కాకి ఘోష - : జీడిగుంట నరసింహ మూర్తి

kaaki ghosha

రాజారావ్ ఈ సారి కూడా నిరుత్సాహ పడ్డాడు. ఒకటా రెండేళ్లా పది సంవత్సరాల నుండి ఇదే తంతు. ఒక్కోసారి అనిపిస్తూ వుంటుంది అతనికి తను నిర్వహించాల్సిన క్రతువు సరిగ్గా చెయ్య లేదేమో నని. లేక పోతే తన మీద చివరి క్షణాల్లో సరిగ్గా చూసుకో లేదని తన తల్లికి కోపంగా వుండి ఆమె ఆత్మ అసంతృప్తితో ఉందేమో. ఇంతకీ రాజారావు పడుతున్న వేదన గురించి వ్రాయలేదు కదూ.

అతను తన తల్లికి ప్రతి సంవత్సరం పెడుతున్న ఆబ్దికాలకు పిండం ముట్టుకోవడానికి ఒక్క సారి కూడా కాకులు రాక పోవడం, అతనికి అసంతృప్తితో పాటు అవమానంగా కూడా అనిపించ సాగింది. అప్పటికీ ఏ ఏటి కా యేడు ఏ లోపం లేకుండా తన అన్నదమ్ములను, అక్క చెల్లెళ్ళను పిలుస్తూనే ఉన్నాడు. బ్రాహ్మణులకు వాళ్ళు అడిగినంత దక్షిణ ముట్ట చెపుతున్నాడు. వేసవి కాలంలో తన తల్లికి ఇష్టమని మామిడి పళ్ళను తెచ్చి భోక్తలకు భోజనంలో వేయిస్తున్నాడు. కనీసం ఎంత లేదన్నా ఆ క్రతువుకు పది వేలకు తక్కువ కాకుండా అవుతోంది. ఇంత చేసినా కూడా పిండం ముట్టుకోవడానికి ఒక్క కాకి కూడా రావడం లేదు.

అప్పటికీ ఒక్కో సంవత్సరం ఆ పిండాన్ని ఒక్కొక్క సోదరుడి చేత కాకికి పెట్టిస్తున్నాడు. అయినా ఒక్క కాకి జాడ లేదు. తల్లికి తన మీద కోపం వుండి ఉంటే వాళ్ళ కోసమైనా రావాలిగా?. చాలా ఇళ్ళల్లో ఆబ్దికాలు సామాన్యంగా పెద్ద కొడుకు ఇంట్లో పెడుతూ ఉంటారు. వాళ్ళు ఈ తంతునంతా భరించ గలిగితే పర్వా లేదు. కొంత మంది ఆర్ధిక ఇబ్బందులు ఉండటం వల్ల సోదరులు ఇద్దరు ముగ్గురు ఉంటే వాళ్ళందరి దగ్గర డబ్బు వసూలు చేసి ఆ క్రతువును ఏ మాత్రం ఆక్షేపణ లేకుండా కానిచ్చేస్తారు.

ఒక సంవత్సరం అనుకోకుండా అన్న గారు ఒంట్లో బాగుండక పెట్టక పోతే ఆ భాద్యత ఇంకొక సోదరుడు తీసుకోవాల్సి వచ్చింది. అతను ఎలాగు నెత్తి మీద వేసుకున్నాం కనుక దాన్ని “ గెట్ టుగెదర్ కం ఆబ్ధికంగా” మార్చేసి దగ్గరి బంధువులను కూడా పిలిచాడు. దాంతో అతని ఖర్చు తడిసి మోపెడంత అయ్యింది. అతని మీద జాలిపడి వచ్చిన సోదరులంతా సమానంగా వేసుకోవాల్సి వచ్చింది. అప్పుడే ఎవరో సరదాగా అన్నారు. “. సెర్మనీ అంటే “షేర్ మనీ “ అని. .అతనా విమర్శ ఏమాత్రం పట్టించుకోక ఆ రెండు రోజులు అందర్నీ కలిపి ఆనందంలో ముంచాడు. అయితే డబ్బు విచ్చల విడిగా ఖర్చై పోయిందని, అనవసర పటోటాపం ఎక్కువయ్యిందన్న విమర్శ మాత్రం వచ్చింది.

ఇలాంటి అపవాదులు నెత్తి మీద వేసుకోవాల్సి వస్తుందని రాజా రావు ఎవ్వరికీ అవకాశం ఇవ్వక మొత్తం ఖర్చంతా తన నెత్తి మీదే వేసుకునే వాడు. ఇంత చేస్తున్నా ఒక సంవత్సరం కాక పోతే మరో సంవత్సరం అయినా పిండం ముట్టుకోవడానికి “కాకి” రాక పోవడం అతనికి జీవన మరణ సమస్య కింద తయారై కూర్చుంది.

ఈ విషయం గురించి మీరు పెద్దగా ఆలోచించకండి. కాకుల కోసం చూడటం వరకే మన పని.“ అంటూ రాజా రావు ఇంటికొచ్చిన ఒక బ్రాహ్మణుడు ధైర్యం చెప్పాడు.

సిటీలో కాకుల సమస్య ఎక్కువ గానే ఉంది. గృహ ప్రవేశాలకు, కర్మలలో గోదానాలు పేరు మీదట గోవులు అద్దెకు తీసుకుని క్రతువులు కానీయడం లేదా ? అలాగే కాకులను కూడా అద్దెకు తెచ్చుకోవాలో ఏమో ఖర్మ ?” అన్నాడు ఒక భోక్త నవ్వుతూ.
సిటీలో ఉండే కాకుల సమస్య ఒక్క రాజా రావుకే కాదని కొన్ని వేల మంది ఇదే సమస్య ఎదుర్కుంటున్నారని ఒక రోజు పేపర్లో చదివాడు రాజారావు .” ఈ రోజుల్లో గృహ ప్రవేశాలకు, జీవులు గతించినప్పుడు చాలా మంది గోదానం చెయ్యడం జరుగుతున్నదే. కాని ఎక్కడో ఒక్కరో ఆరో తప్ప నిజంగా గోవును కొని దానం చేసిన వారంటూ ఎవరూ కనపడరు. ముఖ్యంగా శ్రాద్ధ కర్మలలో పిండం పెట్టడానికి కాకులకు ఉన్న ప్రాశస్త్యాన్ని పురస్కరించుకుని ఆయా కర్మలను శ్రద్దగా నిర్వహించడంలో కాకికి పిండం పెట్టడంతో మాత్రమే ఆ క్రతువుల లక్ష్యం నెర వేర గలదని. ఆత్మలను సంతృప్తి పరచడంలో ఎటువంటి అశ్రద్ధ తగదని ఇటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఇది సహేతుకమా కాదా అన్న విషయాన్ని పక్కన పెట్టి అటువంటి క్రతువులకు కాకులను సమకూర్చడానికి హైదరాబాద్ లోని రాధేయపురంలో వీరభద్రయ్య అనే వ్యక్తిని సంప్రదించవలసిందిగా అతని ఫోన్ నెంబర్ ఇస్తూ వచ్చిన ప్రకటన రాజారావును విశేషంగా ఆకర్షించింది.

“ కాకులను పెంచుకుంటే తప్పేమిటి ? వన్య ప్రాణుల సంరక్షణ వారు దీనికి అభ్యంతరం పెట్టాలనుకుంటే చిలకలు పెంచే వారిని, పావురాయలు పెంచే వారిని కూడా ఇబ్బంది పెట్టాలి గదా?” ఇదే విషయాన్ని ఆబ్దికం ఇంకో వారం రోజులుందనగా అన్నదమ్ములంతా చర్చించు కున్నారు.

రాజా రావు పేపర్లో పడిన ప్రకటన చూసి అడ్రస్ వెతుక్కుంటూ వీరభద్రం ఇంటికి వెళ్ళాడు. అప్పటికే అక్కడ పది పదిహేను మందికి పైగా ఒక సిమెంట్ బల్ల మీద కూర్చుని ఉన్నారు. వారందరి వంతు అయి పోయాక రాజారావు వంతు వచ్చింది.

“రేపు పదమూడో తారీకు అమావాస్య నాడు మా అమ్మ గారి ఆబ్దికం. ఆ రోజు తమరు ఒక “కాకిని” మా ఇంటికి ఎటువంటి పరిస్థితితుల లోనూ మిస్ కాకుండా సమ కూర్చాలి.“ అంటూ తన అడ్రస్ కాయితం మీద వ్రాసి ఇచ్చాడు రాజారావు.

“ అవుననుకోండి. చూస్తున్నారుగా. జనం ఎలా కూర్చున్నారో ? వీళ్ళల్లో ఎంత మందికి కాకులు సప్లయ్ చెయ్యగలమో మేము హామీ ఇవ్వలేక పోతున్నాం. మీరు చెప్పిన తేదీకి ఉన్న డిమాండ్ ను బట్టి పంపడం అనేది ఆధార పడుతుంది. ట్రై చేస్తాను. ఏదీ అడ్వాన్స్ ఒక వెయ్యి రూపాయలు ఇవ్వండి “ అంటూ రసీదు పుస్తకం ముందు ఉంచాడు వీరభద్రం. . . .

అదృష్టం బాగుండి వీరభద్రం ఉదయం పదిన్నరకల్లా ఒక పంజరం లాంటి పెట్టితో ఒక వ్యక్తిని రాజారావు ఇంటికి పంపించాడు అప్పటికే రాజారావు ఇంట్లో అతని సోదరులు, ఇతర దగ్గర బంధువులు చేరి ఇంకా బ్రాహ్మణులు రావడానికి సమయం ఉండటంతో పిచ్చా పాటి మాట్లాడుకుంటున్నారు. కాకితో వచ్చిన వ్యక్తిని చూడగానే వారందరి మొహం చేటంతయ్యింది .

క్రతువు పూర్తయ్యాక కాకికి పిండం వేసే వేళయ్యింది. అందరూ కలిసి బయటకు వచ్చారు. అప్పటి వరకు కాకిని తెచ్చిన వ్యక్తి అక్కడే నిలబడి ఆపసోపాలు పడుతున్నాడు.

అంతలో ఎవరూ ఊహించని విచిత్ర సంఘటన జరిగింది. ఎక్కడి నుండి వచ్చాయో కాని కొన్నేళ్లుగా సిటీలో వాటి అలజడే లేని ఒక పది పదిహేను కాకుల మూక చెవులు చిల్లులు పడేటట్టుగా అరుచుకుంటూ అక్కడున్న వారందరినీ పొడిచినంత పని చేసాయి. దానితో పంజరంలో కాకిని అద్దెకు తెచ్చిన వ్యక్తి బేజారై పోయి తన కాకిని బలవంతంగా పంజరంలోకి తోసేసి బయటకు పరుగు తీసాడు... పోనీ మూకుమ్మడిగా వచ్చిన కాకులైనా పిండం ముట్టుకున్నాయా అంటే అదీ లేదు....వచ్చినంత వేగంగా అవీ హుష్ కాకి...ఈసారైనా అబ్దికం సంపూర్ణ్మవుతుందనుకున్న ఆశలు అడియాసలైపోగా అన్యమన్సకంగా భోజనం చేసి నడుం వాల్చాడు రాజారావు...కలత నిద్ర పడుతూండగా ఏదో పొడిచినట్టయి ఉలిక్కిపడి నిద్ర లేచి పక్కకు చూసేసరికి ఇందాకటి కాకుల్లో ఒకటి పక్కనే వాలి తననే చూస్తోంది...చేత్తో అదిలించబోయిన రాజారావుకి అది ఏమాత్రం బెదరకపోగా స్థిరంగా అక్కడే ఉండడం ఒకింత ఆశ్చర్యాన్ని కలిగించింది....ఏమయ్య రాజారావూ, అబ్దికం అన్య మనస్కంగా పూర్తి కానిచ్చినట్టున్నావే? అని వినిపించడంతో ఆ గొంతెవరిదో అర్థం కాక దిక్కులు చూడసాగాడు రాజారావు...

"నేనేనయ్యా...నీ మనస్తాపానికి కారణభూతాన్ని... అదేనయ్యా కాకిని..." సందేహం లేదు తనపక్కన వాలిన కాకే...మాట్లాడుతోంది...

నీ మనస్తాపానికి సారీ మీ మనుషుల మనస్తాపానికి కారణం మీరేనయ్యా...ప్రతిరోజూ కాకి కనిపిస్తే దాని అరుపు వినపడనంత దూరం చేతికందిన వస్తువు తీసుకుని విస్రి తరుముతారా, అదే మీ స్వార్థం కోసం, మీ పెద్దల ఆత్మ మాలో ఉంటుందన్న ఒకేఒక్క కారణంతో సంవత్సరానికొకసారి మీరు పెట్టే పిండం కోసం మాకోసం ఎదురు చూస్తారా? అంటే, ప్రకృతులోని ప్రతి ప్రాణీ, ప్రతి వస్తువూ మీ అవసరాలకనుగుణంగానే మనుగడ సాగించాలా?" స్థిరంగా పలికింది కాకి గొంతు...

" శాస్త్రం అలా చెబుతోంది...మాదేం తప్పు" అప్రయత్నంగానే అన్నాడు రాజారావు..

సరే, సంవత్సరానికొకసారి మీకు ఉపయోగపడాలంటే మేము బ్రతికుండాలికదా, ఉండాలంటే, ఎక్కడుండాలి? ప్రకృతిలో ఎన్నో పక్షులు, జంతువులూ నశించి పోతున్నాయి...వాటిలో మేమూ ఉన్నామన్న స్పృహ మీకుందా? ఎందుకు? కేవలం మీ స్వార్థం వల్లనే...మేం వాలడానికి ఒక్క చెట్టైనా ఉంచుతున్నారా? ఈ ప్లాటు మీరు కొనుక్కునే ముందు ఇక్కడెన్ని చెట్లుండేవో తెలుసా?

" నన్నేం చేయమంటావు? అవన్నీ నరికేసి వెంచర్ వేస్తేనే కదా మేం స్థలాలు కొని ఇల్లు కట్టుకున్నాం" రాజారావు సమర్ధన ఉక్రోషం కలగలిపి వెళ్ళగక్కాడు...

" అది నిజమే అనుకుందాం..మరి మీరు ఇల్లుకట్టుకోగా మిగిలిన స్థలంలో ఒక్క చెట్టైనా నాటారా? ఒక్క అంగుళం కూడా వదలకుండా మొత్తం ఇల్లు కట్టేసుకున్నారు...జాగా మొత్తం సద్వినియోగమైతే, అద్దెలొస్తాయి..చెట్లు నాటితే ఏమొస్తుంది? అంతేగా?? స్టయిల్ గా ఏ రెండో మూడో క్రోటన్ మొక్కలు నాటితే చాలు ఇంటి ముందు అందంగా ఉంటాయి..." రాజారావు కాదనలేకపోయాడు....

కాకి ఇంకా కొనసాగించింది..."సరే, ఇప్పటి విషయానికొద్దాము, వెయ్యి రూపాయలిచ్చి కాకిని తెప్పించుకుంటే, మీరిలా మూకుమ్మడిగా వచ్చి ఎందుకు అడ్డుకున్నారనేగా?"

అవునన్నట్టుగా తల ఊపాడు రాజారావు...

" ఎందుకంటే, వరుసగా కొన్నేళ్ళు కాకులు కనబడకపోతే, కారణం అన్వేషిస్తారు, పరిష్కారం కోసం ప్రయత్నిస్తారు, డబ్బు పారేస్తే కాకి దొరికితే, ఇక తెల్లారి మాగురించి ఆలోచించడానికి మీకు టైమెక్కడుంటుంది? ఇదేదో బాగుందని అసలే అంతరించిపోతున్న మావాళ్ళని బంధించి సంపాదనకెత్తుకునేందుకు అనేకమంది తయారవుతారు... ఉదాహరణకు వరదలొచ్చినప్పుడు కనిపించే నాలాల ఆక్రమణ సమస్య, వానాకాలంతోబాటు కొట్టుకుపోతుంది...మళ్ళీ షరా మామూలే కదా...బస్సు దొరికేవరకూ తిట్టుకున్న మనుషులే బస్సు దొరకగానే ఎగబడి సీట్లు సంపాదించుకున్నాక, అంతా మర్చిపోరా ఇదీ అలాగే..... కాకుల కోసం మాత్రమే కాక మీ రాబోయే తరాల కోసమైనా మీ పెద్దల స్మారకార్థం ఒక్క చెట్టు నాటండి....చెట్లు లేక కాకులే కాక అనేక అనేక పక్షి జాతులు అంతరించిపోతున్నాయి...వాటి కోసమైనా చెట్లు పెంచండి...అవన్నీ బ్రతికితే మాకేంటి లాభం అనుకుంటున్నావా? ఏం, మన్షులకుపయోగపడితేనే మేం బ్రతకాలా? భగవంతుడు మీలాగే మాకూ బ్రతికే హక్కు ఇచ్చాడు... వనరులను హరిస్తూ మా హక్కును మీ మానవ జాతే కాలరాస్తోంది...దయచేసి మమ్మల్నీ బ్రతకనివ్వండి" కాకి ఏడుస్తోంది....ధారాపాతంగా కన్నీరు కారుస్తోంది.....

రాజారావుకి మెలకువొచ్చింది...కాకి మాట్లాడింది కలలోనే కదాని తేలిగ్గా తీసుకోలేకపోయాడు...మనుషులకు ఆత్మఘోష ఉన్నట్టే కాకులకూ ఉంటుందన్న విషయం అర్థమైంది....అదే తనకు కలలో కనిపించింది...తన ఘోష వినిపించింది....

తన కర్తవ్యమేదో బోధించింది....ఎవరి మనోభావాలనైనా వ్యక్తప్రచడానికి ఇప్పుడు ఎక్కువగా కష్ట పడక్కరలేదు...పెద్దపెద్ద వేదికలే అవసరం లేదు....సోషల్ మీడియా చాలు...ఏదోక న్యూస్ చానల్ వాళ్ళను పట్టుకోగలిగితే చాలు...సంప్రదాయాల్ని గౌరవించే ప్రతిఒక్కరూ, శాస్త్రాన్ని నమ్మే ప్రతి ఒక్కరూ ఆచారాల్ని పాటించే ప్రతి ఒక్కరూ తమ పెద్దల సంస్మరణ రోజుని పర్యావరణ పరిరక్షణ దినంగా, జీవ సమ్రక్షణ దినంగా ప్రకటించుకోవాలి ఆ విషయాన్ని పదిమందికీ తెలియజెయ్యాలి....ఆ దిశగా చైతన్యం తీసుకురావాలి....ఆ ఆలోచనే రాజారావుకి తృప్తిగా అనిపించింది......

మరిన్ని కథలు

Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న
ఓ breaking news
ఓ బ్రేకింగ్ న్యూస్
- బివిడి ప్రసాద రావు
chettu baadha
చెట్టు బాధ
- లక్ష్మీ కుమారి.సి