజ్ మహమ్మద్" ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించేందుకు ఐక్యరాజ్యసమితి - సెక్యూరిటీ కౌన్సిల్ లో అడ్డుపడింది. ముంబై ఉగ్రవాద దాడికి ఆజ్యం పోసిన వ్యక్తిని కాపాడటం చైనా దుర్మార్గానికి పరాకాష్ట. అలాగే "అణు సరపరా దేశాల కూటమి" లోకి భారత్ ను రాకుండా చైనా వ్యతిరేకిస్తోంది. అంతర్జాతీయంగా ఎన్నో విషయాల్లో మన పతనం కోరుతోంది చైనా. అలాంటి చైనాకు మన ద్వారా ఒక్క పైసా లాభమొచ్చినా, అది ఆయుధాలు నిర్మించి మనపైనే వాడే ప్రమాదముంది. అందుకే చైనా వస్తువుల వాడకం మానెయ్యాలి. చైనా వస్తువులు కొనడమంటే మన డబ్బుతో శత్రుదేశాన్ని పెంచి పోషిస్తున్నట్టా కాదా?” వెంటనే మరో ప్రశ్న అడిగాడు అశోక్.

“అవును ... అదీ నిజమే..” కాసేపు ఆలోచించి చెప్పాడు శేఖర్

“అందుకే ... టపాసులు కాల్చడానికి బదులు వేరే ఏదైనా చేద్దాం” చెప్పాడు అశోక్.

“నీ ఆలోచన బాగుంది రా ... ఏం చేద్దామో అదీ నువ్వే చెప్పు!” ప్రోత్సాహం అందించాడు శేఖర్.

“చాలా మంది సైనికులు ఇటీవల మన రక్షణ కోసం ప్రాణాలు వదిలారు. వాళ్ళ కుటుంబాలు దుఃఖంలో ఉండగా మనం సంతోషంగా పండుగ చేసుకుంటామా? మన ప్రధాని మోదీ గారు పిలుపు ఇచ్చినట్టుగా ఒక్కో కుటుంబం ఒక్కో దీపo వెలిగించి దేశరక్షణ కోసం అంకితమైన జవాన్లని స్మరించుకుందాం. నూతనోత్తేజం, పండుగ సందేశం జవాన్లకు అందేలా ప్రతి ఒక్కరం మన సందేశం పంపిద్దాం. పండుగ రోజుల్లో కూడా కుటుంబానికి దూరంగా గడుపుతున్న సైనికుల శ్రేయస్సు కోరి ప్రార్ధనలు జరుపుదాం. అంతే కాకుండా మనం టపాసులు కొనకుండా మిగిలించిన డబ్బుని సైనిక సంక్షేమ నిధికి జమ చేద్దాం” ఉద్వేగంగా చెప్పాడు అశోక్.

“చాలా బాగుంది రా నీ ఆలోచన. ఒక్కో దీపం వెలిగిస్తే సరిపోతుందా?” అడిగాడు శేఖర్.

“సైనికుల సంస్మరణ కోసం ఒక్కో దీపం ముందుగా వెలిగిద్దాం. ఆ తరువాత ఎప్పటిలాగే మన కోసం పండుగ వాతావరణం సృష్టించుకుందాం. ప్రమిదలలో వెలిగించిన దీపాల తోరణాలతో మన సాంప్రదాయం గుర్తొచ్చేలా పండుగ చేసుకుందాం” చెప్పాడు అశోక్.

“శభాష్ రా... మంచి ఆలోచన. నీకు అభినందనలు” నిజాయితీగా చెప్పాడు అశోక్.

“బాగుందండీ మీ ఆలోచన” వెంటనే చెప్పింది ఆనంది.

“ఇది నా ఆలోచన కాదు. ప్రధాని మోదీ గారు చెప్పిన తరువాత వచ్చిన ఆలోచన” సర్ది చెప్పాడు అశోక్.

“ఇది బాగుంది కాబట్టి మన పిల్లలకు నచ్చజెపుదాం. మరీ చిన్నవాళ్ళు కాదు కాబట్టి అర్ధం చేసుకుంటారు” అన్నాడు అశోక్.

“ఇప్పటికే వాట్స్ ఆప్ లో, ఫేస్ బుక్ లో ఎన్నో మెసేజీలు వచ్చి ఉంటాయి” అన్నాడు శేఖర్.

“మన రెండు కుటుంబాలు మాత్రమే ఈ ఆలోచన పాటిస్తే సరిపోదు. మన వీధిలో, ఆఫీసులో ప్రచారం చేయాలి. మంచి సందేశంతో కూడిన మెసేజిలు తయారుచేసి వాట్స్ ఆప్ లో, ఫేస్ బుక్ లో పెట్టాలి. మెయిల్స్ ఇవ్వాలి. లోకల్ న్యూస్ లో వచ్చేలా కరపత్రాలు పంచి పెద్ద ఎత్తున ప్రచారం చేయాలి. ప్రకృతిని కాపాడాలి. మన సైనికులకు మన ప్రేమాభిమానాలు పంచి పెట్టాలి. వారిలో ఆత్మస్థైర్యం పెంచాలి” వరుసగా చెప్పాడు అశోక్.

“అవన్నీ చేయడానికి నేను రడీ. మెసేజీలు వ్రాయడానికి నాకో ఫ్రెండ్ ఉన్నాడు. మిగతా ఏర్పాట్లు కోసం మనం ఒక మీటింగ్ పెట్టుకొని కలిసి చేద్దాం” మాట ఇచ్చాడు శేఖర్.

“బాగుందర్రా మీ ఆలోచన. మనవాళ్ళలో దేశభక్తి తగ్గిందేమో అని అనుమానం కలిగింది. నా ఆలోచన తప్పని నిరూపించారు మీరు. చాలా సంతోషంగా ఉంది” అన్నాడు సింహాచలo.

“ఈ దీపావళి సైనికులకు మనమిచ్చే నివాళి” ఒక్కసారి అన్నారు శేఖర్, అశోక్, ఆనంది.

మరిన్ని కథలు

Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న
ఓ breaking news
ఓ బ్రేకింగ్ న్యూస్
- బివిడి ప్రసాద రావు
chettu baadha
చెట్టు బాధ
- లక్ష్మీ కుమారి.సి