జ్ఞానోదయం - ప్రతాప వెంకట సుబ్బారాయుడు

jnanodayam telugu story

రాంబాబు పార్కులో కూర్చుని తీవ్రంగా ఆలోచిస్తున్నాడు.

ప్రముఖ వార పత్రిక లవ్ కపుల్స్, "ప్రేమ ఊసులు" అనే పోటీ పెట్టింది. దానిలో పాల్గొని ఫస్ట్ ప్రైజ్ పదివేలు కొట్టేయాలని రాంబాబు ప్లాన్. అందుకే అంత తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. అంతేకాదు తన ప్రియురాలు రమణిని కూడా రమ్మన్నాడు.

కాస్సేపటికి రమణి రుస రుస లాడుతూ వచ్చి "రాన్రాను నీకు బుద్ధి లేకుండా పోతోంది రాంబాబూ. నీకెన్నో సార్లు చెప్పాను మా ఆఫీసుకొచ్చి నన్ను పికప్ చేసుకుని పార్కుకు తీసుకురమ్మని. కానీ నాకు ఫోన్ లో మెసేజ్ పాస్ చేసి నీపాటికి నువ్వు వచ్చేస్తావు. అదే నాకు చిరాకు" అంది.

"అలా అనకు రమణీ... మా ఆఫీసేమో ఈ పార్కుకి దగ్గర... మూడు కిలోమీటర్ల దూరంలో వుండే మీ ఆఫీసుకి వచ్చి నిన్ను పికప్ చేసుకుని మళ్ళీ ఇక్కడికే తీసుకురావడం... అసలేమన్నా బాగుంటుందా చెప్పు?" అన్నాడు అనునయంగా.

"అదే నాకు చిరాకు. అందరూ తాము ప్రేమించిన అమ్మాయిల కోసం సప్త సముద్రాలు దాటమన్నా దాటతారే... చెట్లు... పుట్టలు ఎక్కమన్నా ఎక్కుతారు. నేనేమో బస్సులో కష్టపడి నీకోసం రావాలి. ఛ"

"నేను ఇలా పొదుపు చేస్తున్నది ఎవరికోసం చెప్పు? మన కోసమే కదా! రేపు పెళ్ళయ్యాక హ్యాపీగా వుండడానికేగా..."

"సర్లే... సొల్లాపి అర్జంటుగా రమ్మన్న విషయం ఏంటో చెప్పు?"

"అదీ... అదీ... అది..."

"చెప్పానుగా నా కసలే చిరాగ్గా వుందనీ... నాన్చకుండా త్వరగా చెప్పి తగలడు... అసలే ఆఫీసులో చేసిన హెవీ వర్క్ వల్ల టైర్డ్ అయిపోయాను"

"స్త్రీ అన్న తర్వాత కాస్త ఓపిక... సహనం వుండాలి... రమణి డాలింగ్"

"వుంటే కాళ్ళక్రింద వేసి తొక్కేద్దామనా?... నోరుమూసుకుని విషయమేంటో చెప్పు" అంది అక్కడున్న పెద్ద చెట్టు మొదట్లో కూలబడుతూ...

"మరేమో... లవ్ కపుల్స్ పత్రిక వాళ్ళు ప్రేమ ఊసుల పోటీ పెట్టారు. నువ్వు కాస్సేపు సిగ్గులమొగ్గై కాసిన్ని కులాశా కబుర్లు... కళ్ళతో ప్రేమని వడ్డిస్తూ చెబితే నేను ఇన్ స్పయిర్ అయ్యి ప్రేమ ఊసుల్ని అక్షరాల్లో పెట్టేస్తా..."

"అసలు పదివేలొచ్చే ముఖమేనా నీది? ఏదో ఒకటి చెప్పి నన్ను ముగ్గులోకి దించుదామనుకుంటున్నావేమో? అలాంటి పప్పులేం ఉడకవు నా దగ్గర"

"అబ్బా ఎప్పుడూ నీ గోల నీదే కానీ... నా మాట వినిపించుకోవు. ఇదిగో ఈ పత్రిక చూడు" అని ప్రకటన చూపించాడు.

ఆమె కాస్త శాంతించి..."అసలు నీకు రాయడం వచ్చా?" అంది.

"రాయడం వచ్చానా? మా కాలేజ్ మ్యాగజైన్ లో రెండు మూడు కవితలు రాశాను... దినపత్రికలకి కొన్ని సమస్యల మీద ఉత్తరాలు కూడా రాసాను తెలుసా?"

"అబ్బో... చాలానే రాసావు..." వెటకారంగా అని "ఒకవేళ ఖర్మ కాలి నీ ప్రేమ ఊసులకే బహుమతి వచ్చిందే అనుకో... అది నాకే ఇస్తావా... మరి" అంది ఆశగా.

"ఇస్తావా ఏంటి? నీకో లవ్ సింబల్ వున్న బంగారపు ఉంగరం కానుకగా ఇస్తా" అన్నాడు.

"అయితే నేనేం చేయాలి?"

"అద్గదీ... ఏమీ చేయనక్కర్లేదు. ఎప్పటిలా సణుక్కుంటూ... విసుక్కుంటూ... ముఖం ముడుచుకుని చిరాగ్గా వుండకుండా... కాస్త నవ్వుతూ... సిగ్గులొలకబోస్తూ... నాలుగు కమ్మటి మాటలు చెబితే చాలు"

"అంటే... నేను సణుగుతూ... గొణుగుతూ... విసుగు తెప్పిస్తాను... నువ్వేమో ప్రశాంతంగా శ్రీరామ చంద్రమూర్తిలా వుంటావు... అంతేగా... అలాంటప్పుడు నాతో నీకేంటి? వెళ్ళి మరొకత్తెని చూసుకో" అని విసురుగా లేవబోయింది.

"అరే... మళ్ళీ ముక్కు మీద కోపం. మనమేమనుకున్నాం... ప్రేమ ఊసులు రాసి బహుమతి తెచ్చుకోవాలని కదా! అంతలోనే అలా చిచ్చుబుడ్డి వైతే ఎలా?"

"అవును ఆ ఊసుల వంకతో నన్ను చిరాకుదీ... చిచ్చుబుడ్డీ అని నాలుగు మాటలు అనాలనీ... నాకు తెలుసులే..." అంది బాధగా ముక్కు చీదుతూ..

"అది కాదు రమణీ... నేను నిన్నెందుకంటాను చెప్పు? అసలు నువ్వు వచ్చినప్పటినుండీ నన్నెన్నేసి మాటలు అన్నావు... చెప్పు నేనేమన్నా ఉడుక్కున్నానా నీలాగా?"

"అంటే పెళ్ళికాకుండానే నేను నిన్ను సాధిస్తున్నాను. నువ్వు మాత్రం సహనంతో నన్ను భరిస్తున్నావు అంతేగా"

"అబ్బా అలా కాదు రమణీ... కాస్త నేను చెప్పేది విను. రెండు మాటలు నవ్వుతూ మాట్లాడు చాలు... నేను కాగితం మీద కలంతో రెచ్చిపోతా... బహుమతి తెచ్చి తీరతా"

"...అంటే నేను మీ దృష్టిలో మొండిదాన్ని... పెంకి ఘటాన్ని... రెండు మంచి మాటలు అతి కష్టం మీద మాట్లాడాలి అంతేగా... బాయ్ ఫ్రెండ్ వున్నాడన్న ఆనందం లేదు నా ముఖాన. నా అంతట నేనే నీ దగ్గరకి రావాలి... పైనుండి మాటలు పడాలి. ఛీ దరిద్ర బ్రతుకు"

"అలా బాధ పడకు రమణీ... నాకూ బాధగా వుంది."

"వుండదూ మరి? మనసిచ్చిన ఆడపిల్లని ఎవరన్నా ఏడిపిస్తారా? నువ్వుతప్ప"

"నేనేడిపించానా?"

"లేదు నేనే మూడు కిలోమీటర్లు బస్ లో ఉబుసుపోక ఇక్కడికి వచ్చి ఏడుస్తున్నాను"

"అది కాదు... ప్రేమ ఊసుల పోటీ..."

"సరే... నా ఖర్మ... చెప్పు ఏం చేయాలో"

‘హమ్మయ్య... దారిలోకొచ్చింది’ అనుకుని "ఏవైనా ప్రేమగా నాలుగు మాటలు మాట్లడవా?"అన్నాడు.

"మా నాన్నకి ఈ నెల జీతం రాలేదు. సమయానికి మా బాస్ బిజినెస్ పనిమీద బెంగళూరు వెళ్ళాడు. ఎప్పుడొస్తాడో తెలీదు. మాకూ జీతాల్లేవు. ఇంట్లో చాలా కష్టంగా వుంది. మనమేమన్నా సినిమా ప్రేమికులమా? పార్కుల్లో ఒకరి కళ్ళల్లోకి ఒకళ్ళు చూసుకుంటూ కూర్చోడానికీ... డ్యూయట్లు పాడుకోడానికీ" రాంబాబు మనసు మూగదయిపోయింది.

"సర్లే... ఆ మాట ముందు చెప్పొచ్చుగా. ఇదిగో" అని పర్సులోంచి డబ్బు తీసి ఆమె చేతిలో పెట్టి "ఇహ వెళదామా?"అన్నాడు లేస్తూ.

"మరి ప్రేమ ఊసులు?"అంది.

"అవి అందరికీ వుండవని అర్ధమైంది. కలల్లో తేలిపోతూ రాయడానికి... వాస్తవానికీ తేడా వుంటుందని జ్ఞానోదయమైంది. పద నిన్ను బస్ స్టాప్ దగ్గర డ్రాప్ చేస్తాను" అని అక్కడే పక్కగా వున్న పల్లీల వాడికి ఆ పుస్తక మిచ్చి ముందుకు కదిలాడు.

మరిన్ని కథలు

Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు
Sundari maarindi
సుందరి మారింది
- జి.ఆర్.భాస్కర బాబు