షాక్ - చిలకలపూడి సత్యనారాయణ

shock

స్నేహితుడు దివాకర్ కు సీరియస్ గా ఉన్నదని తెలిసిన మరు క్షణం క్రిష్ణ పట్నం బయలు దేరాడు బుచ్చి బాబు.
బస్సు దిగిన వెంటనే టిఫిన్ కూడా చేయకుండా తిన్నగా హాస్పిటల్ కు వెళ్లాడు.

స్నేహితుడు దివాకర్ ఐ.సి.యూ లో ఉన్నాడని తెలుసు కుని అక్కడికి చేరుకున్నాడు బుచ్చి బాబు.

ఐ.సి.యూ బయట కుర్చోనున్న దివాకర్ భార్య మాలిని, బుచ్చి బాబును చూసిన వెంటనే పెద్దగా ఏడవడం మొదలు పెట్టింది.

"ఊరుకో చెల్లెమ్మా. దివాకర్ కు ఏమీ కాదు. నువ్వు ధైర్యంగా ఉండు…ఇంతకీ అసలేం జరిగింది. దివాకర్ని ఐ.సి.యూ లో పడుకో బెట్టే టంత పెద్ద జబ్బు చేసిందంటే వాడికి ఈ జబ్బు ఇది వరకే ఉండుండాలి. డాక్టర్లకు చూపించుకోలేదా" మాలినిని అడిగాడు బుచ్చి బాబు.

“లేదన్నయ్యా…ఆయనకు ఎటు వంటి జబ్బూ లేదు. అదే నాకు ఆశ్చర్యంగా ఉంది. సాయంత్రం నాలుగింటికి నాకు కబురొచ్చింది. మీ ఆయనకు చాలా సీరియస్ గా ఉంది, మీరు వెంటనే బయలు దేరి రండి అని చెబితే వెంటనే బయలు దేరి వచ్చాను. వచ్చిన వెంటనే డాక్టర్లు కలవమన్నారు అని చెబితే వెళ్లి కలిశాను" …వస్తున్న ఏడుపును దిగమింగుకోవటానికి ప్రయత్నిస్తూ కొంగుతో కళ్లు తుడుచుకుంది మాలిని.

"డాక్టర్లు ఏం చెప్పారు" అడిగాడు బుచ్చిబాబు.

“మీ ఆయనకు జబ్బేమీ లేదమ్మా...ఏదో షాకింగ్ న్యూస్ వినడం వలన షాక్ లో ఉన్నారు. ఆ షాక్ వలనే మాటా-మంతీ లేకుండా మూర్ఛ పోయారు. ట్రీట్ మెంట్ ఇచ్చినా గాని లేవ లేదు. అందుకని ఐ.సి.యూ లో అబ్జర్వేషన్ లో ఉంచేము అని చెప్పారు "

"అంతలా మూర్ఛ పోయేటంత బ్యాడ్ న్యూస్ ఏం వినుంటాడు చెల్లెమ్మా?"

“అదే అర్థం కావటం లేదు అన్నయ్యా... ఉదయం స్కూలుకు వెళ్లేటప్పుడు మామూలు గానే ఉన్నారు. ఇదిగో సాయంత్రం ఇలా..." దఃఖం గొంతుకు అడ్డు పడుతుంటే మాలిని మాట్లాడ లేక పోయింది.

"ఊరుకో చెల్లెమ్మా. దివాకరం కు ఏమీ కాదు...నేను వెళ్లి ఒక సారి డాక్టర్ను కలిసి డీటైల్ గా విషయం తెలుసుకొస్తా" అంటూ అక్కడి నుండి బయలు దేరాడు బుచ్చి బాబు.

“సారీ బుచ్చి బాబు గారు...మీ స్నేహితుడు దివాకర్ ఆరొగ్య విషయంలో ఇంత కంటే మేము ఏమీ చెప్ప లేము. ఐ మీన్, ఇంత కంటే చెప్పటానికి ఏమీ లేదు. ఆయనకు ఏ జబ్బూ లేదు. బి.పి నార్మల్, పల్స్ నార్మల్, హార్ట్ బీట్స్ నార్మల్, వైటల్ ఆర్గన్స్ ఆర్ ఫంక్షనింగ్ నార్మల్...హీ ఈజ్ నాట్ ఇన్ కోమా…షాక్...షాక్ లో ఉన్నారు. షాక్ తగిలితేనే అలా అవుతారు. ఫిజికల్ షాక్ తగిలినట్లు సూచనలు లేవు...కాబట్టి మెంటల్ షాక్ తగిలుండాలి. ఆయన్ను హాస్పిటల్ కు తీసుకు వచ్చిన వారికి కూడా ఏమీ తెలియదు. ఎందుకంటే రోడ్డు మీద పడి పోయుంటే తీసుకు వచ్చి చేర్చారు. కాబట్టి అయన షాకుకు కారణం ఆయనే చెప్పాలి...అంత వరకు మనం ఆగాలి" చెప్పాడు డాక్టర్.
బుచ్చి బాబు డాక్టర్ రూము నుండి బయటకు వచ్చాడు. అక్కడున్న కుర్చీలో కూర్చున్నాడు. చివరి సారిగా తాను దివాకర్ ను కలిసిన సంఘటనను గుర్తుకు తెచ్చుకున్నాడు.

*********************************

క్రిష్ణ పట్నం రిజిస్ట్రార్ ఆఫీసు నుండి బయటకు వస్తున్న బుచ్చి బాబు కు దివాకర్ అటుగా వెళ్లటం కనిపించింది. "దివాకరం...ఒరేయ్ దివాకరం" అని అరిచాడు.

దివాకర్ ఆగాడు. ఎవరు పిలిచారా అని వెనక్కి తిరిగి చూశాడు. తన స్నేహితుడు బుచ్చి బాబు కనబడ్డాడు.

"బుచ్చి బాబూ...ఏమిటిలా చెప్పా పెట్టకుండా మా ఊరొచ్చావు!" ఆశ్చర్యంగా అడిగాడు దివాకర్.

"చెప్పేటంత టైము కూడా దొరక లేదు దివాకర్. అందుకే నేనొస్తున్నట్టు నీకు ముందుగా ఇన్ ఫార్మ్ చేయ లేక పోయాను...అది సరే నువ్వేంటి ఇలా చిక్కి పోయావు. ఒక పట్టాన గుర్తు పట్ట లేక పోయాను"

"చిక్కి పోలేదురా...స్లిమ్ముగా తయారయ్యాను"

"ఏదో ఒకటిలే... వొళ్లు తగ్గించమని డాక్టర్ గాని చెప్పాడా?"

"డాక్టర్ చెప్పలా... డైరక్టర్ చెప్పాడు"

"ఈ మధ్య మీ గవర్నమెంట్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్ మెంట్ డైరక్టర్లు ఈ పని కూడా మొదలు పెట్టారా!?"

"మా ఎడ్యుకేషన్ డిపార్ట్ మెంట్ డైరక్టర్ కాదు...సినిమా డైరక్టర్"

"సినిమా డైరక్టరా...!?" బుచ్చిబాబు తన ఆశ్చర్యం వెలిబుచ్చాడు.

"ఓ...నీకు విషయం తెలియదు కదూ. అవును మనం కలుసుకుని చాలా రోజులయ్యింది. అందుకనే నేను చెప్పేది నీకు కొత్తగా ఉంది. నీకు అసలు విషయం చెప్పాలి...రా...అలా ఆ టీ క్యాంటీన్ లో కూర్చుని మాట్లాడుకుందాం" అంటూ అటు వైపుకు నడిచాడు దివాకర్. బుచ్చిబాబు స్నేహితుడిని అనుసరించాడు. ఇద్దరూ టీ క్యాంటీన్లో కూర్చున్నారు.

"నేను సినిమాలో నటించ బోతున్నాను" చెప్పాడు దివాకర్. అప్పుడే వేడి వేడి టీ గ్లాసును నోటి దగ్గర పెట్టుకున్న బుచ్చిబాబు, దివాకర్ చెప్పిన మాటకు ఉలిక్కి పడటంతో వేడి వేడి టీ అతని పెదవులను తాకింది. "అబ్బా" అంటూ టీ గ్లాసును కింద పెట్టాడు.

"షాక్ తిన్నావు కదూ...నేను ఈ మాట చెప్పిన వెంటనే అందరూ షాక్ తింటున్నారు. కానీ నేను చెప్పేది నిజం"

"రేయ్ దివాకరం...నువ్వు హీరోలాగా ఉంటావనేది అక్షరాలా నిజం. నేనే ఈ విషయాన్ని నీ దగ్గర చాలా సార్లు చెప్పాను...అది మాట వరసకే గాని బంగారం లాంటి గవర్నమెంట్ ఉద్యోగం మానుకుని సినిమాల్లో చేరమని ఇచ్చిన సలహా మాత్రం కాదు"

"అయ్యుండచ్చు...కానీ నన్ను వెతుక్కుంటూ వచ్చిన అవకాశాన్ని నేను వదులుకుంటే...బహుశ నా అంత దురదృష్టవంతుడు ఇంకొకడుండడు"

“దివాకరం సినిమా అంటే ఒక ‘మాయ’ రా. ఒక జీవిత కథని రెండు గంటల్లో చూపించి ముగించే ఒక ఇంద్రజాల వేదికరా అది. మంత్ర దండం అనేది ఒక కర్ర ముక్కే తప్ప, అందులో ఏమీ ఉండదని గౌతమ బుద్ధుడు చెప్పినా, అందులో మంత్ర శక్తి ఉంటుందని చూపించి నమ్మించేదే సినిమా రా. నిజ జీవితంలో జరగటానికి వీలు లేని సంఘటనలను జరిగినట్లు, జరుగుతాయన్నట్లు చూపించేది సినిమా...అలాంటి ఇంద్ర జాల వేదికను ఎక్కాలని ఆశ పడకురా. ఆ వేదిక ఎక్కి హిమాలయా పర్వతాలంత ఎత్తుకు ఎదిగి పోవాలని అత్యాశ పడిన వారెందరో అధ:పాతాళానికి పడి పోయారు"

"చూడు బుచ్చి బాబు... ‘ సినిమా’ అని చెప్ప గానే అదేదో తప్పుడు పదం అన్నట్టు ఫీలయ్యే వారే ఎక్కువగా ఉన్నారు. నువ్వూ ఆ కోవకు చెందిన వాడివే. కానీ నాలాంటి హీరో పోలికలు ఉన్నవాడు అలా ఫీలవ కూడదు...అందు లోనూ వెతుక్కుంటూ వచ్చిన అవకాశాన్ని చేజార నివ్వ కూడదు"

"నిజం గానే వెతుక్కుంటూ వచ్చిందా?...నిజం చెప్పు"

అబద్ధం చెప్పటం చేత కాని దివాకర్ "లేదనుకో...హీరోలు కావలెను అని పేపర్లో ప్రకటన వస్తే, అది చూసి నేను అప్లై చేశాను” అని నిజం చెబుతూ “నాలాగా ఎన్నో వేల మంది చేసుంటారు కదా...అందులో నన్ను సెలక్ట్ చేశారంటే, అవకాశం నన్ను వెతుక్కుంటూ వచ్చిందనేగా అర్ధం" అంటూ తన వాదాన్ని జస్టిఫై చేశాడు.

“సరే...నేను ఎంత చెప్పినా నువ్వు వినిపించుకోబోయేది లేదు. నువ్వే కాదు సినిమా వేదిక పైన మోజు పెంచుకున్న వాళ్లెవరూ వినిపించు కోరు. అదే సినిమా అన్న మాటకున్న మహాత్యం. అయినా స్నేహితుడువి కాబట్టి చివరిగా ఒకే ఒక మాట చెబుతాను. సాఫీగా సాగి పోతున్న నీ జీవిత ప్రయాణాన్ని అనవసరమైన ఆశలతో మలుపు తిప్పుతూ ప్రమాదాలను కొని తెచ్చుకోకు...సరేనా" అంటూ అక్కడ్నుండి బయలు దేరాడు బుచ్చి బాబు.

"సరే...సరే" అని సమాధానం చెబుతూ ఫ్రెండును సాగనంపాడు దివాకరం.

********************

"ఏమిటన్నయ్యా...ఇక్కడే కూర్చుండి పోయావు" అని అక్కడ కొచ్చిన మాలిని అడగటంతో ఈ లోకం లోకి వచ్చాడు బుచ్చి బాబు.
"డాక్టర్ ని కలవ లేదా?” అడిగింది మాలిని.

“కలిశాను చెల్లెమ్మా. నువ్వు చెప్పిందే చెప్పారు. జబ్బు ఏమి లేదు...షాక్ లో ఉన్నారు అంటున్నారు"

“నేను చెప్పానుగా అన్నయ్యా" అన్నది మాలిని.

"సరే. నాకో విషయం చెప్పు...ఈ మధ్య దివాకర్ లో ఏదైనా మార్పు గమనించావా?"

"మార్పంటే?"

"మాటల్లో...ప్రవర్తనలో..."

"మాటల్లో, ప్రవర్తనలో మార్పులేమీ కనిపించ లేదు. కానీ ఆయన చేష్టలలొ కనిపించింది"

"ఏమిటా మార్పులు?...చెప్పు"

"స్కూలుకు వెళ్లేటప్పుడు పంచె కట్టుకు వెళ్లే వారు కదా...ఈ మధ్య ప్యాంటులు వేస్తున్నారు. అందులోనూ ఇన్ షర్ట్ చేసుకుంటున్నారు. చెప్పులకు బదులు షూ వాడుతున్నారు. తల వెంట్రుకలను నాలుగైదుసార్లు దువ్వుకుంటూ, ఏవో ఫేస్ క్రీములు, సెంట్లు వాడుతున్నారు. తిండి కూడా తక్కువ తింటున్నారు"

"ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడో నువ్వెప్పుడూ అడగ లేదా?"

"ఎందుకడగలా...అడిగాను. సినిమాలో చాన్స్ వచ్చిందని చెప్పారు. ఎలా వచ్చింది, ఎప్పుడొచ్చింది అని అడిగేను. ఆరు నెలల క్రితం

హీరోలు కావలెను" అని ప్రకటన చూశారట. ఆ ప్రకటనలో వాళ్లడిగినట్లు ఈయన ఆరు ఫోటోలు, ఈయన వివరాలు అన్నీ తెలుపుతూ వాళ్లకు అప్లికేషన్ పంపారట. రెండు నెలల క్రితం వాళ్ల దగ్గర నుండి జవాబు వచ్చిందట...అప్పట్నుంచి ఆయనలో ఈ మార్పులు గమనించాను"

"ఏమని జవాబు వచ్చిందో చెప్పాడా?"

“సినిమా ప్రొడ్యూసర్, డైరక్టర్ మా ఊరు వస్తారట. వచ్చే ముందు కబురు పెడతాము...మమ్మల్ని వచ్చి కలవాలని రాశారట"

"మరి వచ్చారా?"

"లేదు. ఇంకా రాలేదు. ఈ రోజు వరకు రాలేదు. త్వర లోనే వశ్తారట. పొద్దున స్కూలుకు వెడుతున్నప్పుడు కూడా అదే మాట చెప్పారు. వాళ్లు వచ్చిన రోజున ఈయన సినిమా హీరోలా కనిపించాలట. చూసిన వెంటనే వీడు కదా మనం వెతుకుతున్న హీరో అనుకుంటూ, ఇన్ని రోజులు సినిమా ఇండస్ట్రీ కి ఎందుకు కనిపించ లేదు అని వాళ్లు అడగాలట...అంత ఆశగా, ఆనందంగా చెప్పి వెళ్లిన ఆయనకు సాయంత్రం ఇలా ఎందుకు జరిగిందో అర్ధం కావటం లేదు"

ఇంతలొ అక్కడికి ఒక నర్స్ వచ్చి "మాలిని గారంటే మీరేనా...డాక్టర్ గారు మిమ్మల్ని ఐ.సి.యూ దగ్గరకు రమ్మంటున్నారు" అని చెప్పి వెళ్లి పోయింది.

మాలిని, బుచ్చి బాబు ఐ.సి.యు దగ్గరకు వెళ్లేరు. అక్కడ డాక్టర్ కనబడ్డాడు “చూడమ్మా...మీ ఆయనలో కొంచంగా కదలికలు కనిపిస్తున్నాయి. ఎప్పుడైనా పూర్తి సృహ లోకి రావచ్చు. కాబట్టి మీరు దగ్గరే ఉండండి. సృహ లోకి వచ్చిన వెంటనే, ఆయన షాకుకు కారణమేమిటో అడిగి తెలుసుకోండి...ఆయన సృహ లోకి వచ్చిన కొద్ది నిమిషాలలో మళ్లీ షాకు లోకి వెళ్లి పోవచ్చు. వెళ్తారని ఖచ్చితంగా చెప్ప లేను... వెళ్లచ్చు. ఆయన షాకుకు కారణ మేమిటో తెలుసు కుంటే బెటర్ ట్రీట్ మెంట్ ఇవ్వచ్చు" చెప్పాడు డాక్టర్.
మాలినికి దుఃఖంతో మాట రాలేదు.

బుచ్చి బాబు మాత్రం "మీరు చెప్పినట్టే చేస్తామండి" అని చెప్పి అక్కడే కూర్చున్నాడు.

**********************************

స్కూలు ఆవరణలో ఉన్న చెట్టు క్రింద పిల్లలకు పాఠాలు చెబుతున్న దివాకర్ దగ్గరకు ఒక కుర్రాడు వచ్చాడు. వాడిని చూసిని దివాకర్ "ఎవరు నువ్వు...ఎందుకొచ్చావు" అని అడిగాడు.

"నేను వెంకట రమణ విలాస్ హోటల్లో రూమ్ బాయిగా పని చేస్తున్నాను. మా హోటల్లో దిగిన ఒక పెద్ద మనిషి మీకు ఈ చీటీ ఇచ్చి రమ్మన్నారు" అని చెప్పి దివాకర్ చేతిలో ఒక చీటీ పెట్టి వెళ్లి పోయాడు.

దివాకర్ ఆ చీటీని విప్పాడు. "వెంటనే వచ్చి నన్ను కలవండి...ప్రొడ్యూసర్ & డైరెక్టర్ తిక్క సుబ్బులు" అని రాసుంది.
ఆనందంతో వెంటనే అక్కడి నుండి బయలు దేరాడు దివాకర్. తిన్నగా హోటల్ కు వెళ్లాడు. ప్రొడ్యూసర్ ఏ రూములో ఉన్నాడో తెలుసుకుని ఆ రూము దగ్గరకు వెళ్లాడు. ఒక సారి డ్రస్స్ సరి చేసుకుని, తల దువ్వుకుని, ముఖం తుడుచు కుని "మే ఐ కమిన్ సర్ " అన్నాడు.
"మిస్టర్ దివాకర్"

"అవును సర్ "

"రండి. లోపలకు రండి. మీ కోసమే వెయిట్ చేస్తున్నాను...అలా కూర్చోండి" అంటూ దివాకర్ కు కుర్చీ చూపించాడు.

దివాకర్ కూర్చున్నాక "మీరు పంపిన అప్లికేషన్ చూశాను. అందులో మీరు మీ స్కూల్ గురించి బాగా వివరించారు...మీ స్కూల్ గురించి మరి కొన్ని వివరాలు తెలుసుకోవాలని మిమ్మల్ని కలవటానికి మీ ఊరు వచ్చాను" "అడగండి సర్...చెబుతాను"

"మీ స్కూలు పేరేమిటి?"

"మా స్కూలు గవర్నమెంట్ స్కూలండి. కానీ మా స్కూలుకు ఇంకో పేరుంది. ఆ పేరు చెబితేనే అందరికీ ఈజీగా అర్ధమవుతుంది"

"అదే...దాని గురించే అడుగుతున్నా"

"నాకు ముందు మా నాన్న గారు చాలా రోజులుగా ఈ స్కూల్ లో పని చేశారు...ఈ స్కూల్ లో హెడ్ మాస్టర్, మాస్టర్, ప్యూన్ అన్నీ ఆయనే. ఆయన ఎప్పుడూ బఠానీలు తింటూ ఉండేవారు. పిల్లలకు కూడా పెడుతూ ఉండేవారు. చాలా రోజులుగా ఆయన నడిపిన స్కూలు ఇది. అందుకని అందరూ మా స్కూలును "బఠానీల మాస్టారు స్కూలు" అంటారు"

"పేరు చాలా బాగుంది...స్కూలు పేరు మార్చుకోవటానికి మీకేమన్నా అభ్యంతరముందా?"

"మార్చుకో వచ్చు...ఎందుకు అడుగుతున్నారు?"

"స్కూల్ ని సబ్జెక్ట్ గా పెట్టి ఒక సినిమా తీయ బోతున్నాను"

“సంతోషం సర్...చాలా సంతోషంగా ఉంది. ఈ రోజుల్లో స్కూల్ ల గురించి సినిమాలు ఎవరు తీస్తున్నారు సర్. తీయండి సర్. ప్రస్తుతం గవర్నమెంట్ స్కూల్ లు ఎలా ఉన్నాయో, ఆ స్కూల్ లో పిల్లలు ఎలా చదువు కుంటున్నారో...అన్నిటి కంటే ఆ స్కూల్లో పనిచేసే మా లాంటి ఉపాధ్యాయులు ఎన్ని కష్టాలు పడుతున్నారో చూపించండి...అన్నట్లు నేను కూడా నటిస్తానండి" చెప్పాడు దివాకర్.
"మొదట కథ రెడి అవనివ్వండి...ఆ తరువాత మీరు నటించటం గురించి ఆలోచిస్తా. నేను మీ ఊరు వచ్చింది, మీ స్కూలు గురించి తెలుసుకుని, దానిపై ఒక కథ రెడీ చేయాలనే గానీ మిమ్మల్ని నటుడిగా తీసుకోవటానికి కాదు" అసలు మాట చెప్పాడు ప్రొడ్యూసర్ & డైరెక్టర్ తిక్క సుబ్బులు.

దివాకరుకు మొదటి షాక్ తగిలింది...తమాయించుకున్నాడు."అడగండి" దివాకర్ స్వరం కొంచం నీరసించింది.

"మీ నాన్న గారు ఎలా ఉండే వారు...ఐ మీన్, ఆయన రూపం గురించి అడుగుతున్నా"

"కొంచం పొట్టిగా ఉండేవారు"

"కొంచం పొట్టిగా ఉండేవారా? లేక బాగా పొట్టిగా ఉండేవారా?"

"బాగా పొట్టిగా ఉండే వారనే చెప్ప వచ్చు"

"పొట్టి బఠానీల మాష్టారు స్కూలు”…అని సినిమాకు టైటిల్ పెడితే సరిగ్గా ఉంటుందేమో"

"సరి పోతుందండి"

"పార్టనర్స్ ను అడిగి పేరులో మార్పు చేయాలంటే చేస్తాను"

"మీ ఇష్టం సర్"

"ఇది కూడా పేరులో చేర్చుకోవచ్చు లాగుందే...పొట్టి బఠానీల మాస్టారు స్కూల్ లో మీ ఇష్టం. పొడుగ్గా ఉన్నా కొత్తగా ఉంది కదూ"

"అవునండి. మా వైపు స్కూలును బడి అని చెబుతారు"

"మంచి కాలం గుర్తు చేశారు...సినిమా బాగా ఆడాలంటే పేరు లోనే న్యాచురాలటీ ఉండాలి. పొట్టి బఠానీల మాష్టారు బడిలో మీ ఇష్టం...బాగుందా"

"ఈ పేరు కోసమే సినిమా వంద రోజులు ఆడుతుంది సర్ "

"అది సరే...మీ బడిలో ఎంత మంది పిల్లలు చదువుతున్నారు?"

"ఎక్కడ చదువుతున్నారండి...మధ్యాహ్నం భోజనం తినేసి ఉరు తిరగడానికి వెళ్లి పోతారు...ఒకటో నెంబర్ గాడిదలు"

"ఆహా...మీ చెయ్యి ఇలా ఇవ్వండొకసారి" అంటూ దివాకర్ చెయ్యి అందుకుని షేక్ హ్యాండ్ ఇస్తూ "సినిమా పేరు పూర్తిగా చెడి పోయింది...మీ బడీ వద్దూ...ఏమీ వద్దు" అన్నాడు ప్రొడ్యూసర్ & డైరక్టర్ తిక్క సుబ్బులు.

రెండో సారి షాక్ తిన్న దివాకర్ "ఏం చెబుతున్నారండి...!" ఆశ్చర్యంగా అడిగాడు.

“ఒకటో నెంబర్ గాడిదలు అన్నారే...అదే సినిమా పేరు. చెప్పి చూడండి. నోరూరుతుంది...ఒకటో నెంబర్ గాడిదలు. శభాష్. మీ ఊరు వచ్చినందుకు నా కొత్త సినిమాకు మంచి పేరు దొరికింది"

"మీరు రమ్మని కబురు పంపితే వచ్చాను. మా బడి పేరు మీ సినిమాకు ఉపయోగ పడదా?"

"వద్దు...దాని గురించి ఇంకో సినిమా తీసేటప్పుడు ఆలొచిస్తాను. ఇక మీరు వెళ్లచ్చు"

ఆ మాటతో పూర్తిగా నిరాశ పడ్డ దివాకర్ వస్తున్న ఏడుపును దిగ మింగుకుంటూ "మీ సినిమాలో ఎలాగైనా మా బడి పేరు వచ్చేటట్లు చూడండి సర్" అన్నాడు దివాకర్.

"సరే...సరే...ఆలోచిస్తాను" అన్నాడు ప్రొడ్యూసర్, డైరక్టర్.

దివాకర్ లేచేడు. నీరసంగా అడుగులు వేసుకుంటూ హోటల్ రూము బయటకు వస్తుంటే "ఒక్క నిమిషం" అన్న ప్రొడ్యూసర్ మాట వినబడింది. వెనక్కి తిరిగి ప్రొడ్యూసర్ ను చూశాడు.

"పొట్టి బఠానీల మాస్టార్ బడిలోని ఒకటో నెంబర్ గాడిదలు”...ఎలా ఉంది సినిమా పేరు" అన్నాడు.

"బ్రహ్మాండం...బ్రహ్మాండంగా ఉంది సర్" అని సంతోషంగా అరుస్తూ తిరిగి ప్రొడ్యూసర్ దగ్గరకు వచ్చాడు దివాకర్.

ప్రొడ్యూసర్ తన సూటు కేసులో నుండి కొంత డబ్బు తీస్తూ "ఇదిగోండి పది వేలు...సినిమా పేరు కోసం" అంటూ ఆ డబ్బును దివాకర్ చేతిలో పెట్టాడు.

"సంతోషంగా ఉందండి...చాలా సంతోషంగా ఉంది. డబ్బులు ఇచ్చినందుకు కాదు. సినిమాకు మా నాన్న గారి పేరు పెడుతూ సినిమా టైటిల్ ను ఖరారు చేసినందుకు...ఇక వెళ్లొస్తాను సర్" అని వెనక్కు తిరిగిన దివాకర్ ఏదో గుర్తొచ్చిన వాడిలా మళ్లీ ప్రొడ్యూసర్ వైపు తిరిగి "అన్నట్లు...సినిమా తీయడానికి మా ఊరు ఎప్పుడొస్తారు" అని అడిగేడు.

"మీరు ఓ ఇరవై గాడిదలను రెడి చేసి ఉంచండి. మా టెక్నికల్ టీమ్ వచ్చి అందులో కొన్ని గాడిదలను సెలక్ట్ చేసుకుంటుంది...ఆ తరువాత సినిమా మొదలు పెడతాం" చెప్పాడు ప్రొడ్యూసర్, డైరెక్టర్ తిక్క సుబ్బులు.

"నటించడానికి నాకొక ఛాన్స్ ఇస్తారా?" చివరి సారిగా రిక్వస్ట్ చేశాడు దివాకర్.

"సినిమా పేరేమిటి"

"పొట్టి బఠానీల మాష్టారు బడిలోని ఒకటో నెంబర్ గాడిదలు"

"అందులో మీరే ఒకటో నెంబర్ గాడిద....సినిమాకు టైటిల్ ఫైనల్ చేసిన వెంటనే కథ డెవలప్ చేసేశాను. అలా కూర్చోండి...టూకీ గా కథ చెప్తాను"

అంత వరకు షాక్ తో నీరసంగా ఉన్న దివాకర్ ఒక్క సారిగా బలం వచ్చినట్లు ఫీలయ్యాడు. అక్కడున్న కుర్చీని ప్రొడ్యూసర్ దగ్గరకు లాక్కుని అందులో కూర్చుంటూ "చెప్పండి" అన్నాడు ఉత్సాహంగా.

ప్రొడ్యూసర్ & డైరక్టర్ తిక్క సుబ్బులు దివాకర్ కు కథ చెప్పటం మొదలు పెట్టాడు.

"మిగిలిన గాడిదలన్నీ నిజమైన గాడిదలు. మీరు గాడిద తోలు కప్పుకుని ఆ నిజమైన గాడిదలలో గాడిదగా వాటితో పాటూ ఉంటారు. మీకూ...ఒక నిజమైన గాడిదకూ మధ్య ఏర్పడే లవ్ కెమిస్ట్రీయే కథకు ముఖ్యాంశం"

"ఒక నిజమైన గాడిదతో మీకు ఏర్పడే ప్రేమ, దాని వలన మిగిలిన గాడిదలలో ఏర్పడే ఈర్ష్య... మీరు గాడిద కాదు, మనిషి అని తెలిసిన తరువాత జాతి వదిలి జాతి వచ్చి చిచ్చు పెడుతున్నావని ఆ నిజమైన గాడిదలన్నీ కలిసి మిమ్మల్ని బాగా చితక బాదుతాయి...మీరు చచ్చి పోతారు...అదే క్లైమాక్స్”

“అప్పుడు అక్కడ అన్నమయ్య ప్రత్యక్షమౌతాడు. జాతులు రెండేనయ్యా, ఒకటి కొట్టే జాతి...ఇంకొకటి కొట్టించుకునే జాతి అని ముగిస్తాడు...ఎలా ఉంది కథ " అని అడిగాడు తిక్క సుబ్బులు.

దివాకర్ కు అతి పెద్ద షాక్ తగిలింది. తమాయించుకున్నాడు. కుర్చీలో నుండి లేచాడు. "మీకు ఒక పెద్ద నమస్కారం సార్...నాకు మీ సినిమానూ వద్దు...మీ గాడిద దెబ్బలూ వద్దు, ఇదిగోండి మీ డబ్బులు" అంటూ డబ్బును టేబుల్ మీద ఉంచి వెనక్కి తిరిగేడు.

"మిస్టర్ దివాకర్..." అంటూ ప్రొడ్యూసర్ & డైరెక్టర్ పిలుస్తున్నా వినిపించుకోకుండా గబగబా నడుచుకుంటూ హోటల్ నుండి బయటకు వచ్చాడు. ఎటు వెళ్లాలో తెలియని అయోమయ పరిస్థితి. తల తిరుగుతున్న ఫీలింగ్...నిలబడే ఓపిక లేక పక్కనున్న అరుగు మీద కూర్చున్నాడు...పక్కకు ఒరిగాడు.

*********************************

"వద్దు...వద్దు" అంటూ కళ్లు తెరిచాడు దివాకర్. చుట్టూ చూశాడు. తాను హాస్పిటల్లో ఉన్నానని గ్రహించాడు.దూరంగా తన భార్య మాలిని, స్నేహితుడు బుచ్చిబాబు తలుపు తెరుచుకుని రావడం చూశాడు.

"సాఫీగా సాగి పోతున్న నీ జీవిత ప్రయాణాన్ని అనవసరమైన ఆశలతో మలుపు తిప్పుతూ ప్రమాదాలను కొని తెచ్చుకోకు" స్నేహితుని మాటలు గుర్తుకు వచ్చాయి.

కళ్లు మూసుకుని పడుకున్నాడు. దివాకర్ కళ్లు తడిసున్నాయి. “నిజ జీవితంలో హీరో అవడానికి తాపత్రయ పడొచ్చుగానీ... సినిమాలలో హీరో అవాలని తాపత్రయ పడడం అందరికీ సాధ్యమయ్యేది కాదు....అందునా, పెళ్ళాం బిడ్డలున్న తనలాంటి వాడికి, ఒక బాధ్యతాయుతమైన మాస్టారికి అస్సలు తగదు" దృడంగా మనసులో నిశ్చయించు కున్న దివాకర్ మళ్లీ కళ్లు తెరిచాడు. ఎదురుగా నవ్వుతూ కనిపించింది భార్య.

మరిన్ని కథలు

Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న
ఓ breaking news
ఓ బ్రేకింగ్ న్యూస్
- బివిడి ప్రసాద రావు
chettu baadha
చెట్టు బాధ
- లక్ష్మీ కుమారి.సి