ఆనందు, రాజారావు, రవళి ల ఏకయిక పుత్రుడు ఆనందు కు ఎనిమిదో పుట్టిన రోజు ఈ మధ్యనే అయ్యింది
ఆ వేళ ఆదివారం
" ఆనందూ ఇంక లే అమ్మా రామం మావయ్య వచ్చే టయమయింది" అని వాళ్ళ అమ్మ పిలవగానే అనందు టక్కున లేచి కూర్చున్నాడు. అది ఇంట్లో అందరికీ ఆశ్చర్యం కలిగించే విషయమే. ఎందుకంటే మామూలుగా రోజూ వాళ్ళ అమ్మ 'లే అనందూ' అని ఓ పదిహేను నిమిషాలు, నిమిషానికి ఒక మాటు చొప్పున అరిస్తే కానీ ఆనందు మంచం దిగడు.
ఇవాళ వాడి చిన్న మావయ్య 'రామం' ఎదో పని మీద వస్తున్నట్టు మొన్న ఫోనులో మాట్లాడినప్పుడు చెప్పాడు.
రామం ఎప్పుడు ఫోను చేసినా వాళ్ళ అక్కతో మాట్లాడిన తరువాత 'ఆనందు' తో కూడా మాట్లాడకుండా ఫోను పెట్టడు. ముందు గొంతు మార్చి మాట్లాడి " ఎవరు మాట్లాడుతున్నారో " చెప్పుకో అని కాసేపు వాడిని ఆట పట్టిస్తూ ఉంటాడు.
రామం వస్తున్నాడంటే ఆనందు చాలా ఉద్రేక పడటానికి కారణం రెండు విషయాలు. మొదటిది రామం తెచ్చే చాకలేట్. వాళ్ళమ్మ చూడకుండా ఆనందు కి అందిస్తాడు రామం. ఆనందుకు కొంచెం ఆయాసం ప్రోబ్లం ఉండడంతో వాళ్ళమ్మ చాకలేట్లు ఎక్కువ తిననీయదు. రెండవది, ఎప్పుడు వచ్చినా ఎదో టయిములో షాపింగ్ కి తీసుకు వెళ్లి ఆనందు కు ఎదో ఒక ఆట వస్తువు కొని ఇస్తూ ఉంటాడు. ఈ మాటు ఆనందు మామూలుగా కంటే కొంచెం ఎక్కువ ఉద్రేక పడడానికి కారణం, వాళ్ళ ఇంటికి దగ్గరలోనే జరుగుతున్న ఒక ఎగ్జిబిషన్. రామం ఫోను చేసినప్పుడు ఆనందు దాని గురించి చాలా ఉద్రేకంగా చెప్పాడు. తాను అక్కడికి వెళ్లాలని, అమ్మా, నాన్న ఖాళీ లేక తనని తీసుకు వెళ్ళటల్లేదని. రామం రాగానే అక్కడికి తీసుకు వెళ్లాలని డిమాండ్ చేశాడు. ఆనందుని అక్కడికి తీసుకు వెడతానని రామం ప్రామిస్ చేశాడు ఫోనులో.
రోజూ , వాళ్ళమ్మ సహాయంతో లేచి బ్రష్ చేసుకుని స్నానం చేసి బట్టలు వేసుకోడానికి గంటన్నర పడితే, అవేళ అన్ని పనులూ అరగంటలో ముగించుకుని కూర్చున్నాడు ఆనందు.
బయట ఏ మాత్రం చప్పుడయినా ఎంట్రన్స్ లోని వరండా దగ్గరికి పరుగెడుతన్నాడు ఆనందు, రో హౌసెస్ లో వీళ్ళ ఇంటికి అనుకునే ఉన్న హౌస్ వరండా లో జానకయ్య గారు వీల్ చైర్ లో కూర్చుని ఆనందు ని చూస్తున్నాడు. కీళ్ళ వాతము వల్ల ఆయన ఎప్పుడూ ఆ చైర్ లోనే ఉంటాడు ఆనందు రెండు మాట్లు వరండా లోకి వచ్చి వెళ్లిన తరువాత, మూడో సారి అడిగాడు ఆయన " ఎరా ఎవరి కోసమయినా చూస్తున్నావా ? అనడిగారు నవ్వుతూ.
ఆనందు విషయం చెప్పిన తరువాత " ఓహో అలాగా! వెరీ గుడ్. మీ మావయ్య నీకు ఏమి కోన్నాడో రాగానే నాకు చూపించాలి ఒకే ?" అని కోడలు పిలిస్తే వీల్ చైర్ లోపలికి తిప్పాడు ఆయన
*******
మొత్తానికి రామం రావడం, ఆనందు కి చాకలెట్ అందించడం జరిగిన తరువాత, సాయంత్రం ఎగ్జిబిషన్ కి వెళ్ళడానికి ఒప్పందం కుదిరింది. ఆనందు తన స్నేహితులు ఎవరూ ఇప్పటి వరకూ కొననిది కొని వాళ్ళని ఆశ్చర్య పరచాలని, అలాటిది ఏమిటా అని ఆలోచిస్తూ సాయంత్రం దాకా కూడా తేల్చుకో లేక పోయాడు.
ఆ సాయంత్రం ఆనందు వాళ్ళ మావయ్య రామం తో ఎగ్జిబిషన్ కి వెళ్ళాడు. అక్కడ ఎన్ని షాపులు తిరిగినా అతనికి బాగా నచ్చిన దేదీ కనపడ లేదు. చివరికి ఒక చోట కొన్ని పంజరాలలో చిలకల్ని పెట్టుకుని ఒకతను కూర్చున్నాడు. ఒక్కొక్క పంజరంలో రెండేసి చిలకలు ఉన్నాయి. పంజరం లోనే అవి అటూ ఇటూ ఎగురుతూ ఎవరయినా వేసిన గింజలు తీసుకు తింటున్నాయి. ఆనందు కి అవి బాగా నచ్చాయి. అవి కిచ కిచ లాడుతూ ఎగురు తూంటే చాలా ఆనందంగా ఉంది వాడికి. వాడి బాబాయి ఇంకోటేదాయైనా తీసుకుందామని చెబుతున్నా . మారాం చేసి అదే కొనిపించుకుని ఇంటికి తెచ్చాడు
ఇంట్లో ప్రవేశిస్తూ ఉంటె పక్క వరండా లో కూర్చున్న జనకయ్య గారికి పంజరం ఎత్తి చూపించాడు ఆనందు తాను ఎగ్జిబిషన్ లో ఏమి కొన్నాడో.
ఓహో చిలకలనా! అన్నాడు జానకయ్య గారు కొంచెం ఆశ్చర్యంతో కూడిన నిరుత్సాహంతో
ఆ రోజు అంతా , ఆనందూ, చుట్టూ పక్కల ఇళ్లల్లో ఉన్న ఆనందు స్నేహితులూ ఆ పంజరం లో ఆ చిలకలు వేసే గెంతులు చూస్తూ, వాటికి గింజలూ అవీ వేస్తూ
గడిపారు. ఆ మరునాడు కూడా అలాగే రాత్రి దాకా ఆడారు.
*******
ఆనందు ఇంటి దగ్గర పార్క్ లో మిగతా మిత్రులతో ఆడుతున్నాడు. తానూ ఇంకో ఫ్రెండ్ రాజా యే ఉన్నారు. చీకటి పడుతోంది. ఇంక ఇంటికి వెళ్లి పోవాలని అనుకుంటూ ఉండగా సడన్ గా వాళ్ళ ముందు పార్క్ లో చెట్ల మధ్య రంగు రంగు లైట్లు వెలుగుతూ ఒక చిన్న యంత్రం లాంటిది దిగింది. వాళ్లకి ఏమయిందో తెలిసే లోపలే ఇద్దరినీ ఎవరో ఆయంత్రం లోకి గెంటారు. అంతే యంత్రం గాలి లోకి ఎగిరింది. అలా హఠాత్తు గా జరగడంతో ఇద్దరికీ తెలివి తప్పి పోయింది.
వాళ్ళిద్దరికీ మెలకువ వచ్చే సరికి. వాళ్లిద్దరూ ఒక పెద్ద పంజరం లాంటి ఊసలు చుట్టూ ఉన్న పెట్టె లో ఉన్నారు. వాళ్ళ చుట్టూ వింత మనుషులు వీళ్ల ని వింతగా చూస్తున్నారు. వాళ్ళిద్దరికీ ఏడుపు రాలేదు. అమ్మా నాన్నా కూడా గుర్తుకు రాలేదు.
ఆనందు రాజా తో అన్నాడు. "వీళ్లంతా ఎవరు రా వింతగా ఉన్నారు?"
"ఏమోరా నాకూ తెలియటల్లేదు" తమని చూస్తున్న వాళ్ళ కేసి చూస్తూ అన్నాడు రాజా
వీళ్ళు మాట్లాడుకోవడం చూసిన ఆ వింత మనుషులు చప్పట్ల లాగ కొట్టి కేరింతలు లాగ కొట్టారు
వీళ్ళు తినడానికి అన్నట్టు ఊసల మధ్యనుంచి ఏవో విసిరారు. అవి చాకోలెట్ల లాగ ఉన్నాయి చూడ దానికి. ఇద్దరూ చెరొకటీ తీసుకు తిన్నారు. చాకోలెట్ కంటే చాలా బాగుంది. వింత వ్యక్తుల్ని చూస్తూ చాకోలెట్స్ లాంటివి తింటూ కొంత సేపు ఆనందం గానే ఉన్నారు. కానీ బయటికి వెళ్ళడానికి లేక పోవడం వాళ్లకి చాలా ఇబ్బందిగా ఉంది.
మరి కొంత సేపటికి వీళ్లున్న పెట్టె ని తీసుకుని ఇంకో చోటకి తీసుకు వెళ్లారు ఎవరో. అక్కడ కూడా ఇలాగే వింత వ్యక్తులు మూగి వీళ్ళని చూస్తూ కేరింతలు కొడుతున్నారు
అలా రెండు మాట్లు వాళ్ళని వాళ్ళ ఊళ్ళో జరిగే ఎగ్జిబిషన్ లాంటి చోట్లకు తిప్పడం జరిగిన తరువాత, వీళ్ళకి ఆ పెట్టెలోంచి బయట పడాలని అనిపించి ఊసలు లాగడానికి ప్రయత్నించారు. అలా చేసినప్పుడు ఎవరో వాళ్ళ చేతి మీద కొడితే చేతులు వెనక్కి తీసుకున్నారు.
వాళ్లకి చాకోలెట్స్ లాంటివి తినడం మొహం మొత్తి అన్నం తినాలనిపించింది. ఆనందుకు అందు లోంచి ఎలాగయినా బయట పడాలని ఊసలని గట్టిగా లాగాడు. ఎవడో అనందు చేతిమీద చాలా గట్టిగా కొట్టాడు
ఆ దెబ్బకి ఆనందుకు సడన్ గా మెలకువ వచినట్టు అయి కళ్లు తెరిచి చూస్తే తను రోజూ పడుకునే మంచం మీద ఉన్నాడు. ఇదంతా కలేనా! అని అనుకున్నా ఇంకా భయం నుంచి తేరుకోక వాళ్ళ అమ్మ పక్కలో వెళ్లి పడుకున్నాడు.
తెల్లారి లేవగానే ముఖం అదీ కడుక్కుని చిలకలున్న పంజరం దగ్గరికి పరిగెత్తాడు . వీడు పరిగెత్తడం చూసిన వాళ్ళ అమ్మ వాడి వెనకే వచ్చింది " మళ్ళీ ప్రొద్దున్నే వాటితో ఆడడం మొదలెట్టావా? " అంటూ
ఆనందు పంజరం తీసుకుని వీధి వరండాలోకి వచ్చాడు. వెంఠనే పంజరం తలుపు తెరిచి 'రెండు చిలకల్న' వదిలి పెట్టేశాడు. అవి కిల కిల లాడుతూ ఎగిరి పోయాయి
ఆనందు అలాచేయడం వెనక నుంచి వాళ్ళ అమ్మ, పక్క వరండాలో వీల్ చైర్ లో కూర్చుని కాఫీ తాగుతున్న జానకయ్య గారు ఆశ్చర్యం గా చూశారు. ఆనందు అలా ఎందుకు చేశాడో వాళ్ళ ఇద్దరికీ తెలియ లేదు.
జానకయ్య గారు మాత్రం చాలా ఆనందించాడు. అందుకు కారణం లేక పోలేదు. ఆయన చాలా ఆరోగ్యంగా ఉండి ఉద్యోగం చేస్తున్నప్పుడు ఇలాగే 'ఒక చిలకల జంటని చాలా కాలం ఓ పంజరం లో ఇంట్లో ఉంచుకునేవాడు. ఇంటికి వచ్చిన ఒకరిద్దరు మిత్రులు " ఎందుకురా వాటిని అలా బంధిస్తావు? " అనేవారు
వాళ్ళ మాటలు ఆయన నవ్వుతూ కొట్టేసేవాడు. రిటైర్ అవగానే కీళ్ల వాతం తో వీల్ చైర్ లో కూల బడ గానే మొదట చేసిన పని చిలకలని వదిలేయడం