దీపావళి- ఈసారి సైనుకులకు అంకితం - ప్రతాపసుబ్బారాయుడు

deepaavali

సుబాష్ చంద్రబోస్ అంటే జల్సాపురుషుడు. కీర్తి, కాంత, కనకాల్లో..కనకం వాళ్ల నాన్న బాగా సంపాదించి పెట్టాడు. కీర్తి అతని సబ్జెక్ట్ కాదు. ఇహ కాంతం అంటే అతని ప్రాణం. కాంతం అంటే ఓ వేశ్య. సరదాగా ఒకసారి వెళ్లాడు. పిచ్చ పిచ్చగా నచ్చేసింది. అంతే..ఊరివాళ్లు చెవులుకొరుక్కున్నా, ముఖంమీదే మాటలన్నా దున్నపోతు మీద వాన కురిసినట్టుగా, అచ్చోసిన ఆబోతులా తిరుగుతుంటాడు. వాళ్ల నాన్న మిలట్రీలో పనిచేసి వచ్చాడు. తాత స్వాతంత్ర్య సమరయోధుడు అలాంటి ఇంట్లో తప్పపుట్టాడని తండ్రి ఎప్పుడూ తిడుతూనే ఉంటాడు. అయినా మనోడు సిగ్గూ, లజ్జా, మానం, అభిమానం వదిలేశాడు కాబట్టి నవ్వుతూ బలాదూర్ గా తిరుగుతుంటాడు.

ఒకసారి మాంచి ఆకలిమీదున్నాడు. అలాంటి ఆకలి వేసినప్పుడు కాంతమే మృష్టాన్నం. అందుకే యమహా బైకుమీద యమస్పీడుగా కాంతం ఇంటి వైపుగా వెళ్ళిపోతున్నాడు.

ఆమె ఇంటికి వెళ్లేదారిలో కనకరాజు మేడుంది. దాని పక్కనే రాజిగాడిల్లు. రాజిగాడంటే సుబాష్ ఫ్రెండ్. చిన్నప్పటినుంచి కలిసి పెరిగారు. ఎందుకో కాని రాజిగాడంటే సుబాస్ కి ప్రాణం. రాజిగాడు మిలట్రీలో జాయినయ్యాడు. వాడు వెళ్లబోతుంటే కన్నీరుమున్నీరయ్యాడు సుబాష్. ‘ఒరే రాజీ, నువ్వు మిలటరీలోకి ఎళ్లడమేంట్రా? యుద్ధాలవి వచ్చి..నిన్నక్కడికి పంపిస్తే..నీకేవన్నా అయితే నేను తట్టుకోలేన్రా..నా మాటిని ఇక్కడే ఉండిపోరా! మాకు బోలెడంతుంది. నిన్నూ మీ అమ్మనీ సొంతోళ్లలా నేను చూసుకుంటాను’ అని కాళ్లావేళ్లా పడ్డాడు. రాజిగాడు మాత్రం’ఉరే! నాకెందుకో మిలట్రీలో చెయ్యాలని ఇష్టంరా. ఎంచక్కా మన దేశానికి కాపలా కాస్తూ, మనవంక కన్నెత్తి చూసే శతృనాయాళ్లని పిట్టల్ని కాల్చేసినట్టు కాల్చేస్తాను.

మీ తాత, అయ్యా గొప్ప దేశభక్తుల్రా..నువ్వూ అట్టుంటే ఎంత బాగుండేది? సర్లే..నీ ఇష్టం నీది’ అని మూడేళ్ల క్రితం వెళ్లిపోయాడు. రాజిగాడిని చూడాలని మనసు ఎంత పీకుతున్నా ఏం చేయగలడు? ఎప్పుడొస్తాడో అని ఎదురు చూడ్డం తప్ప.
రాజిగాడీంటి ముందు కొంతమంది జనం కనిపించారు. వాడి కళ్లకు కాంతం అంగాంగాలు కన్పిస్తూ కవ్విస్తున్నాయి. మరేం కనిపించడం లేదు. సరాసరి కాంతం ఇంట్లోకెళ్లి ఊయల బల్లమీద కూర్చున్న కాంతాన్ని అమాంతం ఎత్తుకుని పడగ్గదిలోకి తీసుకెళ్లాడు. ఆమె ఏదో మాట్లాడబోయింది. మాట్లాడనిస్తేగా..తుఫానులా చుట్టేశాడు. మట్టిముద్దని నలిపేసినట్టు నలిపేశాడు. పూరేకల్ని ఒలిచేసినట్టు బట్టల్ని తొలగించేసి ఆమెలోకి ప్రవేశించేశాడు. అల ఓ రెండు మూడు సార్లు సంభోగానందం పొంది..తృప్తిగా సేదదీరుతూ.. అప్పుడడిగాడు

"కాంతం..రాజిగాడింటి ముందు ఏమిటే ఆ జనం" అని.

రాజిగాడు..మన పక్క దేశం సరిహద్దుకాడ కాపలా కాస్తుంటే..ఆ దొంగెదవలొచ్చి కాల్చేశారంట..ఇప్పుడో ఇంకాసేపట్లోనో శవం వస్తుందట.."అంది. దానికి తెలుసు సుబాస్ కి రాజిగాడంటే ఎంత ప్రేమో.

"ఇప్పుడా చెప్పేది"సర్రున లేచి బట్టలు కట్టుకుంటూ అన్నాడు.

"నేను చెప్పబోతుంటే..నువ్వు ఎద్దుమాదిరి కుమ్మేస్తుండావాయే.."అని ఏదో చెబుతూనే ఉంది, సుబాష్ వేగంగా పెద్ద పెద్ద అంగలతో బయటకి వెళ్లిపోయాడు.

రాజిగాడి తల్లి శోకదేవతలా ఉంది. సుబాష్ ని చూసి"ఉరే! రాజిగాడు మనకు లేడురా"అని పెద్దపెట్టున ఏడ్చింది. సుబాష్ కళ్లలో అవిశ్రాంతంగా కన్నీళ్లు. "ఊర్కో అమ్మా..ఊర్కో.." అని ఆవిడ్ని ఊరడించే ప్రయత్నం చేస్తున్నాడు. అప్పుడే మిలటరి ట్రక్ లో రాజిగాడి శవం వచ్చింది. సుబాష్ ఆ పెట్టెమీద బోరున విలపిస్తూ పడిపోయాడు.తన స్నేహితుడు..తన ప్రాణం అలా అచేతనంగా ఉండే సరికి గుండె మండిపోయింది.
సైనిక లాంఛనాలతో రాజిగాడి దహనం అయ్యాక సుబాస్ పూర్తిగా మారిపోయాడు. ఊరి నడిబొడ్దు మీద కూడలిలో మితృడి శిలాప్రతిమ పెట్టించాడు.

ఒకసారి అక్కడ అందర్నీ సమావేశ పరచి"నా స్నేహితుడు మరణించాడన్న విషయం మీకు తెలుసు. దేశాల మధ్య యుద్ధాలొచ్చి ఒక నీతితో యుద్ధం చేస్తే, అందులో అసువులు బాస్తే అది వీరమరణం. కానీ నా స్నేహితుడు శతృదేశ కుహనా బుద్ధితో సరిహద్దు వెంబడి కాల్పులు చేస్తే నా స్నేహితుడు మరణించాడు. ఆ దేశం ఎప్పుడూ అంతే పిరికిది. కాల్పుల విరమణకు తూట్లు పొడుస్తూ, పదే పదే కవ్వింపు చర్యలకు పాల్పడుతుంటుంది. ఉరి, పఠాన్ కోట్ సంఘటనలకు కారకమవుతుంది. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ దేశాల్లో కళంక దేశంగా నిలిచింది. అదే నాకు చాలా బాధగా ఉంది. కడుపు తరుక్కుపోతోంది. అందరికీ నా అనే అన్నదమ్ములుంటారు. కాని సైనికుడు మాత్రం అందరికీ సోదరుడే! రాజిగాడు మన ఊరివాడు. మనవాడు. దేశమంటే వాడికి ఎంతిష్టమో మీకు తెలుసు. వాడు కన్ను మూయడం మనందరికీ లోటే! నేనో నిర్ణయానికి వచ్చాను. ఇహనుంచి పాకిస్తాన్ అన్న పదం మనం వినకూడదు. అది దొంగ దేశం. మనం స్వతహాగా శాంతికాముకులం కాబట్టి, యుద్ధాల వల్ల నష్టపోతాం కాబట్టి ఇన్నాళ్లూ హితోపదేశం చేశాం. మన మంచితనాన్ని ఆ ఉగ్రదేశం చేతకాని తనం అనుకుంటోంది. ఇప్పుడు మోడీగారు పాకిస్తాన్ కు గట్టి హెచ్చరికలు చేస్తున్నాడు. ఈ విషయంలో దేశాల మద్దతు కూడగట్టుకుని ముందుకెళుతున్నారు. మన ఈ స్వాతంత్ర్యం మా తాతయ్య, నాన్నల లాంటీ ఎంతోమంది త్యాగ ఫలితం. దాన్ని మనం కాపాడుకోవాలి. గ్రీన్ డ్రస్ వేసుకుని, మిలటరీలో ఉంటేనే దేశానికి సైనికులం కాదు. మనమూ సైనికులమే. పాపం మంచులో, ఎడారిలో మన రక్షణ కోసం రాత్రింబగళ్లు తమ వాళ్లకు దూరంగా దేశ రక్షణలో నిమగ్నమయ్యే మన సైనికుల కోసం మనం కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. మానవతా దృక్పథంతో వాళ్లకు మనమున్నామన్న భావన కలగజేయాలి.

1. మనసైనికులకు సంఘీభావంగా పండగలకి, ప్రత్యేక దినాలకీ గ్రీటింగ్స్ పంపించాలి

2. పాకిస్తాన్ మన మీద దాడి చేసిన ప్రతిసారీ మనవాళ్లను అభినందిస్తూ, మనోస్థైర్యాన్ని పెంచుతూ ఉత్తరాలు రాయాలి. . టీ వీ ల్లో, పేపర్లలో ప్రకటనలు ఇవ్వాలి

౩. అవి చూసి సైనికుల తల్లిదండ్రులు అలాంటి వీర పుత్రులను కన్నందుకు మురిసిపోవాలి. వీలు చూసుకుని మనం వాళ్లను కలవాలి

4. మోడీగారికి పాకిస్తాన్ కుయుక్తులను తుత్తునియలు చేయమని సామూహిక విజ్ఞాపనలు చేయాలి

5. మన సైనికులకు మనం బయట నుంచి ఏ సహాయం కావాలన్నా చేస్తామని తెలియచేద్దాం.

6. పాకిస్తాన్ కు సహాయం చేస్తూ, మనకు పక్కలో బళ్లెమైన చైనా తయారు చేసిన దీపావళి టపాసులు కొనకూడదు. ఒక్క టపాసులే కాదు ఆ దేశం ఉత్పత్తిచేసే ఏ వస్తువునూ, ఎంత చవగ్గా ఉన్నా కొనకూడదు. అసలు మనదేశం లోకి రానీయకుండా కేంద్రం చర్యలు తీసుకునేలా చూడాలి.

7. పాకిస్తాన్ పేర్లకి సంబంధించిన బేకరీల్లో, షాపుల్లో ఏవీ కొనకూడదు.

8. రెండు రోజుల్లో రాబోయే దీపావళిని మన రాజిగాడికి అంకితమిద్దాం. మన టపాసులతో ఆకాశంలో వెలుగులు మింపుదాం. టప టపలు ఢమ డమలతో పాకిస్తాన్ కు ఖబడ్దార్ అని హెచ్చరికలు చేద్దాం.

9. అమరులైన వీర సైనికుల తల్లిదండ్రులను కలసి అలాంటి పిల్లల్ని కన్నందుకు అభినందించి, సన్మానించాలి. అవసరమైతే ఆర్ధిక సాయం చేయాలి.

మీరేమంటారు? అన్నాడు.

అందరూ మిన్నంటేలా చప్పట్లు చరిచారు.

తమ పిల్లాడిలో వచ్చిన మార్పుకు సుబాష్ తండ్రీ, తాతయ్యల కళ్లలో నీళ్లు నిలిచాయి.

*****

ఈసారి ఆ ఊళ్లో దీపావళి అదిరింది. సరిహద్దు రేఖ వెంబడి మన సైనికులు ఎలా శతృదేశ కాల్పులకు ఎదురుకాల్పులతో సమాధానం చెబుతారో అలా కాల్చారు. రాజిగాడి స్మృతిలో జరిగిన బాణాసంచా వేడుక మిగతా ఊళ్లవారికీ, రాష్ట్రాలకి స్ఫూర్తినిచ్చింది. ఇప్పుడు మనదేశమంతా ఏకమై సైనికబలంగా రూపొందింది. నేడో రేపో పాకిస్తాన్, చైనాలు మన బలం ముందు తోక ముడవడం ఖాయం. అందుకే ఆ దీపావళి..సైనికుల కోసం జరిపిన దీపావళిగా చరిత్రలో నిలిచిపోయింది.

మరిన్ని కథలు

Kya huvaa
క్యా హువా
- కె. తేజస్వని
Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు