కమానువీధికథలు - రామదుర్గం మధుసూధనరావు

kamanuveedhikathalu

"కనిపిస్తే కాల్చివేత....' అంటే ఏంటో ...ఈ వాక్యం అర్థం ఎంత భయంకరంగా ఉంటుందో కమాను వాళ్లకి కర్ఫూ అప్పుడు బాగా తెలిసొచ్చిండాది. కమానే ఏం ఖర్మ...ఊరు ఊరే అల్లాడిపోయింది. యాడ చూసినా పోలీసోళ్లే. ఢిల్లీ , హైద్రాబాదు,కర్నూలు యాడాడ నుంచో వచ్చి దిగిపోయిండారు. వీపుకి తుపాకీలు తగలించుకుని..."ఠకా...ఠకా' బూట్ల సౌండు సేసుకుంటూ వీధులెంట తిరగాడుతుంటే...అందరం బిక్కసచ్చిపోయిండాం. కమాను రోడ్డు పక్కనే ఉండటంతో...ఈ పోలీసోళ్లు ఊ అన్నా...ఆ అన్నా...ఆడనే బూట్టు టకటకలాడిస్తూ తిరుగుతుండేవాళ్లు. మనిసి కనిపిస్తే సాలు...రేయ్ అంటూ కేకలేసేవాళ్లు. బైటికొచ్చే దారిలేక పుట్టల్లో సీమల్లా బిక్కుబిక్కుమంటూ ఉండాల్సి వచ్చింది. ఓ పూట అన్నం లేకుండయినా ఉండొచ్చుగానీ ఈ సుద్దులు లేకుండా ఎట్టాగరా నాయనా అనుకునిండాము. అసలు కమాను అంటేనే సుద్దులకి పేరు. అలాంటిది ఉన్నట్టుండి నోటికి బీగం వేసుకుని ఉండాలా...అనేసరికి కాల్లుసేతులాడలేదు. కమాను కట్టపై కూసోకుండా...నాల్గు మాటలు మాట్లాడుకోకుండా ఉండాలంటే మాటలా? అందుకే ఊర్లో అందరూ యాడికాడ నోర్మూసుకుని ఇంట్లో గప్ చిప్ గా ఉంటే...కమానులో మేం ఎప్పట్లాగే సుద్దులు సెప్పుకుంటునే ఉండినాం. అక్కడికీ నాన్న"కర్ఫూ అంటే భయమే లేకుండా పోయింది. ఉండండి ఏదో ఒక రోజు ఉంటుంది పెళ్లి' అనేవాడు. దానికి అమ్మావాళ్లు...ఈ యప్ప ఎప్పుడూ ఇంతే బలే బయస్థుడు అంటూ కొట్టిపారేశారు. అయితే నాన్న అన్నట్టు ఆ "పెళ్లి' రోజు రానే వచ్చింది.

ఎప్పట్లాగే ఆరోజు అందరూ కట్టలపై కూర్చొని సుద్దులు సెప్పుకుంటుండారు. ఉన్నట్టుండి బూట్ల చప్పుడు. “రేయ్...రూకో..రూకోరే...సాలా..' సీఆర్పీ పోలీసులు వీపుకు తుపాకులు తగలించుకుని..చేతిలో పొడవాటి లాఠీలు పట్టుకుని యమదూతల్లా గాఠిగా కేకలేస్తూ...వచ్చేసరికి అందరికీ సెమట్లు పట్టేసిండాయి.అప్పటిదాకా "ఆ...ఎన్ని చూడ్లేదూ..ఇదంతా మామూలే!' అంటూ నిర్లక్ష్యంగా రెండు చేతులు తల వెనక్కి బిగించి కబుర్లు చెబుతున్న పక్కింటి అచ్చణ్ణ కక్క అయిపులేకుండా ఇంట్లోకి దూరిపోయిండాడు. తలుపుల్ని బూట్లతో తంతూ...బూతులు తిడుతుంటే ఇంట్లో అందరం బిక్కచచ్చిఉండిపోయాం. అందరికీ ఒకటే నడుగు వచ్చేసిండాది. అన్ని కష్టాలు ఒకేసారి అన్నట్టు అప్పుడే మరో ఉపద్రవం వచ్చిపడింది. లోపల బితుకుబితుకుమంటూ ఉండిపోయామా...ఉన్నట్టుండి అక్క గాబరాగా ఏడ్వడం సురు చేసిండాది. ఏమయ్యిండాదో మాకెవరికీ అర్థం కాలే...తర్వాత షాక్ అయ్యాం. లోపలకి ఉరికే హడావుడిలో అక్క కూతురు చిన్నది హరిని బైటే వదిలేసి వచ్చేసిండాము. మూడేళ్లుకూడా నిండని ఆ చిన్నారి బైట ఉందని తెలియగానే మా ప్రాణాలు పైపైనే పోయాయి. ఇంటెదురుగా కట్టల మధ్యన చిన్న చప్టా వద్ద కుళాయి. అప్పటిదాకా అక్క అక్కడే కూర్చొని చుట్టుపక్కలోళ్లతో మాట్లాడుతోంది. అక్క పెళ్లయ్యాక బళ్లారిలో ఉన్నా తరచూ వస్తూ పోతూ ఉండేది. అయితే ఈసారి ఈ కర్ఫూ రావడంతో ఎందుకొచ్చిందిరా నాయనా అని మేము...ఎందుకొచ్చానురా దేవుడా అని ఆమె అనుకున్నాం. ఇప్పుడు ఈ కస్టం వచ్చిపడిండాది. పోలీసులు రాగానే తలోదిక్కుగా ఉరికిండామే గానీ...కుళాయికాడ ఆడుకుంటున్న ఆ చిన్నదాన్ని గమనించుకోలేకపోయాం. ఇప్పుడెట్టారా సామీ అని అందర్లో దిగులుపట్టేసింది. మా గుండెలు గుబగుబలాడిపోతుండాయి. అసలే అదంటే మాకందరికీ చాలా గారాబు. కాస్త బక్కగా ఉన్నా...బుట్టబొమ్మలా...చలాకీగా ఉండే హరి కమానులో అందరి ఎత్తుబిడ్డే! ఇంట్లో కూడా చాలా కాలం తర్వాత చిన్నపిల్ల సందడి సురుకావడంతో మా అందరికీ ఓ పుఠాణీ సెలిబ్రిటీ! ఈ పిల్ల లావుకావాలని అక్క నోచని నోముల్లేవు...చేయని ప్రయత్నాలు లేవు. ఎవరో చెప్పారని జొన్నరొట్టెలో దాన్ని దూర్చింది కూడా! ఇంతమంది కంట్లో ఉన్న పిల్ల బైట ఉండిపోతే...అదీ పోలీసుల హడావుడి మధ్య...ఎలా ఉంటుంది చెప్పండి? అక్క ఆవేశంగా నేను బైటికెళతాను అంటోంది...మరోవైపు పోలీసోడు బూటుకాళ్లతో తలుపులు కొడుతున్నాడు. పాపం అమ్మా...అక్కా ఎంతగా వణికిపోయారో! బైట కుళాయికాడ ఇంకొందరు పోలీసోళ్లు నిలుచుని హిందీలో "ఈ పిల్ల కోసమైనా బైటికొస్తారుగా ...అప్పుడుంటుంది' అంటూ హూంకరిస్తున్నమాటలు మాకు లీలగా వినిపిస్తున్నాయి. ఓ అయిదునిమిషాలు ఇలాగే గడిచింది. పేరుకు అయిదునిమిషాలే కానీ అప్పడు మాకు అయిదు యుగాలనిపించాయి.క్షణక్షణం అందరికీ ఒకటే టెన్షన్! చివరికి ఏమనుకున్నారో ఏమో అక్కడ్నుంచి వెళ్లిపోయారు. వారు వెళుతున్నది తలుపుసందుల్లోంచి చూస్తున్నఅక్క ఒక్కసారిగా బైటికెళ్లి...దాన్ని లోపలికి ఎత్తుకొచ్చింది. ఆరోజంతా ఇంట్లో ఒకటే గొడవ. ఒకవేళ ఆ పోలీసులు పసిదాన్ని ఏమైనా చేసిఉంటే...పోనీ చూద్దాం వీళ్లని అని ఎత్తుకెళ్లిఉంటే....ఆ ఆలోచనే భరించలేకపోయాం! వెంటనేఅమ్మ దేముడికి ముడుపు క ట్టేసింది. ఆరోజు కమానులో ఏ ఇంటిముందు చూసినా...మద్దేనం జరిగిన దాని గురించే చర్చ!!

నిజానికి మాకు144 సెక్షను అంటే కూడా తెల్వదు. అలాంటిది ఏక్ దమ్ కర్ఫూ అనగానే ...అర్థం కాలేదు. అందుకే దాన్ని సానా తేలిగ్గా తీసుకున్నోళ్లు ఉండారు. కర్ఫూ అంట...అదేందోనప్పా...ఎవ్రూ యాడ తిరగ్గూడదంట...బైటికి రాకూడదంటా...అంతా సుళ్లులేప్పా...అని కొందరంటే, కర్నూలు, హైద్రాబాదు నుంచి పోలీసులొచ్చిండారంట. వీపులకి తుపాకీలు తగిలించుకుని తిరుగుతుండారంట! అని మరికొందరు. కానీ ఎప్పడైతే పోలీసులు రోడ్డుపై కవాతు సురు చేసిండారో...అప్పుడు అరే ఇదేందో సానా ఉండాదే. పెద్దకస్టమే వచ్చిపడిండాదీ ఊరికి అని పెద్దలు అనుకున్నారు. ఊర్లో కర్ఫూ ప్రకటించాక అందరూ ఇంట్లోనే ఉండాలి. బైటికొచ్చేకి లేదు, షాపులు,హోటళ్లు అన్నీ బంద్ అనేసరికి ఇదేం పజీతి వచ్చిందిరా నాయనా అనుకున్నాం. మాటమీరి వచ్చిండారో అంతే ఖతమ్! అని మైకుల్లో గాఠిగా చెబుతుంటే...మొదట్లో ఎవరూ పట్టించుకోలేదు. ఎప్పుడైతే పోలీసులు మనుసులు కనిపిస్తే సాలు మీదికి రావడం సురు చేసిండారరో ...అందరకీ ఒకటి రెండూ మొదలయ్యిండాయి. జీపులేసుకుని పోలీసులు రయ్ రయ్ అంటూ తిరుగుతుంటే...మాకు బలే మజాగా ఉండేది.

కర్ఫూ పుణ్యమా అని కొత్త సమస్యలు తలెత్తాయి. ఇంట్లో సరుకులు నిండుకునేవి. పాలు, పంచదార,కాయగూరలు...అన్నింటికీ ఇబ్బందే! ఉదయం ఓ అరగంట..సాయంత్రం ఓ అరగంట బైటకు రావడానికి వీలుండేది.అప్పుడే అందరూ అన్నీ పనులు ముగించుకోవాలి. మా కమానులో సామూహిక శౌచాలయ. ఇక దాని తిప్పలు ఆ పరమేసుడికి చెప్పుకోవాల్సిందే! తిండికి టైము పెట్టుకోగలం...మరి ప్రకృతి పిలుపును ఎట్టా నిభాయించేది శివ..శివా!అనుకోవాల్సి వచ్చేది. ఇళ్లకు పక్క వీధి మంగమ్మ పాలు పోసేది కాబట్టి...అది కొంతలో కొంత నయం. ఇక మార్కెట్టుకు పోవాలంటేనే భయం. ఎందుకంటే...ఈలోగా టైమ్ అయిపోతుందేమో? పోలీసోళ్లు మైకుల్లో ఇంతింత గొంతులేసుకుని"అందరూ వెళ్లిపోవాలి...టైమయిపోతోంది. ఆ...వెళ్లండి వెళ్లండి' అంటూ హెచ్చరిస్తుంటే గొంతుకు గసపట్టేలా ఉరుక్కొంటూ ఇల్లు చేరుకునేవాళ్లం. ఆ టైములో ఏది దొరికితే అది...ఎంత దొరికితే అంత అన్నట్టుగా ఉండేది వ్యవహారం.ఉన్న ఈ తలనొప్పులు చాలవన్నట్టు పుకార్లు...వదంతులు పుట్టుకొచ్చేవి. వాడింట్లో తుపాకి ఉంది...వీడింట్లో పొడవాలి కత్తి ఉంది...వాడింటిపై రాళ్లుండాయం...కర్రలుండాయంట...పై గేరిలో కొట్టుకున్నారంట...కత్తులతో పొడుచుకున్నారంట..ఏది నమ్మాలో..ఏది నిజమో..అర్థం కాక తలపట్టుకునే వాళ్లం. లోలోపల భయం కూడా పెరిగిపోయేది. అంతెందుకు ఈ వదంతుల పుణ్యమా అని మేమూ కమానులో ఎందుకైనా మంచిదని ఇళ్లల్లో పొడుగాటి కర్రలు, కారంపొడి డబ్బాలు రెడీ చేసుకున్నామంటే పరిస్థితి ఎంత ఉద్రిక్తంగా ఉండేదో అర్థం అవుతుంది. ఓ రోజు అర్ధగంట కర్ఫూ సడలిస్తే ...కమాను వెనక రోడ్డు..వాసవీ కళ్యాణమం టపం వద్ద గుర్తు తెలీని ముసలోడి నెత్తిపై ఎవరో రాయి వేసి సంపేసిండారని వార్త గుప్పుమంది. ఆ తర్వాత ఏమైందో తెలీదుగానీ మరసటి రోజు మళ్లీ కర్ఫూ టైట్ చేసేసిండారు. కమాను రెండు పక్కల వీధుల మిద్దెలు దాదాపు అంటుకునే ఉంటాయి. కింద అయితే పోలీసులతో పజీతి అని కొందరు పిల్లలు పైకెళ్లి ఆడుకునేవాళ్లు. ఇంకొందరు మాలాంటి పెద్ద పిల్లలు చుట్టుపక్కల ఏం జరుగుతుంది...పోలీసోళ్లు ఏమన్నా తిరుగుతుండారా అని సీఐడీ పని చేసేకి పైన ఎక్కేవాళ్లం. ఈ అతి చేష్టలే ఓ సారి కొంపముంచింది. ఓ రోజు మద్దేనం ఉన్నట్టుండి కమానులోకి పోలీసోళ్లు వచ్చి సీదా మిద్దెక్కేశారు. పైన ఉన్న కొందరు వీరిని చూసిందే తడువు...లగెత్తినారు.అయితే పాపం కొందరు అమాయకులు దొరికిపోయిండారు. పక్కవీధి రాగి దొరికితే వాణ్ని పోలీసులు లాఠీలతో బాదేసారు.మాట్లాడలేని రాగిని పోలీసులు కొట్టిండారని తెలిసి ఎంతమంది బాధపడ్డామో..ఎంతమంది లోలోన ఆవేశంతో అరిసిండామో!! ఓరోజు చిన్నగుండ మాట్లాడుతూ...కమానుకాడ ఉంటే పోలీసులు ఆడ నుంచి హావన్నపేటకు గురిపెట్టి కాల్చిండారని...గుండు తన కళ్లముందే సర్రుమంటూ దూసుకెళ్లిండాదని చెబుతుంటే..ఓ పెద్ద జేమ్స్ బాండ్ కతలా ఆసక్తిగా విన్నాం. లోపల భయపడ్డాం కూడా. కర్ఫూ ఇంత కఠినంగా ఉంటుందా? ఇన్ని బాధలు భరించాల్సి ఉంటుందా అని కమాను వాళ్లం అనుకునిండాం.

ఊర్లో ఏ పండగ అయినా సానా ఉషారుగా చేసుకునేవాళ్లం. గణేష పండగ వచ్చిందంటే..ఏ సందులో చూసినా వినాయకుడి బొమ్మలే! మైకులు పెట్టి భజనలు,పాటలతో హోరెత్తించేవారు. పూజలతో కళకళ...ప్రసాదాల పంపిణీతో సందడి కనిపించేవి.దసరా వస్తే నగరేశ్వర గుడి, వాసవికళ్యాణమంటపం తదితర ప్రాంతాల్లో రంగురంగుల దీపాలు కనువిందు చేసేవి. దీపావళి వస్తే యాడ చూసినా బాణాల శబ్దాలే. రంగుల పండుగంటే ఊరంతా వసంతం ఆడినట్టుండేది. రంజాన్ మాసంలో ఊరు ఊరంతా పెద్దమసీదుకాడే తిరుగుతుండేది. రాత్రిపూట మసీదు చూసేకి అందరం పోయేవాళ్లం. మసీదు ముందర అంగళ్లలో బెల్లం జిలేబీలు, కాజాలు, బెల్లం డాణీలకు ఎక్కడ్లేని గిరాకీ! పీర్ల పండగ వస్తే పులివేషాలేసుకుని రోడ్లపై సందడి చేసేవాళ్లు.సాయిబుల ఇంట్లో పండ్లి జరిగితే రాత్రి వాళ్లు తీసే మెరవణి చూసేందుకు మిద్దెలెక్కేవాళ్లం. కూతురు కాపురానికి పంపే బీరువాలు...సోఫాలు...అల్లుడికిచ్చే కొత్త సైకిలు అన్ని ప్రదర్శనగా తీసుకెళుతుంటే ఎంత గొప్పగా ఉండేదో. వారు వీరు...అ వర్గం ఈ వర్గం అని లేకుండా ఏ పండగ వచ్చినా సంబరాలు చేసుకునేవాళ్లం. ఇంక కమాను చుట్టుపక్కల చెప్పాల్సిన పనే లేదు. పండగ వచ్చిందంటే వెంటనే తెల్సిపోయేది. ఉత్సాహం ముందుగానే వచ్చి గుమ్మాల ముందు వాలిపోయేది.పచ్చతోరణాలు...అందరూ కలిసి తిరగడం...గుళ్లల్లో సందళ్లు...చూడ్డానికి నిజంగా రెండు కళ్లు సరిపోయేవి కావు. ఆ ఆనందాన్ని వచ్చే పండగ దాకా దాచుకుని మురిసి మెరిసిపోయేవాళ్లం!

అంతా బాగానే ఉండాది అనుకుంటుండగానే...మరి ఎవరికి ఏం కన్నుకుట్టిందో తెలీదుగానీ అనుకోకుండా గొడవలు మొదలయ్యాయి. ఎవరు బాధ్యులు అనడం కన్నా అందరం బాధితులమే అంటే బాగుంటుంది. కేవలం ఈ గొడవల వల్ల ఎవరికీ మనశ్శాంతి లేకుండా పోయింది. పండగ వస్తే చాలు పూలు,తమలపాకులు, టెంకాయ, ఊదికడ్లు అమ్మే సాయిబుల

అంగళ్లు కిటకిటలాడేవి. గుళ్లో గ్రామఫోను రికార్డుల్లోంచి ఎమ్మెస్ సుబ్బులక్ష్మి భజగోవిందం...ఘంటసాల భగవద్గీత..మసీదు మైకుల్లోంచి ముల్లా అద్భుత ఆలాపనో మమ్మల్ని భక్తిరసంలో ముంచెత్తేది. ఈ గొడవల మూలాన ఊరి పరిస్థతి మారిపోయింది. ఊర్లో కర్నూలు పోలీసులు దిగారంటే...ఏదో పండగ వచ్చినట్టుందే అనుకునే దుస్థితి. దసరా దీపావళి, గణేష్ రంజాన్ పండగలన్నీ ఊరి పొలిమేరలోనే ఆగిపోయాయి. గుళ్లు బోసిపో్యాయి. మసీదు ముందు నిశ్శబ్దం...ఇంట్లో పిండివంటలు చేసుకుని కృష్ణార్పణం అనుకునే వాళ్లం. మేమెంతో ఇష్టపడే హోలీ మాయమై పోయింది.పండగ రోజున ఊర్లో 144 సెక్షన్ పెట్టేవాళ్లు. ఎవరూ గుంపులుగుంపులుగా తిరగడానికి వీల్లేదు. ప్రతిగుడి,మసీదు కాడ పోలీసుల గుంపు కనిపించేది. హావన్నపేట చౌరస్తా కాడ కుర్చీలపై పోలీసులు కునికిపాట్లుపడతూ కనిపించేవాళ్లు. కమాను కట్టలపై కూర్చొని పోలీసులు పేపర్లు చదువుతుంటే...వారికి కాఫీలు,టీలు సప్లై చేసేవాళ్లం. వారు మాతో చాలా స్నేహంగా ఉండేవాళ్లు. పండుగలకు బంధువులు ఇంటికొచ్చినట్టుగా ఉండేది. ఏవో పిచ్చిపాటి కబుర్లు చెప్పేవాళ్లు. మొదట్లో ఏ పోలీసుల్ని చూసి హడలెత్తిపోయామో...తర్వాత వారితోనే సరదాగా మాటలు కలిపేవాళ్లం. ఊరి పరిస్థితి ఇలా ఉంటే పాపం మీరు మాత్రం ఏం చేస్తారులే...అన్నట్టుగా వారు వ్యవహరించేవారు. ఇలా ఒకటి కాడు రెండు కాదు దగ్గరదగ్గర పది పదిహేనేళ్లు ఊర్లో పండగ సందడే లేకుండా పోయింది. మొదట్లో ఉన్నంత ఉద్రిక్తత లేకున్నా...ఊరిలో పండగ చేసుకోలేని వాతావరణం మాత్రం కనిపించేది. ఈ క్రమంలోనే ఊరికి సున్నితప్రాంతమని ముద్ర కూడా వేసేశారు. పండుగ కళ కాస్తా ఖాకీ కళగా మారిపోయింది. కమాను ఇందుకు మినహాయింపుకాదు. పండుగల్ని...ఆ ఆనందపు అనుభూతుల్ని పోగొట్టుకున్న ఊరు...రంగు వెలిసిన మేడలా నిస్తేజంగా..నిర్భావంగా మారి దీనంగా నిలుచుండిపోయింది.

ఇదంతా గతం. కాలం అన్నింటికీ మందంటారు. నిజమే! ఇప్పుడు మా ఊరు మళ్లీ మామూలు స్థితికి వస్తోంది. ఊళ్లో మెలమెల్లగా పండగ కళ వచ్చి చేరుకుంది. గణేశుడి బొమ్మలు వీధుల్లో మళ్లీ ప్రత్యక్షమయ్యాయి. దసరాకు జమ్మి ఆకులు ఆత్మీయంగా ఇచ్చుకునేందుకు మునిసిపల్ గ్రౌండుకు వెళుతున్నాం. రంజాన్ కు పెద్దమసీదు మళ్లీ కళకళ లాడుతోంది.బెల్లం జిలేబీలు తింటున్నాం. అంతా బాగా ఉందనుకున్నా, పండగ అంటే ఇప్పటికీ మనసులో ఏదో మూలలో పీకుతుంటుంది. బహుశా అది మేం అనుభవించిన, చూసిన చేదు ఘటనల వల్ల కావచ్చు! ఇబ్బందుల మాటెలా ఉన్నా...కర్ఫూ సమయంలో కమానులో మేం పడ్డ కష్టాలు...పాట్లు తలచుకుంటే ఇప్పటికీ తమాషా అనిపిస్తుంది.పోలీసుల కవాతులు...వదంతుల పుణ్యమా అని రాత్రంతా సరికొత్త వ్యూహలకు పదును పెట్టడాలు...ఈ క్షణాన ఇక్కడ నిలిచి చూస్తే...అప్పట్లో మాది ఎంత అమాయకత్వం కదా అనిపిస్తుంది. అంతేకాదు పెదాలపై ఓ సరదా నవ్వు లీలగా మెరిసి తళక్కుమంటుంది!!

మరిన్ని కథలు

Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న
ఓ breaking news
ఓ బ్రేకింగ్ న్యూస్
- బివిడి ప్రసాద రావు
chettu baadha
చెట్టు బాధ
- లక్ష్మీ కుమారి.సి