చల్లగా మృదువుగా బుగ్గలను ఏదో తాకట౦తో ఉలిక్కిపడి మెల్లిగా కళ్ళు తెరిచి౦ది సావేరి. ఎదురుగా భర్త "పుట్టినరోజు శుభాకాంక్షలు నా దేవేరికి" అంటూ నవ్వుతూ వంగి అందంగా అధరాల మీద, లలాటం మీద మృదువుగా చుంబించాడు. "లే లేచి బ్రష్ చేసుకో" అన్నాడు.
"అరె మీరు ఇవ్వాళ ఇంత పెందరాలే లేచారేంటి?" అంది.
"ఏం నీ కన్నా ముందు లేవకూడదా! ఈ రోజు నీకు, నాకు స్పెషల్ డే. అందుకే అందంగా విభిన్నంగా ఈ రోజు జరుపుకుందాము". అన్నాడు.
సావేరి బ్రష్ చేసుకుని వచ్చేసరికి డైనింగ్ టేబుల్ మీద వేడి కాఫీ రెడీగా ఉంది.
"ఇవ్వాళ కాఫీ మీరు పెట్టారేమిటి" అంది సావేరి.
"ఇవ్వాళ ఇంకా చాలా విచిత్రాలు చూస్తావు" అన్నాడు.
"ఏమిటో ఆ గొప్ప విచిత్రాలు" అంటూ అలవోకగా నవ్వింది.
"అలా నవ్వకు, ఆ నవ్వు చూస్తే ఏం చేస్తానో నాకే తెలియదు" అన్నాడు.
"చెయ్యండి నేను వద్దన్నానా?"
"ఏయ్ చిలిపీ ఏమిటదీ? సరే కానీ స్నానాలగదిలో నీ అభ్యంగనానికీ అన్నీ అమర్చాను. స్నానం చేసిరా" అన్నాడు.
కాఫీ తాగి స్నానాలగదిలోకి వెళ్ళిన సావేరి అక్కడ ఉన్న నూనె, నలుగుపిండి, కుంకుడురసం అన్నీ చూసి ఆశ్చర్యపోయింది. కూర్చుని పోసుకోవడానికి వీలుగా ముక్కాలిపీట.
స్నానం చేయడానికి నలుగుపిండి చేతికి తీసుకున్న కావేరి దాన్నించి వచ్చే సుగంధపరిమళాలు ఆశ్వాదిస్తూ నలుగు పెట్టుకుంది. తల స్నానం చేసి బట్ట చుట్టబెట్టుకుని వచ్చిన ఆమెకు మంచం మీద కొత్తబట్టలు సిద్ధంగా ఉన్నాయి. గంధం రంగు జరీ చీర, దానికి తగ్గ రవిక, లోపలి లంగా, అన్నీ అమర్చిన విధానాన్ని మైమరచి చూస్తోంది.
ఇంతలో సాంబ్రాణి పొగతో లోపలికి వచ్చిన సాగర్ ఆమెను అప్పుడే కొత్తగా చూస్తున్నట్లుగా చూసాడు. ప్రబంధ కవులు వర్ణించేటంత సొగసు కావేరిది. చేతిలో ఉన్న వస్తువులు కింద పెట్టి ఆమె వైపు అడుగులు వేసాడు.
నున్నటి ఆమె భుజాల మీద చెయ్యివేసి తనవైపు తిప్పుకున్నాడు. కొత్త పెళ్ళికూతురిలా అతని కౌగిలిలో ఒదిగిపోయింది సావేరి. కొన్ని క్షణాలు ఇద్దరిలో ఏదో తెలియని తమకం.
చుట్టుముడుతున్న మధురోహాలను పక్కకు పెట్టి అతని కౌగిలినించి విడివడి, "శ్రీవారు బైటికి వెడితే నేను బట్టలు వేసుకుంటాను" అంది.
మళ్ళీ ఏమనుకుందో స్నానాలగదిలోకి వెళ్లి లోపలి రంగా, రవిక వేసుకుని వచ్చింది. అద్దంముందు నుంచుని అందంగా చీర కుచ్చిళ్ళు పెడుతున్న భార్య వైపు, చీర కట్టులో ఆమె నైపుణ్యాన్ని చూస్తూ కూర్చున్నాడు. తలకు చుట్టుకున్న తువ్వాలు తీసి జుట్టు విదిలించింది. ఉంగరాలు తిరిగి భుజం దాటని జుట్టు అక్కడక్కడ వెండి తీగలు.
"వేణీ భరంబు విదిలించినంతనే వెదజల్లినవి పరిమళాలు, వెదజల్లినవి పరిమళాలు" అంటూ పాట అందుకున్నాడు. అతను మంచి సంగీతజ్ఞుడు, శృంగార పురుషుడు. అతని రసమయ సంగీతంలో ములిగి పోవడం ఆమెకు ఇష్టమైన చర్యల్లో ఒకటి. అతని నోట పలికే శృంగార గీతాలకు ఒళ్ళు పులకరిస్తుంది.
ఆమెను మంచంమీద కూర్చోబెట్టి ఆమె జుట్టు పాయలుగా విడదీసి సాంబ్రాణి పొగ వేసాడు. వద్దు వద్దంటూనే అతని చర్యలకు పరవశించిపోతోంది. పొగ వెయ్యడం అయ్యాక "జుట్టు చిక్కు తియ్యనా!" అన్నాడు. "చాల్లెండి నేను తీసుకుంటాను" అంది.
"ఐతే జడవేసుకుని ఈ పువ్వులు పెట్టుకో, అంటూ మల్లెల మాల డ్రెస్సింగ్ టేబుల్ మీద పెట్టాడు. జడ అల్లుకుని తలలో పువ్వులు పెట్టుకున్న సావేరి ని చూసి మళ్ళీ పాట మొదలుపెట్టాడు.
'తలనిండ పూదండ దాల్చిన రాణీ మొలక నవ్వులతో మురిపించబోకే" అంటూ.
"నేను మురిపించాలనే కదా! స్వామి వారి అభిప్రాయం. అంటూ నవ్వింది.
అతని ప్రవర్తన విచిత్రంగా వున్నా అతని ముచ్చట తీరుద్దామని ఊరుకుంది. వంటింట్లోకి వెళ్ళబోతున్న ఆమెను వారించి, "నువ్వు పూజ చేసుకుని రా" అన్నాడు.
అతని మాటను కాదనలేక పూజగదిలోకి వెళ్ళింది. అక్కడ అంతా తను రోజూ అమర్చుకునేటట్లుగా అన్నీ అమర్చి వున్నాయి. పూజకు పూలు, సెమ్మాల్లో వత్తులు, నూనె వేసి వున్నాయి. కాస్సేపు భర్త గురించిన ఆలోచనను పక్కకు పెట్టి దైవధ్యానం వైపు మనసు మళ్ళించింది. పూజ పూర్తయ్యి తులసిలో నీళ్ళు పోసి వచ్చేసరికి, డైనింగ్ టేబుల్ మీద ఫలహారం తయారుగా ఉంది.
చిరుకోపం ప్రదర్శిస్తూ "ఏంటీ ఈ రోజు నన్ను ఏ పనీ చెయ్యనివ్వరా!"
"నా శృంగార రసాధిదేవతకు ఈ రోజు విశ్రాంతి. పుట్టినరోజునాడు పనిచేయడమా! పాపము శమింపుగాక" అన్నాడు.
"ఏమిటి ఇవ్వాళ అయ్యగారి పైత్యం ఎక్కువైనట్లుంది. ప్రతీ ఏడాది చేస్తున్నాను కదా!" అంది.
"నువ్వు ఎలా అనుకున్నా ఫరవాలేదు. నేను ఇవ్వాళ ఇలాగే ఉంటాను. ఈ రోజు నేను చెప్పినట్లు నువ్వు చెయ్యాలి" అన్నాడు.
పకపకా నవ్వింది విరగబడి నవ్వుతుంటే ఆమె అందాలు ద్విగుణీకృతమవుతున్నాయి.
"అలా నవ్వద్దన్నానా! నవ్వితే నాకేదో ఔతాది ఏదో లోకాలకు నా మనసు ఎల్లిపోతాది" అన్నాడు సాగర్.
"నెలతపై మోహము నిలుపరాకుంటేను, సొలసి పయ్యెదలోను చొచ్చుకోరాదా!
తలకొన్న యాకె చక్కదనము నీకు చాతైతే పొలుపుమీర వర్ణించి పొగడరాదా" అంటూ అన్నమయ్య కృతిలోని చరణం పాడింది.
"అమ్మ దొంగా నీకు కూడా పాటలు బాగానే వచ్చే" అన్నాడు సాగర్.
"సహవాసదోషం మరి. ఇన్నాళ్ళూ మీ పాటలు వినీ వినీ నాక్కూడా మీ వాసన కొంచెం వచ్చింది మరి. మీ అంత బాగా పాడకపోయినా నాకూ కాస్త పాడ్డం వచ్చు మరి" అంటూ హాస్య మాడింది.
వాళ్ళిద్దరూ నవదంపతులు కాదు కానీ మానసికంగా వాళ్ళిద్దరూ నిత్య యవ్వనులు. దాంపత్యంలో ఉన్న మాధుర్యానికి నిర్వచనం ఆ జంట. ఎన్నాళ్ళయినా వసివాడకుండా మధురిమలు చిందించే అపురూప నికుంజం.
గ్రంధాల్లో చెప్పబడిన పురుషార్ధాలు నాలుగు. ధర్మం, అర్ధం, కామం, మోక్షం. ధర్మ, అర్ధ, మోక్షాల్ని త్రివర్గాలంటారు. నాలుగవది కామం. సరి అయిన రీతిలో విపరీత ధోరణికి లోను కాకుండా దీనికి కూడా సముచిత స్థానాన్ని ఇవ్వాలి.
పురుషుడ్ని స్త్రీ ప్రేమించాలంటే ఆమె కోరుకునే గుణాలు అతనిలో ఉండాలి. పెళ్లి చూపుల్లో ఎంతసేపూ అబ్బాయికి అమ్మాయి నచ్చిందా అని అడుగుతారు. కానీ అమ్మాయికి అబ్బాయి నచ్చాడా లేదా అన్నది ఈ నాటికీ ప్రాధాన్యం ఇవ్వరు. అతని ఆర్ధిక స్థితిగతుల్ని చూసి అతని యోగ్యతను నిర్ణయిస్తారు.
మానసికంగా ఏ భర్త భార్యకు దగ్గరవుతాడో అతని లో ఆమె మమేకం అవుతుంది. స్త్రీ తన పురుషుడికి దూరంగా ఉండలేనన్న భావన, అతన్ని అలలా అల్లుకుపోవాలన్న తపన కల్గించినవాడే భర్తగా అతను విజయం సాధించినట్లు.
సావేరి, సాగర్ ల దాంపత్యం అలాంటిదే. ఆమె అంటే అతనికి అనురాగం. తన ప్రణయాధిదేవత గా ఆరాధిస్తాడు. ఆమె మనసెరిగి మసలుతాడు. చీకటి పడేసరికి ఇల్లు చేరుకోవాలన్న ఆత్రుత పెళ్ళయిన నాటి మొదలు ఈ నాటికీ కొనసాగుతోంది. భార్య సమక్షం అతనికి ఒక మధురమైన అనుభూతి. అతని ముచ్చట తీర్చటమే ఆమె జీవిత పరమావధి. సావేరి అతని పైన ఎప్పుడైనా అలిగితే జయదేవుని అష్టపది లో అతనికిష్టమైన పదం అందుకుని ప్రాధేయపడుతాడు.
"క్షమ్యతామపరం కదాపి తవే దృశ్యం న కరోమి, దేహి సుందరి దర్శనం మమ మన్మధేన దునోమి కుపితేవ" ఓ సుందరీ నీ విషయమై నేనేమైనా అపరాధం చేసిఉంటే నన్ను క్షమించు. ఇక ఎప్పుడూ ఇలాంటి అపరాధం చెయ్యను. నేను మన్మధుని బాధతో విలవిల లాడుతున్నాను. నన్ను అనుగ్రహించు. అని దాని అర్ధం.
"సాయంకాలం డిన్నర్ బైట చేద్దాం" అన్నాడు.
"మరి ఇప్పుడేం చేద్దాం! అది కూడా మీరే చెప్పండి" అందంగా కొంటెగా మూతి విరుస్తూ.
"ఎంచక్కా ఇద్దరం కలిసి వంట చేసి భోజనం చేద్దాము." అన్నాడు.
"పోనీ ఇవ్వాళ్టికి మనం భోజనం మానేసి ఒకర్ని ఒకరు భోజనం చేద్దామా!" అంది వేళాకోళంగా.
"సరేలే నీ పని తరువాత చేస్తాను. ఆత్మారాముడు ఊరుకోడు కదా! అందుకని వంట మొదలుపెడదాము" అంటూ వంటింట్లోకి దారితీసాడు.
ఆమె అతన్ని అనుసరించింది. "మీరు అలా గట్టుమీద కూర్చుని మంచి పాటలు పాడుతూ ఉండండి. నేను అలవోకగా చిటికెలో వంట చేస్తాను సరేనా!" అంది.
"ఒహో అలాగే బహు బాగు" అంటూ వంటింటి గట్టు ఎక్కి కూర్చున్నాడు.
ముఖారి రాగంలో జయదేవుని అష్టపది మొదలుపెట్టాడు.
పాట పూర్తయ్యాక అడిగాడు "అర్ధమయ్యిందా". అంటూ
"చతురులే భావయుక్తంగా నీవే నాకు భూషణం. నీవే నాకు జీవనం, నీవే నా సంసారమనెడి సముద్రంలోని రత్నానివి ప్రియే చారుశీలే అంటూ పొగిడారు. నన్ను మురిపించడానికి కాకపోతే ఈ పాట ఎందుకు పాడినట్టో" అంటూ నవ్వింది.
"రాత్రికి ఫైవ్ స్టార్ హోటల్ లో డిన్నర్, రూమ్ బుక్ చేసాను." అన్నాడు.
"ఇప్పుడవన్నీ ఎందుకండీ" అంటూ కోపంగా చూసింది.
"ఈ రోజు నీ పుట్టినరోజు తో బాటు పెళ్ళిరోజు కూడా. మర్చిపోయావా? నీ మనసులో ఉన్న చిన్న కోరిక నా ముందు వెలిబుచ్చావు. మీ చెల్లెలు మొదటిరాత్రి ఫైవ్ స్టార్ హోటల్ లో బుక్ చేసారని, నువ్వెప్పుడూ అది ఎలా ఉంటుందో చూడలేదని అన్నావు. మన పెళ్ళి అప్పుడు నాకు ఆ స్థోమత లేదు. కాబట్టి ఆ కోరిక నాకూ ఉన్నా తీరలేదు. ఇన్నేళ్ళ తరువాత నీ కోరిక తీర్చాలనిపించింది. అది నా భాధ్యతే కాకుండా ఆనందం కూడా" అన్నాడు.
"వద్దు వద్దు అప్పుడు తెలియక ఏదో అన్నాను. నాకు ఇప్పుడు అలాంటి కోరికలు లేవు. కావాలంటే భోజనం ఏదైనా హోటల్ కు వెళ్ళి చేసి వద్దాము. నా మాట వినండి. కాన్సిల్ చెయ్యండి వాళ్ళు ఒక వేళ డబ్బులు తిరిగి ఇవ్వకపోయినా పరవాలేదు" అంది.
ఆమె ఎందుకు అలా అంటోందో సాగర్ కు అర్ధం కాలేదు.
సావేరి కి చెల్లెలు గుర్తుకు వచ్చింది. తన కన్నా ఏడేళ్ళు చిన్నదైన చెల్లెలంటే సావేరికి అపరిమితమైన ప్రేమ. అందంగా ఉన్న చెల్లెల్ని ఏరికోరి చేసుకుంటానని ఒక బిజినెస్ ఫామిలీ వచ్చింది. తల్లి తండ్రి మురిసిపోయి తాము వాళ్ళతో తూగుతామో లేదో అని ఆలోచించకుండా, వాళ్ళు కబురు పెట్టడమే మహా భాగ్యమని అనుకున్నాను.
చెల్లెలి కళ్ళల్లో కలవారింటి కోడలైనందుకు గర్వం, మెరుపు. మొగ పెళ్ళివారి కోరిక మేరకు ఫైవ్ స్టార్ హోటల్ లో మొదటి రాత్రికి రూమ్ బుక్ చేసారు.. చెల్లెల్ని దింపడానికి వెళ్ళిన సావేరి ఆ లైట్లు, ఆ ధగధగలు, ఆ అలంకరణ చూసి మురిసిపోయి కొన్ని క్షణాలకు మాత్రం అలాంటి సుఖం తమకు కూడా దొరికితే ఎంత బాగుంటుందో అని అనుకుంది. తమ పెళ్ళి లో తామేదో మిస్ అయ్యాయన్న భావన. అదే విషయం మాటల మధ్యలో సాగర్ తో చెప్పిందొకసారి.
చెల్లెలంటే ఈర్ష్య లేదు కానీ అలాంటి సుఖం తమకు దొరకలేదన్న చిన్న బాధ ఆమె మనసులో మెదిలేది. ఆ తరువాత చెల్లెలు కూడా గర్వంగా గొప్పగా దాన్ని గురించి వర్ణించడం తో ఆ అనుభూతి తాను కూడా పొందితే బాగుంటుందని భ్రమపడింది.
పెళ్ళయిన రెండేళ్ళకు అక్కగారింటికి వచ్చింది కావేరి. నాలుగురోజులు ఉన్న కావేరి, అక్కగారి దాంపత్యాన్ని చూసి ఆనందపడింది. ఈర్ష్య పడింది. అక్క కన్నా తను గొప్ప కోడలయ్యిందని గర్వపడింది. మురిసిపోయింది. తాను రాణి అనుకుంది. అసలయిన రారాణి అక్క అని తెలుసుకునేందుకు ఎక్కువ సమయం పట్టలేదు. అనురాగం, ఆప్యాయత చిందించే భర్త ఉంటే గుడిసెలో కూడా ఆనందం గా ఉండొచ్చు అనుకుంది.
అక్కపట్ల బావగారి ప్రవర్తన చూడకూడదనుకుంటూనే ఆమె కంట పడింది. అతని చిలిపి చేష్టలు, దానికి అక్క ప్రతిస్పందన చూసి, తన దాంపత్యం తో పోల్చుకుంటే ఆమె గుండె బరువెక్కింది.
తన బాధ అక్కగారి తో చెప్పుకుంది. కావేరి భర్తకు ఆడంబరాలంటే ఉన్న ఇష్టం, ఆప్యాయతలు, అనురాగాలపట్ల లేదు. ఇవన్నీ అతని దృష్టిలో ట్రాష్. భార్య అంటే అందంగా అలంకరించుకుని నలుగుర్లో ప్రదర్శించే బొమ్మ. భార్య ఫీలింగ్స్ తో అతనికి పనిలేదు. అతనితో కాపరంలో ఆమె మనసు బీటలు బారింది. బీడు భూమిలా తయారయ్యింది.
సావేరి చెల్లెలి కాపురం గురించి తెలుసుకుని బాధపడింది. కొద్ది క్షణాలకయినా డబ్బులో సుఖం ఉంటుందని భ్రమపడి చెల్లెలికి ఉన్నది తనకు లేదని, తనకు లేనిది చెల్లెలుకు ఉందని ఈర్ష్య పడింది. కానీ నిజం తెలిసాక తన తప్పిదనం తెలిసి వచ్చింది. అందుకే ఆ రోజే తన మనసులోంచి ఫైవ్ స్టార్ హోటల్ కోరిక తుడిచివేసింది.
ప్రొద్దున్నుంచి ఎంతో ఆనందంగా ఉన్న భార్య తన చిరకాల వాంఛ తీరుతున్నందుకు మురిసిపోయి తనను అభినందిస్తుందని అనుకున్న అతనికి, భార్య ప్రవర్తన కలవరపరిచింది. ఈ రోజు ఎంతో మధురంగా, అద్భుతమైన రోజుగా మలుద్దామని వేసిన ప్రణాళిక ఇలా అయ్యిందేమిటా! అని బాధపడ్డాడు.
హోటల్ లో భోజనం చేసి ఇంటికి వచ్చారు... ఇంటికి తిరిగి వచ్చాక వాతావరణం ఎలా ఉంటుందో అని భయపడ్డాడు సాగర్. బట్టలు మార్చుకుని మంచం మీద వాలాడు. కొద్దిసేపటిలో తెలుపు రంగు మీద చిన్న చిన్న పూలు ఉన్న చీర కట్టుకుని వచ్చింది సావేరి. తలలో జాజులు, ఆమె వంటిమీద నుంచి వచ్చే సుగంధం అతన్ని మైమరపింప చేసింది. అతని పక్కన కూర్చుని, నుదుటిమీద చుంబించి,
"శ్రీవారికి కోపమొచ్చిందా! ఇదివరలో నా చెల్లెల్ని చూసి అందులో ఏదో సుఖముందని భ్రమపడ్డాను. కావేరి కాపరం గురించి తెలిసాక నా కున్నదేమిటో దానికి లేనిదేమిటో నాకు అర్థమయ్యింది. సుఖం అన్నది ఫైవ్ స్టార్ హోటల్ లో కాదు మన మనస్సులో ఉందని గ్రహించాను. మీ లాంటి సహృదయుడ్ని భర్త గా పొందిన నేను ఎంత అదృష్టవంతురాల్నో నాకు తెలుసు." అంది.
నీ మనసు నాకు అర్ధమయ్యిందన్నట్లుగా తల ఆడించి ఆమె చుట్టూ చేయివేసి దగ్గరగా తీసుకున్నాడు. వారి కలయిక లో ఆవేశం లేదు. ఆమె చుట్టూ ఉన్న ఆ చేతులు కంచుకోటలా ఒక భద్రతాభావాన్ని ఇస్తోంది. ఆమె అతని పొందును ఎందుకు కోరుకుంటోందో తెలియడానికి ఆ చేతులే తార్కాణం.
భార్య లో ప్రియురాల్ని చూడగలిగిన భర్త కౌగిలిలో అన్ని స్వర్గాలు ఉన్నాయని సావేరి ఎప్పుడో గ్రహించింది. తానెంత అదృష్టవంతురాలో అని రోజులో కనీసం ఒక ఇరవై సార్లయినా అనుకుంటుంది. ఆ రోజుకి వాళ్ళ పెళ్ళయి పాతిక సంవత్సరాలు. సావేరికి నలభై మూడు సంవత్సరాలు. పిల్లలు గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తామన్నారు. సాగర్ నిరాకరించాడు. "మీ తోడు మీరు వెతుక్కోండి. నా తోడు తో నేను ఆనందంగా గడుపుతాను". అన్నాడు.
ఆమె చెవులో గుసగుసగా అన్నాడు "నువ్వు నాకు, నేను నీకు. ప్రియే చారుశీలే".