ఆనందానికి ఆవలి అంచు - తిరుమలశ్రీ

anandaaniki aavali anchu

ఉదయం నిద్రలేవగానే అద్దంలో ముఖం చూసుకోవడం అలవాటు నాకు. అది ఇప్పటి అలవాటు కాదు. చిన్నప్పట్నుంచీ వస్తూన్నది. నాతోపాటే పెరిగి పెద్దదయినది.

ఆ రోజు నిద్రలేచి బద్ధకంగా ఒళ్ళు విరుచుకుంటూ అద్దం వద్దకు నడిచాను. అద్దంలోకి యథాలాపంగా చూపులు సారించిన నేను పక్కలో బాంబు ప్రేలినట్టు అదిరిపడ్డాను.

ఓ వికృతాకారం!... అద్దంలో!!

భయంతో కెవ్వున అరచి వెనక్కి గెంతాను.

అదురుతూన్న గుండెను చిక్కబట్టుకుని బెదురుతూనే మళ్ళీ అద్దంలోకి వీక్షించాను.

ఆ వికృతాకారం నా వంకే చూస్తోంది! తీక్ష్ణంగా.

చటుక్కున వెనక్కి చూసాను. నా వెనుక ఎవరూ లేరు!

మళ్ళీ అద్దం వైపు భయం భయంగా చూసాను. ఆ ఆకారం నన్ను చూసి వికృతంగా నవ్వుతున్నట్లనిపించింది. ధైర్యం కూడగట్టుకుంటూ పరీక్షగా చూసాను...

అష్ట వంకర్లు తిరిగిన వదనం... కనురెప్పలు లేవు... కళ్ళు లోతుకు పోయి కనుగ్రుడ్లు బయటకు పొడుచుకు వచ్చాయి... ముక్కు డొల్లగా ఉంది.... చెవులు గ్రహణపు మొర్రుల్లా, ఎలుకలు కొరికేసినట్లున్నాయి... పెదవులు చెదలు తినేసినట్టు బొల్లి బొల్లిగా ఉన్నాయి... పళ్ళు ఉన్నాయో లేవో తెలియడంలేదు... చెంపలు తెల్లగా పాలిపోయి చప్పిదవడలు పడ్డాయి... నెత్తి మీది జుత్తంతా ఊడిపోయి, తలపైన గతుకుల బాటలా ఉంది... శుష్కించిన దేహంతో ఆపాదమస్తకం కృత్రిమంగా తోచింది ఆ ఆకారం...

సందేహం లేదు. అది...అది...దయ్యం!!

ఆ తలంపు నన్ను ఉలికిపాటుకు గురిచేసింది. భయంతో నా శరీరం మంచుగడ్డలా చల్లబడిపోయింది. ఒక్కో అడుగే వెనక్కి వేసాను.

ఆశ్చర్యం! ఆ ఆకారం కూడా వెనక్కి వెనక్కి నడిచింది, నాతో లయగా. నేను ఏం చేస్తే తానూ అదే చేస్తోంది, నన్ను వెక్కిరిస్తున్నట్టుగా.

అదిగో, అప్పుడే హఠాత్తుగా స్ఫురించింది నాకు - అది...అది...నా ప్రతిబింబమేనన్న నిజం!

వాస్తవం వెన్నుదట్టడంతో నా గుండె ఝళ్ళుమంది.

పాతికేళ్ళ యువకుణ్ణి నేను. ’నెక్స్ట్ ఎక్స్’ తరానికి వారసుణ్ణి. తెల్లగా, హ్యాండ్సమ్ గా ఉంటాను. ముఖ్యంగా, నా వదనం - నా ఎసెట్. అది నేను అనుకుంటూన్న మాట కాదు. నన్ను చూసినవారెవరైనా సరే ఒప్పుకుని తీరవలసిన సత్యం. ’సోగ్గాడు’ శోభన్ బాబు ముఖ వర్చస్సు, ఎ. ఎన్నార్. గ్రేసూ నా సొంతమంటారు నా మిత్రులు... అందుకే నా సుందర వదనమంటే మిక్కిలి మక్కువ, కించిత్తు గర్వమూను నాకు. ఆడవాళ్ళలా తరచు నా రూపం అద్దంలో చూసుకోవడం హాబీ అయిపోయింది.

ఇంజనీరింగ్ పాసయ్యి క్యాంపస్ సెలెక్షన్ ద్వారా ఓ ఎమ్మెన్సీలో చక్కటి ఉద్యోగం సంపాదించుకున్నాను. జీతం నెలకు యాభై వేల పైచిలుకే. చింతలేని జీవితం. త్వరలో ఓ ఇంతి చేతిని పట్టుకుని ఓ ఇంటివాణ్ణి కావాలన్న ఆలోచన కూడా.

అటువంటిది, ఆ రోజు నిద్ర లేచేసరికి నా రూపం హఠాత్తుగా అలా వికృతంగా మారిపోవడం...!?

అంతా అయోమయంగా ఉంది నాకు. ఓవర్ నైట్ నాకు ఏం జరిగిందో బోధపడలేదు.

ఇప్పుడు నా వికృత రూపాన్ని బయటి ప్రపంచానికి ఎలా చూపించేది? జుగుప్సాకరంగా ఉన్న నా వదనం నన్నే భయపెడుతూంటే, ఇక ఒరుల మాటేమిటి!?

డోర్ బెల్ మ్రోగడంతో అనాలోచితంగానే వెళ్ళి తలుపు తెరిచాను.

వచ్చింది పనిమనిషి రత్తాలు. నా ముఖంలోకి చూడగానే భయంతో ’కెవ్వు’న అరచి స్పృహతప్పి పడిపోయింది.

ఆ తరువాత న్యూస్ పేపర్ బాయ్... పాలవాడు... అందరిదీ అదే గతి!

ఈ మధ్య అమ్మాయిలు కొందరు వాతావరణ కాలుష్యానికి భయపడి కాబోలు, టెర్రరిస్టుల్లా ముఖమంతా ’బ్యాండేజ్’ కట్టుకున్నట్టు, ముసుగుతో టైట్ గా బిగించుకోవడం కద్దు. కన్నులు, నాసికా రంధ్రాలు(?) తప్ప మరే భాగమూ కనిపించదు. అది గుర్తుకు వచ్చింది నాకు. అదే పద్ధతిలో ముఖానికి పట్టీ కట్టుకుని, అర్జెంటుగా డాక్టర్ వద్దకు పరుగెత్తాను.

అలాంటి వికృత రూపాలను రోజూ చూస్తూ ఉంటాడో ఏమో, డాక్టర్ జడుసుకోలేదు. నన్ను పరీక్షించి పెదవి విరిచేసాడు.

"అలవికాని ఆనందం కోసం అర్రులు చాస్తే కలిగే పర్యవసానమే ఇది. మత్తులో జోగినంతసేపూ అది తెచ్చే విపత్తు ఆకళింపుకాదు. మాదక ద్రవ్యాల వల్ల పొందే ఆనందానికీ ఆవలి అంచున పొంచియున్న ఆపదను పసిగట్టలేకపోవడం మిక్కిలి దురదృష్టకరం... నౌ ఇటీజ్ టూ లేట్" అన్నాడు డాక్టర్.

కొయ్యబారిపోయాను నేను.

"ఇప్పుడు నువ్వు ఉన్నది మిడ్డిల్ స్టేజ్. ఫిజికల్ ఇరోజన్. మరి కొన్నాళ్ళలో నీ మెదడు అఫెక్ట్ అవుతుంది. పిచ్చివాడివయిపోతావు. ఓసారి పాయింటాఫ్ నో రిటర్న్ కి చేరుకుంటే... నేరాలు, ఘోరాలకు పాల్పడడానికి కూడా వెనుదీయవు," మళ్ళీ అన్నాడు డాక్టర్, మేటరాఫ్ ఫ్యాక్ట్ గా.

విషయం బుర్రలో సింక్ అవడంతో, "నో...!" అంటూ పెద్దగా అరచాను...

"బాబుగారూ...బాబుగారూ...!" అన్న పిలుపుతో, చటుక్కున కళ్ళు తెరచాను.

ఎదురుగా డాక్టర్ - కాదు, రత్తాలు. రోజూ ఉదయమే వచ్చి ఇల్లు ఊడ్చి శుభ్రం చేసి వెళ్ళే పనిమనిషి. నలభై ఏళ్ళుంటాయి.

"అలా అరిచేవేంటి బాబూ? నా గుండె అవిసిపోయినాదనుకో. ఏమయినాదేంటి?" సాశ్చర్యంగా అడిగింది రత్తాలు. "మాయదారి పీడకలేదైనా ఒచ్చిందేటీ?"

’పీడకలా!?’ విస్తుపోతూ చుట్టూ పరికించాను. గదిలో బెడ్ మీద ఉన్నాను.

నేను సమాధానం ఇవ్వకపోవడంతో, "ముదనష్టపు పీడకలేదో ఒచ్చేసుంటాది బాబుకు. అందుకే అంత పెద్దగా అరిసేసినాడు" అనుకుంటూ గదిలోంచి వెళ్ళిపోయింది రత్తాలు.

ఛంగున బెడ్ మీంచి క్రిందకు ఉరికి డ్రెస్సింగ్ మిర్రర్ వద్దకు పరుగెత్తాను.

అద్దంలో నన్ను గ్రీట్ చేసింది వికృత వదనం కాదు - నాసుందర వదనం!

తేలికగా ఊపిరి పీల్చుకుని, హుషారుగా ఈల వేసాను.

తెల్లవారు ఝామున వచ్చిన ఆ కలనే నెమరువేసుకుంటూ... అంత పెద్ద కల్ల, కల రూపంలో నన్ను కలతపెట్టాడానికి హేతువేమిటా అనుకుని ఆలోచనలో పడిపోయాను. అప్పుడు మెరిసింది నా బుర్రలో ఫ్లాష్...

ఆ రోజు విక్రమ్ బర్త్ డే. సంపన్నుల ఏకైక పుత్ర రత్నం అతను. మోడర్న్ గై. బాగా ఖర్చుపెడతాడు. అందుకే, బెల్లం చుట్టూ చీమల్లా, ఎప్పుడూ పదిమంది స్నేహితులు అతని వెంట ఉంటారు. పార్టీలకు, పబ్ లకూ తిరుగుతూంటారు.

మందు పార్టీలు, పబ్ లకు నాకు చుక్కెదురు. గొంతు తడిపే ’చుక్కే’ కాదు, మదిని కుదిపే ’చుక్క’ లన్నా ఆమడ దూరంలో ఉంటాను. బీరకాయలు తప్ప ’బీర్’ కాయల్ని ఎరుగని వాణ్ణి. మోడర్నిజం పేరిట సాగే మాడ్ నెస్సూ, మ్యాడ్ నెస్సూ నాకు కిట్టవు. అటువంటి వాటికి ఆమడ దూరంలో ఉంటాను. స్నేహితులు, కొలీగ్సూ హేళన చేస్తున్నా సరే.

విక్రమ్ కి ఊరి బయట ద్రాక్ష తోటల దగ్గర గెస్ట్ హౌస్ ఒకటి ఉంది. పుట్టినరోజు సందర్భంగా కొలీగ్స్ కీ, క్లోజ్ ఫ్రెండ్స్ కీ ఆ రోజు రాత్రి అక్కడ స్పెషల్ పార్టీ ఏర్పాటుచేసాడు అతను. దాన్ని తలచుకుని అంతా హుషారుగా ఉంటే, నేను మాత్రం ఆ పార్టీకి రావడంలేదని చెప్పేసాను.

"నథింగ్ డూయింగ్. ఇది రొటీన్ బీర్ పార్టీ, ఛీర్ పార్టీ కాదు. అమరలోకాలలో తేలియాడించే అద్భుతమైన రేవ్ పార్టీ. ఎ రేర్ పార్టీ. ఎప్పుడో ఒకసారి చవిచూసినంతలో చెడిపోరు ఎవరూను. రేవ్ పార్టీలకు రెగ్యులర్ని నేను. అడిక్ట్ నయిపోయానా? లైఫ్ లో ఇటువంటి చిన్న చిన్న ఎంజాయ్ మెంట్సు కూడా మిస్ ఐతే...ఈ బ్రతుకెందుకు? ఈ సంపాదన ఎందుకు? కాలంతోపాటు మారాలి భాయ్... రాత్రి పార్టీకి అమ్మాయిలు కూడా వస్తున్నారు. నువ్వూ వస్తున్నావు!" అంటూ బలవంతం చేసాడు విక్రమ్.

మరీ మూర్ఖంగా కాదనలేని పరిస్థితి నాది. కారణం, విక్రమ్ నా ప్రాజెక్ట్ మేనేజర్ కూడాను. అతన్ని ఎంటాగనైజ్ చేయడం కేరీర్ దృష్ట్యా తెలివైనపని కాదు మరి...

గత రాత్రి దాని గురించే తీవ్రంగా ఆలోచిస్తూ పడుకున్నందువల్ల కాబోలు, ఆ కల వచ్చుంటుంది నాకు.

ఆధునికత పేరిట పాశ్చాత్యుల్ని చూసి వాతలు పెట్టుకునే సంస్కారాన్ని సంతరించుకున్న ద సో కాల్డ్ మోడర్న్ సొసైటీ - కమ్యూనిటీ గేదరింగ్స్ నుండి పబ్ కల్చర్ కి ఎదిగి... టీ పార్టీల స్థానంలో ’మందు’ పార్టీలను ఫ్యాషన్ గా చేసుకుంటే... ఇంకా ఏదో కావాలని అర్రులు చాచుతూ ’రేవ్’ పార్టీలకు తెర ఎత్తి మత్తులో జోగుతూ ఇల్లు, ఒళ్ళు గుల్ల చేసుకుంటూ... చదివిన చదువును, బంగారు భవిష్యత్తును, విలువైన జీవితాన్నీ బండలు చేసుకుంటోంది నేటి యువత. ’రేవ్’ పార్టీలు తమ ’గ్రేవ్’ కి మార్గాలని గుర్తించలేకపోతోంది. అదే గొప్ప కల్చర్ అని భ్రమపడుతోంది. అదే జీవిత పరమావధిగా బ్రాంతి చెందుతోంది.

సమాజంలో నానాటికీ పేరుకుపోతూన్న స్వార్థం... ప్రపంచీకరణ పేరిట కుదించుకుపోతూన్న ప్రపంచం... మెరుగైన ఆర్థిక పరిస్థితి... శృంఖలాలు త్రెంచుకున్న వ్యక్తి స్వాతంత్ర్యం... వెరసి సంస్కృతి సంకరానికి, జాతి పతనానికి దారి తీస్తున్నాయి. ఈ పోకడ మున్ముందు ఎటువంటి విపత్కర పరిణామాలకు దారి తీస్తుందోనన్న తలంపే భయం గొలుపుతోంది.

అమాయకపు కళాశాల విద్యార్థులే కాక పలు రంగాలకు చెందిన ప్రముఖులు, విద్యాధికులు సైతం బలహీనతకు లోనై మాదకద్రవ్యాలు అందించే తాత్కాలికపు ఉపశమనానికి, ఆనందానికి దీపపు పురుగుల్లా ఆకర్షితులై జీవితాలు నాశనం చేసుకోవడం మిక్కిలి దురదృష్టకరమైన పరిణామం...

ఇలాంటి ఊహలెన్నో నా మదిని ఒక్కుమ్మడిగా ముసురుకున్నాయి. మొహమాటానికి పోతే ఏదో అయినట్లు, ఆ పార్టీలో పాలు పంచుకోవడం వల్ల వాటిల్లే ప్రమాదం ఏమిటో భగవంతుడు ఆ కల రూపంలో నన్ను హెచ్చరించాడనిపించింది. వ్యసనాలన్నీ ’జస్ట్ ఫర్ కంపెనీ’ కి గానో, కుతూహలంతోనో ఆరంభం కావడం కద్దు, సాధారణంగా. విక్రమ్ కోసం నేను ఆ రేవ్ పార్టీలో పాల్గొంటే, రేపు దాని టెమ్టేషన్ కి నేను లొంగిపోనన్న హామీ ఏమిటి? అందమైన నా రూపం కలలోలా జుగుప్సాకరంగా, వికృతంగా మారడం నాకు ఇష్టం లేదు. పిచ్చాసుపత్రి పాలు అవ్వాలనీ లేదు. క్షణికపు ఆనందం కోసం జీవితాన్ని బలి చేసుకోవడం అవివేకమే అవుతుంది...

హఠాత్తుగా నా సెల్ ఫోన్ మ్రోగింది. లైన్లో విక్రమ్.

"సత్తీ! రాత్రి పార్టీకి నువ్వు తప్పక రావాలి సుమా! నువ్వు ఫెన్స్ సిట్టర్ వని తెలిసే మళ్ళీ ఫోన్ చేస్తున్నాను నీకు" అన్నాడు.

అప్పటికే ఓ దృఢ నిశ్చయానికి వచ్చిన నేను, "సారీ, విక్రమ్! రాత్రి నుండీ హై టెంపరేచర్ నాకు. పార్టీకి రావడంలేదు," అనేసి, మారు మాటకు తావివ్వకుండా ఫోన్ కట్ చేసేసాను.

ఇప్పుడు నా మనసు తేలికపడింది.

మరిన్ని కథలు

Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు
Sundari maarindi
సుందరి మారింది
- జి.ఆర్.భాస్కర బాబు