అయ్యోమయం - రాచమళ్ళ ఉపేనదర్

ayyomayam

పని నుండి అలసిపోయి వచ్చిన పరమేశం గబ గబా నాలుగు మెతుకులు గొంతులో వేసుకొని, మంచమెక్కాడు. ఎక్కాడో లేదో దర్జాగా గురకపెట్టసాగాడు. ఆ గురకలోనే గాఢ నిద్రలోకి జారుకున్నాడు.

భార్య పుట్టింటికి పోయిన రోజున పరమేశానికి పర్వదినం. మంచానికి దుర్ధినం. భార్య వుంటే మోచేతి పొట్లతో క్రమ శిక్షణగా పడుకునేలా చేస్తుంది. భార్య లేనప్పుడు పిల్లల్ని తల్లి గురవమ్మ దగ్గరకు పంపించి, చిత్ర విచిత్రమైన నిద్రను సుఖంగా అనుభవిస్తుంటాడు. ఇప్పుడు కూడా అదే చేయ సాగాడు. కాళ్ళను వి ఆకారంలో చాపి, మంచం పట్టెలకు బలంగా ఆనించాడు. పెదాలను టప టపలాడిస్తూ ఆర్త ధ్వని లాంటి గురకను గది నిండా గుమ్మరిస్తున్నాడు. ఊరంతా మేలుకొనే వుంది. తను మాత్రం కలల లోకంలో విహరిస్తున్నాడు.

ఏ రోజు ఎలా వుంటుందో పైనున్న రాజుకే తెలుసు. మనిషికి తెలిసింది నలుసు. అ మాట కొస్తే పరమేశానికి తెలిసిందల్లా వంకాయ పులుసు.
"వామ్మో! ఓరి దేవుడో! యెంత పని జరిగిందిరో!" అని గురవమ్మ పెడ్తున్న శోకాలకు సప్త గుర్రాలతో స్వారీ చేస్తున్న గురక లోంచి గుడ్లెళ్ళ బెట్టాడు పరమేశం. రాక రాక వచ్చిన అవకాశానికి అంతరాయం కలుగ జేసిన తల్లిపై పట్ట రాని కోపంతో విరుచుకు పడదామని, దిగ్గున లేచి కూర్చున్నాడు.

పండ్లు పట పట కొరుకుతూ పక్క గది లోకి వెళ్ళాడు. టి.వి. ముందు జరుగుతున్న తతంగాన్ని చూడగానే అటెన్షన్ అయ్యాడు. భోరున ఏడుస్తున్న తన తల్లిని "వూర్కో నానమ్మ! వూర్కోమంటూ" పిల్లలు ఓదారుస్తున్నారు.

'ఏమైంది దీనికి? స్వంత బంధువులు చని పోయినా ఈ ఎత్తున ఏడ్చిన దాఖలాలు లేవు. కూడు తక్కువైందా? గుడ్డ తక్కువైందా? ఎందుకింతగా ఎగిసెగిసి పడుతోంది.' అనుకున్నాడు.

"ఎహే ఆపు నీ గోల బంగారం లాంటి నిద్ర పాడు చేసావు. ఇప్పుడేమైందని శోక రాగాలు" కస్సుమన్నాడు.

"ఒరేయ్! కొడుకా కూసో! మనల్ని ఏలేటోడు మోడి దొర గా టి.వి.లో ఏం జెప్తుండో సూడు! అయిదు వందలు, ఎయ్యి రూపాయలు చెత్త కాయితాలటయ్యో!" బొడ్లో దాచుకున్న సంచిని దులిపింది. కింద పడ్డ ఐదు, వెయ్యి నోట్లను తిప్పి తిప్పి చూసుకుంటూ గుండెలు బాదుకుంటూ... ఘోల్లుమంటుంటే... కీసుమనసాగిందామె గొంతు.

చేనులో బోరు వేయించాలని సంవత్సర కాలంగా దాస్తున్న లక్ష రూపాయలు గుర్తుకు రాగానే నిద్ర మత్తు నింగి వైపు దూసుకెళ్ళింది. వెన్నులో వణుకు మొలకెత్తుకొచ్చింది. ట్రాఫిక్ లో నిలిచి పోయిన వాహనాల్లా స్థంభించిన తన కళ్ళను టి.వి.కి గురి పెట్టి బిగుసుకు పోయాడు.
గురవమ్మ పెడ బొబ్బలు చుట్టు పక్కలకు పాకటంతో పరమేశం ఇంటి నిండా జనం వెల్లువెత్తారు. "ఏమైందేమైందంటూ?" కంగారు కంగారుగా అడిగారు. చీర కొంగుతో చెంపలు తుడ్చుకుంటూ... ముక్కు చీదుకుంటూ... "తినీ, తినకా కడుపు కట్టుకొని నాలుగు రాళ్ళు యెనకేత్తుంటే... యివి చెల్లవంటున్నారేందిరో దేవుడా! " బాధతో మూలగ సాగింది.

అసలి విషయం తెలవ గానే నోరెళ్ళ బెట్టారందరూ. "నీవే గాదు.. మావి కూడా... డబ్బులే... బ్యాంకులో మార్చుకో వచ్చని చెప్తున్నారుగా... ఏడ్సుడెందుకు?... ఊర్కో!" ధైర్యం చెప్పారు. అందరూ కల్సి... పది నిమిషాలకో సారి బ్రేకింగ్ న్యూసంటూ వస్తున్న వార్తలను అర్థరాత్రి వరకు కళ్ళల్లో ఒత్తులేసుకొని మరీ చూశారు. బ్యాంకులకు, పోస్టాఫిసులకు వెళ్ళి మార్చుకోవటానికి ఎన్ని తిప్పలు పడాలో తలచుకుంటూ... "ఇదేం ఖర్మరా! బాబు!" అనుకుంటూ ఎవరింటికి వారు వెళ్ళి పోయారు.

* * *

ఉదయాన్నే స్నానం చేసి కొత్త బట్టలేసుకున్నాడు. సైకిల్ శుభ్రంగా తుడుచుకున్నాడు. రోజుకు నాలుగు వేలే మార్చుకోవచ్చు నన్న నిబంధన వల్ల తొలుత తల్లి దగ్గరున్న నాలుగు ఐదు వందలు, రెండు వెయ్యి నోట్లను తీసుకున్నాడు. ఆధార్ కార్డ్ జేబులో వేసుకున్నాడు. గురవమ్మ ఆశీస్సులు తీసుకుంటుంటే... "నాన్నా నేనూ వస్తాను" వెంట పడ్ద ఏడేండ్ల కొడుకుని ముందు కూర్చోబెట్టుకొని... దగ్గర్లోనే వున్న టౌనుకి బయల్ధేరాడు.

తొమ్మిది కూడా కాలేదు. బ్యాంకుల నిండా బారులు తీరాయి లైన్లు. సైకిల్ ను చెట్టు పక్కన స్టాండేసి... చెమట తుడ్చుకుంటూ లైన్ లో నిలబడ్డాడు పరమేశం.

నిల్చున్న వారంతా మోడీ నిర్ణయం పై రకరకాల వ్యాఖ్యానాలు చేస్తున్నారు. కొందరు సమర్థిస్తున్నారు. మరి కొందరు దుయ్య బడుతున్నారు. పరమేశం పల్లెత్తు మాటనకుండా వినడంపై మాత్రమే దృష్టి నిలిపాడు.గంటన్నర గడిచాక బ్యాంకు తలుపులు తెరుచుకొన్నాయి. దీంతో అప్పటి వరకు వంకర టింకరగా మారిన లైన్ స్కేలుతో గీత గీసినట్లుగా మారింది. ఈలోపు పరమేశం చేతిని గుంజటం ప్రారంభించాడు కొడుకు.

"ఏయ్! ఏందిరా! సప్పిడి చేయకుండా నిలబడు" గద్దించాడు. "నాన్నా! బాగా వస్తుంది" చివరేలు లేపి చూపించాడు.

"ఇప్పుడా..?" కోపంగా చూసి... లైన్ నుంచి పక్కకు జరిగి ముందూ, వెనక్కి చూశాడు. లైనుకి సరిగ్గా మధ్యలో ఉన్నాడు. 'అమ్మో! ఈ టైంలో బయటకు పోతే వెనుక బడతాను.' అనుకున్నాడు. "అటు పోయి రాపో!" కను బొమ్మలు ఆడిస్తూ సైగలు చేశాడు. వాడివేమీ పట్టించుకోకుండా "నువ్వు రా... నాన్నా..." అదే పనిగా గుంజుతున్నాడు. తప్పేట్టు లేదనుకొని ముందున్న వ్యక్తిని పిలిచాడు. "సార్! పిల్లాడ్ని బయటకు తీసెకెళ్ళి వస్తాను. మీ వెనుక నేనే" నాలుగైదు సార్లు గట్టిగా చెప్పి మరీ వెళ్ళాడు. ఖాళీ స్థలం కోసం వెతుకుతూ అర కిలోమీటర్ నడిచాడు. పని పూర్తయ్యే సరికి పావు గంట దాటింది. ఆగ మేఘాల మీద పరిగెత్తుకుచ్చాడు. లైన్ బాగా కదిలింది. ఇంతకు ముందు నిల బడ్డది ఎవరి వెనుకో కనుక్కో లేక పోయాడు. కాసేపు ముందుకూ, వెనక్కి నడిచాడు. లాభం లేదనుకున్నాడు. మెల్లగా లైన్ మధ్యలో దూర బోయాడు. "ఏయ్! ఆగు! మేం మనషులం కాదా?" అంటూ నోరు తెరిచాడు ఒకడు.

అప్పుడు చూసాడు వాడి అవతారాన్ని. గుబురు మీసాలతో, మిడి గుడ్లేసుకొని తీక్షణంగా చూస్తున్నాడు. పరమేశానికి గుబురు మీసాలు చూస్తే గుండె దడ ఆటోమేటిక్ గా హైరేంజ్ లోకి వెళ్ళి పోతుంది. వెంటనే గజ గజ వణుకుతూ... గుబురు మీసాలోడ్ని నోట్లోనే తిట్టుకుంటూ లైన్ చివర కెళ్ళి నిల్చున్నాడు.

అలా ఎండకు ఎండి... చెమటకు తడిసి... ఆకలితో అలమటించి... కాళ్ళ నొప్పులను తట్టుకొని... కొడుకు కలుగజేస్తున్న అవాంతరాలను దాటి లైన్లో నిల్చుంటే... కౌంటర్ దగ్గరకు చేరే సరికి సాయంత్రం నాలుగైంది.

చచ్చీచెడీ నాలుగు వేలు మార్చుకోడానికే ఒక్క రోజంతా పోతే, ఇక తాను బోరుకోసం దాచుకున్న మొత్తం కొత్త నోట్ల లోకి మారాలంటే ఎన్ని రోజులు పనులు మానుకుని బ్యాంకు లైన్ లో నిల్చోవాలో తల్చుకోగానే అతడి గుండె వేగం ఒక్కసారిగా గంటకరవైమైళ్ళ వేగంతో కొట్టుకుంది.....సరేలే ఏదతే అదయ్యింది...ఓ పదిరోజులు నావి కావనుకుని బ్యాంకులకంకితం చేస్తే సరి అని గొణుక్కున్నాడు... అది విని పక్కనున్న ఆసామీ ఎవరో, " ఏంటి ? మళ్ళీ రేపొద్దామనుకుంటున్నావా? వారానికొక్కసారే," బాంబు పేల్చాడు....ఆ లెక్కన లక్ష రూపాయలు కొత్త నోట్ లలోకి మారాలంటే ఎట్లరా నాయనా అనుకుంటుంటే, మళ్ళీ ఆ ఆసామే ఉపదేశించాడు...దీనికింత బాధెందుకు? తీసుకోడానికి లిమిటుంది కానీ, బ్యాంకులో ఎయ్యడానికేం లేదు...ఎన్నైన ఏసుకోచ్చు....అన్నీ తెచ్చి ముందు ఏసేయ్..."

"ఏంటేసేదీ? నాకసలు బ్యాంకకౌంటే లేదు" నీరసంగా చెప్పాడు పరమేశం...

ఆ మాటతో పరమేశాన్ని ఎగాదిగా చూసాడా ఆసామి.. ఆ చూపులో " ఇగ సావుపో" అన్న భావం కనిపించింది పరమేశానికి.......సరే తర్వాత సంగతి తర్వాత, ముందైతే ఊళ్ళో అందరికన్నా ముందు చేతిలో పడ్డ రెండు వేల రూపాయల నోటుని అందరికీ గొప్పగా చూపించాలనుకొంటూ బయల్దేరాడు....

* * *

ఊర్లో కెళ్ళ గానే కనపడ్డ ప్రతి ఒక్కరికి కొత్త నోట్లు చూపిస్తూ మురిసి పోసాగాడు.అదే ఉత్సాహాంతో ఇంటికి వెళ్ళాడు. కొడుకును దగ్గరకు పిలిచి "ఒరేయ్ ఈ డబ్బులు నానమ్మకు ఇయ్యిపో!" అన్నాడు.

"నానమ్మ ఇదిగో కొత్త డబ్బులు" అంటూ గురవమ్మ చేతిలో పెట్టాడు మనుమడు. నోట్లను చూడగానే మండి పడింది. వెనక్కి, ముందుకూ మార్చి మార్చి చూసుకుంది. "ఒరేయ్! నేను పిచ్చిదాన్లా కనపడ్తున్నార్రా? మీ అయ్య సిన్నప్పుడు గోవిందు కొట్లో పావలా, అర్థ పెట్టి లాటరీ తీస్తే వచ్చే కాగితాలివి..." అంటుంటే ఉలిక్కి పడ్డాడు పరమేశం.

"అవి కాదే! బ్యాంకు వాళ్ళు ఇచ్చిన కొత్త నోట్లు."

"రంగు కాయితాలు అచ్చెయ్యటానికి బాంకోల్లు తిక్కలోల్లా? అప్పటి రంగు కాగితాలని అంత తేలిగ్గా యెలా మర్చి పోతారా? యివి అవే!
నాకివన్ని గాదు... నువ్వు మార్చకొచ్చిన నా నాలుగు వేలు నాకివ్వంటూ...” కొత్త నోట్లను పర్ర పర్ర చించేసింది.

"ఓసి నీ కడుపు గాల! ఎంత పని చేశావే...?" బిత్తరపోయి తెల్లమొహం వేశాడు. రెండు వేల కొత్త నోట్లు మిగిల్చిన విషాదంతో రెండుగా చీలి పోయింది పరమేశం గుండె. ఏం చేయాలో అంతు బట్టక ఉన్న చోటనే కుప్ప కుప్ప కూలాడు.

మరిన్ని కథలు

Kya huvaa
క్యా హువా
- కె. తేజస్వని
Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు