చాలా కాలం క్రితం ఒక అడవికి రాజైన సిం హం ఒక గుహలో నివసిస్తుండేది. సమీపం లోని పొదల్లో ఉండే ఒక ముంగిస ఈ మృగరాజుని దూరంగా ఉండి గమనిస్తుండేది.
జూలుతో ఠీవిగా కనపడే ముఖం, రాజసం ఉట్టి పడే నడక, ఎండ, వాన, చలి బాధ లేకుండా హాయిగా గుహలో మృగరాజు హోదా లో బతకడం ఇవన్నీ గమనిస్తున్న ముంగిసకి కొన్నాళ్ళకి సింహం పై అసూయ కలిగింది.
ఎలాగైనా దాన్ని అంతమొందించి ఆ గుహలో తాను నివసించాలని కలలు కంది. ఆలోచించగా ఆలోచించగా దానికో ఉపాయం తట్టింది.
ఒక రోజు ఉదయాన్నే గుహ ముందు మోకరిల్లి దీనంగా అరవ సాగింది. ఆ దీనాలాపన విన్న సిం హం బయటకు రాగానే "ప్రభో!కాపాడండి. అక్కడొక జంతువు నన్ను భయ పెడుతోంది. దానికి నేను నమస్కరించ లేదని "సంస్కారం లేదా? అడవికి రాజునని తెలీదా?" అని తిట్టి పోసింది. మాకు రాజు నువ్వు కాదు. వేరే ఉన్నారు. అని నేనంటే చెంప పై కొట్టింది. "మీ రాజుని దమ్ముంటే వచ్చి నన్ను గెలవమను." అని చెప్పింది. మీరే వచ్చి దాని పొగరణచాలి."అంది. ఆ మాటలు విన్న సింహం మండిపడుతూ ముంగిస వెనకాలే వెళ్ళింది.
దూరంగా కాలి బాట సమీపంలో ఉండే బావి దగ్గరకు తీసుకు వెళ్ళి తొంగి చూడమంది ముంగిస. నీటిలో కనబడే తన ప్రతి బింబాన్ని చూసి మరో సింహంగా పొరబడి కోపంతో గర్జించింది సింహం.
కానీ ఇలా ఆలోచించింది. 'కుందేలు మాటలు విని మా ముత్తాత నూతిలో దూకాట్ట. నేను అలా చేయ కూడదు. నూతిలో సింహాన్నే బయటకు రానీ. అప్పటి వరకు వేచి ఉంటాను' అనుకుంది. నూతి గట్టునే తిష్ట వేసింది.
అప్పటినుండి ఆకలేస్తే త్వరగా దగ్గర్లో దొరికింది వేటాడి తినేయడం, నూతి గట్టున కునికి పాట్లు పడడం ఇదే సింహం దిన చర్యగా మారింది.
ఇక ముంగిస దర్జాగా సింహం గుహలోనే ఉండ సాగింది. ఇక్కడేమో సింహానికి కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్ర కరువైనాయి.
ఈలోగా కాలి బాట గుండా చుట్టు పక్కల పల్లెలకి రాక పోకలు సాగించే జనంలో కలకలం మొదలైంది. నూతి గట్టున సింహం తిరుగాడుతుండడం చూసి వారు భయంతో వణికిపోయారు. చుట్టు తిరిగి వెళ్ళసాగారు.
అప్పుడప్పుడు నీళ్ళు తోడుకునే జనం రాకపోవడంతో నూతిలో నీరు నాచు పట్టింది. ఒక రోజు తొంగిచూసిన సింహానికి ప్రతిబింబం కనపడలేదు.
"ఓహో! నా శత్రువు నాకు భయపడి నూతిలోంచి బయటకి రాక నూతిలోనే చచ్చింది. అందుకే నీళ్ళు పాడైపోయాయి." అనుకుంది సింహం. పరమానందంతో అడవి అదిరిపోయేలా గర్జించింది.
నూతి సమీపంలోని ఒక పుట్టలోని పాము చాలా రోజుల నుండి ఈ తతంగం గమనిస్తోంది. తమ రాజు అలా అమాయకంగా ముంగిస చేతిలో మోస పోవడంతో దానికి జాలేసింది.
యుక్తిగా మృగరాజుని మోసం చేసిన ముంగిస అంతు చూడాలనుకొంది...
సిం హం వద్దకెళ్ళి, అదేమిటి రాజా? మీ గుహ వదిలి బావి వద్ద ఉంటున్నారు, ఎవరకోసం ? అనడిగింది...
ఎవరో కొతరాజట, నన్నే సవాల్ చేసిందట, బయటికొస్తే దాని అంతు చూడ్డామని కాచుక్కూర్చున్నాను? అంది సిం హం...
దానికి పాము, " అయ్యో రాజా మీరిక్కడ కాపు వేసి కూర్చున్నారు, ఆ జీవి దర్జాగా మీ గుహలోనే తిష్ట వేసింది...కావాలంటే వెళ్ళి చూడండి అని చెప్పింది....అసలే ఇన్నిరోజులూ ఎండకీ చలికీ బికచచ్చి కోపంతో ఉన్న స్మ్ హం ఒక్క ఉదుటన పరిగెత్తి తన గుహకు చేరుకునేసరికి దర్జాగా కూర్చుని ఉన్న ముంగిస కనిపించింది...ముంగిస చేసిన మోసం అర్థమై, దాని మీద పడి చంపేసింది సిం హం....
నీతి : అధికారులతో ఆడుకోరాదు...అది అసలుకే ప్రమాదం.