విశ్వాసం - దాసరి వెంకట రమణ

vishvasam

"మీరు ఎం చేస్తారో నాకు తెలియదు. ప్రభుత్వ బడులు మూత పడగూడదు. హాజరు పెరుగాలి. డ్రాప్ అవుట్స్ తగ్గాలి. వూళ్ళో ఉన్న పిల్లలందరూ మీ బళ్లోనే చదవాలి. ఉత్తీర్ణత శాతం పెరగాలి....." జిల్లా విద్యా శాఖాధికారి అలా చెప్పుకుంటూ పోతూనే వున్నాడు. ఆ సమావేశానికి వచ్చిన ప్రధానోపాద్యాయులందరూ శ్రద్ధగా వింటూనే వున్నారు. చివరికి విద్యాశాఖాధికారి "ప్రజల ముందు, ప్రభుత్వం దగ్గర మన పరువు పోతోంది. దానిని నిలబెట్టే బాధ్యత మీదే!" అంటూ ముగించాడు.

ప్రధానోపాధ్యాయుడు తిరిగి వచ్చాక బడిలో ఉపాధ్యాయులను అందరినీ సమావేశపరిచి, వివరాలు అన్నీ తెలియజేసి, ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించి తక్షణమే దానిని అమలులో పెట్టాడు.

ఒక నెల రోజులలో పాఠశాల రూపురేఖలు మారిపోయాయి. పరిసరాలన్నీ శుభ్రం చేశారు. మొక్కలు నాటారు. మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు. రంగులు వేయించారు. బడి ఎగవేస్తున్న పిల్లలను గుర్తించి, వాళ్ళ తల్లితండ్రులతో మాట్లాడి వాళ్ళు చెప్పే సమస్యలు విని తమకు తోచిన పరిష్కారాలు సూచించారు. బోధనా ప్రమాణాలు పెరిగాయి. తమ వూరి బడిలో వచ్చిన మార్పుకు వూళ్ళో వాళ్ళంతా చాలా ఆశ్చర్య పోయారు.

ఆ తర్వాత ప్రణాళికలో భాగంగా గ్రామంలో ప్రభుత్వ బడిలో కాకుండా యాజమాన్య బడిలో చదువుతున్న పిల్లల వివరాలు సేకరించి, వాళ్ళ తలిదండ్రులతో మాట్లాడి వాళ్ళను తిరిగి ప్రభుత్వ బడిలో చేర్పించే ప్రయత్నాలు మొదలయ్యాయి. ప్రతిరోజూ బడి వదలగానే ఒక గంట ఇందుకోసం కేటాయించి ప్రత్యేకమైన శ్రద్ధతో ఆ పని చేస్తున్నారు. అందులో నరేంద్ర అనే ఉపాధ్యాయునికి ఒకరోజు ఊహించని అనుభవం ఎదురయింది.

నరేంద్ర తను చేయవలసిన పనిలో భాగంగా ఒక ఇంటికి వెళ్లి ఆ వూరికి దూరంగా యాజమాన్య బడిలో చదువుతున్న పిల్లవాడి తల్లిదండ్రులతో మాట్లాడి, వాళ్ళ పిల్లవాడిని యాజమాన్య బడి మాన్పించి ప్రభుత్వ బడిలో చేర్పిస్తే కలిగే సదుపాయాలూ వివరించి, నిదానంగా వాళ్లకు నచ్చజెప్పి వాళ్ళ పిల్లవాడిని ప్రభుత్వ బడిలో చేర్పించడానికి ఒప్పించాడు. అంతలో బయటికి వెళ్ళిన ఆ పిల్లవాడి తాత ఇంటికి తిరిగి వచ్చాడు. జరిగిన సంగతి విని, నరేంద్రతో మాటలు కలిపాడు. వూరి ప్రభుత్వ బడిలో వచ్చిన మార్పులకు చాలా హర్షం వ్యక్తం చేశాడు. నరేందర్ చాలా ఉల్లాసంగా ఆయనతో కబుర్లు చెప్పసాగాడు. అంతలో ఆయన నరేంద్ర పిల్లలు ఎక్కడ వున్నారు ఎం చదువుతున్నారు వంటి వ్యక్తిగత వివరాలు అడిగాడు. నరేందర్ రెట్టించిన ఉత్సాహంతో చెప్పుకొచ్చాడు. తమ పిల్లలు చాలా తెలివైన వాళ్ళని వాళ్ళు నగరంలో అంతర్జాతీయ పాఠశాలలో చదువుతున్నారని, ఎప్పుడూ మొదటి స్థానంలో ఉంటారని ఇంకా తమ పిల్లల ప్రతిభకు సంబంధించి వింత వింత విశేషాలన్నీ చెప్పసాగాడు.

పిల్లవాడి తాత అన్నీ శ్రద్ధగా విని మాటల సందర్భాన్ని మార్చి తన చిన్నప్పుడు ఆ వూళ్ళో జరిగిన ఒక సంఘటన చెప్పుకొచ్చాడు: 'నా చిన్నప్పుడు రెండేళ్ళు వరుసగా వర్షాలు పడక ఈ వూళ్ళో చాలా పెద్ద కరువు వచ్చింది. అప్పుడు ఒక పెద్ద శాస్త్రవేత్త వూరికి దూరంగా వున్న గుట్టమీద ఒక యజ్ఞం చేస్తే వెంటనే విపరీతంగా వర్షాలు పడతాయని చెప్పాడు. ఊరిపెద్ద యజ్ఞానికి అన్ని ఏర్పాట్లు చేశాడు. జనం తండోపతండాలుగా వెళ్తున్నారు. నేను కూడా ఒక గొడుగు తీసుకొని బయలుదేరాను. నా చంకలో గొడుగు చూసి ఊరి పెద్ద "అదేమిటోయ్! వాన ఏమీ రావడం లేదు కదా! చంకలో ఆ గొడుగెందుకు?" అని అడిగాడు. "అదేమిటి మనం యజ్ఞం చేయడానికి వెళ్తున్నాం కదా! వచ్చేటప్పుడు వర్షం పడితే తడవాల్సి వస్తుందనీ..." అంటూ నసిగాను.

దానికి ఊరి పెద్ద పెద్దగా నవ్వి" బాగుందిరా నీ యవ్వారం మనం ఆ కొండమీదకు వెళ్ళడం, యజ్ఞం చేయడం, వర్షం రావడం .... భలే వుంది ..భలే వుంది ఇదంతా జరిగే పనేనా?"అంటూ చాలా ఎగతాళిగా నవ్వాడు. అప్పుడు నేను "మరి అంతమాత్రానికి అంత దూరం పోయి యజ్ఞం చేయడం ఎందుకు?" అని అడిగాను. ఊరి పెద్ద టక్కున ఆగిపోయి నాకు జవాబు చెప్పలేక ముందుకు వెళ్ళిపోయాడు.'

తాత చెప్పడం ఆపి నరేంద్ర వంక చూసి "ఇదంతా నేను ఎందుకు చెప్పానో నీకేమయినా అర్థమైందా?" అని అడిగాడు. నరేంద్రకు చూచాయగా అర్థమైంది. అతను లేచి నిలబడ్డాడు. "వాస్తవానికి ఇది నేను చిన్నప్పుడు చదివిన కథ. నీకు బాగా అర్థం అవడానికి మా వూళ్ళో జరిగినట్టుగా చెప్పా. చూడు! మనిషికి చేసే పని మీద విశ్వాసం ఉన్నప్పుడే ఆ పని సమర్థవంతంగా చేయగలుగుతాడు. మీ ప్రభుత్వ బడి గురించి ఓ.. ఇంత పొడుగు చెప్పావు కదా! మీ బడి సామర్థ్యం మీద మీకు విశ్వాసం ఉంటే, మీ పిల్లలను తీసుకొచ్చి చేర్పించు ఆ మరునాటి నుండి నా మనుమడు మీ బడికి వస్తాడు."

మరిన్ని కథలు

Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న
ఓ breaking news
ఓ బ్రేకింగ్ న్యూస్
- బివిడి ప్రసాద రావు
chettu baadha
చెట్టు బాధ
- లక్ష్మీ కుమారి.సి