కమాను వీధి కథలు - రామదుర్గం మధుసూధన రావు

kamanuveedhikathalu

“బాయే మూడ్...దాయే మూడ్...పీచే మూడ్...ఆగే మూడ్...ఏక్ దో ఏక్...ఏక్ దో ఏక్...'వినడానికే తప్ప ఏమాత్రం అర్థం కాని ఈ పదాలను బాలసామిగాడు గొతుచించుకు గాఠిగా అరుస్తుంటే...మేం కాన్వాసు బూట్లను నేలకేసి కొడుతూ...చేతులు సరసరా ఊపుతూ...కీ ఇచ్చిన బొమ్మల్లా స్కూలు గ్రౌండంతా తిరిగేవాళ్లం. తెల్లారుజాము6 గంటలు...వణికించే డిసెంబరులో... ముని సిపల్ స్కూలు గ్రౌండులో...అలా తిరుగుతుంటే మా తిప్పలు అన్నీ ఇన్నీ కావు. మంచుగాలులు నిక్కరు ..చొక్కా సందుల్లో దూరి వంటిని తాకుతుంటే గజగజ వణికిపోతూనే...బాలసామి కేకలు వింటూ లెఫ్ట్ రైట్ లు కొట్టేవాళ్లం. హమ్మయ్య ఇంక అయిపోయిందనుకునేలోగా వాడు మళ్లీ మొదలెట్టేసేవాడు. ఈసారి ఇంగ్లిస్ లో "స్టాండట్టీ...జ్...అటే...న్షన్..'అంటూ ఆ రెండు పదాల్ని చూయింగ్ గమ్ లాగా లాగి వదిలేవాడు. స్టాండటీజ్ అని రెండు కాళ్లు అటూఇటూ లాగినట్టుగా అంటే...అటేన్షన్ అని గాఠిగా దబాలున అరిచేవాడు. ఏం బడివారం సేస్తుండావురా బాలసామీ...కానీ ఈరోజు నీదే అని మనసులో పండ్లు కొరుక్కొంటూ...నీరసంగానే లెఫ్ట్ రైట్ కొట్టేవాళ్లం. పొద్దున్న ఆరు గంటల నుంచి వాడు మమ్మల్నట్టా బండకేసి ఉతికినట్టు...చపాతి పిండి పిసిగినట్టు...ఏక్ దమ్ మెత్తగ సేసేసినాంక...ఇంక అయిపోయిండాదా నాయనా...ఏమైనా మిగిలిండాదా అనుకునేలోగా వీరబద్రగౌడుసారు ప్రత్యక్షం.ఇంక మాకు వీరబద్రుడే దిక్కు. “రేయ్...అందరూ సక్కగా నిల్చోవాల. నకరాలు చేసుకుంటూ అట్లా ఇట్లా ఊగిండారంటే ఉంటాది మీ కత! ఎన్ సీపీ అంటే ఏమనుకు నిండార్రా...అంత కువ్వాడమైనాదా మీకు...ఎవడైనా దొరకాల అప్పుడు సెబుతా...'అంటూ సారు గర్జిస్తుంటే రెండో వరసలో ఉండే నాకు ఒకటే నడుగు వచ్చేసింది. అంత చలిలోన వంట్లో చెమట్లు పట్టేస్తున్నాయి. షర్టు నిక్కరు..ఇస్త్రీ లేకున్నా...నిక్కరు ఇస్త్రీ మడత కనిపించకున్నా...మామూలుగా ఉండదు. ఆ సారు వీరబద్రుడే అవుతాడు. నేనేమో బాగా నలిపిన పుండకూరలాంటి డ్రస్సు ఏసుకుని ఉండాను. సారు కంట్లో పడకుంటేచాలురా నాయనా అనుకోసాగాను. నేను రెండో లైన్లో నిలుసుండేదే పెద్ద అదృస్టం. మా గుంపుకు కాస్త దూరంలో సారు మాట్లాడుతుంటే...నాకు మా ఊర్లోనే కాదు చుట్టుపక్కూళ్లోని దేవుళ్లందరూ గ్రూపు పొటోల్లో లెక్కన ఒక్కసారే కనిపించారు. మనసులోనే వారందరికీ దండం పెట్టుకున్నా. ఎలాగైనా మా సారు కంటపడకుండా చేయమని. మల్ల ఏ దేవుడు ఇనుకునిండాడో గానీ...సారు "ఈ రోజుకింక సాల్లే...' అని ఆర్డరేసి ఎల్లిపోయినాడు. హమ్మయ్యా...సచ్చిబతికినానురా సామీ అనుకున్నాను. అప్పుడు ఊర్లో పోయే దెయ్యాన్ని ఇంట్లోకి పిలుసుకున్నట్లు...ఈ ఎన్ సీసీలో ఎందుకైనా చేరానురా దేవుడా అనుకున్నా. మళ్లీ తేరుకుని మామూలైపోయిండాను.

ఎన్ సీసీ చేరేటోళ్లు పేర్లు రాపించుకోవాలంట...'క్లాసు పిలకాయలు గుసగుస అనుకుం టుంటే...నాకు బేగిరం అర్థం కాలే. ఏందిరా ఈ ఎన్ సీసీ..అనుకుంటా నాగేషు,వేణు,సురేషు,ఆచారీ అందరినీ అడిగినా...”...మస్తుగుంటుందిరా...రెండుజతల నిక్కర్లు,ఫుల్ షర్టులు ఇస్తరంటా..కాన్వాసు బూట్లు కూడా ఫ్రీ...' అంటుంటే మాకందరికీ బలే అనిపించింది. ఓర్నాయనో స్కూల్లో ఇట్టా ఫ్రీగా కూడా డ్రస్సులిస్తారా? అనుకున్నాం. వెంటనే పరుగులు పెట్టి సారుకాడ పేర్లు రాయించుకున్నాం.నగేషు,సురేషు...ఇంకొంతమంది దీన్ని చాలా గొప్ప ఇసయంగా తీసుకునిండారు. కానీ మనం అట్టా కాదు. ఏద ఏస్కోడానికి బట్టలిస్తారంటా...అన్న మాట మాత్రమే తలకెక్కింది. వెంటనే గుంపులో చేరిపోయాను. వీటికి మించి ఇంకో సీక్రెట్టుండాది. పొద్దుగాలే గ్రౌండుకు వస్తే పరేడ్ అయినాంక టిపిను...వేడి వేడి ఇడ్లి,వడ ఇస్తారని తెలిసింది. ఇంక దీని గురించి మరోలా ఆలోచించడం దండగ..చేరేదే అనుకునిండాను. పైగా నాన్న స్కూలు టీచరు కావడం నాకు పెద్ద రిజర్వేషన్ లాంటిదే.అయితే ఒక్కోసారి బయమేసేది కూడా ఇదే. వీరబద్రగౌడు సారు పిలిచి...”ఏందిరా పొట్టోడా...ఎన్ సీసీ కావాలా నీకు..'లావుపాటి మీసాల చాటున నవ్వు దాచుకుంటూ అడుగుతుంటే...నాకు నిక్కరు తడిసినంత పనైంది.

సార్... సార్...అదీ' నసుగుతుంటే...”సరే మంచిగా చేయాలా తెలిసిండాదా' అని చెప్పి పంపించాడు. ఇంక అప్పట్నుంచి సురు. వారంలో రెండ్రోజులు...పొద్దుగాలే స్కూలుకు డ్రస్సు వేసుకుని వెళ్లేవాణ్ని. ఖాకీ డ్రస్సు...ఎర్రటి కాన్వసు బూట్లు వేసుకుని కమానులో దర్జాగా నడుసుకుంటూ వెళుతుంటే అప్పుడే పోలీసు అయిపోయినట్టుండేది. ఏమైనా సెప్పు...ఎన్ సీసీ సేయనోడు సచ్చినోడి కిందే లెక్క అనుకునేవాణ్ని. ఏం అదృస్టంరా నీది...నిన్ను పట్టేవాడులేదు పో...అని మనసులో నాకు నేనే సబాష్ కొట్టుకునేవాణ్ని.

అయితే రాన్రానూ దాని అసలు కత తెలిసినాంక ...ఇంతుండాదా దీనిలో దేవుడా అనుకున్నా. ఇదే పజీతిగా ఉంటే, నగేషు... సురేషు... బాలసామి ఈళ్ల ఇస్త్రీ నిక్కర్లు మాకు బలే తిప్పలు తెచ్చి పెట్టేవి.మా సారేమో...రేయ్ అట్టా కడక్ గా ఉండాల...అంటుంటే, వారిపై ఎక్కడ్లేని కోపం పుట్టుకొచ్చేది. ఆ నగేషుగాడి నిక్కరు ఇస్త్రీ మడత మరింత సక్కగా పొడుచుకు వచ్చి ఉండేది. వాడు ఈ ఎన్ సీసీలో నేనే మేస్త్రీని...అనే లెక్కన పోజులు కొట్టేవాడు. ఎప్పుడూ ముందు వరసలో దూరిపోయి నిలుచునేవాడు. నేను మరికొందరుమాత్రం...ఏదో ఈ గంట కాళ్లుచేతులూపుకుంటూ తిరిగితే...ఇడ్లీవడ వస్తుందనేలా ఉండేవాళ్లం. బాలసామి ఊరు పడిపోయేలా అరిచినా...నగేషుగాడు గ్రౌండు పగిలిపోయేలా బూట్లతో కొట్టినా...ఇవేవీ పట్టించుకునే స్థితిలో ఉండేవాణ్ని కాదు. ఇడ్లీవడ ప్యాకెట్టు ఎప్పుడు వస్తుందా అని కరబేతిగా ఎదురు చూడ్డంతోనే సరిపోయేది. గంట అయ్యే సరికి మా గుంపుకు ఎదురుగా ఓ పెద్ద వెదురుపుట్ట కనిపించేది. దాన్ని చూడగానే ఎంత సంతోషమో!అప్పట్నుంచి క్షణం కూడా గంటే అనిపించేది. ఈ బాలసామి వదిలితేగా...ఏక్ దో ఏక్ అంటూనే ఉండేవాడు. ఒరేయ్ నాయనా ఇంక చాల్లేరా...ఆడ ఇడ్లీ వడలు చల్లారిపోతుండాయిగానీ...అని మనసు ఒకటే అరుస్తుండేది. సావధాన్...వీశ్రమ్ లు అయిందంటే సాలు...పుట్టకాడికి ఉరికేదే! న్యూస్ పేపర్లలో దుబ్బగా చుట్టిన పాకెట్టు చూడగానే...ఆబగా తీసుకునేవాళ్లం. అదేదో చెమటడోడ్చి అంటారే...కరెక్టుగా ఈ సందర్భానికి సరిపోయేది. లెఫ్ట్ రైట్లతో అలసిపోయిన మాకు... ఆ ప్యాకెట్టు వాసన ముక్కుకు తగలగానే ఎక్కడ్లేని శక్తి వచ్చేది. అప్పటిదాకా పడ్డ కష్టం హుష్ కాకీ!!

నగేషు గాడి నిక్కరు అంత కడక్ గా ఎట్టా ఉండేదో నాకు ఎంత ఆలోచించినా అర్థం కాలేదు. నావరకు పరేడ్ కు వెళ్లే వెనకటి రోజు దిండుకిందనో..పరుపుకిందనో పెట్టేవాణ్ని. కానీ దాని హణేబారం అంతే ఉండేది. ఏ పొద్దూ...ఇస్త్రీ మడత సరిగా కనిపించి చచ్చేది కాదు. ఏం చేస్తే మడత కుదురుతుందా అని తెగ ఫీలై...ఇంక లాభం లేదని రేయ్ నగేషా... నిక్కరు అంత కడక్ మడత ఎట్టరా వస్తుంది?కొచెన్ మార్కు ముఖం పెట్టి మరీ అడిగేసరికి వాడు పోజు కొట్టడం మొదలెట్టాడు. ఛీ ఎదవ బతుకు...ఎవడ్నయినా అడిగితే చాలు...ఆ నీల్గుడు తట్టుకోవడం కస్తం అని బలే ఇదై పోయాను. ఆ తర్వాత వాడు తీరిగ్గా చెప్పాడు. ఇంట్లో పెద్దమ్మ అన్నం చేసేటపుడు గంజినీళ్లు పక్కన పెట్టే ఏర్పాటు చేసుకనేవాడు. నిక్కరు షర్టు ఉతికినాంక దాంట్లో తడిపి ఆరబెట్టి...ఆ తర్వాత ఇస్త్రీ చేస్తానన్నాడు.మరి ఇంట్లో ఇస్త్రీ పెట్టె లేదు కదరా అన్నా అమాయకంగా. వాడు దానికి నవ్వుతూ అది లేదు కానీ చెంబుందిగా అన్నాడు. చెంబులో నిప్పంటించిన బొగ్గులు వేసి ఇస్త్రీ చేసే వాడన్నమాట! నాకు బుర్ర తిరిగి పోయింది. నిక్కరు మడతతో కనిపించాలంటే ఇంత కస్టపడాలా..నావల్ల అయ్యే పని కాదని దండం పెట్టేసుకున్నాను. పాపం నగేషు పడే తపన నా మట్టిబుర్రకు అర్థం కాకపోగా...ఈడిది ఉత్త బడివారం కాకపోతే, ఇంత అవసరమా అనిపించింది. ఇస్త్రీ అంట...అది చెంబు ఇస్త్రీ అంట...నిక్కరుకేమో గంజి పట్టియ్యాలంట..మాకేం బేకులేదులేప్పా...నువ్వే సేస్కో అని లోలోపలే మూతి తిప్పుకునిండాను.

వారానికి రెండ్రోజులు చచ్చీచెడి గ్రౌండులో కాళ్లు నొప్పులు పుట్టేటట్టు పరేడ్ చేసేది పెద్ద పజీతి అనిపించలేదు గానీ..ఎన్ సీసీ డ్రస్సుతోనే తలనొప్పి వచ్చేది. దాన్ని మామూలు రోజుల్లో వేసుకుని వస్తే వీరబద్రగౌడుసారు ఒప్పుకునేవాడు కాదు. నా ఖర్మకాలి ఓ రోజు స్కూలుకి ఎన్ సీసీ నిక్కరు వేసుకుని వచ్చి సారుకు చిక్కిపోయిండాను. అప్పుడు సూడాల నా కస్టాలు...పగోడికి కూడా వద్దు.ఎప్పట్లాగే ఆ రోజు కూడా స్కూలుకి లేటుగా పోయిండాను. గేటుకాడ క్రిష్ణమూర్తి సారు ఇంత పొడుగు బెత్తం పట్టుకుని నిలుసుండాడు. నా కత ముగిసిపోయెరా నాయనా అనుకుంటూ గేటుకాడ నిలుచున్నా. సారు నన్ను చూసి "ఏమలే...పొట్టోడా...మళ్లీ లేటా? ఉండు మీ నాన్నని పిలుస్తా'అంటుంటే నా గుండె డబడబా కొట్టుకుంది. అసలే లేటు వచ్చిండాను...ఎట్టా సచ్చేదిరా దేవుడా అనుకుంటూనే లేద్సార్ ఇంక లేటు రాను అని దాదాపు ఏడుపు గొంతుతో అంటుంటే...అటుగా వీరబద్రగౌడు సారు వచ్చిండాడు. ఆయప్ప రావడం రావడంతోనే నా నిక్కర్నే చూసిండాడు. ఇంక నా పని అయిపోయా...అసలే ఓ దిక్కు లేటయ్యిండాదని హెడ్మాస్టరు బెత్తం ఊపుతుంటే...ఈ సారు కొత్త పురాణం ఎత్తుకునిండాడు. “ఏరా ఆ నిక్కరేసుకునిండావు...మీ నాయన నిక్కరు కొనిపించలేదా...పుసాటుకొచ్చిండాదని ఏసేసుకు నేదనా..' అంటూ తిట్టడం మొదలెట్టాడు. చిన్న పిల్లోణ్ని పట్టుకుని ఇద్దరు పెద్దసార్లు ఒకేసారి అల్లాడి స్తుంటే ఎట్టా ఉంటుంది?థూ...ఏందిరా నా బతుకు ఇట్టాగై పోయిండాది. అందరూ నన్నాడించేటోళ్లే అనుకున్నానా...కళ్లెంబడి నీళ్లు బరబరా వచ్చేసిండాయి. పాపం వీరబద్రగౌడు సారుక్కూడా జాలేసిందేమో...ఊ ఏడ్చింది చాలుగానీ...క్లాసుకెళ్లు. ఇంకోసారి ఈ నిక్కరేసుకుని వస్తే , ఈడే ఇప్పుకొని పంపుతా అర్థమయిండాదా? అంటుంటే తలాడించి క్లాసుకు ఉరుకో ఉరుకు!!

అసలు నేను ఎన్ సీసీ నిక్కరు ఎందుకేసుకోవాల్సి వచ్చిందో చెప్పాలి. అదేం దరిద్రమో నాకు ఎప్పుడూ బట్టలు చాలా కాలం మన్నిక వచ్చేవి కావు. పాపం నాన్న ఎన్ని నిక్కర్లు, షర్టులు కుట్టించినా, రెండుమూడు నెలలకే అవి చిరిగిపోయేవి. అదీ సరిగ్గా పిర్రలమీదే చిరిగేది. బట్టలో నాణ్యత లేదని కాదు. మన వాడకం అంత గొప్పగా ఉండేది. అందుకే నిక్కరు వేసుకున్న నెల్నాళ్లకే వెనకాల చిరుగు కనిపించేది. అక్కడికీ అమ్మ నానా తిప్పలుపడి కుట్లు వేసేది. కానీ అవి నిలిస్తేగా. నిక్కరు ముందు గుండీలు కూడా ఊడిపోయేవి. అమ్మ పిన్నీసుతో ఎలాగోలా కుస్తీపడి సర్దేది. కానీ వెనక చిరుగులు ఎలా కప్పాలి. ఇలాంటి సమయంలోనే ఎన్ సీసీ నిక్కర్లు వచ్చిపడ్డాయి. అవికూడా నిక్కర్లే కదా అని వేసుకునేవాణ్ని. కానీ ఇంత రాద్ధాంతం అవుతుందనుకోలేదు. సారు ఎప్పుడు వార్నింగు ఇస్తున్నా...అది నా గురించే అనిపించేది. ఎందుకంటే మా బ్యాచిలో ఎక్కువసార్లు ఖాకీ నిక్కరు వేసుకుంటుండేది నేనే! అయినా తప్పేముంది? అది కూడా నిక్కరే కదా! బట్టలుండేవే వేసుకునేకి కదా అని నా పాయింటు. దానికింత కట్ నీట్ రూళ్లు ఎందుకో నాకు అర్థమయ్యేది కాదు. నిక్కర్లు లేవు అన్నప్పుడల్లా నాన్న గయ్ అంటూ అరిచేవాడు. మొన్ననే కదా కుట్టించింది. అప్పుడే ఏమొచ్చింది. అయిన అంత త్వరగా ఎట్లా చినిగిపోతుంది? రేయ్ సరిగ్గా ఆ పిర్రలపైనే ఎందుకు చినుగుతాయిరా... అక్కడేమైనా కత్తెర్లున్నాయా?టార్పాలతో కుట్టించినా చించుకుంటావేమో'అంటుంటే...ఏం చెబుతాం, నోర్మూసుకోవడం తప్ప. చినిగిపోయిన...పోతున్న వాటి మధ్య కాస్త బాగున్న నిక్కర్లు ఇవే కావడంతో...గత్యంతరం లేకుండా వేసుకోవాల్సి వచ్చేది. ఇంతకూ నిక్కర్లు ఎందుకు పర్రుమంటు న్నాయంటే...ఏరోజూ మట్టిలో దొర్లకుండా...పార్కులో జారుబండపై జారకుండా ఇంటికొచ్చింది లేదుకదా. మరి ఎట్టా చినగకుండా ఉంటాయి? ఇదేమో ఇంట్లోవాళ్లకి అర్థం కాదు...ఎన్ సీసీ నిక్కర్లేసిండావని అరిసే సారుకూ అర్థం కాదు.

ఎన్ సీసీ క్యాంపు కింద ఓసారి రణ్మండల ఆంజనేయసామి కొండకి తీసుకెళ్లారు. కొండకు అనగానే మాకు ఎక్కడ్లేని కుషీ! అందరం కొండకింద చేరుకునిండాము. వీరబద్రగౌడు సారు మమ్మల్ని వరసగా నిలబెట్టి...”రేయ్...సక్కగా చేసుకోండి. ఆడ కొండపైన ఏవేవో ఉండాయి. మీరు ఈడ నుంచే వాటిని చూస్కొని గుర్తుపట్టి చెప్పాల తెల్సిందా...అనగానే ఉత్సాహంగా ఎస్సార్ గాఠిగా కేకలు. ఇంక ఒక్కొక్కడు ఇంతింత గుడ్లువేసుకుని కొండపై చూస్తూ...బాగా కనిపించిన వారిని గుర్తుపడుతూ సారుకు చెప్పేవాళ్లం. అంటే ఇది మా కండ్లు సరిగ్గా ఉండాయా లేవా అని తెలుసుకునే పరీక్ష!రేప్పొద్దున్న మిలటరీకి పోతే ఆడ శత్రువులు ఎంత దూరమున్నా గుర్తు పట్టాల కదా...అందుకే ఇది.మా ఖర్మ కాకపోతే సక్కగా లెఫ్ట్ రైట్ కొట్టేకి లేదు...మిలటరీ దాకా కత పోతుండాది. అనుకుంటూనే నవ్వు వచ్చేది. మా ఎదవ ఆలోచనలు సారుకి తెలిసేది కాదు కాబట్టి బతికిపోయిండాము. ఇట్టా అనుకుంటుం డామని ఆయప్పకి తెలిస్తే ఇంక మా పని కల్కూర హోటల్ చట్నీయే! ఇదంతా అయిపోయినాంక తిండి పెట్టేవాళ్లు. అప్పటికే సుస్తయిపోయిన మేము పార్శిలు చూడగానే పైనపడి క్కునేవాళ్లం. అప్పుడు గన్క ఎవరైనా సూస్తే...పాపం ఏ ఎడారి నుండి వచ్చిండారో ఈళ్లు...ఎన్ని రోజులయ్యిండాదో తిని..అనుకునే వాళ్లేమో! రాన్రానూ మా బేటరీ డౌన్ అయిపోయిండాది. కానీ ఏమాత్రం తగ్గకుండా నిక్కర్లకు గంజీ పట్టి...చెంబు ఇస్త్రీ పెట్టి...నానా తిప్పలు పడిన నాగేషు,సురేషు లాంటోళ్లకి సర్టిపికెట్లు వచ్చిండాయి. మా పిలగాళ్లలో ఒకడు..రేయ్ సూసిండావా వారికి సర్టిపికెట్లు ఇచ్చిండారంట..అంటుంటే "ఎవడికి బేకురా...ఆ సర్టిఫికేటు..నిర్లక్ష్యంగా మా సమాధానం. చేతకాలేదని ఒప్పుకోడానికి షరమ్ అడ్డొస్తాది కదా అందుకే! పెద్దయ్యాక మాలో మోహన్ గాడే ఆర్మీకి వెళ్లినాడు.వాడు తప్పించి మాలో ఒక్కడూ ఎన్ సీసీ వల్ల అదనంగా ప్రయోజనం పొందలేదు...ఇలా అనుకుంటేనే కుషీగా ఉండేది. ఒకటి మాత్రం నిజం నాలాంటి గాలిబ్యాచోళ్లు కొందరు మాత్రం ఎన్ సీసీలో చేరుకునిండేదే ఇడ్లీ వడ కోసం అన్నది దేవుడి పెమానంగా సత్యం...సత్యం...అంతే!!

బడివారం-వగలు, పజీతి-కష్టం, బేకులేదు-అక్కర్లేదు, హణేబారం-తలరాత, కడక్-కచ్చితంగా

మరిన్ని కథలు

Kya huvaa
క్యా హువా
- కె. తేజస్వని
Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు