కమాను వీధి కథలు - రామదుర్గం మధుసూధనరావు

kamanu veedhikathalu

ఠప్..ఠప్..ఠప్..పొద్దున్న 12 గంటలప్పుడు కమాను కుళాయి కాడ పోటాపోటీగా కేపుల సౌండ్లు. నేను పక్కసందు పిలగాడు ఎదురెదురు కూర్చొని చిన్న గుండ్రాయితో కేపుల్ని దంచుతుం డాము. కేపుపై రాయి పడింది తడువు ఠాప్...చుర్రుమంటూ నిప్పు రవ్వ. ఇద్దరం అసలీ లోకంలో ఉంటేకదా! పది పదహైదు నిమిషాలకే కేపు డబ్బా కలాస్...ఇద్దరి మొహాల్లో విజయగర్వం. చివర్లో ఒకటి కనిపించింది.దీన్ని కూడా దంచేస్తే సరి...అనుకుని సక్కగా పెట్టి గుండ్రాయి ఎత్తా... అంతే, ఇంతలో నా పక్కన దబ్బుమంటూ ఏదో పడి ఠాప్ అంది. చుర్రుమంటూ లేసిన రవ్వలు కాలికి అంటుకునే సరికి ఒక్కసారిగా కోపమొచ్చి ఎవడ్రా సచ్చినోడు అనుకుంటూ తలెత్తి చూస్తినా...వంకరగా నవ్వుకుంటూ రఘుగాడు. కోపం మరింత పెరిగింది. ఏయ్...ఎవరుండారో ఏందో సూసుకోవా...ఏంటి అన్నా. వాడు ఇదేం పట్టించుకోలేదు. నిక్కరులోంచి ఏదో తీసి మళ్లీ కిందికి కొట్టినాడు. ఠాప్ అంటూ పేలింది. ఇంక మాలో ఒకటే ఆత్రం...వీడేందో కొత్తది పట్టుకొచ్చినాడని. “లే..లే..ఏమిరా అది...చూపవా...'బతిమాలడం ప్రారంభించాం. అప్పుడు సూడాల వాణ్ని. ఓర్నాయనో ఎంత టెక్కులేసినాడో. చివరికి మా భుజాపై చేయేసి "ఇంకా ఎంతకాలంరా...ఈ గుండ్రాయితో కొట్టుకుంటారు. ఇది సూడు అంటూ ఇందాక నేలకేసి కొట్టిన పెద్ద బోల్టు-నట్టు చూపినాడు. బోల్టుకు రెండు వాషర్లులాంటి గుండ్రటి పలకలు...వాటిపై నట్టు. పలకలమధ్యలో కేపుబిళ్ల పెట్టి పైన తిప్పాడు. రెండు అతుక్కు పోయాయి.బలంగా కిందికి కొట్టాడు. అంతే ఠాప్ అంది. కేపుల్ని ఇంత నీట్ గా కొట్టవచ్చా అని నోరెళ్లబెట్టాం.అక్కడ్నుంచి మొదలైంది మా కుతకుత..!

ఈ కతంతా దీపావళి రోజున అనుకునిండారేమో...లేదుసామీ నెల ముందే! అసలు దీపావళి ఒకరోజు పండగ అని ఎవరైనా అంటే మా కమాను పిలగాళ్లం ముఖంపైనే నవ్వేస్తాం. మాకు బరాబరి నెల్రోజులైనా ఉంటాది. పండగ అంటే ఇట్ట వచ్చి అట్టా పోయేది కాదు కదా! పూలబజారు నగరేశ్వర స్వామి గుడికాడ సెట్టి అంగట్లో కేపుల పాకెట్టు వచ్చిండాదంటే...ఇంక పండగ సురు అయినట్టే! ఇంట్లో రచ్చరచ్చ చేసి అయినా సరే అయిదుపైసలు సంపాదించుకున్నాక ఇద్దరు ముగ్గురు కల్సి కమాను వెనకాల ఉన్న ఆ పూల బజారుకెళ్లె వాళ్లం. అంగడోడు మమ్మల్ని చూడగానే నిండుగా నవ్వేవాడు.మరి మనం నెల్రోజుల గిరాకీ కదా. ఏమప్పా ఏం కావాల? అడుగుతుంటే...మాకు వరాలిచ్చే దేవుడిలెక్క కనిపించేవాడు. “అన్నా ...బానాలు వచ్చిండాయా...' అమాయకంగా ప్రశ్న వినిపించగానే ఆయన పెదాల వెనక నవ్వు అలా మెరిసేది. ఆ నిన్ననే తెప్పించిండాను. ఈ సారి మస్తుగా ఉండాయి. అద్సరే గానీ ఇప్పుడేం కావాలా మీకు...' అంటుంటే మాకు బలే ముజుగరగా ఉండేది.ఈయప్ప ఇప్పడే ఏదో పది రూపాయల బాణాలు కొనేస్తామని లెక్కేసినట్టుండాడు. కేపులు కావాలని ఎట్టా అడగాలా... మనసులో తెగ బాధపడిపోయేవాళ్లం. కానీ ఏం చేయాలా అవసరం అలాంటిది.గొంతు పెగల్చి "అన్నా

మా కాడ పైసలు తక్కువుండాయి...కేపు..' ఇంకా మాట పూర్తి కాకుండానే గొంతు పెంచేసేవాడు. “ఆ సురువయ్యిండాదా మీ కత! ఏరా పనేం లేదా? పొద్దున్నపొద్దున్నే ఆణాలు...పైసలు పట్టుకుని టింగు రంగా అంటూ వచ్చేసేదానా? అంతలా అంటుంటే బిక్కచచ్చిన ముఖాలేసుకుని అట్టానే నిలుచుం డేవాళ్లం. కొద్ది సేపటికి ఆయే తగ్గేవాడు. “సర్లే మీరు మాత్రం ఏం చేస్తారు...పిలగాళ్లు దీపావళికి కాల్చుకుంటారు...పైసలియ్యాలా అని ఇంట్లో అనిపించాలి కదా! ఇప్పడేం బేరం చేస్తుండారు...కేపులు కావాల అంతే కదా...' అంటూ పాపం కొత్త పార్శిల్ విప్పి అందులో డజన్ లెక్కన పొడుగ్గా ఉండే కేపుల బాక్సుల్లోంచి ఒకటి తీసిచ్చేవాడు. డబ్బా నిక్కరుజేబులో వచ్చిందంటే ఇంక ఎక్కడ్లేని హుషారు. ఇంటికి వచ్చీ రాగానే వంటింట్లో దూరి చిన్నగుండ్రాయి తీసుకుని పరుగు పెట్టేవాణ్ని. “రేయ్...వంటింట్లోంది ఎందుకురా తీసుకెళుతున్నావు...ఇంటికి రా...నీ పని చెబుతా...' అంటూ అమ్మ అరుస్తున్నా...వినేదెవరు? కట్టకు దూరంగా వెళ్లి కేపుడబ్బాలోంచి చిన్నకేపుతీసి దంచడం సురు చేసేవాళ్లం. ఎర్రగా చిన్నబొట్టుబిళ్లలా ఉండే కేపు మధ్యలోనో...పక్కనో నల్లమచ్చలా మొద్దు ఉంటుంది. సరిగ్గా దానిపై రాయిదెబ్బ పడితేచాలు శబ్దం వచ్చేది. డబ్బా కొన్నరోజు సరిగా కొట్టలేక తిప్పలు పడే వాళ్లం. నిప్పురవ్వలు చేతికి తగులుతుంటే బలే పజీతిగా ఉండేది. ఎప్పుడో సంవత్సరం కిందట కాల్చింది మళ్లీ మొదలు పెడుతుండాం కదా! రొవంత ప్రాక్టీసు కావాలి కదా!

ఎప్పట్లాగే గుండ్రాయితో కేపులు కాల్చే మాలో తీవ్ర అసంతప్తి రగిలించింది రఘుగాడే! వాడు ఆ రోజు బోల్టు-నట్టు తీసుకురాకుండా ఉంటే...మాకు వేరే ఆలోచనే ఉండేది కాదు. వాడు చూపించి నాంక...గుండ్రాయి ముట్టుకోవాలంటేనే బేజాయిండాది. ఏం చేయాల? రఘుగాడికి నైస్ కొట్టి"లే..లే..ఎక్కడ దొరుకుతుందిరా' అని అడగ్గా అడగ్గా వాడు షాపు పేరు చెప్పినాడు. బాణాలు కొనేకే దుడ్లులేవు. ఇంక ఈ బోల్టు-నట్టు కతేందిరా నాయినా! పోనీ ఈసారికి వద్దులే అనుకుందా మం టే..రఘు చూపించే టెక్కుతోనే కష్టం. రోజూ నరకం చూపిస్తుండాడు. వస్తాడు...దాన్ని నేలకేసి కొడతాడు. ఎట్టా వాణ్ని తట్టుకునేది..అందుకే ఎవరికి వాళ్లం ఇంట్లో ఏడ్చో...అడుక్కునో ఆ బోల్టు తెచ్చుకున్నాం. పండగ దగ్గరపడుతున్న కొద్దీ కమాను చుట్టుపక్కల బాణాలు అమ్మే అంగళ్లు పెరిగేవి. పాము బిళ్లలు..కేపులు...రీలులు పండగ రేపు అనేదాకా వీటితోనే మా కాలక్షేపం. ఈ నెల్రోజులూ చాక్లెట్లు...నిమ్మకాయ పిప్పరమెంట్లూ... కమ్మరకట్టలూ... త్యాగం చేసి ఆ డబ్బులతోనే బాణాలు కొనేవాళ్లం.

దీపావళి మూడ్రోజులూ చేసేవాళ్లం. ప్రతి ఇంటి ముందు దీపాల వెలుగుల్లో కమాను మెరిసి పోయేది.పండుగ ముందురోజే అమ్మ ఇంటికి సున్నం పూసి ముస్తాబు చేసేది. మొదటి రోజు నీళ్లునింపే పండగ...దీన్నే నరకచతుర్దశి అనేవారు. మరుసటి రోజు అమావాస్య...దీపావళి పండగ. ఆ తర్వాతి రోజు బలిపాడ్యమి. ఈ మూడురోజులు ఇంట్లో బోల్డెన్ని పిండివంటకాలు. నీళ్లునింపే పండగ నుంచే హడావుడి మొదలు. అమ్మ బచ్చలింట్లో నీళ్లు కాచే గుండాలిని బాగా చింతపండుతో తోమి కడిగేది.తళతళా మెరిసే దానిపై విబూది పట్టీలు పెట్టి కుంకుమ పూసేది. అలాగే బిందెలు...చివరికి చిన్న చెంబును కూడా వదలకుండా కడిగి దానికీ కుంకుమబొట్టు పెడుతుంటే...మా సంతోషం అంతా ఇంతా కాదు. ఆ రోజు సాయంత్రం బజారుకెళ్లి బాణాలు కొనవచ్చన్నమాట. ఓ రకంగా బాణాలు కొనేందుకు అది పచ్చజెండా ఊపినట్టే! స్కూలు నుంచి నాన్న ఎప్పుడొస్తాడా అని వేయికళ్లతో ఎదురుచూసేవాణ్ని. ఎప్పుడు నాన్న కళ్లపడకుండా ఎట్టా తప్పించుకుందామా అని ఎత్తులు వేసే నేను ఏడాదిలో ఈరోజు మాత్రం ఎప్పుడొస్తాడా అని ఆత్రంగా ఎదురుచూసేవాణ్ని. పెద్దమసీదుకాడ ఉండే గట్టు వాళ్లంగడికి వెళ్లే వాళ్లం. బాణాలతోపాటు గన్..రీలు కేపులు తప్పనిసరి. లవంగ,డాంబారు,లక్ష్మీబాణాలు కొనేవాళ్లం. కాకరొత్తులు, వైర్లు, మతాబుపెట్టెలు,భూచక్రాలు,విష్ణుచక్రాలు...నాలుగైదు వంకాయబాణాలు... ఇంచుమించు మా బాణాల లిస్టు ఇంతే! కొని సైకిలుపై వస్తుంటే...ఎంత ఆనందమో! దీపావళి...మా సంచిలోనే ఉందనుకుని సంబరపడిపోయేవాణ్ని. ఎవరింట్లో ఏ బాణాలు దిగిండాయో తెలీకుండా చాలా జాగ్రత్తలు తీసుకునేవాళ్లం. ఎందుకంటే తెల్లారుజామున కాలుస్తుంటే...ఆ వెలుగులో మిగిలిన పిలగాళ్ల కంట్లో అసూయ కనిపించాల కదా! నేను ఎంత కిరికిరి పెట్టినా నాన్న రాకెట్టు వద్దనేవాడు. కమానులో అసలే ఎదురెదురిళ్లు. అది పైకెగిరేది బదులు ఇంట్లో దూరితే...ఎందుకొచ్చిన తంటా నాయనా...అది మాత్రం అడగొద్దు అనేవాడు.

బాణాలు తెచ్చిన రోజు నిద్ర వస్తే ఒట్టు. అక్కడికీ అమ్మ "రేయ్...పడుకోరా పొద్దునే లేవాలి. హారతి తీసుకోవాలి' అంటుంటే వళ్లు పులకించిపోయేది. తెల్లారితే చాలురా నా సామిరంగా బాణాల దుమ్ము దులిపేయవచ్చు అనుకునేవాణ్ని. అలసటతో మూతపడ్డ కనురెప్పల మాటున ఎన్ని లక్షల బాణాలు సందడి చేసేవో! ఆ వెలుగులే మనసులోనూ వెన్నెలలు నింపేవి. చూస్తుండగానే తెల్లారి పోయేది. రాత్రి నిద్ర రాదని మొండికేశామా...తెల్లారిలేపితే ముడుచుకుపోయేవాణ్ని. అమ్మ బైట కళ్లాపి చల్లి...ముగ్గులు వేసి బచ్చలింట్లో గుండాలి కింద పొయ్యి వెలిగించాక...హాలులో లైట్లు వేసి లేపేది. ఈ హడావుడితో నా నిద్ర కాస్త హుష్ కాకి! జమకానా పై మేం కూర్చొన్నాక నుదుట కుంకుమబొట్టు పెట్టి హారతి ఇచ్చేది. ఉంగరంతో తలకు నూనెపెట్టి...తర్వాత చేతిలో ఆకువక్కలు ఇచ్చేది. బైట సన్నగా వణికించే చలి...మసకమసక వెలుతురు...అక్కడక్కడా బాణాలు కాలుస్తున్న చప్పుడు...రేడియోలో తిరుచానూర్ స్టేషన్ నుంచి మంద్రంగా ధ్వనిస్తున్న నాదస్వరం....మనసులు దీపాల్లా వెలిగిపోవడానికి...ఆనందంతో పొంగిపోవడానికి ఇంతకన్నా చక్కని వాతావరణం ఎక్కడుంటుంది?“తాంబూలం దేవుడి ముందు పెట్టి నమస్కారం చేసుకోండి' అమ్మ అంటుంటే...దేవుడికి గబగబా దండం పెట్టేసి...బాణాలు కాల్చేకి సిద్దమైపోయేవాళ్లం. బైట గుమ్మం ముందు...కిటికీ గోడలపై ప్రమిదలుండేవి. కాకరొత్తులు వెలిగించుకోడానికి నానా తిప్పలు. సగం మట్టే కదా. అవి బాగా కాలేదాకా ఓపిగ్గా చేతిలోనే పట్టుకుని ఉండాలి. చుర్..చుర్ శబ్దం రాగానే మొహం విప్పారేది. దాంతోనే బిరు సులు...భూచక్ర,విష్ణుచక్రాలు కాల్చేవాళ్లం. అవీ అంతే...సగం దాకా తిరిగి ఆగిపోయేవి. ఈ లోగా అమ్మ "ఇంక కాల్చింది చాలు...కొన్ని ఎత్తిపెట్టండి గౌరమ్మ పండక్కి' అనేది.

చూస్తుండగానే పూర్తిగా తెల్లారిపోయేది. ఆ వెలుతురులో కమానులో ప్రతి ఇంటి ముందు చెల్లాచెదురుగా పడిఉన్న తమిళ అక్షరాల కాగితాలు...వాటి నుంచి వచ్చే తెల్లటిపొగ...మనసును ఇట్టే లాగేసేవి.రేయ్ పళ్లుతోముకోరా..ముఖం కడుక్కోరా...అమ్మ అంటున్నా అవి మా చెవికెక్కితేగా.నిద్రమొహం వేసుకునే కమాను పిలగాళ్లం జట్టుజట్టుగా వీధి మధ్యలో కూర్చొని కాలిన కాకరొత్తుల కడ్డీతో కాయితాలను అటుఇటుగా కెలికేవాళ్లం. కాస్త అంటుకుని మినుకు మినుకుమంటుండే లవంగాలు తుస్ స్...టప్ అంటూ ఉన్నట్టుండి శబ్దం చేసేవి. ఉలిక్కిపడి రేయ్...రేయ్...లవంగా పేలింది అంటూ అరిచేవాళ్లం. ఇంటివాళ్లు వచ్చి లాక్కెళ్లేదాకా ఇదే తంతు. తలంటుస్నానం చేశాక...గన్,రీలుకేపు తీసి కట్టపై స్టైలుగా నిలుచుని డైలాగులు కొడుతూ కాల్చేవాళ్లం. అయితే మాకెందుకో రీలుగన్ దండగ అనిపించేది. రీలు చుట్టి టపటపా...అంతా నిమిషంలో కలాస్ అయ్యేది.అదే విడి కేపులైతే నింపాదిగా కాల్చుకోవచ్చు....ఇదీ మా అభిప్రాయం. అందుకే రీలుగన్ను మాత్రం కొనేవాళ్లం కాదు. ఒకవేళ కొన్నా రీలు కేపుని ముక్కలుగా చేసి వాటినే కాల్చేవాళ్లం. మద్దేనం అన్నం తినే సమయం దాకా విడివిడిగా ఊడదీసిన లవంగబాణాలను ఒక్కొక్కటిగా కాకరొత్తి తంతికి గుచ్చి కుడిచేతిలోని ఊదికడ్డిని అంటించి కాల్చేవాళ్లం. ఆరోజు ఇంట్లో అమ్మ సజ్జ ఓళిగలు చేసేది. మనసారా లాగించేవాళ్లం.

సాయంత్రం...పెద్దపెద్ద అంగళ్లలోలక్ష్మీపూజ పేరుతో సందడి చేసేవాళ్లు. ఖాతామణి పుస్తకాలకు పసుపుతో స్వస్తిక్ రాసి పూజ చేసేవాళ్లు. ఈ ఖాతామణి పేద్ద బైండింగ్ తో ఉండేది. అంగడి జమా ఖర్చులు రాసే పుస్తకం. విచిత్రం ఏంటంటే ఈ ఖాతామణిని నిర్వహించే గుమాస్తాలు...బక్కగా రివటగా ఉండేవాళ్లు. క్యాలికులేటర్లు,కంప్యూటర్లు వారి ముందు ఏపాటి లెక్క? పేజీపై నుంచి కింద దాకా పెన్నుతో అంకెల్ని అలా లెక్కగట్టి రెండో మాట లేకుండా రాసేవారు. అరువుబేరాల చిట్టా ఆ పుస్తకంలోనే ఉండేది. అమావాస్య రోజున పాత పుస్తకానికి మంగళం పాడి కొత్తది తెరిచేవారు. ఓ రకంగా ఇది కొత్త ఆర్థిక సంవత్సరం లాంటిదన్న మాట. గౌరా అంగడి...రోషన్ మార్కెట్ అంగళ్లలో లక్ష్మీపూజ బ్రహ్మాండంగా జరిగేది. తెలిసిన అంగళ్ల వద్ద హాజరు వేయించుకునేవాళ్లం. వాళ్లిచ్చే చిన్నదూద్ పేడా... చిన్నచిన్న బాణాలు ఆబగా తీసుకునేవాళ్లం. చీకటిపడ్డాక కమానులో శరభణ్ణ...తుంగావాళ్లు, పక్కనే ఉన్న డైమండ్ వాళ్ల ఇళ్ల వద్ద...అటూఇటూ చుట్టుపక్కలా అందరూ అబ్బురపడేలా బాణాలు కాల్చేవారు. ఈ లోగా షరాబ్ బజారు వద్ద బాణాలు బాగా కాలుస్తారంటా రండ్రా అంటూ వెళ్లేవాళ్లం. మతాబులు...బిరుసులు...కాకరొత్తులు ఎన్ని ఎన్నిరకాలుగా విర్రవీగుతూ వెలిగినా...మా సందడి, సంబరాల ముందు చిన్నబోయేవి. అసలు దీపావళే మా కమాను పిలగాళ్ల వెంటపడి తిరిగేదేమో...మా అమాయకత్వాన్ని...ఆనందాన్ని కాసింత అరువు తీసుకుని బాణాల్లో కలుపుకొని వెలిగేదేమో... అందుకే ఆ వెలుగులు అంత అందంగా కనిపించేవి!!

పజీతి: ఇబ్బంది, బరాబరి:సరిగ్గా, దుడ్లు:డబ్బులు

మరిన్ని కథలు

Kya huvaa
క్యా హువా
- కె. తేజస్వని
Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు