నాన్న నేనిప్పుడే చెబుతున్న ఇవన్నీ నేను పోగేసుకున్న డబ్బులు కార్తీక పౌర్ణమి కి టపాసులు కొనుక్కుంటా , నేనొక్కడినే కాలుస్తా విశ్వధర్ , వాడి వయస్సు పది సంవత్సరాలు, మహా పొదుపరి, వాడు దేనికోసం పని మొదలుపెట్టాడో అది అయ్యేవరకు వదలకుండా పట్టు పట్టే మొండి వాడు , అలా అని అల్లరివాడు కాదు, ఆలోచన పరుడు అన్ని ఆలోచించి నిర్ణయించుకుంటాడు, కానీ మొండి వాడు మొన్న దీపావళి రోజున టపాసులు కావాలని బాధ పడితే అది చూడలేక ఫ్రెండ్ దగ్గిర అప్పు చేసి మరి వాడి కోరిక తీర్చాను, దీపావళి రోజు వాడికి అత్తయ్యలు , మామయ్యలు, వరసకి బంధువులు ఇనాము గా ఇచ్చిన డబ్బులు దాచుకుని మళ్ళి ఈ రోజు ఆ డబ్బుల్ని తగలెయ్యాలని పట్టుకుకూర్చున్నాడు .
*******************************************
కార్తీక పౌర్ణమి , ఈ రోజు పొద్దున్న వాడి ఇనాము మనీ జేబులో పెట్టుకుని ఎదురుచూస్తున్నాడు , టపాసులు ఎప్పుడు కొనుక్కుందాం , ఎప్పుడు కాలుద్దాం అని , " నాన్న ఉదయం తొమ్మిదింటికి షాపుకి వెళ్లి టపాసులు కొనుక్కుందాం అన్నావుకదా , తొమ్మిదయింది పదా " వాడి కోరిక నాకు తీర్చాలని లేదు , అనవసరం అనిపించింది , కానీ వాడిని కోపగిస్తే చిన్న మనసు బాధ పడతాడేమో నని . . . . . .
" పదా డాడీ " వాడి పిలుపుతో ఆలోచనలోంచి తేరుకున్నాను , ఇక వాడు ఆగడని అర్థమైంది , ఇద్దరం స్కూటర్ పైన బయలుదేరాం . వెళుతుంటే దారి లో ఒక అనాధ బాలల ఆశ్రమ నిర్వాహకులు అనాధ పిల్లలని ఒక ఇరవై మంది వరకు ఉంటారు, పోగేసుకుని ప్రార్థన గీతాలు ఆలపిస్తూ వారి అనాధ జీవితాన్ని వర్ణించే గీతాలు పాడుతూ చందాలు పోగేసుకుంటూ వెళ్తున్నారు, దారిన వెళ్లే వారు కొంతమంది అదేదో వింత చూస్తున్నట్లు , కొంత మంది పట్టనట్లు, కొంత మంది తోచిన విధంగా డబ్బు సాయం అందిస్తూ ఉన్నారు.
ఈ దృశ్యం మా వాడి కంట పడింది, ఇది వాడికి కొత్త సంఘటన ఇప్పటివరకు చూసి ఉండక పోవడం వల్ల అదే పనిగా వారినే చూస్తూ ఉండి పోయాడు, మేము అనాధ పిల్లల గుంపుని దాటి ముందుకు సాగి పోతున్నాం, "నాన్న" కొంచెం గంభీరంగా పిలిచాడు, నాకు కొత్తగా ఉందా పిలుపు , ఏంటి నాన్న ? అన్నాను , ఇందాక ఆ పిల్లలు పాటలు పాడుతూ చెందాలు పోగేస్తున్నారు కదా ,ఎందుకలాగా, వారికి అమ్మ నాన్నలు లేరా ? మరి వారిని ఎవరు . . . . . . . . ఆగాడు , వాడి సందేహం నాకు అర్థం అయింది .
ఇప్పుడు వాడు పూర్తి వివరాలు తెలిసే వరకు వదలడు నాకు తెలుసు, స్కూటర్ ముందుకి సాగుతూనే ఉంది , నేను కొనసాగించాను, ఏమి లేదురా ,
తల్లి తండ్రులు చనిపోయిన వారిని, తమ తప్పుల్ని పిల్లల రూపం లో వదిలించుకుని వెళ్లిన పిల్లల్ని , తప్పి పోయిన పిల్లల ని , ఆ అనాధాశ్రమం వారు చేరదీసి , వారి బాగోగులు అన్ని పెద్దయ్యే వరకు చూసుకుంటారు, ఆ పిల్లలకి చదువు, బట్టలు, భోజనం , తదితర సౌకర్యాలు కల్పించడానికి డబ్బు కావాలి కదా , పాపం ఆశ్రమం వాళ్ళే అంత డబ్బు ఎక్కడి నుండి తెస్తారు , నీలాగా వాళ్లకి అప్పుతెచ్చి దీపావళికి టపాసులు, కొత్త బట్టలు తెచ్చి పెట్టె తల్లి తండ్రులు లేరు కదా ? అని ఆగాను , వాడి మొఖం లో వింత ఏక్సప్రెషన్ చూసాను , నేను చెప్పిన అనాధ బాలల విషయం , నేను అప్పుచేసి కొన్న టపాసుల విషయం ఒకేసారి బోధ పడ్డట్టుగున్నయ్ వాడికి . . . . . . . ,
కాస్త తట పటాయించి ....... "అందుకే ఇలా చందాలు పోగేసుకుని దయయున్నవారు ఇచ్చిన డబ్బు తో ఆ పిల్లలని సాకుతారు " .. .
నేను చెప్పడం ఆపాను , వాడు ఉకొట్టడం ఆగింది , బండి ముందుకు సాగి పోతుంది, కాసేపు మా మధ్య నిశ్శబ్దం అలుముకుంది. టపాసులు అమ్మే షాప్ ముందు బండి ఆపాను, విశ్వధర్ బండి దిగ లేదు, వాడు ఇంకా అనాధ పిల్లల ఆలోచన లోంచి బయట పడ లేదు , నేను ఎదో అనే లోగానే .. . . . . . . , నాన్న అంటే ఆ పిల్లలకి పండక్కి కొత్త బట్టలు, టపాసులు ,
ఏమి ఉండవు కదా ? నేను ఇంకా ఏమి అనకుండానే , నాన్న మనం అనాధాశ్రమం పిల్లలని చూసాం కదా వాళ్ళ దగ్గరికి వెళదాం , నా డబ్బులు వాళ్లకి ఇచ్చేస్తాను, నేను టపాసులు కాలిస్తే, నేనొక్కడినే కదా సంతోషిస్తాను ,
కానీ ఈ డబ్బు వాళ్లకి డొనేట్ చేస్తే అందరికి ఎంతో కొంత సాయంగా ఉంటుంది కదా వాళ్లంతా సంతోషిస్తారు .విశ్వ మాట్లాడుతుంటే నా నోటా మాట రాలేదు, ఇంత చిన్న వయసులో ఎంత పెద్దగా ఆలోచించావురా అనుకున్నాను మనసులో , మరి ఇన్ని రోజులుగా టపాకాయల కోసం దాచుకున్నావు కదారా డబ్బులు అన్నాను, నన్ను మాట్లాడనివ్వకుండా వాళ్లు వెళ్లి పోతారు నాన్న త్వరగా పదా వాళ్ళని పట్టుకుందాం తొందర పెట్టాడు.
బండి స్టార్ట్ చేసి వేగంగా ఆ గుంపు వెళ్లిన వయిపు సాగాము .
*******************************************
ఉన్న డబ్బంతా అనాధ పిల్లలకు ఇచ్చావు , మరి నీ పరిస్థితి ఏంటిరా ? అడిగాను . "నాకు మీరున్నారు కదా నాన్న , అప్పు చేసైనా మా కోరికలు తీరుస్తారు " .
మరి వాళ్లకు ? అన్నాడు
అప్పుడు వాడి కళ్ళల్లో మెరిసిన మెరుపు ఎన్ని" తారా జువ్వలు" వెలిగించినా రాదేమో ,
వాడి మోము పై విరిసిన కాంతి ఎన్ని కార్తీక దీపాలు వెలిగించినా రాదేమో