కల్పన - దినవహి సత్యవతి

kalpana

ప్రముఖ రచయిత్రి సృజన కలంనుంచి వెలువడిన కథల సంపుటి ‘జీవన రాగాలు ......’. సృజన గారి రచనలంటే నా కెంతో ఇష్టం. వాస్తవానికి దర్పణం పట్టినట్లు ఉంటాయి ఆవిడ రచనలన్నీ. గబగబా పని పూర్తి చేసుకుని పుస్తకం చేతిలోకి తీసుకుని చదువుదామని తెరిచాను. మొదటి కథ ‘కల్పన’ ...

**************

కవిత, కల్పన ఇద్దరు కాకినాడలో ఒకే కాలేజీలో బి.ఎస్సి ., చదువుతున్నారు. హాస్టలులో ఒకే గదిలో ఉంటున్నారు త్వర లోనే గాఢ స్నేహితులయ్యారు. వీలయితే ఒక సారి వచ్చి వెళ్ళమని ఇంటి దగ్గర నుండి ఫోన్ వస్తే 3 రోజులు సెలవలు కలిసి వచ్చాయని ఇవాళ ఉదయమే సామర్ల కోట తన ఇంటికి వచ్చింది కవిత. భోజనం చేసి కొంచం సేపు పడుకుందామని అనుకుంటుండగా మధ్యాహ్నం సుమారు రెండు గంటల సమయంలో ఫోన్ వచ్చింది కల్పన వద్ద నుండి.

‘అదేమిటి పొద్దునే కదా మాట్లాడాను ఎన్నో కబుర్లు చెప్పింది మళ్ళీ ఇంతలో ఫోనెందుకు చేస్తోంది?’ అనుకుంది కవిత.

‘మూడు రోజులు సెలవలు కదా నువ్వు కూడా ఇంటికి వెళ్ళ కూడదా?’ అన్నప్పుడు కల్పన అయిష్టంగా తలూపి మౌనంగా ఉండి పోయింది. సరే లేమ్మని కవిత కూడా మరి రెట్టించ లేదు. కానీ గత వారం అత్యవసరమైన పని పడి ఇంటికి వెళ్ళివచ్చినప్పటి నుంచి కల్పన ఎక్కువ సమయం ఏదో ఆలోచిస్తున్నట్లుగా ఉండటం కవిత గమనిస్తూనే ఉంది . ఏదైనా ఉంటే తానే చెప్తుందిలే అని ఎదురు చూస్తోంది కవిత.

“హలో కల్పనా! ఏమిటే అంత కొంప మునిగి పోయే పని పొద్దున్నేగా మాట్లాడుకున్నాము. ఇంతలో ఏమైంది? అప్పుడే నా మీద బెంగ పెట్టుకున్నావా” ఆట పట్టిస్తున్నట్లుగా అడిగింది కవిత.

కానీ “హలో! ఎవరు మాట్లాడుతున్నారు?” అని విన వచ్చిన ప్రశ్నకు కొంత ఆందోళన చెంది “హలో! మీరెవరు? నేను కవితను . ఇది నా స్నేహితురాలు కల్పన ఫోను , మీ దగ్గరికెలా వచ్చింది?” అంది గబ గబా

“నేను ఇన్స్పెక్టర్ రాగిణిని మాట్లాడుతున్నాను. మీ స్నేహితురాలు కల్పన ఫోన్ లో మొదటగా మీ నంబరే ఉండటంతో మీకు కాల్ చేస్తున్నాను”

“ఇన్స్పెక్టర్ గారా , కల్పన కేమైంది? దయ చేసి చెప్పండి”

“మీ స్నేహితురాలు కల్పన ఆత్మహత్యకు పాల్పడింది. పరిస్థితి విషమంగా ఉంది ” అని అవతల నుంచి వినగానే

“ఏమిటీ” అని పెద్దగా కేక పెట్టింది కవిత . ఆ అరుపుకు ఇంట్లో వాళ్ళంతా బెదిరి పోయి ‘ఏమైంది ఏమైంది’ అంటూ పరుగెత్తి వచ్చారు. విషయం వాళ్ళకి వివరించి ఇంకా సరిగ్గా తెరవ నైనా తెరవని బ్యాగుని అలాగే మళ్ళీ భుజాన వేసుకుని పర్సు చేత బట్టుకుని పరుగున బస్టాండుకి వెళ్ళి బస్సెక్కి కాకినాడ తిరుగు ప్రయాణమైంది. దారి పొడుగునా ఏమై ఉంటుందా, కల్పనకి ఆత్మహత్య చేసుకో వలసిన అగత్యం ఎందుకు వచ్చిందా అనే ఆలోచిస్తూ ఉండి పోయింది. తన ప్రాణ స్నేహితురాలు ఈ మధ్య కొంచం దిగులుగా ఉండటం గమనించింది కానీ ఎప్పుడు నవ్వుతూ అందరితో సరదాగా ఉండే కల్పన ఇంత పని చేస్తుందనుకోలేదు. బయటకు చెప్పుకో లేని బాధేదో ఆమెని లో లోపల కలచి వేసిందా?

బస్సు దిగి హాస్టలుకి వచ్చేటప్పటికి అక్కడంతా గందర గోళంగా ఉంది. ఇన్స్పెక్టర్ రాగిణి వార్డెనుని ప్రశ్నిస్తున్నారు. కవిత రావడం చూసిన ఆవిడ “మేడమ్ ఈ అమ్మాయే కవిత, కల్పన స్నేహితురాలు. ఈమె తోనే మీరు ఫోన్ లో మాట్లాడారు” అంటూ కవితని రాగిణికి పరిచయం చేశారు.

“నమస్తే మేడమ్” అంది కవిత. కవిత వచ్చేటప్పటికే హాస్టలు నిర్వాహకురాలిని అడిగి కల్పన ఇంటికి సమాచారం పంపే ఏర్పాట్లు చేసింది రాగిణి.

ఆ తరువాత “ ఏమ్మా నీ స్నేహితురాలు కల్పన ఆత్మహత్యకు పాల్పడడానికి కారణం ఏమైఉంటుందో నువ్వేమైనా చెప్ప గలవా?” అని కవితను ప్రశ్నించింది.

“అదే నాకు అర్థం కావడం లేదు మేడమ్. కల్పన ఎప్పుడు అందరితోనూ చాలా సరదాగా ఉంటుంది. ఒక వేళ ఏమైనా ఉంటే నాతో తప్పక చెప్తుంది. అలాంటిది ఇలా ఎందుకు చేసిందో నాకు కూడా అంతు బట్టటం లేదు మేడమ్” అంటుండగానే కవితకి దుఃఖం తన్నుకు వచ్చి వెక్కడం మొదలు పెట్టింది. అంత లోనే ఏదో గుర్తుకు వచ్చి వెంటనే తమాయించుకుని “మేడమ్ ఒక విషయం ” అంది

“ఏమిటమ్మా?”

“గత వారం కల్పన ఏదో అత్యవసరమైన పని ఉందని వాళ్ళ ఊరు వెళ్ళి వచ్చింది. అప్పటు నుండి ఎందుకో కొంచం దిగులుగా ఉండటం గమనించాను”

“స్నేహితురాలు దిగులుగా ఉంటే విషయం కనుక్కోవడానికి నువ్వు ప్రయత్నించ లేదా?”

“అడిగాను మేడమ్ కానీ ఏమి లేదని చెప్పి మాట దాట వేసింది. నేను మరి రెట్టించి అడగ లేదు. అదే నేను చేసిన పొరపాటని ఇప్పుడు ఎంతో బాధ పడుతున్నాను అంటూ కళ్ళమ్మట ఏకధారగా కారుతున్న కన్నీటిని తుడుచుకుంటూ జీరబోయిన గొంతుతో ఏదైనా చెప్పేదుంటే తానే చెప్తుందిలే అనుకున్నాను. ఇంతలో నేను కూడా ఊరుకి వెళ్ళాల్సి రావడంతో వచ్చాక అడగొచ్చులే అనుకుని దిగులు పడొద్దని మాత్రం చెప్పి వెళ్లాను. ఇలాంటిదేదైనా జరుగుతుందని ఏమాత్రం ఊహించినా కల్పనని ఒంటరిగా వదిలి వెళ్లి ఉండేదాన్నే కాదు” అంటూ ఏడవ సాగింది. అప్పుడు రాగిణి ప్రక్కనే ఉన్న ఇంకో మహిళా కానిస్టేబులుకి కవితను అవతలికి తీసుకెళ్ళి మంచి నీళ్ళు త్రాగించ మని సైగ చేసింది.

ఇంతలో ఇంకో కానిస్టేబులు “మేడమ్” అంటూ వచ్చాడు.

“ఏమిటి భద్రయ్యా?”

“ఆ అమ్మాయి పెట్టెలో ఇది దొరికింది” అంటూ ఒక కవరు రాగిణి చేతికి అందించాడు

ఆ కవరుపై ‘నా ప్రాణ స్నేహితురాలు కవితకు’ అని వ్రాసి ఉంది.

ఆవిడ దానిని “నీ స్నేహితురాలు నీకు ఏదో ఉత్తరం వ్రాసి పెట్టినట్లుంది. ఏమి వ్రాసిందో చదివి చెప్పు” అంటూ కవితకి అందించారు. గబ గబా కళ్ళు తుడుచుకుని కవరు తెరిచి అందులో ఉన్న మూడు కాగితాలు బయటకు తీసింది. ఉత్తరం చూసి కవిత ముఖంలో భావోద్వేగం గమనించింది రాగిణి. ఉత్తరం చదవసాగింది కవిత .........

“ప్రియాతి ప్రియమైన కవీ! (కవితను ప్రేమతో ‘కవీ’ అని పిలవడం అలవాటు కల్పనకు), ఈ ఉత్తరం నీకు చేరేటప్పటికి నేను ఈ లోకంలో ఉండను. ఇది చదివితే నేనిలా చేయడానికి కారణమేమిటో నీకు అర్థమవుతుంది .

ఇన్ని సంవత్సరాలుగా ఈ బాధని నాలోనే దాచుకుని ఎంత మానసిక క్షోభని అనుభవించానో నాకే తెలుసు. నా పట్ల ఏమి జరుగుతోందో అర్థమయ్యేటప్పటికే చాలా ఆలస్యమై పోయింది. ఈ విషయం ఎవరికి, ఎలా, ఏమని చెప్పాలి .........ఈ ప్రశ్నలు అహర్నిశలు నన్ను వేధిస్తూ ఉండేవి.

అమ్మతో చెబితే? నాన్ననే దైవంగా కొలుస్తూ ఆయన గురించి ఎవరేమైనా ఒక్క మాట అంటే కూడా సహించని అమ్మ నా మాటలు నమ్ముతుందా? నేను చెప్పేది విన్నాక నాకు తోడుగా నిలబడుతుందా? ఎప్పుడూ క్లబ్బులని , సమావేశాలని తిరుగుతూ ఉండే అమ్మ, పేరు ప్రతిష్ఠలకే ప్రాముఖ్యత నిచ్చే అమ్మ ... ఈ విషయం విని తట్టుకో లేక తనకి తాను ఏదైనా హాని తల పెట్టుకుంటే ఇప్పుడిప్పుడే యుక్త వయసు లోకి వస్తున్న చెల్లి ఆరు సంవత్సరాల తమ్ముడు.. వాళ్ళకు దిక్కెవ్వరు?

పోనీ నాన్ననే అడిగితే ? ......హు! నాన్న ! ఆ పదానికే కళంకం తెచ్చిన వ్యక్తితో మాట్లాడాలంటేనే నాకు అసహ్యంగా అనిపించింది . అసలు నా మనో వ్యధకి కారణం ఆ వ్యక్తే గదా???

పిల్లలు తమకేమైనా కష్టం కలిగితే తల్లి దండ్రులకు చెప్పుకుంటారు. అలాంటిది కన్న తండ్రే పిల్లలకి హాని తల పెడితే? సంతానాన్ని దుష్టుల నుండి కాపాడి రక్షించ వలసిన తండ్రే మృగంలా కూతుర్ని కబళించాలని చూస్తే ఇంక ఆ వ్యక్తికి తండ్రి అని పిలిపించుకునే అర్హత లేదు. నాకు ఊహ తెలిసి జరుగుతున్న దారుణం అర్థమై కొంత వరకు జాగ్రత్త పడగలిగాను. కానీ మొన్న అనుకోకుండా పని మీద ఇంటికి వెళ్లినప్పుడు అదే అఘాయిత్యం ఆ వ్యక్తి నా చెల్లెలి పట్ల కూడా చేయ బోవడం చూసి నా మనసు వ్యధతో క్రుంగి పోయింది. ఇంకా ఉపేక్షిస్తే నా చెల్లెలి జీవితం కూడా అఘాయిత్యం పాలవుతుందని అనిపించింది. నేను మాటల్తో చెప్తే ఎవరు నమ్ముతారు ? ఏ విషయాన్ని సాక్ష్యం ఉంటేనే గాని నమ్మని మన వ్యవస్థలో ఇది నిజమని నిరూపించడం ఎలా ? అందుకే చెల్లికి కొంచం జాగ్రత్తగా ఉండమని చెప్పి వచ్చాను. కానీ ఎలా , ఎన్నాళ్ళు నేను ఇక్కడ ఉంటూ అక్కడ చెల్లిని కాపాడ గలను? అందుకే నీకు ఈ ఉత్తరం వ్రాస్తున్నాను. నీ నుండి ఒక సహాయం కోరుతున్నాను.

అది చెప్పే ముందర నీ మనసులో వచ్చిన సందేహం “నేను చని పోవడమెందుకు, ధైర్యంగా ఈ పరిస్థితిని ఎదుర్కొని ఉండ వచ్చు కదా అని’ .. చదువుతున్న కవిత అప్రయత్నంగానే పైకి ‘అవును’ అనేసి .....తలెత్తి ఒక సారి రాగిణి కేసి చూసి తిరిగి ఉత్తరం చదవ సాగింది......

‘నాకు జీవించాలనే ఇచ్ఛ నశించింది. దుర్మార్గుడైన ఆ వ్యక్తిని అమ్మ దైవంలా పూజిస్తుంటే చూస్తూ ఈ జన్మ గడపలేను. పది మందిలో దేవుడని పేరు తెచ్చుకుని ఇంట్లో కన్న కూతుర్లని కామించే ఆ వ్యక్తిని నా తండ్రిగా భావించి సమాజం కోసం నటిస్తూ బ్రతకాలని లేదు. అందుకే ఈ లోకం వదిలి వెళ్ళి పోవాలని నిశ్చయించు కున్నాను. కానీ నేను అనుభవించిన మానసిక క్షోభ వేరే ఏ కూతురు అనుభవించ కూడదు. మంచి మనుషులనే ముసుగు వేసుకుని సంఘంలో చెలామణి అవుతూ కన్న కూతుర్లని కామ పిశాచుల లాగా కబళిస్తున్న ఇలాంటి ఎంతో మంది మృగాలకి కఠినమైన శిక్ష పడాలి. నా చావుకి కారణం నా కన్న తండ్రే, నా చెల్లెలిని కబళించాలని చూసిన ఆ వ్యక్తికి శిక్ష పడేలా చూడు. ఇదే నా ఆఖరి కోరిక . తప్పక తీరుస్తావు కదూ !

జన్మ జన్మలకు నీవే నా నెచ్చెలివి కావాలని కోరుకుంటూ నిన్ను వదిలి వెళుతున్న

నీ ప్రియమైన

కల్పన

ఉత్తరం చదవ గానే ‘కల్పనా ఎంత పని చేసావే!’ అంటూ పెద్దగా ఏడుస్తూ కుప్ప కూలి పోయింది కవిత. ఆమె పరిస్థితి చూసి అక్కడున్న వాళ్ళందరికీ కూడా కన్నీళ్ళాగలేదు. ప్రక్కనే నిలబడి, కవిత సాంతం ఉత్తరం చదివాక ఏమి వ్రాసిందో అడిగి తెలుసు కుందామని ఎదురు చూస్తున్న రాగిణి స్పృహ కోల్పోయి నేలకి ఒరిగి పోతున్న కవితను గభాలున పట్టుకుని ప్రక్కనే ఉన్న కుర్చీలో కూర్చుండ బెట్టి ఆమెను జాగ్రత్తగా చూడమని అక్కడున్న కానిస్టేబులుకి చెప్పింది. తదుపరి కవిత చేతి లోంచి జారి పడిన ఉత్తరాన్ని చదివిన రాగిణికి కూడా అంతు లేని దుఃఖం అంతకు మించిన ఆగ్రహం పెల్లుబికి వచ్చాయి.

కానీ తానొకటి తలిస్తే దైవమొకటి తలచాడని ఆత్మహత్యా ప్రయత్నం చేసినప్పటికీ కల్పన మరణించ లేదు. డాక్టర్ల ప్రయాసతో ప్రాణాపాయం నుండి బయట పడింది. వెంటనే రాగిణి పై అధికారుల ఆదేశాలకి మేరుగా కల్పన నుండి వాగ్మూలం తీసుకుంది. ఆ సాక్ష్యాలతో కల్పన తండ్రిని వెంటనే అదుపులోకి తీసుకునేలా ఆదేశాలు జారీ చేయించింది.

విషయం తెలిసి హుటా హుటిన వచ్చిన కల్పన తల్లి కన్నీరు మున్నీరుగా విలపించింది . “ఒక్క సారి నన్ను నమ్మి ఈ విషయాన్ని నాతో చెప్పి ఉంటే దుర్మార్గుడైన నీ తండ్రికి నేనే శిక్ష పడేలా చేసేదాన్ని” అంటూ వాపోయింది కూతురుని చూసి.

కల్పన తండ్రిపై ఆరోపణలు సాక్ష్యాధారాలతో సహా రుజువు కావడంతో అతనికి కోర్టు కన్న కూతురు కల్పనని ఆత్మ హత్యకు పురి కొల్పేలాగా మానసిక శారీరిక హింసకు గురి చేసినందుకు, చిన్న పిల్ల కల్పన చెల్లెలిని బలాత్కారం చేయడానికి పూనుకున్నందుకు గాను శిక్షా స్మృతుల ప్రకారం కఠినాతి కఠినమైన శిక్ష విధించింది.

ఆస్పత్రిలో కోలుకుంటున్న ప్రాణ స్నేహితురాలైన కల్పనను పరామార్శించడానికి వెళ్ళిన కవిత “చూడు నువ్వు కోరుకున్నట్లుగానే నీ తండ్రికి శిక్ష పడింది. ఇంక నీ జీవితానికి , నీ చెల్లెలి జీవితానికి ఏమి భయం లేదు. ఇప్పుడు మీ అమ్మ గారు కూడా నీ వెంటే ఉంటారు. ఇంకెప్పుడూ ఇలాంటి పిచ్చిపని చేయవు కదూ” అంటూ స్నేహితురాలి చేతులు పట్టుకుని ఆప్యాయంగా నిమిరుతూ చెమ్మ గిల్లిన కళ్ళను తుడుచుకుంది .

ఒక వైపు తల్లిని, చెల్లెలిని, తమ్ముడిని ఇంకోవైపు ప్రాణ స్నేహితురాలైన కవితను చూసి జీవితం పట్ల తిరిగి ఆశ చిగురించగా తృప్తిగా కళ్ళు మూసుకుంది కల్పన.

******************************

కథ పూర్తయ్యింది. నా మనసు కూడా భారమైంది. నేటి సమాజంలో కల్పనలాంటి అమ్మాయిలు ఎంత మందో? కానీ ఎంత మంది కల్పనలాగా ఇలాంటి విషయం బయటకు చెప్ప గలుగుతున్నారు? సమాజంలో పరువు ప్రతిష్ఠలు దెబ్బ తింటాయని ఝడిసి ఎంతో మంది కిమ్మన కుండా ఉండి పోతున్నారేమో?

ఇలాంటి అత్యాచారాలను సహిస్తూ పిరికి తనంతో తమకు తామే హాని తల పెట్టుకో కుండా ధైర్యముగా ఎదుర్కోవాలని సూచిస్తున్నట్లుగా, కల్పన పాత్రను బ్రతికించి దుర్మార్గుడైన ఆమె తండ్రికి శిక్ష పడేలా చూపి, కథకు చక్కటి ముగింపును ఇచ్చి ఒక మంచి సందేశాన్ని అందించిన రచయిత్రి సృజనా శక్తికి మనసు లోనే అభినందనలు తెలియ జేశాను.

మరిన్ని కథలు

Kya huvaa
క్యా హువా
- కె. తేజస్వని
Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు